1
విద్యార్థి దశ కవిత్వ ఉద్వేగానికీ ఆవేశానికీ సజీవ రూపం!
విద్యార్థి దశలో బతికే ఎవరైనా- వాళ్లేం రాసినా అది కవిత్వంతో తళతళలాడుతుంది. దానికి ఓజోగుణం వుంటుంది. అదే- ఆ దశని ప్రత్యక్షంగా అనుభవిస్తున్న విద్యార్థులే ఐతే కవిత్వానికి ఇంకో రూపాలే.
వాళ్ళని పోలిన గొప్ప కవిత్వం ఇంకేదైనా వుందా అంటే- తడుముకోకుండా మళ్లీ వాళ్ళే అని చెప్పాలి.
బాల్యంలో ఎక్కువ కాలం విద్యార్థులు బతికేది పాఠశాలలోనే. ఉపాధ్యాయుల సమక్షంలోనే. విద్యార్థులతో విద్యార్థుల మధ్య బతికే ఉపాధ్యాయులు నిత్యం తాజాగా వుంటారనేదానికి ఉదాహరణలు అనేకం.
సహజ సున్నిత స్వభావం తొలి యవ్వన దశ నుంచి లోకమంతా విస్తరించడమూ నూతన వ్యవస్థ నిర్మాణంలో భాగమే అనుకుంటాన్నేను.
2
అవును- మీరంటున్నది నిజమే. ప్రపంచం కృత్రిమ అవస్థలోకి జీవనసంక్షోభంలోకి కూరిపోతున్నప్పుడు విద్యార్థుల్లోనూ దాని ప్రతిఫలనాలు కనిపిస్తాయి కదా అని-
నేనంటానూ- తరగతి గదులను వెలిగించే విద్యార్థులకూ జీవనసంక్షోభం అర్థం కావాలని- అర్థమైన ఆ స్థితిలోంచే ప్రపంచాన్ని సరైన దృష్టికోణంలోంచి అర్థం చేసుకుంటారని- ఆ దృష్టికోణం కలగడానికి మాత్రం ఉపాధ్యాయునిదే ప్రధాన పాత్ర అంటాన్నేను.
విద్యార్థుల చిన్న చిన్న అనుభవాలను; రోజువారి ప్రపంచాన్ని- దాని పోకడలను గురించి ఏం ఆలోచిస్తున్నారో- తరగతి గదుల్లోంచి ఎలా ఎదుగుతున్నారో- తెలుసుకోవాలని ఈ ప్రయత్నం. తరగతి గదుల్లోంచి సృజనలేని తరం, చూపులేని తరం ఒకటి తయారవుతుందని మారిన వాతావరణంలో వర్తమానాన్ని గమనిస్తూ అప్పుడెప్పుడో అన్నాన్నేను. లేదు లేదు అది అబద్ధం- చూపున్న విద్యార్థులు వస్తున్నారని- విద్యార్థులదే రేపటి కాలం అని చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఆ చెప్పడమేదో వాళ్లే చెబితే! అందుకే విద్యార్థులదే ఈ వేదిక.
విద్యార్థులంటే- పాఠశాల విద్యార్థులే కాదు, కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులూ ఈ వేదిక మీద నిలబడొచ్చు.
3
సారంగలో ఈ కాలమ్ మొదలవుతున్న సందర్భంగా ప్రముఖ కవి- ‘మంగలేష్ దబ్రాల్’ పిల్లల కోసం రాసిన ఒక కవిత మీ కోసం. ఇది పిల్లల కోసం రాసినా, విద్యార్థులకు అంతే ప్రేమగా వర్తిస్తుంది.
పిల్లలకు ఉత్తరం
•
ప్రియమైన పిల్లల్లారా, మీ కోసం మేం ఏమీ చేయలేకపోతున్నాం. మీ ఆటల్లో మేం భాగమవ్వాలని మీరు కోరుకుంటారు, మాతో ఆడాలనుకుంటారు, మీలాగే అమాయకంగా మేం మారాలని కోరుకుంటారు.
ప్రియమైన పిల్లల్లారా, బతకడమంటే ముగింపులేని యుద్ధమని మేం మీకు చెప్తాం. బతుకుయుద్ధంలో మేం కత్తులను మొదటగా వాడటానికి సానబెట్టాం. కోపం, ద్వేషం మమ్మల్ని అంధుల్ని చేశాయి. ప్రియమైన పిల్లల్లారా మేం మీతో అబద్దం చెప్పాం.
ఈ రాత్రి సుదీర్ఘమైనది, సొరంగమంత సుదీర్ఘమైనది, ఈ సొరంగం బయటంతా మేఘావృతం, మేం అక్కడ శోకాన్ని వింటున్నాం. పిల్లల్లారా మిమ్మల్ని అక్కడికి పంపిస్తున్నందుకు క్షమించండి. మేం అబద్ధం చెప్పాం – జీవితం ఒక యుద్ధభూమని – మేం అబద్ధం చెప్పాం.
ప్రియమైన పిల్లల్లారా, జీవితం గుండా మీరు నవ్వుల్లా వెదజల్లబడతారు – జీవితం పండగలాంటిది, ఆకుపచ్చని చెట్టులాంటిది – మీరు పక్షుల్లా చెట్టులోపల రెక్కలతో టపటపలాడుతుంటారు. ఒకానొక కవి చెప్పినట్టు- జీవితం విసిరిన బంతి మరియు నువ్వు విరామంలేని పాదానివి- నీ చుట్టూ జీవితం అల్లబడి వుంది.
ప్రియమైన పిల్లల్లారా, మేము చెప్పినది నిజం కాకపోతే అప్పుడది ఏమైనా కావొచ్చు.
4
విద్యార్థుల కవిత్వానికి ఆహ్వానం.
మీరు విద్యార్థులు అయితే మీ కవితల్ని నేరుగా editor@saarangabooks.com కి పంపించండి.
అధ్యాపకులు కూడా తమ విద్యార్థుల కవితల్ని పంపించవచ్చు.
*
మంచి ప్రయత్నం సార్
అభినందనలు
పిల్లల్ని ముందుకు తీసుకుపోయే ఆలోచన ఇది..అంటే కాలాన్ని కూడా!?
అభినందనలు…