కొత్త ప్రశ్నల వెతుకులాట “అయిదోగోడ”

కల్పన కథల్లోని పాత్రలు మన నిత్య జీవితంలో కనిపించే పాత్రలే, కాకపోతే మారుతున్న సమాజానికి అనుగుణంగా ఏర్పడిన పాత్రలు.

గాయాలు కనిపించవు, గాయాలు మాట్లాడవు, గాయాలు సాక్ష్యమివ్వవు, ఈ చరిత్రకు దేహమే మొదలు, దేహమే చివరా!! వాళ్ల బతుకులు ఎప్పుడెలా ఆరంభమయ్యాయో, ఎక్కడ ఎప్పుడెలా అంతమయ్యాయో ఒక్క సాక్ష్యమూ దొరకదు, ఒక్క మాటా వినిపించదు, ఒక్క కాలిజాడా మిగలదు!! అంతటా మౌనం, ఏదో ఒక చివర నాలుగు గుసగుసలు, ఎక్కడో ఒక చోట మృత్యువు చిరునామా, ఆద్యంతాల నడుమ నలిగే నిశ్శబ్ద చారికలు..

అని కల్పనా రెంటాల చాలా కాలం క్రితం ఒక కవితలో రాశారు. ఇప్పుడు ఆమె తాజాగా వెలువరించిన కథా సంకలనం ‘అయిదో గోడ’లో ఇవే మృత్యువు చిరునామాలు, ఇవే నిశ్శబ్ద చారికలు కనిపిస్తాయి.  ప్రవహించే నదులు సాక్ష్యాలు చెప్పవు, శవాలని మోసిన బావులు మాట్లాడవు, మట్టి వాసనల మనుష్యుల మూలాల్ని పట్టివ్వవు.

ఈ కథలు చదువుతున్నప్పుడు ఫ్రెంచి అస్తిత్వవాది, ఫెమినిస్టు సిమన్ ది బోవా రాసిన 1949లో రచించిన  సెకండ్ సెక్స్ (రెండవ సగం) లో కొన్ని భాగాలు 1989-90 ప్రాంతంలో  ఉదయం దినపత్రికలో అనువదించి ప్రచురించిన రోజులు గుర్తుకు వచ్చాయి. ఆమె స్త్రీని రెండవ సగం అని మాత్రమే అన్నారు కాని మొదటి సగం పురుషుడే అని చెప్పారు. పురుషుడు సారం అయితే స్త్రీ భౌతిక రూపమే అని అన్నారు. సమాజంలో పురుషుడు అత్యవసరం, సంపూర్ణం, సర్వోత్కృష్టం అయితే, స్త్రీ అనవసరం, అసంపూర్ణం, ఖండితం అన పరిస్థితుల గురించి ఆమె వివరించారు. అతడు ప్రపంచంలోకి విస్తరించి తన ఇష్టాన్ని ప్రపంచంపై రుద్దితే స్త్రీ లోలోపలికి ముడుచుకుపోయి, అంతర్ముఖురాలిగా మారుతుందని, అతడు సృష్టించి, వర్తించి, ఆవిష్కరిస్తే ఆమె తనను కాపాడేందుకు అతడికోసం నిరీక్షిస్తుందని ఆమె అభివర్ణించారు.

అప్పటికీ ఇప్పటికీ స్త్రీ రెండవ సగమే. భౌతిక రూపమే. కల్పన ఈ రెండవ సగం కు అడ్డంకిగా ఉన్న కనపడని అయిదో గోడ గురించి ఒక సామాజిక దృక్పథంతో, ఒక సైద్దాంతిక నేపథ్యంతో ఈ కథలురాశారు. ‘మాకు గోడలు లేవు, గోడలు పగులగొట్టడమే మా పని, అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం’ అని శ్రీశ్రీ ఏనాడో రాశారు. నాలుగు గోడల్ని ఛేదిస్తున్న స్త్త్రీలు ఈ అయిదో గోడను కూడా ఛేదించే సమయం తప్పకుండా వస్తుంది. అయిదో గోడ కనపడని గోడ, అదృశ్యంగా ఉండే గోడ, ఈ గోడ వెనుక ఉన్న దృశ్యాదృశ్యాల గురించి కల్పన తన కథల్లో వివరించారు.

ఈ గోడలన్నీ భూస్వామ్య,పెట్టుబడి దారీ , సామ్రాజ్యవాద, మార్కెట్  వ్యవస్థలు, నిర్మిస్తున్న గోడలు. మనల్ని మనం అమ్ముకునేలా చేసి మనమే కొనుక్కుంటున్నామని భ్రమలు కలిగించే గోడలు, ఆరోగ్యకరమైన, స్వచ్చమైన, కల్లాకపటం లేని, స్నేహపూరితమైన సంబంధాలను అడ్డుకునే గోడలు. వీటన్నిటినీ మనం ప్రశ్నించాల్సిందే.

మనం సమాజంలో వ్యక్తులుగా జీవిస్తున్నప్పటికీ మన జీవితాలు ఈ వ్యవస్థలకు భిన్నమైనవేవీ కావు. సామాజిక నేపథ్యం నుంచి వేరువడ్డవి కావు.  కనుక సమస్యలను ఎదుర్కొనే వ్యక్తులు వ్యక్తి వైకల్యం (ఏలియనేషన్ ) కాకుండా వారి గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత సమాజానికి, రచయితలకు ఉంటుంది. అందుకే కల్పన రకరకాల జీవితాలు జీవిస్తున్న వారి గురించి మనకు తెలియజేసే ప్రయత్నం చేశారు.

స్త్రీల జీవితాల గురించి, సమానత్వం గురించి, వారి ఆకాంక్షల గురించి, ఇష్టాయిష్టాల గురించి, స్వంత ఆలోచనల గురించి   మన తెలుగు రచయితలు ఎప్పుడు పట్టించుకోవడం ప్రారంభించారో చెప్పలేం. మల్లాది, చలం, కుటుంబరావు, రంగనాయకమ్మ, ఓల్గా. తదితరులు మనకు ఉండవచ్చు. కాని ఆధునిక సమాజంలో విస్తృతంగా, వేగంగా  మారుతున్న వస్తువుకు అనుగుణంగా, అంతే వేగంగా రచనలు రావడం లేదని మనకు అనిపిస్తుంది. ఇవాళ్టి గోడలు చాలా సంక్లిష్టమైనవి,

అసలు నేను మారుతున్న సమాజానికి అనుగుణంగా ఆలోచిస్తున్నానా అని నాకే అనిపిస్తుంది. మా అమ్మాయి తన మిత్రులతో కలిసిన గ్రూప్ ఫోటో లో ఒక యువకుడిని చూపిస్తూ వాడు ‘గే’ అని చాలా  సాధారణంగా చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఇవాల్టి తరం  లైంగిక ఇష్టాయిష్టాల గురించి నిస్సంకోచంగా మాట్లాడుకోవడం నాకు కొత్త విషయమే.  తన తండ్రి ఒకప్పుడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినప్పటికీ,  సౌరభ్ కృపాల్ అనే న్యాయవాదిని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో వెనుకాడింది. నిన్నమొన్నటి వరకూ  ఐర్లాండ్ కు భారత రాయబారిగా ఉన్న వ్యక్తి తాను గే అని బహిరంగంగా ప్రకటించుకున్నారు. గే ల విషయంలోనే కాదు, మొత్తం ఎల్ జి బి టి ల విషయంలో భారతీయ సమాజం ఎంతో వెనుకబడి ఉన్నది. శిఖండిని చూడగానే భీష్ముడు అస్త్ర సన్యాసం చేశాడట. ఇప్పుడు కూడా ట్రాన్స్ జెండర్ లను చూస్తే సమాజం దూరంగా పారిపోతున్నది. బస్ స్టాపులవద్ద అడుక్కోవడం తప్పని సరి అయిన వారిని చూసి ఎందరి కార్ల కిటీకీలు తెరుచుకుంటాయి? మహాభారత కాలానికీ, నేటికీ ఏం మార్పు వచ్చిందని? మనమింకా రామాయణ, మహాభారత కాలం నుంచి దూరం రాకుండా ఉండేందుకు ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు మనను వెనక్కు నెట్టేస్తూనే ఉంటాయి. గతాన్ని ప్రశ్నించకుండా, భవిష్యత్ లోకి వెళ్లకుండా అడ్డుకుంటూనే ఉంటాయి.

అంతేకాదు, స్వతంత్రంగా జీవించే స్త్రీలు,  మరో స్త్రీని సహచరిగా ఎంచుకునేవాళ్లు,  భర్త చనిపోయిన తర్వాత మరో సహచరుడిని వెదుక్కునే వాళ్లు, పురుషుడి హింసాకాండపై  తిరుగుబాటు చేసేవాళ్లు, అత్యాచారాలపై బహిరంగంగా పోరాటం చేసేవాళ్లు, స్త్రీ సహజ శరీరధర్మాలను అర్థం చేసుకోలేని సమాజాన్ని ప్రతిఘటించేవారు, నాలుగు గోడల మధ్య  ఇష్టానికి వ్యతిరేకంగా భర్త చేసే రేప్ ను ఎదుర్కొనేవాళ్ల గురించి సమాజం చర్చించదు. కల్పన కథల్లో ఇలాంటి అనేక పాత్రలు ఎదుర్కొన్న  భీభత్సకర సన్నివేశాలు మనకు ప్రత్యక్షమవుతాయి. ఒక్కో కథ ఒకో కొత్త జీవితాన్ని మనకు పరిచయం చేస్తుంది, ప్రతి పాత్ర గోడల్ని ధ్వసంచేసేందుకు ప్రయత్నిస్తుంది. సృష్టి, శారద, శ్రియ, తులసమ్మ,సాంచెజ్, మాయ, వైష్ణవి ఇవన్నీ మన నిత్య జీవితంలో కనిపించే పాత్రలే, కాకపోతే మారుతున్న సమాజానికి అనుగుణంగా ఏర్పడిన పాత్రలు.

కల్పన తన కవితలో రాసినట్లు వాళ్ల పుస్తకాల్లో తొంగిచూశారు.ఒక్కో పుట చింపి మనకు చదివి వినిపించారు. కన్నీళ్లతో అలుక్కుపోయిన అక్షరాల్ని మనకు కనిపించేలా తిరిగి రాశారు. రెండు వేర్వేరు సంస్కృతుల్ని మాత్రమే కాక, రెండు సంస్కృతుల మధ్య ఘర్షణల్నీ, వైరుధ్యాల్నీ చిత్రించారు. స్థలకాలాల్ని విభజించిన లక్ష్మణ రేఖల్ని ప్రస్తావించారు.

ఈ హింసాచరిత్రకు దేహమే మొదలు, దేహమే చివరా.. మనసు పాత్ర ఎక్కడుంది?

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

3 comments

Leave a Reply to పట్నాల ఈశ్వర రావు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కల్పన గారి అయిదో గోడ కధ సంపుటి చలబాగా విశ్లేషించారు కృష్ణరావు గారు. ఈ పుస్తకం చర్చపై ఆంధ్ర అస్సోసియేషన్ ఢిల్లీ వారు ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ లో మాట్లాడుతూ కూడా “ఈ హింసాచరిత్రకు దేహమే మొదలు, దేహమే చివరా.. మనసు పాత్ర ఎక్కడుంది?” అన్నారు.

    కృష్ణపక్షం లో వచ్చే విశ్లేషణలు , కవితలు క్రమం తప్పకుండ చదివే పాటకుడిగా ఆయన ఈ విశ్లేషణ చాలా మెచ్చుకుంటాను

  • కొన్నేళ్ళ క్రితం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఉత్తమ రచనల పోటీలో ఉత్తమ బహుమతి గెలుపొందిన కల్పన రెంటాల “ఐదో గోడ” మకుటంగా ఇప్పుడు తన తొలి కథల సంపుటి వెలువడడం, అన్నీ కథలూ పాఠక లోకాన్ని ఆలోచింపజేయగా, ఐదో గోడ కథ మరింతగా ఆకట్టుకుని అనేక చర్చా వేదికలకీ దారి తీయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అప్పటి నాయ నిర్ణేతలయిన నేనూ, గొల్లపూడి వారూ ఈ కథ మీద చాలా సార్లు చర్చించుకున్నాం. ఆయన హెమ్ టీవీ లో నిర్వహించిన వందేళ్ళ కథకి వందనాలు ధారావాహికలో ఈ కథని ఎంపిక చెయ్యడానికి నన్ను సంప్రదించినప్పుడు కూడా నాకు భలే సంతోషం వేసింది. కల్పనా రెంటాల ఏది వ్రాసినా ఆషామాషీగా ఉండదు అని అందరికీ తెలిసినా, తన కథా సంపుటి ఇప్పటికైనా ప్రచురించినందుకూ, దానికి వస్తున్న విశేష స్పందనకీ ఎంతో అభినందిస్తున్నాను.

    —వంగూరి చిట్టెన్ రాజు

  • మంచి సమీక్ష ఐదో గోడ కూడా కూలిపోయే రోజు తొందరలోనే రావాలి. మంచి పుస్తకాలు దొరికే చోటు, రేటు కూడా తెలియ జేస్తే బాగుంటుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు