గొంతున వేలాడే గుదిబండలు

గొంతున వేలాడే గుదిబండలు

నా చిన్నప్పటి నడితి(సంగటన) ఇది. మావూరికి పొరుగునున్న ఊర్లో ఒక దొంగ ఉండేవాడు. చుట్టుముట్టు ఇళ్లలో ఊళ్లలో ఏదో ఒక మొట్టు(వస్తువు)ను దొంగిలించి, వాటిమీదున్న పేర్లను తొలగించి, తనదో తనవాళ్లదో పేర్లను చెక్కించేసేవాడు. అందరూ చాటుగా గొణుక్కోవడమే కానీ వాడిని ఎదిరించిన వారెవరూ లేరు. వాడంటే అందరికీ బెదురు.

కొన్నేళ్లకు వాడిని ఎదిరించే వాడు ఇంకొకడు పుట్టుకొచ్చినాడు. వీడిది మావూరే, మా పక్కిల్లే. వీడు పోయి వాడిని ఎదురుకోవడమేకాదు, వాడి తప్పుడుపనులను నిలదీసి దుమ్ముదులిపేసేవాడు. అదంతా చూసిన మా ఎలమి(సంతోషం)కి పట్టపగ్గాలు లేకుండా పోయినాయి.

కొన్నేళ్లు గడచినాయి. మెల్లమెల్లగా వీడు వాడికంటే పెద్ద దొంగ అయినాడు. వాడిలాగా దొంగిలించడమే కాదు, మీదకు తెగబడి లాగేసుకొనేవాడు. వాటన్నింటి మీద తనపేరునే చెక్కేసుకొనేవాడు. మొదటి వాడిదేమో పొరుగూరు, వీడిది పొరుగిల్లే. పెనంమీద నుండి పొయ్యిలో పడినట్లయింది మాపని.

***

కొంగునాడుకు కింది కొసన ఉన్న ఉడుమలపేట అనే ఊరిలో కొన్నేళ్లపాటు ఉండినాను నేను. దిగువకొంగు అంతా తెలుగుమయం. ఉడుమలపేట, మటంగుంట, పొల్లాదూరు(ఉడుమలైపేట్టై, మడత్తుగుళం, పొళ్ళాచ్చి అనేవి వీటికి తమిళ పేర్లు)  తాలూకాలలో 65 నూర్పాలు(శాతం)  తెలుగువాళ్లు ఉంటారు. 25 నూర్పాలు తమిళులూ, 10 నూర్పాలు కన్నడిగులూ ఉంటున్న తావు ఇది. కేరళని ఆనుకుని ఉన్నా ఒక్క నూర్పాలు కూడా మలయాళులు లేరక్కడ.

నూరు నుండి నూటయేబై ఏళ్ల కిందట, నడికొంగు తావులైన ఈరోడు, కరూరుల నుండి, కొంగు వెళ్లాళులు అనే తమిళ కాపుకుదురువారు దిగబడి, ఈ తావులకు చేరుకొన్నారు. వీళ్లే నూటికి ఇరవైమంది ఉంటారక్కడ. అంటే నూటేబై ఏళ్ల కిందట దిగువకొంగులో అరవమాటల ఆనవాళ్లే లేవు. పదేళ్ల కిందట, ఉడుమల పల్లెలలో తొంబయ్యవ పడిలోని పెద్దలను పలకరించినప్పుడు తెలిసింది ఈ మెలన(చరిత్ర) అంతా. ఆయీడు వాళ్లకెవరికీ తమిళం తెలియదు.

గోమంగళం అనే పల్లెలో నూరేళ్లకు పైబడిన ఒక అవ్వదగ్గర, 1856లో రెండో అచ్చు పొందిన, చదలవాడ సీతారామశాస్త్రిగారి పెద్ద బాలశిక్ష కనబడింది నాకు. ఆ తల్లి ఆ పొత్తానికి నానాడూ పువ్వులు పెట్టి మొక్కుతూ ఉండేది.

దిగువ కొంగునాడులో పల్లెలపేర్లన్నీ చాలావరకూ తెలుగులో ఉంటాయి. ఈ పేర్ల గోల మాకెందుకు అని విసుక్కోకుండా, కొన్ని ఊర్లపేర్లను చెబుతాను వినండి.

మర్లపల్లి, రెడ్డిపల్లి, తుమ్మలపల్లి, జల్లిపల్లి, మానుపల్లి, కళలపల్లి, దీపాలపల్లి, సామరాయపల్లి, ఎర్రజనం పల్లి, పెద్దజనంపల్లి, అమ్మపల్లి, పెద్దప్పపల్లి, వెన్నమాను పల్లి, అడివిపల్లి, సోమవారపల్లి, పొట్టెంపాళెం, పళ్లపాళెం, జెక్కంపాళెం, కొత్తపాళెం, రెడ్డిపాళెం, చిన్నకుమారపాళెం, ఉస్తికాయలపాళెం, గొర్లగుంట, బాపినచెరువు, మురుగుత్తి చెరువు, రాగలబావి, పూలనూతి, పళ్లనూతి , పెదపాపనూతి, గురప్పనాయుడూరు, బోడినాయుడూరు, కన్నమనాయుడూరు, మర్రిమానూరు, బండగలూరు, గట్టుకొత్తూరు, పెద్దకోట, కురిచికోట, బల్లకొండాపురం, కొంగలనగరం, ఇప్పలనగరం, గుడిమంగళం, గోమంగళం…

ఇవి కొన్నే. ఊర్లపేర్లే కాదు, కొండలూ గుట్టలూ వాగులూ వంకలూ చెరువులూ చేనులూ అన్నిటిపేర్లు తెలుగుమయం అక్కడ. అయితే ఈ తెలుగంతా మంది నోళ్లలో మట్టుకే ఉంటుంది. దొరతనం(ప్రబుత్వం) వారి దాపిక(రికార్డ్స్)ల్లో ఈ పేర్లన్నీ తమిళంలోనే కనబడుతాయి. మంది నోటిమాటకు విలువలేని తావు ఇది.

నేను అక్కడ ఉన్నప్పుడు, కొన్నాళ్లు నలత పడినాను. విరుగు(చికిత్స) కోసం వారానికి రెండుసార్లు పొల్లాదూరుకు పోవలసి వచ్చింది. ఉడుమలకూ పొల్లాదూరుకూ నడుమ నలబై కిలోమీటర్లు. పేరేగి(బస్)లో గంట పయనం. ఆ గంట పయనంలో నడుమన కొన్ని పెద్దపల్లెలలో పేరేగి ఆగేది. ముందుగా పూలనూతి, ఆనక అందూరు, అన్నెనక గడిమిట్ట, ఆ వెనక కోలారుపల్లి, అటు వెనక ఊంజవేలంపట్టి, చివరకు  పొల్లాదూరు.

ఈ తిరుగుడులో ఊంజవేలంపట్టి నన్ను పట్టిపట్టి లాగుతుండేది. ఆ పేరెంతో వింతగా వినిపించేది నాకు. రెండూర్ల నడుమ నా తిరుగుడు, నాలుగయిదు నెలలపాటు సాగింది. ఒడలు కుదుటపడినాక, ఒకనాడు దిగేసినానక్కడ, ఆ పేరు కతను కనుక్కోవాలని. రాదారి పక్కనంతా దూరపు దరుల నుండి ఏ దారీ లేక వచ్చి బేరాలు చేసుకుంటున్న వారు ఉన్నారు. పాతవూరుకు చేరాలంటే పావుగంట సేపు పావుకోళ్లను కదిలించాలన్నారు. నా అడుగులు ముందుకు పడినాయి. కొంత దవ్వు నడిచినాక పుంత చెంతనే నాకొక గుట్ట కనబడింది. గుట్ట మీది గుడి కూడా.

గుడిలో పూజరులు చెప్పే పేరు చెరితలు గొప్పగా ఉంటాయి. అవన్నీ కూడా వేలుపునుడితో ముడివడి ఉంటాయి. ఆ గొప్పలను వినడం, విని తప్పెటకొట్టి చాటడం, తెలుగువాళ్లకు ఎంతో మక్కువయిన పని. నేనూ తెలుగువాడినే  కదా! ముందు గుట్టమీది గుడికే పోయినాను. నేను అనుకొన్నట్లే ఆ గుడి పూజరికూడా ఊంజవేలంపట్టికి గొప్ప చెరితనే చెప్పినాడు.

అయితే అది వేలుపునుడిలో కాదండీ… తప్పు తప్పు వేలుపు నుడిలోనే. నా ఈ తడబాటుకు కారణం ఉందిలెండి. మన తెలుగువాళ్లకు వేలుపునుడి ఒక్కటే. అది గీర్వాణం. తమిళులకు రెండు వేలుపు నుడులు ఉంటాయి. గీర్వాణం ఒకటయితే అరవాణం రెండోది. నేను ఎగతాళి చేస్తున్నాను అనుకోకండి. తమిళులు నుడివేదే ఇది. శివుడు వెండికొండ మీద తాండవమాడుతూ చేతిలోని డక్కను మోగించినాడట. డక్కకు ఓ వైపు గీర్వాణమై వెలువడితే, రెండోవైపు మోత తమిళమై  బయల్పడిందంట. ఆ పూజరి ఆనాడు నాకు చెప్పింది రెండో మోత కత. వినండి మీరు కూడా.

”వెండికొండన దండుమీది పెత్తనం కోసం వినాయకునికి చిరుతనికీ పోటీ జరిగింది. ఓడిన కుమారస్వామి అలిగి వెండికొండను దిగి నేలమీదకు వచ్చేసినాడు. కేరళలోని పాలకాడు దగ్గర దిగి, విరవిరగా తూరుపువైపుగా నడుస్తూ వచ్చినాడు. పొల్లాదూరును దాటినాక అలత కలిగింది. ఇదిగో ఈ గుట్టమీదికెక్కి ఒక చెట్టునీడన పడుకొన్నాడు. అక్కడ వెలిమలలో, అలిగి వెళ్లిపోయిన చిన్నకొడుకుని తలచుకొని తల్లడిల్లిన అమ్మలగన్నయమ్మ, వెంటనే కొండదిగి కొడుకుని వెతుక్కొంటూ వచ్చింది.  ఈ బండలమీద పడి కునుకుతున్న కొడుకును చూసి అల్లాడిపోయింది. మానుకొమ్మకు ఒక దూరి(గుడ్డ ఊయల)ని కట్టి, అందులో కొడుకును పడుకోబెట్టింది. ఊంజల్(ఊయల)లో వేలన్-ను పడుకోబెట్టిన తావు కాబట్టి ఈవూరికి ఊంజల్ వేలన్ పట్టి అనే పేరువచ్చి, అదే ఊంజవేలంపట్టి అయింది.”

ఇదీ అరవయ్యరు చెప్పిన ఊరిపేరు కత. అయ్యవారి కత సరే, ఆవూరివాళ్ల కతను కనుక్కొందామని ఊరివైపుకు కదలినాను. పోయి చూస్తే ఏముంది! ఆ తావునున్న అన్ని ఊర్లలాగానే ఉంది అది కూడా. మూడువంతులు పైగా తెలుగువాళ్లు ఉన్నారక్కడ. మాదిగవారు, ఇరవైనాలుగిళ్ల తెలుగు సెట్టిగార్లు అనే రెండు కులాలవారు ఎక్కువగా ఉన్నారు. ఈ ఇరవైనాలుగిళ్ల వాళ్లనే కొన్నిచోట్ల జనపసెట్లు అనీ, కొన్నిచోట్ల సాదు సెట్లు అనీ, కొన్నిచోట్ల గోనిగమవాళ్లు అనీ, కొన్ని చోట్ల పెరికె బలిజలు అనీ అంటుంటారు.

ఆవూరి మాదిగగేరిలోని ఈడుడిగిన పెద్దలు ఒకరిద్దరు చెప్పినది ఇదీ. ‘ఈ ఊంజవేలంపట్టి ఎట్ట వచ్చెనో మాకు తెలవదండ. మా పెద్దల తలకట్టు(తరం) నుండి మా పిల్లప్పుడు వరకూ అందురుమూ సిగరమాకలపల్లి అని పలుమాడుకొని ఉండితిమి. ఇపుడుదా కొత్తంగా ఈపేరు వచ్చె.”

ఆమాటతో  నిక్కం తేటపడింది నాకు. ఊరు ఏర్పడుతూ ఉన్నపుడు, ఆ చోటంతా చిగురుమాకులు ఉండి ఉంటాయి. అందుకే చిగురుమాకులపల్లి అనే పేరు  వచ్చి ఉంటుంది.

చిగురు, చిగర, సిగర వంటిపేర్లతో రాయలసీమవాళ్లూ, తెన్నాటి(ఇప్పటి తమిళనాటి) తెలుగువాళ్లూ పిలుచుకొనే మాను ఒకటి ఉంది. నెల్లూరు, తిరువళ్ళూరు  తావులలో దీనినే చీకిరేణి చెట్టు అంటారు. దీని కొమ్మలు చాలా పెళుసు. చిన్నబరువుకు కూడా పుటుక్కుమంటాయి. అంత పెళుసైన చిగురుమాను కొమ్మలు కూడా చేవదేలి గట్టిగా ఉంటాయి ఆ గడ్డన అనే ఎరుకలో ‘అచట పుట్టిన చిగురు కొమ్మయిన చేవ’ అన్నాడు అల్లసాని.

అయితే చిగురుమాకులపల్లి, ఊంజవేలంపట్టిగా ఎట్ల మారుంటుంది? ఇది తెలియాలంటే ఈ కాస్త వివరాల్ని వినాలి మీరు.

తిరుపతి దగ్గర మొదలయి, తెన్నాడు అంతా పరచుకొని ఉంటుంది కణక్కుపిళ్ళై అనే తమిళకులం. వీళ్లకు తమిళమంటే చాలా మక్కువ. ఎవరికైనా వారి అమ్మనుడి మీద ఉండేదే, ఉండవలసినదే. కానీవీళ్లకు తెలుగుమీద ఎనలేని కనలు. తెన్నాట, తెలుగు ఆనవాళ్లను వేళ్లతోపాటు పెకలించి పడేసింది వీళ్లే. తెల్లవారి తరిలో  తెన్నాట కరణీకాలన్నీ వీరి చేతిలోనే ఉండేవి. అప్పుడే పనిగట్టుకొని, వేల తెలుగు ఊర్లపేర్లను తమిళానికి మార్చి, దాపిక(రికార్డు)లకు ఎక్కించినారు వీళ్లు. ఆ చరిత్రను అంతా ఇక్కడ విడమరచడం కుదరదు. మరొకసారి ముచ్చటిస్తాను.

కణక్కుపిళ్ళైలు బాగా చదువుకొన్నవారు. తమిళంతోపాటు తెలుగునూ ఎరిగినవారు. వీళ్లు మార్చిపెట్టిన పేర్లు, మంది మాటలలోని వాడుక తమిళానివి కావు, పాత కావ్యాల తమిళ మాటలను వెతకి తెచ్చి పెట్టినారు. ఎందుకంటే ఈ అరవపేర్లు చాలా చాలా పాతవి అని తెలియ చెప్పడం కోసం. చదువు రానివారే కాదు, అంతోయింతో చదువుకొన్న తమిళులు కూడా ఆపేర్ల ఎరుకను చెప్పలేరు.

చిగురుమానుకు వాడుక తమిళపేరు అరప్పుమరం. గంటు(గ్రంథ) తమిళంలో దానినే ఊంజవేలమరం అని రాసుంటారు. ఆ గంటు తమిళాన్ని తీసుకొని, కణక్కుపిళ్ళైలు చిగురుమాకులపల్లికి చేసిన తమిళసేతే ఊంజవేలంపట్టి.

గుడిలో పూజ చేసుకొనే అరవయ్యవార్లకు ఇంత తమిళం తెలియదు. తెలిసినా, తుమ్మచెట్టులాంటి చిగురుమానుకూ వేలుపుకూ ముడిపెట్టలేరు. తమకు మక్కువయిన గీర్వాణంలోకి దూకి, ఊ అంటే ఉమ, జ అంటే పుట్టుక, ఉమకు పుట్టిన వేలన్ వెలసిన కొండ అని చెబుదామంటే ద్రావిడ ఎసవు(ఉద్యమం) ఒకవైపు వణికిస్తూ ఉందాయె. అందుకని, ఊరిపేరును వేలుపుకు ముడిబెట్టి అందంగా అరవంలో కతను అల్లినారు. ద్రావిడ చిక్కపట్టు( సిద్దాంతం)ను చాటుతూ, వేలుపేలేడని నుడివే తమిళ తెలివరులు కూడా, ఈ కతలను ఒప్పేసుకొన్నారు. ఎందుకంటే, తమకు లేనిదీ, తమది కానిదీ దొంగిలించి తెచ్చుకొ న్నారు కదా! దేవుడి పేరుతో దొంగసొమ్మును సొంతం చేసుకోవడం తేలికని వాళ్లకు బాగా తెలుసు.

ఇప్పటికైనా ఎరుకపడిందా మీకు, కల్లబొల్లి మాటలాడే ఆ తోడునుడుల గురించి! ఎరుకపడి ఉంటే, ఈ ఆడక(ప్రశ్న)కు మారాడండి. వేలుపు నుడుల పేరుతో రెండు గుదిబండలు, తెలుగు గొంతున వేలాడుతున్నాయి కదా, వాటిని ఎప్పుడు వదిలించుకొందాం?

*

స వెం రమేశ్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చదివే వారు కళ్ళు తిప్పకుండా చెప్పే మాట వినేలా కడవరకూ గుంజుకు పోవటం రమేశ్ గారి శైలి. ముగింపు చేరాక గుక్కతిప్పుకుని మళ్లీ మొదటి మాటలు చదివితేగానీ శీర్షిక బోధపడదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు