1
ఆ రోజంతా నేపాల్ లోని, ఫోక్రా నగరంలో ఫీవా సరస్సు ఒడ్డున కూర్చొని ఎటూ తేల్చుకోలేకుండా గడిపాను. జామ్సమ్ గ్రామానికి విమానంలో వెళ్లాలా, ఎస్.యు.వి. లో వెళ్ళాలా అని ఆలోచనలో పడ్డాను.
నేలపై ప్రయాణించే వారికి దొరికే అనుభవం విమానంలో వెళ్లేవారికి దొరకదు అనిపించింది, ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో. చివరకు నేలపై ప్రయాణించే వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అలా నిర్ణయించుకున్నందున నాకు ఎటువంటి సంతోషం దక్కిందో మాటల్లో చెప్పలేను.
Arizona లోని Grand canyon కంటే భారీ కనుమల్లోంచి mustang province గుండా ప్రయాణిస్తున్నప్పుడు, రోడ్డు మార్గంలో రావాలని నిర్ణయించుకున్నందుకు నన్ను నేను ప్రశంసించుకోకుండా ఉండలేకపోయాను. కాళీ గంధకి నది ఒడ్డున ఇరుకైన లోయల గుండా సాగే ఆ మార్గం ఒక విభ్రమం. ఉత్కృష్టం.
జామ్సమ్ దగ్గరలో ఉందనగా తెల్లటి మట్టి రోడ్డు పై లోయలో దుమ్మురేపుకుంటూ ఎస్.యు.వి వెళ్తోంది. జామ్సమ్ ఎయిర్ పోర్ట్ లో అప్పుడే దిగిన విమానం కూడా పక్కన దుమ్మురేపుకుంటూ landing అవుతోంది. ఆ దృశ్యం హాలీవుడ్ సినిమాని తలపించేలా ఉంది. నా నిర్ణయం మరొకలా ఉండివుంటే ఈ విమానంలోనే నేను ఇక్కడ దిగేవాడిని కదా అనుకున్నాను. ఇంతలోనే జామ్సమ్ వచ్చింది. ఆ గ్రామం విచిత్రంగా హాలీవుడ్ కౌబాయ్ చిత్రాలలోని సెట్ లా ఉంది. అది అలా ఉండడానికి గల కారణాన్ని తర్వాత వివరిస్తాను.
2
నేను హోటల్ లో కొంతసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం డాబా మీదకు రాగానే అక్కడ నేను ఏమి చూసానో అది నా అవగాహనకి, జ్ఞానానికి అందలేదు. అసలు అది ఏమిటో అంత చిక్కలేదు. ఒకవైపు ధవళగిరి, మరొకవైపు అన్నపూర్ణ శ్రేణి, మధ్యన నేను. అదీ చాలా దగ్గరగా. తల ఎత్తితే ఎక్కడో ఆకాశంలో ఉన్నాయి, ఆ మహా పర్వత శిఖరాలు.
ఇలాంటి అనుభవం భారతదేశపు హిమాలయాల్లో దొరకదు. ఎందుకంటే 8000 కంటే ఎక్కువ ఎత్తులో ఉండే పర్వతాలు భారతదేశంలో లేవు, ఒక్క కాంచనగంగ తప్ప. అదీ ఇండియా-నేపాల్ లలో విస్తరించి ఉంది. కాని నేపాల్ లో అటువంటి పర్వతాలు 9 ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద 14 ఉన్నాయి. 8000+ మీటర్ల ఎత్తున్న పర్వతాలను చూడాలంటే నేపాల్ వెళ్లాల్సిందే. 8000 మీటర్ల కంటే ఎత్తైన పర్వతాలను పూర్తిగా 90° కోణంలో తల ఎత్తి చూడాల్సి ఉంటుంది. అది ఒక అనూహ్యమైన, తీక్షణమైన అనుభవం.
ఇక 8000 అడుగులు ఎత్తు తర్వాత పర్వతాల మీద ఒక Intricate texture ఉండడం గమనించాను. దాని గాంభీర్యాన్ని చూస్తే ఊపిరి ఆగిపోతుంది. ఆ texture లో ఏముందో నేను చెప్పలేను. కానీ అది ఈ లోకానికి సంబంధించినది కాదని మాత్రం చెప్పగలను.
ఆ పర్వతాల మహిమాన్విత భయద సౌందర్యానికి నా కళ్ళ నుండి జలజలా కన్నీళ్ళు రాలుతున్నాయి. కాలాతీతమైన అనుభవానికి దేహం చిగురుటాకులా వణుకుతోంది. అది ఏమిటో అర్థం చేసుకోలేని, తెలియరాని అనుభవం. ఒక నిగూఢ మార్మిక రహస్యం.
ఇంతలోనే చీకటి పడింది. తీవ్రమైన చలిగాలులు మొదలయ్యాయి. కౌబాయ్ స్ట్రీట్ లో షాపింగ్ చేద్దామని బయటకు వచ్చాను. అప్పటికి సాయంత్రం ఏడు గంటలు అయింది. అప్పటికే వీధి అంతా చీకటిగా, నిర్మానుషంగా ఉంది. చలికి దుకాణాలు మూసేశారు. హిమాలయ పర్వత చలిగాలులు నన్ను బలంగా విసిరేస్తున్నాయి.
ఏ దేశంలో వెళ్ళినా, ఏ నగరానికి వెళ్లినా, రాత్రివేళ చీకటి వీధుల్లో తిరగడం నాకు ఇష్టం. నిద్రిస్తున్న మహా సర్పాలవలె చీకటి వీధులుదీర్ఘంగా, నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంటాయి. ఏ నగరం యొక్క ఆత్మ అయినా ఆ చీకటి వీధిల్లోనే ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఏదో తెలియరాని ఆధ్యాత్మిక శాంతి అలా తిరుగుతుంటే దొరుకుతుంది.
అలా వెళ్లగా వెళ్లగా మూసివేసిన ఒక షాపుకి ఒక పక్క చిన్న తలుపు తెరవబడి ఉంది. అందులోకి వెళ్ళాక అక్కడ ఒక అద్భుతమైన వస్తువుని కనుగొన్నాను. హిమాలయ పర్వత పాదాల్లో సాగు చేయబడుతున్న తోటల్లోని ఆపిల్ పళ్ళతో స్థానికంగా తయారు చేయబడిన ప్రఖ్యాత apple brandy అది. భారతదేశంలోని నా మిత్రులకి కానుక ఇవ్వడం కోసం కొన్ని సీసాలు కొన్నాను.
ఇండియా చేరుకున్నాక apple brandy రుచి చూసిన నా మిత్రుల సంతోషానికి అవధులు లేవు. Aged liquor ఇవ్వలేని గొప్ప రుచిని, అనుభవాన్ని ఆ రంగులేని, రుచికరమైన Apple brandy ఇచ్చిందని చెప్పారు.
రాత్రి చలిగాలులు బాగా పెరిగాయి. హోటల్ రూమ్ లో 10 అంగుళాల దళసరి బొంత ఉంది. దానిని కప్పుకున్నా చలి తట్టుకోవడం కష్టం అయింది. ఆక్సిజన్ కోసం కిటికీని కొద్దిగా తెరిచాను. కానీ చలిగాలిని తట్టుకోలేక కొన్ని నిమిషాల్లోనే మూసేసాను.
3
యూరోప్-అమెరికన్ పర్వతారోహకులు జామ్సమ్ ని బేస్ క్యాంపు గా ఉపయోగిస్తారు. అన్నపూర్ణ, ధవళగిరి లాంటి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించడానికి వచ్చినవారు జామ్సమ్ గ్రామాన్ని చేరుకుంటారు. ఇంకా ముక్తినాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వచ్చిన వారు కూడా ఇక్కడ బస చేస్తారు.
యూరోప్-అమెరికన్ పర్వతారోహకుల ప్రభావం వల్ల ఈ గ్రామం కౌబాయ్ స్ట్రీట్ ని తలపిస్తుంది.
ఈ జామ్సమ్ గ్రామం పట్ల నాకు ఎంతో ప్రేమ కలిగింది. మరొకసారి వెళ్లి అక్కడ ఒక నెల రోజులైనా గడిపి రావాలనుకుంటున్నాను.
*
Add comment