డోరిస్ లెస్సింగ్ (1919-2013) పరిచయం
సుప్రసిద్ధ బ్రిటన్ రచయిత్రి, నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత డోరిస్ లెస్సింగ్, 1919 అక్టోబరులో పెర్షియా(ఇరాన్) లోని కెర్మాన్ షాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ బ్రిటీష్ సంతతివాళ్లే. చాలాకాలం రొడేషియా (ప్రస్తుత జింబాబ్వే) లో నివసించి తొలుత నర్స్ మెయిడ్ గా, టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేశారు. అక్కడే ఆమె సాహిత్య సృజనకు స్వీకారం చుట్టారు. తన 15వ యేట మొట్టమొదటి కథ రాసిన ఆమె, దాదాపు 20వ శతాబ్ది ఆసాంతం రచన కొనసాగించి యూరప్ సమకాలీన సాహిత్యంపై చెరగని ముద్రవేశారు.
బహుగ్రంధ రచయిత్రిగా పేరొందిన లెస్సింగ్ కవిత్వం, చిన్నకథ, నవల, నాటకం, పాట, ఆటోబయాగ్రఫీ, నాన్ ఫిక్షన్, ఇట్లా సాహిత్యంలోని పలుజోనర్స్ లో విస్తృతంగా కృషి చేశారు. మోడర్నిజం, పోస్ట్ మోడర్నిజం, సూఫీయిజం, సోషలిజం, ఫెమినిజం వంటి ఉద్యమాల్లో ఆమె సాహితీ సృజన సాగింది. తమ జీవితకాలంలో దాదాపు 90 వరకూ రాసిన వివిధ గ్రంథాల్లో యాభైకి పైగా నవలలున్నాయి.
2007లో ఆమెకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన పదకొండవ రచయిత్రిగా, అదికూడా 88 యేళ్ల వయసులో నోబెల్ అందుకున్న అతిపెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించారు.
డోరిస్ లెస్సింగ్ రాసిన ప్రతి నవలా ఒక సంచలనమే.1950లో వొచ్చిన మొట్టమొదటి నవల “ది గ్రాస్ ఈజ్ సింగింగ్” యూరప్ అంతటా ఆమె పేరు మార్మోగిపోయేలా చేసింది. రచయిత్రిగా తొలిరోజుల్లో కమ్యూనిస్ట్ భావజాలంతో రాసిన “చిల్డ్రన్ ఆఫ్ వయొలెన్స్” గొలుసు నవలతో ఆమెకు అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా “ది గ్రాస్ ఈజ్ సింగింగ్,” “ది గోల్డెన్ నోట్‌బుక్,” “ది గుడ్ టెర్రరిస్ట్,” “కానోపస్ ఇన్ ఆర్గోస్” నవలలు ఆమెను ప్రపంచ లెజెండ్స్ సరసన నిలిపాయి. 1962లో ప్రచురించిన “ది గోల్డెన్ నోట్‌బుక్” ను ఒక ఫెమినిస్ట్ క్లాసిక్ గా ప్రపంచం కీర్తించింది. “కానోపస్ ఇన్ ఆర్గోస్” నవల సైన్స్ ఫిక్షన్లో సంచలనం సృష్టించింది.
ఈ నవలల ప్రాచుర్యంతో లెస్సింగ్ పెద్దసంఖ్యలో అవార్డులు గెలుచుకున్నారు. నోబెల్ బహుమతి సహా పదుల సంఖ్యలో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. వాటిల్లో ముఖ్యమైనవి సోమర్సెట్ మామ్ అవార్డు, ఆస్ట్రియన్ అవార్డు, డబ్ల్యూ స్మిత్ లిటరరీ అవార్డు, ప్రీమియో గ్రీన్జానే కేవోర్ పురస్కారం, జేమ్స్ టెయిట్ స్మారక బహుమతి, ప్రీమియో ప్రిన్సిపి డీఆస్ట్రస్ అవార్డు, చివర్లో నోబెల్ బహుమతి. యూరప్ ఖండంలో తనకురాని పురస్కారం లేదని ఆమె నోబెల్ పురస్కార ప్రదాన
సభలో ప్రసంగిస్తూ స్వయంగా చెప్పుకున్నది. ది టైమ్స్ రూపొందించిన 20వ శతాబ్ది బ్రిటన్ 50 మంది మహా రచయితల జాబితాలో లెస్సింగ్ ఐదో స్థానంలో నిలిచారు. ఆమె తన తొంబై నాలుగవ యేట 1913లో మరణించారు.
డోరిస్ లెస్సింగ్ ప్రసిద్ధ కథాసంపుటి “లండన్ ఆబ్జర్వ్ డ్”లోని “ది ఊంబ్ వార్డ్” కథకు ఇది తెలుగు అనువాదం.
విశాలమైన హాలు లాంటి ఒక గదిలో రెండువైపులా నాలుగేసి చొప్పున ఎనిమిది పడకలు. గది చివర్లో ఎదురెదురుగా ఒకదానికొకటి అనుకొని మరోరెండు మంచాలు వేసిఉన్నాయి. ఉత్తర లండన్‌లోని అతి ప్రాచీన విక్టోరియన్ ఆసుపత్రిలోని ఒక దృశ్యమిది. విశాలమైన గదిని తాత్కాలికంగా గైనిక్ వార్డుగా మార్చి ఉపయోగిస్తున్నారు. అయితే ఆ గదినింకా అన్ని సౌకర్యాలతో పూర్తిస్థాయి వార్డుగా రూపొందించలేదు. గదిలో కిటికీలకు గులాబీ పువ్వుల డిజైన్లున్న కర్టెన్లు వేలాడుతున్నాయి. పేషంట్ల నడుమ గోప్యత కోసం అవసరమైనప్పుడు బెడ్లను వేరుచేసేందుకు రన్నర్ స్క్రీన్లను అడ్డంగా జరుపుతూ పని కానిచ్చేస్తున్నారు. తాత్కాలిక వార్డుగా మార్చినప్పటికీ ఆగది రోగులకు సౌకర్యంగానే కనిపిస్తున్నది.
సాయంత్రం సందర్శకుల కోసం కేటాయించిన సమయమైంది.
పేషంట్లను చూసేందుకు ఆదినం చాలమందే వచ్చారు. రోగుల పక్కనే ఉన్న కుర్చీల మీదా, బెడ్ల మీదా కూర్చున్నారు. నాన్నలు, అమ్మలు, తోడబుట్టినవాళ్లు, బంధుమిత్రులు, పిల్లలు… ఇట్లా చాలామంది నిర్దేశిత టైముకన్నా ముందే మధ్యాహ్నం రెండు గంటల నుండే వస్తూపోతున్నారు. కానీ వాళ్లలో రోగుల భర్తలెవరూ లేరు. వాళ్ళు మరికొద్దిసేపటి తర్వాత వస్తారు. అంతా ఎక్కడెక్కడో ఉద్యోగాల మీదా, పనుల మీదా పోయివుంటారు.
వార్డు మొత్తంమీద ఒక మంచం దగ్గర మాత్రం ఒక స్త్రీ భర్త, ఆమె తలవైపున కుర్చీలో కూర్చుని వున్నాడు. ఆ పేషంట్ పేరు మిల్డ్రెడ్ గ్రాంట్. దాదాపు నలభై ఐదేళ్ళుంటాయి. బలహీనంగా కనిపిస్తున్నా మనిషి చాలా అందంగా ఉంది. భర్తకు సమీపంగా కూర్చొని అతని ముఖంలోకి తదేకంగా ఆరాధనతో చూస్తుంది. అతడామె రెండు చేతుల్ని తన చేతులతో మృదువుగా బిగించి పట్టుకున్నాడు. అతడు మంచి పర్సనాలిటీతో భారీగా ఉన్నాడు. చేతులు దృఢంగా, అరచేతులు విశాలంగా ఉన్నాయి. ఖరీదైన బట్టలు ధరించి హుందాగా ఉన్నాడు. ట్విడీ బూడిదరంగు జాకెట్, తెల్లటి చొక్కా అతని ఒంటిమీద మెరిసిపోతూ ఏదో ప్రకటనలో నటుడి మాదిరి కనిపిస్తున్నాడు.
అతడు తను కట్టుకున్న టై విప్పి కుర్చీ వెనుక వేలాడేశాడు. ఇదతన్ని అనధికారిక రూపంలోకి మార్చేసింది. ఇప్పుడు సాదాసీదాగా కనిపిస్తున్నాడు. భార్యపట్ల అతడు పడుతున్న ఆందోళన ముఖంలో వ్యక్తమవుతున్నది. భర్తనూ, అతను పడుతున్న బాధనూ కళ్ళనిండా నింపుకుంటున్నట్టుగా ఉన్నాయామె చూపులు. అంతమందిలోనూ వాళ్ళు పరిసరాలు మరిచి ఏకాంతమై పోయారు. అది జనరల్ ఆస్పత్రి అనికాకుండా తమ ఇంట్లోని ఓ గదిలో ఏకాంతంగా ఉన్నట్టున్నారు. వార్డులోకి ఎవరొస్తున్నారో ఎవరు పోతున్నారో వాళ్ళకు అసలు గుర్తులేదు.
అతడారోజు ఉదయమే భార్యను ఆస్పత్రిలో చేర్పించాడు. అప్పటినుంచి ఎక్కడికీ వెళ్ళకుండా ఆమెదగ్గరే కూర్చుని వున్నాడు.
అది మహిళల గర్భకోశ వ్యాధుల ప్రత్యేక వార్డు. నేమ్ బోర్డు మీద గైనిక్ వార్డ్ అని కనిపిస్తున్నప్పటికీ అక్కడందరూ వాడుకలో ‘గర్భిణీల వార్డు’ అని చెప్పుకుంటారు.
మిసెస్ గ్రాంట్ కాకుండా వార్డులో మరో తొమ్మిదిమంది పేషంట్లు ఉన్నారు. చిత్రమేమంటే ఆసమయంలో వార్డు మొత్తానికి ప్రసవం కోసం వొచ్చిన స్త్రీలెవరూ లేరు. గర్భాశయ సంబంధ ఏవేవో సమస్యలతో చెరినవాళ్ళే అందరూ. వాళ్లలో కొందరికి వివిధ ఆపరేషన్లు, మరికొందరికి ఇతరత్రా వైద్యచికిత్సలు జరగాల్సి ఉంది. పరిశీలించి చూస్తే వాస్తవానికి ఆక్కడెవరూ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నట్టు కనిపించడం లేదు. అంతేకాదు, మరే వార్డులోనూ లేనివిధంగా ఒకింత సరదాగానూ కనిపిస్తున్నారు. కానీ లోపల్లోపల ఎవరి భయాలు, ఆందోళనలు వారికి ఉండే వుంటాయి.
వార్డు లోపలికీ, బయటకూ హడావిడిగా తిరిగే నర్సులు రోదించేవాళ్లపైనా, అలాగే చాలాసేపు నిశ్శబ్దంగా వుండి బాధపడే వాళ్లపైనా ప్రత్యేకంగా ఓ కన్నేసి వుంచుతున్నారు. రాత్రి ఏడవుతుండగా వార్డులోకి భోజనాలొచ్చాయి. సందర్శకులు చాలావరకు అప్పటికే ఇళ్లకు వెళ్లిపోయారు. అక్కడ రోగులెవరికీ ఆకలి ఉన్నట్టు కనిపించడం లేదు. తిండి కోసం ఎవరూ ఆరాటపడుతున్నట్టు లేరు.
కానీ గ్రాంట్ భర్త మాత్రం భార్యను తినమని ఎంతగానో బ్రతిమాలుతున్నాడు. ఆమె తినలేనంటూ నిరాకరిస్తుంది. భార్య మొండితనం పట్ల అతడు కాస్త చిరాకుపడ్డాడు. మందలించబోతూ ఆమె జాలిగోలిపే ముఖాన్ని చూసి తగ్గాడు. ప్రేమగా, ఒక తండ్రిలాగా సముదాయించాడు. గ్రాంట్ తనచేతిలో ప్లేటు పట్టుకొని అట్లాగే కూర్చున్నది. అతడే చెంచాతో మెల్లగా తినిపించసాగాడు. ఆమె కళ్ళవెంట నీళ్ళు అదేపనిగా కారిపోతున్నయి. అతడు మధ్యమధ్య చెంచా ప్లేటులో ఉంచి జేబురుమాలుతో భార్య కళ్ళు తుడుస్తున్నాడు.
ఆమె చిన్నపిల్లలా వెక్కిళ్లు పెడుతూ ఏడుస్తుంది. బలహీనమైన ఆమె ఛాతి ఎగిరి పడుతుంది. కన్నీళ్లతో తడిసిన తన విశాల నీలినేత్రాలతో ఆతన్నే తదేకంగా, తనివితీరా చూస్తుంది. నీలినేత్రాలు ఎప్పుడైనా సంతోషానికి నిర్వచనంగా వుండాలి. వర్షించే మేఘాలు కాకూడదు. దుఃఖం ఆమెకు ఎంతమాత్రం నప్పలేదన్నట్టు వార్డులోని ఇతర పేషంట్లు ఆమెదిక్కే చూస్తూ మధ్యమధ్య ముఖాలు తిప్పుకొని చిన్నగా గుసగుసలాడుతున్నారు.
తమ ఆఫీసులూ, ఇతరత్రా పనులు ముగించుకుని ఆస్పత్రికి వొచ్చిన ఇతర పేషంట్ల భర్తలు ఒక్కొక్కరు వార్డులోకి చేరుతున్నారు. కొద్దిసేపు ఆ వార్డులో కొన్ని జంటలు సన్నిహితంగా కూర్చొని ఇల్లూ, తమ పిల్లలూ, తదితర విషయాల గురించి చిన్నగా చర్చించుకున్నారు.
ఒక బెడ్ మీద పేషంట్ ఒకామె సీరియస్ గా చేతిలో మేగజైన్ పేజీలు తిప్పుతూ మధ్యమధ్య తలెత్తి పుస్తకం మీంచి ఓరగా అందరినీ చూస్తున్నది. ఇంకో మంచంలో నడివయసు దాటిన మిస్ కుక్, చేతిలో ఏదో అల్లికపని చేసుకుంటూ వార్డు నలువైపులా కలియచూస్తుంది. ఆ పక్కనే తనను చూసేందుకు ఎవరూ రాక ఒంటరిగా వున్న యువతి ఏదో నవల చదువుతూ వాక్ మన్ వింటున్నది. ఆమె ధోరణి చూస్తే మనిషి ఉన్నత కుటుంబానికి చెందినదానిలా (అవునో కాదో తెలియదు) కనిపిస్తున్నది. ఇంకా ఇతర రోగులు వొచ్చిన సందర్శకులతో ముచ్చట్లాతున్నారు. ఇక కొత్తగా ఆ ఉదయమే వార్డులో చేరిన మిల్డ్రెడ్ గ్రాంట్ మాత్రం భర్తకు అతుక్కుపోయి కూర్చొని బేలగా కన్నీళ్లు పెట్టుకుంటుంది.
కాస్సేపటికి సందర్శకుల సమయం ముగిసింది. నర్సు పదేపదే గుర్తుచేయడంతో వచ్చినోళ్లు ఒక్కొక్కరే వెళ్ళడానికి
సిద్ధమయ్యారు. ప్రేమగా ముద్దులు, ఆలింగనాలు, చేతులూపుతూ వీడ్కోళ్లు.
“రేపు మళ్ళీ వస్తానుగా” అనే వాగ్దానాలు.
ఆగకుండా అదేపనిగా ఏడుస్తున్న మిల్డ్రెడ్ గ్రాంట్ కుర్చీలోంచి లేవబోయిన భర్తను మరింత గట్టిగా కావలించుకొని భోరుమంది.“టామ్! వొద్దు… దయచేసి మీరు వెళ్లిపోవొద్దు” ఏడుస్తూనే బ్రతిమాలింది.
టామ్ బలవంతంగా ఆమెను తననుంచి విడదీసి సరిగా కూర్చోబెట్టాడు. ప్రేమగా భార్య వెన్ను నిమురుతూ ఆమె భుజాలచుట్టూ చేయి వేశాడు. చక్కగా దువ్వుకున్న ఆమె మృదువైన బూడిదరంగు జుట్టు ఫ్యానుగాలికి చిందరవందరవుతూ అస్తవ్యస్తంగా ఎగురుతున్నది.
“ప్లీజ్ టామ్, మీరిక్కడే వుండండి. వెళ్లిపోవద్దు” వేడుకుంది.
“లేదు డియర్, ఒక ముఖ్యమైన పని ఉంది. నేను తప్పక వెళ్ళాలి. మళ్ళీ పొద్దునే వొస్తానుగా. నువు ముందు ఏడుపు ఆపెయ్యి గ్రాంట్. అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. నిబ్బరంగా వుండు. నీకేమీ కాదు. ప్లీజ్… నామాట విని ఏడవకు” అతడు అనునయిస్తూ మళ్ళీమళ్ళీ చెప్పాడు.
కానీ ఎంత చెప్పినా ఆమె ఏడుపు ఆపలేదు. జాలిగా, విషాదంగా భర్త ముఖంలోకి చూసింది. తర్వాత అతని భుజానికి తలానించి ఇంకింత గట్టిగా ఏడవసాగింది.
“అబ్బా… గ్రాంట్, దయచేసి ఎడవకు. నేను చెపుతున్నాగా, నీకేమీ కాదు. మనం భయపడినట్టు నీది ప్రమాదకరమైన జబ్బుకాదని డాక్టరు చెప్పాడు. అది నువ్వూ విన్నావుగా. పరిస్థితి ఎంత సీరియసైనా ఫరావాలేదు నిజం చెప్పమని కూడా నేను డాక్టర్ని అడిగాను. దానికాయన మరేం ప్రమాదం లేదన్నాడు. వారంరోజుల్లో నువు ఆరోగ్యంగా ఇంటికొస్తావు” టామ్ గొంతు తగ్గించి మంద్రస్థాయిలో భార్యకు భరోసా ఇచ్చాడు. తను మాట్లాడుతున్నంత సేపూ భార్య వీపు మీద లాలనగా తడుతున్నాడు. కంగారుపడొద్దనీ, మరేం భయంలేదని బుజ్జగించాడు.
కాస్సేపటికి ఆమె ఏడుపు కొంచెం నెమ్మదించింది. కానీ తీవ్రంగా వచ్చే వెక్కిళ్లు ఆగటం లేదు. తను భయపడేది తన జబ్బు గురించీ, వైద్యం గురించీ కాదని భర్తకు చెప్పాలనుకొని మాటిమాటికి తల అడ్డంగా ఊపుతుంది. నిజానికి ఆమె అంతలా ఎందుకేడుస్తుందో అతనికి తెలీయంది కాదు. కానీ తన భావోద్వేగాలు బయటపడకుండా అతడు జాగ్రత్త పడుతున్నాడు.
ఆమె వెక్కిళ్ళ రోదన మరింక వినలేక ఓ నర్సు విసురుగా అక్కడికొచ్చింది. చాలాసేపటి నుంచి ఆమె వీళ్లిద్దరినీ గమనిస్తున్నది. భర్తను వెళ్ళకుండా ఆమె అడ్డుకోవడం, అతడేమో ఎంతసేపైనా ఓపిగ్గా భార్యను సమాధానపరుస్తూ ఓదార్చడం చూసింది. నర్సు అక్కడికి రానైతే వొచ్చిందిగానీ ఏంచేయాలో చప్పున తోచలేదు. నర్స్ వైపు చూశాడు టామ్. అతని చూపు నిస్సహాయతే కాకుండా ఒకింత నిగూఢంగా ఉన్నది.
“మేడమ్! ఇక నేను చేయగలింది ఏమీ లేదు. మీదే బాధ్యత” అన్నాడు నర్సు నుద్దేశించి.
తర్వాత భార్యవేపు తిరిగి “గ్రాంట్, నేనిక వెళతాను” అని చెప్పాడు.
అట్లాచెప్పి ఆమె నుంచి విడివడ్డాడు. కానీ ఆ మరుక్షణమే గ్రాంట్ అతని మెడచుట్టూ చేతులు గట్టిగా పెనవేసి వదల్లేదు.
బలవంతంగానే చేతులు విడిపించుకొని, దిండు ఆసరా చేసి ఆమెను పడుకోబెట్టాడు. తర్వాత లేచి నిలబడుతూ
నర్సు వైపు సాదరంగా చూశాడు. “మీరైనా చెప్పండి మేడం. నా భార్య అనవసరంగా భయపడుతుంది. అందుకు కారణం కూడా వుందనుకోండి. మా పెళ్ళయిన ఇన్నేళ్లలో ఆమె నన్ను విడిచి ఎప్పుడూ ఉండలేదు. ఒక్కరాత్రి కాదు, ఇరవై ఐదు సంవత్సరాలుగా” చెప్పాడు నవ్వుతూ.
అతని మాటలకు నర్సులో ఏ స్పందనా కనిపించలేదు కానీ, గ్రాంట్ మాత్రం తలడ్డంగా ఊపుతూ లేచి కూర్చునేందుకు ప్రయత్నించింది. కన్నీళ్ళతో ఆమె గులాబీ రంగు జాకెట్టు తడిసిపోయింది. అతడు భార్యను లేవకుండా అడ్డుకున్నాడు. తిరిగి సరిగా పడుకోబెట్టాడు. ఆమెకు అందకుండా జరుగుతూ నిటారుగా నిలబడ్డాడు. ఇదిచూసి ఆమె చిన్నబుచ్చుకున్నట్టు గోడవైపు తల తిప్పుకున్నది.
“నేను వెళుతున్నాను గ్రాంట్” చెప్పి టామ్ ముందుకు నడిచాడు. వెళుతూ ఆమెను చూసుకోమని నర్సువైపు తలూపి సైగ చేశాడు.
“మీకేం ఫరవాలేదు మిసెస్ గ్రాంట్” నర్సు ఎంతో క్రమశిక్షణగా చిరునవ్వు నవ్వుతూ మంచం దగ్గరకొచ్చింది. ఆమెది చాలా చిన్నవయసు. ఇరవై వుంటాయేమో. పొద్దుటి నుంచీ డ్యూటీ చేయడంవల్ల కావొచ్చు బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నది. టామ్ వెళ్లిపోయేవరకూ ఏమీ అనలేక మౌనంగా ఉన్న పక్కన మంచం మీది ఒక పెద్దావిడ, వార్డులో అందరి తరఫునా ఫిర్యాదు చేస్తున్నట్టు “ఇదిగో అమ్మాయ్! నువ్వు నీ ఏడుపుతో ఇక్కడున్న ఇతర రోగుల్ని ఇబ్బంది పెడుతున్నావు. చప్పుడు చేయకుండా పడుకుంటే మంచిది” గట్టిగా అంది.
నర్సు కూడా ఆమెను సముదాయించే ప్రయత్నం చేసింది. కానీ ఎవరి మాటలూ మిల్డ్రెడ్ గ్రాంట్ మీద పనిచేయలేదు. ఆమె ఆగకుండా అట్లాగే ఏడుస్తుంది. ఇదంతా తాము ఊహించిందే అన్నట్టు ఇతర పేషంట్లు పెద్దావిడ వేపు ఎగతాళిగా చూశారు.
కొన్ని క్షణాల తర్వాత గ్రాంట్ కొద్దిగా శాంతించినట్టు గొంతు తగ్గించి ఏడవసాగింది.
“మేడం, మీకు మంచి టీ ఏమైనా కావాలా?” నర్సు మర్యాదగా అడిగింది. ఆమె దీనికి సమాధానం చెప్పకుండా గట్టిగా ఊపిరి తీస్తూ, మధ్యమధ్య ముక్కు ఎగబీలుస్తున్నది. నర్సు వార్డులో అందరిదిక్కూ ఓమారు చూసింది. తర్వాత మరింకేమీ అనలేక బయటికి వెళ్లిపోయింది.
రాత్రి తొమ్మిది గంటలవుతున్నది. సాధారణంగా మరికొద్దిసేపట్లో వార్డులో అందరూ నిద్రపోతారు. ఈలోపు పేషంట్లకు నిద్రకు ముందిచ్చే పాలపానీయాలతో ట్రాలీని నెట్టుకుంటూ ఒక వ్యక్తి లోపలికొచ్చాడు. బెడ్ల మీద రోగులు రకరకాల పనుల్లో ఉన్నారు. ఒకరిద్దరు మంచాల మధ్యలో కూర్చొని చేతులతోనే జుట్టు దువ్వుకుంటున్నారు. ఇంకొకరు జుట్టుకు రబ్బరు బాండు చూడుతున్నారు. కొందరేమో ఒక పద్ధతి ప్రకారం ముఖాలకూ, మెడలకూ క్రీములు రుద్దుకుంటున్నారు.
వార్డులో పరిస్థితి మందకొడిగా మారి, గడుస్తున్న సమయాన్ని గుర్తించలేని విధంగా వున్నది.
పగటి షిఫ్టులో పనిచేసిన సిబ్బంది ఇళ్లకు వెళ్ళిపోయి కొత్తవాళ్ళు డ్యూటీకి ఎక్కారు. వార్డులో ఉన్న రోగులందరిలోకి పెద్దావిడ గొంతు సవరించుకొని చెప్పసాగింది. అక్కడ పనిచేసే నర్సులు ఆమెను గ్రన్నీ అని పిలుస్తారు.
“చూడండి… నా మొగుడు పాతికేళ్ళక్రితం పోయాడు. అప్పట్నుంచి, అంటే ఇరవయేళ్లుగా నాకు నేను ఒంటరిగా
బతుకుతున్నా. ఆయన ఉన్నప్పుడు మేమెంతో సంతోషంగా ఉన్నాం. కానీ చనిపోయాక ఒక్కదాన్నీ… ఒంటరిదాన్నీ
అయిపోయాను. అప్పటి నుంచి ఎవరూ లేకుండా బతుకుతున్నాను.”
ఆమె చెప్పేది వింటున్న మిల్డ్రెడ్ గ్రాంట్ హఠాత్తుగా ఏడుపు ఆపేసింది. మిగతావాళ్ళు ఆశ్చర్యపోయి పెద్దావిడ వైపు మెచ్చుకోలుగా చేతులూపి సైగలు చేశారు. అయితే ఊహించని విధంగా ఈసారి గ్రాంట్ నుంచి కాకుండా మరో వైపు నుంచి ఏడుపు వినిపించింది. గది ఎడమ మూలన మంచం మీద పడుకొనివున్న స్త్రీ ఉన్నట్టుండి పెద్దగా రోదిస్తున్నది.
ఆమె కూడా ఒంటరి మహిలే. కానీ ఆమె వితంతువు కాదు. చాలాకాలం క్రితమే భర్త వొదిలేశాడు.
గ్రన్నీ ఆమెను చూస్తూ పెద్దగా నిట్టూర్చి భుజాలు ఎగరేసింది. తర్వాత అందరినీ ఉద్దేశించి “కొంతమంది ఆడాళ్ళకి వాళ్ళ అదృష్టం గురించి తెలియదు” అంది విసుగ్గా.
“అవును, నిజమే. అదృష్టవంతులకు ఆ గ్రహింపు ఉండదు” ఎదుటి మంచం మీదున్న మిస్ కుక్ సమర్థించింది.
“నా సంగతే చూడరాదూ. నేనందరికన్నా దురదృష్టవంతురాలిని. నాది జాలిగోలిపే దయనీయ స్థితి. ఇంతవరకు నాకు పెళ్ళే కాలేదు. భర్త ప్రేమ, అనురాగం, తోడు, స్నేహం ఈ అదృష్టాలేవీ తెలియవు. నా మనసుకు నచ్చి నాకు దగ్గరైనవాడు ప్రతిసారీ అందినట్టే అంది దూరమైపోయాడు. చివరికి తోడెవరూ లేక ఇట్లా ఒంటరిగా గుండ్రాయిలా మిగిలాను” తనను తాను ఎగతాళి చేసుకుంటూ, అది తనకు మామూలన్నట్టు చెప్పి పగలబడి నవ్వింది. తర్వాత తలతిప్పి చూసింది ఎవరు ఏవిధంగా రియాక్టయ్యారో అన్నట్టు.
బాధను నవ్వుగా మార్చుకొని బతుకుతున్న కుక్ మాటల్లోని విషాదాన్ని ఎవరెంత గ్రహించారో తెలియదుగానీ, ఇతర స్త్రీలు మిస్ కుక్ నవ్వుతో శృతి కలిపారు. కొద్దిసేపు వార్డులో ఆహ్లాదం కురిసి, వాతావరణం కొంత తేలికైంది.
మిస్ కుక్ మంచి మాటకారి. హాస్య చతురత కలిగిన వ్యక్తి. బహుషా తనమీద తాను అట్లా జోకులేసుకోవడం ఆమెకు ఎంతోకాలంగా అలవాటైనట్టుంది. భారీ మనిషి. చక్కటి దేహఛాయ. వయసు డెబ్భైవరకూ వుండొచ్చు. అయినా ఆమెలోని చురుకుతనం వల్ల చిన్నదానిలా కనిపిస్తుంది.
వార్డులో పేషంట్స్ అందరూ నిద్రకు ఉపక్రమించారు. నైట్‌డ్యూటీలో వున్న నర్సు మళ్ళీ వొచ్చింది. అన్ని మంచాల వద్దకు తిరుగుతూ సమస్యలు కనుక్కుంటుంది. మిల్డ్రెడ్ గ్రాంట్ అందరినీ బాగా ఇబ్బంది పెడుతోందని డ్యూటీ దిగిపోతూ సహచర నర్సు చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. మిసెస్ గ్రాంట్ వైపు అనుమానంగా చూస్తూ పలుకరించేందుకు దగ్గరకొచ్చింది. మళ్లా ఏమనుకుందో “గుడ్ నైట్ లేడీస్, గుడ్ నైట్” అని రోగులందరినీ ఉద్దేశించి చెప్పింది. తన మాట రోగులు పట్టించుకున్నారో లేదో పరిశీలించుకుంటూ దీపాలు ఆర్పేసి బయటికి వెళ్ళింది.
లైట్లు లేకపొయినా వార్డులో పూర్తి చీకటిగా లేదు. హాస్పిటల్ ముందున్న కారు పార్కింగ్ ప్రదేశంలోని పసుపురంగు నియోన్ లైట్ల వెలుగులు ఇక్కడివరకూ ప్రసరిస్తున్నయి. గది గోడలమీద పల్చటి వెలుతురు, మసక చీకట్లు కలగలిసిన పొడవాటి నీడలు పరుచుకున్నయి. కిటికీలకు వేలాడుతున్న కర్టెన్లు తమ నారింజ రంగు ప్రకాశాన్ని కొంత కోల్పోయినట్టు కనిపించాయి.
మిల్డ్రెడ్ గ్రాంట్ హఠాత్తుగా మళ్ళీ ఏడువసాగింది. అదివిని మిగతా స్త్రీలు ఆందోళన చెందారు. గ్రాంట్ మంచం ద్వారానికి దగ్గరగా ఉంది. ఆమెకు పక్కన వరుసగా రెండు మంచాల మీద ఇద్దరు నడివయసు పేషంట్స్ మిసెస్ జోన్లీ, మిసెస్ రోస్ మోరీ ఉన్నారు. ఇద్దరూ ఆరోగ్యంగానూ, హుషారుగానూ కనిపిస్తున్నారు. అది ఆస్పత్రి అని కాకుండా తమ ఇంట్లో ఉన్నట్టు
వాళ్ళెప్పుడూ సందడి చేస్తుంటారు. ఎంతసేపూ ఫోన్లో తమ భర్తలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధుమిత్రులతో మాట్లాడుతూ హడావిడి సృష్టిస్తారు. వాళ్లకేవో పనులు పురమాయిస్తారు. ఎన్నో విషయాలు చర్చిస్తారు. వివిధ పనుల్లో సలహాలు, సూచనలు చేస్తుంటారు. ఇంట్లోకి కావాల్సిన సరుకులు, అట్లాగే తమకోసం ఇష్టమైన ఫుడ్స్ ఇక్కడినుంచే ఆర్డరు చేసేస్తుంటారు. అంతేకాదు, ఇతర డాక్టర్లను కలిసేందుకు ఇక్కడినుంచే అప్పాయింటుమెంట్లు బుక్ చేస్తుంటారు.
వీళ్ళను చూసేందుకు చాలామంది కట్టగట్టుకొని ఆస్పత్రికి కొచ్చేస్తారు. పండ్లు, రకరకాల చిరుతిండ్లు, పూలబొకేలు, గడబిడగా మాటలు, చేసే హడావిడి, చూసేవాళ్లకు ఆ మంచాల దగ్గరేదో ఫ్యామిలీ పార్టీ జరుగుతున్నట్టు ఉంటుంది.
చూస్తుంటే వాళ్ళేదో గర్భాశయ సంబంధ సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్టు కనిపించదు. వాళ్ళ దేహాలు తప్ప ఆత్మలు ఇక్కడలేనట్టు కనిపిస్తుంది. వాళ్ళది మనోధైర్యమో, మొండిధైర్యమో చూసేవాళ్లకు విచిత్రంగా తోస్తుంది. ఏదో విధిలేక, బలవంతంగా ఆస్పత్రిలో చేరినట్టు ఉంటుంది వాళ్ళ ప్రవర్తన.
అదేవరుసలో నాలుగో మంచం ఎప్పుడూ సెటైర్లూ… జోకులూ వేస్తుండే మిస్ కుక్ది. ఆమెకెదురుగా వృద్ధ వితంతు మహిళ. ఆమెకు పక్కన పొట్టిగా బొద్దుగా ఉన్న అందమైన యువతి. ఉన్నత కుటుంబం నుంచి వచ్చినట్టుంది. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు. కానీ ఎప్పుడైనా క్లుప్తంగా మాట్లాడినా స్పష్టంగా శాసించినట్టు వుండే స్వరం. ఎవరితో సంబంధం లేకుండా ఎప్పుడూ పుస్తకాలు, వాక్మన్తో తన ఏకాంతాన్ని ప్రత్యేకంగా సృష్టించుకుంటుంది.
వార్డులో ఇతర రోగులకు ఆమెందుకో అంతగా నచ్చినట్టు లేదు. ఆ యువతి వార్డులో లేనప్పుడు ఆమె గురించి చిన్నగా గుసగుసలాడుకుంటారు. నిజానికి ఆమె స్థాయికి బయటేదైనా పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో చేరొచ్చు. ఆ స్థోమత ఉన్నదనే అందరికీ అనిపిస్తుంది. అట్లాకాకుండా ఆమె ఇక్కడ నేషనల్ హెల్త్ సెంటర్లో అబార్షన్ కోసం రావడం వెనుక ఏదో మతలబు, స్వార్థం వుండేవుంటాయని వాళ్ళు చెవులు కొరుక్కుంటారు. హాస్పిటల్లోనూ ఆమె ధరించే ఖరీదైన దుస్తులు, నడవడి అట్లా అనిపిస్తాయి.
ఆమెకు పక్కన మరో మంచంలో కొత్తగా పెళ్ళయిన యువతి ఉన్నది. ఆమెకీ మధ్యనే గర్భస్రావమై ఏవో తీవ్రమైన సమస్యలేర్పడ్డయి. నిశ్శబ్దంగా నిస్త్రాణంగా పడుకుంది. ముఖం అమాయకంగా, లేతగా ఉంది. ఆ ముఖంలో అంతులేని విచారం గూడుకట్టుకొని ఉంది. కానీ, పైకి తొణక్కుండా ధైర్యంగానే కనిపిస్తుంది. ఆమెకు అవతల మిల్డ్రెడ్ గ్రాంట్‌కు ఎదుటి బెడ్ మీద మరో నడివయసు స్త్రీ. ఒకప్పుడామె మంచి నర్తకి. ప్రస్తుతం నృత్య కార్యక్రమాలు చేసే వయసు దాటిపోయింది గనుక ఆమె డ్యాన్స్ టీచరుగా ఉంటున్నది. రెండ్రోజుల క్రితం ఇంట్లో పనిచేసుకుంటూ మెట్లమీద నుంచి జారిపడింది. ఫలితంగా అంతర్గత గాయమైంది. ఆమె మానసిక ఆందోళనతో ఉన్నప్పటికీ నిబ్బరాన్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నది.“ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. అప్పుడే ప్రపంచం మీతోపాటు శృతికలిపి నవ్వుతుంది” అని సరదాగా అందరికీ చెపుతుంది.
“మీరు బలహీనులు కాకుండా వుంటే అదే గొప్ప జీవితం” అన్నది కూడా ఆమె లక్ష్యమైనట్టు వుంటుంది.
పేషంట్లు తమతమ పడకల మీద సర్దుకొని పడుకుంటున్నారు. బయట కారు పార్కింగ్ నుండి వచ్చే వెలుతురు వాళ్లమీద మసగ్గా ప్రసరిస్తున్నది. అట్లా అరగంట గడిచింది. లోపలినుంచి ఏడుస్తున్న శబ్దం ఇంకా ఆగకపోవడంతో నైట్‌డ్యూటీ నర్సు లోపలికొచ్చింది. మిల్డ్రెడ్ గ్రాంట్ ఏడుపు ఆపలేదు. నర్సు ఆమె బెడ్ దగ్గరకొచ్చి నిలబడింది.
“మిసెస్ గ్రాంట్, ఏమిటి మీరు చేస్తున్నది? మీరిట్లా రాత్రంతా ఏడుస్తూ వుంటే ఇతర పేషంట్లు కొద్దిసేపైనా నిద్రపోవద్దా? మీకు కూడా నిద్ర అవసరం. రేప్పొద్దున్నే మీకో టెస్టు ఉందన్న సంగతి మరిచారా? అనవసరంగా టెన్షన్ పడకండి. మీకొచ్చిన భయమేమీ లేదు. ప్రశాంతంగా నిద్రపొండి” నచ్చజెప్పుతూ అన్నది.
అయినాసరే, గ్రాంట్ రోదన ఆపలేదు. ఇంకా పెద్దగా రాగం తీసింది. కొద్దిసేపు ఓపిగ్గా చూసిన నర్సు“సరే, నేనింత చెప్పినా మీరు వినడంలేదు. ఇంక నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు” అంటూ వెనుదిరిగింది. వార్డులో అందరినీ చూస్తూ “ఇంకొద్ది నిమిషాల్లో మిసెస్ గ్రాంట్ ఏడుపు మానకుంటే బెల్లు కొట్టండి. ఆమెను వేరేచోటికి మార్చేస్తాం” చెప్పి వెళ్ళిపోయింది.
నర్సు కోపంతో అన్న మాటకి గ్రాంట్ స్వరం తగ్గించింది. కానీ ఏడుపు మాత్రం ఆపలేదు. వెక్కిళ్లు అణుచుకోవడం ఆమెకు సాధ్యపడటం లేదు. చిన్నపిల్లలా ఆమె వెక్కిళ్లు ఏడుపును మించి వినిపిస్తూ ఇతరుల్ని ఓ విధమైన కంపనకు గురిచేస్తున్నయి. అక్కడున్న ప్రతి స్త్రీ మనసు మూలన ఎంతో సున్నితమైన సహజ లక్షణాలు గల్గిన ఒక పసికందు దాగి ఉన్నది. కానీ ఆ పసిబిడ్డ తన సహజ హక్కులూ లక్షణాలనూ ఎప్పుడో కోల్పోయిందన్న వాస్తవాన్ని మిసెస్ గ్రాంట్ విషాద రోదన వాళ్ళకి బలవంతంగా స్ఫురణకు తెస్తున్నది. ఆ పసికందుని శాంతింపజేసే, సంతోషపెట్టే క్రమంలో తామెన్ని సంఘర్షణలు పడ్డారు, ఎన్ని విషాదాలు భరించారు, ఎన్నెన్ని కోల్పోయారో పలువురు గుర్తుచేసుకున్నారు.
గర్భస్రావమై చికిత్స పొందుతున్న అమ్మాయి తనలోతాను నిశ్శబ్దంగా కుములుతున్నది. ఏడుపు బయటికి వినిపించకున్నా చెంపల మీంచి జారుతున్న కన్నీళ్ళు మసకలో మెరుస్తున్నయి. అందరు ఆమెవైపు జాలిగా చూశారు. ఆపక్క బెడ్ మీద నర్తకి మహిళ మెలికలు తిరిగిన స్థితిలో పడుకొని ఉన్నది. చిన్నపిల్ల మాదిరి తన కుడిచేతి బొటనవేలు నోట్లో పెట్టుకుంది. వార్డులో జరిగేదంతా గమనిస్తున్న హైక్లాస్ యువతి, ఎవరి మాటలూ ఏడుపులూ వినిపించకుండా చెవులకు వాక్ మన్ ఇయర్ పీసెస్ తగిలించుకుని ఇష్టమైన సంగీతాన్ని మాత్రమే తన చెవులను చేరేలా జాగ్రత్త పడుతున్నది.
మొత్తమ్మీద వార్డులోని స్త్రీలందరూ పరస్పరం తెలుసుకున్నట్టూ, అర్థం చేసుకున్నట్టూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆంతరంగంలో తెలియని కంగారుగా ఉన్నారు. పైకి నిబ్బరంగా కనిపిస్తున్నారు. వారిలో ఏ ఒక్కరో… ఏక్షణంలోనో భళ్ళున బద్దలై ప్రస్తుతం రోదిస్తున్న వాళ్ళకంటే పెద్దగా శోకాలు పెడతామేమోనే ఆందోళన వాళ్లలో ఉన్నది.
చివరికి మిసెస్ రోజ్మేరీ స్టాంఫోర్డ్ తనవంతు ప్రయత్నంగా “ఏమిటండీ ఇది? ఎవ్వరేమీ పట్టనట్టున్నారు? ఎంతచెప్పినా ఆమె ఏడుపు ఆపడంలేదు. అందరికీ ఇబ్బందిగా ఉన్నది. ఆమె ఈవార్డులోనే వుంటే మనమిక నిద్రపోలేం. నర్సులు ఆమెను వేరేచోటుకు షిఫ్టు చేయాల్సిందే. నేనెళ్లి వాళ్ళతో మాట్లాడుతా” గట్టిగా బెదిరిస్తూ ఆమె కదిలేలోగానే మిస్ కుక్ తన బెడ్ మీంచి దిగుతూ “ఒక్క నిమిషం ఆగండి” అంది.
భారీమనిషి కావడం వల్ల ఆమె చురుకుగా కదల్లేదు. పైగా తీవ్రమైన కీళ్లనొప్పులు. అందుకే మంచం మీంచి దిగడానికి కొంత సమయం పట్టింది. బెడ్ కింద ఉంచిన బ్యాగులోంచి డ్రస్సింగ్ గౌన్ తీసి నెమ్మదిగా వేసుకున్నది. ఆగది బాగా చల్లగా ఉన్నది. ఆమె చలిని అసలు తట్టుకోలేదు. అట్లాగని వొళ్ళు వెచ్చబడేందుకు తోడ్పడే ఉలెన్ స్వెట్టర్లూ, కోట్లూ కొనుక్కోని ధరించే స్థోమత ఆమెకు లేదు. కింద స్లిప్పర్లు వెతికి కాళ్ళకు తొడుక్కున్నది.
మిస్ కుక్ నర్సుకు ఫిర్యాదుచేసేందుకు స్వయంగా పోతున్నదో, లేక టాయిలెట్ కు బయలుదేరిందో కొద్దిక్షణాలు అక్కడెవరికీ అర్థం కాలేదు. అంతా ఆమెనే చూస్తూ కాస్సేపు గ్రాంట్ ఏడుపు విషయం మరిచారు.
మిస్ కుక్ చిన్నగా నడుస్తూ గ్రాంట్ వద్దకు వెళ్ళింది. ఆమె బెడ్ పక్కన ఆరోజు పగలంతా గ్రాంట్ భర్త కూర్చుని వెళ్లిన కుర్చీలో తన స్థూలకాయాన్ని కూలేసింది. తర్వాత ఆప్యాయంగా మిల్డ్రెడ్ భుజంపై చెయ్యేసింది.
“చూడమ్మాయ్, నువ్వట్లా అదేపనిగా ఏడవకూడదు” ప్రేమగా అయినా మందలించే స్వరంతో అంది.
“అట్లా ఎంతసేపని ఎడుస్తావు? ఆరోగ్యానికి అదంత మంచిది కాదు. నీకో సంగతి చెపుతాను విను. వింటావు కదూ! ఇక్కడున్న మనమందరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నవాళ్ళమనే సంగతి నువు గ్రహించాలి. ఈ వార్డులో వాళ్ళంతా గర్భాశయ సంబంధమైన ఏదో సమస్యలతో బాధపడుతున్నవాళ్లే. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన జబ్బు. అందరూ కష్టాలు పడుతున్నోళ్ళే. తమ జబ్బులకు వైద్యం కోసమే ఇక్కడికొచ్చారు. అంతెందుకు, నన్నే తీసుకో. నాకు పిల్లలు లేరు. జీవితంలో గర్భధారణకే నోచుకోలేని గర్భాశయం నాది. అలాంటిది ఈ వయసులో పెద్దాపరేషన్ చేయించుకొని గర్భసంచిని తొలగించుకోవాల్సిన దుస్థితి కలిగింది.”
మిస్ కుక్ ఈ మాట ఏదో జోక్ లాగా చెబుతూ బిగ్గరగా నవ్వేసింది. ఆమె పాతకాలపు శ్రామిక మహిళ. సూటిదనం, మోటుదనం ఆమె సహజత్వాలు. నిజానికి తాను చెప్పింది కొంచెం మంచి భాషలో ఎట్లాచెప్పాలో ఆమెకు తెలియక కాదు. “గర్భసంచిని గురించి నేను మాట్లాడే పద్ధతి మోటుగా ఉండొచ్చు. దానిపట్ల నా దృష్టి విధానం కూడా సరైంది కాకపోవచ్చు. కానీ, ఈ గర్భసంచి జీవితంలో నాకోసం ఏంచేసిందని?” ఆగి ఒకసారి తలెత్తి అందరినీ చూసింది.
“లోపలెన్ని లోతులున్నా నేనెప్పుడూ నవ్వుతూ ఆనందంగా వుండేందుకే ప్రయత్నిస్తా. నవ్వడం అన్నిటికీ మంచిది” పెద్దగా మిసెస్ గ్రాంట్ వెక్కిళ్ళను మించి అందరికీ వినిపించేలా అన్నది.
“చూడు బేబీ, నువు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకంటే నీ జీవితంలో ప్రతిరాత్రీ నీకు గుడ్ నైట్ చెప్పే ఒక మనిషి నీకు తోడున్నాడు. అదెంతో గొప్ప విషయం. ఈ అదృష్టం ఎందరికి ఉంటుంది? చాలామంది స్త్రీలకు ఊహల్లో తప్ప నిజజీవితంలో అనుభవంలోకి రానిది. అటువంటి మంచి భర్త నీకున్నాడు. ఇంత గొప్ప వాస్తవాన్ని నువు గుర్తించలేదా?” అనునయిస్తూ రెండు క్షణాలు ఆగింది.
గ్రాంట్ ఏ ప్రతిస్పందన లేకుండా ఏడుస్తూనే ఉన్నది. కిటికీలోంచి ప్రసరించే మసక వెలుతుర్లో ఇతర స్త్రీలు ఈ సందర్భాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మిస్ కుక్ స్వరంలోని కారుణ్యం వాళ్ళని కట్టిపడేస్తున్నది. కుక్ కొంత అలసటగా, ఆందోళనగా కనిపిస్తున్నది. ఏదో నిగూఢ వేదన ఆమె ఆంతరంగాన్ని పరుచుకున్నట్టుగా ఉన్నది.
ఏడుస్తున్న మిసెస్ గ్రాంట్ భుజాల చుట్టూ చేయ్యేసింది.“మరిక ఏడవొద్దు అమ్మాయ్. ఏడుపువల్ల మనసూ, ఆరోగ్యమూ రెండూ పాడవుతయి” కుదుపుతూ చిన్నగా చెప్పింది.
హఠాత్తుగా మిస్ కుక్ వైపు తిరిగి ఆమె మెడచుట్టూ రెండుచేతులతో పెనవేసి భోరుమంది గ్రాంట్ . కొద్దిసేపు ఉధృతంగా రోదించి గుండె బరువు దించుకున్నది.“నా నిస్సహాయతను మన్నించండి. ఎంత ప్రయత్నించినా మామూలుగా ఉండలేకపోతున్నా. ఇప్పటివరకూ నేనేరోజూ ఒంటరిగా నిద్రపోలేదు. ఎల్లవేళలా నా టామ్ నాకు తోడుగా ఉన్నాడు.”
మిస్ కుక్ ఆమెను దగ్గరకు తీసుకుంది. తల నిమురుతూ చిన్నపిల్లలా లాలించింది. కుక్ కొద్దిసేపు అట్లాగే మౌనంగా
ఉండిపోయింది. ఆమె మనసులో ఏ జ్ఞాపకాలు కదిలాయో, ఏ విషాద పవనాలు వీచాయో తెలియదు కానీ ముఖం నిశ్చల గంభీరంగా ఉన్నది. అంతర్లీనంగా ఆమె తనతో తానే సంఘర్షణ పడుతున్నట్టు అనిపించింది. పెద్దగా నిట్టూర్చి ఒకింత కఠినంగా అన్నది. “ఇందాకే చెప్పాను, నువు చాలా అదృష్టవంతురాలివని. ప్రతిక్షణం కంటికి రెప్పలా నీ మొగుడు టామ్ నీవెంట ఉన్నాడు. మేమందరం… ఆమాటకొస్తే చాలామంది అట్లాంటి స్థితి మాకూ కలిగితే బాగుండని కోరుకుంటాం. నువు ఇందాకన్నావే ఒక్కరాత్రి కూడా నీ భర్తను విడిచి వుండలేదని. అదిగో, ఆమాటలే మేమూ చెప్పాలని అనుకుంటాం. కానీ సాధ్యం కాదుగదా. అందరికీ ఆ అదృష్టం ఉండదుకదా”
కుక్ స్వరం హఠాత్తుగా విషాదాన్ని నింపుకున్నది. అప్పటిదాకా ప్రదర్శించిన కాఠిన్యం పోయి మార్దవంగా చెప్పింది.
“నువ్వింత బేలవైతే ఎట్లా అమ్మాయి? నీ ఈ ఒంటరితనం ఒక్కరాత్రికేగా. రేప్పొద్దున మీ ఆయన నీ కళ్ల ముందుంటాడు. ఇది చాలామంది వుండే ఆస్పత్రి. ఇక్కడ కూడా మీఇంట్లో మాదిరి ఉండాలంటే కుదరదుగా. ఈమాత్రం దానికి ఇంతమందిలో ఏడవటం ఎంత అవమానం?”
మిస్ కుక్ కు సంతానంలేదని, అసలు పెళ్ళేకాలేదని, ఒంటరిగా జీవిస్తున్నదన్న విషయాన్ని ఇతర మహిళలు గుర్తుచేసుకున్నారు. కుక్ ఇప్పటివరకు తన పెంపుడు పిల్లిని తప్ప మరెవరినీ అంత ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని లాలించిన అనుభవం లేదు. అట్లా అక్కున చేర్చుకునేందుకూ, అనురాగాన్ని పంచేందుకూ ఆమెకీ లోకంలో అయినవాళ్ళెవరూ లేరు. ఇంతకాలానికి ఆమెకిప్పుడా అనుభవం ఎదురైంది. మొదటిసారి కుక్ చేతులు సాటిమనిషిని కావలించుకొని వున్నాయి. దశాబ్దాల ఆమె జ్ఞాపకాల దొంతరలో మరో మనిషిని దగ్గరకు తీసుకోవడం ఉద్వేగభరిత అనుభవంగా ఉన్నది. ఇదామెకు కొత్త అనుభూతి కలిగించింది. కొంచెంసేపు ఆమె అప్పటివరకు తనకే తెలియని ప్రేమమయమైన మరో లోకంలో విహరించినట్టయింది. ఆ లోకం చాలా వేరుగా ఉంది. అక్కడ మనుషులు ఆప్యాయతలు కురిపిస్తున్నారు. ప్రేమలు పంచుకుంటున్నారు. ఒకరికొకరు సన్నిహితమై ఆలింగనాలు చేసుకొని, ముద్దులు పెట్టుకుని, రాత్రుళ్ళు సన్నిహితంగా పడుకుని, మధుర అనుభవాలు పంచుకుంటున్నారు.
కలలాంటి ఆలోచనల వలయం నుంచి మిస్ కుక్ హఠాత్తుగా బయటపడింది. క్షణంపాటు మసకచీకట్లో ఏమీ కనిపించలేదు. ఒళ్ళంతా పదునైన ఆయుధాలు గుచ్చుకున్నట్టు అనుభూతి చెందింది. తర్వాత సర్దుకొని చెప్పసాగింది. ఇదివరటి మందలింపు ధోరణి లేదు. తనకు సంబంధంలేని ఆలోచనల నడుమ ఆమె కంఠంలో అవ్యక్తమైన ఆవేదన తొణికింది.“ చూడమ్మా… ఇంత చిన్న విషయానికి అంతలా ఏడుస్తారా ఎవరైనా? నీ ఆరోగ్యం ఏమవుతుంది? పెద్దదాన్ని చెపుతున్నా. నామాట విని మరో యోచన లేకుండా పడుకుని నిద్రపో. చిన్నపిల్లలా ఏడవొద్దు. అందరూ ఏమనుకుంటారు? నీకేం ఫర్వాలేదు, రేపుదయానికల్లా నీ టామ్ నీ ముందుంటాడు సరేనా?”
కొద్ది నిమిషాల తర్వాత మిసెస్ గ్రాంట్ వెక్కిళ్లు తగ్గిపోయాయి. ఆమె ఏడవడం పూర్తిగా ఆపేసింది. కొన్నిగంటలుగా రోదించి బాగా అలసిపోయిన ఆమెను పసిపిల్ల మాదిరి జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టింది కుక్. ఆమె మెడవరకూ దుప్పటి కప్పింది. అట్లాగే కొన్ని క్షణాలు నిలబడి నిద్రపోతున్న గ్రాంట్ కేసి తదేకంగా చూసింది. మిస్ కుక్ ముఖం ఏ భావాలు వ్యక్తం కాకుండా, రహస్యాలు దాచుకున్నట్టు లోతుగా ఉన్నది. దీర్ఘంగా నిట్టూర్చి మెల్లగా తన మంచం దగ్గరకు వెళ్ళింది. అంతకుముందు ధరించిన గౌను విప్పేసింది. చెప్పులు మంచం కిందికి నెట్టి నెమ్మదిగా బెడ్ మీద వాలింది.
ఇదంతా చూస్తున్న ఇతర మహిళలు ఆగదిలో చీకటంత నిశ్శబ్దంగా తమ ఆంతరంగాలతో సంభాషించుకున్నారు. వార్డులో తెలియని గంభీరత అలుముకున్నది. ఆ వాతావరణాన్ని తేలికపరిచేందుకు చొరవగా ఎవరైనా ఏదైనా మాట్లాడటం అవసరం. మిస్ కుక్ మళ్లా తానే పెదవి విప్పింది. “అందరూ చూశారుగా. మీరూ జీవించి నేర్చుకోండి” అని వ్యాఖ్యానించింది. అంతా మౌనంగా ఉండిపోయారు. ఎవరికివారే తమవైన లోకాల్లో తిరుగాడుతూ త్వరగా నిద్రపోయారు.
—————————-
*
Add comment