కొయ్యకత్తి

క ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆయనకు ప్రజలంటే చాలా ప్రేమ, దయ. ఒకసారి రాత్రి చీకటిలో బయటకు చూస్తావుంటే వీధుల్లో అక్కడక్కడ దీపాలు ఆరుతూ వెలుగుతూ కనబడ్డాయి. తాను హాయిగా అంతఃపురంలో కాలు మీద కాలేసుకుని పడుకున్నట్లే తన ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారా లేదా తెలుసుకోవాలి అనిపించింది. దాంతో రాజులాగా పోతే రహస్యాలు బయట పడవని తనను ఎవరూ కనుక్కోకుండా ఒక పేదవానిలా మారువేషం వేసుకొని నగర వీధుల్లోకి బయలుదేరాడు. అక్కడ అనేకమందిని కలిశాడు. వారి మాటలు విన్నాడు.

కానీ… ఆడా మగా, చిన్నా పెద్దా, ధనికా పేదా తేడా లేకుండా ఎవరు చూసినా ఏదో ఒక దిగులు. నోరు విప్పితే చాలు కష్టాలు వరదల్లా ముంచెత్తుతున్నాయి. “అసలు ఈ రాజ్యంలో సంతోషంగా ఒక్కరు కూడా లేరా” అని ఆలోచించుకుంటూ పోతూవుంటే ఒక పాడుబడిన గుడిసె లోపలినుంచి పడీపడి నవ్వుతున్న మొగుడు పెళ్ళాల మాటలు సంబరంగా వినపడ్డాయి. “అరే ఇంత నిరుపేదలు ఇంత సంతోషంగా ఉన్నారే. కారణం కనుక్కుందాం” అని తలుపు తట్టాడు.

“ఎవరూ” అన్నారు లోపలినుంచి.

“ఒక పేద యాత్రికున్ని. ఆకలి అవుతావుంది. ఏమన్నా పెడతారేమోనని” అన్నాడు.

వాళ్లు చిరునవ్వుతో తలుపు తెరిచారు. “దా లోపలికి. కడుపునిండా కావలసినంత కోరుకున్నవన్నీ పెట్టలేం గానీ మాకు ఉన్నదాంట్లో నీకు సమానభాగం ఇస్తాం” అంటూ స్వాగతం పలికారు. వాళ్లు వండుకున్న దానిలో మూడోభాగం రాజుకు పెట్టారు. వాళ్లతో మాటలాడుతూ వివరాలు కనుక్కుంటూ నెమ్మదిగా తిన్నాడు. చేయి కడుక్కుంటూ “మిమ్మల్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. లోకంలో ఎవరు చూసినా ఏదో ఒక సమస్యతో బాధపడతా ఉన్నారు. కానీ నేనిక్కడ ఇంతసేపు ఉన్నా మీరు ఒక్క బాధ కూడా చెప్పుకోలేదు. ఇంతకీ నువ్వు ఏం చేస్తా వుంటావు” అని అడిగాడు.

దానికి ఆ పేదవాడు చిరునవ్వు నవ్వి “మిత్రమా… నేను చెప్పులు కుడతాను. నాలుగు వీధులు కలిసే చోట నాకు అంగడి ఉంది. ఎదుటివారు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. నాకు కావలసిన ధనం చేతికి అందగానే అంగడి మూసి వచ్చేస్తాను” అన్నాడు.

“ఎప్పుడైనా నీకు పని దొరకక ఒక రూపాయి కూడా చిక్కలేదనుకో… అప్పుడు ఎట్లా” అన్నాడు.

పేదవాడు చిరునవ్వు నవ్వి “ఇంతవరకు ఎప్పుడూ అలా జరగలేదు. కానీ దేవుడు ఒక దారి మూసేస్తే ఇంకొక దారి తెరుస్తాడు. అంతేగానీ లోకంలో ఎవరినీ ఆకలితో చావనివ్వడు” అన్నాడు. రాజుకు ఆ పేదవాని మాటలు చాలా నచ్చాయి. అదే సమయంలో అతనికి తన మాటల మీద ఆ పేదవానికి ఎంత నమ్మకం వుందో పరీక్షించాలి అనే కోరిక కలిగింది.

తర్వాతరోజు ఉదయం ఊరంతా దండోరా వేయించాడు. “ఈ రోజునుంచీ రాజ్యంలో ఎక్కడా ఎవరూ చెప్పులు కుట్టకూడదు. అలా కుడితే వంద కొరడా దెబ్బలు” అని. దాంతో ఆ పేదవానికి పని పోయింది. అతను ఎప్పుడూ ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకొని హాయిగా బతకడమే గానీ అందరిలా ఎక్కువ సంపాదించుకొని దాచిపెట్టుకునే రకం కాదు కదా… దాంతో ఏం చేయాలబ్బా అని ఆలోచించకుంటా పోతూ వున్నాడు.

అలా నడిచీ నడిచీ బాగా దాహం అయ్యింది. దాహం తీర్చుకోవడానికి ఒక బావి దగ్గరకు పోయాడు. అక్కడ ఒకతను పది బిందెలు నింపుకొని బండిలో పెట్టుకోవడం కనిపించింది. “ఎందుకు మిత్రమా అన్ని నీళ్ళు నింపుకుంటా ఉన్నావు” అని అడిగాడు.

దానికి అతను “ఈ ఊరిలో ధనవంతులు చాలామంది ఉన్నారు. వాళ్లుగానీ, వాళ్ళ ఇంటి ఆడవాళ్లు గానీ నీళ్ల కోసం బిందెలు మోసుకుంటూ ఇంత దూరం రాలేరు. అందుకే బిందెలు నింపుకొని ఆ వీధుల్లో పోతే చాలు ఎగబడి కొంటారు” అన్నాడు. పేదవానికి ఆ ఆలోచన నచ్చింది. వెంటనే ఇంటికిపోయి నాలుగు బిందెలు తీసుకొని, వాటిని నింపి కావడిలో పెట్టుకుని ధనవంతుల ఇళ్లకు అమ్మడానికి పోయాడు. సాయంకాలానికంతా కావలసినంత ధనం చేతికి అందింది. ఆ రోజుకు కావలసిన సరుకులన్నీ కొనుక్కొని సంబరంగా ఇంటికి వచ్చాడు. అలా వారం రోజులు గడిచిపోయాయి.

ఒకరోజు రాత్రి కాగానే మరలా మారువేషం వేసుకొని రాజు ఆ పేదవాని ఇంటికి పోయాడు. పేదవాడు రాజును చూస్తూనే చిరునవ్వుతో “రా మిత్రమా రా… ఈరోజు కూడా మాతో కలసి కాస్త కడుపు నింపుకో” అని నవ్వుతూ ఆహ్వానించాడు. రాజు లోపలికి పోయి కూర్చున్నాడు. పేదవాని మొహంలో చిరునవ్వు తప్ప చిన్న బాధ కూడా లేదు. మాటల్లో నవ్వులే తప్ప కొంచెం కూడా విచారం లేదు. అది చూసి రాజు “మొన్న రాజ్యంలో ఎవరూ చెప్పులు కుట్టకూడదని రాజు వేసిన దండోరా విన్నాను. ఆ రోజు నుంచీ నీ గురించే ఆలోచిస్తా ఉన్నాను. దేవుడు ఒక దారి మూసేస్తే ఇంకోదారి తెరుస్తాడు అన్నావు కదా. మరి బ్రతకడానికి మరోదారి దొరికిందా” అన్నాడు.

పేదవాడు చిరునవ్వు నవ్వి జరిగిందంతా చెప్పి “ఆశ లేకుండా జానెడు పొట్ట నింపుకోవడం ఎంతసేపు. మా ఇద్దరికీ ఎలాంటి లోటు లేదు. హాయిగా కాసేపు వీధి వీధి తిరుగుతా కాసిన్ని నీళ్లు అమ్ముకుంటే చాలు” అన్నాడు.

తరువాత రోజు రాజు “ఈ రోజునుంచీ రాజ్యంలో మంచినీళ్లు వీధి వీధి తిరుగుతూ అమ్మినా కొన్నా వంద కొరడా దెబ్బల శిక్ష తప్పదు” అని దండోరా వేయించాడు. దాంతో ఆ పేదవాడు మరలా వీధిలో పడ్డాడు. చేతిలో పని పోయినా పెదవులపై చిరునవ్వు మాత్రం చెక్కుచెదరలేదు.

“ఏం పని చేద్దామబ్బా” అని ఆలోచిస్తా తిరుగుతావుంటే ఒకచోట కట్టెలు అమ్మేవాడు కనబడ్డాడు. అతని దగ్గరికి పోయి “మిత్రమా కట్టెలు అమ్ముకుంటే కడుపు నిండుతుందా” అని అడిగాడు.

అతను చిరునవ్వు నవ్వి “ఊరి బయట అడవిలో ఊరికే కట్టెలు దొరుకుతాయి. చేతికి బలం ఉంటే చాలు కావలసినన్ని కట్టెలు కొట్టి అమ్ముకోవడమే. అయినా సోమరిపోతులకు బతకడం కష్టంగానీ మనలా శ్రమను నమ్ముకున్న వాళ్ళకు కాదు కదా” అన్నాడు. వెంటనే ఆ పేదవాడు ఇంట్లో ఉన్న గొడ్డలి సానరాయితో బాగా పదునుపెట్టి అడవికి పోయాడు. మోయగలిగినన్ని కట్టెలు కొట్టుకుని తెచ్చి వీధుల్లో అమ్మడం మొదలుపెట్టాడు.

సాయంకాలానికంతా కావలసినంత ధనం చేతికి అందింది. రోజుకోరకం పళ్ళు, కూరగాయలు తెచ్చుకొని కమ్మగా  కడుపునిండా సంబరంగా తినసాగారు. అట్లా వారం రోజులు గడిచిపోయాయి.

ఎప్పటిలాగే రాజు మారువేషం వేసుకొని వాళ్ళుండే చోటికి వచ్చాడు. లోపల కిలకిల నవ్వుకుంటా సరదాగా మాట్లాడుకుంటున్న మొగుడూ పెళ్ళాలు కనిపించారు. రాజును చూడగానే అతను “రా… రా… మిత్రమా లోపలికి. వారం దాటిపోయింది మనం కలసి కబుర్లు చెప్పుకుంటా తినక. ఈరోజు మాతో కలసి కమ్మగా కడుపు నింపుకుందువుగానీ” అంటూ ఆహ్వానించారు.

రాజు ఆ పేదవాని మొహంలో గానీ, మాటల్లో గానీ కొంచెం కూడా విచారం కనపడకపోవడంతో ఆశ్చర్యపోయి “రాజ్యంలో ఎవరూ నీళ్లు అమ్మకూడదని రాజు దండోరా వేయించాడు కదా. మరి ఎలా బతుకుతా వున్నావు. ఆ రాజు చాలా దుర్మార్గునిలా ఉన్నట్టున్నాడే” అన్నాడు. దానికి ఆ పేదవాడు “రాజును ఎందుకు తిడతావు మిత్రమా. మా రాజు చల్లని దయగల మహానుభావుడు. ఏ కారణం లేకుండా ఏ పనీ చేయడు. ప్రజలు కష్టపడకూడదని అతని ఆలోచన కావచ్చు” అన్నాడు. రాజు అతని మంచితనానికి మనసులోనే దండం పెట్టుకున్నాడు. అయినా పట్టు వదలలేదు.

తర్వాతరోజు బాగా ఆలోచించి “రేపటినుంచి రాజ్యంలో ఎవరూ కట్టెలు కొట్టకూడదు. వాళ్ళందరికీ సైనికులుగా ఉద్యోగం ఇస్తున్నాం. వెంటనే సైన్యంలో చేరిపోవాలి” అని దండోరా వేయించాడు. అది విని పేదవాడు చాలా సంబరపడ్డాడు. ఈ చిన్న చిన్న పనులకంటే సైనికుని పని బాగుంటుంది అనుకున్నాడు. తన చేతిలోని గొడ్డలి వాళ్లకి అప్పగించి సైన్యంలో చేరిపోయాడు. వాళ్లు అతని చేతికి ఒక వెండికత్తి ఇచ్చి రాజమహల్ దగ్గర కాపలా పని అప్పగించారు.

