కొసమెరుపులోని అందం…

కథ ముగింపులోని ఈ అనుకోని మలుపు గురజాడ ద్వారా తెలుగు కథలో  ఒక నమూనా నిర్మాణంగా మిగిలినప్పటికీ ఈ ట్విస్ట్ కు అవసరమైన అనివార్యతనూ నమ్మశక్యతనూ నిర్మించటంలో గురజాడ సక్సెస్ అయినట్లు కనిపించదు.

థలోని కంటెంట్ కు ఆధారం జీవితమే అయినప్పటికీ జీవితం దానికి అదే కథ కాలేదు.

కథకులు తమ కల్పనా శక్తితో కళా వ్యూహంతో కొంత డ్రామానీ, కొంత ఉత్కంఠనీ, అనుభవైక్యతనీ, ఆర్టిస్టిక్ లాజిక్ నీ చేర్చి సహజత్వం ఉట్టిపడేట్టు చేస్తే అది కథవుతుంది.ఈ క్రమంలో వర్ణన, రిపోర్ట్, సంభాషణ, వ్యాఖ్యానం పాత్రల పరస్పరత, ఘటనల ,సన్నివేశాల రూప కల్పన కథను కథగా తీర్చి దిద్దుతాయ్. ఇలా కథను నిర్మించే పద్ధతులు రకరకాలు.

జరగబోయేదానినుంచి పాఠకుల దృష్టిని దానికి భిన్నమైన దానివైపుకు మళ్లించి వారు ఊహించిన దానికి సంబంధం లేని మలుపును సృష్టించటం ఒకానొక కధానిర్మాణపద్ధతి. తమ అంచనాలు తారు మారైన ప్పుడు కలిగే ఆశ్చర్యానికీ షాక్ కీ గురయ్యేటట్లుగా పాఠకుల్ని నడపటంలోనే ఈ నిర్మాణపధ్ధతి మెరిట్ ఉంది. ఈ ప్లాట్ ట్విస్ట్ నీ లేదా ట్విస్ట్ ఎండింగ్ నీ సాధించటంలోని అనివార్యతనీ, నమ్మశక్యతనీ కథకులు ఎంతబాగా రూపొందించగలిగితే అంత విజయాన్ని కథ పొందగలుగుతుంది. ఫ్రెంచ్ కధా రచయిత మపాసా ఈ కధావిధానానికి ఆద్యుడైనప్పటికీ ఓ. హెన్రీ తదితర అమెరికన్ కథకులు ఈ నిర్మాణ పద్ధతిని ఎక్కువ ప్రాచుర్యంలోకి తెచ్చారు.

తెలుగులో గురజాడ కథలన్నీ ఈ నిర్మాణంలోనే నడుస్తాయి. ఆయన తొలి కధ ‘దిద్దుబాటు’ ఇందుకు మంచి ఉదాహరణ.ఇందులో వేశ్యాలోలత్వాన్ని ఎండగట్టటమే ఇతివృత్తం. ఈ ఇతివృత్తాన్ని కథగా మలచడానికి ఊహించని మలుపును రూపొందిస్తాడు.  ఎప్పటిలాగే రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన గోపాలరావుకు భార్య కమిలిని కనిపించదు. ఆమె వదిలిన ఉత్తరం చేతికందుతుంది. వేశ్యాలోలత్వానికి లోబడిన అతని ప్రవర్తనకు బాధపడి పుట్టింటికి వెళుతున్నట్లుగా భార్య అందులో రాస్తుంది.అది చదివి భర్త తన తప్పును తెలుసుకుని కుమిలిపోతాడు. ఆమెను తీసుకురావడానికి బయలుదేరే సమయంలో అప్పటివరకూ మంచం కింద దాక్కున్న కమిలిని సంతోషంతో కిల కిలా నవ్వుతూ బయటికి వస్తుంది. ఆమె పుట్టింటికి వెళ్లలేదనే విషయం గోపాలరావుతో పాటు పాఠకులకూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వారి అంచనాలు ఆ విధంగా తారుమారవుతాయి. గురజాడ రాసిన’ పెద్ద మసీదు’ కూడా ఈ అంచనాల తారు మారు నిర్మాణంలోనే నడుస్తుంది.

కథ ముగింపులోని ఈ అనుకోని మలుపు గురజాడ ద్వారా తెలుగు కథలో  ఒక నమూనా నిర్మాణంగా మిగిలినప్పటికీ ఈ ట్విస్ట్ కు అవసరమైన అనివార్యతనూ నమ్మశక్యతనూ నిర్మించటంలో గురజాడ సక్సెస్ అయినట్లు కనిపించదు. ఇది ట్విస్టుగా కంటే ఒక చీప్ సినిమాటిక్ ట్రిక్కు గా కనిపిస్తుంది. అయితే  ఈ నమూనాలో నడిచిన కధలు చాలానే ఉన్నాయి. లబ్ద ప్రతిష్టులైన ఎంతోమంది తెలుగు కథకులు ఈ నిర్మాణ వ్యూహాన్ని  గురజాడకంటే బాగా అల్లగలిగారు. ఇదే ట్విస్టును నేటితరం కథకులు చక్కగా పండించగలుగుతున్నారు.

తెలివి అగ్రకులస్తుల జాగీరు కాదని నారాయణ రెడ్డికి తెలిసి రావడాన్ని ‘జాగీరు’ అనే కథగా పసునూరి రవీందర్ చాలా convincing గా నిర్మిస్తాడు. కులోన్మాది అయిన నారాయణరెడ్డి  ఇంజనీరింగ్లో చేరిన తన కొడుకు ఆదిత్య కు అన్ని విధాలా ఉపయోగ పడుతూ వున్న వినయ్ అంటే ఇష్టం కలుగుతుంది. ఆధునిక సాంకేతికతో  ఆటాడుకునే వినయ్ తీరు చూసి నారాయణరెడ్డి ఎన్నో సార్లు ఆశ్చర్యానికి లోనవుతాడు.’ ఈ జనరేషన్ కు అసలైన హీరో వినయే’ అనుకునేవాడు. అలాంటిది ఒకరోజు వాళ్ల ఇంట్లో ఆదిత్యతో కలిసి వినయ్ టీవీ చూస్తున్న సమయంలో మాల మాదిగల్ని, మిగిలిన పీడిత కులస్తులనీ బండ బూతులు తిడుతూ ఉంటాడు.

చెడిపోయిన మోటార్ బాగుచెయ్యటానికి వస్తానన్న ఎలెక్ట్రీషియన్ కొన్ని రోజులుగా రాకపోవడం వల్ల  కోపంతోఅతని కులం పేరుతో అతన్ని తిడుతూ అతని కులపోళ్ళందరినీ నోటికొచ్చినట్లు తిడుతూ కొడుకు ఉన్న గదికొస్తాడు. అప్పటికే వినయ్ వెళ్ళిపోయాడు. డల్ గా కూర్చున్న ఆదిత్య ,’అట్లా కులం పేరుతో తిడితే ఎట్లా? వినయ్ విని హర్ట్ అయి వెళ్ళిపోయాడు తెలుసా’ అంటాడు.  ‘వినయ్ ఎందుకు వెళ్ళిపోయిండు? వినయిదే కులం?’ అని అడుగుతాడు నారాయణ రెడ్డి. తానిప్పటివరకూ ప్రతిభ లేనివాళ్లుగా తిడుతున్న sc కులానికి చెందినవాడే వినయ్ అని తెలిసి ‘నారాయణ రెడ్డికి మనసంతా ఏదోలా ఉంది.తెలివి ఒకరి జాగీరు(సొత్తు)కాదని తెలిసొచ్చింది’ అనే కామెంట్ తో కధ ముగుస్తుంది. నారాయణరెడ్డి తో పాటు పాఠకులకీ వినయ్ కులం చివరిలో గాని తెలీదు. అతనితో పాటు పాఠకులూ తెలివి ఒకరి జాగీరు కాదని ఫీలవుతారు. అనుకోని మలుపును నిర్మించటంలోని అనివార్యతను వాస్తవికంగా అలా రూపొందిస్తాడు కధకుడు. కథను వినయ్ కోణం నుంచి కాకుండా నారాయణరెడ్డి కోణం నుంచి నడపటంలోనూ కధ ఐరనీ ఆఫ్ లైఫ్ ని బాగా పట్టించగలిగింది.

నారాయణ రెడ్డిని కులోన్మాదిగా బిల్డ్ అప్ చేయటానికి అతనికి రాజేశం అనే వెలమతో ఉన్న స్నేహాన్ని చూపిస్తూ మధ్యలో ఒక సబ్ ప్లాట్ నడుపుతాడు కధకుడు. వృత్తిపరంగా ఉద్యోగ రంగాల ప్రకారంగా వారికి ఎన్ని గొడవలున్నా కింది కులాల వారిపట్ల వారికున్న చులకన భావంలో ఐక్యత ఉండటాన్ని సహజంగా చూపుతాడు. ఈ పని చేసే క్రమంలో కధ కొంత డ్రాగవుతుంది. అనవసర సాగదీత వల్ల మూడ్ కొంత దెబ్బ తింటుంది.మెయిన్ ప్లాట్ కంటే సబ్ ప్లాట్ నిడివి ఎక్కువై ప్రారంభానికి చెందిన లింకు తెగినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ వినయ్ కులం  ఐడెంటిటీ మీదినుంచి పాఠకుల దృష్టిని మొదటినుంచి ముగింపువరకు పక్కకు మళ్లించి పట్టుకురాగలిగాడు రచయిత.

ప్లాట్ ట్విస్టు ను చివరిలో ఫీలయ్యేట్లు చేసే ఈ పద్ధతిని కథలోని వివిధ దశల్లో క్రియేటివ్ గా నిర్మించడం ద్వారా మాస్టర్ చేసిన కధకులూ మనకున్నారు.తరువాతి భాగంలో అడుగడుగునా పాఠకుల్ని బోల్తా కొట్టిస్తూ చివరిలో ఒక బిగ్ ట్విస్ట్ తో గొప్పగా అలరించే బిగిని పట్టుకోడానికి ప్రయత్నం  చేద్దాం.

*

గుంటూరు లక్ష్మి నర్సయ్య

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • క‌థా నిర్మాణంలో అద్భుత‌మైన విష‌యాన్ని ప‌రిచ‌యం చేసిన ప్ర‌ముఖ విమ‌ర్శ‌కులు జీ.ల‌క్ష్మీ న‌ర్స‌య్య సార్‌కి ధ‌న్య‌వాదాలు. క‌విత్వ నిర్మాణ విష‌యాలు విశ్లేషించ‌డానికి మ‌న‌కు అనేక‌మంది విమ‌ర్శ‌కులు ఉన్నారుగాని, కథా విమ‌ర్శ‌కుల కొర‌త ఎంత‌గానో ఉంది. అలా మా క‌థ‌ల మంచి చెడుల‌ను చెప్పే వాళ్లుంటే బాగుండ‌ని నేను, నా తోటి క‌థ‌కులం ప‌లుమార్లు అనుకున్నం. ఇలాంటి నేప‌థ్యంలో నా క‌థ‌లోని మంచి చెడుల‌ను నిస్ప‌క్ష‌పాతంగా వివ‌రించినందుకు ల‌క్ష్మీన‌ర్స‌య్య‌సార్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. ఇలాంటి విశ్లేష‌ణలే తెలుగు క‌థా ద‌శాదిశ‌ను నిర్ణ‌యిస్తాయ‌ని భావిస్తున్నా. ల‌క్ష్మీన‌ర్స‌య్య‌గారికి, సారంగ సంపాద‌క వ‌ర్గానికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు.
    -డా.ప‌సునూరి ర‌వీంద‌ర్‌

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు