మనం కొన్నింటికి ఎంత అలవాటు పడిపోయామంటే వొక జంట అది పెళ్ళైన జంట కానీ, ప్రేమలో వున్న జంట కానీ; అబ్బాయి వయసు అమ్మాయి వయసు కంటే ఎక్కువ వుండాలి. అబ్బాయి ఎత్తు అమ్మాయి ఎత్తు కంటే ఎక్కువ వుండాలి,అబ్బాయి సంపాదన అమ్మాయి సంపాదన కంటే ఎక్కువ వుండాలి. అలా వున్నప్పుడే మనకు ఈడూ జోడూ అనిపిస్తుంది. తద్విరుధ్ధంగా వుంటే ముక్కున వేలు వేసుకుంటాము. కాని నిజ జీవితంలో అన్నీ అలా వుండవు. నాకు తెలిసిన వొక జంట లో అతని ఎత్తు ఆమె ఎత్తు కంటే తక్కువ. అయితే ఆమె కొంచెం వంగి నడుస్తూ వుండేది. అది అలవాటై పోయి ఆమెకు గూని వున్నదేమో అనే భ్రమ కలిగేది మాకు. బాధ కూడా వేసింది. పెళ్ళికి అడ్డు రాని ఆమె ఎత్తు తర్వాతి జీవితానికి ఎలా వచ్చిందో. వెనకాల ఎలాంటి సంభాషణలు జరిగి వుంటాయో వూహించవచ్చు. లేదూ ఆమె తనకు తానే అలా చేసినా, ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సమాజం మన మీద ఒక్క మాటా చెప్పకుండానే చాలా పెత్తనం చెలాయిస్తుంది. ఎదురు తిరగడానికి ప్రయత్నం చేయాలిగాని, లొంగిపోవడానికి కాదుగా. ఈ సారి హిందీ సినెమాల్లో వయసులో అమ్మాయి పెద్దది అబ్బాయి చిన్నవాడూ అయిన కథలు కొన్ని చూద్దాం. ఈ విషయంలో హిందీ సినెమా ధైర్యంగా బోల్డ్ కథలు ఎంచుకుంది. ఆడుతాయా లేదా అన్నది తర్వాతి విషయం.
2003 లో దీప్తి నావల్ నటించిన “ఫ్రీకీ చక్రా” వచ్చింది. అందులో దీప్తి నావల్ వొక డాక్టరు. కాని భర్త చనిపోయిన తర్వాత వొక రకమైన వొంటరితనానికి గురవుతుంది. వొక సీన్ లో ఆమె మూడంకె వేసి పడుకోవడం, ఇలా ఆమె మనస్తత్వం పట్టి ఇస్తుంది. పిల్లలు డోర్ బెల్లు నొక్కి పారిపోతారు. ఎవరో అనామకుడు ఫోన్ చేసి సెక్సీ కబుర్లు చెబుతుంటాడు. ఆమె అతన్ని ప్రోత్సహించదూ, ఫోన్ పెట్టేయదు కూడా. ఆమె వైద్య వృత్తి మానేసి మార్టీషియన్ పని చేస్తుంది. అంటే క్రీస్తు మతస్తులలో ఎవరన్నా చనిపోతే వాళ్ళ అంత్య క్రియల నిర్వహణ. ముఖ్యంగా శవాన్ని లేపనం రాసి, శవపేటికలో సర్ది, దాన్ని అలంకరించి శ్మశాన వాటికకు పంపడం. మనం ఇలాంటి వృత్తి గురించి ఒక సినెమాలో చూడడం కూడా విశేషమే. సరే, ఆమె ఇంటికి వో కుర్రాడు పేయింగ్ గెస్ట్ గా వస్తాడు. ఆమె అతనికి టీ చేసి పెడుతుంది. అతను మాత్రం ఆమెతో మరీ చనువు తీసుకుని వ్యవహరిస్తుంటాడు. ఆమెకు ఇబ్బంది గా వున్నా ఏమీ చెప్పదు. ఆమె మీద తనకు హక్కేదో వున్నట్టు ప్రవర్తిస్తాడు. నెమ్మదిగా వాళ్ళు దగ్గరవుతారు. కథ మొత్తం చెప్పను, చూడండి. సినెమా గొప్ప సినెమా కాకపోవచ్చు కాని ప్రత్యేకంగా వుంటుంది. కొన్ని లోపాలున్నా గుర్తుండిపోయే సినెమా.
2013 లో B A Pass అన్న చిత్రం వచ్చింది. ఇది మాత్రం బోల్డ్ చిత్రమే కాదు, మంచి చిత్రం కూడా. కథాస్థలం ఢిల్లి. ఆ పట్టణ స్వరూప స్వభావాలని,జీవితాన్ని చక్కగా చూపించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పంతొమ్మిదేళ్ళ ముకేశ్ పరిస్థితి ఇరకాటంలో పడుతుంది. ఇద్దరు చెల్లెళ్ళు. చావుకు వచ్చిన బంధువులు కూర్చుని మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఈ పిల్లల బాధ్యత ఎవరు తీసుకోవాలని. ఇద్దరమ్మాయిలనీ అమ్మాయిల అనాథాలయంలో పెడతారు. ముకేశ్ ని దూరపు చుట్టాలు తమతో ఢిల్లీ కి అయిష్టంగా తీసుకెళ్తారు. అక్కడ బియ్యేలో జేరతాడు. ఇంటి చాకిరీ అంతా చేసినా ఆంటీ ముఖం ముడుచుకుంటూనే వుంటుంది. కష్టపెట్టే మాటలంటూ వుంటుంది. వొకసారి ఆ ఇంట కిట్టి పార్టీలో వచ్చిన సారిక కన్ను అతని మీద పడుతుంది. మాయమాటలు చెప్పి అతన్ని తన ఇంటికి రప్పించుకుని నెమ్మదిగా అతన్ని తన సెక్సు తీర్చే యంత్రంగా మార్చుకుంటుంది. పాపం ముకేశ్ కి ఆమె పట్ల నిజంగానే సద్భావం వుంటుంది. కొన్నాళ్ళకి సారిక తన స్నేహితురాళ్ళ దగ్గరికి ముకేశ్ ని పంపడం, డబ్బు సంపాదించడం, అతని సంపాదన కూడా తన దగ్గరే దాయడం చేస్తుంది. తెలీకుండానే అబ్బాయి హై ప్రొఫైల్ మగ వేశ్యగా మారిపోతాడు.. అసలు కథ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. బయటకు రాలేని రొచ్చులో దిగబడిపోయాడతను. మరో వైపు ఆ అమ్మాయిలను అనాథాలయంలో లైంగిక దోపిడీ ప్రయత్నాలు. వాళ్ళు అది తప్పించుకోవడానికి పారి పోయి ముకేశ్ ని చేరుకోవాలని చూస్తారు. ఆ తర్వాత ఎలాంటి ముగింపు వుంటుంది వగైరా చర్చించను. కానీ ఈ చిత్రం చాలా నిజాయితీగా తీశారు. సారికా గా నటించిన శిల్పా శుక్లా బాగా చేసింది.
ఇవి కొన్ని బోల్డ్ చిత్రాలు. ఇలాంటివి ఇంకా చాలా వున్నాయి కాని నా ఉద్దేశం వొక (హిందీ సినెమాకు) కొత్త అంశాన్ని తడమటం. ఇక ఇదే అంశంతో పరిణతి చెందిన ప్రేమ కథలు కూడా వున్నాయి. వాటి పేర్లు చెప్పి వూరుకుంటా. ఎందుకంటే వాటిలో సెక్సు గురించి మాట్లాడకుండా తీయడంవలన ప్రేక్షకుల ఆమోద ముద్రను పొందాయవి. వొకటి “దిల్ చాహతా హై”. అక్షయ ఖన్నా డింపల్ కాపడియా మధ్య సంబంధం మిస్టిక్ గా చూపాడు. మరో చిత్రం “వేక్ అప్ సిద్”. అందులో రణబీర్ కపూర్, కొంకొణా సెన్ శర్మల ప్రేమ కూడా చాలా హృదయశ్పర్శి.
ప్రేమ గుడ్డిది అంటారు కదా. మరి అది వయసు తారతమ్యాన్ని ఎలా చూస్తుంది? మనం కూడా వొక జడ్జీ స్థానం లో కూర్చుని తీర్పులు చెప్పాలా, కథను అర్థం చేసుకోవాలా? అన్నీ బాగుండకపోవచ్చు. కొన్ని కేవలం వ్యాపారాత్మక దృష్టితో సొమ్ము చేసుకోవడానికి తీసి వుండొచ్చు. కాని ఏదైనా సమాజంలో వైవిధ్యం వున్నట్లే, సినెమాలో కూడా వుండాలి కదా.
*
వైవిధ్యం ఉన్న సినిమా లాపరిచయముబాగుంది.. ji!ఇంకా మేము చూడటం అనేది వేరే సంగతి,. చూసిన అనుభూతి కలిగించే మీకుధన్యవాదాలు..!💐ji.
ఫ్రీకీ చక్రా, బిఎ పాస్ సినిమాల కథ చెప్పి చూడమని మాకు వదిలేశారు. మామూలుగా అయితే ఇలాంటి సినిమాలు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపరు చాలామంది. అందులో నాది మొదటి వరుస. మీరు చెప్పే విధానం బాగుంది సర్.
BA passచూడాలి నేను.
ది వయొలిన్ ప్లేయర్ గురించి కూడా రాయండి పరేష్ గారూ
ఐడీ గురించి కూడా
ఆ రెండు సినిమాలూ బావుంటాయి. మీరు రాస్తే ఇంకా బావుంటాయి