గతం మీద కొత్త వెలుగు!

తెలుగులో ఇటువంటి  సామాజిక అంశాలు మీద వచ్చిన నవలలు చాలానే వచ్చినా,  వి.చంద్రశేఖరరావు గారి రచనలు ముందు వరసలో ఉంటాయి.

మధ్య మా స్నేహితుడు సాహిత్య అవసరం గురించి చెప్తూ, ”ఈ సైన్స్ పుస్తకాలు ఒక పదేళ్ళ  తర్వాత చదివిన అలానే ఉంటాయి కానీ సాహిత్య పుస్తకాలు మాత్రం మన గతాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి” అని అన్నాడు.కాస్త ఆలోచిస్తే నిజమే కదా అని అనిపించింది. ప్రతి కథ లేదా నవల ద్వారా ఆ పాత్రలలో మనల్ని మనం చూసుకోవడమే కాకుండా అప్పటి సమాజంలో ఉండే ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, విలువలు లాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మనం చుట్టూ ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాల గురించి కూడా తెలుసుకొనే అవకాశం ఉంటుంది.

తెలుగులో ఇటువంటి  సామాజిక అంశాలు మీద వచ్చిన నవలలు చాలానే వచ్చినా,  వి.చంద్రశేఖరరావు గారి రచనలు ముందు వరసలో ఉంటాయి. చంద్రశేఖర రావు గారి కథల పుస్తకాలు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నా, ఈ మధ్య కాలంలో ఆయన రాసిన “ఆకుపచ్చని దేశం” “నల్లమిరియం చెట్టు” నవలలు రెండు కలిపి ఒకే పుస్తకంగా వచ్చాయి. ఈ నవలల గురించి ఒక నాలుగు మాటలు-

ఆధునిక మానవుడు తన మేధాశక్తీ వల్ల అభివృద్ధి చెందుతున్నాడు. ఐతే ఈ అభివృద్ధిలో భాగంగానే ప్రకృతిని నాశనం కూడా చేస్తున్నాడు. కేవలం పట్టణ లేదా నగర జీవితాన్నే పురోగతిగా, పల్లె లేదా అడవిలో జీవించే వాళ్ళను అనాగరికులుగా భావిస్తున్నాడు. తమ నగర లేదా పట్టణ జీవితాల అవసరాలకు అనుగుణంగా ఎన్నో కొత్త ప్రాజెక్టులు,రోడ్లు కడుతూనే ఉన్నాడు. అయితే ఈ పట్టణీకరణ పెద్దగా ఇష్టం లేని జాతులను బలవంతంగా తమలో కలుపుకోవడమో లేదా వాళ్ళ ఉనికే లేకుండా చెయ్యడమో చేస్తున్నాడు. ఇలాంటి ఒక కథాశంతో వచ్చిన నవలే “ఆకుపచ్చని దేశం”.

2004-09 మధ్యలో అప్పటి ఆంధ్రప్రదేశ్ లో నీటి అవసరాల కోసం వెలుగోడు ప్రాజెక్ట్ ప్రారంభించాలి అనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ వల్ల పదిహేను గ్రామాలూ, రెండు చెంచు గూడాలు జలమయమవుతాయి. కాబట్టి అక్కడి ప్రజలకు ప్రభుత్వం మార్కాపురం దగ్గరలో పునరావాసం ఏర్పాటు చేస్తుంది. కానీ గొట్టిపడియ అనే గ్రామంలో ఉన్న చెంచులు ఈ మార్పుకు పెద్దగా ఇష్టపడరు. వాళ్ళని ఒప్పించి ఈ  నగర జీవితంలోకి తీసుకోని రావడానికి వాళ్ళ ప్రాంతం నుంచి చిన్నప్పుడే వేరుపడిన వీర అనే యువకుడు బయలుదేరుతాడు.  అలా వెళ్లిన వీర, అక్కడి ప్రజల జీవితం గురించి ఎలాంటి విషయాలు తెలుసుకున్నాడు, వీర రాకతో అక్కడి చెంచుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి వంటి విషయాలే ఈ నవలలో ముఖ్య కథ.

ఈ నవల ఒక జాతి ఉనికికి సంబంధించిన కథైనా, అప్పటి రాజకీయ నాయకుల గురించి, స్వార్ధంతో పనిచేస్తే NGOలు గురించి, తక్కువ చేయబడ్డ జాతి వాళ్ల మీద జరిగే పోలీసుల హింస వంటి ఎన్నో విషయాలు గురించి ఈ నవలలో రచయత స్పృశించారు.

