కోటమ్మా, నువ్వు పిల్లల్ని కనని మాతృమూర్తివి!

చల్లని మనస్సు చలువ చేతులు నిర్మలమైన స్పర్శ కోటమ్మ వ్యక్తిత్వం.

నమెలా బయటపడతాం?బయటపడి,కళ్లెలా తెరుస్తాం?కాళ్ళెలా ఆడిస్తాం?మనల్ని మనం ఎలా వెలిగిoచుకుంటాం? జీవితానికి కన్నీళ్లు ఉంటాయని, బతుకు పోరాటమని,ఆకలి నిద్ర సహజాతాలని,ప్రపంచం విశాలమని,మనుషులు ఇరుకు హృదయాలతో తిరుగుతుంటారని,కర్ఖశమూ కరుణా కడుపు కన్నీళ్లు ఉంటాయని మనం ఎప్పుడు తెలుసుకుంటాం? పుట్టుకతోనే కదా మనమీ ప్రపంచాన్ని చూస్తాం?జననంతోనే కదా మనమీ లోకం రంగులమయమని తెలుసుకుంటాం?

తండ్రి మన రూపానికి బీజం వేసుండొచ్చు. తల్లి ఆ రూపానికి గర్భంలో నీడనిచ్చి ఉండొచ్చు.అమ్మనాన్న అనుక్షణం మన రక్షణకు గస్తీకాసుండోచ్చు. కళ్లలోని కలల ఉయ్యాలు ఊపుకుంటూ లాలిపాటలు పాడుకొని ఉండొచ్చు.ప్రతి స్త్రీకి పురుడొక యుద్ధం.ఒక జన్మలో ఎన్నో జన్మల్ని జీవిస్తుంది స్త్రీ. There are number of rebirths in one birth of women.ప్రతి పురుడూ పూనర్జన్మే.ఇప్పుడంటే ఆధునిక  డాక్టర్స్,అత్యాధునిక హాస్పటల్స్,సీజరియన్స్,నొప్పి తగ్గించే మందులు మత్తునిచ్చే ఇంజెక్షన్స్ అని కొంత వెసులుబాటు ఎదో వొచ్చిందేమోగానీ, ముప్పయి నలబైయేళ్ళ కింద పురుడు పోయాలంటే మంత్రసానే.

మంత్రసానే డాక్టర్,మంత్రసానే నర్సు.మంత్రసానే మోటివేటర్.ఊరుకో మంత్రసాని ఉండేది.మంత్రసానిని చూసుకొని ప్రతితల్లి హాయిగా ఉండేది.మంత్రసాని ఒక దారిదీపం.బాలింతల పాలిట వెలుగు బావుట.

పుట్టబోయే బిడ్డ పసిదేహం మీదపడే మొదటి చలువ చేయి మంత్రసానిదే.ఆమె చల్లని స్పర్శతో చూపుతో ఆలింగనంతో శిశువుల తొలిపరిచయం ఎంతో ఆత్మీయంగా ఉండేది.ఊరిలో ప్రతి ఒక్కరికి మంత్రసాని మీద అపారమైన గౌరవం,ఉన్నతమైన భక్తి ఉండేది.

మా ఊరికో మంత్రసాని ఉండేది.ఆమె పేరు కోటమ్మ. ఎప్పుడు ఎవరు ఏ అర్ధరాత్రి కోటమ్మా.. అని కేకవేసినా పురిటినొప్పి కబురుతో ఎవరొచ్చినా..విసుగు చిరాకు లేకుండా స్పందించేది. కులమత భేదంగానీ, బంధుప్రీతి గానీ లేని కోటమ్మ మావూరు ఎరిగిన చూసిన మొదటి డాక్టర్.ప్రంపంచానికి ఫ్లోరెన్స్ నైటింగేల్ ఉన్నట్టే, ఊరికో మంత్రసాని నైటింగేల్ లా పడిగాపులు కాస్తూ కళ్ళలో మెలుకువని దాచుకొని ఉంటారు. వయసు అరవయేళ్లు కోటమ్మకి.ముఖం నిండా
మడతలు.కాళ్లకు పెద్దపెద్ద వెండి కడియాలు.

చేతులనిండా మోచేతిదాకా మట్టిగాజులు.
ముగ్గుబుట్టలాంటి తల.పగిలి నెఱలిచ్చి జీవికకోసం
చేసిన ప్రయాణలకు సాక్షిగా నిలిచే పాదాలు.

అచ్చులుపడ్డ చెప్పులజోడు.మిరపగుట్టలాంటి బొట్టు.నల్లని దేహచాయ.నాలుగు కుంటల ఇళ్లస్థలం అందులో అతిచిన్నగా జమ్మితో కప్పిన పూరిగుడేశలో కోటమ్మ ఆమె పెనిమిటి ఉండేవారు.భర్త నీటి కాపరి.భార్య పురిటి కాపరి.ఒకళ్ళది మొక్కల్ని పెంచే భాద్యత.మరొకరిది పిల్లల్ని తడిమే డ్యూటీ. అన్యోన్యత
వాళ్ళ బాంధవ్యాన్ని దాంపత్యాన్ని నిత్యా సంతోషంతో వెలిగించేది. ఏఒక్క పూట మరే ఒక్క మాటా ఒకరినొకరు అనుకున్నట్టు ఎవరు చెప్పుకోరు. ఏ బంధమైన ఆనందంలో ఎక్కువ నిలబడి దుఃఖంలో వేధనలో తునిగిపోతుంది కానీ కోటమ్మ పోతయ్యల మధ్య అన్యోన్యత తప్ప ఘర్షణ గోడలు ఏమీ ఉండేవికాదని వాళ్ళ దాంపత్యాన్ని ఉదాహరణగా అప్పుడే పెళ్లి చేసుకునే యువతి యువకులకు చెప్పేవారు.

ఎండలేదు. వానలేదు. పగలూరాత్రిలేదు. ఇప్పటిలా ముహుర్తాలు, auspicious time, date, astrology, ఏమీలేవు.ఎప్పుడు నొప్పులొస్తే అప్పుడే ఆ క్షణమే గొప్పది. ఎప్పుడు మంత్రసాని చేయివేస్తే అదే తల్లి బిడ్డకి కలిసివొచ్చే కాలం.

చల్లని మనస్సు చలువ చేతులు నిర్మలమైన స్పర్శ  కోటమ్మ వ్యక్తిత్వం. ఆ విధి పూరిపాకలో కోటమ్మ ఇప్పుడు లేదంటే దిగులు అవరిస్తుంది.శిథిలమై పోతున్న ఆ ఇంటి గోడల్ని కప్పుని వాసాల్ని చూస్తుంటే పెను విషాదాం సంక్రమిస్తుంది.

అన్నీ సమూలంగా తుడిచిపెట్టుకుపోతున్న కాలంలో,మనుషులతో సహా అన్నీ అంతరిస్తున్న సమయంలో మంత్రసాన్లు మాత్రం సజీవంగా ఉండటం ఉండగలగటం ఎంత వరకు సాధ్యo?ఇప్పుడు కోటమ్మ లేదు.కోటమ్మతో పురుడు పోయించుకునేందుకు సిద్ధంగా ఉన్న స్త్రీలు లేరు. కాలం మారుతోంది.మారిన కాలం కోటమ్మని ఏమీ మార్చలేకపోయింది.విధి ఏమిటంటే వందకు పైగా పురుళ్ళు పోసి నాలాంటివాడికి జన్మిoచటానికి సాయంచేసిన కోటమ్మకు సంతానం లేరు.

గొడ్రాలనే నిందలు అవమానాల్ని ఎన్నో తట్టుకొని నిలబడ్డది. సాయం చేయడానికి కోటమ్మ కావాలి,కానీ సహానుభూతిని చూయించడానికి కూడా లోకానికి హృదయం విశాలమవ్వలేదు.సాయం చేసే చేతుల్ని,ఇతరుల బిడ్డల్ని ప్రేమించే హృదయాన్ని ఇచ్చిన దేవుడు పిల్లల్ని కనడానికి ఒక గర్భసంచిని ఎందుకు ఇవ్వలేదా అని దేవుడ్ని తిట్టేవాడ్ని కోటమ్మ గుర్తొస్తే.ఐనా ప్రేమించే హృదయం లేనివారుకదా నిజంగా గొడ్రాళ్ళు. పిల్లల్ని పెంచటం రానివాళ్ళ కదా గర్భసంచులు లేనివాళ్లు.నాకు పిల్లలు లేకపోతే ఏంటి నేను పురుడుపోసిన ప్రతి శిశువు నా బిడ్డేగా అనేది పిచ్చి కోటమ్మ.పిల్లో పిళ్ళాడో పుట్టినాకా ఐదో పదో ఇస్తే వాటితోనే కుటుంబాన్ని పోషించుకుంది.పిచ్చితల్లి ఎక్కడుందో?మాలాంటి పిల్లలందరిని ప్రేమించిన కోటమ్మ ఆత్మని ఎప్పుడయినా జ్ఞాపకం తెచ్చుకుంటే
ఏమీ ఆశించని వెన్నెల గుర్తొస్తుంది.ఒకకన్నుతో కన్నీటిని రాల్చుతూ మరొకన్నుతో ఉమ్మనీటిని వాసన పీల్చుకుంటూ..జీవించింది.కోటమ్మ… థాంక్ యూ..మమ్మల్ని నీ హస్తాలతో తాకినందుకు మా తల్లుల్ని పురిటి గండాల్నించి కాపాడినందుకు.

కోటమ్మ నువ్వు పిల్లల్ని కనని మాతృమూర్తివి. గర్భసంచి లేని తల్లివి. కోటమ్మ నీకు మరణం లేదు. నువ్వు చనిపోతే నువ్వు పురుడు పొసిన బిడ్డలే నీపాడిని మోశారు. నిన్ను కాల్చలేక కాల్చారు. వొదులుకోలేక వొదులుకున్నారు.

కోటమ్మ నువ్వు జీవితాన్ని జయించావు.

ఇట్లానే బతకాలని,ఇట్లానే నలుగురికి సాయపడి పదిమందికి ఉపయోగపడుతూ బతకాలనే పాఠాన్ని నేర్పి పోయావు…అందుకు థాంక్స్..అందుకే థాంక్స్..

*

పెద్దన్న

16 comments

Leave a Reply to ఫజుల్ రహమాన్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంత్రసాని అనే పదం కనుమరుగయ్యే ఈ కాలంలో ఎప్పుడో విన్నట్టుగా ఉందే అనుకునే ఈ రోజుల్లో ఆ పదమే వినలేదు అని ఆలోచించే సమయం లో ఆ పదం వినగానే ఏవో మంత్రాలు వేసే వారు అని భయపడే ఈ మధ్య కాలంలో
    మంత్రసాని అనే ఒక గొప్ప వ్యక్తిని ఈ నవ సమాజానికి కళ్లకు కట్టినట్టుగా వివరించాలని మీ ఆలోచనలకు నా శిరస్సు వంచి అభినందనలు.

    • ఎక్స్ళ్లేంట్…సర్..మీ కామెంట్..విలువైనది…మీ స్పందనకు కృతజ్ఞతుడ్ని…

  • Chala bavundi annaya… Sahayam chesina vallani marchipokapovatame nijamina manavatwam.. U r great annaya

    • Tq saibaba.. జోస్న.. నువ్వుకూడా రాస్తున్నావ్ హప్ప్య్…

  • మంత్రసాని జీవితాన్ని చిత్రిక పట్టారు…ఔను..మీరన్నట్టు ఆనాడు కనడానికి ఏ ముహూర్తాలూ లేవు..మంత్రసాని చేయి పడిందే ముహూర్తం. ఇప్పుడు మంత్రసానులూ లేరు.. వారితో కాన్పు చేయించుకునే స్త్రీలూ లేరు.

    మీ కథ బాగుంది పెద్దన్నా అభినందనలు…

    • మంత్రసానుల ప్రేమల్ని,వారిచేతి స్పర్శల్ని ఊళ్ళు కోల్పోయాయి…బొడ్డుకోసి బిడ్డల రక్తాన్ని తుడుస్తూ కన్నీళ్లు పెట్టుకునే మంత్రసానులు లేరు…సిజేరియన్ చేసి..కాష్ తీసునే..డాక్టర్స్ తప్ప…

  • నోకియా, శాంసంగ్ ఫోన్లను అందరూ కొన్నారు.
    కానీ ఎంతమందికి ఆ కంపెనీ మొదటి మోడల్
    గుర్తుంది?
    ఇప్పుడున్న కాలంలో మనకి 10 మంది డాక్టర్లు గుర్తున్నారు.
    కానీ ఎంతమందికి మన మొదటి డాక్టర్(మంత్రసాని)
    గుర్తున్నారు?
    మనం గుర్తుంచుకోవలసినదాన్ని మర్చిపోతునం,
    మర్చిపోవలసినధాన్ని గుర్తుంచుకుంటున్నాం.
    మొన్న తాత, నేడు మంత్రసాని. నీ కథల ద్వారా
    జీవితాలు, విలువలు ఇంత బాగా గుర్తుచేస్తున్నందుకు
    ధన్యవాదాలు పెద్దన్న.

  • మీ కామెంట్ ఆలోచింపజేస్తుంది…అన్నా..excellent..

  • Anati Biddalu putta ganay kotamma prema apyayathala sparsha thagili sahajaganay yentho arogyanga undayvallu.
    Neti Passikandhu lu A Dhivika sparsha koolipoyaru .
    Kottamma di Nissvardha seva ithay,Neti kotamaladi(Dr’s&Nurses )di swardha seva.
    ANDHU KAY PEDDHA OPERATIONS EKUVAINAAYE PEDDHANNA GARU MARABHATHULA.

  • అప్పట్లో మంత్రసాని ఇంటికి వచ్చిందటే నిండు గర్బినికి కొండంత దైర్యం. పండంటి బిడ్డ ఏ ప్రతిబంధకం లేకుండా బయటకు వస్తదనిభరోసా. ఎప్పుడూ పాతచీరలో కనిపించే మంత్రసాని ఉన్నట్టుండి వేరే చీర కట్టిందంటే కాలనిలో ఎవరో నీలాడారని సంకేతం. తల్లికి తనే, ఆమె బిడ్డకు తనే ఇలారెండుతరాలకు పురుడు పొసే మంత్రసానులు నిజంగా మానవతామూర్తులు. మా ఊరిలో కులానికో మంత్రసాని ఉండేది. n

    • అవును..అవును…అన్నిపోతున్నాయి…మనమూ పోతున్నాము…అడ్డదిడ్డంగా ….tq

  • బాగుంది ! పల్లెటూళ్ళలో పుట్టిన నాతరం వారికి ‘మంత్రసాని’ పేరు పరిచయమే. నేటి తరానికి ‘మంత్రసాని’ పేరు తెలియకపోవచ్చు. నేడు ప్రతీ మండల కేంధ్రానికో ప్రభుత్వ దవాఖానాలున్నాయి అంతకు మించి ప్రయివేటు ఆసుపత్రులు కోకొల్లలు వేలకు వేలు డబ్బులు వెదజల్లితే కాని ప్రసవాలు జరగటం లేదు. కోటమ్మలాంటి వారు ప్రతీ ఊరుకొకరు ఉండే వారు. నా చిన్ననాటి సంఘటనలు కళ్లముందు కదిలినట్టుగా వుంది రచన ! అభినందనలు !!

    • మీ కామెంట్కి వాల్యూబుల్ వన్ ప్రసాద్ సర్..tq..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు