[దేవవ్రత ఉన్న పళాన రమ్మనమంటే పెరిగెత్తుకొని వెళతాడు స్వరూప్.
దేవవ్రత ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోబోయాడని తెలుస్తుంది.
వారం రోజులుగా వర్కుకి వెళ్ళడం లేదనీ, తాగుడికి అలవాటు పడ్డాడని తెలుస్తుంది.
దేవవ్రతని అపార్ట్మెంట్ మేనేజరు గది ఖాళీ చెయ్యాలని నోటీసు ఇస్తాడు.
స్వరూప్ మేనేజరుతో మాట్లాడి అతనికి నచ్చచెబుతానని అంటాడు.
సుధీర్, నేహ తనకి చెప్పకుండా ఫ్లోరిడా వెళ్ళడం శీనుకి నచ్చదు.
నేహ తల్లి కూతురితో మాట్లాడాలని ఫోన్ చేస్తూనే ఉంటుంది.
ప్రతీ సారీ ఏదో ఒక వంక పెట్టి తప్పించుకుంటూ ఉంటాడు శీను.
ఎప్పుడు నేహా పంచ నుండి బయట పడతానా అనుకుంటాడు.]
స్వరూప్ బాత్రూం వైపు వెళ్ళగానే మేనేజరుతో మాట్లాడ్డానికి బయల్దేరాడు స్వరూప్.
దారిపొడుగునా దేవవ్రత చేసిన పనిని తిట్టుకుంటూనే ఉన్నాడు.
వెళ్ళేసరికి మేనేజరు ఎవరితోనో ఫోనులో ఉన్నాడు.
అతను సుధీర్‌ని చూసి “వన్ మినిట్” అని చేత్తో సౌంజ్ఞ చేసాడు.
సరేనంటూ గది బయట కుర్చీలో కూలబడ్డాడు.
దేవవ్రతకి చదువు తెలివితేటలూ ఉన్నాయి కానీ, కామన్‌సెన్స్ లేదని విసుక్కున్నాడు. ఎలా సర్ది చెప్పాలో తెలీదు.
ఓ రెండు నిమిషాల తర్వాత మేనేజరు బయటకొచ్చి “కామాన్ ఇన్” అంటూ లోపలకి పిలిచాడు.
సుధీర్ తనని పరిచయం చేసుకున్నాడు, దేవవ్రత ఫ్రెండుగా.
“యూ ఆర్ దేవాస్ ఫ్రెండి…వాట్ ఈజ్ హీ ఉప్టూ మేన్…” అంటూ చేతులు పైకెత్తి అన్నాడు.
స్వరూప్ చిన్నగా నవ్వాడు, అంతే.
“దేవా నా ఫ్రెండ్. అతనికి ఈ మధ్యే పెళ్ళయ్యింది. అమెరికా రావాల్సిన వైఫ్ మిస్సింగ్!” అని చూచాయగా చెప్పాడు.
“ఓ ఐ సీ. అతను పెద్ద న్యూసెన్స్‌గా తయారయ్యాడు. నైబర్స్ కంప్లైంట్ చేసారు.
మీ ఫ్రెండ్ సూపర్ మేన్. సీలింగ్ ఫేను విరక్కొట్టాడు….సారీ! అతను రూం ఖాళీ చెయ్యాలి. అంతే కాదు, ప్రోపర్టీ డేమేజ్ క్రింద అయిదు వేల డాలర్లు కట్టాలి.
ఇంకా లీజ్ అగ్రీమెంట్ మధ్యలో బ్రేక్ చేసినందుకు అతని డిపాజిట్ వదులుకోవల్సి వస్తుంది…” అంటూ చెప్పాడు.
ఇది విని స్వరూప్ కంగారు పడ్డా, పైకి కనిపించనీయకుండా – “సరే” – అని మాత్రం అన్నాడు.
దేవవ్రత మానసిక స్థితి సరిగా లేదనీ, కొద్ది రోజులు టైము ఇవ్వమని అడిగాడు.
రెండు వారాల నోటీస్ అని చెప్పాడు, మేనేజరు.
“రెండు వారాలా? ఉన్న పళంగా ఎక్కడికి వెళతాడు? పైగా ఈ అపార్ట్‌మెంట్ తీసుకొని రెణ్ణెల్లు కూడా కాలేదు…ప్లీజ్ గివ్ హిమ్ సమ్ మోర్ టైమ్ …”
అని బ్రతిమాలాడు.
“మీ ఫ్రెండు మరలా ఇలా చెత్తగా బిహేవ్ చేయనని అగ్రీమెంట్ రాసివ్వాలి. ఈసారి ఇలాంటివి జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది…అతనికి ఆరు వారాల గడువు ఇస్తున్నాను. అంతకు మించి నేను చేసేదేమీ లేదు…” అంటూ గట్టిగా చెప్పాడు.
చచ్చినాడి పెళ్ళికి వచ్చిందే కట్నం – అన్న తీరుగా సరేనంటూ వెనక్కి వచ్చాడు.
నిజానికి దేవవ్రత అమాయకుడు. రాముడు బుద్ధిమంతుడి టైపు. అలాంటిది ఒక్క నెల్లాళ్ళల్లో వాడిలా తయారయ్యాడంటే నమ్మబుద్ధి కావడం లేదు స్వరూప్‌కి.
పెళ్ళి మనుషుల్లో ఇంత మార్పు తీసుకొస్తుందా అనుకున్నాడు.
ఇలాంటివి వింటే పెళ్ళంటే భయం పుడుతుంది అనుకున్నాడు.
అపార్ట్‌మెంటుకి వెనక్కి వచ్చేసరికి దేవవ్రత స్నానం చేసి నీటుగా వచ్చాడు.
దేవవ్రత మ రీ పొడుగూ కాదు, పొట్టీ కాదు. చిన్న సైజు హీరోలా ఉంటాడు.
మీసాలూ, గెడ్డంతో భయంకరంగా ఉన్నవాడు, అవి తీసేస్తే మనిషిలా కనిపించాడు స్వరూప్‌కి.
మేనేజరు చెప్పిందంతా చెప్పాడు స్వరూప్. తలదించుకునే విన్నాడు దేవవ్రత.
“ఇప్పుడేం చెయ్యాలి…?” అంటూ అమాయకంగా అడిగాడు.
“అకాశానికి మేక్కొట్టి ఉరేసుకోవాలి…” అని విసుగ్గా అన్నాడు స్వరూప్.
ఒక్కసారి “అదేంట్రా..” అంటూ భయపడిపోయాడు దేవవ్రత.
“లేకపోతే ఏంట్రా! పోయిందెలాగూ పోయింది…దానికోసం నీ జీవితం తగలెట్టుకుంటావా…? ఇంకా నయం అపార్ట్‌మెంట్ మేనేజరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వ లేదు. సూసైడ్ ప్రయత్నం నేరమని ఈ దేశం లా. తెలుసా…? అది తెలిస్తే బొక్కలో తోస్తారు ఇక్కడ…” అంటూ గట్టిగా విసుక్కున్నాడు.
తలదించుకున్నాడు దేవ. వచ్చే ఏడుపుని దిగమింగుకుంటూ ఉన్నాడు.
“ఏం…చెయ్యాలో తెలీక చేసిన మూర్ఖపు పని. నాలుగు వారాలుగా నిద్ర లేదురా. ఒక పక్క అమ్మా, నాన్నా గొడవ. అనూ ఏమైదో అన్నది రెండోది…”
“ఒరేయ్! ఆ అమ్మయి పేరెత్తితే నరుకుతా…” అంటూ స్వరూప్ ఖండించాడు.
“ముందు ఇప్పుడేం చెయ్యాలో ఆలోచించు. నీకు ఈ బే యేరియాలో నెల్లాళ్ళలో ఇల్లు దొరకడం కష్టం. ప్రయత్నిద్దాం. అంత వరకూ నువ్వు ఏ వెధవ పనీ చెయ్యనని ప్రామిస్ చెయ్యాలి..” అంటూ గదిమాడు. అలాగేనంటూ చేయి ముందుకు పెట్టాడు దేవవ్రత.
“రూం వెతుకుదాం. అంతలోగా నా రూంకి మారుదువుగాని. సామాను పబ్లిక్ స్టోరేజిలో పడేద్దాం…అన్నట్లు చెప్పడం మరిచా…నువ్విచ్చిన రెణ్ణెల్ల డిపాజిట్ వెనక్కి ఇవ్వనని చెప్పాడు మేనేజరు. పైగా ఈ ఫేను నిర్వాకానికీ చార్జ్ చేస్తాడట…”
దేవవ్రత నెత్తిమీద చెయ్యి వేసుకున్నాడు.
“ఒక పని చెయ్యి…ఇలా ఒంటరిగా ఉండడం మంచిది కాదు; మా రూంలో ఉంది గాని ఓ వారం…వర్కుకి వెళ్ళడం మానకు…”
ఈ మాటలు వినగానే కళ్ళనీళ్ళు వచ్చాయి దేవవ్రతకి. ఒక్క ఉదుటున స్వరూప్‌ని పట్టుకొని బావురుమన్నాడు.
” నీలాంటి ఫ్రెండు దొరకడం…” ఏడుస్తూనే అన్నాడు.
“నువ్వు ముందు ఏడుపు ఆపాలి…నే చెప్పినట్లు చెయ్యి…బట్టలు తీసుకొని రూముకి రా. నీ కారు ఇక్కడే వదిలెయ్యి…” అన్నాడు.
దేవవ్రత మారు మాట్లాడ కుండా రెండు జతల బట్టలూ అవీ బ్యాక్ ప్యాక్‌లో సర్దుకొని బయల్దేరాడు. ఇద్దరూ స్వరూప్ కారెక్కారు.
“ముందు అపార్ట్‌మెంట్ వెతుకుదాం. ఒకటి చెప్పు… నీ గ్రీన్ కార్డ్ ఎంతవరకూ వచ్చింది? ” అడిగాడు స్వరూప్.
“I-140 అయ్యింది…485 కి అప్లై చేసానన్నాడు లాయర్…ఏం?” ఆశ్చర్యంగా చూసాడు దేవా.
“బ్రతికిపోయావ్! నువ్వు సూసైడ్ చేసుకుంటున్నావని అపార్ట్‌మెంట్ మేనేజరు నీ మీద కంప్లైంట్ ఇస్తే నీ గ్రీన్‌కార్డ్ కాస్తా గోవిందా అయ్యేది…”
దేవ వ్రత మొహం చిన్నబుచ్చుకున్నాడు. బాధగా తల విండో వైపు తిప్పుకున్నాడు.
“ఒకరకంగా నువ్వు అదృష్టవంతుడివి. అనూ ఇక్కడికొచ్చాకా నువ్వు హెరాస్ చేస్తున్నావని నీ మీద కంప్లైంట్ ఇచ్చిందనుకో, నీ బ్రతుకు సర్వనాశనం అయ్యుండేది. ఇక్కడి లా నీకు తెలుసు కదా…అది గుర్తొచ్చి అడిగాను. ఒరేయ్…ఒకటడుగుతాను. నిజం చెప్పు. నో లయింగ్!…” అంటూ దేవ వ్రత వైపు చూసాడు.
“అడుగు. నిజమే చెబుతా…”
“పెళ్ళయ్యాక, నువ్వూ, అనూ సెక్స్…”
“అయ్యింది…” స్వరూప్ మాటలు పూర్తికాకుండానే చెప్పాడు దేవవ్రత.
“అయ్యిందా? నువ్వు అక్కడ రెండు వారాల పైనే ఉన్నావు కదురా…ఒక్కసారేనా…?” అంటూ నోరెళ్ళ బెట్టాడు.
“చాలా సార్లు…” అంటూ కళ్ళు మూసుకున్నాడు దేవవ్రత.
“ఒరేయ్! ఆమె మామూలు అమ్మాయి కాదురా. ఖతర్నాక్ ! ఇక్కడికి రాకపోవడమే బెటర్. వచ్చుంటే చచ్చుండేవాడివి నువ్వు..”
“అది జరిగినా బావుండేది…” అంటూ ఏడ్వడం మొదలు పెట్టాడు.
“షటప్!” అని కోపంగా స్పీడు పెంచాడు స్వరూప్.
ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు దేవవ్రత.
ఇంత జరిగినా దేవవ్రత అనూని తిట్టకపోవడం స్వరూప్‌కి ఆశ్చర్యం కలిగించింది.
ప్రేమ గుడ్డిదే కాదు. చెవిటిది, అవిటిది కూడా – అనుకున్నాడు.
000000000
అమ్మా, నాన్నా వచ్చాక నీహార్‌లో చాలా మార్పు వచ్చింది.
నాలుగైదు తెలుగు మాటలు కూడా నేర్చుకున్నాడు.
వాడు, గ్రాండ్‌పా అని పిలుస్తూంటే – వద్దు, అమ్మమ్మా, తాతా – అనే పిలవమని చెప్పాడు నాన్న.
నవ్వొచ్చింది నాకు. పెళ్ళయ్యాక రాజుబావని ఏమండీ అని పిలవమని అత్తయ్య చెప్పింది.
అవేం పట్టించుకోవద్దని బావ పిలుపే ఇష్టపడ్డాడు.
నీహార్‌కి మాటలొచ్చిన కొత్తలో వాడు నన్ను చూసి బావా అని పిలవడం మొదలు పెట్టాడు. ఇవన్నీ తలుచుకుంటే నవ్వొస్తుంది. పక్కన బావుంటే ఎంత బావుండేది అనిపిస్తుంది.
అది నా దురదృష్టం. అంతే! ఒక రకంగా దానికి నేనే కారణమేమో కూడా.
అవన్నీ తలచుకుంటే మనసు పాడవుతుంది. బావ లేడు. అంతే.
అలోచనలో వుండగా భుజమ్మెద చెయ్యి పడేసరికి ఒక్కసారి ఉలిక్కిపడ్డాను.
వెనుకనే నాన్న, వాడి పక్కనే నీహార్!
“ఒక్కసారి భయపడ్డాను…” అంటూ తేరుకున్నాను.
“ఏం లేదమ్మా! నీహార్‌ని ఇండియా పంపుతావా వేసవి శలవలకి…” నాన్న కళ్ళలో అభ్యర్థన.
” ఎలా పంపను నాన్నా! వాణ్ణి వదిలి…”
“నువ్వు మేం ఎలా రావాలనుకుంటున్నావో మేమూ అంతే కదా…చిన్న రిక్వెస్ట్…” అన్నాడు.
“అదేంటి అలా అంటావు. పంపుతానులే. మీరింకా నాలుగు నెలలుండాలి…”
“ఎంత సేపయ్యింది వచ్చి…? వస్తూనే నీ ఆఫీసు రూంలోకి వెళిపోయావు…?”
“ఏం లేదు. ఎవరికో ఒకాయనకి ఈ రాత్రి తొమ్మిదింటికి లిమో కావాలట. ఆయన ఏదో కంపెనీ లో ఎగ్జిక్యూటివ్. సమయానికి ఏ డ్రైవరూ లేడు.
అందరికీ కాల్ చేసి చూస్తున్నా. కర్తార్ షికాగో వెళ్ళాడు…”
“పోనీలే! ఎవరూ ఖాళీ లేరని చెప్పేయ్…” అన్నాడు నాన్న.
అన్నంత సులభం కాదని నాన్నకి చెప్పాను. మెల్ల మెల్లగా వాళ్ళకీ ఇక్కడి జీవితం గురించి తెలుస్తోంది.
నాన్నకీ, అమ్మకీ ఇక్కడి శుభ్రత విపరీతంగా నచ్చేసింది. అమ్మకి అసలే చాధస్తం కూడా ఎక్కువ. ఇక్కడ శుభ్రత చూసి ఆశ్చర్యపోయారు.
“ఇహ ఎవరూ లేకపోతే నేను వెళ్ళాలి…” అన్నాను కుర్చీలోంచి లేస్తూ.
నాన్న నువ్వా అన్నట్లు ఆశ్చర్యంగా చూసాడు.
నాన్నకి తెలుసు నేనూ లిమో డ్రైవ్ చేస్తానని. అంతే కానీ ఇలా కష్టమర్లని తీసుకెళతానని వాళ్ళు అనుకోలేదనుకుంటా.
వ్యాపరం ఇంతగా ఎదగని కొత్తలో నేనొక్కద్దాన్నీ రోజంతా నడిపిన అనుభవాలున్నాయి. ఇప్పుడైతే తగ్గించేసాను కానీ.
“అమ్మో! అంత పెద్ద కారు…నువ్వా…” ప్రతీ తండ్రికీ ఉండే ఆదుర్దా అది.
“నాన్నా! నీకో విషయం తెలుసా? ఈ లిమో నడపడానికి ప్రత్యేకమైన లైసెన్‌స్ కావాలి. అందరికీ అంత ఈజీగా ఇవ్వరు…” అని చెప్పాను.
సాధారణంగా ఈ లిమోలు మగవాళ్ళే నడుపుతారు. ఆడవాళ్ళ సంఖ్య వేళ్ళ మీద లెక్కపెట్టచ్చు. నేను డ్రైవింగ్ టెస్టుకి వెళ్ళినప్పుడు నన్ను చూసి నోరెళ్ళ బెట్టాడు అక్కడున్న ఆఫీసరు.
అతను ఇంతకుముందు ఆడవాళ్ళు లిమో డ్రైవ్ చేయడం చూళ్ళేదని అన్నాడు.
నేను డ్రైవ్ చేసాక అతనికి నమ్మకం కుదిరింది. ముందు లైసెన్‌స్ రాదేమోనని భయపడ్డాను.
అతను ఏం అనకుండానే లైసెన్‌స్ మంజూరు చేసాడు.
కర్తారూ, మా ఆఫీసులో వాళ్ళెవరూ లైసెన్‌స్ వచ్చిందంటే నమ్మలేదు. లైసెన్‌స్ చూపించాక నమ్మారు.
రాజు బావుండగా ఒక్కసారీ కారు డ్రైవ్ చేస్తే ఒట్టు. నాకు బావ డ్రైవ్ చేస్తేనే ఇష్టం.
బావ బలవంతమ్మీద నేర్చుకున్నాను కానీ నాకు మొదట్లో ఈ డ్రైవింగ్ అంటే చచ్చేటంత భయం.
ఆ భయం పోగట్టి బావ చచ్చీ చెడీ నేర్పించాడు.
నిజానికి ఇప్పుడు అదే నాకు దిక్కయ్యింది. బ్రతకనిస్తోంది కూడా.
మనుషులెలా మారుతారో, ఎందుకు మారతారో చెప్పలేం. ఒక్కోసారి అవసరం ముందుకు నెడుతుంది.
తొమ్మిదింటి బుకింగ్ కన్‌ఫర్మ్ చేసాను. ఎవరినుండీ జవాబు రాకపోతే నేనే వెళతానని నాన్నకి చెప్పాను.
ఇంత రాత్రి ఒక్కతివీనా అంటూ నాన్న నసిగాడు. నేను పట్టించుకోలేదు. నవ్వేసాను.
స్నానం చేసి వస్తానని బాత్రూం వైపుగా వెళ్ళాను.
ఓ గంట వరకూ ఎవరూ జవాబివ్వ లేదు. ఇహ నేనే వెళదామని నిశ్చయించుకుని బయల్దేరాను. నాన్న వెళ్ళద్దొని సణిగాడు.
వ్యాపారంలో కష్టమరు దేవుడు లాంటి వాడని చెప్పాను.
ఒక్క అసంతృప్తి కష్టమరు చాలు; వ్యాపారాలు కూల్చడానికి.
అది నేను కళ్ళారా చూసాను కూడా.
ఈ లిమో సర్వీస్ కూడా విచిత్రంగా ఉంటుంది. ఒక్కసారి నచ్చితే వాళ్ళనే పిలుస్తారు. మార్చడానికి ఇష్టపడరు.
నచ్చకపోతే వాళ్ళు పిలవకపోవడమే కాదు; పదిమందికీ చాటింపేస్తారు.
లిమో సర్వీసులో మేము బేయేరియాలో 50 ర్యాంకులో ఉండే వాళ్ళం.
ఇప్పుడు రెండో స్థానానికి వచ్చాం. నేనే కావాలని వ్యాపారాన్ని పెంచలేదు.
నీహార్ ఎదిగే వరకూ పెంచకూడదని నిర్ణయం తీసుకున్నాను.
ఆ రాత్రి అడ్రసు వెతుక్కుంటూ లాస్ఆల్టోస్ హిల్ల్స్ వైపు వెళ్ళాను.
తొమ్మిది కావడానికి ఇంకా పది నిమిషాలు ఉంది.
ఆ కష్టమరు ఇల్లు ఇంద్ర భవనం లా వుంది. పెద్ద పోర్టికో.
ముందు ఆటోమేటిక్ సెక్యూరిటీ గేట్. ఇంటి ముందు లాన్ అదీ చాలా అందంగా ఉంది.
లిమో పార్క్ చేసి డోర్ బెల్ రింగ్ చేసాను.
ఎవరో ఒకతను ఓపెన్ చేసాడు. లిమో సర్వీస్ అని చెబుతూండగా, మెట్ల మీద నుండి దిగుతూ ఒక అమెరికన్ కనిపించాడు.
నన్ను చూడగానే – గివ్ మీ 2 మినిట్స్ – అన్నాడు.
నేను ఒకే అని నా లిమో దగ్గరకి వచ్చేసాను.
అయిదు నిమిషాల తరువాత అతను రావడం గమనించి డోర్ ఓపెన్ చెయ్యడానికి నిలుచున్నాను.
“ఐ యాం ప్రాహీ!” అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాను.
అతనూ నవ్వుతూ ప్రతిగా చేయందించాడు – “ఐ యాం రాయన్!” – అంటూ.
అతని బ్యాగ్ వెనుక ట్రంకులో పెట్టి వెనక్కి వస్తూండగా – వేరీజ్ ద డ్రైవర్? – అని అడిగాడు.
నేనే అని చెబితే ఆశ్చర్యంగా చూసాడు.
“యూ కెన్ డ్రైవ్!…” సంశయంగా చూసాడు.
“యెస్! ఆయిదేళ్ళుగా నడుపుతున్నా…” చెప్పాను.
“రియల్లీ! నేనెప్పుడూ లేడీ షాఫర్‌ని చూళ్ళేదు,” అని అన్నాడు.
ఇప్పుడు చూస్తున్నారు కదా అని నవ్వేసాను.
లిమో కారు చాలా పొడవుగా ఉంటుంది. ఓ మూడు కారులున్నంత పొడావుగా. టర్న్‌స్ తీసుకోవడం కష్టం అవుతుంది. అది నడపడానికి చాలా నైపుణ్యం కావాలి. చాలామంది లిమో నడపడానికి భయపడతారు.
ముందు శాన్‌హోసే ఎయిర్‌పోర్టుకి వెళ్ళాలన్నాడు. ఒకర్ని రిసీవ్ చేసుకొని అక్కడనుండి ఫ్రీమాంట్ వెళ్ళాలని చెప్పాడు.
సరే నన్నాను.
ఎయిర్పోర్ట్ పార్కింగ్ లాట్ దగ్గర దిగి అతని బ్రీఫ్ కేస్ కోసం ట్రంక్ ఓపెన్ చేస్తూండగా గమనించాను; ఆ దీపాల వెలుగులో అతను నాకేసే చూస్తున్నాడని.
బ్రీఫ్ కేసు ఇస్తూండగా అది తీసుకుంటూ అప్రయత్నంగా అన్నాడు – “యూ ఆర్ సో బ్యూటిఫుల్!”
వేంటనే ఏం జవాబు చెప్పలో తెలీలేదు – “థాంక్యూ!” అని నవ్వేసాను.
ఒక అరగంటలో వస్తానని వచ్చే ముందు మెసేజ్ ఇస్తానని చెప్పాడు. సరేనని కారులో కూర్చున్నాను.
నేను షాఫర్ వేషం వేసినపుడు హ్యాట్ పెట్టుకుంటాను. ఎవరూ నన్ను ఇండియన్ అని గుర్తు పట్టకుండా నా డ్రెస్సులు వేసుకుంటాను.
రాయన్ అన్నట్లుగా ఇంతవరకూ ఎవరూ అనడం వినలేదు.
ఇక్కడ వాళ్ళు, ముఖ్యంగా ధనవంతులు చాలా సభ్యతతో ప్రవర్తిస్తారు.
ఎవరూ ఇలాంటి కామెంట్లు చెయ్యరు. ఇతనెవరో వేరేలా ఉన్నాడే అనుకున్నాను.
ఆ తరువాత అతన్నీ, అతనితో వచ్చిన ఒకామెను ఫ్రీమాంట్‌లో వదిలి అతన్ని లాస్ ఆల్టోస్ దగ్గర దింపాను.
అప్పటికే రాత్రి పన్నెండు దాటింది.
వెళుతూండగా వెనక్కి పిలిచాడు – “యువర్ గుడ్ నేమ్ ప్లీజ్…!” అంటూ.
“ప్రాహీ!” అని చెప్పాను. కోటు జేబులోంచి కార్డ్ తీసి ఇచ్చాడు. నాదీ ఇవ్వమన్నట్లు సైగ చేసాడు. ఇచ్చాను.
వెళుతూ వెళుతూ మరలా అన్నాడు – “యూ ఆర్ సో బ్యూటిఫుల్!”
నేను మాములుగా లిమో ఎక్కి కూర్చున్నాను. అతనిచ్చిన కార్డు పక్కన పడేసే ముందు ఏవిటా అని చూసాను.
“రాయన్ విలియమ్స్…” పేరు పైకి చదివాను.
దాని క్రింద – “టెక్నాలజీ అడ్వైజర్” అని ఉంది.
అతను పని చేసే కంపెనీ – గూగుల్!
(సశేషం)
ఖాళీ పేజీలు గత భాగాలు ఇక్కడ చదువుకోండి
Add comment