గా.రా.

”మీరు స్పీకరయితే పెద్దగా మాట్లాడకూడదు. అంత స్పష్టంగా మాటాడకూడదు. ఇంతకీ తమరేనా స్పీకరుగారు” అన్నాడు గారాగారు.

వర్తమాన కథ

అప్పుడు శాస్తజేతనన విహారంలో ఉన్నాడు. మధ్యాహ్న సమయంలో ఆయన తన కుటీరంలో విశ్రమిస్తున్నాడు. వెదురు కిటికీ లోకి నీలం రంగు పిట్ట వచ్చి కూచుని శాస్తని చూసి కిచకిచ మంది. కళ్లు తెరచి చిరునవ్వుతో పిట్టని పలకరించాడాయన. పిట్ట మళ్లీ కిచకిచ మంది. ఆయన మళ్లీ కళ్లు మూసుకొని పిట్టని చూస్తూ చిరునవ్వుతో వింటూండగా కుటీరం బయట భిక్షువుల మాటలు వినిపించాయి. కళ్లు తెరచి పిట్టవేపు చూడగానే అది ఎగిరి పోయింది.

శాస్త అనుమతించగానే నలుగురు భిక్షువులు లోపలికి వచ్చి ప్రణామం చేసి కూచున్నారు. ఆయన లేచి కూచుంటూ అన్నాడు.

”ఆయుష్మాన్‌, చెప్పండి.”

నలుగురిలో వృద్ధభిక్షవు కొంచెం సందేహిస్తూ అన్నాడు.

”భన్తే, ఇరువురు భిక్షువులు భిక్షు సంఘ మర్యాద నతిక్రిమించి ప్రవర్తిస్తున్నారు. మాలో మాకు వైరం కల్పించి, కొద్ది మందిని నమ్మించి, చివరకు అవసరాన్ని మించి చీపరాలనూ, భిక్షనూ సమకూర్చుకుంటున్నారు”.

శాస్త కళ్ళు మూసుకుని క్షణం అలోచించి అన్నాడు. “ఆయుష్మాన్, వారివురూ స్వభావం చేత మూర్ఖులు, స్వార్ధపరులు. భవిష్య జన్మలో వారు శాపగ్రస్తులవుతారు”.

“భన్తే, వారి కథ వినాలని కుతూహలంగా వుంది”.

 

:భవిష్యకథ:

గతంలో ఆయనెప్పుడూ దెయ్యాన్ని చూసి ఉండకపోవడం చేత గుండె జారి, కంగారుపడి ఆగిపోయాడు. అసలే సన్నపాపిడిలాంటి కాలిబాట. దాని మధ్యగా కూచుని అదీ. దిరిశెన చెట్ల పక్కనుంచి ఒంపు తిరగడంతో, అడ్డంగా హఠాత్తుగా ముందు ఏడెనిమిది అడుగుల మొండెం కనిపించింది. గుండె ఆగి కొట్టుకోగానే అతను మళ్లీ చూశాడు. అయిదు అడుగుల ఎనిమిది అంగుళాల తెలుగు శాసనసభ్యుడతను. ఆ ఎత్తుకి అతని కళ్లకి దెయ్యం ఛాతీ సగం దాకా కనిపించింది. మెల్లిగా తలెత్తి పైకిచూశాడాయన. మెడ నరం పట్టి తల దించుకున్నాడు. ఒళ్లంతా చెమటతో ముద్దయిపోయింది. గన్‌మెన్‌ వెధవల్ని రావొద్దని చెప్పడం పొరపాటయిపోయింది. పదిహేను అడుగుల బొంగులా   ఉంది  దెయ్యం. మఠం వేసుకుని కూచుందది. తెల్లటి ఒంటి మీద వెండి తీగెల్లాంటి వెంట్రుకలు. ఆ ఎత్తునుంచి నేల మీదికి పడిన మర్రి ఊడల్లాంటి జుట్టు. కాళ్లు ఒణికి చతికిలబడి రెండు చేతులూ ఎత్తి దణ్నం పెట్టేడు. హనుమాన్‌ చాలీసా చదువుదామని నోరు తెరిచినా అది రాకపోవడం వల్ల నోరు మూసుకున్నాడతను. తలపైకెత్తి చూడ్డానికి భయమేసింది. దణ్నం పెట్టి దెయ్యం పాదాలు పట్టుకున్నాడు. ఒక్కో పాదం పెద్ద తాటాకంత ఉంది. అంత భయంలోనూ అతనికి దెయ్యం కాళ్లు మెలిదిరిగి లేవని తెలిసింది. దెయ్యాల్లో ఎన్ని జాతులు, కులాలున్నాయో తనకి తెలీదు.

”తవరు దెయ్యంగారు కాదంటారా? క్షమించాలి, అధ్యక్షా.”

”పిచ్చివెధవా, ఇది అసెంబ్లీ కాదు. నేను దయ్యాన్నీగాదు. నేను రుషిని.”

”దయుంచండి. ఆయ, నన్ను ఒదిలెయ్యండి. రేపుదయం అసెంబ్లీ సెషనుంది. తవరు రుషిగారని తలీక మాట్టాడేను. ఆ మాటలు రికార్డుల నుంచి తొలగించండి. మన రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ, మిమ్మల్ని మించిన రుషి ఎవ్వడూ లేడని నేను మనవి చేస్తున్నాను. మన రాష్ట్రానికి మీరు అవసరం. మీరే రాష్ట్రం. రాష్ట్రమే తవరు. నేను మీరు ఎలా చెబితే అలా ….”

”మేం రుషులం. మాకు పొగడ్తలు అనవసరం. మీరు సి.ఎమ్‌.గారి చాలీసా చదవడం అలవాటయి, ఎన్నికలు దగ్గరవడంతో పూనకం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.”

”క్షమించాలి. ఆయ. మీ ఆశీస్సులు కావాలండి. అంతే. మరి నన్ను వెళ్లమని  శలవా?”

”పోదూగాని. నీతో ఎక్కువ మాట్లాడితే నాక్కూడా తపశ్శక్తి పోయి అక్రమంగా చేపల చెరువులు తవ్వించాలనీ, బినామీ భూములు కొనుక్కోవాలనీ కోరికలు పుడతాయి. ఒక్కసారి కళ్లు మూసుకో.”

”ఆయ. తప్పకుండానండి.”

చప్పున కళ్లు మూసుకున్నాడు గారపాటి రాఘవరావు

”తెరు”

చప్పున కళ్లు తెరిచాడు రావు గారు. దిమ్మెరబోయి కళ్లు నులుముకుని చూశాడాయన. ఎదురుగా సన్నగా తెల్లగా మామూలు రుషిలా కూచుని ఉన్నాడు రుషి. ”నిన్ను భయపెట్టడానికే శరీరాన్ని  పెంచుకున్నాం. మా దగ్గిర అణిమ, గరిమ, లఘిమ వంటి మహత్తర శక్తులుంటాయి.”

”ఆయ. రుషులంటే సినిమాల్లో జూసేనండి. ఆయ. నా జన్మ దన్యం. ఒచ్చే జన్మలో కూడ మీరే మా నాయకులు. అప్పుడు కూడా మీరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని నమ్ముతున్నాను. మీ వెనకే మేమందరం”.

“నేను వెళ్లబోయే ముందు నీ భవిష్యత్తు తెలియజేసి వెడదామని ఆగేం.”

”ఆయ. ఆయ. తవరే మా భవిష్యత్తు. అంతా మీ చేతుల్లో ఉంది. మన పశ్చింగోదావరి జిల్లా మీ కనుసన్నల్లో .”

”నోరు ముయ్యి. మూర్ఖుడా.”

”ఆయ. మన్నించాలి. తమ పట్ల బక్తి వల్ల మాటాడతన్నాను. అంతే. మీరు మన్నింతానంటే ఒక్క మనవి,”

”ఊ”

”మా ముఖ్యమంత్రిగారికి మీ ఆశీస్సులతో కొంచెం బూడిదివ్వండి.”

”భ్రష్టుడా, దాన్ని బూడిదనరు. విభూది.”

”ఆయ. మన్నించాలి. మన్నించాలి. అది రికార్డుల నుంచి తొలగించండి. రెండో ప్రార్థన మనవి జెయ్యమని సెలవా?”

”ఊ”

”ఆయ. మన కొల్లేరంతా చేపల చెరువులయి పోవాలని ఆసీరదించాలి. ఇంకే అడగనండి తవర్ని.”

”పరమ హీన మూర్ఖుడా. నీ ఖర్మం వల్ల నువ్వేవవుతావో చెప్పడానికి చత్తీస్‌ఘడ్‌ వెళుతూ ఆగేను. నీ పూర్వజన్మ  వాసనలు పోలేదు.”

”మన్నించాలి. మన్నించాలి. దయుంచండి నా పూర్వజన్మ బోగట్టా వినాలనుంది.”

”నీకు వినక తప్పదు. నువ్వు పూర్వజన్మలో కృష్ణాతీరంలో ఒక చాకలి దగ్గిర గాడిదవు. దానిక్కారణం అంతకుపూర్వం గ్రామపెద్దగా ఉండి ప్రజాధనం కాజేశావు.”

