కళలకు, కళాకారులకు పుట్టిల్లు తెలంగాణ. జానపద కళలకు పెట్టని కోట తెలంగాణ నేల. ఇలాంటి మట్టి చరిత్రను కెమెరా కంటితో రికార్డు చేసిన అరుదైన ఫోటో జర్నలిస్ట్ గుడిమల్ల భరత్ భూషణ్. పోరాటాల ఖిల్లా వరంగల్ జిల్లా అందించిన ఈ ఆణిముత్యం ఫోటోగ్రఫీ కళకే తన జీవితాన్ని ధారపోశారు. మూడు దశాబ్దాలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నా సరే, ఏనాడు తాను కెమెరాకు దూరమయ్యిందే లేదు.
తెలంగాణ అనగానే గుర్తొచ్చే బతుకమ్మ పండుగ నుండి మొదలు బోనాలు, మట్టిగోడలు, దర్వాజలు, ముగ్గులు, పతంగులు, సకినాలు, కులవృత్తులు, చిందు, డక్కలి కళారూపాలు ఇలా ఒకటేమిటి ఏదైనా సరే అందంగా భరత్‌భూషణ్ ఫోటోలోకి వచ్చి ఒదిగి పోవాల్సిందే. అందుకే బతుకమ్మ ఫోటోను చూస్తే భరత్‌భూషనే గుర్తుకు రావడం ఆశ్చర్యమేమి కాదు. అట్లా సంవత్సరాల తరబడి ఒక విషయం మీదనే పని చేయడం అలవాటు చేసుకున్నాడు. తెలంగాణ గ్రామీణ జీవితంలో వైవిధ్యమైన విషయాలన్నింటిని ఫోటోలు తీశాడు. ముఖ్యంగా ఒక్క దర్వాజల మీదనే పదకొండు సంవత్సరాల పాటు ఫోటోలు తీసే పని చేశాడంటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. అంతటి నిబద్ధతే తనను ఈ స్థాయికి చేర్చింది. సినిమా రంగానికి వెళితే సత్యజిత్‌రే అంతటి డైరక్టర్ కావాలని, పెయింటింగ్ వేస్తే పికాసో అంతటి చిత్రకారుడు కావాలని కలగన్నాడు. కానీ, ఊహించని విధంగా తెలంగాణ గర్వించే ఫోటోగ్రాఫర్‌గా ఎదిగారు.
తెలంగాణ నేలకు ఉన్న వైవిధ్యాన్ని అర్థం చేసుకున్నతనం భరత్ భూషన్ రచనల్లో, ఫోటోల్లో కనిపిస్తది. వరంగల్‌లో ఉన్నంత కాలం అక్కడి ప్రజల జీవితంతో మమేకమై పని చేశాడు. కాకతీయుల శిల్ప కళా నైపుణ్యం దగ్గరి నుండి మొదలు పెట్టి గౌండ్ల వారి జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేసినతనం వరకు ఆయనది సామాన్యుల పక్షం. అందుకే గాడిద పాలమ్ముకునే డక్కలి మహిళనైనా, చిందు భాగోతానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చిందు ఎల్లమ్మనైనా, తెలంగాణ సాయుధపోరాటంలో కొదమసింగంలా గర్జించిన చాకలి ఐలమ్మనైనా, విప్లవోద్యమంలో నెత్తురసొంటి కవిత్వం రాసిన చెరబండరాజునైనా భరత్ భూషన్ కెమెరా అద్భుతంగా చిత్రించింది. వరంగల్ నుండి వచ్చి, హైదరాబాద్‌లో స్థిరపడినా తన పట్టుదల ఏమాత్రం తగ్గలేదు. ఫోటో జర్నలిస్టుగా, ఫ్రీలాన్సర్‌గా ఎంతో సేవ చేశాడు.
తెలంగాణ పల్లెను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయడానికే అతడు జీవితాన్ని ధారపోశాడు. తెలంగాణ అస్తిత్వ జెండాను, దేశం గుండెల మీద నిలబెట్టడానికి ఇంకా తండ్లాడుతూనే ఉన్నాడు. తెలంగాణ నేల అతడి కెమెరా కంటికి సబ్జెక్టూ ఆబ్జెక్టు. తెలంగాణ మట్టిమనుషులే అతడి పెయింటింగ్‌కి క్యాన్వాసు. తెలంగాణ బతుకే అతడి అక్షరాలకు వస్తువు. నాలుగు దశాబ్దాల తెలంగాణ జీవితాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్న కెమెరా కన్ను భరత్ భూషణ్. తెలంగాణ గత చరిత్రను ఈ తరానికి పరిచయం చేస్తున్న సృజనకారుడు. అతడిలోని బహుముఖ సృజన కళలు ఎంతటి విపత్కర పరిస్థితుల్లోను ఆగిందే లేదు. వరంగల్ నగరంలో ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టినా, అతడి ఆలోచనలు అభిరుచులు మాత్రం సాధారణమైనవి కావు. అందరిలా చదువుకోమన్న తండ్రి మాటను కాదని, సామాజిక కట్టుబాట్లను ఎదురించి జీవితంలో బరిగీసి కొట్లాడుతున్న ఫోటోగ్రాఫర్, పెయింటర్, రైటర్ ఆయన.
వరంగల్‌లో ఉన్నంతకాలం అక్కడి చరిత్రను, వర్తమానాన్ని కెమెరాలో బంధించిన భరత్ భూషన్, హైదరాబాద్ వచ్చాక, ఈ చారిత్రక నగర ఆత్మను పట్టుకోవడం మీద దృష్టి పెట్టాడు. సామాన్య ప్రజానీకానికి హైదరాబాద్ అంటే బతుకునిచ్చే పట్టణం మాత్రమే. కానీ, భరత్ భూషన్‌కు అలా కాదు. అంతకు మించినదేదో వెతుకుతాడు. అలా తాను కనుగొన్నవే ముత్యాలు, గాజులు, పతంగులు, స్వీట్ల మీద పెట్టే సిల్వర్ పూతలు. భిన్నమతాల ప్రజలు, భిన్న సంస్కృతుల జాడలు భరత్ భూషణ్‌లో కొత్త చింతనకు దారులు వేశాయి. తిండి మరిచి, ఇల్లు కిరాయి బాధలు మరిచి కేవలం తన కళ మీదనే ఫోకస్ పెట్టడం అందరికీ సాధ్యంకాదు. అట్లా ఒక్కో విషయం మీద వందలాది ఫోటోలు తీసి పదిలంగా చరిత్రనంతా రికార్డు చేశాడు. ఎక్కడిపోయినా అక్కడి ప్రజల జీవన విధానాన్ని, వారి చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేయడం తనకు ఇష్టమైన పని. అప్పుడు మాత్రమే ఆ జాగా గొప్పతనం అర్థమవుతుందని భావిస్తాడు. అందువల్లనే ఒక్క బతుకమ్మ మీదనే ఇరవై సంవత్సరాలు పని చేశాడు.
ఇక భరత్‌భూషన్‌లో చిన్ననాటి నుండి ఉన్న పెయింటింగ్ కళ కూడా ఆగిపోలేదు. ఒకవైపు ఫోటోగ్రాఫీలో సుదీర్ఘ అనుభవం గడిస్తూనే, మరోవైపు చిత్రకళ మీద కూడా దృష్టి సారించాడు. చిత్రకళా రంగ చరిత్రను అధ్యయనం చేసి, తనదైన సొంత శైలిని ఏర్పరచుకున్నాడు. తెలంగాణలో దళిత, బహుజన, మహిళల జీవితాలను పెయిటింగ్ ద్వారా పరిచయం చేశాడు. అలాగే రచయితగా తెలంగాణ నేటివిటీని అక్షరాల్లోకి ఒంపాడు. తెలంగాణలో ప్రముఖమైన జాతరలైన సమ్మక్క సారక్క, ఐనవోలు మల్లన్న, కొమురవెల్లి వంటి పుణ్యక్షేత్రాలను పరిచయం చేస్తూ పలు వ్యాసాలు రాశాడు. ఈ వ్యాసాలు, ఫోటోలు, పెయింటింగ్‌లు అనేకమంది ప్రముఖులను ఆకర్షించాయి. జాతీయ స్థాయిలో ఇక్రిసాట్‌లో వాటర్ రిసోర్సెస్ మీద జరిగిన వర్క్‌షాప్‌లో భరత్ భూషన్ బతుకమ్మ మీద ఇచ్చిన ప్రజెంటేషన్ శాస్త్రవేత్తల దృష్టిని సైతం ఆకట్టుకుంది. బతుకమ్మను తయారు చేసేందుకు వాడే పువ్వుల్లో, నీటిని శుభ్రం చేసే లక్షణముందని చెప్పి, మెప్పించాడు.
తెలంగాణలో కిందికులాలకు సాధ్యం కాని ఫోటోగ్రఫీ, రచన, పెయింటింగ్..ఈ మూడు రంగాల్లో తనదైన ముద్రను నెలకొల్పాడు భరత్‌భూషన్. ఒకవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా శ్రమించాడు. నాలుగుదశాబ్దాల విలువైన కాలాన్ని కళకు అంకితం చేశాడు. రాజా త్రయంబకం రాజా వంటి విశిష్ట పురస్కారాలు అందుకున్నా తన కృషికి రావాల్సినంత పేరు, గుర్తింపుగాని రాలేదు. క్యాన్సర్‌తో పోరాడుతూనే తన కళా ప్రస్థానాన్ని ఇంకా కొనసాగించడం ఈనాటి తరానికి ఆదర్శం. అవార్డులు, రివార్డులు ఆయన కళకు చిన్న గుర్తింపులు మాత్రమే. ఆయన కళ దేశానికే గర్వకారణం. అలాంటి మహా కళాకారుని అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు. వారి కుటుంబం నేటికి పేదరికంలోనే మగ్గుతోంది. కనీసం సొంత యిల్లు కూడా లేని ఆ కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
*
భరత్ భూషణ్ బతుకు – చిత్రాన్ని పటం కట్టినవ్ రవీ.. అభినందనలు. శనార్తులు..
చరిత్ర చెప్పిన సత్యం ఏంటంటే చిత్తశుద్ధితో ప్రజలను జాగృతం చేసి, నిస్వార్థంగా సేవచేసిన కళాకారులు నాయకులు వారి కుటుంబాలకు దూరమై ఆర్థికంగా చితికి పోయినరు. వారి త్యాగాలను మనకు తన కలం ద్వారా గుర్తు చేసిన పసునూరి రవీందర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు
పసునూరి రవీందరన్న గారు మీరు ఫోటో గ్రాఫర్ భరత్ భూషణ్ గారి గురించి చాల గొప్పగా చెప్పారు…
భరత్ భూషణ్ గారి వ్యక్తులు చానంటే చాన అరుదుగ కనిపిస్తారు. ..
క్యాన్సర్ తో పోరాడుతునే కళ మీదున్న ప్రేమను పట్టువీడలే…
ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్న.
కళకే జీవితాన్ని ధారపోసిన
భరత్ భూషణ్ గారికి నా కన్నీటి నివాళులు..
Excellent write up