ఎనిమిది కథలతో ముస్తాబై వచ్చిన తల్లావజ్ఝల పతంజలిశాస్త్రిగారి తాజా కథలసంపుటి ‘గుప్తా ‘91’ని చేతిలోకి తీసుకుని చదవడం మొదలెడితే, మొదటి కథ రెండో పేరాలోనే, చొరవ చూపిస్తున్న భర్తని వారిస్తూ, “చాల్లెండి సంబండం. ఎదిగిన పిల్లలున్నారని తెలీదేటీ?” అనే ఒక భార్య కనిపిస్తుంది. సమాధానంగా అతను, “ఆళ్లెదిగితే నేనేం జెయ్యనే? దానికీ దీనికీ సంబంధం ఉందాసల?” అని అడుగుతాడు. శాస్త్రిగారి కథలు లోతుగా ఉంటాయని భయపడేవారికీ, పెట్టేవారికీ ఈ హాస్యం ఒక చిరువిరుగుడులా పనిచేస్తుంది. అలా చదువుతూ పోతుంటే, ‘దయారత్నం’ అనే కథ ప్రారంభంలోనే ముకుందరావు, “పిల్లలేం చేస్తున్నారు దయా?” అని దయారత్నాన్ని అడుగుతాడు. దానికి దయారత్నం సమాధానం: “పెరుగుతున్నారు బాస్.” ఏదో స్థాయిలో కొంత చమత్కారాన్ని చూపించకుండా ఏ మంచిరచయితా ఊరుకోలేడు. నిజానికి శాస్త్రిగారి ట్రేడ్‌మార్క్ హాస్యం ఒకటుంది: బ్రాకెట్లల్లోనుంచి తొంగిచూసే అంతరంగాలు. అవి ఈ సంపుటిలోని కథల్లోనూ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి. ఈ కథాసంపుటిలో ఆ బ్రాకెటెడ్ అంతరంగాలు ఇంకొంచెం ఎక్కువ బాధ్యతని తీసుకున్నాయి. కొన్నిసార్లు కథని అర్థం చేసుకోవడానికి అవి కూడా అవసరమవుతాయి!
పైన చెప్పిన రెండు సంభాషణల్లోనూ పిల్లల ప్రస్తావన ఉంది. పిల్లల గురించి ‘వాల్‌పోస్టర్’ లాంటి మంచికథని రాసిన శాస్త్రిగారు ఈ సంపుటిలోనూ పిల్లలమీదే “ఈ యాటాణ్నండి,” (సంధులు విడదీస్తే, ‘ఈ ఆట ఆడనండీ,’ అని దానర్థం!) కథని రాశారు. ఇంటికెవరో ముఖ్యమైన అతిథి వస్తున్నాడు కాబట్టి, ఆ ఇంటావిడ తన కొడుకునీ, ఇద్దరు కూతుళ్లనీ, పనిమనిషి కూతురినీ పైన మేడమీద ఆడుకోమంటుంది. బిల్డర్ అయిన ఆ ఇంటాయన పిల్లలు సహజంగానే ఇంగ్లీషు చదువులు చదువుతున్నారు. పనిమనిషి కూతురు జ్యోతి (బహుశా, దళిత బాలిక) మాత్రం కార్పొరేషన్ స్కూలులో. పిల్లలందరూ కలిసి స్కూల్ ఆట ఆడదామని నిశ్చయించుకున్నాక, మగపిల్లవాడు, పెద్దవాడు తనని తాను హెడ్‌మాస్టర్‌గానూ, చెల్లెళ్లిద్దరినీ మిస్సులుగానూ, జ్యోతిని అటెండర్‌గానూ నిర్ణయించేస్తాడు. ఆర్థిక, లింగ, వర్ణభేదాల ఆధారంగా వాళ్లవాళ్ల స్థితులు నిర్ణయమైపోయాయి. ఈ ఆటలో ఒక మిస్సు తనకి హెచ్.ఎం పదవి కావాలంటుంది. కుదరదంటాడు హె.ఎం. జ్యోతి, తను మిస్సు కావాలనుకుంటుంది. అదీ కుదరదంటాడు హె.ఎం. జ్యోతికి తన యదార్థజీవితానికీ (అక్కడ కూడా పార్ట్‌టైమ్ పనిపిల్లే), ఈ ఆటకీ మధ్య తేడా ఏమిటో అర్థం కాదు. ఆక్రోశంతో జ్యోతి చేసే తిరుగుబాటు మూడు అంచెలుగా సాగుతుంది. మొదట ఒక మిస్సుతో, “నాకు ఇంగిలీషు రాదండి,” అని క్లాసులోంచి వెళ్లిపోయి, నిరసన చూపుతుంది. తరువాతి అంచెలో “అక్కా నేను కూడా టీచరు పని చేస్తా, నువ్వు నా పని చెయ్యి,” అని మరో అమ్మాయికి చీపురు చూపిస్తుంది. ఆఖరి దశ, అబ్బాయి కిశోర్‌మీద తిరగబడుతుంది: “నే జెయ్య, నా ఇష్టం. నేనీయాట ఆణ్నండి.” దానికి సమాధానంగా కిశోర్, జ్యోతిని లెంపకాయ కొడతాడు. అది జ్యోతి అనే అట్టడుగు స్థాయి మనిషికి – అందునా స్త్రీకి – శిక్ష; ఆ స్థాయికి కొంచెం ఎగువనున్న మిగతా ఇద్దరు ఆడపిల్లలకి హెచ్చరిక. సమాజంలోని మేల్ షొవినిజం ఇచ్చిన నమూనా తీర్పు అది.
కథ ఇంతే అయితే ఇది చాలా మామూలు కథ అవుతుంది. కానీ కథ అంతే కాదు. ఇంకో సమాంతర కథ, కింద డ్రాయింగ్ రూం/డైనింగ్ హాల్లో జరుగుతుంటుంది. గమ్మత్తేమిటంటే, కథలో ఇదో అనవసరమైన అదనపు భాగంలాగా అనిపిస్తుంది తప్ప, కథ మొత్తానికి ఇది చాలా ముఖ్యమైనదని అనిపించేలా శాస్త్రిగారు రాయలేదు. కింద జరిగే ఈ కథని కేవలం ఒక్క పేజీలో వర్ణిస్తారు.
“వర్మ”గారు బిల్డర్. “న్యూటన్”గారు ఆయన ప్రాజెక్టుల నిర్వాహకుడు. పేర్లనిబట్టి, వీళ్లు ఏయే వర్గాలకి మూసలో ఊహించగలం. వర్మకి న్యూటన్ సహకారం ఎంతో అవసరం. లంచ్‌కి వచ్చిన న్యూటన్‌కి బీర్లుకూడా సరఫరా చేస్తాడు వర్మ. కావలసినవి అందించడంలో వర్మకి భార్య సుమతి సహకారం కూడా ఉంది. న్యూటన్‌కి సుమతి పట్ల ఉన్న ప్రత్యేకమైన ఆకర్షణ అన్యాపదేశంగా వ్యక్తమవుతూ ఉంటుంది. సుమతి వడ్డిస్తుంటే భోజనం చేయడం కష్టమనీ, అలాగని “ఇప్పుడు బీరు తాగుతూ” ఆమె వడ్డించకుండా తినడం అంత సులభం కాదనీ న్యూటన్ అనుకుంటూ, “సాధ్యమైనంతవరకూ” వర్మ చెబుతున్న ప్రాజెక్టు వివరాలు వినడానికి “ప్రయత్నించాడతను.” మరోపక్క, అప్రయత్నంగా, ఏం చేస్తున్నాడో మనం ఊహించుకోగలం. న్యూటన్ చూపులు సుమతి శరీరానికి తెలియవా? తెలిసినా తెలియనట్టే ఉన్నారనుకోవాలి. అవసరం ముందుకొచ్చినప్పుడు ఏ ఇబ్బందులూ గుర్తుకురావు. వివక్షని కూడా కన్వీనియెంట్‌గా విస్మరించగలరు. అయితే, సుమతికి వివక్ష ఉందని ఎందుకనుకోవాలి? దానికి ఆధారం ఏమిటి? సమాధానం కథలో ఓచోట చెప్పీచెప్పనట్టుగా ప్రస్తావించబడుతుంది. పనిమనిషి కూతురికి సుమతి, “వాళ్లమ్మ చూస్తుండగా చాక్లెట్లు కూడా ఇస్తూంటుంది.” భేదభావం మనసులో ఉన్నవారికే అది లేదని ప్రదర్శన చేయడం ఎక్కువ అవసరం అవుతుంది. ఇదంతా ఒక్కపేజీలో చెప్పే పెద్దల కథ.
కేవలం ఆటే అయినా, పరస్పరావసరాలు ఏమీ లేకపోయినా, పిల్లల చర్యల్లో సైతం ఆర్ధిక, సామాజిక దర్పం ముందుకొస్తుంది. జ్యోతికి అప్పగించిన పని చేసితీరాల్సిన పని కాకపోయినా, అది కిశోర్‌కి తెలిసినా, తెలియనట్టే ఉండగలడు; మగవాడినన్న అహంకారంతో లెంపకాయా కొట్టగలడు.
కథలో చెప్పినట్టు, “న్యూటన్‌గారి ముక్కు, కళ్లు, మూతి, చెవులు వేటికవి అంత బాగోవు. కానీ అన్నీ కలిసిన ముఖం మాత్రం ఆకర్షణీయంగానే ఉంటుంది.” అలానే, సుమతి “కళ్లూ, ముక్కూ, చెవులూ, పెదాలూ వేటికవి అందంగా లేకపోయినా, ఆమె ముఖం అన్నీ కలిసి ఆకర్షణీయంగా ఉంటుంది.” తేడాలనేవి మానసికమైన వికారాలే తప్ప అందులో భౌతికాంశం ఏదీ లేదని ఈ కథ ప్రారంభంలోనే ఒక పరోక్ష సూచన చేస్తుంది.
శాస్త్రిగారి కథల్లోని శిల్పంలో ఉన్న విలక్షణత కథాసంవిధానంలో ఎక్కువగా ఉంటుంది. ఇంత సంక్లిష్టమైన కథని రాయడానికి, పైగా చెప్పీచెప్పనట్టు చెప్పడానికి విషయ నియంత్రణ చాలా అవసరం. ఆ నియంత్రణ తప్పితే కథ అడ్డంగా విస్తరించి, లోతు తక్కువవుతుంది. ఈ కథని చదివాక, పై పరిశీలనలని కథకి ఆపాదించగలిగితే, కథాసంవిధానం విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ అర్థమవుతుంది.
ఆయన కథనంలోని మరిన్ని శిల్పవిశేషాలని విస్తరణభీతి చేత చెప్పకుండా వదిలేస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయం మాత్రం చెప్పాలి. జాగ్రత్తగా గమనిస్తే, ఈ కథ వర్తమానంలో ప్రారంభమై, గతంలో ముగుస్తుంది! ఈ సంపుటిలో ఇది అలాంటి గమ్మత్తైన శిల్పవిశేషం ఉన్న రెండో కథ.
మరో కథ ఏమిటో సరదాగా మీరు కనిపెట్టండి!
***
కథాసంవిధానంలో ఉత్కృష్టమైన స్థాయిని ప్రదర్శించిన కథ ‘దయారత్నం.’ మరో సంక్లిష్టమైన కథ. “It takes something more than intelligence to be able to write intelligently. It requires something closer to echolocation, an acute sense, in mid-flight, of where you are,” అని ఓ విమర్శకుడు అన్నదానికి ఈ కథ ప్రత్యక్ష ఉదాహరణ. పిల్లలేం చేస్తున్నారంటే, ఎదుగుతున్నారని సమాధానం చెప్పేది ఈ కథలోనే. “దాంతోపాటు ఏం చేస్తున్నారు?” అన్న తరువాతి ప్రశ్నకి ఈ కథ కొంత సమాధానం. అసలు, పెద్దలేం చేశారన్నది అసలు సమాధానం.
శర్మ, దయారత్నం ప్రాణమిత్రులు. వాళ్ల పిల్లల ప్రేమకథ గురించి అనుకోకుండా తెలుసుకున్న దయారత్నం అతలాకుతలమై పోతాడు. విపరీతమైన మానసిక వ్యథకి లోనవుతాడు. బైబిల్ చదువుతూ శాంతిని పొందాలనుకుంటాడు. కూతుర్ని దగ్గరగా పరిశీలించడం మొదలెడతాడు. పోనీ, కూతురితో మాట్లాడి చూడొచ్చు కదా అన్న భార్య మాటనీ పెద్దగా పట్టించుకోడు. ఇతని ప్రవర్తనలోని తేడాని కూతురు గమనించకుండా పోలేదు. తన సంక్షోభాన్ని కూతురికి కూడా బట్వాడా చేస్తున్నానన్న స్పృహ దయారత్నానికి ఉంది; దానిగురించి బాధ కూడా ఉంది. “దాన్ని దగ్గరికి తీసుకుని చెవిలో దానికి వినబడకుండా క్షమాపణలు చెప్పుకోవాలనుంది,” అన్న అద్భుతమైన వ్యక్తీకరణ ఉంది. ఈ వాక్యంలోనే కథ స్ఫూర్తి చాలా ఉంది. ‘దాన్ని దగ్గరకు తీసుకుని’: కూతురంటే అతనికి అపరిమితమైన ప్రేమ; ‘చెవిలో’: బహిరంగంగా కాదు, ఏకాంతంలో; ‘దానికి వినబడకుండా’: తను బయటపడినట్టు ఆమెకి తెలియకుండా; ‘క్షమాపణలు చెప్పుకోవాలని ఉంది’: తను చేస్తున్నది తప్పే, తనకి తెలుసు, తనీ తప్పు చేయకూడదు అన్న అపరాధ భావన.
కానీ, ఆ పని చేయలేదు దయారత్నం. పైగా తన అపరాధ భావన మరింత పెరిగేలా, హైదరాబాద్‌నుంచి నాగ్‌పూర్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. దయారత్నం ఇలా నలిగిపోతున్న పరిస్థితుల్లో, అటు శర్మతో స్నేహమూ సక్రమంగా కొనసాగడం లేదు; ఇటు కూతురితోనూ దగ్గరితనం దూరమైంది. కాలం పరిష్కారాలని తనదైన మార్గంలో చూపించినా, అవేవీ దయారత్నానికి ఊరటనివ్వలేదు. చివరికి, కూతురు తండ్రిపట్ల ఇప్పటికీ కనబరచే ప్రేమ కూడా దయారత్నానికి ఏ ఉపశాంతినీ కలిగించలేకపోతోంది. చనిపోబోయే ముందు ఈ వ్యవహారం తెలుసుకున్న మిత్రుడు శర్మ, దయారత్నం చేసిన త్యాగాన్ని ప్రశంసించడం కూడా అతనికి ఉపశమనాన్ని ఇవ్వలేకపోయింది. శర్మ థాంక్స్ చెప్పాలనుకున్నాడన్న విషయం తెలుసుకున్నాక, “అతని [దయారత్నం] రక్తమాంసాలు గాలిలో కలిసిపోయాయి.”
పైపైన ఈ కథని చదివితే- సమస్యని పరిష్కరించుకోలేక పోయిన మంచివాళ్ల కథ అనిపిస్తుంది. దయారత్నానికి తను నిర్వహించిన పాత్ర వల్ల శాంతి కరువైంది. సుగుణ, విష్ణులు ఈ సమస్యని తామే పరిష్కరించుకోవడానికి ఏ అడుగూ వేయలేదు సరికదా, తమకు కాలానుగుణంగా దక్కినవాటిని మౌనంగా అంగీకరించారు. విషయం తెలిసిన దయారత్నం భార్య కూడా చురుగ్గా ఏమీ చేయలేకపోయింది. ఈ విషయం తెలిసిన శర్మ కూతురు సైతం డిటో. విషయం శర్మకి తెలియదు గానీ, తెలిస్తే ఏం చేసి ఉండేవాడో తెలియదు.
కథని మరింత శ్రద్ధగా చదివితే, కథలో కనిపించే మూడు కీలకమైన అంశాలు/వాక్యాలు కొత్త అనుమానాలని కలిగిస్తాయి.
ఒకటి- థర్డ్ పెర్సన్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ (దయారత్నం పరంగా ప్రథమ పురుష పరిమిత దృష్టికోణ కథనం)లో నడుస్తున్న కథ, ఒకే ఒక్కసారి కట్టుతప్పి, సుగుణ పరంగా ఒక పేరాని వర్ణిస్తుంది. దయారత్నం నాగ్‌పూర్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడన్న వార్త తెలిశాక, అసలు డాడీ ఎప్పట్నుంచో అదోలా ఉంటున్నాడని గమనించిన సుగుణతో దయారత్నం భార్య, అదంతా సుగుణ గురించి బెంగేనని చెబుతుంది.
“సుగుణ టీ తాగుతూ ఏవీ అనలేదు. బెంగ! బెంగ ఎందుకు? పది నిముషాలు టీ తాగి లోపలికి వెళ్లిపోయింది సుగుణ. మొహం చన్నీళ్లతో కడుక్కుని అద్దంలోకి చూస్తూండిపోయింది. బెంగ? ఆమె వేపే చూస్తున్న కళ్లు తటాల్న విచ్చుకున్నాయి. గుండె వేగం పుంజుకుంది. అలాగే నిలబడి పోయిందామె (“డాడీ.”) హఠాత్తుగా జ్వరం తగిలి ఒళ్లు చల్లబడినట్టయింది. ఆమె మెల్లిగా మంచం దగ్గరికి వెళ్లి నుంచోలేక కూచుండిపోయింది. డాడీ. (“అప్పుడే?”) సుగుణ కళ్లు నీళ్లు చిమ్మేయి. మంచం మీద వాలిపోయిందామె. కళ్లనిండా ఆశ్చర్యం అలాగే ఉండిపోయింది.”
ముందు, దయారత్నానికి బెంగ ఎందుకో సుగుణకి అసలు అర్థం కాలేదు. బ్రాకెట్లో ఉన్న “అప్పుడే?” కి రెండురకాల అర్థాలు ఉండొచ్చు. “అప్పుడే తెలిసిపోయిందా?” అన్నది ఒకటైతే, “అప్పుడే ఇది ప్రేమ అని ఊహించేసుకున్నారా?” అన్నది మరోటి. ఈ రెండింటిలో ఏది సరైనదీ అనే ప్రశ్నకి అంతకుముందు బ్రాకెట్లలో ఉన్న “డాడీ” సమాధానం ఇస్తుంది. “ఇలా అనుకున్నావా డాడీ?” అని నిష్ఠూరంగా సుగుణ అనుకుంది అని తప్ప దాన్ని వేరేలా అర్థం చేసుకోలేం. అప్పుడు రెండో బ్రాకెట్లో ఉన్నదాని అర్థం “అప్పుడే ఇది ప్రేమ అని ఊహించేసుకున్నారా?” అవుతుంది. (సుగుణ అంతరంగం పై పేరా ద్వారా పాఠకుడికి ఇప్పుడు లీలామాత్రంగానైనా తెలిసింది అన్న విషయం దయారత్నానికి తెలీదు! ఈ డ్రమటిక్ ఐరనీ- దయారత్నం పాత్రని విశ్లేషించుకోవడానికి పాఠకుడికి పనికొస్తుంది.)
ఇంతకీ- సుగుణ, విష్ణుల మధ్య ఉన్నది దయారత్నం ఊహించిన స్థాయిలో ప్రేమ కాకపోవచ్చు. సుగుణ అనుకున్న “అప్పుడే?” దీన్ని సూచిస్తుంది. ఒకరితో మరొకరు స్నేహంగా చనువుగా మెలుగుతూ ఉండివుండొచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండివుండొచ్చు. ప్రేమ, పెళ్లి అనేవి బహుశా వారి దృష్టిలో అప్పటికి లేకపోయివుండొచ్చు. (ఇది అది కాదు అని సుగుణ, దయారత్నానికి చెప్పగలదు. కానీ అతను అప్పటికి ఉన్న స్థితిలో దాన్ని నమ్ముతాడన్న నమ్మకం సుగుణకి బహుశా ఉండి ఉండదు.) మొత్తానికి దయారత్నం అవగాహన సరైనది కాదేమోనన్న అనుమానానికి ఆస్కారం ఇచ్చే కథాభాగం ఇది.
రెండు- కథ చివరి పేజీలో శర్మ ఆఖరిక్షణాల మధ్య ఉంటాడు. సుగుణ, విష్ణుల విషయం శర్మకి హాస్పిటల్లో చేరే ముందు అతని కూతురు కాంతి ద్వారా తెలుస్తుంది (“సుగుణ, విష్ణు గురించి అనేశానంకుల్,” అంటుంది తప్ప, కాంతికి ఏం తెలుసో మనకి తెలీదు; కాంతి ఎంతవరకూ చెప్పిందో కూడా మనకి తెలీదు; చెప్పటానికి కాంతి దగ్గర ఎంత విషయం ఉందో కూడా తెలీదు.) దయారత్నం గొప్పమనసుని ప్రశంసించిన శర్మ, వాడికి థాంక్స్ చెప్పు అని, మళ్లీ, నేనే చెప్తాలే అంటాడు. ఈ విషయం తెలుసుకున్న దయారత్నానికి “రక్తమాంసాలు గాలిలో కలిసిపోయాయి. పెద్ద కొండచరియలాంటి దుఃఖం అతన్ని కబళించింది.” ఎందువల్ల? దానికి ఒకే కారణం కనిపిస్తుంది: తనా ప్రశంసకి అర్హుడిని కానన్న అపరాధ భావన.
మూడు- కాంతి, దయారత్నానికి పై విషయం చెప్పాక, “వాడికి థాంక్స్ చెప్పాలమ్మా,” అన్న శర్మ మాటలు దయారత్నానికి “చెవిలో వేడి తారుచుక్కలు” లాగా అనిపిస్తుంటాయి. అప్పుడు దయారత్నం అనుకుంటాడు: “ఇప్పుడు శర్మని ఎలా చూడ్డం?” తను చేసింది స్నేహాన్ని నిలుపుకోవడానికి చేసిన త్యాగం అని దయారత్నం నిజంగా నమ్మితే, దాన్ని శర్మ ప్రశంసించడం కూడా జరిగింది కాబట్టి, “శర్మని ఎలా చూడ్డం?” అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు. ప్రశంసించిన శర్మని కలవడానికి సందేహించే దయారత్నం చేసింది నిజంగా ‘స్నేహం కోసం త్యాగమా’ అన్న అనుమానం కలుగుతుంది. మనం అనుమానాలను బలపరచే విధంగా దయారత్నం స్పందన ఉంటుంది.
వెరసి- బహుశా ఏమీ లేని విషయాన్ని పెద్దది చేసి, అటు స్నేహితుడిని దూరం పెట్టి, కూతుర్ని పరీక్షించి, నానాహింసల పాలై, అందర్నీ హింసించిన దయారత్నానికి అసలు ఈ పెళ్లి జరగడమే ఇష్టం లేదేమోనన్న సందేహం తలెత్తుతుంది. తను అనుకున్నది నెరవేర్చుకోవడానికి నెపాన్ని స్నేహం మీద వేశాడా అని అనిపిస్తుంది.
ఇన్ని అపరిష్కృత సందేహాల మధ్య, కనిపించేటంత సూటికథ కాదు ఈ కథ. ఇన్ని రకాల తాత్పర్యాలకి ఒదిగేలా “diamantine intensities”తో కథనం చేయడం సాధారణమైన ప్రతిభతో సాధించగల విషయం కాదు. పాఠకుడు ఈ నానార్థాల ప్రతిధ్వనుల చిక్కుముళ్లల్లో పడి, వాటిని విప్పదీసుకుంటూ చాలాకాలం గడిపేయొచ్చు. ఇంకా ఈ కథలోని సుగుణ గురించి చెప్పాల్సింది చాలా ఉంది. ఎక్కడో కానీ కనిపించని విష్ణుగురించి కూడా చాలా చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలయినా వాళ్లు ప్రదర్శిచిన హుందాతనాల ముందు, పెద్దరికాలు ఎంత చిన్నపోయాయో చెప్పుకోవచ్చు.
మింగలేక, కక్కలేక అవస్థపడుతూ బైబిల్ చదువుకుంటున్న దయారత్నాన్ని చూసి అతని భార్య ఒక సందర్భంలో “ఏం లాబం పాపం…” అనుకుంటుంది. ఈ అనుకోవడం శాస్ట్రిగారి తరహా బ్రాకెట్లలో ఉంటుంది. అది అలానే ఆవిడ గొంతులో మనం చదువుకోగలిగితే, అంత సీరియస్ కథ మధ్యలోనూ ఫక్కున నవ్వొస్తుంది. మళ్లీ, నవ్వడం భావ్యం కాదనీ అనిపిస్తుంది.
షర్లీ హాజర్డ్ అనే కథారచయిత్రి ఓ కథలో, “We are human beings, not rational ones,” అంటుంది. ఈ వాక్యాన్ని సరైన సమయంలో సరైన స్ఫూర్తితో గుర్తుచేసుకోగలిగితే, దయారత్నం లాంటి మనుషుల మీద కూడా మనం కొంత కరుణని చూపించగల అవకాశం ఉంటుంది.
***
దయారత్నంది కూతురి మీద ప్రేమవల్ల హింసపడి, హింసపెట్టినవాడి కథ అయితే, “దహనకాంక్ష” కథ కేవలం హింసని ప్రేమించేవాడి వికృతగాథ. హరూకీ మురకామీ రాసిన ‘బార్న్ బర్నింగ్’ అనే కథ శీర్షికని (నిజానికి మురకామీ ఈ శీర్షికని విలియమ్ ఫాల్కనర్ అదే శీర్షికతో రాసిన కథనుంచి తీసుకున్నాడు) చూశాక ఈ కథని రాయాలనిపించిందని కథ చివర్లో రచయిత పేర్కొన్నారు. నిజానికి మురకామీ రాసిన కథకీ, ఈ కథకీ ఏమాత్రం సంబంధం లేదు. మురకామీ కథలో ‘బార్న్ బర్నింగ్’ అనేది ఒక మెటఫొర్ మాత్రమే- బహుశా హత్యలకి. తగలబెట్టడాలని ఆ కథలో అసలు చూపించరు మురకామీ.
పంటకుప్పలనీ, బస్సులనీ, స్కూళ్లనీ, ఇళ్లనీ రహస్యంగా రాత్రుళ్లు తగలబెడుతూ, దానికి సిద్ధమవటంలోనూ, దూరంగా కనిపించే మంటల్లోనూ, తర్వాత తప్పించుకోవడంలోనూ అమితానందం పొందే ఒక వ్యక్తి కథ ఇది. ఇలాంటి పని చేయొచ్చని ఒక అజ్ఞాత వ్యక్తినుంచి ఉపదేశం పొందినట్టే, ఇతను కూడా వేరేవాళ్లకి ఇలాంటి ఆనందం పొందవచ్చని ప్రచారం చేస్తూ వెళ్తుంటాడు. సామూహిక రోదనలో ఇతను పొందే ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది. ఏ పని చేస్తూ ఉన్నా కళ్లముందు మంటలు కనిపిస్తుంటాయి అతనికి.
మంటల్ని సూపర్ ఇంపోజ్ చేస్తూ శాస్త్రిగారు సృష్టించే మాంటాజ్ కథని దాదాపు దృశ్యమానం చేస్తుంది. కాకపోతే, కాలంలో ముందుకీ వెనక్కీ వెళ్తూ నాన్-లీనియర్‌గా సాగే కథనం డాప్లర్ ఎఫెక్ట్‌ని సృష్టించినట్టవుతుంటుంది అక్కడక్కడా!
ఈ కథని శాస్త్రిగారు ఎందుకు రాశారు అన్నది ఊహించడం కష్టం కాదు కానీ, మురకామీ కథలో కూడా దీనికి సమాధానం దొరుకుతుంది. ఆ కథలోని కథకుడికి (ఇతనో రచయిత కూడా) ధనికుడు, అందగాడైన ఓ యువకుడు తారసపడతాడు- ఒక కామన్ గర్ల్‌ఫ్రెండ్ ద్వారా. అతనితో కలిసి మందుకొట్టి, గంజాయి తాగుతున్న సందర్భంలో ఆ యువకుడు రచయితతో యథాలాపంగా తను బార్న్స్‌ని తగలబెడుతూ ఉంటానని చెబుతాడు. ఎందుకు, ఏమిటి అన్న ప్రశ్నల అనంతరం, అసలీ రహస్యాన్ని తనకెందుకు చెబుతున్నావని ఆ యువకుడిని రచయిత అడుగుతాడు. దానికి ఆ యువకుడి సమాధానం: “ఇతను నవలలు రాస్తాడు కదా, మానవ ప్రవృత్తులలో భిన్నత్వాల గురించి ఇతనికి ఆసక్తి ఉండదా అనుకున్నాను. రచయితలు ఏదైనా విషయం మీద తీర్పు చెప్పేముందు దాని సమగ్రస్వరూపం గురించి ఆలోచిస్తారు. ఆ విషయాన్ని వాళ్లు ఆమోదించలేకపోయినప్పటికీ, దాని ఉనికిని విస్మరించకుండా కనీసం అంగీకరిస్తారు. అందుకూ- నీకు చెప్పింది!”
శాస్త్రిగారు కూడా ఈ కథలో ఎలాంటి తీర్పులూ ఇవ్వలేదు. పైన ఉపయోగించిన ‘వికృత’ అన్నది నిజానికి నా పదం. చాపకింద నీరులాగా ఇలాంటి సేడిస్టిక్ భావజాలం ఎలా వ్యాప్తిచెందగలదో హెచ్చరించడమే రచయిత ఉద్దేశం అనిపిస్తుంది. కానీ, పాఠకుడు ఒక్కోసారి జడ్జ్‌మెంటల్‌గా ఉండటం కూడా అవసరం అవుతుంది- ముఖ్యంగా ఇలాంటి పాత్రల పట్ల.
***
‘రమ సంగతి’ కథలోని రమ, ప్రసాదరావు పట్ల అలా జడ్జ్‌మెంటల్‌గా తయారవుతుంది- తను అతనినుంచి ఆశించింది దక్కకపోవడం వల్ల. ప్రసాదరావుకి స్టూడెంట్ అయిన రమ, ప్రసాదరావు సాంగత్యాన్ని కోరుకుంటుంది. ప్రసాదరావుకీ లోపల కోరిక ఉన్నా, చుట్టూ ఉన్న పరిస్థితులు సహకరించక ఒప్పుకోడు. ఆ ఇబ్బందిని నిజాయితీగా చెప్పకుండా, నేను పెళ్లైనవాడిని తెలుసా అని అనవసరమైన నైతికతాహంకారాన్ని తనకి తాను ఆపాదించుకొని ఆమెను అవమానిస్తాడు. పగబట్టిన రమ, ప్రసాదరావు తనమీద అత్యాచార ప్రయత్నం చేశాడని కాలేజీలో ఫిర్యాదు చేసి, అతని ఉద్యోగాన్ని ఊడగొట్టించి తన కక్ష తీర్చుకుంటుంది. కాలేజీ విడిచి వెళ్లిపోతుంది.
కానీ ఆ తర్వాతెప్పుడో రమ ఫోన్ చేసి అతన్ని ఇంటికి పిలిపించుకున్న సందర్భంలో ఇద్దరూ భౌతికంగా దగ్గరవుతారు. మళ్లీ ఎప్పుడు కలుద్దాం అని అడుగుతాడు ప్రసాదరావు. ‘మీ విషయంలో పొరపాటు పడ్డాను, సారీ, నన్నెప్పుడు కలిసే ప్రయత్నం చేయకండి,’ అని చెప్పి సాగనంపుతుంది.
There is no there there.
ప్రసాదరావు గురించి తన అంచనా తప్పుకాదని తనకి తాను నిరూపించుకోవడానికి రమ చాలా దూరం వెళ్లింది. నిజానికి రమ, ప్రసాదరావు విషయంలో ఒక్కసారి కాదు, రెండుసార్లు పొరబడినట్టు లెక్క. మొదటిసారి తన ఆహ్వానాన్ని మన్నిస్తాడనుకుంటే అతను ఒప్పుకోనప్పుడు, రెండోసారి- అతనికి నిజంగానే (అతను అనుకునే) నైతిక విలువలున్నాయేమో అని రమ సందేహిస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా అతను ప్రవర్తించినప్పుడు.
ఈ సైకలాజికల్ ఆట సరే- రమ తన గౌరవానికి భంగకరంగా ఇలా సాహసం చేయడానికి ఆమెను ప్రేరేపించినదేమిటి? బహుశా, ఆధునిక మనస్తత్వాలు, వాటి వెనక ఉండే కాన్షస్‌నెస్‌లూ. ఇందులో గమనించవలసింది- ఆమె తన లైంగికతపట్ల ఫీలవుతున్న స్వాతంత్ర్యం , తన అంచనాలు సరికాదో తెలుసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లగల సాహసం. ఈ కథలోని రమ సమాజం ఆశించే హద్దులని పట్టించుకోకుండా, తీర్పులని లెక్కచేయనితనంతో, స్వంతవ్యక్తిత్వం ఉన్న నిజమైన పాత్రగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తుంది. ఆధునిక స్వతంత్రతని చూపించడం, కుహనా నైతికతలని బహిర్గతం చేయడం వరకే ఈ కథ చేసే పని; తప్పొప్పుల చర్చ కాదు.
***
‘ఉడత’ చిన్న కథ, మంచి కథ. కనిపించిన ప్రతిదాన్నీ స్వంతం చేసుకుని రాజకీయనాయకులు తమ స్వంత ప్రచారానికి ఎలా వాడుకుంటారో చూపించిన కథ.
కథకి పొడుగు, లోతులే కాకుండా మరో డైమెన్షన్ – ఆఘ్రాణశక్తిని ఆపాదించిన కథ ‘శేషు ఒక బహుమానం’. శేషు అనే ప్రియుడు చేసిన మోసం, తద్వారా అలముకున్న చీకటి, చుట్టుకుపోయిన ఏకాంతం, రాజుకుంటున్న రుజ, ఇవన్నీ కలిసిన జ్వరం- ఇదీ ఆమె జీవితం. ప్రియుడు బహూకరించిన కుక్కపిల్ల (దాని పేరు కూడా శేషు) – వీటన్నిటికీ మౌనసాక్షి, జ్ఞాపకానికీ వర్తమానానికీ మధ్య వంతెనలాంటి ప్రతీక. రెండు రకాల శేషులు ఆమె జ్వరపీడిత అస్తిత్వంలోంచి కలగలిసి అలుక్కుపోయి కనిపించి, వాస్తవం, భ్రమల సరిహద్దు సీమల్లో సమసిపోయిన విషాద జీవితం ఆమెది.
***
‘గుప్తా ’91’ మామూలుగా చదివితే- కాలంలో వచ్చిన మార్పులని పట్టుకున్న సాధారణమైన కథ అనిపిస్తుంది. కానీ, మరో అడుగు ముందుకేసి, నర్మగర్భంగా చెప్పిన సంగతి మరోటి ఉంది ఈ కథలో.
ఈ కథలో మూడు తరాలున్నాయి. పెద్దావిడ వెంకటమ్మ తరం; ఆవిడ కొడుకు గుప్తా తరం; గుప్తా కొడుకు, కూతుర్ల తరం.
పెద్దావిడ వెంకటమ్మ ఏ ఊళ్లో ఉన్నా తన ఊరు తురకపాలెం నుంచి మానసికంగా బయటపడలేకపోయింది. అదే తన ప్రపంచం, తనకు తెలిసిన ప్రపంచం. ఆ ఊరి మనిషి కనిపిస్తే తురకపాలెం మామిడిచెట్టు ఇంటికొచ్చినట్టుంటుంది ఆవిడకి. ఊరిమనిషి సింహాచలం కనిపిస్తే పాత కబుర్లన్నీ కలబోసుకుని, “ఆవిడ మొత్తం డెబ్భై ఏళ్లూ కాసేపట్లో జీవించేది.” ఇంట్లో జరిగే మార్పులకి ఆవిడ సాక్షే తప్ప, ఆ సంరంభంలో పాత్ర కాలేని మనిషి (ఆ కాలానికి ఓ అద్భుతం అయిన టీవీ ఇంట్లో ఉన్నా ఎప్పుడైనా తప్ప చూడ్డం కూడా మానేశారావిడ.) తన ప్రపంచం తన ఊరే కాబట్టి, ఆ ఊళ్లో ఇందిరాగాంధీ కట్టించిన బస్టాండ్, కొత్త పోస్టాఫీసు, ఆ ఊళ్లో ఎన్టీ రామారావు కనిపించడం- ఇవన్నీ ఆవిడ పొంగిపోయే వార్తలు. ఆవిడ ప్రపంచం ఇంత పరిమితంగానూ, ఖాళీగానూ, సంక్లిష్టరహితంగానూ ఉండేది.
గుప్తా తరానికి వచ్చేసరికి, కుటుంబం మొత్తం మొదట్లో దాదాపు ఒకే ప్రపంచంలో నివసించేవారు. ఏం చెయ్యాలో కలిసి ఆలోచించుకోవడం, రాబోయే వాటికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం వగైరా. ఒక్క చిన్న తేడా అల్లా- గుప్తాకున్న అతిచిన్న రహస్య జీవితం, రహస్య సరదాలు. అతని జీవితంలోనూ, అతని కుటుంబపు జీవితంలోనూ రెండు రకాల మార్పులు సహజంగా వచ్చాయి. ఒకటి ట్రాన్స్‌ఫర్ల పరంగా భౌగోళికమైన మార్పు. రెండు, సామాజిక పరిణామాల ప్రభావాల ఒత్తిడుల వల్ల రిక్షానుంచి స్కూటర్‌కి మారడం, ఫోను, టీవీ, వీడియో లాంటి సౌకర్యాలని సమకూర్చుకోవడం. ఈ రెండో మార్పుకి అతను ఇష్టంగా సిద్ధపడలేకపోయాడు. కారణం, దాన్ని ఆర్ధికంగా భరించాల్సింది తానే కాబట్టీ, “అతని జేబు గుండెకు దగ్గరగా” ఉంటుంది కాబట్టి. అనివార్యమైన మార్పుల్ని అతను అయిష్టంగానైనా సరే, స్వీకరించాల్సి వచ్చింది. ఒక రకంగా, అతని ప్రపంచం – ట్రాన్స్‌ఫర్లే కావచ్చు, పొందుతున్న అదనపు సౌకర్యాలు కావచ్చు – అతనితో నిమిత్తం లేకుండా విస్తరించుకుంటూ పోయింది. నిమిత్తం ఉన్నా లేకపోయినా, సమాజ అవసరాలకి అనుగుణంగా అతని ప్రపంచం విస్తృతమౌతూ వచ్చింది. గమనించవలసింది- ఈ ప్రపంచంలో అతని పక్కన అతని భార్య కూడా ఉంది.
పిల్లల తరం పూర్తిగా భిన్నమైనది. వాళ్లకి ఊహ తెలిసేనాటికే ఆకర్షణీయమైన వస్తువులు రావడం ప్రారంభమైంది. ఓ టీవీ కొనడంలోనో, ఓ ఫోన్ (ఎనభై, తొంభైలలో) పెట్టించుకోవడంలోనో ఉన్న కష్టనష్టాల గురించి వారికి తెలియగల వయసు కాదు. ఎలాంటి బాధ్యతనీ వహించాల్సిన అవసరం లేకుండా వస్తువులని ఆశించడం వారికి చిన్ననాటినుంచే అలవాటయింది. కూతురు యుక్తవయసుకి వచ్చాక, ఆమెకి టీవీ హీరోయిన్ అందమైన కనుబొమ్మలు కనిపించాయి. పాకెట్ మనీ అవసరమైంది. ఐ బ్రోస్ ట్వీజింగ్, ఫేషియల్స్ అవసరమయ్యాయి. ఇంటర్మీడియెట్‌కే స్నేహాలు విస్తరించి బాయ్‌ఫ్రెండ్, అతనితో ప్రేమకథ వరకూ వెళ్లింది. అది మరింత దూరం వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంజినీరింగ్‌లో చేరిన కుర్రాడు మొదట వాచీతో మొదలెట్టి, తర్వాత వెస్పా, అటుతర్వాత బైక్ వరకూ వెళ్లిపోయాడు. ఇవన్నీ సహజమైన మార్పులు (“మొక్కలు చెట్లయ్యాయి”) కావొచ్చు. కానీ, అనూహ్యంగా వీళ్ల ప్రపంచాలు వేరైపోయాయి. పిల్లలేం చేస్తున్నారో పెద్దలకి తెలీదు; కనీసం అన్న ఏం చేస్తున్నాడో చెల్లికి తెలీదు. వైస్ వెర్సా. నలుగురు కలిసి ఉన్న కుటుంబం, మూడు ప్రపంచాలుగా తయారయింది.
ఇదీ కాలం తెచ్చిన ముఖ్యమైన మార్పు: భౌతికమైన మార్పులే కాకుండా, మానసిక ప్రపంచాలు వేరై పోవడం. సమాజనిర్మాణంలో వస్తున్న మార్పులకి అనుగుణంగా ఎవరి జీవితనిర్మాణాల్లో వారు బిజీగా ఉండటం. అలాంటి మార్పుని పట్టుకోవడం ఈ కథ లక్ష్యం అనిపిస్తుంది. డికెన్స్ గురించి రాసిన ఒక వ్యాసంలో జార్జ్ ఆర్వెల్ ఒక మంచి పరిశీలన చేస్తాడు: “Dickens is always pointing to a change of spirit rather than a change of structure.” అలాంటి అపప్రథ నుండి ఈ కథ ఎంత విజయవంతంగా తప్పించుకుందో గమనిస్తే, రచయిత చూపు ఎంత నిశితంగా ఉందో అర్థమవుతుంది!
***
విపరీతమైన కోపాన్ని ప్రదర్శించే మనుషుల్ని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఆ పిచ్చి ఆగ్రహం వెనకనున్న కారణం ఏమిటో మనకు తెలిసే అవకాశం చాలా తక్కువ. “సత్యలింగం” కథలోని కూర్మయ్య నాయుడు కూడా అలాంటి పిచ్చికోపం ఉన్న మనిషి. అతని కోపం ఫలానాదాని మీద అని కాదు. అతనే చట్రంలో ఉంటే ఆ చట్రం మీద కోపం తెచ్చుకోగలడు- సొంత కుటుంబం కావచ్చు, ఆఫీసు కావచ్చు, బయటి సమాజం కావొచ్చు. కాంతారావు (కథకుడు) అనే టి.టి.ఇ. ఇంట్లో అద్దెకుంటున్న ఈ కూర్మయ్య నాయుడుని, ఒకానొక కేసులో పోలీసులు అరెస్టు చేసే దాకా వెళ్లింది. కాంతారావే తన పలుకుబడిని ఉపయోగించి అతన్ని బయటకు తీసుకుని వస్తాడు.
పై సంఘటన తర్వాత కూర్మయ్య నాయుడు తనని చూసి తనే సిగ్గుపడ్డాడు. బహుశా, “I want an excuse to change my life,” అనుకుని ఉండవచ్చు. కాంతారావు సహాయం అడిగాడు. తనెప్పుడో విన్న “సత్యలింగం” అన్న ఆధ్యాత్మిక గురువు పేరుని అనాలోచితంగా గుర్తుకు తెచ్చుకుని ఆ గురువుని ధ్యానిస్తే ఫలితం ఉంటుందని చెబుతాడు కాంతారావు. ఆ అబద్ధం కూర్మయ్యని కాపాడింది. అతను మరణించే వరకూ శాంతమూర్తిలానే బతికాడు. కానీ, తను చేసిన పని పట్ల కాంతారావుకే ఎందుకో సుఖంగా లేదు. ఏనాటికయినా కూర్మయ్యకి ఆ నిజం చెప్పేయాలనుకున్నాడు. కానీ, అదృష్టవశాత్తూ ఆ నిజం తెలుసుకోకుండానే కూర్మయ్య మరణించాడు.
మిగతా కథ ఈ కథ చుట్టూ అల్లుకుని ఉంటుంది.
మనిషిని సమూలంగా అతలాకుతలం చేయగల నిజాన్ని కాంతారావు, కూర్మయ్యకి ఎందుకు చెప్పాలనుకున్నాడు? బహుశా, అది నిజాయితీపరుడి అపరాధ భావన. ఆ బరువుని మోసే శక్తి లేక, పర్యవసానాలని పట్టించుకోకుండా, ఆ నిజాన్ని కూర్మయ్యకి బట్వాడా చేద్దామనుకున్నాడు కాంతారావు. ఒక అబద్ధం చేయగల మేలు ఎంతవున్నా ఆ అబద్ధానికి కారణం తను కావడం భరించలేకపోయాడు కాంతారావు. నిజం చెప్పి బయటపడాలనుకున్నాడు.
కథ ముగింపులో, కాంతారావు భార్య ఐసియులో ఉంటుంది. కాంతారావు మనసునిండా ఆందోళన. అప్రయత్నంగానే అతను “సత్యలింగాయనమః” అని స్మరించుకోవడం ప్రారంభిస్తాడు. అబద్ధమే అయినా, ఒకవేళ అది తనని కాపాడగలదేమో అన్న భ్రమ. మునిగిపోయేవాడు గడ్దిపోచని పట్టుకున్నట్టే తప్ప, బహుశా ఈ అబద్ధపు నమ్మకం వల్ల కాంతారావుకి ఏ ప్రయోజనమూ, కనీసం శాంతి కూడా దొరకకపోవచ్చు.
ఈ కథలో వాడిన కొన్ని భావనలు, పోలికలు ఆశ్చర్యాద్భుతాలు కలగజేస్తాయి. కూర్మయ్య కోపాన్ని వర్ణిస్తున్న సన్నివేశాలలో, కాంతారావు అతని గురించి ఓ మాట అనుకుంటాడు: “నిత్యం ఇలా బుసలు కొట్టే వ్యక్తికి, శాంతి అలా ఉంచి భద్రత ఏముంటుంది?” భద్రత గురించి (అతని ఆరోగ్యం దృష్ట్యా కావచ్చు, సమాజం నుంచి కావచ్చు) ప్రస్తావన రావడం ఒక ఉన్నతమైన ఆలోచన. కూర్మయ్య కోపాన్ని నింపుకున్న పేజీల అనంతరం, అతను మారాక, అతన్ని వర్ణిస్తూ శాస్త్రిగారు రాసిన వాక్యం: “బిగువుగా కనిపించేవాడు […] కొంచెం సడలినట్టు కనిపించాడు. నీళ్లు పీల్చుకుని పచ్చబడిన చెట్టులా కనిపించాడు.” భాషలో సంక్లిష్టత ఎక్కువగా లేకుండా, భావాన్ని ఎంత అందంగా ప్రదర్శించవచ్చో చెప్పగల ఇలాంటి ఉదాహరణలు ఈ కథలోనే కాదు, శాస్త్రిగారి ఇతరకథల్లో కూడా విరివిగా ఉంటాయి.
***
ఈ కథలని చదివాక, మన అవగాహన ఏదో మేరకు పెరిగినట్టు అనిపిస్తుంది. మనల్ని మనం కొత్తగా కూడదీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎదుటివాడిని అర్థం చేసుకోవడం ద్వారా మనల్ని మనం కొత్తగా అర్థం చేసుకున్నట్టుగా కూడా అనిపిస్తుంది. సహానుభూతి అన్నంత పెద్ద పదం కాకపోయినా, కొన్ని పాత్రలని దయతో ఎలా చూడవచ్చో ఆలోచింపజేస్తాయి.
అందుకని, ఈ కథలు అందరూ చదవాల్సిన కథలు. చదివి ఆలోచించాల్సిన కథలు. ఆలోచించి చర్చించదగ్గ కథలు.
*
Excellent review 😍
కథాసంవిధానం విషయంలో నా మానసిక పరిణతిని కొంతయినా విస్తరింపజేసుకోటానికి ప్రయత్నించాను, ఈ వ్యాసం ద్వారా.
లోతైన విశ్లేషణ. ఇంత గాఢంగా రాయాలంటే, ఎంతో శ్రద్ధగా చదవాలి. రమణమూర్తి గారికి నమస్సులు.
ధన్యవాదాలు, ఎమ్వీ రామిరెడ్డి గారూ!
థాంక్యూ శ్రీధర్ గారూ!