”మహాప్రభో నన్ను మన్నించండి. నాకు గ్నాపకం లేదు. నన్ను దీవించండి. ఆయ. మా గారపాటోరు అందరికీ బ్రేమ్మలంటే భక్తి. మీకు తెలవందిగాదు.”

”రుషులు బ్రాహ్మలని ఎవరు చెప్పేరు?”

”కాదా స్వామీ? బ్రామ్మలని విన్నాను.”

”రుషి అయినవాడికి అవేవీ ఉండవు. గత జన్మలో ఎంతో కొంత నిజాయితీ గల గాడిదలా జీవించడం వల్లనూ, మీ యజమాని కర్రదెబ్బలు కిక్కురుమనకుండా సహించడం వల్లనూ మనిషి జన్మ ఎత్తేవు. అయినా, నీ బుద్ధి మారలేదు. అందువల్ల కొద్దికాలంలో నువ్వు క్రమంగా గాడిదవై పోతావు. ఇంక వెళ్లిరా.”

రాఘవరావుగారి గుండె మరోసారి పూర్తిగా ఆగి కొట్టుకుంది. నిస్సహాయంగా రుషి వేపు చూశాడు. నా గన్‌మెన్లుంటే కుక్కని కాల్చినట్లు కాల్పించేవోణ్ని, ఏటనుకుంటున్నావో అనుకున్నాడాయన. రుషి నవ్వేడు.

”మూర్ఖుడా, మీ స్పీకరుగారికి వారి బావమరిది పేరు మీద అయిదువందల ఎకరాల చేపల చెరువులు అక్రమంగా తవ్వించావు. అయినా వారికి నువ్వంటే చీదర. అది నీకు తెలీదు. మాకు అలా కాదు నీ మనసులో ఏవుందో తెలుస్తుంది. నీ తూటాలు నన్నేవీ చేయలేవు.”

”స్వామీ స్వామీ నన్ను మన్నించండి. నా తప్పులు కాయండి. కాపాడండి. మీరు కోరుకున్న చోట క్రిష్ణ ఒడ్డునేనా సరే పాలరాయితో ఆశ్రమం కట్టిస్తాను. మన  ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రిగారిని నన్ను రాజ్యసభకి అంపించమని అర్జీ కూడా పెట్టుకున్నాను. బేరాలు సాగుతున్నాయి. నన్ను సెపిస్తే మీకేం లాబం చెప్పండి.”

”ఇది నా శాపం కాదు. దేవుడి సంకల్పం. అంతేగాదు. నీకా సీటు రాదు. ఒక సినిమా నటుడు ఎక్కువిస్తానంటున్నాడు.. ఈ జన్మలో అయినా ఉత్తమ గాడిదలా జీవించు.”

అంటూ మెల్లిగా పెళ్లగించినట్టు కూచున్న చోటు నుంచి గాల్లోకి లేచేడు. గారపాటివారు కళ్లు మూసుకున్నారు. ఆయనకి మాట పడిపోయింది రుషిగారు పైకి లేచి చెట్ల మధ్యనుంచి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. గారా అనుకున్నాడు ”ఈణ్ని అసలు ఎన్‌కౌంటరు చేయించి మావోయిస్టు కోవర్టని పూడిచిపెడితే బావుండేది.” అసలీ రుషులు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచీ హిమాలయాల్లో ఎక్కడో గోతులు తవ్వుకుని అందులోనే ఉంటారుగదా. మరీడు బైటికెందుకు వచ్చినట్టు? చాలాసేపటిగ్గానే నిలబడి బంగ్లా వేపు వెళ్లలేకపోయాడాయన. అసలిదంతా పెళ్లాం గొడవ గొడవ వల్ల వచ్చింది. అరకో అరకో అంటూ తినేసింది. సర్లే దాన్నోరసలే మంచిదిగాదు. ఏడిచిపోద్దని  అరకొచ్చి పడ్డాడు. నిలుగు రోజులూ బాగానే గడిచేయి. రోజూ రాత్రిపూట ముఖ్యమంత్రిగారి ఆరోగ్యం గురించి ఫోను చేస్తూనే ఉన్నాడు. రెండో రోజు ఒకచోట చిన్నచిన్న కొండలు, పల్చటి అడవీ చూడగానే గారా గారికి ఆశ్చర్యకరమైన ఆలోచన ఒచ్చి రాత్రి ముఖ్యమంత్రికి ఫోన్‌ చేశాడు.

”ఆయ. సార్‌, మీ హెల్తు జాగర్త సార్‌. మన యావద్దేశ భవిష్యత్తు మీ యొక్క హెల్తు మీద ఆధారపడి ఉంది సార్‌. సార్‌, నాకో ఆలోచన కలిగింది సార్‌. ఇక్కడో చోట చిన్న కొండలు, ఓ మోస్తరు అడవీ ఉంది సార్‌. ఆ కొండల్ని కొట్టించేసి, అడివికి అగ్గెట్టి నిర్మూలించి పరిశ్రమలకి ఇప్పిస్తే మన యువతకి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని మీకు మనవిజేస్తన్నా సార్‌.”

”నిజమే రాఘవరావుగారూ. నా కోరికా అదే ! కానీ పర్యావరణం, అటవీ చట్టం ఉన్నాయి గదా ?”

”ఎధవ చట్టం సార్‌. అడవుల్లో పులులూ, సింహాలూ గట్టా ఊళ్ల మీద బడి మనుషుల్ని తింటా ఉంటే ఈ ఎదవ చట్టం కాపాడుద్దా సార్‌ ? సారూ, మన చివటం రాజుగారి చేత పూతరేకులు అంపించాను, అందినయా ?”

అనవసరంగా ఇవాళ ఉదయవే సర్దాగా అలా నడుచుకుంటూ వెళ్దావని బయలుదేరేడు గారా. గన్‌మెన్‌లని వెనక ఉండిపొమ్మని చెప్పి ఏదో ఆలోచనలో దూరం వెళ్లిపోయాడాయన. పెద్దడివి కాదుగానీ పల్చపల్చగా చెట్లున్నాయి. రుషి గాడికి దొరికిపోయాడు. ఏదో మత్తులో నడిచినట్టు బంగ్లాకి చేరుకున్నాడు.

కిటికీ ఊచలు పట్టుకుని బయటకి చూస్తున్నాడు గారపాటి రాఘవరావు. అరకులో రుషిగారు కనిపించి అయిదారు నెల్లయింది. ఆ మర్నాడే విమానంలో హైదరాబాదు చేరుకున్నాడాయన. ఆ రోజు నుంచీ ఆయన సరిగా నిద్రపోలేదు. రోజూ ఒకటి రెండు పీడకలల చొప్పున ఈ అయిదు నెలలూ ఉలిక్కిపడి లేచి కూచుంటున్నాడాయన. మరీ ఒక పీడ కల ఆయన్ని పగలు కూడా పిచ్చికుక్కలా తగులుకుంది. అసెంబ్లీ నుంచి ఇంటికొచ్చి సాయంకాలం ఒక్కడే నడకకోసం బయలుదేరేడు గారా. దారిలో ఎక్కడో అనుకోకుండా హఠాత్తుగా ఆయన గాడిదైపోయాడు. ముందు, కాళ్లు రెండూ కురచయి పోయాయి. గాడిదలా ఇంటికి నడుచుకొస్తుంటే దారిలో ట్రాఫిక్‌ పోలీసు లాఠీతో డొక్కలో పొడిచాడు. బూటు కాలితో కూడా తన్నేలోపల అరుస్తూ పరిగెట్టేడాయన. కానీ బాధంతా దిగమింగి ఇంటికెళ్లి భార్య చేత్తో దాహం పుచ్చుకుని, వీలయితే వీపు రాయించుకు పడుకుందావని గేటు తోసుకుని లోపలికి వెళ్లేడు గారా. పూలు కోసుకుంటూ గాడిదని చూసిందామె. ఆమె కనబడగానే ఓదార్పు కోసం సంతోషంగా ఓండ్రిస్తూ ఆమె దగ్గిరకి వెళ్లేడు గారా. ఆమెకి ఆగ్రహం నసాళానికి ఎక్కి ” జేష్ఠముండా, గాడిదముండా, లంజి కానా” అంటూ వినరాని అనేక తిట్లతో కర్ర తీసుకుని బాదింది. వెంటబడి బాదుకుంటూ గేట్లోంచి గెంటి తలుపేసుకుందామె. ఆ దెబ్బలకి ఆయన మాట్లాడ్డం మర్చిపోయాడు. తాళి కట్టిన భర్తననే గౌరవం, అపేక్షా లేకుండా పోయాయి.(”ఆ ఎదవ తిట్లేటి అసల?”) బాధతో అవమానంతో గారా ఒగరుస్తూ గేటు బయట నిలబడలేక కూలబడిపోయాడు. అదేం తక్కువదిగాదు. కసిదీరా బాదింది. రోషంతో లేచి గేటు తలుపు తోసి లోపలి కెళ్లే ప్రయత్నంలో మెళుకువ వచ్చిందాయనకి.

గత నెల రోజుల్నించీ పరిస్థితి ఏవీ బాగుండడం లేదు. చేతులమీదా, తల వెంట్రుకలు, పిక్కలు, పొట్ట మీదా వెంట్రుకలు రంగు మారుతున్నాయి. తెలిసిన వాళ్ళందరూ అడుగుతున్నారు. రోజూ నిద్ర లేవగానే పాదాలు చూసుకుంటున్నాడు రావుగారు. పాదాల బదులు గిట్టలు మొలిచాయని భయం. మనశ్శాంతి లేదు. పోనీ రుషిగారు మళ్లీ కనిపిస్తే కాళ్లమీద పడదా వనుకున్నా, ఎక్కడ గాల్లో తిరిగుతున్నాడో తెలీడం లేదు. గారా గారికి మరో చిత్రమైన మార్పు కనిపిస్తోంది. పార్టీ సమావేశంలో ఆ మధ్య ముఖ్యమంత్రిగారు మాట్లాడగానే అందరూ చప్పట్లు కొట్టేరు. సంతోషంగా అందరూ పెద్దగా నవ్వేరు. అరిచేరు. గారా గొంతు కలిపి  నవ్వు శ్రుతిమించగానే ఆయన ఆగి ఆగి ఓండ్ర పెట్టడం ప్రారంభించాడు. పోనీ ఓసారి ఓండ్రించాడంటే సరిపెట్టకుందావన్నా  రెండ్రోజుల క్రితం కూడా ఆయన అనుకోకుండా ఓండ్రించడంతో స్పీకరుగారు పిలిచి మందలించారు. గారాకి దిగులు పట్టుకుంది. అంతా రుషి చచ్చినాడు చెప్పినట్టే జరుగుతోంది. ఉగాదినాటికి తను పూర్తి స్థాయిలో గాడిదయిపోడం ఖాయం. కర్ర తీసుకుని డొక్కలో పొడవకుండా ఉంటే భార్య చేసే ఉగాది పచ్చడి సీమెండి ప్లేట్లో నేల మీద పెడితే నాలికతో నాక్కుంటూ తినాల్సిందే. ఏది దారి? ఓ రోజు రాత్రి భార్యని లేపి అంతా చెప్తే సరిపోతుందనే ఆలోచన కూడా వచ్చింది. దరిదాపు వెంటనే నాలిక్కరుచుకున్నాడు. ఆస్తి మొత్తం ముందు రాయించేసుకుని తరవాత చెట్టుకి కట్టేసి సర్దాగా ఎప్పుడంటే అప్పుడు కర్రతీసుకు బాదుడు.

ఆ రుషిగాడు చెప్పినట్టే రాజ్యసభ సీటు సినిమావాడు తన్నుకుపోయాడు. ముఖ్యమంత్రిగారికి ఆడి బేరం నచ్చింది. ఆయనకి విశ్వాసం మీద విశ్వాసం లేదు. అసలీసారి ఎమ్మెల్యే అయినా దక్కుద్దో లేదో తెలీడం లేదు. ఇంకిప్పుడీ గాడిద జన్మ తప్పేటట్టు లేదు. అయినా రుషిగాడికి మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రీ గారూ కనిపించలా. అసలికి ధర్మం మాటాడుకుంటే దరిదాపు అసెంబ్లీ నిండా గాడిదల గుంపు ఉండాలిగదా మరి. గారపాటి ఫేమిలీ ఇంత కాలం బ్రామ్మల్ని కొల్చుకున్నందుకు మాబాగా జరిగింది. దీనికి తోడు ఎవరూ లేనప్పుడు తలుపేసుకుని నేలమీద గాడిదలా నడవాలనిపిస్తోంది. కొంచెం తల ఊపుతూ మోకాళ్ల మీదా చేతులమీదా నడుస్తూ తిరగాలనిపిస్తోంది. ఆ కోరిక ఎక్కువయి పోతోంది. అంటే ఒకటో రకమైన పులస చేప మీద బ్రమ లాంటి దన్నమాట. అసలీ బతుకేటి? నిన్నటికి నిన్న మద్యాన్నం ఇంత బువ్వ తిని, అంతకు ముందు కడుపులో పడ్డ బీరుకాయల వల్ల సోఫాలోనే కునుకు తీసాడు గారా. అసెంబ్లీలో కూచున్నట్టు కలొచ్చింది. తను నాలుగు కాళ్లతో స్పీకరు గారి దగ్గిరికి వెళ్తున్నాడు. ”రాఘవరావు గారూ, అలా పాక్కుంటూ రావడం సభామర్యాద గాదు. దయచేసి మామాటగా నడుస్తూ రండి. సీసీ కెమెరాలున్నాయి. దయచేసి దేకడం మానెయ్యండి.” తనేమో నోనో అంటూ అరుస్తున్నాడు. దెందులూరు శాసనసభ్యురాలు ఒక్క గంతులో వచ్చి ”రాగవయ్య గారూ ఏటిదీ? లెగండి ముందు” అంటూ భుజాలు పట్టుకుంది. అంతే, వెంటనే మోరఎత్తి ఓండ్రించాడు. ఎవరో మొహం మీద నీళ్లు చల్లేరు. చేతిలో మంచినీళ్ల గ్లాసుతో భార్య. ”ఏటా నిద్రేటీ, ఆ అరుపులేటి? లోపలికి గాడిదగాని దూరిందనుకున్నా. లెగండి చాలుగాని.” గారాగారు చిన్నబుచ్చుకుని, దరిమిలా కుమిలిపోయి లోపలికెళ్లి పడుకున్నారు. నిద్ర రాలేదు. తన భవిష్యత్తు గాడిదయి పోయింది. అంతా శూన్యం. తాళాలేసిన శాసనసభలా జ్ఞాపకాలు తప్ప ఏవీ లేదు. ఏదిదారి? పోనీ ఇదంతా పీడకల, మెళకువ రాగానే అంతా మామూలే అనుకోడానికి కుదరడం లేదు. ఆలోచిస్తుండగా నిద్రలోకి జారేడు గారా. నిద్రపట్టేముందు రెండు ఆలోచనలొచ్చాయి ఆయనకి. ఒకటి, పోనీ షిరిడీ వెళితే పని జరుగుతుందా లేకపోతే కొండకెళ్లి  మిగిలిన తలనీలాలు సమర్పించుకుంటే బావుంటదా ! తనకి ఎందుకో తిరపతి మీద క్రితం ఏడాది నుంచీ బ్రమ పోయింది. ఎప్పట్నుంచో తనకి టిటిడి ఛైర్మను కావాలని కోరిక. ముఖ్యమంత్రిగారు కూడా కొంచెం మెత్తబడ్డారు. తీరా కేబినెట్‌లో పేరు చెప్పగానే అందరూ ఎదురు తిరిగేరు. చావనైనా చస్తాంగాని గారపాటి తిరపతి పోడానికి వీల్లేదని కూచున్నారు. (”కొండ మీదింక గడ్డి గూడా మిగల్దు సార్‌”) సీ.ఎమ్‌. గారు సున్నా చుట్టారు.

మరో నెల కూడా దాటింది. గారా బయటికి రావడం మానేశాడు. ఆయనింటి ముందు పచ్చిక, కాసిని చెట్లూ ఉంటాయి. మధ్యాన్నం అందరూ పడుకున్న తరవాత బయటికి వెళ్లి చెట్ల వెనక నిలబడి గారా ఓండ్రించడం అలవాటు చేసుకున్నాడు. గదిలో ఎలాగూ మోకాళ్ళ మీద డేకుతున్నాడు. ఎప్పుడూ గది తలుపులు వేసుకునే ఉంటున్నాడాయన.(”వెర్రి కుదిరింది, రోకలి తలకి చుట్టుకోమన్నాడంట”) బుర్రలో ఈయనకి కొంచెం బీటగాని దీసిందా అనుకుంది ఆయన భార్య. సరిగ్గా మరో నెలా పద్దెనిమిది రోజుల తరువాత తెలుగు పత్రికల్లో మొదటి పేజీల్లో, ఇంగ్లీషు పత్రికల్లో మూడో పేజీలో వార్తపడింది.

”….రాఘవగారు ఇంతవరకూ రెండుసార్లు శాసనసభకి పశ్చిమ గోదావరి నుంచి ఎన్నికయ్యారు. అనేక ముఖ్యమైన కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. ఆయనకి ఆర్ధికమైన, కుటుంబ సంబంధమైన ఇబ్బందులుగానీ, వ్యక్తిగతమైన సమస్యలు గానీ ఉన్నట్టు తెలియడం లేదు. రావుగారి భార్య వరలక్ష్మిగారు కూడా ఎటువంటి కుటుంబ కలహాలు లేవని ధృవీకరించారు. కానీ కొంతకాలం నుంచీ వింతగా ప్రవర్తిస్తున్నారనీ మాట్లాడ్డం తగ్గించారనీ ఎప్పుడూ ఎవరో రుషి గురించి పలవరిస్తూండేవారనీ తెలియజేసారు. ముఖ్యమంత్రి”

రావుగారు చెప్పాచెయ్యకుండా అదృశ్యం అయిపోయారు. రెండ్రోజులపాటు రాసి పేపర్లు ఆయన గురించి మర్చిపోయాయి. కానీ రహస్యం రావుగారికీ, కొల్లేటి పెద్దింటమ్మవారికీ, రుషిగారికీ తప్ప ఎవరికీ తెలీదు.

ఆదృశ్యం అయినరోజు రాత్రి, రావుగారు హఠాత్తుగా తన నాలుగు కాళ్ళమీదా నడుచుకుంటూ పూర్తిస్థాయి గాడిదగా మారి ఇల్లు వదిలి బయటపడ్డాడు. తనకీ హైద్రాబాదుకీ రుణం తీరిపోయింది.

తనకి తెలీకుండానే ఆయన విజయవాడ హైవే చేరుకున్నాడు. రోడ్డుకి ఒక పక్క దూరంగా నడుస్తూ తన దురదృష్టానికి దురపిల్లుతూ గారా ఎంతదూరం నడిచాడో తెలీదుగానీ క్రమంగా చీకటి కరిగి రోడ్డు తెల్లబడ్డం గమనించి ఓ చెట్టుకింద విశ్రాంతిగా ఆగేడాయన. గాఢమైన వేదనవల్లా, నడకవల్లా నిద్ర కమ్ముకు రావడంతో అలాగే కూలబడిపోయాడు. ఎంతసేపు నిద్రపోయాడో గానీ మెళకువ వచ్చి, కాస్త కాళ్ళు జాడించాలనిపించింది. కళ్ళు విప్పి లోకాన్ని చూసేసరికి, లోకం కొంచెం దీర్ఘచతురస్రంగా వుండడమే గాక వేగంగా కదుల్తున్నట్టనిపించింది. గారా మళ్ళీ లేచే ప్రయత్నం చేశాడు. ఆయన వల్లకాలేదు.

అప్పటికి రావుగారికి పూర్తి స్పృహ వచ్చి లోకం చూడగానే తనెంత దుస్థితిలో ఉన్నాడో వెంటనే అర్థమయింది. ఒక శాసనసభ్యుడికి జరగవలసిన అగౌరవం కాదు. గారా కాళ్ళు, వెనక జత కట్టేసివున్నాయి. తాను పడుకున్నది లారీలో. ఇంకొంచెం తలతిప్పి చూడగానే తలవేపు ఇద్దరు కాళ్ళు బారజాపి, ఒకడు మరోడి భుజం మీద తలపెట్టుకుని నిద్రలో వున్నారు. గారాకి ఏంచెయ్యాలో అర్థంగాక మంద్రస్థాయిలో ఓండ్రించింది. అసలు జీరో అవరు వ్యవహారం ఇది. వీళ్ళకి తెలిసినట్టు లేదు. చటుక్కున మెళకువ వచ్చి ఒకడు కాలితో తలమీద తన్నాడు. (..అధ్యక్షా…) ఇంక నిశ్శబ్దంగా వుండకపోతే తన మర్యాద దక్కదని అర్థమైంది. ఈ వెధవలకి తనెవరో తెలీదు. తనకి తెలిసినా ఉపయోగం లేదు. సత్యంతో సమస్య ఇదే. తను చెయ్యగలిగినదేమీ లేదు.

కళ్ళుమూసుకున్నాడాయన. గంట తరవాత టీకోసం ఆగినప్పుడు వెనక కాళ్ళు కట్టు విప్పి ఇద్దరూ దిగేరు.

టీలు, సిగరెట్లూ అయిన తరువాత ఇద్దరూ మళ్ళీ ఎక్కేరు. అప్పటికి గారా లేచి నిలబడగలిగాడు. లారీ కదులుతూండగా అడిగేడాయన.

“…ఏదేనా బ్రేక్ఫాస్టు ఉందా…”

“బెజవాడలో నీళ్ళు తాపుతాం” అన్నాడు తన్నినవాడు.

“నన్ను ఎక్కడికి తీసికెళ్తున్నారు.”

“బెజవాళ్ళో నిన్ను అమ్ముతాం.”

“ఎవరికి?”

“నీకెందుకు?”

“నేను ఎవరికీ అమ్ముడవను. ఇంతవరకూ ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ మారలేదు. నా విలువ కట్టడం మీ వల్లగాదు…”

“యయ్యెహె కుక్కలా పడుండు.”

“దొంగ వెధవల్లారా, నేను కుక్కలా ఎందుకు పడుంటాన్రా… ఊళ్ళోగానుంటే ఎస్పీగారికి ఫోన్ చేసి ఇద్దర్నీ బొక్కలో తోయించేవాణ్ని.”

ఇద్దరిలో కొంచెం చిన్నవాడు ఒళ్ళుకాలుకొచ్చి కాలితో తలమీద తన్నేడు.

“అమ్మో, అమ్మో.. ఓరి దొంగముండాకొడకా…” ఈసారి ఇద్దరూ తన్నేరు.

“అమ్మో తల పగిలిపోయిందిరా లమిడీ కొడుకుల్లారా సభాహక్కులు తెలీని ఎదవల్లారా.”

ఈసారి ఇంకొంచెం గట్టిగా డొక్కలో  కుమ్మేరు.

“అమ్మో, అమ్మో.. రేయి ఎదవల్లారా, ఒక్కటి గుర్తెట్టుకోండి. నన్ను తన్నిన ప్రతి తన్నూ తెలుగోడి మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయి” అంటూ గారా తలెత్తి కళ్ళెర్రజేసి చూస్తూ, ముక్కుపుటాలు వణుకుతూండగా అన్నాడు.

“రేయి తెలుగోడి మనోభావాలు గాయపడితే ఏవవుద్దో తెలుసా!  ఇంకొక్క దెబ్బపడిందా, జాగర్త” అని ఎందుకేనా మంచిదని  ఓండ్రించిందిగారా. ఇద్దరూ లేచి బలంగా డొక్కలో తన్నేరు.

“అమ్మో!” గారా మళ్ళీ బెజవాడ దుర్గమ్మ కొండ వంపు తిరేగవరకూ కిక్కురుమన్లేదు.

వాళ్ళు అన్నట్టుగానే బెజవాడ దాటగానే గారాకి తిండి పెట్టేరు. గారా కొంచెం నిరసన తెలియచెయ్యాలని అనిపించినా ఎందుకేనా మంచిదని ఏవీ అనలేదు. ఒకసారి ఆకాశంవేపు కోపంగా చూశాడాయన.

లారీ ఎక్కడో ఆపి ఎవరితోనో మాట్లాడేరు ఇద్దరూ. గారాకి చెట్టుకి కట్టి పడేసి ఉంచడం నచ్చలేదు. అనుకోకుండా కోపం తన్నుకొచ్చి  ఓండ్రించింది. ఇద్దరిలో కాలి దురద ఎక్కువ వున్న యువకుడు వచ్చి అన్నాడు.

“ఈసారి గాని అరిసేవనుకో, డొక్కబద్దలైపోద్ది”

ఆ రాత్రి మళ్ళీ పొద్దుపోయింతరవాత గారా ప్రయాణం మొదలైంది. తెలతెలవారుతుండగా ఓ పెద్ద కాలు ఒడ్డున చెట్టుకింద దిగేడు గారా. తనను తీసుకు వచ్చినవాడు నడివయస్కుడు. గారాకి ప్రాణం లేచివచ్చింది. తనెక్కడున్నాడో తెలుసాయనకి. నిడదవోలు కాలువ దగ్గిర. రెండు ముక్కుపుటాలూ తెరిచి ఆ ఉదయపు పశ్చింగోదావరి గాలిపీల్చుకున్నాడాయన. కొంచెం పొద్దుపోయింతరవాత గానీ వీపు మీద మూటలు మోస్తూ గాడిదలు, చాకలివాళ్ళూ రాలేదు.

హైదరాబాదు పోలీసులకి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. మనిషి మాయమైనట్టయింది. గారాకి పోనీ వివాహేతర సంబంధాలున్నాయేమోనని కూడా ఆకోణం నుంచి కూడా ఆలోచించారు పోలీసులు.

దెందులూరు శాసనసభ్యురాల్ని కూడా విచారించారు. ఏవీలేదని తెలిసింది (“ఆరికంత కెపాసిటీ లేదండి మరి”)

సొంత గడ్డమీదకి రాగానే ఓసారి గర్వంగా తలతిప్పి అటూ ఇటూ చూసేడు గారా. నీటి ఒడ్డున బండల మీద చాకళ్ళు బట్టల్ని ఉతుకుతున్నారు. చెట్ల కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నాయి గాడిదలు.

వాటిని చూడగానే గారా గారికి అనుమానం కలిగింది. ఎవరై ఉంటారు? ఇక్కడికి ఏ రుషి వచ్చాడో ఎలా తెలుస్తుంది. పైగా హైదరాబాదంటే పెద్ద శాసనసభా, సెక్రటేరియట్ అవీ ఉన్నాయి. మరి వీళ్లెవరై వుంటారు. ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇవి కల్తీ లేని సహజ గార్ధబాలన్నమాట. ఏది ఏమైనా ఇక్కడ చక్కటి పశ్చింగోదావరి గాలీ, చల్లదనం. గారా గారికి తనని ఆ ఇద్దరు వెధవల దగ్గిర్నంచి కొనుక్కున్న వృద్ధ చాకలి మీద కొంచెం గౌరవం ఏర్పడింది. ఎప్పుడూ ఏదో గొడవగా వున్నా అసెంబ్లీ కూడా హాయిగా చల్లగా వుంటుంది. నీటివేపు నడిచాడు గారా గారు. యజమాని చాకలి పక్కబట్టలు కాబోసు ఉతుకుతున్నాడు. అందరితోపాటు చక్కగా లయబద్ధంగా గొంతు కలుపుతున్నాడు. తన నియోజకవర్గం కాకపోయినా తన ప.గో. గుట్టలు గుట్టలుగా ఒడ్డున గడ్డిమీద బట్టలు ఆరెయ్యడానికి సిద్ధంగా వున్నాయి. ఆడాళ్ళు కొందరు వెదురు గడలకి కట్టిన తాళ్ళ మీదా, గడ్డిమీదా బట్టలు ఆరబెడుతున్నారు. ఒడ్డునే చాకలి గ్రూపులందరికీ పక్కా ఇళ్ళు కట్టించి ఇవ్వాలి. కానీ వెంటనే తన పరిస్థితి గుర్తుకొచ్చి కళ్ళనీళ్ళు తిరిగేయి గారా గారికి. ఆ దుః..ఖంలోనే సంసారం జ్ఞాపకం వచ్చింది. పాపం కూతురు ఆమెరికాలో ఎంత బాధపడుతోందో. కొడుకులిద్దరూ కూడా బాధపడతారు. పెద్దాడికి ఎమ్మెల్సీ అవాలని కోరిక. ఆ సందర్భంలోనే స్పీకరుగారి బావమరిదికి అయిదువందల ఎకరాల బినామీ చెరువు కొల్లేటిలో తవ్వించాడు. రుషిగాడి దయవల్ల ఈ గతి పట్టింది. వరం పెద్దగా పట్టించుకోదు. ఈలోగా గారాకి ఆకలనిపించింది. కొన్నవాడికి తన ఆకలి తెలీకపోతే ఎలా… దురద, ఆకలీ సిగ్గెరగవు. కొంచెం దగ్గిరవరకూ వెళ్ళి అంది గారా.

“ఇక్కడ బావుంది. నాకు సంతోషంగా వుంది. నీకు వృద్ధాప్య పింఛను, ఒక వ్యక్తిగత మరుగుదొడ్డీ ఇప్పిస్తాను. సరేమరి. ఆకలవుతోంది భోజనం ఏర్పాట్లు చేస్తే బావుంటుంది.”

“ఏటేటీ..”

“ఏం లేదు. లంచి లేటయ్యేట్టుగా ఉంది. ఆ ఏర్పాట్లు చూడమంటున్నాను”. యజమాని చాకలి వెనక్కి తిరిగాడు.

“బోయినం గావాల్నా.. ఓసి లంజి కూతురా. దా.. తినవే  నీయమ్మ..” చేతిలో అప్పటికే మెలిదిప్పి ఉన్న ఎమ్మిగనూరు దుప్పటి గదలాగా ఉపయోగించి గారా మూతిమీద బాదేడు. మరో రెండు బూతులు కూడా తిట్టేడు నిజానికి. గారా మూతి విరిగినంత పనైంది. ఓండ్రిస్తూ చెట్లదగ్గిరికి పారిపోయాడు గా.రా. దూరంగా చెట్లకింద నిలబడి నిప్పులు చెరుగుతూ చూశాడాయన. దవడ ఇంచుమించుగా ఊడిన కిటికీ రెక్కలాగుంది. ఏ నియోజక వర్గం అయినా ఓటరు గాడిదకొడుకుల్ని నమ్మడానికి వీల్లేదని జ్ఞాపకం వచ్చింది. నెప్పి భరించలేక, ఉగ్రంగా చూడ్డం మానేసి నీడలో పడుకున్నాడు గారా.

తరవాత స్పృహలేదు. ఆ తరవాత కూడా స్పృహ రాకపోను. కానీ కలలో ఎవరో కడుపు మీద తన్నేరు. మూలిగాడు గారా గారు. “లెగెహె దున్నపోతా” మరోసారి తన్నుతో  ఒకసారి మూలిగి లేచి నుంచుంది గారా. ఎదురుగా పన్నెండేళ్ళ కుర్రవాడు.

“నువ్వేనా ఏరా డొక్కలో తన్నేవు?  మొన్నటి దాకా పశ్చింగోదావరి నా జేబులో వుండేది. ఎవడ్రా నువ్వు…”

“నీ బాబునిగానీ నిదరోయింది చాలు గానీ నడు” అంటూ ఒక్క ఎగురు ఎగిరి వీపు మీద కూచున్నాడు. కలుక్కుమంది నడుం.  “పద” మోకాలితో పొడిచి నీటి దగ్గిరికి తీసికెళ్ళేడు వాడు నడుస్తూ అటూ ఇటూ చూసింది గారా. గుండె ఆగిపోయింది. తనలాగే మిగతా గాడిదలు నీటిదగ్గర నుంచుని ఉన్నాయి. ఒక్కోదాని వీపు మీద బట్టల మూటలు కడుతున్నారు. కొన్ని అప్పటికే మోసుకుంటూ గట్టు ఎక్కుతున్నాయి. గారాకి భవిష్యత్తు స్పష్టంగా అర్థం అయింది. వీపు మీద వెధవ అనవసరంగా మోకాలితో డొక్కలో పొడుస్తున్నాడు. మొత్తానికి తండ్రీ కొడుకులిద్దరూ కలిసి కొండంత మూటలు అటూ ఇటూ బిగించారు. వాటి మీద మళ్ళీ ఎక్కి కూచుంటాడని భయపడింది గారా. కానీ ముందు నడుస్తూ మెడతాడు లాగేడు కుర్రాడు. రోడ్డు మీదికి రాగానే ఒకదానివెంట మరొకటి గాడిదల వరసలో భారంగా నడుస్తున్నాడు గారా. ఎటువంటి జీవితం ఎలాగైపోయింది? రుషిగాడివల్ల ఒకే ఒక్క ఊరట. ఆ స్థితిలో తనని ప్రెస్సోళ్ళు కూడా గుర్తుపట్టలేరు. తను తొందరపడి విజయవాడ హైవే ఎక్కకుండా ఉంటే!  చెప్పలేం. ఏ లంబాడీ తండా వాడో చూసి వుంటే తన జీవితం ఎంత హీనం అయిపోయి వుండేది. రెండు కిలోమీటర్లు దూరం భారంగా, బాధగా జీవితం గురించిన ఆలోచనలతో గారా గారు యజమాని ఇంటికి చేరేడు. యజమాని భార్య బట్టల మూటల్ని దింపింది. రాత్రి దాణా కడుపులో పడగానే నిద్రపట్టేసింది.

మర్నాటి సాయంకాలానికి గారాకి కొన్ని జీవన వాస్తవాలు అర్థం అయినాయి. ఒకటి తన అస్తిత్వం కేవలం తనకి మాత్రమే సంబంధించింది. తను ఆం.ప్ర. శాసనసభ్యుడనే సత్యం పట్ల ప్రజలకి ఎటువంటి ఆసక్తీ లేదు. రెండు తన అస్తిత్వ వ్యవహారాలలో తనకి స్పష్టత లేదు. తన స్పృహకీ వాస్తవానికీ సంబంధం లేదు. రుషిగాళ్ళని ఎప్పుడూ నమ్మరాదు. ఇది ఆడిశాపం. ఏవీ అనుమానం లేదు. చివరిగా అసెంబ్లీ అంత సుఖంగా లోకం ఉండదు. ఇది దరిద్ర, ఛండాల, జెష్ట వెధవల ముదనష్టపు లోకం. చాకలి వాళ్ళు గాడిదల్ని క్షోభ పెట్టకూడదని చట్టం తేవాలి. చివరాకరిగా ఎమ్మిగనూరు దుప్పట్లని వెంటనే నిషేధించాలి. దుప్పట్లని ఎలా వాడాలో తెలీని ఎదవలున్న లోకం ఇది. మరోటి కూడా ఉంది. ఒక్క కొల్లేటి పెద్దింటమ్మ వారు తప్ప ఈలోకంలో దేవుడు లేడు. కానీ ప్రస్తుతం తను చేయగలిగింది ఏవీ లేదు. రుషిగాడి కాళ్ళు పట్టుకోడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఆడికి పెట్రోలు పంపుగానీ, చిన్న ఇంటి స్థలం గానీ, ఉచిత మరుగుదొడ్డిగానీ వేస్టు. అడవుల్లో తిరిగే వోడికి మరుగుదొడ్లు ఎందుకు? చాలా దీర్ఘంగా నిట్టూర్చి గారా అనుకున్నాడు. తన యజమాని పైకి కనిపించినంత మంచివాడు కాదు వాడికీ వాడి ఎదవకొడుక్కీ హింసా ప్రవృత్తి ఉంది. తను గుట్టుగా మర్యాదగా ఉంటం మంచిది. పార్టీ ప్రెసిడెంటుగారు మొకమ్మీద ఛీ అన్నంత మాత్రాన పార్టీ ఒదిలేసుకుంటున్నామా.. మరోటి ఉదయం, సాయంత్రం పెద్దింటమ్మవారిని స్మరించడం. అమ్మ భక్తుడు తను. ఎవడో ఎదవ కోర్టుకెళ్ళి కొల్లేటి చేపల చెరువుల్ని నిర్మూలిస్తున్నప్పుడు కూడా అమ్మనే నమ్ముకున్నాడు. అమ్మ ఎందుకో కల్పించుకోలేదు.

గారా మిగతా స్వజాతీయులతో దూరంగా వుంటున్నారు. కానీ ఒకే కేస్టు ఓటర్లవడం చేత మాట్లాడక తప్పలేదు. తన గతం గురించి ఏమీ చెప్పలేదు. ఏదో మర్యాదకోసం పలకరింపులూ, యోగక్షేమాలు, భోజనం వంటి ప్రస్తుత విషయాల గురించే  ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. కానీ మహిళలు చాలామంది డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారనీ, వారిలో నూకాలమ్మ, ఎస్తేరమ్మ అనే ఇద్దరు ఆ డబ్బుతో వడ్డీలు తిప్పుతున్నారనీ, బట్టలు ఆరేస్తూ అనుకుంటూండగా తెలిసింది. తను వెళ్ళి ఒకటి రెండు అంశాలు ప్రస్తావించాలనుకున్నా గారాగారు తమాయించుకున్నారు.

మరో రెండుమూడు రోజుల తరువాత పెద్దింటమ్మవారు కరుణించారని అర్థమైంది గారాకి ఆ రోజు మధ్యాహ్నం గారా గారు నిద్రలేచి బద్ధకంగా మిత్రులవేపు నడిచారు. పక్కకి చూడగానే చెట్టుకింద వయసులో తనకంటే పెద్దదయిన గాడిద కనిపించింది. తదేకంగా తననే చూస్తోంది. గారా ఆగి చూశాడు. దాని చూపుల్లో ఏదో తెలియని స్నేహం.  పలకరింపుగా ఇద్దరూ తలూపుకున్నారు. అసంకల్పింతంగా గారా చెట్టుకిందికి నడిచాడు.

“రండి, రండి. మీరు అందరిలాంటివారు కాదు. నేను గమనిస్తూనే ఉన్నాను. మనిద్దరం  ఇక్కడ ఉండవలసిన వాళ్ళం కాదు.”

“మీరు గమనించింది నిజం” అన్నాడు గారా.

“నేను మీ శ్రేయోభిలాషిని. మీ గురించి వినాలని ఉంది. మనిద్దరం బాతుగుంపులో హంసల్లాంటివారం. మిమ్మల్ని చూడగానే ఐరావతం మాసిన బట్టల్ని మోస్తున్నట్లనిపించింది.”

“ఆయ. నిజం నాది చాలా బాధాకరమైన స్టోరీ” గాఢంగా నిట్టూర్చి అటూ ఇటూ ఎవరూ లేరని చూసుకుని గారా ఇలా అంది. క్లుప్తంగా తన ఇటీవలి జీవిత చరిత్ర చెప్తుంటే వింటున్న మిత్రుడు ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టేడు. తరువాత మొహం  దుప్పటీ అంత అయింది.

“ఎంత ఆశ్చర్యం. సంతోషం ఇన్నాళ్ళకి ఒకసాటి మహానుభావుడు కలిశాడు. ఇకనుంచీ మనిద్దరం ఒకటి…

“ఆయ. కానీ తమరెవరో చెప్పలేదు.”

“నా పేరు గౌడ. కర్నాటక  మాది. మైనింగు విషయాల్లో నన్ను అపార్థం చేసుకుని ఎసీబీ వారు నన్ను అనవసరంగా ఇరికించారు. తాత్కాలికంగా ఎవరికీ చెప్పకుండా నందీహిల్సు వెళ్ళాను. అక్కడ ఒక రోజు మార్నింగ్ వాక్ లో ఉండగా ఆకాశం నుంచి ఒక రుషి ఊడిపడ్డాడు.. అని ఆగి గారాని చూస్తూ నవ్వేడు. గారా గారికి మాట పడిపోయింది.

“ఎంత ఆశ్చర్యం. మనిద్దరి స్టోరీ ఒకటే. ఆంధ్రా రావడం కూడా అనుకోకుండా జరిగిపోయింది. పొరుగు రాష్ట్రం అనే కాదు, మనందరం సాటి వాళ్ళం. మన ఆశలు, ఆశయాలూ ఒకటే”.

గారాకి కళ్ళు తిరిగేయి.

“అంతా పెద్దింటమ్మవారి దయ. మనలాంటి ప్రజాస్వామ్య లౌకికవాదులిట్లా కలవడమే ఉదాహరణ. అసలీ రుషి గొడవేంటో తెలీడంలేదు. ఎక్కడ కర్నాటక ఎక్కడ అరకు”.

“రుషులకీ దెయ్యాలకీ దూరాభారం ఉండదు రావుగారూ…”

“అవుననుకోండి. అరకు నుంచి చత్తీస్ గడ్ ఎగిరేడు మరి. ఇంక అక్కడ అసెంబ్లీ పరిస్థి ఏవైందో” ఇద్దరూ కాసేపు మౌనంగా చత్తీస్ గడ్ అసెంబ్లీ ఊహించుకుంటూ ఏవీ మాట్లాడలేదు. ముందు గారా గారు తేరుకుని అన్నారు.

“ఆయ. నా మనసులో మాట మీకు మనవి చేస్తున్నాను. మీకు తెలవదని గాదు” గారా గొంతు గాద్గదికమైంది. ఆయన ప్రతిమాటా కన్నీటిలో తడిసి ముద్దవుతుండగా అన్నాడు – “అసెంబ్లీకి దూరంగా ఉండడం కష్టంగా ఉంది సారూ. అసెంబ్లీ సమావేశాలు ఏడాది పొడుగునా ఉండాలి. ఆళ్ళకి కుదరగ్గానీ లేపోతే ఓటర్లు కలెక్టర్ని పిలిచి గోచీ పెట్టండని అడగ్గల్రు. మనం ఏడాదంతా అసెంబ్లీలో కూచుంటే మన ఆడలేడీసు కూడా హాయిగా ఉంటారు. ఆ సుకం పోయింది గౌడు గారూ. పోనీ ఈ టరం పూర్తిగా కూడా అవలేదు. ఏమాటకామాటేనండి. ఆయ. మాకేంటీన్లో నాలుగు పెద్ద ఇడ్లీలు అయిదు రూపాయలండి. మంచి కమ్మటి దళసరివి. కారప్పొడీ, ఒకటో రకమైన నెయ్యి, పల్లీల పచ్చడి, గుమగుమలాడిపోయే సాంబారు” అంటూండగా ఆ పరిమళాలు సోకి గారా ముక్కుపుటాలు అదిరేయి. కుడుపులోంచి చిరునవ్వు తన్నుకొచ్చి అన్నడాయన.

“ఓమాట చెప్పమంటారా! ఉల్లి దోశలు, పెసరట్టుఉప్నా కేవలం ఒక్కదేవుడే చెయ్యగల్డు. ఆరి తరువాత మా సూరపరాజు లంజి కొడుకండి. మావోడే లెండి. నేనే వంటలో పెట్టేను. నవ్వుతాలకో మాట చెప్పనా.. సెషన్స్ అవంగానే ఇంటికెల్తే ఒళ్ళుజేస్తాంగదా. ఆడోళ్లు హైద్రాబాదులో చిన్నిల్లుందనుకుంటున్నారు” ఇద్దరూ నవ్వుకున్నారు. గౌడగారు విషాదంగా నవ్వి అన్నారు –

“నిజం చెప్పేరు. ఆ బాధ మనిద్దరికీ తెలుసు. వీళ్ళకేవి తెలుస్తుంది? ఒకసారి అసెంబ్లీకి వెడితే ఎప్పుడూ మనమే వెళ్ళాలనిపిస్తుంది. అనవసరమైన ఎన్నికల న్యూసెన్సు లేకపోతే ఓపని చెయ్యచ్చు”

“మీరేంచెబితే అంత. మా గౌరవ ముఖ్యమంత్రిగారికి కూడా మనవి జేసుకుంటాను. ఆరికి ఎన్నికలంటే చిరాకు, చీదర”

“నా అభిప్రాయం ఏమంటే ఒకసారి మనలాంటి పెద్దమనుషులు ఎన్నికైన తరవాత రెండుసార్లవరకూ కంటిన్యూ చెయ్యాలి. అప్పుడే మన నియోజక వర్గాలకి సేవచెయ్యగలం.”

“ఆయ. తమరెంత విలవైన మాట చెప్పేరు గౌడుగారూ. మన రాజ్యాంగంలో అటువంటి మార్పులు చెయ్యవలసిన అవసరం ఎంతేనా ఉంది.”

“నేనిక్కడికి వచ్చిన తరవాత ఈ విషయం. ఆలోచించాను. ఏం లాభం శాపగ్రస్తులం”.

“ఇదంతా ఆ రుషిగాడిద వల్ల జరిగింది సారూ”

“గురుగారూ మీరిచ్చిన ఈ అయిడియా మన ప్రియతమ నాయకుడైన ముఖ్యమంత్రిగారికి చెపుతే ఎలా వుంటుంది? వారు కొత్త అయిడియాలంటే చెవికోసుకుంటారండి”

“కొత్త అయిడియాలంటే వారికి ఉపయోగించేవి. మీక్కాదు. పైగా మీరు రెండుసార్లు ఊరికే ఎన్నికయితే వారికేం లాభం”

“ఆయ నిజవేనండాయ ఆరికేం లాభం? ఎటూగాకుండా పోయేం గదా?

“మనిద్దరి బాధా ఒకటే. చూద్దాం. ఆలోచిద్దాం.”

“ఆరుషి కనిపిిస్తాడంటారా? కాళ్ళట్టుకుందాం. ఎంత చెడ్డా రుషిగారు గదా”

“రుషులు మనకోసం  కనిపించరు. శాపాలేవేనా పెట్టాలంటే ఒస్తారు.”

“గౌడుగారూ, మీకేంటండీ, ఆడిమీద కోపం రాలేదా?”

“పిచ్చివాడా, ఎన్నికల్లో ముఖ్యమంత్రిగారివల్ల ఓడిపోయాను. తరువాత బుద్ధిలేక ఒక కన్నడ సినిమా తీశాను.”

“బాగా ఆడిందా?”

“ఆ హీరో నన్ను ముంచాడు. వాణ్ని హీరోయిను ముంచింది. ఇన్ని రకాలుగా క్షవరం అయిం తరవాత శాంతంగా ఉండక ఏం చేస్తాం… ఏదేనా మిగిలుంటే రుషిగారు అదీ చేసి వెళ్ళేడు.”

“ముఖ్యమంత్రిగారు మిమ్మల్నెందుకు మోసం జేశాడంటారు.”

“ఒక విషయం మీకు అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రులకి మరీ తెలివైన శాసనసభ్యులుగానీ, మంత్రులు గానీ నచ్చరు. అలా ఎవడేనా ఉంటే వాడు ఆయన కులస్తుడయి ఉండాలి. వీళ్ళుగాక ఇతర పార్టీల్లోంచి దూకి ఒచ్చినవారూ, ఏదో ఒక కేసులో ఇరుక్కున్న వాళ్ళూ అయితే మరీ మంచిది. మొదటివారు నాలుగు డబ్బులు చేసుకుంటారు గానీ ఆయన జోలికి రారు. రెండోవారు కేసులవల్ల మూసుకు పడుకుంటారు.”

“మీరేంజేశారు”

“ఇల్లీగల్ మైనింగు వ్యవహారం లెండి. ఆయనకి చెప్పి చెయ్యలేదని కోపం. సెటిల్మెంటు కుదర్లేదు. మరోసారి దీర్ఘంగా విచారంగా నిట్టూర్చేడు గారా. నయవే. తనా పొరబాటు చెయ్యలేదు. బినామీ వ్యవహారాలన్నీ ఆయన అంగీకారంతో ఇష్టంతోనే చేశాడు. గౌడుగారు, గారా నిశ్శబ్దంగా ఎవరి అసెంబ్లీల్లోకి వారు వెళ్ళిపోయారు. ముందుగా గారా తేరుకుని అడిగాడు.

“మీ ముఖ్యమంత్రిగారి మీద మీ అభిప్రాయం ఏవిటి గౌడుగారు.”

“అది నేను చెప్పడానికీ  మీరు వినడానికీ కూడా అసహ్యంగా ఉంటుంది.”

ఇద్దరూ కొంచెం నవ్వుకున్నారు. ఇంతలో పక్కచెట్ల దగ్గిర్నించి నాలుగైదు గాడిదలు వచ్చి చేరేయి. పలకరింపులు అయ్యేక ఒక గాడిద అంది.

“మీరు పెద్దలు. అనుభవం ఉన్నవారు. మిమ్మల్ని గౌరవించడం మా ధర్మం.” గౌడగారు నవ్వి అన్నారు. “ఎమ్మెల్యే టిక్కెట్టుగానీ మంత్రిపదవిగానీ ఎగ్గొట్టేముందు పార్టీ అధ్యక్షులు ఇదే అంటారు.”

“అవి మాకు తెలవ్వు. మాకీ రేవు మాత్రమే తెలుసు. మీ వంటివారు అనేక రేవుల్లో పనిచేసి వచ్చేరు. మా బాధలు మీరు చూస్తూనే ఉన్నారు గదా! లోకంలో ఎలాగూ మనకి గౌరవం లేదు. ప్రతీ వెధవనీ గాడిద కొడుకని తిడతన్నారు. పోనీ అనుకుందాం, మన యజమానులకేం పోయేకాలం ? పన్జేయించుకుంటా తిట్లూ, తిమ్ములూ, తన్నులూ. ప్రతిరోజూ మన జాతి మనోభావాలు దెబ్బతింటున్నాయి. మీరే ఏదయినా ఆలోచన చెయ్యాలండి మరి. మీ ఇద్దరి మొకాల్లో ఉతికిన బట్టల తేజస్సు కనిపిస్తాఉంది.”

గారాగారన్నారు. ”మేం కాదనం. నిజమే ననుకోండి మీరన్న మాట గూడా నిజవే. యజమానుల పద్ధతి మాకూ ఏవీ బాగుంటం లేదు. చూస్తానే ఉన్నాం. జీరో అవర్లో లేవదీసే సావకాశం లేదిప్పుడు. సరే, బాధపడకండి. ఇక్కడ పెద్దలు గౌడుగారున్నారు. ఇద్దరూ ఆలోచించి అందరికీ ఆమోదకరమైన యొక్క పరిష్కారం కనుగొంటాం. శలవు. ఇప్పుడు గౌడుగార్ని రెండు ముక్కలు మాటాడమని కోరి ప్రార్ధిస్తున్నాను.” అంటూ గౌడగారి వేపు చూశాడు గారా. గౌడ గంభీరంగా కొంచెం తల ఊపి గొంతు సవరించుకుని అన్నాడు.

”ఈ సమస్య ఇవాళ కొత్తగా వచ్చింది గాదు. గతప్రభుత్వాలు యజమానులతో లాలూచీ అయి చేసిన అన్యాయం ఇది. అంతేగాదు. మిత్రులారా, ఇది మనందరి మనోభావాలకీ సంబంధించిన ప్రశ్న. మన రాష్ట్రంలో దేశంలోగానీ కూడూ గుడ్డా కంటే మనోభావాల కోసం మనం ఎంతటి త్యాగానికి అయినా వెనుదియ్యం.”

అందరూ స్వల్పంగా ఓండ్రించారు. మరి కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. సాయంత్రం వీపు మీద మూటలతో పక్కపక్కనే నడుస్తూ గా.రా. అన్నాడు.

”గౌడుగారూ, మనం సభ ఏర్పాటు చెయ్యడం మంచిది.”

”నేనూ అదే అనుకుంటున్నాను.”

గౌడుగారు రాత్రి ఆలోచించారు. గారా కూడా రాత్రి తీవ్రంగా ఆలోచించారు. చిత్రంగా ఇద్దరి ఆలోచనలూ ఒకేలా ఉన్నాయి. మర్నాడు మధ్యాహ్నం చెట్టుకింద కలిసినప్పుడు గౌడగారు అన్నారు.

”సార్‌, ఇవాళ నా మనోభావాలు కూడా కొంచెం దెబ్బతిన్నాయి. ఇందాక రేవు దగ్గిరికి వస్తున్నప్పుడు అనవసరంగా నా డొక్కలో రెండుసార్లు పొడిచి బూతులు కూడా తిట్టేడు మా యజమాని.”

”బాదపడకండయ. రాత్రి ఆలోచించేనండి. ముందు మీరేం ఆలోచించారో చెప్పండి.”

గౌడగారు కాసేపు డొక్కనొప్పి మర్చిపోయాడు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. గారా అంతా విని సంతోషంతో కొంచెం ఓండ్రించింది. మరికాసేపు ఇద్దరూ పథకాన్ని అమలు చెయ్యడానికి సంబంధించిన విధివిధానాలను గురించి ఆలోచించారు. ఒకటి ప్రాథమికంగా ఇద్దరూ నమ్మేరు. తమలాంటి ప్రజాస్వామ్య లౌకికవాదులకు మరోమార్గం లేదు. పదిహేను నిముషాల తరువాత అందరూ సమావేశం కావాలని నిర్ణయించారు. ఈలోగా జరిగిన చిన్న సంఘటన వల్ల ఇద్దరి మనోభావాలూ తీవ్రంగా గాయపడ్డాయి. సమావేశం గురించి కబురు పంపించడానికి సిద్ధం అవుతూండగా గారా యజమాని కొడుకూ, వాడి స్నేహితుడూ చెరో కర్రా చేతుల్లో తిప్పుకుంటూ వచ్చేరు. యజమాని కొడుకు గాడిదల మీద ఎక్కి రేసులు పెట్టుకుందావన్నాడు. రెండోవాడు గాడిద రేసులు తనకి తెలియవనీ పడితే ప్రమాదమనీ హెచ్చరించాడు. యజమాని కొడుకు రేసు బావుంటుందని ఎంత చెప్పినా రెండోవాడు వినలేదు. ఏం చెయ్యలేక ఇద్దరూ గోలీలు ఆడుకోడానికే నిర్ణయించుకుని వెళ్లిపోయారు. వాళ్లిద్దరి మాటలు వింటున్నంతసేపూ గారా గారికి గుండె గొంతులోకి వచ్చింది. గౌడగారు రేసు మధ్యలో చావడం ఖాయం అనుకున్నాడు. గారా అన్నాడు.

”వాడెంత ఎధవో చూశారా మీరు?”

”అది ప్రజాస్వామ్యవాదుల్ని అణగదొక్కడానికి మతతత్త్వ శక్తుల కుట్రలా ఉంది. ఇది ఇంతటితో ఆగదు. వాళ్లు రేపు రావచ్చు గదా !”

”ఈళ్లు మన మీద ఎక్కి స్వారీ చెయ్యడం ఖాయం.”

”ముందు సభ సంగతి చూడండి. మనకి అదే దారి.”

కొద్ది సేపయిన తరువాత గార్దభ మిత్రుల సమావేశం మొదలైంది. అందరూ ఇద్దరు నాయకులవైపూ ఆశగా చూస్తున్నారు. వాళ్లని కాసేపు చూడనిచ్చి గారా అన్నాడు. గౌడుగార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.” గౌడు గారు అందర్నీ  పరికించి చూస్తూ అన్నారు.

”మిత్రులారా, మన సమస్యలు పరిష్కరించుకోడానికి ముందు మనం చర్చించుకోడానికి అన్ని హంగులూ ఉన్న ఒక సభ ఏర్పాటు చేసుకోవడం ఎంతేనా అవసరం. చర్చ లేందే పరిష్కారం లేదు. మనం పరిష్కారం దిశగా పోవాలంటే చర్చ తప్పదు. దానికి ముందు సభ అవసరం. నేను చెప్పేది జాగర్తగా వినండి. మీలో సీనియరు ఒకరు స్పీకరుగా    ఉంటారు. వారిని అందరం గౌరవించాలి. అంటే గౌరవంగా మాట్లాడితే చాలు. వారిని ‘అధ్యక్షా’ అని మాత్రమే సంభోదించాలి.”

”ఎందుకండీ మామూలుగా మాటాడుకోవచ్చుగా” అన్నాడొక సభ్యుడు.

”అలా కుదరదు. అది రాజ్యాంగం. నీకు తెలీదు. సమస్యల్ని ఉత్తుత్తినే పరిష్కారం చెయ్యకూడదు. ఈ విషయంలో మేం ఎంతో అనుభవం గడించాం. సరే. నన్ను శాసనసభా నాయకుడంటారు. మీ తరపున మాట్లాడతాను. మన గౌరవనీయులు గారాగారు ప్రతిపక్షనాయకుడిగా ఉంటారు.”

”అంటే ఆరేం జేస్తారండి?”

”మామూలుగా అయితే ప్రమాదాలు జరిగినా, ఇళ్లు కాలిపోయినా, మంచినీళ్లు రాకపోయినా, పడవలు మునిగిపోయినా ముందుగా వెళ్లి అక్కడ ఎవరో ఒకరు చంటి పిల్లాణ్ని ఎత్తుకుని మీడియాతో మాట్లాడతారు. ఇక్కడ, వారికి ఎలా తోస్తే అలా ఉంటారు.”

”మీడియా ఏటండి?”

”మనం ఏం జెప్పినా ఆడిష్టం వచ్చినట్టు రాసేవాడన్నమాట” అన్నాడు గారా.

”మరాడు మనకి అవసరమంటారా?”

”పాములు, ఎలకలు, జెర్రిగొడ్లు, పులులు, సింహాలు, నక్కలు, మనకి అవసరమా? ఆడూ అంతే.” అన్నారు గౌడ.

”సరే. అయన్నీ పెద్ద విషయాలు. మేం జూసుకుంటాం. ఇప్పుడు మీరంతా నేను చెప్పినట్టు నుంచోవాలి. మీ స్పీకరెవరు?”

సభ్యులు కాసేపు చర్చించుకున్నారు. చివరికి ఒక పెద్ద సభ్యుడు అంగీకరిస్తూ ఓండ్రించాడు. వెంటనే గారా అన్నాడు.

”మీరు స్పీకరయితే పెద్దగా మాట్లాడకూడదు. అంత స్పష్టంగా మాటాడకూడదు. ఇంతకీ తమరేనా స్పీకరుగారు” అన్నాడు గారాగారు.

”ఇదిగో ఈ ఎదవేనండి. మాలో పెద్దోడు లెండి.”

”స్పీకరుగార్ని  ఎదవనకూడదు.”

”అంటే ఆడు మాకు బాగా ఎరిగున్నోడండి.”

గారాగారు చెప్పినట్టు అందరూ ఒక పద్ధతి ప్రకారం నుంచున్నారు. ముందు గారా చిరునవ్వుతో ఒచ్చి గౌడగారి దవడతో దవడను ఆనించి అన్నాడు.

”మీకు శభాకాంక్షలు. మేం ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా బాధ్యతలు నిర్వహిస్తాం. మీ అభివృద్ధి కార్యక్రమాలు మాకు నచ్చినంత వరకూ సహకరిస్తాం. నమస్తే.”

గౌడగారు గంభీరంగా తల ఊపేరు. సమావేశాలు మొదలయ్యాయి. ఉదయం పది గంటల్నుంచీ ఒంటి గంట వరకూ, మళ్లీ రెండు నుంచీ అయిదు వరకూ. నాలుగైదు రోజులు గడిచేయి. గౌడగారు,గారాగారూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఏదో తెలీని ఆనందం. ఎవరూ చూడనప్పుడు ఇద్దరూ కలిసి ఓండ్రిస్తున్నారు. వీరంత కాకపోయినా స్పీకరు కూడా కొంత ఆనందం పంచుకుంటోంది. దాని వల్ల దాణా కూడా కొంచెం ఎక్కువగా తీసుకోగలుగుతోంది. దానికి ఇందులో ఏదో రుచి ఉందని అర్థమైంది. ఆరోజు లంచి టైములో గౌడగారు అన్నారు.

”గారాగారూ, చాలా సంతోషంగా ఉంది. సభలు జయప్రదంగా మీ సహకారం వల్ల జరుగుతున్నాయి. ఈ శీతాకాలం సమావేశాలు ముగిసేలోగా వీరి సమస్యలు పరిష్కారం అవుతాయంటారా?”

”ముందు ఒక సభాసంఘాన్ని  నియమిద్దాం. సమస్యలంటారా? మనం తొందర పడకూడదు. ఏదో ఒక సమస్య ఉంటానే ఉంటది. సబలు జరగుతానే ఉండాల. సమస్యలు ఇవాళ కాకపోతే రేపు.”

గౌడగారు గంభీరంగా అంగీకార సూచకంగా తల ఊపేరు.

** *** **

కధ విన్న భిక్షువులు నిశ్శబ్దంగా లేచి శాస్తకి ప్రణామం చేసి బయటకి వెళ్లిపోయారు. కుటీరం లోంచి ఏదో పిట్ట కిచకిచలు వినిపించాయి

*

 

 

 

 

 

తల్లావజ్ఘల పతంజలి శాస్త్రి

3 comments

Leave a Reply to Lalitha TS Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • భలే చెణుకు విసిరారుగా, పతంజలి గారు!
    “మీడియా ఏటండి?”
    “మనం ఏం జెప్పినా ఆడిష్టం వచ్చినట్టు రాసేవాడన్నమాట,” అన్నాడు గారా.
    “మరాడు మనకి అవసరమంటారా?”
    “పాములు, ఎలకలు, జెర్రిగొడ్లు, పులులు, సింహాలు, నక్కలు, మనకి అవసరమా? ఆడూ అంతే.” అన్నారు గౌడ.

    రుషులు, గాడిదలు. భిక్షులు, శాపాలు, పాలితులు, ప్రభుత్వం!
    గౌడు అంటే గౌఁడుగేద గుర్తువచ్చింది.

  • డేవిడ్ షుల్‌మన్ గార్రాసిన SPRING, HEAT, RAINS – A South Indian Diary పుస్తకంలో నేను చదివిన ఫతంజలి గారు మీరే అని గుర్తుపట్టి చాలా సంతోషించాను.

    మీ కథలో గాడిద రాఘవరావుగారి మీడియా, స్పీకరు వగైరా నిర్వచనాలు మహత్తరంగా వున్నాయండి. భలే!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు