క్యాపిటలిజం మనిషిలో స్వార్థం పుట్టినప్పుడు పుట్టి, మనిషికి నీడలా ఎదిగింది. దాన్ని రాజుల కాలంలో ఫ్యూడలిజమన్నారు. ఆ తరువాత బూర్జువాలు, జమీందార్లు, భూస్వాములు, పెట్టుబడిదార్లు ఇలా దాని రూపాల్ని రకరకాలుగా మార్చుకుంటూ దాని ఉనికిని మనిషిలో సుస్థిరం చేసుకుంది. ప్రపంచాన్ని క్యాపిటలిజం, కమ్యూనిజం ప్రభావితం చేసినంతగా మరో ‘ఇజం’ చేయలేదంటే అతిశయోక్తి కాదు. సమాజంలో ఉన్న ప్రజలు, రచయితలు, సామాజిక వేత్తలు, మేధావులు ఈ రెండు సిద్ధాంతాల మధ్య నలుగుతుంటారు. నడుస్తుంటారు. కొందరు ‘కమ్యూనిజం’ (మార్క్సిజం) అంటే.? ఇంకొందరు ‘క్యాపిటలిజం’ (పెట్టుబడీదారివర్గం) అంటారు. అసలు ఈ రెండు ఇజాలు ఏం చెప్పాయో? ఏం ఉద్ధరించాయో? చర్చిస్తూనే కరోనావ్యాధి ‘ఇజం’గా ఎలా మారిందో చూద్దాం.!
ఈ రెండు సిద్ధాంతాలు మనుషుల్ని ఉత్తర – దక్షిణ ధృవాల్లా మార్చాయి. సామాన్య ప్రజలు కూడా వాళ్ళకే తెలియకుండా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ సిద్ధాంతాలనే అనుసరిస్తారు. అసలు కమ్యూనిజం అంటే ఏమిటి? ఇది ఎప్పుడు వచ్చిందో చూద్దాం.!‘‘ఫిబ్రవరి 1848 కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్ లు కమ్యూనిస్టు ప్రణాళికను ప్రపంచానికి అందజేశారు. మానవ చరిత్ర గమనాన్ని దీనంతగా ప్రభావితం చేసిన మరో పత్రమేదీలేదు. ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ప్రజా పోరాట రూపాలను తీర్చిదిద్దుతున్నది’’.(కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక. మొదటివ్యాసం) కార్మికుల్ని యాజమానులు దోచుకుంటున్న విధానాన్ని ఖండిస్తూ, శ్రమసమానత్వాన్ని బోధిస్తూ పుట్టుకొచ్చిన సిద్ధాంతమే కమ్యూనిజమని చెప్పవచ్చు. ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే రంగనాయకమ్మగారి అభిప్రాయం కూడా చూద్దాం.!‘‘సమాన హక్కులూ, సమాన బాధ్యతలూ వుండవలసిన సమ సమాజాన్ని, కమ్యూనిజం అనీ దాని ప్రారంభ దశని సోషలిజం అనీ అంటున్నాం. పెట్టుబడిదారీ వర్గం చేతిలో వున్న రాజ్యాధికారాన్ని కార్మికవర్గం తీసుకుని, తన పరిపాలన ప్రారంభించగానే అది కమ్యూనిజం అవదు. లేదా అది, సోషలిజం కూడా అవదు. భూస్వాముల చేతుల్లో వున్న భూమి హక్కునీ, పెట్టుబడిదారుల చేతుల్లో వున్న ఇతర ఉత్పత్తి సాధనాల హక్కుల్నీ రద్దు చేసే క్రమం ప్రారంభమైన రోజు నించే, సోషలిజం ప్రారంభమైనట్టు అవుతుంది’’.(రంగనాయకమ్మ. మార్క్సిజమే తెలియకపోతే పుట్టిన వాళ్ళం పుట్టినట్టే ఉంటాం. పుట:66) అనే పుస్తకంలో ఇలా అన్నారు.
1848 లో కారల్ మార్క్స్; ఫ్రెడరిక్ ఎంగిల్స్ ఆలోచనల్నుండి, రాతల్నుండి పుట్టుకొచ్చిన కమ్యూనిజంలో అంతర్భాగంగా ఉన్న సోషలిజం రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరప్లో కొన్ని దేశాల్లో అమలులోకి వచ్చింది. ఆ తరువాత 1949 లో చైనాలో కూడా వచ్చింది. అలా వచ్చిన కొన్నాళ్ళకే ఆయా దేశాల్లో కనుమరుగైపోయింది. 2020 లో అంటే సుమారుగా నూట డెబ్భైరెండు సంవత్సరాల తరువాత కూడా మార్క్స్ కలగన్న కమ్యూనిజం ఫలించలేదు. రష్యా – చైనాలో వచ్చిన సోషలిజం పట్ల మార్క్స్ సంతృప్తి పొందాడనుకోలేము. ఎందుకంటే ‘లెనిన్’ పుట్టినరోజు పార్టీలను మార్స్క్, ఎంగెల్సులు తీవ్రంగా వ్యతిరేకించారు. స్టాలిన్, మావో వ్యక్తిగత పూజలలు కూడా వాళ్ళు సహించలేదు. ప్రపంచంలో ఉన్న ప్రతీ ఫిలాసఫర్ ఇంచుమించుగా మనిషి అంతరంగావిష్కరణకై కృషి చేశారు తప్పా చమట చుక్కలు చిందించే శ్రామికుల కోసం ఆలోచించిన ఫిలాసఫర్స్ అంటే మాత్రం మార్క్స్, ఎంగిల్సులు కనిపిస్తారు. ఆయన బలపరిచిన కమ్యూనిజం చాలా గొప్ప సిద్ధాంతం కానీ, దాన్ని ఆచరిస్తున్న నాయకులే బలహీనులు.! ఊసరివెల్లి లాంటి మనుషులు నిర్మించిన రాజకీయ పార్టీల ముందు సిద్ధాంతాలు నిర్మించిన పార్టీలు నిలబడలేకపోతున్నాయి. అంతిమదశ కమ్యూనిజం రాకముందే సోషలిజంలోనే కార్మికవర్గం అనేక ఉపశమనాలు పొందారు. ఈ రోజుల్లో అమలౌతున్న వర్కర్స్ యూనియన్స్, పనిగంటల లెక్కింపు, కార్మిక భీమాపథకాలు ఇలా చాలా సౌకర్యాలు మార్క్స్ కలగన్న కమ్యూనిజం చలవని ఖచ్చితంగా చెప్పుకోవాలి.
ఈ కమ్యూనిజం పార్టీల మీద అందులో సభ్యుల మీదున్న విమర్శ ఏమిటంటే.? వీళ్ళెవ్వరూ మార్క్స్ రాసిన ‘దస్ క్యాపిటల్’ చదవలేదని అంటుంటారు.! ఇలాంటి వాళ్ళను ఉద్దేశించి‘‘కొందరు మార్క్సిస్టులు, ‘కాపిటల్’ ని ముట్టుకోకుండానే, మార్క్సిజంలో ‘అ ఆ’ లు కూడా తెలియకుండానే, మార్క్సిజం అనే మాటనే వల్లెవేస్తూ, తమని మార్క్సిస్టులమని నమ్ముకుంటూ వుంటారు. కమ్యూనిస్టు పార్టీల్లో సాధారణ సభ్యుల్లోనే కాదు, నాయకుల్లో కూడా కొందరు, మార్క్సిజాన్ని తాము బాధ్యతతో పాటించవలిసిన సిద్ధాంతంగా తీసుకోరు’’. (రంగనాయకమ్మ. తత్వశాస్త్రం చిన్న పరిచయం. పుట:192) అని రంగనాయకమ్మగారు విమర్శించారు. ఇందులో కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆధిపత్యపోరు ఇలా సమాజంలో ఉన్న అన్ని జాఢ్యాలు ఈ పార్టీలలో కూడా ఉంటాయి. కింద పనిచేసే సామాన్య కార్యకర్తలకి ‘కారల్ మార్క్స్’ అంటే ఆ గ్రామ, జిల్లా, రాష్ర్ట, దేశ స్థాయిల్లో పనిచేసే నాయుకులే తప్పా నిజమైన మార్క్స్ ఎంతమందికి తెలుసన్నది వాళ్ళని నిశితంగా పరిశీలించినప్పుడు అనుమానంగానే మిగులుతుంది.! సాధారణ కార్యకర్తల మీద నాయకుల పెత్తనం యజమాని, బానిస తంతునే గుర్తుచేస్తుంది.!
రాజ్యాధికారంలోకి రావాల్సిన కమ్యూనిస్టులు ఎందుకు ఇంతకాలం వెనుకబడిందంటే.? ‘‘వ్యక్తి స్వేచ్ఛ అనేది బూర్జువా వర్గపు కుటిల వాదమని, అది పెట్టుబడిదారీ దోపిడీ విధానానికి మారు పేరు అని కమ్యూనిస్టులు నమ్మారు. వ్యక్తికి, సమిష్టికి సమన్వయాన్ని సాధించడానికి బదులు, వ్యక్తిని అణగద్రొక్కి సమిష్టికి ప్రాధాన్యం ఇచ్చారు. సమిష్టి పేరుతో పార్టీ, పార్టీ పేరుతో కొద్దిమందితో కూడిన పాలకమండలి, ఆ మండలి పేరుతో ఒక వ్యక్తి నియంతృత్వం చెలాయించడం, అలా చెలాయించే అవకాశాన్ని కమ్యూనిస్టులు కల్పించడం జరిగింది’’. (నండూరి రామమోహన రావు. విశ్వదర్శనం. పుట:395) అని నండూరిగారు పేర్కొన్నారు. ఈ వాక్యాల్లో నిజంలేదని కొట్టిపారేయలేము. ఏ దేశంలో అయినా అసలు కమ్యూనిజం రావాలంటే.? విపరీతమైన నియంతృత్వ పోకడలు పాలకుల్లో ఉండాలి. అప్పుడు సమాజంలో అసహనం పెరిగి ఉద్యమాలకు దారి తీస్తుంది. అప్పుడది కమ్యూనిజం వైపుకు నడుస్తుంది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు నడుస్తునంత కాలం ఏ దేశంలో అయినా కమ్యూనిజం రావడానికి అవకాశం లేదు. వీళ్ళ సిద్ధాంతాల ప్రకారం వ్యక్తి స్వేచ్ఛా, పెట్టుబడీవర్గం వీళ్ళకు శత్రువులైతే పరిశోధనలు, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇలా అన్నింటికి మూలం పెట్టుబడేకదా.? మరి దీన్నే వ్యతిరేకిస్తే.? సమాజాభివృద్ధిని కోరుకోదా.? సమాజాల్లో ఉన్న కార్మికులు అభివృద్దిలో భాగమై ఆ సౌకర్యాలను పొందుతున్నారు కదా.? కార్మికుల పేదరికానికి దోపిడీదారి వర్గం కారణమైనా ఆ వర్గం తయారు చేస్తున్న ఉత్పత్తులు వాడకుండా వాళ్ళపై పోరాటం చేయగలమా.? క్యాపిటలిజం మనిషి శరీరంలో ఒక భాగమైనప్పుడు దానిని వ్యతిరేకించడం సాధ్యంకాని రోజులు నడుస్తున్నాయని కమ్యూనిస్టులు మర్చిపోకూడదు.!
‘‘If at age 20 you are not a communist then you have no heart. If at age 30 you are not a capitalist then you have no brains.’’ – George Bernard Shaw. ‘‘ఇరవై సంవత్సరాల వయసులో కమ్యూనిస్టువి కాకపోతే నీకు హృదయం లేనట్టు. అదే ముఫ్పై సంవత్సరాల వయసులో క్యాపిటిలిస్టువి కాకపోతే నీకు మెదడు లేనట్టు’’. అనే ఈ బెర్నాడ్ షా మాటలు చూస్తే క్యాపిటలిజాన్ని వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టులకు బుర్రలేనట్టు తేల్చిన మాటల్లో నిజముంది. ఎందుకంటే కమ్యూనిస్టులకు, సామాజికవేత్తలకు సమసమాజ నిర్మాణంకోసం, సమానత్వ పోరాటాల కోసం కావాల్సింది హృదయమే.! వీళ్ళ మేధను హృదయం గెలుస్తుందని అర్థం చేసుకోవాలి.! హృదయం ఓడిపోయిన కమ్యూనిస్టులు కూడా మనకు దండిగానే ఉన్నారు. ఇలాంటి వాళ్ళనే రంగనాయకమ్మగారు విమర్శంచేది.! ప్రపంచాన్ని ప్రస్తుతం నడిపిస్తున్న క్యాపిటలిజం కరోనా ముందు చతికిలపడింది. జబ్బలు సరిచిన అగ్రరాజ్యాలు కరోనా దెబ్బకి ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. అలాగే మతాలు కూడా ఇంతకాలం నోటికొచ్చినన్ని కబుర్లు చెప్పాయి. ఇలాంటి ఆపత్కాల పరిస్థితుల్లో రక్షిస్తాడనే కదా? ఇంతకాలం ఆ దేవుళ్ళని, మతాల్ని పూజించింది? ప్రార్ధించింది? మరి ఇలాంటి సమయంలో ఆ దేవాలయాలకు సెలవలంటే? అసలు మనం ఇంతకాలం చేసిన దానధర్మాలు ఎవరి ఖాతాలో చేరినట్లు.? ఈ భూమ్మీద ఉండాల్సింది ఎకరాలకు ఎకరాలు దేవాలయాలు, బాబాలాశ్రమాలా? లేక ఆసుపత్రులు, స్కూల్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, పోలీస్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలన్నది? ప్రజలు వాళ్ళ నమ్మకాల్ని పక్కన పెట్టి వాస్తవ దృష్టితో ఆలోచించాలి.! అందుకే మనిషికి శాస్త్రీయ దృక్పథం, రేషనల్ థింకింగ్ చాలా అవసరం. అదిలేక సోక్రటీస్, బ్రూనో, గెలీలియో లాంటి అనేక మహామేధావుల్ని కోల్పోయాం.!
అసలు ఈ ‘కరోనాఇజం’ ఏమిటి? ఒక అంటువ్యాధి ఇజం ఎలా అవుతుందని మీలో చాలామందికి సందేహం కలగవచ్చు.? కాకపోతే ఈ ఇజాల్లో ఉన్న లక్షణాలే కరోనాలో కూడా ఉన్నాయి. మార్క్స్ అనే ఒక వ్యక్తి నమ్మిన సిద్ధాంతాన్ని ప్రపంచమంతా నమ్మేలా, ఆచరించేలా చేశాడు. అలాగే కరోనా కూడా ఒక వ్యక్తితో మొదలై ప్రపంచమంతా పాకుతుంది. ఒక ఇజం మనిషిని రక్షిస్తే; మరోఇజం మనిషిని భక్షిస్తుంది. కానీ వ్యాపించడంలో మాత్రం తేడా లేదు. అందుకే కరోనాని ఇజమనుకోవచ్చు. కరోనావ్యాధి తగ్గిపోయినా? దాన్నంత తేలిగ్గా మర్చిపోలేము. ఎందుకంటే ప్రపంచాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా ఒక కుదుపు కుదిపేస్తుంది. ఇకపై ‘పెట్టుబడీదారి వర్గాన్ని కరోనా మందు; కరోనా తరువాత’ని నిర్వచించే రోజులు రాబోతున్నాయి.ఈ అలసత్వం ఎవరిదంటే మనకు కనిపిచేది క్యాపిటలిస్టులే! ఎందుకంటే ప్రపంచాన్ని ప్రస్తుతం శాసించేది, వాళ్ళ మాట కాదంటే ఆయా దేశాల్ని శపించేది వీళ్ళే కాబట్టి.! దోపిడీదార్లు మనుషుల్ని ఆధునిక మరబొమ్మలుగా మార్చి పోటీ ప్రపంచంలో పడేశారు. మనిషికి అలుపొచ్చి ఆగినా సమాజమంతా అతన్ని ఒక ఫెయిల్యూర్గా చూసేలా తయారు చేశారు. అలాంటి సమాజం కరోనా వల్ల మొదటిసారి ఆగింది. ఆలోచిస్తుంది.! యుద్ధాలకు సిద్ధమని ఎచ్చులు పోయిన దేశాలు ఇప్పుడు బొచ్చలు పట్టుకుని అడుక్కున్నా ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకూ ఎన్ని వ్యాధులు వచ్చినా? మొత్తం ప్రపంచాన్ని ఐక్యంగా గడగడలాడించిన వ్యాధి కరోనాయే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కనక ఇది ‘కరోనాఇజం’ అవుతుంది.!
క్యాపిటలిజంలో అంతర్భాగంగా నడుస్తున్న ఎన్నో వ్యాపారాల్లో, పరిశోధనల్లో అనేక లాభనష్టాలు మనుషులు అనుభవిస్తూనే ఉంటారు. కానీ పర్యావర్ణానికి మాత్రం నష్టం తప్ప లాభం లేదు. ఆ నష్టాన్ని సరిచేసే పనిలో భాగంగా ఎలక్ర్టానిక్ వస్తువుల మీద ‘ఫైవ్ స్టారింగ్’ పద్దతిని తీసుకొచ్చారు. దీనివల్ల కరెంట్ తక్కువ కాలుతుంది. బొగ్గు వాడకం, చెట్లు నరకడం తగ్గుతుంది. వాహనాల వ్యర్ధాల్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ బైకులు, కార్లు తీసుకొస్తున్నారు. దీనివల్ల ‘ఓజోన్’ పొరను దెబ్బతీసే వాయుకాలుష్యం కొంత తగ్గుతుంది. అలాగే వాళ్ళు చేస్తున్న పరిశోధనల్లో ప్రపంచం మీద మనిషి ఆధిపత్యాన్ని దెబ్బతీసే పరిశోధనలు మనిషే చేయడం ఆశ్చర్యం. అదేమిటో చూద్దాం.!
మనిషి ఆవిష్కరణల్లో చక్రం, కరెంట్, కంప్యూటర్, ఇంటర్నెట్, ఫోన్ ఇలా మనుషుల జీవన విధానాల్లో అనేక మార్పులు తెచ్చాయి. ఇప్పుడు రాబోతున్న ఆవిష్కరణ మాత్రం వీటన్నింటి కన్నా వేగవంతమైనది. ప్రమాదకరమైనది. అదే ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్’ ఇది ఒక కంప్యూటర్ ప్రోగ్రాం. ఇప్పటి వరకూ ఉన్న ప్రోగ్రామ్స్ మనం రాసినవి. ఈ ‘ఏఐ’ అలా కాదు. మనిషిలానే సొంతగా నేర్చుకోవడం, నేర్చుకునే విధానంలో లోపాలు ఉంటే సరిచేసుకోడం దీని ప్రత్యేకత.! ఏఐ ఇప్పుడు మనం వాడుతున్న మొబైల్స్ లో కూడా ఉంటుంది. మనం సెర్చ్ చేస్తున్న విషయాల్ని బట్టి మన అభిరుచుల్ని, ఆలోచనల్ని అంచనా వేసి దానికి సంబంధించిన అనేక విషయాల్ని మనకు చూపిస్తుంటుంది. ఏఐ ఇప్పుడు సొంతంగా కవితలు, న్యూస్ ఆర్టికల్స్, మ్యూజిక్ ఇలా మనుషులతో అన్ని రంగాల్లో పోటీపడడానికి సిద్ధమవుతుంది. సాధారణంగా మనుషుల ‘ఐక్యూ’ 85 ఉంటే నార్మల్. అదే 120 ఉంటే స్మార్టని అర్థం. ప్రపంచ మేధావైన ‘ఐన్స్టీన్ ఐక్యూ 160’. అలాంటిది భవిష్యత్తులో రాబోతున్న ఏఐ కి ఐక్యూ 12,952 ఉండవచ్చని ఒక అంచనా.! ఒకవేళ పూర్తి స్థాయిలో ఏఐ కనుక వస్తే ఈ భూమ్మీద అత్యంత శక్తివంతమైనదవుతుంది. ప్రముఖ సైంటిస్టు ‘స్టీఫెన్ హాకింగ్’ ఏఐ తో జాగ్రత్తగా ఉండాలని అది మానవ జాతిని నాశనం చేసే అవకాశముందని హెచ్చరించారు. మనుషులకు బయలాజికల్గా కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని దాటి వెళ్ళలేరు. కానీ తనకు తానే నేర్చుకోగల ఏఐ కి అలాంటి హద్దులేమీ లేవు. కాబట్టి నిరంతరం నేర్చుకునే ఏఐ తో మనుషులు పోటీపడలేరని స్టీఫెన్ హాకింగ్ తెలియజేశారు. ఆయన మాటల్ని, చెప్పిన విషయాల్ని చాలామంది మేధావులు సమర్ధించారు.
ఇప్పుడు ప్రస్తావించిన విషయాలు కొత్తవేమీ కావు. జనబాహుళ్యంలో నలుగుతున్నవే! కానీ ప్రపంచం కరోనా వల్ల ఎదుర్కుంటున్న ఈ విషమ పరిస్థితుల్లో గుర్తుచేసుకోవడం అవసరం. ఎందుకంటే మన భ్రమలు తొలిగి మన బలాలు, బలహీనతలు ఇంకాస్త స్పష్టంగా అర్థమవుతున్న సమయమిది.! ఈనాటి మనిషి వస్తువుల్ని తన జాతిగా ప్రేమిస్తూ మానవస్పృహ లేకుండా బతికేస్తున్నాడు. ‘కరోనా’ మనలో ఉన్న పెట్టుబడిదారుణ్ణి, ఉద్యమకారుణ్ణి అణగదొక్కి మనిషి తనాన్ని నిద్రలేపి ప్రకృతి ప్రియత్వంవైపు, ఆరాధనవైపు దారి చూపుతుందా.? ఈ ‘లాక్ డౌన్’ వల్ల ఇంతకాలం అశాంతితో నిండిన బతుకులు ప్రశాంతిని పొందుతూ రీచార్జవుతున్నాయి. ఇక నుండి ‘‘ప్రపంచ పండుగ’’ అని మతాలకు అతీతంగా ప్రతీ సంవత్సరం ఓ పది రోజులు ప్రపంచమంతా లాక్ డౌన్ సెలవలు ఇస్తే ఎంత హాయిగా ఉంటుందో కదా.? యాంత్రికమైన అనుకరణలో భాగంగా మానవ సంబంధాలు కృత్రిమంగా మారిపోతున్న సమయంలో అవి మళ్ళీ సహజత్వాన్ని, మానవత్వాన్ని విరబూయాలంటే ఇలాంటి విశ్వ ఐక్యతను, మానవ ఏకతను చాటిచెప్పే కార్యక్రమాలు మానవజాతి మనుగడకి ఆరోగ్యకరం. ఇదే కరోనాఇజం ఇస్తున్న సందేశం.!
*
A good comparison. Coronaism can not save common man. It also showed a way towards capitalism. As long as government is under control of capitalists, it would be no difference in society.
Communism would set new goals according to Indian society. First caste should be eliminated.
In my opinion , eyes on leadership tends to groups in communist parties that to caste domination plays crucial role
Thank you so much
మిత్రులు మంచి వ్యాసం అందించారు.
కరోనఇజం అంటూ ఆసక్తికరమైన వాదన బాగుంది.
అయితే మార్క్స్ , ఏంగెల్స్ కు ముందు కమ్యూనిజం లేదని కొట్టి పారేస వారే కమ్యూనిజానికి ఆద్యులు అనే వాదనతో చిన్న భిన్నాభిప్రాయాల వాది.ప్రపంచ చరిత్రలో ఆదిమ కమ్యూనిజం ( Ancient communism) అనే పదం, దానికొక చరిత్ర ఉన్నాయి. మరిన్ని వివరాలు కావాలంటే బౌద్ద సాహిత్యంలో దీఘనికాయ గ్రంథంలో సిగలోవాద సుత్త మరింత విస్తృత అవగాహన కలుస్తుందన మాత్రం ఖచ్చితంగా చెప్పులను.
ధన్యవాదాలు సార్! తప్పకుండా చూస్తాను👍
ధన్యవాదాలు సార్.! తప్పకుండా చూస్తాను👍