సాయంత్రం కాగానే ఆ పేదవాడు సంబరంగా సైన్యాధికారి దగ్గరికి ఉరుక్కుంటా పోయి ఆ రోజు కూలి ఇవ్వమని అడిగాడు. సైన్యాధికారి చిరునవ్వు నవ్వి “ఇక్కడ ఏ రోజు కా రోజు కూలి ఇవ్వరు. నెలకు ఒకసారి అంతా కలిపి జీతం ఇస్తారు” అన్నాడు.

సైనికునికి దిక్కుతోచలేదు. నెలరోజులు బతికేది ఎట్లా… ఏదైనా పని చేసుకుందామంటే పొద్దున పోతే రాత్రి వరకు రాజమహలు దగ్గరే సరిపోతుంది. ఆలోచిస్తా వుంటే నడుముకున్న వెండికత్తి గుర్తుకు వచ్చింది. వెంటనే ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి పోయి వెండికత్తి కుదువ పెట్టి నెల గడవడానికి కావలసిన సరుకులు తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చి అచ్చం అలాగే ఉండే ఒక కొయ్య కత్తి తయారు చేసి దాన్ని నడుముకుండే ఒరలో దోపుకున్నాడు. జీతం రాగానే వెండికత్తిని వెంటనే విడిపించుకోవాలి అనుకున్నాడు.

వారం దాటగానే ఎప్పటిలా మారువేషం వేసుకున్న మహారాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మొగుడు పెళ్ళాలు లోపల సరదాగా కిలకిలా నవ్వుకుంటన్న మాటలు వినిపించాయి. “అరే… వారం రోజులుగా కూలీ లేకున్నా ఎలా ఇంత సంబరంగా ఉన్నారు” అనుకుంటా లోపలికి పోయాడు. ఆ పేదవాడు మిత్రునికి అన్నం పెడుతూ జరిగిందంతా వివరించి కొయ్యకత్తి చూపించాడు.

రాజు బాగా ఆలోచించి ఈసారి తప్పించుకోకుండా ఒక ఎత్తు వేశాడు. తర్వాతరోజు పొద్దున్నే రాజమహలు దగ్గరికి సైనికుడు పోగానే సైనికాధికారి పిలిచి “నిన్న ఒక దొంగకు రాజుగారు మరణశిక్ష విధించారు. వాని తల నరకవలసిన పని నీ మీద పడింది. వెంటనే సిద్ధమవు. మరో అరగంటలో ఆ దొంగను తీసుకొని వస్తారు” అని చెప్పి అతని చేతిలో భయంకరమైన పదునైన పెద్ద కత్తి పెట్టాడు.

ఆ మాటలు వినగానే పేదవాడు అదిరిపోయాడు. “అయ్యా నేను ఇంతవరకు చిన్న చీమకు కూడా అపకారం తలపెట్టలేదు. అలాంటిది ఒకేసారి ఒక మనిషి తల నరకడం అంటే నాతో కాదు. కావాలంటే ఈ ఉద్యోగం ఇప్పుడే ఇక్కడే వదిలేసి పోతా” అన్నాడు.

దానికి ఆ సైన్యాధికారి ఒప్పుకోలేదు. “రాజు గారి మాటంటే మాటే. ఈరోజు నీ వంతు. అంతగా కావాలంటే వాని తల నరికి ఆ తర్వాత ఉద్యోగం వదిలివేయి. కాదు కూడదు అంటే ముందు నీ మెడ మీద తలకాయ ఉండదు జాగ్రత్త” అని హెచ్చరించాడు.

ఆ పేదవాడు దొంగను ఎలా మరణశిక్ష నుంచి తప్పించాలా అని తెగ ఆలోచించాడు. అంతలో అతనికి తన నడుముకున్న కొయ్యకత్తి గుర్తుకు వచ్చింది. వెంటనే తనకు ఇచ్చిన కత్తి పక్కన పెట్టి ఆ దొంగ ముందు నిలబడి “ఓ దేవుడా… ఈ ప్రపంచంలో ఇంతవరకు నేను ఎవరికీ ఎటువంటి హానీ చేయలేదు. తప్పు చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి గానీ ఇలా మరణశిక్ష వేయడం పెద్ద తప్పు. నా మాట నిజమే అయితే నేను నా ఒరలోంచి తీసే వెండికత్తి క్షణంలో కొయ్యకత్తిగా మారిపోవాలి” అని గట్టిగా అరుస్తూ సర్రున ఒరలోంచి కత్తి తీసి పైకెత్తాడు.

చూస్తున్న జనాల కళ్ళంతా ఆశ్చర్యంతో పెద్దగయ్యాయి. సైనికాధికారికి నోట మాట రాలేదు. ఆ పేదవాని చేతిలో వెండికత్తి కాక కొయ్యకత్తి సూర్యుని వెలుతురు పడి మెరుస్తా కనపడింది. “ఏమిటీ వింత” అనుకున్నాడు.

అంతలో “ఆపండి. ఆ దొంగను వదిలివేయండి. అతను దొంగ కాదు. ఇది ఒక చిన్న నాటకం మాత్రమే” అంటూ నవ్వుతూ రాజు అక్కడికి వచ్చాడు.

రాజును చూసి పేదవాడు చాలా ఆశ్చర్యపోయాడు. తడబడుతూ “మిత్రమా మీరు ఈ దేశానికి ప్రభువులా” అన్నాడు.

రాజు నవ్వేశాడు. ఆప్యాయంగా అతని భుజంపై తట్టి “ఇకపై నీవు సైనికునిగా ఉండవలసిన అవసరం లేదు. నా సలహాదారులలో ఒకనిగా ఉండు” అన్నాడు.

“మహారాజా అంత పెద్ద పదవికి నేను సరిపోనేమో” అన్నాడు సందేహంగా ఆ పేదవాడు.

రాజు చిరునవ్వు నవ్వి “నీ మనసు చాలా మంచిది. సాయం చేయడం, ఉన్నదానిలో తృప్తిగా బతకడం, సంపాదించాలనే యావ లేకపోవడం, ఇతరుల పట్ల ప్రేమ దయ కలిగి ఉండడం, కష్టాల్లోనూ పెదాలపై చిరునవ్వు తొలగకపోవడం, అపాయంలో ఉపాయంతో తప్పించుకోవడం… ఇలా ఇంతకన్నా మంచి గుణాలు ఇంకేం ఉంటాయి సలహాదారునిగా నియమించుకోవడానికి. ఈ రోజే ఇప్పుడే చేరిపో” అని నవ్వేశాడు.

*

Follow Saranga on https://www.instagram.com/edi.tor472/

ఎం.హరి కిషన్

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ చాలా బాగుంది. హరికిషన్ గారికి ధన్యవాదములు.

  • పిల్లలకు చెప్పడానికి ఒక మంచి కథ దొరికింది. మీ సూది కథ మా పిల్లలు అడిగి మరీ చెప్పించుకుంటారు.

  • కొయ్య కత్తి..కథ పిల్లల్లో విజ్ఞానం అందించగల కథ.
    అంతమాత్రమే కాదు బాలబాలికలకు స్పూర్తి డాయకమైన మంచి కథ.
    రచయిత హరికిశన్ గారికి అభినందనలు/శుభాకాంక్షలు.
    ——–డాక్టర్ కె.ఎల్.వి ప్రసాద్
    సికిందరాబాద్.56

  • సమస్యలను అనుకూలం మలచుకోవడం,ప్రతికూల పరిస్థితుల్లో జీవితాన్ని గడపటం,ఎల్లప్పుడూ సంతోషము తో కుటుంబసభ్యులతో వుండటమనే మంచి విషయము తో కథ చెప్పిన విధానం బాగుంది..

  • కథ చాలా బాగుంది. రాజు, తన దగ్గర పనిచేసే సలహాదారుకి మంచి వ్యక్తిత్వం కలవారిని నియమించుకోవాలనే స్పృహ ఉండడం సరైన విషయం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు