కొత్త మాటల్ని వెతుక్కోవాలి!

నిషికేమి తెలియదని
ఓ క్రిమి వచ్చి చెప్పేదాక తెలియలేదు.
ఇది అఖండ నాగరికతకు
ఒక గర్వభంగం!చెట్టూ పుట్టా పట్టుకోడానికి
ఇప్పుడు అడవులు కూడా లేవు
సకల మేధస్సులూ
డొల్ల విశ్లేషణల్తో  డీలాపడ్డాయి.

ప్రపంచం
ఇంత సంక్లిష్టమని
ఇప్పుడే తెలిసింది.
వైరస్ పేదలకే ఎక్కువ వైరి.
ఉద్యోగాలు పోతున్నాయి
బతికుంటే
బలుసాకు కూడా మిగిలేటట్టులేదు.
క్రిమి వర్సెస్ ఎకానమీ.

ఊపిరితిత్తులు
అందరికీ వుంటాయి
కాని కూలీలకు
బయట వేలాడుతుంటాయి.
చేతులు అందరికీ వుంటాయి
కాని కూలీలకు
చాకిరే శానిటైజరు.
సొంతూళ్లకెళ్ళి
ఏం చేస్తారు తండ్రీ!
అక్కడా ఇదే ఎండ!

ఏ దేశంలోనైనా
శ్రీమంతులు బాగానే వుంటారు
ఎల్లనివారిదే లొల్లి.
మెలో డ్రామాలు చూసి
కన్నీళ్లు పెడితే చాలదు.

మనిషి, మానవత
సహనం,సంకల్పం
ఈ పదాలన్నీ
నిరర్థకంగా రాలిపోతున్నాయి.
ఇప్పుడు కవిత్వం రాయడానికి
కొత్త మాటల్ని వెతుక్కోవాలి.

*
painting: Mandira Bhaduri

డా.ఎన్. గోపి

3 comments

Leave a Reply to Kota Prasad Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగా చెప్పారు. మనిషి కేమీ తెలియదు, క్రిమి వచ్చి చెప్పేదాకా.

  • ఇప్పుడు, కవిత్వం, రాయడానికి కొత్త
    మాటలు ను వెతుకోవాలి..👌👍.సర్.
    అభివందనలు.!💐

  • “చాకిరే కూలీలకు శానిటైజర్” అద్భుతంగా రాశారు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు