క్రాస్ రోడ్స్ 

క్రాస్ రోడ్స్ 

శ్రావ్య లాగానే ముఫ్పై పైబడిన అమ్మాయిలు పెళ్ళి అంటే సముఖంగా లేరు.ఇక విదేశాల్లో వున్న యువతీ యువకులల్లో పెళ్ళి మాటంటే చేదు మాత్ర మింగిన మొహం పెడతారు.

వాట్సాప్ కి కొడుకు పంపిన వీడియో చూస్తూ “కోపం తెచ్చుకోవడం ఎందుకు? పోష్ కల్చర్ అంటే ఇంతేగా” అనుకుంది నీరజ.

అదే మాట  సమాధానమిచ్చింది కొడుక్కి.

తిరిగి సమాధానంగా రెండు యాంగ్రీ ఎమోజీలు.  “పర్లేదు వీడిలో ఓ సాధారణమైన మగవాడు వున్నాడన్నమాట” అనుకుంది.

పైట కాస్త  పక్కకు తొలిగితే ఆఫ్ ఇడ్లీ అని కామెంట్ వినాల్సి వస్తుందేమో అని భయపడిన తరం తమది అనుకుంటూ ఆ వీడియో మరోసారి చూసింది.

కూతురు శ్రావ్య ఉలిపిరి వస్త్రాలతో అర్ధనగ్న దేహంతో ముందుకు వేలాడిల్సిన గొలుసులు వెనుకగా వేలాడుతూ వెనుక వేలాడాల్సిన జుత్తు ముందుకు వేసుకుని తాగుతూ తూలుతూ జోగుతూ అశ్లీలంగా జోక్స్ వేస్తూ ఇద్దరు యువకుల మధ్య వేలాడుతుంది. కాసేపటి తర్వాత ఆ యువకులిద్దరూ ఆమెను  వెలుతురు లేని పొడవైన కారిడార్ లోకి తీసుకుని వెళుతున్నారు.

ఆ తర్వాత.. !?ఏం జరుగుతుందో ఊహించండం మానేసింది. ఆ మసక చీకట్లో దేహాలు మునకలు వేస్తూ ఏ వేకువజాముకో   బాహ్య సృహలోకి తేలుతారు. సూర్యుడు తెల్లగా మారే సమయంలో ఇంటికి చేరుకుంటుంది శ్రావ్య.

కొన్నేళ్ళుగా భయపడటం దిగులుపడటం మానేసింది నీరజ. జరిగేది కళ్ళు అప్పగించి చూస్తూవుండటమే!

బ్రేక్ఫాస్ట్ చేయడానికి టేబుల్ ముందు కూర్చున్నప్పుడు “కాస్త పెందలాడే ఇంటికి వచ్చేయ్ శ్రావ్యా!” .

“ఇంట్లో ఏముంటుదమ్మా బోర్ తప్ప! పబ్ లో అయితే మ్యూజికల్ హిట్స్ తో డాన్స్ యమ్మీ యమ్మీ పుడ్, డ్రింక్స్, సరదా కబుర్లు, ఇవి కాక లైఫ్ లో అనుభవించడానికి ఏం వుంటాయి చెప్పు?  తిరిగి ప్రశ్న ఆమెకే !

“ఇలా వారానికి రెండు రోజులు పబ్ ల చుట్టూ తిరుగుతూ  మంచినీళ్ళ ప్రాయం లా డబ్బు ఖర్చు పెట్టే బదులు సేలరీ లో కొంత సేవ్ చేసుకోవచ్చు కదే! “

“యూ ఆర్ రాంగ్ మమ్మీ, ఆల్కలైన్ వాటర్ లా ఖర్చు పెడుతున్నావ్ అనాలి. అయినా మీ పెద్దాళ్ళంతా ఇంతే! ఇరవై లక్షలు పెట్టి డైమండ్ జువెలరీ కొని లాకర్ లో దాచుకోవాలి అనుకుంటారు. అదే మా యంగ్ మైండ్ సెట్ ఎలా వుంటుందో తెలుసా! ఆ ఇరవై లక్షలతో కారు కొని ఇంటి ముందు పెట్టుకుని ప్రెస్టీజ్ పెంచుకోమని చెపుతాం. బోడి నగలెవడిక్కావాలి?  ఏవి సిల్వర్ నగలో డైమండ్ నగలో ఏవి వన్ గ్రామ్ నగలో ట్వంటీ టూ కేరెట్ నగలో ఎవడూ చెప్పలేడు.”

కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది నీరజ.

కొన్నాళ్ళ తర్వాత విదేశాల్లో ఉన్న వరుడి బయోడేటా ముందు పెట్టింది చూడమని.

“పెళ్ళా!? వాట్ నాన్సెన్స్ !   నేను చేసుకుంటానని చెప్పానా? ఈ పెళ్ళి అనే లంపటం నాకొద్దు. నేనిలాగే లైఫ్ ఎంజాయ్ చేస్తాను. ఆ పెళ్ళికి అయ్యే ఖర్చులన్నీ నాకిచ్చేయ్, నేను ఫ్లాట్ కొనుక్కొని అందులోకి మారిపోతాను.

“పెళ్ళి చేసుకోక ఏం చేస్తావ్, ఇలాగే రోజుకొకడితో ఊరేగుతావా?  రాజేష్ కోపంగా చెంపచెళ్ళుమనిపించాడు అక్క ని.

ఇది ఊహించని పరిణామం.

“ ఏయ్! అసలు నువ్వెవడివిరా నన్ను కొట్టడానికి, మందలించడానికి సుద్దులు చెప్పడానికీ. బి యువర్ లిమిట్స్! అంతగా కావాలంటే నువ్వు చేసుకో పెళ్ళి. అమ్మను నీ కుటుంబం తో సంతోషంగా వుంచు. నీళ్ళ గ్లాస్ ని  టేబుల్ మీద వున్న మొబైల్ ని వెంట వెంటనే విసిరికొట్టింది. అదే కసితో తమ్ముడిని తిరిగి టపటప వాయించింది.

నీరజ నివ్వెరపోయి చూస్తుంది. ఇద్దరినీ వారించాలని కూడా తోచనంతగా. ఎదురుగా వేలాడుతున్న భర్త ఫోటో వంక చూస్తూ..  “పిల్లలిద్దర్ని ఎంతో క్రమశిక్షణతో పెంచాం. అడిగినప్పుడల్లా తాహతు కొద్దీ  వాళ్ళ చిన్న చిన్న సరదాలన్నీ తీర్చాం. మన పెంపకంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదు. చదువులు పూర్తయ్యాక ఉద్యోగాలు చేసే కాలానికి వీళ్ళిలా  ఉన్మత్తంగా తయారయ్యారేంటో” .

చెరొక బ్యాగ్ తగిలించుని ఇంటి నుండి నిష్క్రమించాక పగిలిన గాజు ముక్కలు ఏరుకుంటూ ఆలోచిస్తుంది.

శ్రావ్య లాగానే ముఫ్పై పైబడిన అమ్మాయిలు పెళ్ళి అంటే సముఖంగా లేరు.ఇక విదేశాల్లో వున్న యువతీ యువకులల్లో పెళ్ళి మాటంటే చేదు మాత్ర మింగిన మొహం పెడతారు. తన పరిధిలో ఓ ఇరవైమంది ఆడమగ ఉంటారు పెళ్ళి వద్దనేవద్దు అంటున్నవారు.

ఆ మాటే ఫ్రెండ్ సుజాత తో అంటే ..” అయ్యో! వాళ్ళకు పెళ్ళి అవసరం లేని అచ్చట్లు ముచ్చట్లు అన్నీ బహిరంగంగా జరిగిపోతుంటే పెళ్ళి అనే పనికిమాలిన మాటలు,  ఖర్చు ఎందుకు? అదో దండగ మారి వ్యవహారం. మనకూ పిల్లలున్నారు. ఎవరెప్పుడు ఏ ఆపద తెచ్చి పెడతారోనని భయంగా వుంది. నా ఫ్రెండ్ లక్ష్మి కూతురు శిల్ప పెళ్ళై పన్నెండేళ్లు అయినా పిల్లలను కనడం ఇష్టం లేదంటూ వాయిదా వేస్తుంటే చూసి చూసి భర్తకు విసుగు వచ్చి విడాకులు ఇచ్చాడు. ఆ పిల్ల ఇప్పుడు కెనడా నుండి వచ్చేసి ఈ నగరంలోనే వుంటుంది. ఇంకా నీ కూతురు నయం. పెళ్ళి చేసుకుని ఎవడో ఒక మగాణ్ని బకరాను చేయడం లేదు, సంతోషించు” అంది.

మనసు కలుక్కుమంది ఆ మాటకు. ఆ రోజంతా ఆ మాటనే తల్చుకుంటూ బాధపడింది. తర్వాత సుజాత నిర్మొహమాటంగా చెప్పినా నిజమే చెప్పింది లే అని సర్దుకుంది.

పెళ్ళి అంటే స్త్రీ పురుషుల మధ్య కమిట్మెంట్. చాపల్యంతో మగవాడు పక్కదారి పట్టినా కొనవరకూ బాధ్యతగా భావించేది స్త్రీ . ఆ బాధ్యతను మోయడం ఇష్టం లేని స్త్రీలు ఎక్కువైపోయారు. శ్రావ్య,రమ్య, శిల్ప .. ఇలా ఎందరో ఆ బాటలో. ఉన్నత చదువులు ఉద్యోగాలు వల్ల స్త్రీలు స్వేచ్ఛా జీవులయ్యారు. కుటుంబం కావాలనుకునే వాళ్ళు తక్కువగా స్వేచ్ఛగా బతకాలి అనుకునేవారు ఎక్కువగా.. మద మత్సరాలతో అక్రమ సంబంధాలతో ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఒకవేళ అడ్డం అనుకుంటే  మట్టుబెట్టుకోవడం దాకా వచ్చింది. వివాహ వ్యవస్థ బోలుదనం అంతా బట్టబయలు అయ్యింది. ఈ వొంటరి జీవితాలు ఎక్కడ ఎలా కడతేరిపోవాలో? తల బద్దలుకొట్టినట్లు బాధ పెడుతున్న ఆలోచనలు.

గేటు దగ్గర చప్పుడైంది. కిటికీ లోంచి చూసింది. చెల్లెలు కూతురు విజేత. పక్కనే ఇంకొక యువకుడు.

పెద్దమ్మా! అంటూ దగ్గరకొచ్చి ఆత్మీయంగా హత్తుకుంది. కుశల ప్రశ్నలు వేసింది. వినయ్ అంటూ ఆ యువకుడిని పరిచయం చేసింది. అతను నీరజ పాదాలను అంటి నమస్కరించాడు.

“అమ్మ నాన్న ఎలా వున్నారు? నువ్వు ఏం చేస్తున్నావు?”

“నీకు రెండు సంతోషకరమైన విషయాలు చెప్పాలి పెద్దమ్మా” అంది. స్వీట్ బాక్స్ తీసి ఓ ముక్క తినిపించి “నేను డి ఎస్సీ లో సెలక్ట్ అయ్యాను. ఉద్యోగం వచ్చింది. మా ఊరి స్కూల్ కి  వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను”

నీరజకు కళ్ళలో సంతోషం పొంగుకొచ్చింది. విజేతను హత్తుకుని ఆనందం వ్యక్తం చేసింది.

“రెండో విషయం ఏమిటంటే.. వినయ్ ని పెళ్ళి చేసుకుంటున్నాను. అమ్మ నాన్నకు ఇష్టం లేదు. ఉద్యోగం కూడా వచ్చింది. పనిపాటా లేనోడితో నీకు పెళ్ళి యేంటి అంటారు.కట్నం ఇవ్వలేదని వొదిలేసి పోయినోడ్ని మళ్ళీ నాకు అంటగట్టే ప్రయత్నాలు మొదలెట్టారు కూడా! కానీ నన్ను ఇష్టపడే వాడు మాత్రమే నాక్కావాలనుకుంటున్నాను. కులం కానివాడ్ని చేసుకుని పరువు తీస్తావా అని నాన్న చిందులు. వినయ్ వాళ్ళింట్లోనూ అభ్యంతరాలు. మొగుడు వదిలేసిందే కావాలా నీకు అని. నాకు ప్రేమ పెళ్ళి పెద్దలు కుటుంబం పిల్లలు అన్నీ కావాలి పెద్దమ్మా! పెద్ద వాళ్ళ అంగీకారం కోసం ఎదురుచూస్తున్నా!”

ఆశ్చర్యంగా చూసింది. ఎంత స్పష్టంగా ఉంది విజేత! ఇలాంటివారు వుంటేనే ముందు ముందు కుటుంబం వుంటుందేమో!

“మా పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి పెద్దమ్మా” మరీమరీ చెప్పి వెళ్ళింది.

*

కెఫటేరియా లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ. రాజేష్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది దివ్య .

“ఏంటి మరొకసారి చెప్పు? మీ అమ్మ అక్క తో కలిసి ఆ ఇంట్లో వుండటమా? నెవ్వర్ వాళ్ళను పూర్తిగా వదిలేసి వస్తేనే నీతో పెళ్ళి. మీ అక్కని చూస్తే ఎవతైనా నిన్ను పెళ్ళి చేసుకుంటుందా? వరస్ట్ ఫ్యామిలీ అని అంటే బాధపడతావని అనడం లేదు”

రాజేష్ నొచ్చుకున్నాడు.  దివ్య తో తొలి పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు.

ఓ ఫ్రెండ్ బర్త్ డే ఫంక్షన్ లో డిజె సాంగ్ కి ఊగిపోతూ.. “పుష్పకవిమానంలాంటి నా హృదయం లో  ఎంతమందికైనా చోటుంది రండి రండి” అని పిలుస్తుంటే చూసాడు దివ్య ని.ఆమె ఒక వర్ధమాన గాయని. ముందుకు అడుగు వేయబోతుండగా.. ఫ్రెండ్ హెచ్చరించాడు.

“ఒరేయ్! ప్రివ్యూ ఫ్రీ గానే ఉంటుంది. తర్వాత ఆమెను భరించలేవు రా ! జాగ్రత్త” అని. అయినా వినలేదు.కుంభ కుచములు, చిరునవ్వు ఉదయించినట్లు వున్న పెదవుల పొందిక చూసి ఆకర్షణలో పడిపోయాడు. ఇప్పుడు ఆ వలలో నుండి తప్పించుకుని బయటపడలేకపోతున్నాడు. వారానికి ఒకరోజు కలిసి తిరగడం షాపింగ్ లో క్రెడిట్ కార్డు లిమిట్స్ దాటడం. అవి కట్టడానికి ఫ్రెండ్స్ నో తల్లినో దేబిరించడం. పెళ్ళి చేసుకుందాం అంటే ఏవేవో షరతులు, గొంతెమ్మ కోరికలు.

“ఏంటీ వింటున్నావా? మీ అమ్మను వొప్పించి ఇల్లు నీ పేరున మార్పించుకో. నీకు ఉద్యోగం వొకటి వుంటే సరిపోతుందా”

సరేనన్నట్లు తలూపాడు.

మరోమీటింగ్ లో .. “మీ అక్క ఏమిటి మరీ అలా తయారైంది? బాగానే సంపాదిస్తున్నట్లుంది. ఫ్లాట్ తీసుకుంది అంటగా”

నువ్వు మాత్రం తక్కువా?పీల్చి పిప్పి  చేస్తున్నావ్ గా!  మా అక్క ను ఎందుకు అంటున్నావు అని  పైకి అనలేకపోయాడు.

“డౌన్ ఫేమెంట్ అమ్మ కట్టింది. లోను కూడా అమ్మ పెన్షన్ నుండే కట్ అవుతుంది. ఆడపిల్ల కి సొంత ఇల్లు వుండాలని మా అమ్మ తాపత్రయం.”

“ఇక మీ అమ్మ దగ్గర నుండి  నీకేం రాలవన్నమాట. పోనీ మన పెళ్ళి అయ్యాకైనా ఆమె ఆ ఇల్లు వదలుతుందా లేదా?”

“లేదు, అమ్మ తర్వాతే మనకి ఆ ఇల్లు. ఆమె ఎక్కడో పైన గదిలో ఉంటుంది. నీ స్వేచ్ఛ కేమి అడ్డం కాదు, ప్లీజ్! పెళ్ళి కి వొప్పుకో  దివ్యా” బతిమాలాడు.

“సారీ! మరీ ఇంత తక్కువ స్టేటస్ లో వున్న వాడిని కట్టుకుంటావా? ఆ ఫ్యామిలీ కూడా మంచిది కాదు అని మా పేరెంట్స్ అబ్జెక్షన్. బ్రేకప్ చేసుకుందామా రాజేష్”

“ఎలా చేసుకంటావ్ బ్రేకప్! నా చేత లక్షలు లక్షలు ఖర్చు పెట్టించావ్,” అరిచాడు.

“పిచ్చివాడిలా మాట్లాడకు, నీ సరదా నీది నా సరదా నాది. దట్సిట్!”

“యూ” గట్టిగా అరిచాడు. విలాసంగా నవ్వి వెళ్ళిపోయింది.

రాజేష్ దిగులుగా చేతుల్లో ముఖం దాచుకున్నాడు.

*

అమ్మా! ఈ ఇల్లు నా పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? అలా అయితేనే దివ్య నన్ను పెళ్ళి చేసుకుంటానంటుంది” తల్లి ముఖం చూడకుండా తలొంచుకుని అడిగాడు.

నీరజ ఆశ్చర్యపోలేదు.ఊహించిన విషయమే!

“ఇలా అడిగేనని ఏమీ అనుకోకు. దివ్య అంటే నాకు చాలా ఇష్టం అమ్మా! ఆమె లేకుండా నేను బతకలేను”  ముక్కు ఎగబీలుస్తూ అన్నాడు.

“శ్రావ్య తనకు నచ్చినట్లు తను బతుకుతుంది.దాన్ని మార్చలేం.  రేపటి గురించి ఆలోచన లేదు. తనకో రక్షణ ఉంటుంది అనో ఒక ఆధారం అంటూ వుండాలనో ఆ ఇల్లు కొనిపెట్టాను. అదీ నా పేరుతోనే వుంది. ఇదీ నా పేరుతోనే వుంది. నా  తర్వాత మీ ఇద్దరికీ కనీసం చెరొక ఇల్లు వుండాలని నా తాపత్రయం.”

ఆ మాటలు నచ్చనట్లు చిరాకుగా చూసాడు రాజేష్.

దివ్య మనస్తత్వం చాలా ప్రమాదకరమైనది. భవిష్యత్తులో ఆమెతో నీకు కష్టాలు వస్తాయి నాన్నా!  అని అనునయంగా చెప్పాలనుకుంది. ఆ చెప్పడం వల్ల వచ్చే వ్యతిరేకత ఏమిటో కూడా తెలుసు గనుక మౌనంగా భోజనం ముగించింది..

నీరజ తన గదిలో పడుకుని ఆలోచిస్తుంది.ఎటూ తేల్చుకోలేకపోతుంది. రాజేష్ ని తన తమ్ముడు కూతురు శ్రీ వల్లి ని చేసుకోమని బతిమాలింది. ఆ పల్లెటూరు పిల్ల నాకొద్దు అన్నాడు. శ్రీవల్లి ఇంజినీరింగ్ చదివింది. అమెరికా పిల్లాడొకడు వచ్చి ఆ పిల్లను ఎగరేసుకుని వెళ్ళాడు. ఎవరి రాత ఎవరు మార్చగలరు? శ్రీవల్లి పెళ్ళి పీటల మీద కూర్చుని  ఎంత గర్వంగా చూసింది రాజేష్ వైపు.

ఒకవిధంగా శ్రావ్యలో  స్పష్టత వుంది.స్పష్టత లేనిది  రాజేష్ లోనే! ఒకోసారి దివ్య లేకపోతే బతకలేను అంటాడు. మరోసారి నన్ను పూర్తిగా బికారిని చేసి అది జంప్ చేస్తుంది అంటాడు.

నిజమే! ఎన్ని వినడం లేదు!! ఈ తరం పిల్లలు కొందరు పచ్చి స్వార్థపరులు. కని పెంచిన తల్లిదండ్రులు దగ్గర వున్నదంతా ఊడ్చి పెట్టి అప్పులు చేసి విదేశాలకు పంపిస్తే అక్కడే ఉద్యోగం సంపాదించాక ఏళ్ళ తరబడి తల్లిదండ్రులు లతో మాట్లాడకపోవడం. ఫోన్ నెంబర్ తెలియనీయకుండా జాగ్రత్త పడడం.  తల్లిదండ్రులు నానా అగచాట్లు పడి వారి క్షేమ సమాచారం తెలియక తల్లడిల్లి ఎలాగోలా నెంబర్ తెలుసుకుని కాల్ చేస్తే  వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసుకొని తమ అడ్రస్ కూడా తెలియకుండా జాగ్రత్త పడటం. లగ్జరీ లైఫ్ స్టైల్ తో తనకు నచ్చిన వాడితో సహజీవనం చేయడం. తాను సంపాదించిన ప్రతి డాలర్ తమకే ఖర్చు చేసుకోవాలనే స్వార్థంతో ముఖం చాటేయడం. తల్లితండ్రుల ప్రేమను రక్తసంబంధాలను అపహాస్యం చేయడం.

కొందరు తల్లిదండ్రులేమో పిల్లలను డబ్బు కోసం పీక్కుతినడం మామూలైంది.మొత్తంగా మనుషులే స్వార్థంగా మారిపోయారు.

యవ్వనదశలో వున్నవాళ్ళంతా రకరకాల వ్యసనాలకు బానిసలై మీదు మిక్కిలి వ్యామోహాలతో  గతి తప్పి పోతున్నారు. కొంతమందికి కెరీర్, కొంతమందికి డబ్బు  పవర్. మద్యం, మగువ, మజా.ఇలా అనేక రకాలుగా.  జీవితం ఏ వైపుగా నడుస్తుందో తెలియని పరిస్థితిలో అయోమయానికి లోనవుతూ.. కూడలిలో నిలబడుకుని వున్నారు చాలామంది.

ఈ నిలబడుకోవడం వెనుక వర్తమాన సామాజిక ఆర్ధిక పరిస్థితులు రాజకీయ కోణాలు లేవా? ఇల్లు పెళ్ళి పిల్లలు స్కూల్ హాస్పిటల్ ఆఫీస్.. అన్నీ రాజకీయమే!

స్పష్టంగా కొంత, అస్పష్టంగా మరికొంత. అర్హత వుంటే ఏ రంగంలోనైనా ఉపాధి అవకాశాలు వుంటాయి.  పెళ్ళిళ్ళు వద్దంటే కుటుంబరంగం మాయమై పోవడమేనా?  ముందు ముందు గృహిణి ఉద్యోగం మాయమైపోతుందా? భలే! వినడానికి ఆలోచించడానికి కొత్తగా వుందీ విషయం. గట్టిగా నవ్వుకుంది.  అంతలోనే విజేత, శ్రీవల్లి లాంటి వారు మదిలో మెదిలారు.

*

రాజేష్ డాక్యుమెంట్ రైటర్ తో మాట్లాడుతున్నాడు గిఫ్ట్ డీడ్ అని రాస్తే ఎంత ఖర్చు అవుతుంది అని, పేపర్స్ రెడీ చేయమని. శ్రావ్య వారం రోజులైంది ఇంటికి వచ్చి. శ్రీలంక ట్రిప్ లో వున్నానని. రోజుకొక మెసేజ్.  అప్పుడప్పుడు వాట్సాప్ లో ఫోటోలు.

ఏమీ తేల్చుకోలేకపోతుంది. తను కూడా ఇప్పుడు కూడలిలో నిలబడి వుంది. కూతురికి తన అవసరం లేదు. కొడుక్కి తన అవసరం లేదు. ఇద్దరికీ తన వద్ద ఏం వుందో అది కావాలి. తక్షణం ఇచ్చేయాలి. తనకేది దారి!?

పిల్లలను వారి స్వేచ్ఛ కు వారిని వదిలేస్తూనే తన సర్వస్వాన్ని వారికి అప్పగించడం లేదా వారి పాటికి వారిని వదిలేసి తన భద్రతను తాను చూసుకోవడం.

పిల్లలకేనా స్వేచ్ఛ!! తల్లిదండ్రులకు స్వేచ్ఛ వుండకూడదా! తీసుకోలేరా!?

శ్రావ్య  పదే పదే అనే మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. “ఒక వయస్సొచ్చాక పిల్లల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు , వదిలేయాలి”

“నిజమే! వారిని గూటి నుండి ఎడ తోలాలి, ఎల్లెడలా  తన రెక్కల కింద సంరక్షించాలని అనుకోకూడదు. వారి గూడు వారే నిర్మించుకోవాలి.తనకెందుకు ఈ తాపత్రయం!?   రివర్స్  ప్రొవిజనింగ్! సామానంతా పై గదిలోకి మార్చేసింది.  రెండు ఇళ్ళకు టు లెట్ బోర్డు పెట్టకుండానే పరిచయస్థులకు అద్దెకు ఇచ్చింది.

పెయిడ్ సీనియర్స్ లివింగ్ లో చేరిపోయింది. రోజూ ఫోన్ ఇరవైసార్లు అయినా మోగుతోంది. చిద్విలాసంగా నవ్వుకుంటూ సైలెంట్ మోడ్ లోకి  మార్చేసింది. కథ ఇంకా మిగిలేవుంది.

 

వనజ తాతినేని 

 

 

 

 

 

 

వనజ తాతినేని

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు