సృజన సుమాలు ముకులించినవేళ
అగ్ని ఆరిన ఆచరణల పగుళ్లనుంచి
నలుసులా యెపుడో మొదలైయుంటుంది
జాతి మూలుగుల్లోకి చేరివుంటుంది
వైరుధ్యాలు గమనించే నిశితదృష్టికి
భావివినాశనంలా దేశ దరులను కూల్చే
వేల శాఖల తమోవృక్షం వేళ్లూనుతూ
అవగతమయ్యే వుంటుంది.
చీకటిలో కలిసిపోయిన క్రీనీడలా
దీపపు సమ్మెను ఆవరించిన అంధకారంలా
భద్రలోకపు అంతశ్చేతనలోకి
ఇతరమనే దారువు చేవదీరివుంటుంది.
అవును నిజం
ఈదేశ సామరస్య యవనిక మీదకు
‘ఈవిల్ ‘యెలానో వచ్చి వాలింది.
ఈనేల సహృదయ ఆవరణలోకి
క్షుద్రపాదు యెలానో పెంపుదలైంది
ఈజాతి సహజీవనంలోకి
ఒక అపశృతి వైరస్ లా గూడుకట్టింది.
అవును నిజం
అజ్ఞానానికి ఆధిపత్యం సంక్రమించినపుడల్లా
ఒక దుష్టాంగం వేలశిరసులెత్తుతుంది
ఒక జాతి బహుళత్వానికి ఏకత్వ వ్యాధి సోకినప్పుడల్లా
ఒక జీవనది ఆవిరై మేటలు వేస్తుంది
దేశసౌభాగ్య ఆలింగనాల్లోకి
భావదారిద్ర్య లేమి చొరబడినప్పుడల్లా
ఒక విధ్యేషపు వెల్లువ కట్టలు తెగుతుంది.
2
ఒక వలసప్రభువు చలికాగిన నెగడు
మన వూరిని మతకలహమై కాల్చినపుడు
ఒక పరాయీ పాలకుడు ఎగదోసిన విభజన
మన నాడును నిలువుగా చీల్చినపుడు
జాతుల హననవాదానికి బీజాలు దిగి
విషవిధ్వేష జీవి పురుడుపోసుకొని వుంటుంది.
సనాతన ఊడలమర్రి తొర్రలో మనువత్వం
తామరతంపరలా పిల్లల్ని పెట్టివుంటుంది
పిల్లిమొగ్గలేస్తున్న ఆ లార్వాల వారసత్వమే
ఊరూవాడా అసహనమసి మడుగుల్ని తవ్వుతూ
సమైక్య వారధుల్ని తొలుస్తూ వుంటుంది.
ఒకానొక రథయాత్రలో దండయాత్రలు చేసి
గుమ్మటాలు కూల్చి గోద్రాలు రగిల్చి, శిబిరాలను కూర్చి, సమూహాలను దృవాలకు నెట్టి
అప్రతిహత భయదుంధుభిలను మోగిస్తూ వుంది
అనేక రూపాలతో అనేక ఆంక్షలతో
నిర్బంధాలను పరివ్యాప్తం చేస్తున్నది
అనేక సంకేతాలతో అనేక నిషేధాలతో
అనైక్యతకు దారులు పరచినది.
3
దినదిన మనుగడలాంటి బతుకాట
క్షణ క్షణ పోరాటాల నెత్తుటాట
కుగ్రామమైన ప్రపంచపు ఉన్మత్తక్షేత్రాలలో
రెక్కలు సాచిన చారలడేగ సమక్షంలో
రెపరెపలాడుతున్న కాషాయ ఛత్రఛాయ
నాగరికతా స్తరాల మధ్య ఎడమను
మరింత పెంచేవుంటుంది.
హెచ్వన్ వీసా సాధన గెలుపుకు సంకేతమవుతున్న కాలాన
వీకెండ్ లాలసే జీవితాన్వేషణకు గీటురాయి
అవుతున్న లోకాన
ఆదర్శాలకు పణంగా సుఖవిలాసాన్ని వొడ్డాల్సిన
అవసరం లేదనే, బతకనేర్చినతనమొకటి
భద్రలోకాన్ని వొప్పించే వుంటుంది.
సంస్కృతుల సంఘర్షణలో
ఏ కాలంలో ఏ శక్తులు
ఎవరిని పరాజితుల్ని చేసి
ఎవరికి సేవకులుగా మార్చి
పురుషసూక్తాలు రాసుకున్నారో
ఆ అవమానాల్ని మరచిన బహుజన లోకం అందలాల వేటలో పడి
ఆత్మగౌరవం విస్మృతిలోకి జారే వుంటుంది.
ఈ దేశపు సప్తవర్ణపు తోటలో
నోరెత్తని మల్లెలు నేలరాలుతున్నవి
ప్రతిఘటించే నెలవంకలు నింగిచేరుతున్నవి
తోట మధ్యన నిషిద్ధ ఫలాల తీపిలో
మధ్య తరగతి భద్రలోకం
ఊయలలూగుతువున్నది.
నలుచెరుగులా మొలిచిన చెరపు
అదే ప్రధాన కాపులా పెరిగిన కలుపు
ఆలోచనా చేలలో విరగ కాసిన
ధ్వేషఫలాల వెగటును కమ్మని రుచిలా భ్రమసి
ఈ నేల వైవిధ్యతనే తోసిరాజని భద్రలోకం అఖండ కలలు కంటూవున్నది.
ఊయలలూపే మత్తు వూపి వూపి చివరకు
మంటల్లో గిరాటు వేస్తుందని చరిత్ర యెన్నడో చెప్పింది
క్రూరత్వాల భ్రమణంలో తిరిగి తిరిగి తమ
కాళ్లముందు తామే కూలడం తథ్యమని
కాలం సాక్ష్యంగా చెబుతుంది
శాంతి కోసం అక్కరపడే కాలానికి
తమ సంతానపు రక్తవర్ణ చిత్రం కళ్లకు కడుతుంది
దేశం రాల్చిన కన్నీటిరాశుల్లో, విస్థాపిత ఆక్రోశాల్లో
కొట్టుకుపోయే తరాల పీడకల వెన్నాడుతుంది.
సంస్కృతీసంపదలన్నీ మూలవాసుల నుంచి
పెంపైన వారసత్వాలవేనని గ్రహించిన నాటికి
ప్రేమలా అంకురించడానికి
కాలాన్ని జ్ఞాననేత్రంలా సన్నద్ధం చేయమంటుంది
కలసిజీవించడాన్ని కొత్తగా చిగుర్చమంటుంది
శాంతి శాంతి శాంతత కోసం
దేశదేహం నిత్యకలలు కంటుంది.
*
ఎంత సల సలా మరిగిన హృదయంతో రాసి ఉంటాడీ కవితను కవి ! ఎన్ని కన్నీళ్ళ సముద్రాలలో మునకలేసి ఒడ్డునే పడి చేపలా గిల గిలా కొట్టుకుని ఉంటాడీ కవి ! వ్యవస్త మీద ఎంత నిశితమైన చూపున్నది. తన చుట్టూ ఉన్న లోకం ఏం పట్టించుకుంటోంది ? ఎటువైపు ఒరిగిపోతోంది ? అంతా కళ్ళముందుంచిన కవిత.
మీ పదాల సోయగమూ, వాటి కూర్పునే చూడాలి సర్. శిల్పాన్నెంత సుకుమారంగా తీర్చిదిద్దుతారో మీరు ! ఇట్టే తెలిసిపోతుంది. బాగుంది కవిత. అభినందనలు.
పోయెమ్ బాగుంది✊
వెంటాడే పాదాలు ఎన్నో..
సంస్కృత పదాలు తగ్గించుకోలేరా?