కొన్ని లెక్కలు… మరికొన్ని ఊహల రెక్కలు…

లోటస్‌ ఫిలిం కంపెనీ – హైదరాబాదు

(తెలంగాణ సినిమా మూకీ యుగం: 1896 –1932)

రచన – హెచ్‌. రమేశ్‌ బాబు

ప్రతులకు – అన్ని ప్రధాన పుస్తక విక్రయశాలల్లో.

పేజీలు – 160, వెల – రూ. 150

మూకీల నుంచి టాకీల మీదుగా ఇప్పుడు ఓటీటీ సినిమాల దాకా సాగిన మన చలనచిత్రాల ప్రస్థానం సుదీర్ఘమైనది. అందులో… మాటలు లేని మూగ సినిమాల శకం గురించి రికార్డయిన చరిత్ర తక్కువ. అందులోనూ తెలుగు వారి చరిత్ర, తెలుగు ప్రాంతాల చరిత్ర రికార్డయింది మరీ తక్కువ. బ్రిటీష్‌ వారికి నిజామ్‌ రాజు ధారాదత్తం చేయగా అటు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగమైన సర్కారు జిల్లాలు, దత్తమండలాల ప్రాంతంలో కానీ, ఇటు నిజామ్‌ సొంత ఏలుబడిలో మరాఠ్వాడా, హుబ్లీ ప్రాంతాలతో కలసిన హైదరాబాద్‌ సంస్థానంలో కానీ సాగిన సైలెంట్‌ సినిమా ప్రయాణం ఇవాళ్టికీ పూర్తిగా వెలుగులోకి రాని సమాచారఖని. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రత్యేక రాష్ట్ర స్ఫూర్తితో… సినీ వ్యాసకర్త, పలు సినీ గ్రంథాల రచయిత హెచ్‌. రమేశ్‌ బాబు ఇప్పుడు హైదరాబాద్‌ ప్రాంత మూకీ యుగ అంశాలను తవ్వి తీశారు. అలా తయారైనదే – ‘లోటస్‌ ఫిలిం కంపెనీ – హైదరాబాదు (తెలంగాణ సినిమా మూకీ యుగం: 1896 – 1932)’ పుస్తకం.

స్టీఫెన్‌ హ్యూ లాంటి విదేశీయుల నుంచి బి.డి. గర్గ లాంటి స్వదేశీయులు, స్థానిక విశ్వవిద్యాలయ పరిశోధకుల దాకా ఇప్పటికే పలువురు చేసిన శోధనలు, సాధనలు, రచనల నుంచి కావాల్సినంత తీసుకొంటూ… అరుదైన ఫోటోలతో సహా అనేక పాత పుస్తకాల సమాచారాన్ని సేకరించుకుంటూ… అన్నీ కలబోసి ఒకచోట అందించారు రమేశ్‌ బాబు. పదేళ్ళు పట్టిన ఈ పరిశ్రమ కచ్చితంగా అభినందనీయం. అదే సమయంలో అనంతర పరిశోధనల్లో నిగ్గుతేలిన తాజా సమాచారాన్ని బట్టి పరస్పర వైరుద్ధ్యాలనూ, పాత తప్పులనూ సరిచేసుకోవాలని మర్చిపోయి రచయిత తడబడ్డారు. ఆయన పట్టుదలగా చేసిన ప్రయత్నాన్ని హర్షిస్తూనే… ఇప్పటికే తెలుగుతో పాటు ఇంగ్లీషు అనువాదంగానూ ఈ పుస్తకాన్ని ప్రచురించి, ప్రపంచం ముందు పెట్టినందున… చరిత్రలో తప్పులు ప్రచారమై భావితరాలు పొరబడకుండా, నిష్ఠురమైనా సరే నిజానిజాల గుణదోష విచారణ చేయడం అవసరం.

పాత తప్పులేమళ్ళీ పుస్తకంలోకి!

చిత్రంగా ఈ రచనలో మద్రాసు సినీచరిత్రను ఎత్తిరాయడంలోనూ కొన్ని తప్పులు దొర్లాయి. మద్రాసులో నేటి మౌంట్‌రోడ్‌ ఫిలాటెలిక్‌ బ్యూరో ఆఫీస్‌ (నాటి ఎలక్ట్రిక్‌ థియేటర్‌) ఆ ఊళ్ళో మొదటి సినిమా హాలు అనేది (పేజీ. 47) తప్పులతడక కథ అని ఇప్పటికే పలువురు తేల్చారు. చరిత్ర పుస్తకాల్లో మార్చారు. అయినా, అది అచ్చంగా అలాగే ఈ కొత్త పుస్తకంలోకీ ఎక్కింది. ఇక, అక్కడ సినిమాలు చూసే రఘుపతి వెంకయ్య నాయుడు సినీ రంగం పట్ల ఆకర్షితులయ్యారనడమూ అలాంటి పొరపాటే. 1900లలో తొలి దశకం మధ్యనాటికే సినీ ప్రదర్శనల్లోకి ప్రవేశించారు వెంకయ్య. అలాంటి ఆయన ఆ తర్వాత ఈ 1910ల ప్రథమార్ధంలో ఆరంభమైన హాళ్ళలో చిత్రాలు చూసి, సినీరంగం వైపు వచ్చారనడం ఏ రకంగా చూసినా అసంబద్ధం. ఇక, వెంకయ్య కుమారుడు రఘుపతి ప్రకాశ్‌ హాలీవుడ్‌ దిగ్గజం సిసిల్‌ బి. డిమిలీ దగ్గర శిక్షణ పొందారనే మాట దశాబ్దాల క్రితం కొందరు పుట్టించిన పుక్కిటి పురాణం. అది వట్టి గాలివార్త అని ఇప్పటికే పలువురు పదే పదే నిరూపించారు. తీరా ఆ పాత పుకార్లనే ఈ పుస్తకంలోనూ (పేజీ 53) మళ్ళీ అచ్చేశారు.

హైదరాబాద్కు తొలి సినిమా చూపిన మద్రాస్వాసి!

హైదరాబాద్‌లో సినిమాటోగ్రాఫ్‌ ప్రదర్శనలు ఎప్పుడు మొదలయ్యాయన్న విషయంలోనూ రచయిత పొరబడ్డట్టు కనిపిస్తుంది. భారతదేశంలో తొలిసారిగా 1896 జూలై 7న బొంబాయిలో సినిమాటోగ్రాఫ్‌ ప్రదర్శన జరిగింది. అప్పటికే మద్రాసులో నివసిస్తూ, మౌంట్‌రోడ్‌లో మద్రాస్‌ ఫోటోగ్రాఫిక్‌ స్టోర్‌ నడుపుతున్న టి. స్టీవెన్సన్‌ అదే ఏడాది డిసెంబర్‌ మొదట్లోనే చెన్నపట్నానికి సినిమా ప్రదర్శనలు తెచ్చారు. హైదరాబాద్‌కు వాటిని తీసుకువెళ్ళిందీ ఈ మద్రాసు వాస్తవ్యుడే! స్టీఫెన్‌ హ్యూస్‌ పరిశోధన నుంచి విస్తృతంగా ఉద్ధరింపులు పేర్కొన్న పుస్తక రచయిత మద్రాసులో తొలి సినీప్రదర్శన ‘యానిమేషన్‌ పద్ధతిలో రూపొందించిన స్లైడ్లతో’ (పేజీ 33) సాగిందని తప్పులో కాలేశారు. అవి సినిమాటోగ్రాఫ్‌ ప్రదర్శనలే తప్ప ఈ పుస్తక రచయిత పేర్కొన్నట్టు స్లైడ్ల ప్రదర్శనలు కావు.

దక్షిణాది తర్వాతే హైదరాబాద్కి!

మద్రాసులో ప్రదర్శనలిచ్చిన స్థానికవాసి టి.జె. స్టీవెన్సన్‌ ఆ తర్వాత బ్రిటీష్‌ ఇండియా అంతటా పర్యటిస్తూ, ‘ముందుగా… వచ్చింది హైదరాబాద్‌ నగరానికి’ (పేజీ 34) అని రాశారు. అది కూడా సరికాదు. నిజానికి, స్టీవెన్సన్‌ 1896 డిసెంబర్‌ చివరి దాకా మద్రాసులో తొలి సినిమాటోగ్రాఫ్‌ ప్రదర్శనలిచ్చారు. ఆపైన సుదీర్ఘకాలం దక్షిణ భారతమంతటా విస్తృతంగా పర్యటించారు. చివరకు 1897 ఆగస్ట్‌ 30 నాటికి మద్రాసుకు తిరిగొచ్చి, మరోసారి అక్కడ పలు సినిమాటోగ్రాఫ్‌లు చూపారు. సరిగ్గా ఆ ముందే… అదే ఆగస్ట్‌లో… హైదరాబాద్‌లో తొలి సినీ ప్రదర్శనలు జరిగాయి. అవి ఈ మద్రాసీయుడు ఇచ్చారన్నది అసలు నిజం. అంటే, తెలంగాణ గడ్డపై 1897 ఆగస్ట్‌ నుంచి మాత్రమే సినిమాటోగ్రాఫ్‌ ప్రదర్శనలు జరిగాయని గ్రహించాలి.

తెలంగాణలో తొలి సినిమాటోగ్రాఫ్ప్రదర్శన:

1896లో కాదు…  1897లోనే!

ఆంగ్ల పరిశోధక గ్రంథాల్లోని సమాచారాన్ని అర్థం చేసుకోవడంలో, తెలుగులో అందించడంలో అతి వ్యాప్తి, అవ్యాప్తి దోషాలూ ఈ ‘లోటస్ ఫిలిం కంపెనీ – హైదరాబాదు’ పుస్తకంలో కొన్నిచోట్ల జొరబడ్డాయి. చరిత్ర గమనిస్తే… సికింద్రాబాద్‌ అనేది సైనిక దండు విడిసిన కంటోన్మెంట్‌ ఏరియా. బ్రిటీషు వారి విడిది. అందుకే, అక్కడ విందులు, వినోద ప్రదర్శనలు, సినిమాటోగ్రాఫ్‌ షోలు జరిగాయని గ్రహించాలి. తెలంగాణ గడ్డపై 1897 ఆగస్ట్‌ నాటి స్టీవెన్సన్‌ సినిమాటోగ్రాఫ్‌ ప్రదర్శనల కన్నా ఏడాది ముందే 1896 ఆగస్ట్‌లో జరిగాయని ఈ పుస్తక రచయిత చెబుతున్నవి – సికింద్రాబాద్‌లో ఎగ్జిబిషన్‌లో భాగం. అవీ… ఒక్కరే కంతలో నుంచి చూసే ‘పీప్‌ హోల్‌ షో’లు. ఈ కదిలే చిత్రాలు… సినిమాకు ముందు రూపాలు. అంతేతప్ప, పదుగురూ ఏకకాలంలో చూసే సినిమాటోగ్రాఫ్‌ ప్రదర్శనలు కావు. ఈ సినిమాటోగ్రాఫ్ ప్రదర్శనల్నే మనం పాపులర్ గా సినిమా ప్రదర్శనలు అంటూ వస్తున్నాం. తొలి సినీ ప్రదర్శనలకు కొండగుర్తుగా చరిత్రలో గుర్తిస్తూ వస్తున్నాం. ఆ సంగతి రచయితకు తెలియదని అనుకోలేం.

ఒక వేళ ‘పీప్ హోల్ షో’లే గనక సినిమా ప్రదర్శనలైతే, బ్రిటీష్‌ సైన్యాల విడిదిగా విందు, వినోదాల ప్రదర్శనలు సాగే కంటోన్మెంట్‌ ప్రాంతమైన సికింద్రాబాద్‌ కన్నా ముందే దేశంలోని వేర్వేరు నగరాల్లోనూ అవి జరిగాయి కదా! మరి, అలా జరిగిన ఆ షోలను మూకీ సినిమాలుగా మన చరిత్రలో ఇంతకాలం భారతీయ సినీ చరిత్రలో ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదేం? ఈ ప్రశ్న వేసుకుంటే, సమాధానం సులభంగా అర్థమైపోతుంది. అలాగే, ‘1897 నాటికే సికిందరాబాదు నుండి మదరాసుకు ముడి ఫిలిం సరఫరా అయినట్టు పేర్కొన్నారు స్టీఫెన్‌ హ్యూస్‌’ (పేజీ 35) అని రమేశ్‌ బాబు ఉట్టంకించారు. కానీ, ఆ మాటకు ఆధారం కనిపించదు. ఆంగ్ల మూల రచనలోనూ ఎక్కడా ఆ ఊసు లేకపోవడం గమనార్హం. చిన్న అజాగ్రత్త సైతం చరిత్రలో కొత్తగా పెద్ద తప్పును ప్రచారంలో పెడుతుందని గుర్తించాలి.

 మూసీ వరదలపై టాపికల్తీసిందెవరంటే

1908 సెప్టెంబర్‌ 28న హైదరాబాద్‌లో మూసీ నదికి వరదల్లో నగరంలో మూడో వంతు నామరూపాలు లేకుండా పోయింది. అప్పటికే నిజామ్‌కు సినిమా గాలి ఉంది కాబట్టి, ‘ఆ బీభత్స దృశ్యాలను దృశ్యబద్ధం చేయడానికి కలకత్తాకు చెందిన జె.ఎఫ్‌. మదన్‌ బృందాన్ని రప్పించింది’ ఆయనే (పేజీ 39) అని సిద్ధాంతీకరించారీ పుస్తక రచయిత. దానికీ, ఆ తర్వాత చాలా ఏళ్ళకు ఎప్పుడో హైదరాబాదొచ్చి మూకీలు తీసిన ధీరేన్‌ గంగూలీకీ ఊహల ముడి వేశారు. కానీ వాస్తవం వేరు. అసలు కలకత్తాలోని సినీ వ్యాపార దిగ్గజం మదన్‌కూ, హైదరాబాద్‌లోని నిజామ్‌ ప్రభువుకూ అనుబంధమున్న దాఖలాలే లేవు. ఫోటోగ్రఫీ, చిత్రకళల్లో నేర్పున్న ధీరేన్‌ కలకత్తా నుంచి వచ్చి హైదరాబాద్‌లో నిజామ్‌ వారి ఆర్ట్‌ కాలేజ్‌లో చిత్రకళా బోధకుడిగా చేరింది 1916, ఆ తర్వాతే! అప్పటికి ధీరేన్‌కూ, మదన్‌కూ మధ్య కూడా దోస్తీయే లేదు!!

ఆ తర్వాతెప్పుడో ధీరేన్‌ సినిమాల్లో నటించడానికని మదన్‌ను తొలుత సంప్రతించిన సంగతి పట్టుకొని… ‘మదన్‌ శిష్యుడు ధీరేన్‌ గంగూలీ’ అంటూ మూసీ వరదలపై తీసిందీ మదనే అని సాక్ష్యం లేని చరిత్రను రచయిత ప్రతిపాదిస్తే ఎలా? అది సమర్థనీయం కాదు. నిజానికి, ఆ వరదల టాపికల్‌ చిత్రాన్ని తీసింది – బొంబాయికి చెందిన ఎక్సెల్షియర్‌ సినిమాటోగ్రాఫ్‌ సంస్థ. ఆ సంస్థ పక్షాన ఒక కెమేరామన్‌ హైదరాబాద్‌ వచ్చి, చిత్రీకరణ జరిపారు. అది ఇప్పటికే పలువురు ప్రసిద్ధ మూకీ యుగ చరిత్రకారులు పేర్కొన్న సత్యం! చరిత్రకెక్కిన నిజం! సాక్ష్యాధారాలతో సప్రామాణికంగా అది తప్పని నిరూపిస్తే ఓకే కానీ, సొంత ఊహా ప్రాతిపదనలతో దాన్ని కాదనేస్తే ఎలా?

 ఆంధ్ర ప్రాంతంలోనూఅప్పటికే!

అలాగే, ‘రఘుపతి వెంకయ్య కన్నా ముందే 1908లో బాబు పి.ఎస్‌. తెలంగాణలో సైలెంట్‌ చిత్రాలు ప్రదర్శించారు’ అన్నారు రచయిత. ‘ఆంధ్రజ్యోతి జ్ఞాపకాలు’ దానికి ఆధారమంటూ ఆసరా తీసుకున్నారు. కనీసం ప్రచురణ తేదీ వెల్లడించ లేదు సరికదా, ఆ తోక పట్టుకొని, ‘అంటే ఆంధ్ర ప్రాంతంలో కన్నా ముందుగానే తెలంగాణలో మూకీల ప్రదర్శన జరిగిందనేది చారిత్రక సత్యం’ (పేజీ 53) అని ఏకపక్షంగా అనేశారు. సావధానంగా గమనిస్తే – నిజానికి 1896 డిసెంబర్‌లోనే మద్రాసులో మొదలైన స్టీవెన్సన్‌ సినిమాటోగ్రాఫ్‌ ప్రదర్శనలు అక్కడ నుంచి దక్షిణాది పర్యటనల అనంతరమే సికింద్రాబాద్‌కు చేరాయి. అలా అప్పటి నుంచే ఆంధ్ర ప్రాంతంలోనూ సినిమాల ప్రదర్శన ఉన్నట్టే కదా! ఆ సంగతి రచయిత గ్రహించక, మామూలు లాజిక్ మర్చిపోయినట్టున్నారు. ఆంధ్రలో కన్నా ముందే తెలంగాణలో మూకీలున్నాయని చెప్పాలనే అనవసర ఆభిజాత్యంతో, తొందరపాటు ప్రదర్శించారు.

రఘుపతి వెంకయ్య పితామహుడెందుకంటే…!

తెలుగు సినీ పితామహత్వం విషయంలో ఈ పుస్తక రచయితకు కొన్ని అభ్యంతరాలు ఉన్నట్టున్నాయి. ఆ స్థానిక భావోద్వేగాలనూ, భిన్నాభిప్రాయాలనూ సానుభూతితో అర్థం చేసుకోవాల్సిందే! గౌరవించాల్సిందే!! కానీ, ‘‘తెలుగు సినిమా మూలాలు తమిళనాట ఉన్నప్పుడు, తెలంగాణ సినీ పితామహుడు బెంగాలీయుడు (ధీరేన్‌ గంగూలీ) కావడంలో తప్పు లేదు’’ (పేజీ 22) అని పుస్తక రచయిత విచిత్ర వాదన, ప్రతిపాదన. ఇక్కడే అసలు చిక్కుంది. అసలు మద్రాసు (చెన్నపట్నం) సహా నేడు తమిళనాడు అంటున్న ప్రాంతంలో సింహభాగం ఒకప్పుడు మన తెలుగు వారిదే! మన ఏలుబడిలోదే! ఆ చరిత్ర మర్చిపోయి చరిత్ర పుస్తకం రాస్తుంటేనే ఇబ్బంది. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కొచ్చి, కలకత్తాకు చెందిన మదన్‌ థియేటర్స్‌ వారి పక్షాన హాళ్ళు నడిపి, లోటస్‌ ఫిల్మ్‌ కంపెనీ పేర 1922 ప్రథమార్ధం తర్వాత మూకీలు తీశారు ధీరేన్‌. ఆయనను తలకెత్తుకుంటూ… తెలుగువాడైన రఘుపతి వెంకయ్యను ఈ రచన అంతటా ఎందుకో రచయిత చిన్నచూపు చూశారు.

చరిత్రను లోతుగా గమనిస్తే… 1905–6లో వచ్చిన తమిళుడు సామికన్ను విన్సెంట్‌. అతని వెన్నంటే ఆ తర్వాత రంగప్రవేశం చేసినప్పటికీ విన్సెంట్‌ను మించినవాడు తెలుగు వెంకయ్య. పరిశోధించి చూస్తే దాదాపు 1906 ప్రాంతం నుంచే (?) మద్రాస్‌ సహా దక్షిణ భారతావనిలోనూ, అలాగే బర్మా, శ్రీలంక సహా విదేశాల్లోనూ మూకీ ప్రదర్శనలిచ్చారు వెంకయ్య. 1913–14లోనే మద్రాస్‌లో భారతీయుల తొలి శాశ్వత సినీ థియేటర్‌ ‘గెయిటీ’ కట్టారు. ఆపై ఒకటికి మూడు సినిమా హాళ్ళు పెట్టారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 1920కే సొంతంగా గ్లాస్‌ స్టూడియో నిర్మించారు. సినిమాల పంపిణీ చేపట్టారు. 1921కే మూకీలు తీసిన మనవాడు వెంకయ్య. ఆ రోజుల్లోనే కుమారుడు రఘుపతి ప్రకాశ్‌ను విదేశాలకు పంపి, సినీ రూపకల్పనలో శిక్షణ పొందేలా చేసిన తొలి తెలుగువాడు ఆయన.

అలా సినీరంగంపై ప్రాణం పెట్టి… ప్రదర్శన, స్టూడియో, పంపిణీ, చిత్రనిర్మాణం – నాలుగు సెక్టార్లలోనూ మూకీల యుగంలోనే కాలుమోపి, నాలుగింటా తెలుగువారిలో ప్రప్రథముడిగా నిలిచాడు గనకే రఘుపతి వెంకయ్యను తెలుగు సినీ పరిశ్రమకు పితామహుడన్నారు. ఆ కిరీటం కట్టబెట్టారు. దక్షిణాదితో పాటు దేశవిదేశాలకు తన కృషిని విస్తరించిన అలాంటి వ్యక్తిని కేవలం మద్రాసుకే పరిమితమైనట్టుగా ‘‘చరిత్రలో సినీ రంగానికి మద్రాసులో ఆద్యులైన వారిలో ఒకరుగా నిలిచిపోయాడు’’ (పేజీ 51) అంటూ ఈ పుస్తకంలో రచయిత తగ్గించి చెప్పడం భావ్యమా? ఇది అక్షరాలా వెంకయ్యను ఆంధ్రుడనే ముద్రతో ‘డిజ్‌ ఓన్‌’ చేసుకోవాలనే సంకుచిత ప్రయత్నం అనిపిస్తుంది. తోటి తెలుగువారిపై దుగ్ధతో… అవసరమైతే బెంగాలీనైనా తలకెత్తుకోవాలనే తెంపరితనం, భావదాస్యంగా కనిపిస్తుంది.

ఇది చాలదన్నట్టు పుస్తకంలో మరోచోట ‘తెలుగు నేలపై తొలి మూకీ (‘మార్కండేయ’) తీసింది సి. పుల్లయ్యనే. కనుక ఆయనను తెలుగు సినిమా పితామహుడుగా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది’ (పేజీ 120) అంటూ మరో వింత ప్రతిపాదన ఉంది. ఇక్కడ కూడా రఘుపతి వెంకయ్యనూ, ఆ మాటకొస్తే సి. పుల్లయ్యకే సినీ రూపకల్పనలో ఓనమాలు దిద్దబెట్టిన గురువైన రఘుపతి ప్రకాశ్‌నూ కూడా పక్కకు తోసిపుచ్చే (అతి) తెలివైన ప్రయత్నమూ మరోసారి తెలిసిపోతూ ఉంటుంది. భారతీయ సినీ పితామహుడని పేరుబడ్డ ఫాల్కే కన్నా, బెంగాలీయుడు ధీరేన్‌ గంగూలీ కన్నా చాలాముందే సినీరంగంలోకి వచ్చిన తెలుగుబిడ్డ రఘుపతి వెంకయ్య అనేది ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా నిజం. ఆ సంగతి చరిత్ర రాస్తున్న రచయిత గ్రహించాలి.

భౌగోళికభాషా చరిత్రలు చూడకుంటే ఎలా?!

బ్రిటీషు వారికి నిజామ్‌ వదులుకున్న తెలుగు ప్రాంతాలు, మద్రాస్‌ రాష్ట్ర ఏర్పాటు, మద్రాస్‌ – హైదరాబాద్‌ల పాలకులు, కాలగతిలో ఈ రెండు ప్రాంతాల్లోని సామాజిక – ఆర్థిక – భౌగోళిక – భాషాపరమైన మౌలిక తేడాలను గ్రహిస్తూ, కూలంకషంగా పరిశోధిస్తేనే చరిత్రకు సరైన న్యాయం జరుగుతుంది. అలాకాక వెంకయ్యను వదిలించుకోవాలనో, స్థానికత సాకుతో వేరెవరినో తగిలించుకోవాలనో, ఆంధ్రా ముద్రతో సాటి తెలుగువారిని తోసిపుచ్చాలనో (దుర్‌) ఉద్దేశపూర్వకంగా రాస్తే… సత్యనిష్ఠ కన్నా సొంత ఇష్టానిష్టాలదే పైచేయిగా మారే ప్రమాదం ఉంటుంది.

ఒక్కొక్కటిగా చూస్తూ – భాష సంగతికే వస్తే… హైదరాబాద్‌ సంస్థానంలో చిరకాలం నుంచి మూకీ చిత్ర యుగకాలం దాకా అధికార భాష అటు తెలుగూ కాదు, ఇటు ఉర్దూ కాదు! అప్పుడెప్పుడో క్రీ.శ. 1206 నుంచి బహమనీలు, కుతుబ్‌షాహీలు, ఆదిల్‌ షాహీల ఏలుబడిలో అధికార భాష – పర్షియన్‌! తెలుగు, మరాఠా, కన్నడ ప్రాంతాలన్నీ కలసి ఉన్న హైదరాబాద్‌ సంస్థానంలో దీర్ఘకాలం జనసామాన్య భాషేమో ఉర్దూ. పర్షియన్‌ తెలిసినవాళ్ళు తగ్గి, ఫర్మానాల అనువాదానికే తడిసిమోపెడవుతున్న వేళ కనీసం కోర్టు వ్యవహారాల్లోనైనా ఉర్దూను అధికార భాషగా చేయాలనే ప్రతిపాదన 1871లోనే వచ్చింది. అప్పుడు ఒప్పుకోకున్నా ఎట్టకేలకు 1884లో కోర్టు లావాదేవీల భాషగా రంగప్రవేశం చేసింది ఉర్దూ. ఆ తర్వాత 1886కు వచ్చేసరికి రాష్ట్రమంతటికీ అధికార భాష అయింది.

అలా 1886 నుంచి భారత యూనియన్‌లో విలీనమైన 1948 వరకు హైదరాబాద్‌ సంస్థానంలో ఉర్దూనే ప్రభుత్వ భాష, యాస. ప్రభుత్వ పాలనాధికారుల్లో అత్యధికులు ముస్లిమ్‌లే! అంటే, సినిమాటోగ్రాఫ్‌ రాక ముందు మొదట అధికార భాష పర్షియన్‌తో, ఆ పైన ఉర్దూతో మమేకమైన ఈ ప్రాంతం తెలుగు భాషనూ, తెలుగు సినిమానూ తలపై పెట్టుకున్నది – సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు తర్వాతే! ఏర్పాటు అనంతర పాలకుల కాలంలో ఉర్దూ ప్రాబల్యం తగ్గిన తర్వాతనే! అలాగే, హైదరాబాద్‌ ప్రాంతంలో 1900ల తొలి దశకాల్లో తెలుగు భాషను నిలుపుకోవడానికి వీర తెలంగాణం ఉద్యమించిన సంగతులన్నీ స్థానిక సామాజిక, భాషా, సాంస్కృతిక చరిత్రకెక్కినవే! ఆ చరిత్రను గుర్తుపెట్టుకోవడం కీలకం.

ఇక, నైజామ్‌ ఏలుబడిలో కలకత్తా నుంచి వచ్చి తోటి బెంగాలీయులతో ధీరేన్‌ గంగూలీ నడిపిన ‘లోటస్‌ ఫిల్మ్‌ కంపెనీ’ మొదలు మార్వాడీలు, గుజరాతీల??? ‘మహావీర్‌ ఫోటో ప్లేస్‌’, ‘నేషనల్‌ ఫిల్మ్‌ కంపెనీ’ వగైరాలన్నీ తెలుగేతరమే! ఆ సంస్థలు తీసిన అతి కొద్ది సైలెంట్‌ సినిమాలూ అంతే! ఆ మూగ చిత్రాలు అర్థమయ్యేలా దృశ్యాల నడుమ తెరపై వచ్చే ఇంటర్‌ టైటిల్‌ కార్డులు కూడా ఉర్దూ, గుజరాతీ సహా తెలుగేతర భాషల్లోనే సాగాయి. అంతే తప్ప తెలుగులో కాదు. కానీ, హైదరాబాద్‌ సంస్థాన ప్రాంతంలో తెలుగేతరులు తీసిన ఈ మూకీలకు భిన్నంగా మద్రాస్‌ ప్రెసిడెన్సీలో మనవాళ్ళు తీసిన మూకీల్లో మాత్రం మన తెలుగు ఇంటర్‌ టైటిల్‌ కార్డులూ ఉండడం గమనించి తీరాల్సిన విషయం.

మద్రాసు మనదైనప్పుడు చరిత్ర మనది కాదా?!

భౌగోళిక పాలనా అంశాలకు వస్తే – మద్రాస్‌ రాష్ట్రంలో భాగమైన తెలుగు ప్రాంతాలు ఒకప్పుడు నిజామ్‌ ఏలుబడిలోవే! అనేక పరిణామాలతో ఆనక బ్రిటీషు వారికి ఆ పాలకులు అప్పగించినది సర్కారు ప్రాంతం (కోస్తా ఆంధ్ర). మరో ఒప్పందంలో భాగంగా క్రీ.శ. 1800 ప్రాంతంలో బ్రిటీషు వారికి హైదరాబాద్‌ నిజామ్‌ ధారాదత్తం చేసినవి ‘దత్తమండలాలు’ (అంటే ‘సీడెడ్‌’ ప్రాంతం. మరోమాటలో స్వాతంత్య్రోద్యమ కాలంలో 1928 తర్వాత పేరు మారిన నేటి ‘రాయలసీమ’). అలా నిజామ్‌ ఏలుబడి నుంచి పోయిన సర్కారు, సీడెడ్‌ – రెండు తెలుగు ప్రాంతాల ముక్కలతో… విజయనగర సామ్రాజ్యంలో చంద్రగిరి పాలకులు ఈస్టిండియా కంపెనీకి ఇచ్చిన చెన్నపట్నం (మద్రాస్‌) రాజధానిగా… బ్రిటీషు పాలనలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం సాగింది. అసలు చెన్నపట్నం, చెన్నై అన్న పేరే తెలుగు ఏలిక దామెర్ల వెంకటాద్రి నాయకుడి తండ్రి దామెర్ల చెన్నప్ప నాయకుడి పేర వచ్చింది.

ఇవేవీ గమనించకుండా ఈ పుస్తక రచయిత అంటున్నట్టు, లేదా అనుకుంటున్నట్టు అది ఒక్క ‘అరవ దేశం’ (పేజీ 21) ఏమీ కాదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పాలన సైతం తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషలు మూడింటితో సాగింది. అలా తమదైన చెన్నపట్నంలో అక్కడ తెలుగువారు సైలెంట్‌ సినిమాలు తీశారు. తమిళ సోదరులతో పోటీపడ్డారు. అంతేతప్ప, మూకీల కాలంలో తెలుగువారు తమిళనాట తలదాచుకొని, సినిమాలు తీశారనుకోవడం చరిత్ర తెలియనితనం.

అలాగే, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం, ఆపైన సమైక్య రాష్ట్రం ఏర్పడే వరకు ‘… మద్రాసులో వారంతా సినిమా రంగానికి చేసిన సేవలను తెలుగు సినిమాలో అంతర్భాగంగా రాసుకుంటున్నారు. వాస్తవానికి, అప్పటి వరకూ మదరాసు రాష్ట్రానికి సంబంధించిన సినిమా విశేషాలన్నీ కూడా ఆ ప్రాంతానికే చెందుతాయి. కానీ, సమైక్య రాష్ట్రం ఏర్పడిన తరువాత అక్కడి పరిణామాలను తెలుగు సినిమా చరిత్రకు తొలిరోజులుగా చరిత్రకెక్కించారు’ (పేజీ 23) అంటూ రచయిత మరో అతి వ్యాఖ్య చేశారు. అసలు… నిజామ్‌ వదిలేశాక బ్రిటీషు ఏలుబడిలో, ప్రెసిడెన్సీలో, మద్రాస్‌ రాజధానిగా తెలుగు వారు గడిపినకాలం తెలుగువారిది కాకుండా ఎలా పోతుంది? తమిళుల చరిత్రను తెచ్చి తెలుగు సినిమా చరిత్ర అంటే తప్పు. అంతేకానీ, మద్రాసులో జరిగింది గనక తెలుగు వారి కృషి అయినా సరే అది తెలుగు సినీ చరిత్రే కాదని అనడం సబబేనా? ఒకవేళ అలా అంటే… అది వట్టి అజ్ఞానమే!

1953లో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత మద్రాసు తమ పాలనా రాజధాని కాకున్నా, దక్షిణాది సినీ కేంద్రంగా తెలుగు, కన్నడ, మలయాళీలు అక్కడే కొనసాగారు. మరి, రమేశ్‌బాబు వాదన ప్రకారం ఆ తర్వాత చాలాకాలం సైతం తమది కాని మద్రాసులో జరిగిన కన్నడ, మలయాళ భాషీయుల సినిమా కృషి కూడా వారిది కాకుండా పోతుందా? కన్నడ, మలయాళీలు సైతం మద్రాసులోని తమ సినీ ప్రస్థానాన్ని తమ సినీ చరిత్ర నుంచి దూరంగా పెట్టాలా? అందుకని, ‘తెలుగు సినిమా మూలాలు తమిళనాట ఉన్నప్పుడు, తెలంగాణ సినీ పితామహుడు బెంగాలీయుడు కావడంలో తప్పు లేదు’ (పేజీ. 22) లాంటి ఆవేశం అర్థరహితం. నిర్మోహంగా, నిరావేశంగా సాగాల్సిన చరిత్ర పరిశోధనలో ఈ పుస్తక రచయిత ఇలా తరచూ గాడి తప్పడం పెను విషాదం.

వాళ్ళను అవమానించకండి!

గత సినీచరిత్రకారులు తెలుగు సినీచరిత్రలో హైదరాబాద్‌ సంగతుల్ని కొద్దిగానే రాశారనీ, ‘…హైదరాబాద్‌ స్టేటులో ఏమీ జరగలేదనీ, అంతా అరవదేశంలో జరిగిందే తెలుగు సినిమా చరిత్ర అనీ ప్రచారం చేస్తూ చరిత్రగా రాశారు’ (పేజీ 21) అనీ రచయిత ఆరోపణ. మద్రాసులో జరిగిందే చరిత్ర అని పాతవాళ్ళు ప్రచారం చేశారనడం తప్పు. ఆరుద్ర లాంటి పరిశోధనా దృష్టి ఉన్నవారు, బొమ్మకంటి, రావి కొండలరావు లాంటి పాత్రికేయులు తమకున్న పరిశోధనా పరిమితుల్లోనే హైదరాబాద్‌ సినీసంగతులూ, చరిత్ర రాశారు, చెప్పారు. స్థలకాలాలతో సహా అనేక పరిమితుల మధ్య అప్పటికి తమకు లభ్యమైన సమాచారంతో ధీరేన్‌ గంగూలీ కథ సహా హైదరాబాద్‌ సంగతులు తమకు తెలిసినదంతా వ్యాసాల్లో, చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కించారు. ఆ సంగతి చూసి, చదివి, తెలిసి కూడా మనం ఇప్పుడు కొత్త మిలీనియమ్‌లో ఆధునిక సాంకేతిక వృద్ధితో మనకు అందుబాటులోకి వచ్చిన అనేక వనరుల అనంతర పరిశోధనలతో పోల్చడం తగని పని. అది మన ముందు తరాల వారి అవిరళ కృషినీ, అంతకు మించి అంకిత భావాన్నీ అనుమానించడమే! అవమానించడమే!

ఆరోపణల పర్వం మానాలి! ఆలోచనతో సాగాలి!

రచయిత ఇంకా ముందుకెళ్ళి, ‘ఒకవేళ హైదరాబాద్‌ గనుక ఆంధ్రప్రదేశ్‌లో కలువకపోయి ఉంటే, హైదరాబాద్‌ స్టేట్‌లో తెలంగాణ సినిమా అనేది బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది’ (పేజీ 23) అని చిలవలు పలవలుగా చీకటి బాణాలు వేశారు. ఇది మరో అనుచిత ఆరోపణ. ఇలాంటి కలంజారుడు వ్యాఖ్యలు ఈ మంచి పుస్తక ప్రయత్నంలో పలుచోట్ల పంటి కింది రాళ్ళు. నిజానికి, 1948లో హైదరాబాద్‌ విమోచన నాటికి, ’53లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఆవిర్భావం నాటికి, ’56లో తెలంగాణతో తెలుగువారి సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు నాటికి హైదరాబాద్‌లో ఏ మేరకు సినీ నిర్మాణ స్టూడియోలు, వసతులు ఉన్నాయి? అది లోతుగా చూస్తే, ఈ ఊహాపోహల బలం ఇట్టే తేలిపోతుంది. రచయిత అది గమనించాలి. ఆ మాటకొస్తే – 1956లో హైదరాబాద్‌ రాజధానిగా సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాతనే… వివిధ ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చాకనే… 1990లలో వినోదపు పన్ను విధింపులో తేడాలు పెట్టాకనే… ఇంతకాలానికి ఇక్కడ హైదరాబాద్‌లో సినీరంగం సుస్థిరమైంది. ఆ చరిత్రనూ, నిన్న గాక మొన్నటి వాస్తవాలనూ విస్మరించరాదు.

ఒక్కమాటలో… ఇప్పుడు చేయాల్సింది ఆరోపణల పర్వం కాదు. ఆలోచనతో… మరుగునపడ్డ స్థానిక చరిత్రల పునర్నిర్మాణం. హైదరాబాద్‌ రాష్ట్రం సహా అంతటా తెలుగు వారి సినిమా ప్రస్థానంపై నిర్విరామ కృషి. నిరంతరం సాగాల్సిన ఆ ప్రయత్నంలో మన సినీ చరిత్రకు ఈ పుస్తకం అనేక లోపాలు ఉన్నప్పటికీ ఓ కొత్త చేర్పు. మూకీల కాలంలోనే హైదరాబాద్‌ సంస్థాన ప్రాంతం నుంచి బొంబాయికీ, సినీ రంగానికీ వెళ్ళిన పైడి జైరాజ్, రాంప్యారీ, సరోజినీ దేవి (నాయుడు) చెల్లెళ్ళు మృణాళినీ దేవి, సునాళినీ దేవి, కెమేరామన్‌ ఎం.ఎ. రెహమాన్‌ లాంటి పలువురి సమాచారమే అందుకు సాక్ష్యం.

పేరుకిది తెలంగాణ ప్రాంతంలో మూకీ యుగానికి సంబంధించిన పుస్తకమైనా – ఇందులో తమిళ, మలయాళ, కన్నడాల్లో జరిగిన తొలినాళ్ళ ప్రయత్నాల వివరాలూ సూక్ష్మంలో మోక్షంగా రచయిత అందించారు. అది పాఠకులకు దక్షిణాది పరిణామాలపై విహంగ వీక్షణంగా ఉపకరిస్తుంది. అయితే, వ్యక్తుల, ప్రదేశాల పేర్లలో అనేక తప్పులు, రచనలో అక్షర దోషాలూ చోటుచేసుకున్నాయి. ఇంటర్నెట్‌ ఎత్తిపోతల్లో… ఈ పుస్తకంలో అమెరికా థియేటర్‌ కాస్తా మద్రాసు గ్లోబ్‌ థియేటరై పోయిన ఫోటోల (పేజీ 50) లాంటి గందరగోళాలు సరేసరి. ఈ తప్పులను మలి ముద్రణల్లో సవరించుకుంటే… కొన్ని ప్రతిపాదనలు, చారిత్రక అంశాలకు నిర్దిష్టంగా, నిర్దుష్టంగా ప్రామాణిక ఆధారాలు పక్కనే పేర్కొంటే… సినీ ప్రియులకు ఇది ఒక చక్కటి ఆకర గ్రంథమవుతుంది. రచయిత రమేశ్‌బాబు కృషి, శ్రమ అవిస్మరణీయం అవుతుంది.

*

రెంటాల జయదేవ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు