గురుకులం కదా నువ్వు!

అంటే అమ్మ

అమ్మంటే చెక్కిలిపై చల్లటి ముద్దు!

అమ్మంటే, హక్కులన్నీ

నాకొక్కడికే దఖలు పరిచిన ప్రేమ!

ఇదేనా నువు నేర్పిన తొలి పాఠం!

 

ఇడుములు ఇక్కట్లు పెనవేసుకున్న

బతుకంటేనే ఒక దుఃఖం

బతకడం అంటే ఆ దుఃఖాలను దిగమింగుకోవడం

ఇదేలే నువు నేర్పిన మలి పాఠం!

==

కందిపోయినా కనిపించని

నా లేత నలుపు చెంపమీద

అచ్చొత్తుకున్న నీ అయిదువేళ్ల సాక్షిగా..

అబద్ధం చెప్పకూడదన్నది ఒక పాఠం!

 

మాట పూర్తికాకుండానే–

నా మూతిమీద ఫెడీమన్న నీ చేతి వాటానికి–

పెదవిలో పాతుకున్న  పై పన్ను

జొటజొటా పోటెత్తించిన నెత్తురు సాక్షిగా..

మర్యాదగానే మాట్లాడాలన్నది ఒక పాఠం!

 

మార్చురీ తలుపు బయట

స్ట్రెచర్ మీద విశ్రాంతి తీసుకుంటున్న నాయిన సాక్షిగా..

ఎవరెలా ఆడుకున్నా.. ఎదురు మాటాడకుండా..

ఓడినట్టుగా కనిపిస్తే పోయేదేం లేదన్నది ఒక పాఠం!

 

బడి చదువులను దాటి, పాతికేళ్లు దాటి

కొలువుల్లో కుదురుకున్నాక కూడా..

నా మోకాళ్ల మీద విరిగిన గోగుమెల్లి సాక్షిగా..

నోటికి ఫిల్టర్ ఉండాలన్నది ఒక పాఠం!

 

నోటిదూకుడూ, మాటతీరూ..

ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా సొంతం..

వాదనకు దిగని మౌనభాషే

బంధాలను దృఢంగా పెనవేసేది..

మనో పరిణతికి అద్దం పట్టేది..

జీవనవేదాలను పొదవుకున్న మాటలనూ

ఆ మాటలను పొదవుకున్న ముచ్చట్లనూ

నాపై వర్షిస్తూ ఉండిన నీ మెత్తటి ఒడి సాక్షిగా..

బతుకు చివరి అంకానికి చేరాక కూడా

నేర్పుతూనే వచ్చావు కదా ఒక్కో పాఠం!

 

నీ ప్రతి అనుభవమూ

నేను నేర్చిన పాఠమే!

నీ బతుకు అణువణువూ

కొత్త కొత్త అధ్యాయాలను–

జోడించుకుంటూ విస్తరించే పాఠ్యపుస్తకమే!

తరగతుల అంతరాలు తెలియనివ్వని..

పరీక్షలను నాదాకా రానివ్వని..

గురుకులం కదా నువ్వు!

 

నా విద్యార్థిత్వానికి

నీతోనే శుశ్రూషలు చేయించుకునే నా శిష్యత్వానికి

హఠాత్తుగా నువ్వు చరమగీతం పాడేసిన తరువాత..

ప్రతి గడియ ఒక పరీక్షే

ప్రతి సందర్భం ఒక సమీక్షే

ఉత్తీర్ణత్వం దక్కినదో లేదో

తుదికంటా తెలుసుకోలేని శిక్షే!

 

30 జులై 2025

మునిసురేష్ పిళ్లె

సురేష్ పిళ్లె స్వతహాగా జర్నలిస్టు. శ్రీకాళహస్తిలో పుట్టి, పెరిగి హైదరాబాదులో స్థిరపడ్డారు. కథలు, కవితలు, రాజకీయ వ్యంగ్య రచనలు, సీరియల్ నవలలు రాశారు. కార్టూన్లు గీస్తారు. వృత్తి ప్రవృత్తి ఒకటే కావడం అదృష్టం. జర్నలిజంలో పీజీ, బీఎల్ చేశారు.
Facebook :: https://www.facebook.com/kamspillai

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అమ్మలంతా గురువులే ! వారి నడవడికే మార్గదర్శనం, సత్సంతానానికి! వారు అలా నడుచుకున్నప్పుడు లోకమే నందనవనం కదా ! చాలా చక్కని కవిత!
    అమ్మకెప్పుడూ వందనం! B రచయితకి అభినందన !

  • సురేష్ గారు ఇప్పటి దాకా మీరు పాత్రికేయులు, కథకులు గానే తెలుసు. వచన కవిత్వం రాస్తారని తెలియదు. మొదటి సారిగా మీ కవిత చదివా. అదీ అమ్మ మీద రాసిన కవిత. ప్రతి బిడ్డకు అమ్మ గురించి ఇవే ఆలోచనలు, అనుభవాలు ఉంటాయి. ఎవరు చదివినా ,ఎవరికి వారు వారి అమ్మ గురించి రాసినట్లు అనుభూతి పొందుతారు.

  • అవును, అమ్మంటే నిజంగా అమ్మే

  • అమ్మని చివరిరోజుల్లో ఎలా చూసినా అమ్మ గురించి కవిత రాయని కవులుండరు.అయితే అమ్మ జీవితం నుండి ప్రతీ సందర్భంలోనూ పాఠశాల లో నేర్పని ఒక కొత్తపాఠాన్ని
    నేర్చుకుని పాటించే వారు కొందరే.సురేష్ పిళ్ళే తాను అమ్మ గురుకులంలో నేర్చుకున్న పాఠాల్ని కవిత్వీకరించిన క్రమంలో పాఠకులు కూడా తప్పక ఒకసారి అమ్మని తడుముకోవలసిందే తప్పదు.అభినందనలు సురేష్.

  • బోధనకు సంబంధించిన పాఠ్యపుస్తకమే తప్ప అమ్మ ఎప్పుడూ ప్రశ్నాపత్రం కానేకాదు. బిడ్డను మార్కులతో కొలిచి గ్రేడులిచ్చే మూల్యాంకనం అస్సలు కాదు. బడినుంచి ఇంటికొచ్చిన బిడ్డ వీపుమీది పుస్తకాల బరువును దించి కడుపాకలి గురించి ఆలోచిస్తుంది తప్ప మెదడును దులిపేందుకు ప్రయత్నించదు. అమ్మ అమ్మే…
    బాగుంది మిత్రమా నీ కవిత. మీ అమ్మ గురించి రాసిన నవలలోని సారమంతా ఈ కవితలో వుంది. అభినందనలు.

  • అమ్మ గురుకులంగా మారే వైనాన్ని మనందరి అనుభవాల సారంగా అభివర్ణించలేసు… అక్షరీకరించారు.

    మ్యూనిసురేశ్ పిళ్ళైగారికి వందనాభినందనాలతో

  • అమ్మంటేనే అది గురువు. బతుకు బాటలో అడుగడుగునా ఎదురైయ్యే పరీక్షలకు ఎదురొడ్డి నిల్చునేలా చేసే వికాసం అమ్మ ప్రేమ. అటువంటి అమ్మను తలచి, అమ్మను స్తుతించి, అమ్మ నేర్పిన బతుకు పాఠాలను, అమ్మ ప్రేమ వ్యక్తిని ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది. అమ్మను ప్రేమించేవారు ఎప్పుడూ ప్రధమ శ్రేణి ఉత్తీర్ణులే. సురేష్ పిళ్ళేయి గారి కవిత కన్నీళ్ళు తెప్పించింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు