1
యాదిలో సంతకం
మబ్బులు కురిసెనో లేవో
ఉరుములు ఉరుముతున్నాయ్
పిడుగులు యాడనో పడ్డ శబ్దం
ఓ మట్టి సుగంధాన్ని మోసుకొచ్చిన గాలి
ముక్కుపుటాలకందించి ఆగింది
ఆమె వస్తుందో రాదో
గాజులగలలు వినిపిస్తున్నాయ్
కాలి గజ్జెల సవ్వడి దూరం నుండి దగ్గరౌతున్న వినికిడి
ఆమె ను తాకిన గాలి నన్నూ స్పర్శించి ఓ సందేశమిచ్చి వెళ్ళిపోయింది
ఓ చినుకు నేల రాలింది
ఆమె అడుగు నా ముందు పడింది
లోలోన అలజడి
ఆమె వర్షమై నన్ను అల్లుకుంది
చినుకులు ఆశీర్వదించాయి
ఆమె నుదుటి పై ఓ సంతకం
జీవితాంతం మధురంగా యాదిలో.
2
నవ జీవనం
నేను నడుస్తున్నాను
ఎక్కడికి వెళ్తున్నానో దారికీ తెలియదు
ఎగుడు దిగుడు వంకర టింకర దారైనా
ఎక్కడో ఓ చోట ముగింపుంటుందని నాకు తెలుసు
గతం తొలుస్తుంటే
భావి ఆశలకు రెక్కలు తొడిగేనా! అనుకుంటూ సాగుతున్నా!
దారికి అటూ ఇటూ చెలకలు
సాగుతున్న అరకలు
నాటుతున్న విత్తనాల అలికిడి
రేపటి మొక్క మదిలో తారాడే
జానపదాల ఒరవడి నేలతో మమేకం
పదం నోళ్ళల్లో తరాలుగా నానుతూ
జీవం పోసుకుంటుంది
జొరబడిన ఆరుద్ర
పుట్టెడు సంతోషంలో పుడమి
దారిన కురిసే చినుకుల సవ్వడి
పారుతున్న ఒర్రెలు
నాలో వికసిస్తున్న భావాలు
గతమో కల! వర్తమానం ఓ జడివాన!!
గాయం మానిపే కాలం నా పయనంలో తోడుగా!
భూమిని చీల్చుకుంటూ వచ్చిన ఆరుద్ర పురుగు
నాలో జవసత్వాలు నింపింది!
మోదుగు చెట్టు మీది పాలపిట్ట తుర్రుమని తాటికమ్మల మధ్యన దూరింది!
ప్రాణికి స్వేచ్ఛావాయువులు స్వచ్ఛం!
మనిషి మనుగడకు ప్రకృతి యే పాఠం!
మనసు మరుపెరుగకపోతే
దారంతా పల్లేర్లే
ఆగిన దారి!
ఆగని నడక !
కొత్త దారి సృష్ఠించుకుంటూ
నవ జీవనం వైపు!!
*
చాలా బాగున్నాయి మీ రెండు కవితలూ
అభినందనలు అన్నా