కొత్త సంసారం, బిడ్డల పెంపకమూ

  నా పెళ్ళికి ముందే మా అమ్మా నాన్నలు పోయారు. ఉద్యోగం కారణంగా నేను బెజవాడ వదిలిపెట్టి హైదరాబాదులోనే స్థిరపడ్డాను. పెళ్ళి కూడా ఇక్కడే అయ్యింది. బేచలర్ గా మిత్రులతో రూం లో వుండే నేను వొక ఫ్లాట్ అద్దెకు తీసుకుని కొత్త కాపురం మొదలుపెట్టా. నెమ్మదిగా వొక్కటొక్కటే సమకూర్చుకున్నాం. నాకు వంట ముందునుంచీ వచ్చు, ఆమె కూడా ఉద్యోగిని కాబట్టి ఇంటి పనులు కలిసి చేసుకుంటూ గడిపేశాము. మూడు నెల్ల తర్వాత మేము ప్రెగ్నంట్ అయ్యాము. అవును మెమే. యెందుకంటే మమేకం అయితే శారీరికంగా కాకపోయినా మానసికంగా మగవాడికి కూడా అంతే కష్టంగా వుంటుంది. సమ్యుక్త కుటుంబం అయితే ఇలాంటప్పుడు యేమేం చెయ్యాలి, యేమేం చెయ్యకూడదు అన్నీ పెద్దవాళ్ళు చెప్పడానికి వుంటారు. కొంత ధైర్యం వుంటుంది. నేను పెరిగిన వాతావరణం కూడా ఆడవాళ్ళ విషయాలు కేవలం ఆడవాళ్ళ మధ్యే చర్చకు వచ్చేవి, మగవాళ్ళు అవేం తెలీకుండా పెరిగేవారు. ఇప్పుడు చాలా మారిపోయింది అనుకోండి.

నాకు చదవడం అలవాటు కాబట్టి ప్రెగ్నన్సి మీద పుస్తకం తెచ్చుకుని చదివా. అందులో తెలుసుకోవలసిన విషయాలు వున్నాయి, కాని సమగ్రత కోసం గర్భం దాల్చిన ఆ తొమ్మిది నెల్లూ రాగల రకరకాల కాంప్లికేషన్లు వివరంగా చర్చించబడ్డాయి. అది చిదివి గుండెలు జారిపోయాయి. ఆవిడకి యేమన్నా చెప్పబోతే, అది నువ్వు చదివితే చదివావు, నాకు చెప్పి నాలో భయం తెప్పించకు అనేసింది. మిగిలింది వొక్కటే మార్గం, గైనకాలజిస్ట్ ని కలవడం. చాలా కచ్చితంగా చెప్పిన రోజునే వెళ్ళే వాళ్ళం. అందరూ ఆడవాళ్ళే వున్న ఆ క్లినిక్ లో కూడా వచ్చిన మగాణ్ణి నేను వొక్కడినే. మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించినా తర్వాత తర్వాత పట్టించుకోవడం మానేశాను. ప్రసవానికి వొక రోజు ముందు దాకా తను బేంకికి వెళ్ళింది. ఆ రోజు ఆమె స్పాటింగ్ అవుతోందని చెబితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను, ఈ రోజే సి సెక్షన్ చేసి కానుపు చెయ్యాలన్నది. అలాగే చేసింది డాక్తర్. ఆపరేషన్ అలసట, అప్పుడు ఇచ్చిన మత్తు ప్రభావంతో రోజంతా ఆమె నిద్ర పోయింది. పుస్తకంలో చదివిన విషయం, మొదట వచ్చే కలస్ట్రం ని కొంతమంది పిల్లలకు పట్టరు కాని అది ఎదుగుదలకి చాలా అవసరం. అది గుర్తుపెట్టుకుని నేను నర్సుని విసిగించేవాడిని. చివరికి కసురుకుంది, తల్లి నిద్రపోతుంది కదా, పాలెక్కడికి పోతాయి? బాబుకి గ్లూకోజునీళ్ళు పడుతున్నానులే అని. అక్కడితో వొక అధ్యాయం ముగిసింది.

ఇప్పుడు అదే ఇంట్లో మేము ముగ్గురం. అంత చిన్న పసికందుని యెత్తుకోవాలన్నా భయం. కాని ఆశ్చర్యంగా ఆయా సమయాలలో నాకే తెలీకుండా వొక ధైర్యం, పరిస్థితిని ఎదురుకొని నడుచుకునే నేర్పూ వచ్చాయి. నిఖిల్ పుట్టడం బాబ్రి మస్జిద్ వార్షికోత్సవం నాడు. బాబుకు స్నానం చేయించడానికి, మాలిష్ చేయించడానికి వొక ఆయా వచ్చేది. ఈ లోగా నేను పుస్తకాల షాపుకెళ్ళి పిల్లల పెంపకం మీద యేదన్నా పుస్తకం ఇమ్మన్నాను. అతను డాక్టర్ స్పొక్ పుస్తకం ఇచ్చాడు ఇది బాగుంటుందని. అది నిజంగానే బాగుంది. యెంతంటే ఆ తర్వాత నేను మిత్రులకి ఆ సందర్భం వచ్చినప్పుడు గిఫ్ట్ గా ఇచ్చాను. ఇప్పుడు ఈ పుస్తకం నాకు తోడు, ధైర్యం చెప్పే హితవు. అందులో వొక మాట వ్రాస్తాడు : పిల్లవాడికి మొదటి రోజుల్లో యెవరైతే శారీరికంగా దగ్గర వుంటారో వాళ్ళకు మానసికంగా దగ్గరవుతారు. ఇంత మంచి సువర్ణావకాశం జారవిడుచుకోక తల్లి దండ్రులే పిల్లవాడి పనులన్నీ చెయ్యాలి అని. యెలాగూ లంగోటాలు మార్చడం, తుడవడం, కడగడం అన్నీ నేనే. వొక్క స్నానం మాత్రం భయం అని చెప్పి ఆయాని పెట్టుకున్నాను. ఇది చదివాక స్నానం కూడా నేనే చేయించేవాడిని.

మాకొక మంచి పిల్లల డాక్టర్ దొరికారు. నిఖిల్ కి తరచుగా గొంతులో ఇంఫెక్షన్ వచ్చేది. డాక్టర్ చూసి, ఆ మాట చెప్పి కేవలం జ్వరానికి మాత్రం వ్రాసిచ్చేవాడు. 24 గంటలు చూసి తగ్గకపోతే నాకు ఫోన్ చెయ్యండి నేను ఫోన్ మీదే ఏంటి బయాటిక్ పేరు చెబుతాను అనేవాడు. యెంత ధైర్యం వున్నా తండ్రిగా, భర్తగా అప్పట్లో చాలా టెన్షన్ పడేవాడిని. వొక రోజు ఆ డాక్టర్ ని అడిగాను, ఇలా ఇంఫెక్షన్ రాకుండా వుండాలంటే యేం చెయ్యాలి అని. నా మనసులో యేముందంటే అది వచ్చే దారులేవో తెలిస్తే ఆ తలుపులు మూసుకు కూర్చుంటే ప్రమాదం తప్పుతుంది కదా అని. నా అమాయకత్వానికి నవ్వి అన్నాడు : అది రావడానికి వెయ్యి దారులు. మీరు మరీ యెక్కువగా ఆలోచించి జాగ్రత్త తీసుకోవద్దు. మామూలు పరిస్థితుల్లో మనం తీసుకునే జాగ్రత్తలే చాలు. చిన్న చిన్న వాటికి గురైన పిల్లల ఇమ్మ్యునిటి కూడా బలపడుతుంది. లేదూ ఏదన్నా వస్తే నేనున్నాను కదా అని. ఆయన లండన్ లో కొన్నాళ్ళు చదువుకున్నాడు. ఆయనా, స్పోక్ వొకే మాట చెప్తారు. తిండి విషయంలో పిల్లల మీద బలవంతం వద్దు, వాళ్ళు ఇష్టంగా తినాలి, తిండి వరైటి మార్చుతూ ఇవ్వండి అని. నేను తూ చ తప్పకుండా పాటించా. నిఖిల్ కి తినడం 20 యేళ్ళు దాకా అలవాటే కాలేదు. తప్పనిసరిగా వుండాల్సిన కామన్ సెన్స్ అప్పుడు లేకపోయింది నాకు. ఇది పని చెయ్యడం లేదూ అని తెలిసిన తర్వాత పధ్ధతులు మార్చుకోవాల్సింది. ఇప్పటికీ మా వాడు అంటాడు అప్పుడు బలవంతంగానైనా నాకు తిండి అలవాటు చెయ్యాల్సింది అని. ఈ మాట ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే జీవితంలో ఏ విషయంలోనూ పర్ఫెక్షన్ అంటూ వుండదు. ప్రతి తల్లి దండ్రులకు వేర్వేరు అనుభావలుంటాయి. చేసిన పొరపాట్లు, చెప్పుకోవాల్సిన విజయ గాథలూ వుంటాయి.

సరే నేను ఇది వ్రాయడం మొదలు పెట్టింది డాక్టర్ స్పొక్ తన పుస్తకంలో వ్రాసిన కొన్ని వాక్యాలు మీకు అందించాలని.

Enjoy your baby మీ పాపను ప్రేమించండి, ఆ సహచర్యం ఎంజాయ్ చెయ్యండి. పాప ఎలా వుంటే అలా స్వీకరించండి. ఎలాంటి గుణగణాలున్నాయి అందంగా వుందా ప్రత్యేకంగా వుందా ఇలాంటివేవీ పట్టకుండా పాప ఎలా వుంటే అలా స్వీకరించి ప్రేమించండి. ఇది నేను సెంటిమెంటు కారణంగా చెప్పడం లేదు. పాపను ఎలా వుంటే అలా స్వీకరించినపుడు పెరిగి పెద్దయ్యక ఆ పాప ఆత్మగౌరవంతో మెలగగలుగుతుంది. సంతోషంగా వుండగలుగుతుంది. అది చాలా ముఖ్యం. అలాంటి పరిస్థితుల్లో ఆ పాపలో వున్న విశేష శక్తులూ, యుక్తులూ అన్నీ సంపూర్ణంగా వికసిస్తాయి. తద్విరుధ్ధంగా పెంచితే పాప ఆత్మన్యూనతతో పెద్దవ్వచ్చు.

Changing roles of men and women ఇప్పటికీ సమాజంలో గెండర్ వివక్షలు చూస్తున్నాము. అది రూపు మాపాలంటే మీకు పుట్టిన బిడ్డను అబ్బయి అయినా అమ్మాయి అయినా వొకేలా పెంచండి. అబ్బాయికి ఆటవస్తువుగా బార్బీ డాల్ ఇవ్వరు. మీవాడు ఇష్టపడుతున్నాడా? తప్పక ఇవ్వండి. వాడు పెద్దయ్యాక మంచి తండ్రి కాగలడు. పిల్లల్లో అబ్బాయిల సమర్థను, అమ్మాయిల అందాన్నీ వచ్చినవాళ్ళు మెచ్చుకోవడం చూస్తాము. అలాంటి పరిస్థితి వచ్చినపుడు నెమ్మదిగా వేరే విషయంలోకి మారండి. ఆ ఉచ్చులో మీరూ పడొద్దు, పిల్లల మీద ప్రభావం కూడా పడనివ్వద్దు.

We are disillusioned ఆస్తికులైన తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. వొక నమ్మకం ప్రకారం, పనులన్ని ప్రశాంతంగా చేసుకుంటూ పోతారు. ఇలా వ్రాయడం ద్వారా నేను ఆస్తికత్వాన్ని ప్రచారం చేస్తున్నాననుకోవద్దు. నేను ఏ చర్చికీ చెందను, కాని నాకు గట్టి ఆధ్యాత్మికమైన నమ్మకాలున్నాయి. మతపరమైన నమ్మకాలు లేనివాళ్ళు యెక్కువ వంచితులు, వారిలో మానవత్వాన్ని కూడా సరైన విలువ ఇవ్వరు. మనం అన్నిరకాల భ్రమలకు వంచితమైన కాలం లో వున్నాము, వస్తువుల పట్ల కాదు మనుషుల పట్ల. ఆయన వాడిన పదాలు ఇవి disenchanted, disillusioned శాస్త్రీయ, సాంకేతిక ప్రగతి తో పాటు మనుషుల్లో మతాన్ని ప్రశ్నించే గుణమూ, సమాధానం రానప్పుడు మారడమూ జరిగింది. ఇక్కడ వొక పొరపాటు జరిగినట్టు నాకు తోస్తుంది. ఈ భ్రమ మానవ ప్రకృతిని తప్పుగా అర్థం చేసుకునేలా చేసింది. మనం ఇతర జంతువులకంటే ఎంతో ఉన్నత స్థానం లో వున్నా, మనం వేరు. మన ప్రకృతి ఆధ్యాత్మికం. మనలో వున్న నైరూప్య హేతువుతో మనం ఈ విశ్వం మూతం యొక్క అర్థాన్ని చాలావరకు తెలుసుకోగలిగాము. మనుషులకి మతం మీద నమ్మకం లేకపోనీ, ప్రేమ మీద తప్పకుండా వుండాలి. మేలు, మంచితనం, సత్వర్తన వల్ల కలిగే లాభమే నమ్మాలి. పిల్లలు ఇలాంటి భావనలతోనే ఎదగాలి.

పిల్లలు తమని వున్నది వున్నట్టుగా స్వీకరించి ప్రేమించే సమాజం కావాలి. ఏదో ప్రత్యేకత, నైపుణ్యం లేదా అందం వున్నందువల్ల కాదు. అప్పుడే వాళ్ళు ఆత్మ విశ్వాసంతో మనగలుగుతారు. ఆ లక్షణాలని మెచ్చుకోకూడదని కాదు, మెచ్చుకున్నా అది గౌణమై, అప్రధానమై వుండాలి.

ఇంత లావు పుస్తకంలో ఏది ఎంచుకోవాలో సమస్యే. స్పృశించని అంశం లేదిందులో. నేను చదివింది 1992 ఎడిషన్. దాని తర్వాత పది దాకా సంస్కరణలు జరిగిన ఎడిషన్లు వచ్చాయి. ప్రతి సారి సమయాని తగ్గట్టుగా కొత్త కొత్త అంశాలను జోడిస్తూ. ఈ 1992 పుస్తకం లోనే స్వలింగ సంబంధాల గురించి, సింగిల్ పేరెంట్ గురించి, దత్తతు గురించి, ప్రయాణాలలో జాగ్రత్తల గురించి, child abuse గురించి, వికలాంగ పిల్లల గురించి, కవల గురించి వొకటేమిటి చాలా విషయాల గురించి చర్చించాడు.

నా వరకైతే ఈ పుస్తకం నా పిల్లల పెంపకంలో దారి దీపం పని చేసింది.

*

పరేశ్ దోశి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తల్లిదండ్రులు అయ్యే ముందు take it for granted ga తీసుకోకుండా, ఎవరైనా చదువుకుని ప్రిపేర్ అవుతారా ఆ సందర్భానికి, సంరక్షణకు అనుకునేదాన్ని. మీరు అలా చెయ్యడం నాకు ఎంతో నచ్చింది. పిల్లల ఒక్కో వయసులో ఒక్కో ఛాలెంజ్. దానికి parents సంసిద్ధం కావడంలో పుస్తకాల ది ముఖ్య పాత్ర. తెలుగులో ఏమి ఉన్నాయో తెలియదు. మీరు చేసినది సమాజానికి విలువైన పని. అభినందనలు.

    • Thank you Aruna Pappu garu. తెలుగులో చలం బిడ్డల శిక్షణ ఉంది. చాలా బాగుంటుంది.

  • చలం గారి,బిడ్డ లశిక్షణ, చదివాము, కానీ,మీరు రాసింది దానిబట్టి. .మీరు పరిచయం చేసిన book బాగునట్టు ఉంది .ధన్యవాదాలు, జీ!మంచి book పరిచయం చేసినందుకు.!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు