హైవే మీద కార్ల వెనకాల కుక్కలు తరుముతూ ఎందుకు పరిగెడతాయో తెలుసా?
కడుపు చెరువయ్యేలా, గుండెకి గండిపడేలా, గొంతు జీరుకుపోయేలా, నదికి నిలువెల్లా దుఃఖం ఎందుకో తెలుసా?
నాకు నువ్వెంతో నీకు నేను అంతే. కానీ నీకు నేను ఎలానో నాకు నువ్వు అలానే కాదని…
అన్ని వానలు ఒక్కలానే కురుస్తాయి. నీకు తడవాలనిపిస్తుంది కదా అది నీ వాన.
అందరి ప్రపంచాలు ఒక్కలానే ఉంటాయి. నువ్వు తలుపు తెరవగానే వాన కురుస్తుంది చూడు- అదే నీ ప్రపంచం.
అసలారోజున వాన కురవకపోయి ఉంటే,
అలవాటైన కప్పలు కూడా ఆదమరచి మడుగులో జారి పడకపోయి ఉంటే,
మళ్లీ మబ్బుపట్టడం ఒట్టి అనుమానం కాదని అప్పుడే బలంగా అనిపించి ఉంటే,
ద్వేషించడం నేర్చుకోని గాయాన్ని, ఎందుకు కమిలిందని ఎవరూ ఇంకొన్నాళ్లు అడగకుండా ఉంటే…
ఎర్రపూలున్న తెల్లదుప్పటిలోంచి అతని గొంతు వినపడుతోంది
“క్షమిస్తావా అన్నిటినీ?”
గట్టిగా ముద్దు పెడుతుంది.
“మర్చిపోతావుగా తప్పులన్నీ?”
బుగ్గతుడిచి మళ్లీ ముద్దు పెడుతుంది
“ఉంటావా నాతో?”
అతని జుట్టు చెరిపి నవ్వుతుంది. సంబరం పట్టలేక పొంగి పొంగి నవ్వుతూనే ఉంటుంది.
నవ్వు ఆగాక గుసగుసగా అడుగుతుంది “పిల్లి పిల్లలకి స్నానం ఎలా చేయిస్తుందోయ్?”
గుర్తుంచుకోదల్చుకోనివి గుర్తురాకుండా ఉండడానికి ఒకటే దారి. మర్చిపోవాలనుకున్న సంగతి మర్చిపోడమే.
హలొ …హెలో, ఇక్కడ కవరేజ్ లేదు. కరెంట్ లేదు. రంగులో చేతులు ముంచి గోడల మీద అద్దిన ముద్రలు మాత్రం మెరుస్తూ ఉన్నాయి. ఎర్రమట్టికుండలో అడుగున కాసిన్ని నీళ్లు కూడా మిగలలేదు. నిన్ను వదుల్చుకుని వెనక్కు తిరిగి వచ్చిన ఈ పాతఇంట్లో అదే పాత చీకటి. అదే ఆందోళన, ఇతమిద్ధంగా ఇందుకు అని తెలీని భయం, రాత్రంతా అప్రమత్తత.
తెల్లారగానే
వాన వెలవగానే
కాసిని నీళ్లు గొంతులో పడగానే
ఆ గుక్కెడు నీళ్లిచ్చిన ప్రతి మనిషిని ఇప్పుడు ఆమె ఓకేమాట అడుగుతుంది “ఉంటావా నాతో?”
ఇంతకీ హైవే మీద కుక్క సంగతి తెలిసిందా లేదా?
అద్భుతమైన మాటలు