ఈ నవలను ఒక సుదీర్ఘ జానపథ కథలాగా రచయత తన సహజ వాక్య నిర్మాణంతో ఒప్పించారు. మన అనుకున్న సిద్ధాంతాలు, ఉద్యమాలు, పోరాటాలు వంచనకు గురవుతున్న సమయంలో ఒక పోరాట నిర్మాణం ఎలా జరుగుతుందో, ఒక కలను వాస్తవం ఎలా చేసుకోవాలో ఈ నవల ద్వారా మనం తెలుసుకోవచ్చు.

తెలుగు ప్రజల్లో కులం అనేది ఒక బలమైన సామాజిక సమీకరణం. ప్రతి కులం తమ అస్తిత్వం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాయి. వీటిల్లో దళితుల పోరాటాలు చాలా ముఖ్యమైనవి. 1920 నుంచి దళితులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నా 1985 లో జరిగిన చుండూరు ఘటన నుంచి వాళ్ళ ఉద్యమం మరింత తీవ్రతరం చేశారు. ఆ పోరాటాల భాగంలోనే మొదలైన “దండోరా ఉద్యమం” నేపథ్యంలో వచ్చిన నవలే “నల్ల మిరియం చెట్టు” అనే నవల.

ప్రకాశం జిల్లాలో ఎక్కువ ప్రభావం చూపిన దండోరా ఉద్యమం వాళ్ళ అదే ప్రాంతానికి చెందిన మాదిగ కులస్థుడైన రాజసుందరం కుటుంబ కేంద్రంగా నడిచే నవల ఇది . రాజుసుందరం దండోరా ఉద్యమాన్ని నిరసించే ఒక దళిత రాజకీయ నాయకుడు. తన కొడుకైన రూమి ఈ దండోరా ఉద్యమానికి ఆకర్షితుడై చేసే ఆందోళనల వల్ల రాజుసుందరం రాజకీయ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో అనేది ఈ నవలలోని ప్రధాన కథాంశం.

ఈ నవల రాజుసుందరం కుటుంబం ద్వారా మూడు దశాబ్దాల తెలుగు రాష్టాల చరిత్ర కనిపిస్తుంది. ముఖ్యంగా దళిత వర్గాల జీవితం, మత మార్పిడులు, వామపక్ష ఉద్యమాల వ్యాప్తి, కుల ద్రోహాలు, ఆర్థికస్థాయి లో మార్పుల వల్ల వచ్చే వర్గ మార్పు వంటి ఎన్నో విషయాలు గురించి రచయత చాలా విస్తృతంగా చర్చించారు.

ఈ రెండు నవలలు కాస్త దుఃఖాన్ని , భయాన్ని చూపిస్తున్నట్టు ఉన్నా ప్రతి కథ చివర్లో జరిగే పతాక సన్నివేశం ద్వారా మనలో ఒక ఆశను, నమ్మకాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఈ రెండు నవలలో ఎక్కడ కూడా రచయత బలమైన సిద్ధాంతాల గురించి ఉపన్యాసాలు లేకుండా చాల సరళమైన పద్దతిలో కథను నడిపించారు. ఈ కథను చదువుతునప్పుడు ఈ కథాంశం నిజంగానే జరిగిందా..? అనే ఆలోచన మనకు తప్పకుండా కలుగుతుంది.

ఈ పుస్తకానికి ముప్పై పేజీల ముందుమాట ఉండటం కొంచెం ఇబ్బందిగా  ఉన్నా, రెండు నవలలు చదవడం పూర్తయిన తర్వాత ఈ ముందుమాట చదివితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.

తెలుగులో ఆధునిక రాజకీయ-సామజిక అంశాల మీద ఉండే కథాంశం కోసం చూసే వాళ్ళకి ఈ పుస్తకమే ఒక మంచి ఎంపిక. ఇలాంటి పుస్తకం మన తెలుగులో రావడం మనం అదృష్టం

ఈ పుస్తకం telugubooks.in లో దొరుకుతుంది.  పుస్తక ధర : ₹300/-

లింక్ : https://www.telugubooks.in/products/akupacchani-desham-nallamiriyam-chettu

దయచేసి పుస్తకాలను కొని చదవండి..!

*

 

 

ఆదిత్య అన్నావఝల

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Excellent review on what appear to be a collection of two excellent novels. I’d like to know who wrote the 24-page foreword to the collection.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు