క‌మిట్‌మెంటు

కూతురి మొహంలో బాధ‌, నిరాశ‌, సంతోషం, ఉద్వేగంలాంటి ఫీలింగ్సేమీ తాను క‌నిపెట్ట‌లేక‌పోవ‌డం ఆమెకి న‌చ్చ‌లేదు. 

“స్టోరీ బాగానే వుంది. కానీ  డాన్సులూ వాటేసుకోవ‌డాలూ త‌ప్ప‌ పెర్ఫార్మెన్స్ కి పెద్ద‌గా స్కోప్ వున్న‌ట్టు లేదు క‌దా?”, అడిగింది హీరోయిన్‌.

“అవున్నిజ‌మే”, వొప్పుకున్నాడు ద‌ర్శ‌కుడు. నిజానికి అత‌న్ని అప్పుడే ద‌ర్శ‌కుడు అనడం స‌రికాదేమో. ఇప్పుడు చేయ‌బోయేదే అత‌ని మొద‌టి సినిమా. స్క్రిప్టు చేత్తో ప‌ట్టుకొని, సినిమా ఆఫీసుల చుట్టూ తిర‌గ్గా తిర‌గ్గా మూడేళ్ల‌కి అవ‌కాశం వ‌చ్చింది. ఎలాగైనా హీరోయిన్ పాత్ర‌కి ఈ అమ్మాయిని వొప్పించాల‌ని తంటాలు ప‌డుతున్నాడు. “ఆ  పిల్లెవ‌రో బావున్న‌ట్టుంది చూడు. చేసింది రెండు, మూడు షార్ట్ ఫిల్మ్సే అయినా మంచి స్పార్క్ వుంది పిల్ల‌లో”, చెప్పాడు ప్రొడ్యూస‌ర్‌. స్పార్క్ అంటే ఏంటో మూడేళ్ల కృష్ణాన‌గ‌ర్ జీవితం నేర్పింది అత‌నికి.  ఈ సినిమా చేయ‌డానికి ఆ అమ్మాయిని వొప్పించ‌క‌పోతే డైరెక్ష‌న్ ఛాన్సు పోతుంద‌ని కూడా అత‌నికి అర్థ‌మైంది. అందుకే నానా తంటాలూ ప‌డుతున్నాడు ఆమెని క‌న్విన్స్ చేయ‌డానికి.

“మొద‌ట్లో గ్లామ‌ర్ రోల్స్ చేయ‌డ‌మే కెరీర్‌కి మంచిది. పెద్ద సినిమాలు నాలుగు చేశాక అప్పుడు యాక్టింగ్ కి స్కోప్ వుండే పాత్ర‌లు ఎంచుకోవ‌చ్చు మీరు”. ఇంకా మీరు అనే ద‌గ్గ‌రే వున్నాడు. బ‌హుశా అగ్రిమెంట్ మీద సైన్ చేశాక నువ్వు లోకి దిగుతాడేమో.

“కొత్త డైరెక్ట‌రు, కొత్త హీరో. హీరోయిన్ గా న‌న్ను లాంచ్ చేస్తున్నారు కాబ‌ట్టీ రెమ్యూన‌రేష‌న్ కూడా పెద్ద‌గా యివ్వ‌నంటున్నారు. జ‌నాలు గుర్తుపెట్టుకునేంత గొప్ప రోల్ కూడా ఏం కాదు. స‌గానికి పైగా సినిమా అవుట్‌డోరే. ఒక డైరెక్ట‌ర్‌గా కాకుండా ఫ్రెండ్ గా చెప్పండి, నేను ఈ సినిమా వొప్పుకోవ‌డం తెలివైన ప‌నేనా?”  ఫ్రెండ్ అనే ప‌దం అత‌ని అవ‌స‌రానికీ, లౌక్యానికీ అడ్డం ప‌డిపోయిన‌ట్టుంది. వెంట‌నే స‌మాధానం చెప్ప‌లేక‌పోయాడు.

“మీర‌న్న‌ది క‌రెక్టే. కానీ పేరున్న బ్యాన‌ర్ క‌దా. పెద్ద ప్రొడ్యూస‌ర్‌. సినిమా డెఫినెట్‌గా రిలీజ్ అవుతుంది. అస‌లు మీకొక విష‌యం తెలుసా. హైద‌రాబాద్‌లో రోజుకి వంద‌ సినిమాలకి కొబ్బ‌రికాయ కొడ‌తారు. అందులో స‌గం సినిమాలు స్టోరీ డిస్క‌ష‌న్ల తోనే ఆగిపోతాయి. మిగిలిన‌వాటిలో నైంటీ ప‌ర్సెంట్ ఫ‌స్ట్ షెడ్యూల్ దాటి పోనే పోవు. ఈ గండాల‌న్నీ గ‌డిచి ఫ‌స్ట్ కాపీ రెడీ అయ్యి, థియేట‌ర్లు దొరికి, సినిమా రిలీజ్ చేయడ‌మంటే మాట‌లు కాదు. ఫ‌స్ట్ సినిమా వ‌ర‌కూ డైరెక్ట‌ర్ని, క‌థ‌నీ చూడ‌కుండా నిర్మాత‌కి వున్న రెప్యుటేష‌న్ బ‌ట్టి పోవ‌డం క‌రెక్టు”.

“స‌రే. ఒక‌ట్రొండు రోజుల్లో చెపుతా నా డెసిష‌న్‌”.

“ఇంకొక్క విష‌యం…” దేనికో మొహ‌మాట‌ప‌డుతున్నాడు.

“ప‌ర్లేదు చెప్పండి”

“అదే.. ప్రొడ్యూస‌ర్ గారు క‌మిట్‌మెంట్ కావాలంటున్నారు”.

“క‌మిట్‌మెంట్‌తో చేస్తాన‌నే న‌మ్మ‌కం వుండ‌బ‌ట్టేగా న‌న్ను వెతుక్కుంటూ వ‌చ్చారు. మీకోసం కాక‌పోయినా న‌న్ను నేను ప్రూవ్ చేస్కోడానికైనా క‌ష్ట‌ప‌డ‌తానుగా?!”

“క‌మిట్మెంట్ అంటే అది కాదు. ప్రొడ్యూస‌ర్ గారికి మీరంటే చాలా ఇష్టం”.

“సంతోషం. నాకు హీరోయిన్ ఛాన్స్ యిస్తున్నారు కాబ‌ట్టీ నేనూ ఆయ‌న్ని యిష్ట‌ప‌డిన‌ట్టే అనుకోండి”. ఆ అమ్మాయికి అర్థం అయిందో లేదో కుర్ర డైరెక్ట‌రుకి అర్థం కావ‌డం లేదు.

“మీకు స‌రిగ్గా అర్థం అయిన‌ట్టు లేదు. ప్రొడ్యూస‌ర్ గారు మీతో కొంత టైమ్ ప్రైవేట్‌గా స్పెండ్ చేయాల‌నుకుంటున్నారు”.

“ప్రైవేట్ గా స్పెండ్ చేయ‌డం అంటే?”.. అత‌న‌లా మొహ‌మాట‌ప‌డ‌టం ఆమెకి ముచ్చ‌ట‌గా వుంది.

“క‌మిట్‌మెంట్ అన‌గానే మీకు అర్థం అయిపోతుందేమో అనుకున్నాను”. అత‌ని మొహం చూస్తే జాలేసింది ఆమెకి.

“అర్థ‌మైందిలేండీ. ప్రొడ్యూసర్ వొక్క‌డేనా? ఇంకా ఎవ‌రైనా క్యూలో వున్నారా?”

“మామూలుగా అయితే కేమెరామ‌న్ కి కూడా వుత్సాహం ఎక్కువే. కానీ,  ప్ర‌స్తుతం అయ్య‌ప్ప‌మాల వేసుకున్నాడు కాబ‌ట్టీ అత‌న్నుండీ ఎలాంటి ప్ర‌మాద‌మూ లేదు”.

“అత‌న్నుండీ ప్ర‌మాదం లేదు అని నొక్కి చెపుతున్నారంటే..  అస‌లంటూ క‌మిట్‌మెంట్టు డేంజ‌రే అని వొప్పుకుంటున్నార‌న్న‌మాట‌..” అంది.

ఏం బ‌దులివ్వాలో అత‌నికి అర్థం కాలేదు. రెండు సెకన్లాగి ఆమే అడిగింది. “మ‌రి మీ సంగ‌తేంటి?”

“నా సంగ‌తేంటి” తిరిగి ప్ర‌శ్నించాడ‌త‌ను.

“మీకు క‌మిట్‌మెంట్ అవ‌స‌రం లేదా?”

ఆమె ఏం అంటుందో అర్థం కావ‌డానికి అత‌నికి కాస్త టైమ్ ప‌ట్టింది. ‘కావాలి’ అంటే క‌థ అడ్డం తిరుగుతుందేమో. ‘ఒద్దు’ అంటే బంగారంలాంటి ఛాన్సు మిస్ అయిపోతానేమో. అత‌ను ఎటూ తేల్చుకోలేక‌పోవ‌డం ఆమెకి అర్థం అవుతోంది. అత‌న్ని అంత‌కి మించి యిబ్బంది పెట్ట‌డం యిష్టం లేన‌ట్టు, “ముందు అస‌లు ప్రొడ్యూస‌ర్ సంగ‌తి ఆలోచించుకోనివ్వండి ముందు. మీ విష‌యం త‌ర్వాత చూద్దాంలే” అంది.

ఆమె యిండైరెక్టుగా త‌న‌కి గ్రీన్ సిగ్న‌ల్ యివ్వ‌డం అత‌నికి న‌చ్చిన‌ట్టే వుంది.

“ఏ సంగ‌తీ ఎల్లుండిక‌ల్లా చెప్తాను, ప‌ర్వాలేదుగా?” అడిగింది.

నిజానికి ప్రొడ్యూస‌ర్ చాలా ఆత్రంగా వున్నాడు. రెండురోజులు ఆగాక నిర్ణ‌యం చెపుతానందంటే త‌న‌మీద ప‌డి పీక కొరుకుతాడు. కానీ, ఆమె నో చెప్ప‌ద‌న్న న‌మ్మ‌కం క‌లిగింది కుర్ర డైరెక్టరుకి.

“నేను మేనేజ్ చేస్తాలేండీ. ఎల్లుండి క‌లుద్దాం. సేమ్ టైమ్‌.. సేమ్ ప్లేస్‌..”

అత‌ను లేచి వెళ్లిపోబోతుండ‌గా సందేహిస్తూ అడిగింది, “ప్రొడ్యూస‌ర్ల బామ్మ‌ర్దులు, కొడుకులు కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తార‌ని విన్నాను”.

“మ‌న ప్రొడ్యూస‌ర్‌కి బామ్మ‌ర్దులు లేరు. ఒక కొడుకున్నాడు. కానీ, అత‌న‌లాంటి వాడు కాదు. అంత‌వ‌ర‌కూ నాకు ఖాయంగా తెలుసు” భ‌రోసా యిచ్చాడు.

“ఓకే.. సీ యూ దెన్” న‌వ్వుతూ చెప్పింది. ఆల్రెడీ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయిపోయిన‌ట్లు ఫీలౌతూ బ‌య‌ట‌కి న‌డిచాడు డైరెక్ట‌ర్ కుర్రాడు.

******

“ఏమంటున్నాడేమిటీ డైరెక్ట‌రు?” అడిగింది త‌ల్లి.

“ప్రొడ్యూస‌ర్ తో అయితే ప‌డుకోని తీరాల్సిందేన‌ట‌. షూటింగ్ లేట‌య్యి, కేమెరామ‌న్ మాల తీసేస్తే అత‌నితో కూడా ప‌డుకోవాల్సిరావ‌చ్చు. ఎటుతిరిగీ డైరెక్ట‌రుతో ప‌డుకోవాలా వ‌ద్దా అన్న‌ది మాత్రం నా యిష్టానికి వ‌దిలేశారు”.

ప‌డుకోవ‌డం అన్న ప‌దాన్ని కూతురు అన్నిసార్లు వాడ‌డం త‌ల్లికి న‌చ్చ‌లేదు. కూతురి మొహంలో బాధ‌, నిరాశ‌, సంతోషం, ఉద్వేగం యిలాంటి ఫీలింగ్సేమీ తాను క‌నిపెట్ట‌లేక‌పోవ‌డం కూడా ఆమెకి న‌చ్చ‌లేదు.  “ఏదో న‌వ్వుతాలుకి అలా వొక మాటేసి వుంచుతారులే గానీ, నిజంగా బ‌ల‌వంత పెడ‌తారా ఏంటి! ఇంత‌కీ క‌థ నీకు న‌చ్చిందా లేదా?” ఎక్స్ ట్రా ఆర్టిస్టుగా త‌న‌కున్న ముప్పై సంవ‌త్స‌రాల ఇండ‌స్ట్రీ ఎక్స్పీరియెన్సు నేర్పిన‌ లౌక్యం కూతురి ద‌గ్గ‌ర అక్క‌ర‌కి రాక‌పోవ‌డం ఆవిడ‌కి స్ప‌ష్టంగా తెలుస్తోంది.

“న‌వ్వుతాలుకేం కాదు. చూడ‌బోతే, ప్రొడ్యూస‌ర్‌తో ప‌డుకోవాల‌న్న విష‌యం కూడా అగ్రిమెంటులో రాసి సంత‌కం పెట్టించుకునేలా వున్నారు”. ఆమె ముఖం యింకా ముభావంగానే వుంది.

ఇక డొంక‌తిరుగుడు య‌వ్వారం ప‌నికిరాద‌ని త‌ల్లికి అర్థ‌మైంది. “సినిమా వాళ్ల‌నేముంది. ఇప్పుడంద‌రూ పెళ్లిళ్లు కాకుండానే కానిచ్చేస్తున్రారుగా. ప్రేమ‌లూ దోమ‌లూ అంటా ఖాళీగా తిరిగేవాళ్లంతా చేసేది ఆ ప‌నేగా. అదేప‌ని హీరోయిన్ అవ‌డం కోసం చేస్తే త‌ప్పేంటి?”

“ప్రేమా దోమా అని తిరిగేవాళ్లలో చాలామంది పెళ్లి కాకుండానే ఆ ప‌ని కానిచ్చేస్తున్నారు నిజ‌మే. కానీ వాళ్ల‌కీ, ముక్కూమొహం తెలీనివాడితో క‌మిట్‌మెంటు కోసం ప‌డుకునేవాళ్ల‌కీ తేడా వుంటుందిగా”.

ఈ క‌మిట్‌మెంట్ అన్న‌మాట వాడ‌డం త‌ల్లికి అల‌వాటు లేదు. అలాంటి డిప్ల‌మాటిక్ లాంగ్వేజీ ఆవిడ‌తో ఎవ‌రూ మాట్లాడి వుండ‌లేదు. “ఏమే, ఫ‌లానా టైముకి రెడీగా వుండు, మేనేజ‌ర్ బండి పంపిస్తాన‌న్నాడు” అని కానీ, “ఆటో మాట్లాడుకోని ఫ‌లానా చోటుకొచ్చెయ్‌. కాస్త నీటుగా రెడీ అవ్వు” ఇలాంటి మాట‌లు త‌ప్ప‌, “ఆ ప‌నికోసం”  ఎవ‌రూ ఇంగ్లిషు వాడిన దాఖ‌లాలు లేవు. టెర్మినాల‌జీ ప‌రిచ‌యం లేక‌పోయినా, కూతురి మాట‌ల్లో భావం ఆమెకి అర్థం కాక‌పోలేదు. సినిమావాళ్ల మ‌ధ్య తిరుగుతూ నేర్చుకున్న నాగ‌రికుల భాష‌, ప‌ల్లెటూళ్లో ప‌నోళ్ల భాష రెండూ క‌లిపేసి మాట్లాడుతుంది ఆవిడ‌.  ఒక‌డ్రెండు పొడిమాట‌లు మాత్ర‌మే త‌న నోటెంట విన్న‌వాళ్లు బాగా చ‌దువుకున్నావిడ‌నో, పొట్ట‌కోస్తే అక్ష‌ర‌మ్ముక్క లేనిద‌నో ఏదైనా అనుకోడానికి అవ‌కాశం వుంది.

“హీరోయిన్ అవుదామ‌ని మ‌ద్రాసెళ్లి, అనుకుందేమీ జ‌ర‌క్క‌, అక్క‌డా యిక్క‌డా న‌లిగి, హైద‌రాబాదొచ్చి ఎక్స్ ట్రా ఆర్టిస్టుగా ఎండ‌న‌కా వాన‌న‌కా వొళ్లు హూనం చేస్కోని నిన్ను పెంచాను. అక్క‌డే సినిమావాళ్ల మ‌ధ్య‌లోనే వుంటే, నిన్ను కూడా ఫ‌లానాదాని కూతురు అనే పిలుస్తార‌ని భ‌య‌మేసి నిన్ను తీస్కోని వూరికి పోయి, కూలిప‌నులు చేసి నిన్ను చ‌దివించాను. నేను చేయ‌లేని ప‌ని నువ్వు చేయాల‌ని నిన్నిక్క‌డికి తీసుకొచ్చాను. ఇన్నాళ్లూ వూరుకోని ప‌డుకోవ‌డం గిడుకోవ‌డం అని నిష్టూరంగా మాట్లాడ‌త‌న్నావ్‌. అంత యిష్టం లేని ప‌నైతే వెన‌క్కితిరిగి వూరికే పోదాం ప‌ద‌. ఇద్ద‌రం కూలిప‌నులు చేసుకోనే బ‌త‌కొచ్చు”, కుండ బ‌ద్ద‌లుకొట్టింది త‌ల్లి.

“అబ్బా. దొబ్బ‌బాకే న‌న్ను. ప‌డుకోకుండానే హీరోయిన్ అయ్యితీరాలి అని నేనేమైనా శ‌ప‌థం చేస్త‌న్నానా ఏంటి? న‌న్ను కాస్త ఆలోచించుకోనియ్యి. ఎలాగూ క‌మిట్‌మెంటు త‌ప్ప‌న‌ప్పుడు అదేదో కాస్త ఆయ‌మ‌న్నోడిని వెతుక్కుందాం. వీడు కాక‌పోతే యింకోడు”.

“అవును మ‌రి. ఇక ప్ర‌పంచంలో ప‌డుకోడానికి రెడీ అయ్యే మొన‌గ‌త్తె ఎవ‌రూ దొర‌క‌లేద‌ని పెద్ద‌పెద్దోళ్లంతా ప‌రిగెట్టుకొచ్చేత్తారు నీకోసం. చేతికందిందాన్ని మ‌ట్టిలో వొల‌క‌బొయ్య‌బాకు. నా మాటిని వెంట‌నే వొప్పేస్కో. ఈ ప్రొడ్యూస‌రు నాకు ప‌రిచ‌య‌మే. కంపాగ‌డ్డీ క‌రిచైనా సినిమా పూర్తిజేస్తాడు. ఆలోచించుకోడం లేదు గాడిద‌గుడ్డూ లేదు. నువ్వు ఈ సినిమా చేస్త‌న్నావ్‌.”

ప‌రుషంగా మాట్లాడాల‌ని ప్ర‌య‌త్నించింది కానీ, త‌న కూతురు బ‌తుకు కూడా త‌న బ‌తుకులానే అయిపోతుందేమోన‌నే భ‌య‌మే క‌న‌బ‌డుతోంది ఆవిడ గొంతులో. కూతురికి వొక్క‌సారిగా త‌ల్లి మీద సానుభూతి పొంగుకొచ్చింది.

“ఏదోవొహ‌టి చేద్దాంలే. మ‌ళ్లీ వూరికి పోయేదైతే లేదు. మ‌ధ్యాహ్నం ఆ రెస్టారెంటు గ‌డ్డి తిని నాలుక చ‌ప్ప‌బ‌డిపోయింది. కాస్త రొమాంటిగ్గా వుండేదేదైనా వొండు” అంటూ త‌ల్లిని ముద్దు పెట్టుకుంది. వంట‌కీ రొమాన్సుకీ సంబంధం ఏంటో త‌ల్లికి అర్థం కాలేదు. కానీ, త‌న క‌మిట్‌మెంట్ విష‌యంలో ప‌ట్టుద‌ల‌కి పోయి, అవ‌కాశం చెడ‌గొట్టుకునే వుద్దేశం కూతురికి లేద‌న్నంత వ‌ర‌కూ ఆవిడ‌కి బోధ‌ప‌డింది.

*******

చెప్పిన టైముక‌న్నా అర‌గంట లేటుగా వ‌చ్చాడు డైరెక్ట‌రు. అంత‌కు ముందు రోజున్న వుత్సాహం అత‌నిలో లేక‌పోవ‌డం గ‌మ‌నించింది ఆమె.

“ఇంకా సెట్స్ మీద‌కి పోనే లేదు. అప్పుడే అలిసిపోయారు డైరెక్ట‌రు గారు” న‌వ్వుతూ అడిగింది. అత‌నిలో స్పంద‌న లేదు. మొత్తానికి జ‌ర‌గ‌రానిదేదో జ‌రిగింద‌ని ఆమెకి అర్థ‌మైంది.

రెండు నిముషాల‌య్యాక అత‌నే అన్నాడు, “మ‌నం ఈ సినిమా చేయ‌డం లేదు”.

“మ‌నం అంటే?  మిమ్మ‌ల్నీ న‌న్నూ యిద్ద‌ర్నీ పీకేశారా? క‌మిట్‌మెంటు గురించేనా?”

“అస‌లు దీంతో మీకు సంబంధం లేదు. మ‌నం ఈ ప్రాజెక్టు చేయ‌ట్లేదు, అంతే!” మ‌నం అనే మాట‌ని ఎందుకంత నొక్కి ప‌లుకుతున్నాడో ఆమెకి అర్థం కాలేదు.

“మీమీద న‌మ్మ‌కం లేక వాళ్లు యింకో డైరెక్ట‌ర్ని పెట్టుకున్నారు. న‌న్ను సెట్ చేసింది మీరే కాబ‌ట్టీ, యిప్పుడు న‌న్ను కూడా వొద్దంటున్నారు అంతేనా?” అడిగింది.

“నా మీద న‌మ్మ‌కం లేకేం. మేట‌ర‌ది కాదు..” ఎందుకో గానీ, అస‌లు కార‌ణం చెప్ప‌డం అత‌నికి యిష్టం లేదు.

“మీరు చెపుతారా?  ప్రొడ్యూస‌రుకి ఫోన్ చేసి క‌నుక్కోమంటారా?”..  చేయ‌డానికి ఆమె ద‌గ్గ‌ర అస‌లు నంబ‌రుంటేగా! కానీ, కార‌ణం తెలుసుకోకుండా వ‌ద‌ల‌ద‌ని డైరెక్ట‌రుకి అర్థ‌మైంది.

“ప్రొడ్యూస‌రుకి వొక కొడుకు వున్నాడ‌ని చెప్పాగా. వాడు క‌మిట్‌మెంట్ అడుగుతున్నాడు.”

“మొన్న నేన‌డిగిన‌ప్ప‌డు వాడంత ప‌త్తిత్తు లేడ‌నీ, ఆడోళ్ల జోలికి రాడ‌నీ స‌ర్టిఫికెట్ యిచ్చారుగా”.

“వాడు ఆడోళ్ల జోలికి రాడ‌న్న‌ది నిజ‌మే. కానీ వాడు ప‌త్తిత్తు మాత్రం కాదు.”

“కొంప‌దీసి మిమ్మ‌ల్ని క‌మిట్‌మెంటు అడుగుతున్నాడా ఏంటి?”,  పెద్ద‌గా న‌వ్వేసింది.

“అవును..” నూతిలోనుంచీ వ‌స్తున్న‌ట్లు చిన్న‌గా వినిపించింది డైరెక్ట‌రు గొంతు.

“నేనేదో స‌ర‌దాక‌న్నాను. చెప్పండి అత‌గాడికి యింకా ఎవ‌రివ్వాల‌ట క‌మిట్‌మెంటు?” సీరియ‌స్‌గా అడిగింది.

“మీరు స‌ర‌దాకి అన్నదే నిజం. ప్రొడ్యూస‌ర్ కొడుకు గే అంట‌. నా క‌మిట్‌మెంటు కావాలంటున్నాడు..” డైరెక్ట‌రు గొంతులో కోపం బాధ త‌న్నుకొస్తున్నాయి. ఈసారి ఆమె నిజంగానే షాక్ అయ్యింది.

రెండు నిముషాలు మౌనం రాజ్య‌మేలింది.

మూడేళ్లు. అద్భుత‌మైన క‌థ చేతిలో వుంచుకోని కూడా కుక్క‌లాగా తిరిగాను. చివ‌రికొక‌డు దొరికాడ‌నుకుంటే.. ఛీ.. ఇలాంటి లం.. డుల వ‌ల్లే ఇండ‌స్ట్రీ సంక‌నాకిపోయింది”. ఏడుపు త‌న్నుకొస్తున్న‌ట్టు అత‌ని గొంతులో జీర‌.

మీరేమీ అనుకోనంటే వొక మాట చెపుతాను, సందేహిస్తూ అడిగింది.

చెప్పండి అన్నాడు.

“నిజంగా మీ స్టోరీలో అంత మేట‌రుంటే, వొక్క సినిమాతో ఎక్క‌డికో వెళ్లిపోతారు. మ‌ళ్లీ మ‌ళ్లీ యిలాంటి క‌మిట్‌మెంట్ల అవ‌స‌రం రాక‌పోవ‌చ్చు, క‌దా?

అవును, త‌న‌మీద ఆ అమ్మాయికి ఆ మాత్రం న‌మ్మ‌కం వుండ‌డం అత‌నికి కాస్త ఊర‌ట‌నిచ్చింది. ఈ వొక్క‌సారికీ క‌మిట్‌మెంట్ యిచ్చేయొచ్చుగా.  ?”  తాపీగా అంది హీరోయిన్‌.

“ఛీఛీ.. ద‌రిద్ర‌పుగొట్టు డైరెక్ష‌న్ ఛాన్స్ కోసం వొక మ‌గోడితో ప‌డుకుంటాడా ఎవ‌డైనా? ”  కోపంతో అత‌ని మొహంలో న‌రాలు పొంగుకొస్తున్నాయి.

ఏం, అందులో అంత కానిప‌నేముంది?

అస‌లు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? అత‌న‌లా స‌డెన్‌గా ఏక‌వ‌చ‌నంలోకి దిగ‌డం ఆమెకి న‌చ్చ‌లేదు. “ప్రొడ్యూస‌రుతో ప‌డుకోడానికి నేను సిద్ధ‌ప‌డ‌డంలా? అలాగే నువ్వూ. తేడా ఏముంది?” అంది.

“ఆడ‌ది మ‌గాడితో ప‌డుకోవ‌డం, మ‌గాడు మ‌గాడితో ప‌డుకోవ‌డం వొక‌టేనా?”

“అదే ఎందుక్కాదో చెప్ప‌మంటున్నా”.. ఆమె గొంతులో సీరియ‌స్‌నెస్ చూసి అత‌ను కాస్త జంకి, మ‌ళ్లీ మీరు లోకి వ‌చ్చాడు.

“మ‌గాడు మ‌గాడితో ప‌డుకోవ‌డం సృష్టిధ‌ర్మానికే విరుద్ధం” అన్నాడు. స‌మ‌యానికి సృష్టిధ‌ర్మం అనే ప‌దం త‌ట్టినందుకు కించిత్ గ‌ర్వించాడు కూడా.

“ఒక ఆడ‌ది యిష్టం లేకుండా వొక మ‌గాడితో ప‌డుకోవ‌డం మాత్రం సృష్టి ధ‌ర్మానికి వ్య‌తిరేకం కాదా?”

“వ్య‌తిరేకం ఎలా అవుతుంది? ఆడ‌దీ మ‌గాడూ క‌లిసి ప‌డుకోవ‌డం, సెక్సు సుఖాన్ని అనుభ‌వించ‌డం, క‌డుపు చేయించుకోవ‌డం, పిల్ల‌ల్ని క‌న‌డం యిదంతా అనేక యుగాలుగా జ‌రుగుతూ వ‌స్తుందేగా”.. అత‌నిలోని మృగం బ‌య‌టికొస్తోంది.

“నిజ‌మే. ప‌డుకోవ‌డం, క‌డుపు చేయించుకోవ‌డం, పిల్ల‌ల్ని క‌న‌డం, వొద్ద‌నుకుంటే క‌డుపు తీయించుకోవ‌డం యివ‌న్నీ యుగాలుగా జ‌రుగుతున్న‌వే. కానీ, నేను మాట్లాడేది యిష్టం లేని మ‌గాడితో ప‌డుకోవ‌డం గురించి. నేను ప్రొడ్యూస‌రు కొడుకుతో ప‌డుకోడానికీ, నువ్వు ప్రొడ్యూస‌రు కొడుకుతో ప‌డుకోడానికి నా దృష్టిలో ఎలాంటి తేడా లేదు. ఇష్టం కానిది ఏదైనా రేప్ కిందే లెక్క‌. హీరోయిన్ కావాల‌నుకుంటే నేను నిర్మాత‌తో  రేప్ చేయించుకోడానికి సిద్ధ‌ప‌డ‌తాను. అలాగే, డైరెక్ష‌న్ ఛాన్స్ కావాల‌నుకుంటే నువ్వు వాడి కొడుకుతో రేప్ చేయించుకుంటావు. నా విష‌యంలో రేప్ కానిది, నీ విష‌యంలో మాత్రం ఎలా అవుతుంది?”

నిజానికి యీ సినిమాలో చేయ‌కుండా ఆమెని వొప్పించి, తాను యింకో ప్రొడ్యూస‌ర్‌ని ప‌ట్టుకునేవ‌ర‌కూ ఆగ‌మ‌ని అడగాల‌ని వ‌చ్చాడు అత‌ను. కానీ, యీమె వాల‌కం చూస్తే అది కుదిరే ప‌ని కాద‌ని డైరెక్ట‌రుకి క్లారిటీ వ‌చ్చేసింది.

“ఇష్టం వుండి ప‌డుకున్నా, ఇష్టం లేకుండా ప‌డుకున్నా.. అస‌లంటూ ప‌ని మొద‌లెట్టాక ఆడామ‌గా మ‌ధ్య కెమిస్ట్రీ దానంత‌ట‌దే సెట్ట‌యిపోద్ది” అన్నాడ‌త‌ను.  మూడురోజుల క్రితం అమాయ‌కంగా త‌న‌ముందు కూచోని, క‌మిట్ మెంట్ అనే ప‌దం వాడ‌డానికి మొహ‌మాట‌ప‌డిన వాడేనా వీడు?

“ఏ యిద్ద‌రు ఆడామ‌గా క‌లిసి  ప‌డుకున్నా ఫీలింగ్సుతో సంబంధం లేకుండా కెమిస్ట్రీ సెట్ అయిపోద్ద‌నే నీ థియ‌రీలో వ‌న్ ప‌ర్సెంట్ కూడా నిజం లేదు. స‌పోజ్ వుంద‌నే అనుకుందాం. నువ్వు కూడా వొక‌సారి ప్రొడ్యూస‌ర్ కొడుకుతో ప‌డుకోని చూడు. ఒక‌వేళ మీ యిద్ద‌రికీ కూడా కెమిస్ట్రీ సెట్ అవుద్దేమో?”, ఎర్ర‌బ‌డిన మొహంతో కోపంగా చెప్పింది.

“ఇంత ప‌చ్చిగా మాట్లాడేదానివి ఆరోజు పెద్ద ప‌తివ్ర‌త‌లాగా పోజు కొట్టావ్‌?  సిగ్గ‌నిపించ‌డం లేదూ” వెట‌కారంగా అన్నాడు.

“ప‌తివ్ర‌త‌లాగా క‌న‌బ‌డాల‌ని తాప‌త్ర‌య‌ప‌డే వొక ఆడ‌పిల్ల‌ని కూచోబెట్టి.. నీ నోటికొచ్చిన లెక్క‌లు చెప్పి, ప‌డుకోవ‌డం చాలా ప‌విత్ర‌మైన ప‌ని అని న‌చ్చ‌జెప్పినందుకు నీకు సిగ్గ‌నిపించ‌డం లేదూ” తడుముకోకుండా బ‌దులిచ్చింది.

“ఇక నీతో నాకు మాట‌లు అన‌వ‌స‌రం. రోజుకొక‌డితో  ప‌డుకోని రోల్సే తెచ్చుకుంటావో, రోగాలే తెచ్చుకుంటావో నీ యిష్టం. నీలాంటి వాళ్లంతా చివ‌రికి తేలేది రెడ్‌లైట్ ఏరియాలోనే..”  విసురుగా లేచాడు.

“నా యిష్ట‌ప్ర‌కారం నిర్ణ‌యాలు తీసుకున్నాక నేను ఎక్క‌డ తేలతానూ అన్న‌ది నాకు అస‌లు మేట‌రే కాదు. నువ్వు మాత్రం జాగ్ర‌త్త‌. ఈసారి మ‌గ‌పిల్ల‌ల్లేని ఆడ‌నిర్మాత‌ని వెతుక్కో”.. ప‌బ్లిక్ ప్లేసు కాక‌పోయుంటే చేయిచేసుకునేవాడేమో. కుర్చీని బ‌లంగా వెన‌క్కి త‌న్ని ప‌రిగెడుతున్న‌ట్లు అక్క‌ణ్నించీ వెళ్లిపోయాడు.

****

“కాయితాల మీద సంత‌కాలు పెట్టించారా?  హీరోయిన్‌గా నిన్ను పెట్టుకున్న‌ట్టేనా?” అడిగింది త‌ల్లి. కూతురితో క‌లిసి క్యార‌వాన్లో కూచోని, జ్యూసులు ఆర్డ‌ర్‌ యిస్తున్న‌ట్టుగా రాత్రంతా వొక‌టే క‌ల‌లు ఆవిడ‌కి.

ఆవిడ ఉత్సాహం మీద నీళ్లు చ‌ల్ల‌డానికి ప్రాణం వొప్ప‌లేదు కూతురికి.

“ఆ, పెట్టుకున్న‌ట్టే అనుకో”, ముభావంగా అబ‌ద్ధం చెప్పింది.

“ఏవైందే” ద‌గ్గ‌రికొచ్చి, కావిలించుకుంటూ  అడిగింది త‌ల్లి.

“అమ్మా, నేనొక‌ట‌డుగుతాను చెప్పు. ఇష్టం లేకుండా ఎవ‌రితోనైనా క‌మిట్‌మెంటుకి వొప్పుకుంటే, ప‌డుకున్నాక అదే సెట్ట‌యిపోద్దా?”, ఏడుపుని అదిమిపెట్టుకుంటూ అడిగింది.

“నాలుగుసార్ల‌య్యాక అదే అల‌వాటైపోద్ది” అని చెప్పాల‌నిపించింది త‌ల్లికి. కానీ, కోడిపిల్ల‌లా క‌రుచుకుపోయిన కూతురి కంట్లో నీళ్లు ఆవిడ మెడ‌కి త‌గులుతున్నాయి. ఎవ‌రో గొంతు ప‌ట్టుకొని నొక్కేస్తున్న‌ట్టు, మాట‌లు బ‌య‌ట‌కి రావ‌డానికి మొరాయిస్తున్నాయి. ఆవిడ త‌న‌ ప్ర‌మేయం లేకుండానే “ఊహూ” అని గొణిగింది.

*

 

శ్రీధర్ బొల్లేపల్లి

37 comments

Leave a Reply to sridhar Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Very gripping story. మీరు మరిన్ని కధలు రాయాలి. ఈ సారి ఇంగ్లీష్ మాష్టారు చల్లని పిల్లల కథ రాస్తారని ఎదురు చూస్తాను

    • నా క‌థ మీకు న‌చ్చినందుకు చాలా సంతోషంగా వుంది. మూడో క‌థ‌గా కాక‌పోయినా.. మీరు చెప్పిన‌ట్లు ఒక చ‌ల్ల‌ని పిల్ల‌ల క‌థ రాయ‌డానికి త‌ప్ప‌కుండా ప్ర‌య‌త్నం చేస్తాను.

  • ఈ మధ్య చదివిన కథల్లో నాకు బాగా నచ్చిన కథ. మనుషుల్లో నిజాయితీ లేమి గురించి శ్రీధర్ కి ఎప్పుడూ పేచీ. తన మాటల్లో రాతల్లో ఎప్పుడూ ఈ పేచీ కనిపిస్తూనే ఉంటుంది. కథ చివర్లో కూతురు కన్నీళ్ళు తల్లి మెడ తడపడం దగ్గర ఒక్కసారి గుండె చిక్కబట్టినట్లు అనిపించింది. పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదు కదా. జీవితం బోల్డ్ గా బతకడానికి కావాల్సిన పాఠాలు చాలా నేర్పి ఉంటుంది తల్లీ కూతుళ్ళకి.. కానీ ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న వెనక ఎంత బాధ ఉండి ఉంటుంది!??. ఆలోచనల్లో grey areas ను ఇంతకన్నా powerful గా present చేయగలరా ఎవరన్నా

    • మీరు వాడిన పేచీ అనే ప‌దం నాకు చాలా బాగా న‌చ్చింది. నా క‌థ‌ల‌న్నీ పుస్త‌కం వేసుకునే రోజు వ‌స్తే ఈ పేచీ అనే మాట‌ని కూడా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణ‌ణ‌లోకి తీసుకుంటాను. Grey areas గా మ‌నం చెప్పుకునేవ‌న్నీ కొన్నాళ్ల‌కి నార్మ‌ల్ అయిపోతాయి. ఆలోచ‌న‌ల స్థాయిలో దాదాపు చాలావాటికి చోటిస్తూనే వుంటాం. కానీ మాట్లాడుకోడానికి సందేహిస్తుంటాం అనుకుంటా. ఈ క‌థ రాయ‌డం వెన‌కు మీ ప్రోత్సాహం, ప‌బ్లిష్ అయిన త‌ర్వాత వ‌చ్చిన స్పంద‌న‌ని మీతో క‌ల‌సి సెలెబ్రేట్ చేసుకోవ‌డం నాకొక ఫ్యామిలీ ఈవెంట్ లాంటిదే. థేంక్యూ.

  • ఇండస్ట్రీలో పాతుకుపోయిన కమిట్మెంట్ అనే జడ్యాన్ని మనసును మెలిపెట్టెలా చెప్పడమే కాకుండా కమిట్మెంట్ విషయంలో మగాడిలో ఉన్న హిపోక్రసీని బయట పెట్టారు.

    • థేంక్యూ బావ‌గారూ. మూర్తిమ‌త్వం వికాసం, రాజ‌కీయాలు, వ్యాపారం, సంస్కృతి.. యిలా అనేక అంశాల‌పై విస్తృత‌మైన అధ్యయ‌నం చేసిన మీరు మెచ్చుకోవ‌డం నాకు గ‌ర్వంగా వుంది. థేంక్యూ.

  • నిజంగా కళ్ళముందు జరుగుతున్నంత సహజత్వం వుంది కధనంలో….
    ఇన్ని ఆవిష్కరణలు, అద్భుతాలు జరుగుతున్నాయి విశ్వంలో..
    కానీ ఇలాంటి బాధాకరమైన అనుభవాలు తప్పటం లేదు. concept, భాష,శైలి,అంతరంగాన్ని ఆవిష్కరించిన తీరు అన్నీ బావున్నాయి. ఇలా వ్రాస్తే కధలు ఎందుకు చదవరు? All the best to the writer…
    Expecting some more from u …

    • ఇలా రాస్తే ఎందుకు చ‌ద‌వ‌రు? అన్న మీ మాట‌లు నా బాధ్య‌త‌ని రెట్టింపు చేస్తున్నాయి. ఎలా రాశానూ అని ఆలోచించుకొని, మ‌ళ్లీ అలాగే కానీ లేదా అంత‌క‌న్నా బాగా కానీ రాయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తాను.

  • Nice story naku chala baga nacchindhi writer evaro kani okka kadhalo chala points touch chesaru…..elane manchi kadhalu rayandi…

    • మీ కాంప్లిమెంట్ కి ధ‌న్య‌వాదాలు. రైటర్ ఎవ‌రో కానీ అంటారేంటి సార్‌. బొమ్మేసి మ‌రీ అంత పెద్ద‌క్ష‌రాల్లో రాశారుగా పేరు శ్రీధ‌ర్ బొల్లేప‌ల్లి అని. Just kidding.. Thanks a lot for sparing your time for me.

  • Extreme comment కావచ్చేమోగాని, తెలుగు పాఠకులకొక మొపాసా దొరికాడు.

    All the best Sridhar garu. 👍

    • చాలా పెద్ద బ‌రువు పెట్టేశారు నా మీద‌. కానీ, మ‌ధ్య‌మ‌ధ్య‌లో బ‌రువు దించుకోడానికి మీలాంటి సోద‌ర స‌మానులైన మిత్రులు వున్నారు కాబ‌ట్టీ, ధైర్యంగా ఈ ట్యాగ్‌ని మోసేస్తా. Thank you so much anna for your guidance and support. అఫ్స‌ర్ గారూ, వింటున్నారా? ఒక అర‌డ‌జ‌ను క‌థ‌ల‌య్యాక జూనియ‌ర్ మొపాసా అనో, లేక ఆంధ్రా మొపాసా అనో వేయాలి మీరు నా పేరుకి ముందు. స‌రేనా?

  • గన్ లోనుండి దూసుకొచ్చే ‘బుల్లెట్’లాంటి కథ రాశారు సార్.👍

    • థేంక్యూ సో మ‌చ్ అండీ. ఇలాంటి కాంప్లిమెంట్స్ చ‌దివిన‌ప్పుడు బ‌ద్ధ‌కం వ‌దిలించుకొని, మ‌ళ్లీ యింకో మంచి క‌థ రాయాల‌న్న స్ఫూర్తి క‌లుగుతుంది.

  • నువ్వు ఇరగదీస్తావ్..ఇలాగే ముందుకు పో. స్టోరీ సూపర్.

  • నువ్వు ఇరగదీస్తావ్..ఇలాగే ముందుకు పో. స్టోరీ సూపర్. లవ్యూ శ్రీధర్

    • నా మొద‌టి క‌థ సారంగలో వ‌చ్చిన‌ప్పుడు మీరు ఫోన్ చేసి అభినందించిన క్ష‌ణాలు నాకు చాలా అపురూప‌మైన‌వి గురూగారు. ఈరోజు కాదు, ప‌దేళ్ల క్రితం టీవీ9 ఆఫీసులో క‌లిసిన మొద‌టిక్ష‌ణం నుండీ మీరు నా పైన వాత్స‌ల్యం చూపిస్తూనే వున్నారు. దానికి అర్హుణ్ని కావ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను.

  • తెలుగులో సినిమా రంగం నేపథ్యంలో కథలు అరుదుగా కనిపిస్తాయి.అలా చూస్తే ప్రయత్నం బావుంది.నేరేషన్ బావుంది
    సినిమారంగంలో కమిట్మెంట్ గురించి చెప్పిన రచయిత
    ప్రధాన పాత్ర రూపురేఖలను సడెన్ గా మార్చినట్టనిపించింది
    ఇంకొంచెం subtle గా చెప్పాల్సిందేమో

    • సినిమా నాకున్న బిగ్గెస్ట్ పాష‌న్ అండీ. Everything/anything about cinema intrigues me. నెరేష‌న్ న‌చ్చినందుకూ, క‌థ గురించి కామెంట్ పెట్టినందుకూ సంతోషం. మీరు చెప్పింది నిజ‌మే. ఇంకాస్త subtle గా వుండివుండొచ్చు. పాత్ర‌ల స్వ‌భావంలో వ‌చ్చిన ఆక‌స్మిక‌మైన మార్పు విష‌యంలో కూడా మీ సూచ‌న గుర్తు పెట్టుకుంటాను.

  • Don’t want to discourage you, so plz take this whole piece in positive way sir , డిస్క్లైమర్ ముందే ఎందుకు అంటే , మొదటి సారి చదువుతున్నాను మిమ్మల్ని , పొగడ్తల చినుకుల్లో రియాలిటీ గొడుగులు కొన్ని సార్లు అవసరం అని.

    ఈ కథ స్క్రీన్ బై స్క్రీన్ చూస్తున్నట్లు ఉంది కానీ కథనం లో కథ తాలూకా బేసిక్ trait ఆర్ద్రత మిస్ అయింది ఏమో అనిపిస్తుంది . క్లుప్తంగా చాలా వెబ్ సిరీస్ లేదా షార్ట్ మూవీస్ కాంపాక్ట్ మోడ్ లో యూ ట్యూబ్ థంబ్ నైల్ లా చదువుతున్నట్లు.

    “Me too” phase 2 స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ అన్ని మేజర్ భాషల సినిమా రంగాల్లో ott based గా ఈ కథలు వచ్చేశాయి. రాజీవ్ ఖండెల్వాలా లాంటి వాళ్ళు సంవత్సరం క్రితమే మీడియా కి చాలా ఇంగ్రడియెంట్స్ అందించారు . సో థీమ్ , చెప్పే పద్ధతి రెండూ పాత బడ్డాయి.

    కాని బెస్ట్ పార్ట్ ఒకటి ఉంది .Ethnic wear కుచ్చిళ్ళ సర్దుబాటు లో ఆగిపోయిన కథలు లేదా , అతను ఆమె ప్రియుడు/ ప్రియురాలు – my own freaking emotions లాంటి కథలు చదివి చదివి అక్షరం అంటే ద్యావుడా మళ్ళీ ఇంకో కథా అని భయపడే చోట intresting experience for telugu reader .

    ప్రపంచం సిడ్నీ షెల్డన్ చదివే కాలానికి మనం అవే కథలు యండమూరి వాయిస్ లో చదువుకొని “అబ్బా భలే ” అనుకున్న తెలుగు రీడర్స్ గా నిజానికి మనకి విమర్శ చేసే హక్కులు లేవు కానీ hmmm కొన్ని సార్లు మరక మంచిదే గా.

    నిశీధి !

    • మొత్త‌మ్మీద నా క‌థ కొంత‌వ‌ర‌కూ మీకు న‌చ్చింద‌ని అర్థ‌మైంది. చాలా సంతోషం. ర‌చ‌యిత‌గా కాకుండా వొక పాఠ‌కుడిగా చూస్తే బ‌హుశా ఈ క‌థ గురించి నాక్కూడా మీకు క‌లిగిన అభిప్రాయ‌మే క‌లిగుండేది. ఒక క‌థ మొద‌లెట్ట‌గానే దానిని ఎంత త్వ‌ర‌గా కంక్లూడ్ చేద్దామా అన్న ఆరాటం వుంటుంది నాకు. టీవీ ఛానెళ్ల‌కి స్క్రిప్టులు రాయ‌డం, ఎఫ్బీలో పొడ‌వాటి పోస్టులు పెట్ట‌డం త‌ప్ప ఎప్పుడూ కుదురుగా కూచోని క‌థ‌లు రాసింది లేదు. ఆ అనుభ‌వ రాహిత్యం క‌న‌బ‌డ‌కుండా మేనేజ్ చేయాల‌నుకున్నాను గానీ, దొరికిపోయాన‌న్న‌మాట‌. ఆప‌కుండా రెగ్యుల‌ర్ గా రాస్తూ పోవాల‌న్న‌ది ప్ర‌స్తుతానికి సంక‌ల్పం. (ప్ర‌స్తుతానికి అన్న‌మాట అఫ్స‌ర్ అన్న‌య్య కంట‌బ‌డ‌కుండా డిలీట్ చేసేయాలి మ‌నం). ఇక‌ముందు కూడా నా క‌థ‌లు చ‌దివి, మీ వొపీనియ‌న్ నిష్క‌ర్ష‌గా చెపుతార‌నీ, నాలుగు మంచి క‌థ‌లు రాయ‌డానికి మీ స‌ద్విమర్శ‌తో స‌హ‌క‌రిస్తార‌నీ ఆశిస్తాను. థేంక్యూ.

  • శృంగారం పవిత్రమైనది. అది సృష్టి కార్యం.
    ప్రేమతో నిమిత్తం లేకుండా డబ్బు కోసం, అవకాశాలకోసం ఇతరులతో శృంగారంలో పాల్గొంటే ఆ కార్యాన్ని అపవిత్రం చేసినట్లే.

    ఇద్దరు వ్యక్తులు శృంగారంలో పాల్గొనడానికి కావాల్సిన ప్రాతిపదికల గురించి ఈ కథ చాలావరకు సహేతుకంగానే చర్చించింది. మంచి కథ.

    సినిమాల్లో అవకాశాలను ఏంచేసైనా సంపాయించుకోవాలని వెంపర్లాడే అమ్మాయిలు, ఇప్పటికే సినిమాల్లో నటిస్తున్న ఆడా మగా ఈ కథను చదివితే మంచీ చెడ్డా కాస్తయినా తెలిసొస్తాయి.
    సినిమావాళ్ళకనే కాదు, బయట కూడా ప్రేమతో పనిలేకుండా కేవలం కామంతో పేట్రేగిపోతున్న యువతతో పాటు మరెవరికైనా మంచిని సుాచించే కథే!

    • ఏదో అదాటున వ‌చ్చిన ఆలోచ‌న‌ని అనాలోచితంగా కాగితం మీద పెట్టేశాను. అది మీలాంటి వారి ప్ర‌శంస‌కి పాత్ర‌మైనందుకు సంతోషంగా వుంది. సందేశం యివ్వాల‌నే వుద్దేశం కానీ, యిచ్చే అర్హ‌త వుంద‌న్న ధైర్యం కానీ నాకు లేవు. కానీ, మీర‌న్న‌ట్టు నిజంగా నా క‌థ‌లో అలాంటి సందేశం వుండి వున్న ప‌క్షంలో అది నాకు బోన‌స్ అన్న‌మాట‌. థేంక్యూ సో మ‌చ్ స‌ర్‌.

  • సినిమా జీవితం లో చెత్త చాలా క్లియర్ గా చూపించారు. కధన నడపిన తీరు కూడా చాలా బావుంది.

    • థేంక్యూ వెరీ మ‌చ్ స‌ర్‌. ముందు ముందు కూడా మీ అంద‌రికీ న‌చ్చేవిధంగా రాయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను.

  • ఆడవాళ్లకు చాలా తేలిగ్గా చెప్పే మాటలు లోతుగా ఆలోచిస్తే చాలా కష్టంగా ఉంటాయి , ముఖ్యంగా జెండర్ ఈక్వాలిటీ గురించి చూస్తే మనలో తెలియకుండానే చాలా పురుషాధిక్యత మనసు ఉంటుంది ఎంత నీతులు వల్లించినా మనదాక వచ్చేసరికి అంగీకరించడం చాలా కష్టంగా ఉంటుంది
    చాలా బాగా వ్రాసారు సర్, ఇలాగే ఆలోచింపచేసే మంచి కథలు వ్రాయాలని, రాస్తారని కోరుకుంటున్నాను .
    God bless you

    • నిజ‌మే స‌ర్‌. ఒక conscious effort పెట్టి, నిజాయితీగా ఆలోచించుకుంటే త‌ప్ప మ‌న భావ‌జాలం ఎలా వున్న‌దీ మ‌న‌కి అర్థం కాదు. క‌థ‌కి బ‌య‌ట మ‌నంద‌రి జీవితాల్లో జ‌రుగుతున్న వాటితో పోలిస్తే , నిజానికి యిక్క‌డ ప్ర‌స్తావించ‌బ‌డింది చాలా చిన్న అంశం. మార్పు దిశ‌గా యింకా మొద‌టి అడుగు కూడా ప‌డింద‌ని అనిపించ‌దు నాకు. క‌థ మీకు న‌చ్చినందుకు సంతోషం. త‌ప్ప‌కుండా మంచి క‌థ‌లు రాయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు