క్రికెట్ కిట్టు

మూడర్రల మా చిన్న ఇల్లు మొత్తంగ రోడ్డుమీదికే ఉంటది. ముందలి రూం తలుపునించి మూడు మెట్లు దిగినమంటే అది రోడ్డే. ఆ ముందలి రూంలనే ఒక సగం షాపు, ఇంకో సగం ఇల్లు. వేర్వేరని చెప్పగూడదుగానీ.. ఇంట్లనే షాపు. రాత్రిపూట ముందలి రూంలనే పండుకున్నమంటే గయ్యగయ్య బండ్ల సప్పుడు వినిపిస్తనే ఉంటది. మా అమ్మయితే ఎంత రాత్రికాడ పండుకున్నా పొద్దుపొద్దుగాల్నే లేశి బయట వాకిలి ఊడ్శి సాంపి జల్లి ముగ్గేస్తది.

ఇల్లు, షాపు ఒక్కటేజేబట్టి పొద్దున లేస్తే ఎవలో ఒకలు చాపత్త అని, చక్కర, పాలని వస్తనే ఉంటరు. అట్ల గిరాకీ ఎవలన్న వస్తుంటే.. నన్ను లోపలికి పోయి పండుకోమనేది మా అమ్మ. ఒక్కోసారి నాకేదన్న బుద్ధిపుడ్తే అమ్మతోటే లేశి చాయ్ తాగుకుంట పొద్దుగాల్నే వచ్చే గిరాకీ నేనే చూస్తుండె.

ఒక చల్లటి చలికాలం. నేను ముసుగుగప్పి పండుకున్న. అప్పటికింక ఆరుగూడ గాలే. సాంపి జల్లుతానికని లేశిన మా అమ్మ, ఇంట్లకొచ్చి నన్ను లేపి – “ఆ ముస్లిమోల్ల పిలగాడు సందుకాడొచ్చి నిలబడ్డడురా..” అన్నది. అమ్మకు వాని పేరు పలకరాలేదనుకుంట. నేను లేశి బయటికొచ్చి చూసిన.

“నేను పిలుస్తుంటేగూడ వస్తలేడురా” అన్నది అమ్మ.

నేను వాని దగ్గరికి పోయిన. “ఫిర్‌దోస్ ఏమైందిరా?”

వాడు ఆ సందు మొదట్ల ఉన్న స్తంభాన్ని పట్టుకొని – “మ్యాచ్ వస్తుంటదిరా” అన్నడు. ఇదేం క్రికెట్ పిచ్చిరా నాయనా?

అప్పుడేదో న్యూజిలాండ్ – ఇండియా మ్యాచులు నడుస్తున్నయి. తెల్లారుగట్లనే వచ్చేది. “సరే, దా” అని ఇంట్లకి తీసుకొచ్చి టీవీ పెట్టిన. అప్పట్ల నాకు తెలిసి మా ఇంటికాడ ఉన్న ముస్లిమోళ్ల ఇండ్లల్ల టీవీ అన్నది లేకపోయేది. క్రికెట్ మ్యాచ్ వస్తున్నదంటే మా ఇంటి ముందల పెద్ద గుంపు తయారయ్యేది. ఇంటికి ఎదురుంగనే ఉన్న మసీదుల నమాజ్ అయిపోంగనే.. క్రికెట్ ఉన్నదంటే మా ఇంటికొచ్చేది చానామంది. ఈ ఫిర్‌దోస్ గాడు నాకు దోస్త్ ఎట్లయిండన్నది గుర్తులేదు. వాని ముఖం ఎట్ల ఉండేది, ఎన్ని రోజులు నాతోటి కలిసున్నడు, ఏ ఊర్నించి వచ్చిన్రు ఆళ్లు? – ఏదీగూడ గుర్తుకులేదు. ఆళ్లు మన దిక్కోళ్లు కాదని అమ్మ చెప్పుడు మాత్రం తెల్సు. వాడు అప్పట్ల ఎట్ల మాయమైండు, ఎక్కడికి పోయిండో తెల్వదుగానీ.. ఎప్పుడు క్రికెట్ ఆట గుర్తొచ్చినా ముందు ఫిర్‌దోస్ గాడే గుర్తుకొస్తడు.

ఒక్కపూట బళ్లు ఇచ్చినప్పుడు ఎర్రటి ఎండలగూడ క్రికెట్ ఆడేది. ఎండాకాలం సెలవులు వచ్చినయంటే పొద్దుగాల ఆరింటి నించి ఎండొచ్చేదాంక – మళ్ల నాలుగ్గంటలకు ఎండ దిగుతుంటే స్టార్ట్ చేసినమంటే చీకటి పడేదాంక.. ఎంత అలిపిరొచ్చినా ఆడుతనే ఉండేది.

మా అన్నకు పిల్లలందర్ని కూసోబెట్టి క్రికెట్, సిన్మాల గురించి చెప్పుడంటే ఎందుకిష్టమో తెల్వదుగానీ ఆరేడేండ్లు వచ్చేసరికే సిన్మాలు, క్రికెట్ నేర్పిచ్చిండు. “క్రికెట్ ఆడుదమారా?” అనంగనే ఉరికేది. టీవీల క్రికెట్ వస్తున్నదంటే.. అప్పట్ల ఉన్న ఒక్క దూరదర్శన్ కోసం.. ఎట్ల యాంటినా తిప్పితే షేక్‌గాకుండ టీవీ వస్తదో లెక్కలేసుకునేది. అదేందోగానీ ఒక్కో సిరీస్‌కి ఒక్కో దగ్గర నిలబెడితే టీవీ మంచిగ వచ్చేది. ఇంటిమీదికెక్కి యాంటినా కదిలించుకుంట – “వస్తున్నదా? వస్తున్నదా?” అని అడుగుతుంటే.. వస్తున్నదని చెప్తానికి ఎగిరి అరుసుకుంట నవ్వుతుండె.

మా అన్న ఎట్లాంటోడంటే.. ఏం చేసైనా సరే క్రికెట్ వస్తున్నదంటే టీవీ వచ్చేటట్టు చేసేటోడు. నాకే కాదు, అక్కకు, ఇంటి పక్కల ఉండే నా దోస్తులకుగూడ క్రికెట్ ఎక్కించిండు మా అన్న. తొంభైళ్ల పుట్టిన పిల్లలకు క్రికెట్ నరం నరంల ఉంటదని ఎవలో అన్నట్టు మాకైతే నిజంగనే అట్లనే ఉండేది. మేం క్రికెట్ చూసేకాడ్నించి.. ఎప్పుడైతే ఒక పిచ్చి లెక్క ఆడుడు మొదలుపెట్టినమో.. అప్పుడే ఇప్పుడుంటున్న ఈ మూడర్రల ఇంటికి మారినం. మా ఇంటి ఎదురుంగనే ఆమీనా మసీదు ఉందని చెప్పినగదా, ఆ మసీదుకి, దాని పక్కన ఇంకో ఇంటికి మధ్యన మొత్తం ఖాళీ ప్లేసు. ఆ ఖాళీ ప్లేసే మాకు గ్రౌండు. మసీదు నీడ పడేంత దూరం ఎవ్వలూ ఇండ్లు కట్టుకోరని చెప్పేటోళ్లు. అదెంత నిజమో తెల్వదుగానీ, మాకైతే గ్రౌండు దొరికింది.

ఇటుపక్కనోళ్ల ఇంటిగోడకి బొగ్గుతోటి గీసినయే వికెట్లు. ఆనించి సక్కగ మసీదు గోడకి కొట్టినమంటే సిక్సు. మసీదు మీద పడ్డదంటే ఔటు. అటు పక్క, ఇటు పక్క కంపచెట్లు ఉండేటియి. ఆ కంప చెట్లల్ల పడితే టూ-డీ. మా ఇంటికి ఎదురుంగనే పెద్ద మోరి ఉన్నది. ఆ మోరి మీద్నించి దుంకితే గ్రౌండ్‌ల పడుతం.

“ఎయ్, ఈ పెద్ద మోరి ఏడ దుంకుతంరా..” అనుకుంటే.. మసీద్ గోడని పట్టుకొని మోర్లనే రాళ్ల మీద కాళ్లుపెట్టుకుంట పోవాలి. ఆ పెద్ద మోరి మేం పిల్లలం దాటాల్నంటే.. మా ఇంటికానించే రోడ్డు మీద ఏ బండ్లు రానిది చూసి ఒక పదడుగులు ఉరికి ఉరికి ఎగిరి దుంకాలి. అటు ఇటు అయ్యిందంటే లటక్కున ఆ మోర్ల పడుతం. నేను రెండుసార్లు పడ్డ. మా అన్నసొంటోళ్లు అయితే ఇట్ల నడిచినట్టే దాటేది.

ఫిర్‌దోస్ గాడు ఉన్నప్పుడు పొద్దునలేస్తే ఆ గ్రౌండ్‌లనే ఉండేది. ఆళ్లు నల్లగొండ వదిలేసి పోయినంక వాడెప్పుడూ కనిపియ్యలేగానీ, మా స్కూల్ దోస్తులందరికి ఇదే గ్రౌండ్ అయ్యింది. మా ఇల్లు ముందల్నించే అందరికి అడ్డా. క్రికెట్ ఆడుడుతోటి ఇంకెక్కువైంది.

పొద్దస్తమాన అందులనే ఉంటుంటే ఇంట్ల తిట్లు పడేది. నేను ఫస్టు ర్యాంకే వచ్చేదిజేబట్టి నన్ను అమ్మ ఏమనేది కాదు. కానీ ఒక్కొక్కళ్ల అమ్మయ్యలు వచ్చి ఉరికిచ్చి కొట్టేది. “గాడిది కొడకా.. సదువుకోవారా అంటే..” ఇట్ల ఎవ్వల్ని కొడ్తానికి ఎవ్వలొచ్చినా అందరూ పరార్.

అట్లనిజెప్పి మా ఆటని ఎవలన్న ఆపుతరా అన్నట్టు ఆడుతనే ఉండేది.

ఆ గ్రౌండు మీదినించే ఒక ముసలాయన రోజూ నమాజ్ చదువుతానికి పోతుండె. మసీదు దిక్కు మేం బాల్ కొడుతున్నమని తిట్టని తిట్లు తిట్టేది. పాపం ఆ ముసలాయన అటు దిక్కు వస్త వస్తనే.. “అరెయ్, క్యా హై రే యే బచ్చే..” అని మమ్మల్ని కట్టె పట్టుకొని ఉరికిచ్చేది. మేం ఆ కొస్సేపు అటూ ఇటూ ఉరికేది. ఆయన మసీదుల పడంగనే మళ్ల షురూ. మమ్మల్ని రెండు మాటలంటానికి ఆయసపడేటోడు – ఆ కొస్సేపటికే – “అల్లాహుక్బరల్లా..” అని అరిస్తేమటుకు వాడకట్టంత అరిచినట్టు వినిపిచ్చేది.

ఆ ముసలాయన తప్ప మమ్ముల ఆ గ్రౌండుల క్రికెట్ ఆడుతానికి ఎవ్వలూ గొడవ పెట్టరు. కానీ బాల్ పోయిందంటే ఉన్నదే కథ. ఎవడన్న గట్టిగ కొట్టేటోడు మసీదు మీదికి కొట్టిండంటే.. ఆ గేటెక్కి, గోడ పట్టుకొని మసీదు మీదికెక్కి బాల్ కిందికియ్యాలి. అట్ల మసీదు మీదికెక్కి బాల్ తీసేటోళ్లు ముగ్గురు నలుగురికి ఎక్కువ లేరు. బాల్ మోర్లబడితే కొట్టినోడే తియ్యాలి. కంప చెట్లల్ల పడ్డా కొట్టినోడే తియ్యాలి.

మేం గోడకి వికెట్లు గీసిన ఇల్లున్నదా? పోయి పోయి ఎవడన్న ఎనుకకి.. అంటే ఆ ఇంట్లకి కొడితే ఇగ బాల్ పోయినట్టే. బాల్ పోతే కొనుడు అంత ఈజీ కాదు. అందరూ తలా రూపాయి ఏసుకున్నా మామూలు రబ్బరు బాలే వచ్చేది. గట్టిగ ఉండే టెన్నిస్ బాల్‌తోటి ఆడాల్నని, క్రికెట్ బ్యాట్ ఒకటి ఉంటే బాగుంటదని కలగనేది మేమందరం.

పెద్ద కట్టకాడ ఎప్పుడన్న ఆడుతానికి పోతే.. అక్కడ.. అప్పటిదాంక చెక్కతోటి మేమే బ్యాట్ తయారుచేసుకొని ఆడిన మాకు – నిజం బ్యాటు, చేతులకు గ్లౌజులు, వికెట్లు చూస్తే – “మనకి ఒక క్రికెట్ కిట్ ఉంటే ఎంత బాగుంటదిరా” అనుకునేది.

అయితే అది పెద్దోళ్ల కథలేరా అనుకుంటుంటేది ఎమ్మటే. ఎప్పుడన్న ఎక్కడన్న మంచి చెట్లు కనిపిస్తే – వాటిని ఇర్శి వికెట్లు తయారుచెయ్యాలనుకునేది. మా బ్యాట్ విరిగినదంటే మనకు తెల్సిన వడ్లోళ్లు ఎవలున్నరని దోలాడేది.

సంజయ్ అన్న ఇంటి ముందల నిలబడేది. బ్యాట్‌కి పనికొచ్చే చెక్కని మేమే తీసిచ్చి దాంతోటి బ్యాట్ చెయ్యమని అడిగేది.  అట్లనే ఆ గ్రౌండుకి దగ్గర్లనే ఒక వడ్లాయనది కట్టెల మండి ఉండేటిది. ఆయనకాడికి పోయి అడిగితే తిట్టి పంపించిండు ఒకసారి.

మేం ఎంత తెలివిగల్లోళ్లమంటే.. “అన్నా, నువ్వు సిన్మా హీరో లెక్కనే ఉన్నవు!” అనేది. అదేందోగానీ అట్ల అనంగనే ఆయన బ్యాట్ చేసిచ్చేటోడు. చెక్క బ్యాటు, అందరు పైసలు జమేస్తే బాల్ – ఇవైతే దొరుకుతున్నయి. ఎప్పటికన్న మాకంటూ ఒకటి క్రికెట్ కిట్ ఉంటదా అనుకునేటోణ్ని. ఆశగ ఉండేది.

అగో.. అప్పుడే రెండు వేల నాల్గు ఎన్నికలొచ్చినయి. మా పిల్లలందర్ని పిల్శి ఒక అన్న – “అరెయ్, ప్రచారంల తిరుగుతరా?” అని అడిగిండు.

“ఏం ప్రచారం అన్నా?” అని మేమంటే – “చెయ్యి గుర్తుకే మన ఓటు అని తిరగాల్రా.. అంతే” అన్నడు. అట్ల తిరిగితే ఒక క్రికెట్ కిట్టుగూడ ఇస్తమని చెప్పిండు.

మేం ఆగుతమా ఇగ? రోజూ ప్రచారానికి పొయ్యేది. “కోమటిరెడ్డి నాయకత్వం వర్థిల్లాలి”, “చెయ్యి గుర్తుకే మన ఓటు” అని గొంతు పొయ్యేటట్టు అరుచుకుంట తిరిగేది.

“కోమటిరెడ్డీ వస్తున్నాడు పల్లె పల్లెకూ..” అని పాటలు కూడా బట్టీ కొట్టి పాడేది.

పొద్దుగాలంతా ఆట.. పొద్దుగూకినంక ప్రచారం. క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా పాటలు నోట్లనించి పోకపొయ్యేటివి.

మా గ్యాంగులనే ఒకడు – “నోరిళ్లని వాటరుకై పోరాటం చేశాడు.. నిరాహార దీక్షలతో నిధులను సాధించాడు” అని పాడితే అందరం అట్లనే పాడేది.

ఒకసారి ఆడుకుంట ఆడుకుంట అల్శిపొయి – “అరెయ్, క్రికెట్ కిట్టు వచ్చినంక ఈ చెక్క బ్యాట్‌తోటి పనే ఉండదురా. రన్నర్‌కి కూడ కట్టె అవసరం లేదు, రెండు బ్యాట్‌లుంటయి” అని హాయిగా నీడపొంటి కూసొని మాట్లాడుకుంటుంటే ఈ పాట గుర్తుకొచ్చింది.

“అవున్రా, నోరిళ్లని వాటరేంది?” అని అడిగిన. అవును ఏందిరా? ఏందిరా? అందరం ఒకళ్ల దిక్కు ఒకళ్లం చూసుకున్నం. సాయంత్రం ప్రచారంల ఎవలినో అడిగితే – తిట్టిండుగానీ చెప్పలే. ఆ అన్నకుగూడ తెల్వదనుకుంట.

రోజూ ప్రచారం జెర్రంత చీకటి పడేదాంక చేసేది. అయిపోయినంక వస్తుంటే – అందరినీ ఒక దగ్గర చేర్చి చిన్న స్ప్రైట్ సీసా కొనిపిచ్చి తాపుతుండె. అమ్మా! క్రికెట్ కిట్టేగాక, స్ప్రైట్‌గూడ తాపిస్తున్నరు కదరా అనుకున్నం.

ఎలక్షన్లు దగ్గరపడ్డయి. ప్రచారం బంద్ చేసిన్రు. క్రికెట్ కిట్టు వస్తదని కలలుగంటనే ఉన్నం కానీ ఎంతకీ ఎవ్వలూ తెచ్చియ్యలే. మేం ప్రచారం చేసిన కోమటిరెడ్డి గెలిచిండుగూడ. ఇగ ఆపుకోలేక మమ్ముల ప్రచారానికి తీస్కపోయిన అన్నని అడిగినం.

“ఇంకెక్కడి క్రికెట్ కిట్టురా? అప్పుడే ఎవలో పట్కపొయ్యేగా?” అన్నడు ఆ అన్న నిమ్మలంగ.

ఇదయిన తర్వాతగూడ చానా ఏండ్లు క్రికెట్ ఆడినం. మేం ప్రచారం చేసుకుంట పాడిన పాటల ’నోరిళ్లని’ అన్న మాట అస్సలు లేదని, నల్లగొండ అనంగనే గుర్తుకొచ్చే ఫ్లోరైడ్ సమస్య గురించి చెప్తున్నరని.. ఆ పాటల ఉన్నది ’ఫ్లోరిన్ లేని’ అనిగూడ తెల్సుకున్నం గానీ, మేం ఎన్నడుగూడ క్రికెట్ కిట్ అన్నదైతే ఎరుగం.

*

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు