కొత్త ప్రశ్నల కూడలిలో కథా ‘కచ్చీరు’

బహుజన తాత్విక దృక్పథంతో కొత్త కథకులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో బహుజన కథాకచ్చీరు జరుగనుంది. ఫిబ్రవరి 2,3 తేదీల్లో జరిగే ఈ సమావేశానికి కూడలి వేదిక కానుంది.

థలు రావాలి. మంచి కథలు రావాలి. సమాజంలోని అన్ని సమూహాల నుండి పచ్చిపచ్చిగా బతుకు కథలు రావాలి. కొత్త కథకులు కావాలి. కొత్త వస్తువు కావాలి. కథా సాహిత్యం మరో అడుగు ముందుకు వేయాలి. కథకు ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి. ఇప్పుడొస్తున్న కథలన్నీ బాగున్నాయా? ప్రతీ యేడాది ఎన్ని మంచి కథలు వస్తున్నాయి? ఎంత మంది కొత్త కథకులు వస్తున్నారు? వారికి వారి కథల బాగోగులు చెప్పే కథా విమర్శకులు ఉన్నారా? కథా యుగం నడుస్తున్నదనుకునే కాలంలో కథ దారి తప్పుతున్నదా, ఉన్నతీకరణ చెందుతున్నదా? యేడాదికేడాది కాదు, క్షణ క్షణం మారుతున్న జీవితపు పార్శ్వాలను, సంఘర్షణను కథ పట్టుకుంటున్నదా? వికసిస్తున్నట్టు కనిపిస్తూనే మూసలో పడి కొట్టుకుంటున్నదా? ప్రపంచం ఎటువైపు పరుగులు తీస్తున్నది, మన కథ ఏ గట్టున మొద్దు నిద్ర పోతున్నది? కథలకు స్పేస్‌ పెరిగిందా? తరిగిందా? కథా సంకలనాల, వార్షికల క్వాలిటీ పెరుగుతున్నదా? నెమ్మదిగా లాబీయింగ్ లతో దిగజారుగుతున్నదా? కవి సమ్మేళనాలు ఉన్నట్టు కథా సమ్మేళనాలు ఎందుకు లేవు?

కథకుడు సరిగానే ఆలోచిస్తున్నాడా? సమాజాన్ని చూడాల్సిన విధంగానే చూస్తున్నాడా? ఎవరి పక్షం వహిస్తూ ఎలాంటి కథలు రాస్తున్నాడు? కాలక్షేప కథలు రాసేలా కథకున్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది ఎవరు? కథకులకు వస్తువు ముఖ్యమా? శిల్పం ముఖ్యమా? శిల్పం కథను డామినేట్‌ చెయ్యొచ్చా? కథలో మాండలికం ఏ మేరకు ఉండాలి? ఏది భాషా? ఎవరిది మాండలికం? ఎవరు నిర్ణయించాలి? రెండు రాష్ట్రాలమయ్యాం సరే అణగారిన బాధితుల పక్షాన కథకుడు నిలబడుతున్నాడా?

ఔనూ, తెలుగులో చెంచు కథకులున్నారా? యానాది కథకులున్నారా? రెల్లి కథకులున్నారా? పోనీ మైదాన ప్రాంతాల్లో మన చుట్టే జీవిస్తున్న డక్కలి, బైండ్ల, పంబాల, బుడిగ జంగాల నుండి ఒక్క కథకుడైనా రాకుండా అడ్డుకున్నది ఎవరు? ఎక్కడ జరిగింది మోసం? కథకుల పట్ల పత్రికల తీరు మారుతున్నదా? మరింత కుంచించుకుపోయి గడ్డకట్టుకు పోతున్నదా? ఎలైట్‌ కథకులు పాశ్చాత్య పోకడలను ఇంకా కాపీ కొడుతూనే ఉన్నారా? సొంత గొంతుకతో సొంత కాళ్ల మీద ఏమైనా నిలబడే ప్రయత్నం చేస్తున్నారా? మరిచేపోయాను…కనుమరుగైన కథకుల జాబితా పెరుగుతోందా? తరుగుతోందా? కథకులకు ప్రోత్సాహం అందించే సాహిత్య సంఘాలున్నాయా? కథకులను గుట్టు చప్పుడు కాకుండా చంపే కుట్రలు ఇంకా నడుస్తున్నాయా? కథ గురించి లోకం ఏమనుకుంటున్నది? లోకం గురించి కథకుడు ఏమనుకుంటున్నాడు?

కథ తిరిగి తిరిగి మళ్లీ మొదటికే చేరుతున్నదా? విశ్రాంత వర్గాల, బలిసిన కులాల ఈవెంట్‌ షోగా మారుతున్నదా? కమర్షియల్‌ కార్పోరేటు సొగసులతో హొయలుపోతూ సామాజిక బాధ్యతను చూసి వెకిలిగా నవ్వుకుంటున్నదా? కథ అంటే క్యాబరే డ్యాన్సా? డబ్బున్న వాళ్లు మాత్రమే వేదికలెక్కి దిగే సెల్ఫీల టైం పాస్‌ వ్యవహారమా? సీనియర్‌ కథకులు కళ్లు మూసుకుంటున్నారా? మూసుకున్నట్టు నటిస్తున్నారా? విపరీత పోకడలు, విర్రవీగే వికటాట్టహాసాలు తెలుగు కథకు మేలు చేస్తాయా? తన తిండి తాను తిన్నందుకు చంపబడ్డ ఆక్లాక్‌ను గురించి తెలుగు కథ పట్టించుకున్నదా? అగ్రవర్ణాల అమ్మాయిని ప్రేమించినందుకు దారుణంగా హత్యగావించబడ్డ ప్రణయ్‌లు మన కథకులకు కనిపిస్తున్నారా? ప్రశ్నించే గొంతుకలను పట్టపగలే నిర్మూలించే పాలక నీతి మన కథల్లో ఎండగట్టే నీతిగా ఎప్పుడు మారేను? యూనివర్సిటీల్లో ఇంకా రాజ్యమేలుతున్న మనువాద కులవ్యవస్థ కురూపి రూపం మన కథల్లో చిత్రించే ధైర్యం ఉందా మనకు? ఓట్లకోసం నోట్లు రద్దు చేసి ప్రజల బతుకును రోడ్డున పడేసిన దుర్మార్గాన్ని కథలుగా మలిచామా? అవినీతిని ప్రతీ గడపకు చేరుస్తున్న దిగజారుడు రాజకీయ వ్యవస్థను గురించి కథ రాసే స్పృహ అందివచ్చేది ఎప్పుడు? ప్రజలంటే ఐదేళ్లకోసారి క్యూలో నిలబడి ఓట్లేసే ఓటర్లుగా మారుస్తున్న వారసత్వ, డబ్బు రాజకీయాలను గురించి కథకుడు ఏమనుకుంటున్నాడు? అంతరిస్తున్న ఈ దేశ మూలవాసుల ఆర్తిని ఆవేదనను ఒక్క కథకుడైనా కథీకరించే సాహసం చేస్తున్నాడా? ఎస్సీఎస్టీబీసీ మైనారిటీ కథకుల కథలను పట్టించుకునే సాహిత్య పెద్దమనుషులు ఎందరు? నాలుగు దశాబ్దాల అస్తిత్వ కథా సాహిత్య గమనం చాటుతున్న నిజాలు ఏమిటి? అనుభవాలు ఏమిటి? ప్రధాన స్రవంతిని ఎవరు నిర్ణయిస్తారు? ఎట్లా కుట్రలు చేసి ఆక్రమిస్తారు?

కథను నిర్మొహమాటంగా విమర్శించే విమర్శకుల కరువు ఎప్పుడు తీరుతుంది? కవిత్వానికి ఉన్నట్టు కథా ప్రక్రియకు విమర్శకులు ఎందుకు లేరు? చెత్త కథల్ని, మంచి కథల్ని విడమరిచి చెప్పే వాళ్లు లేకపోవడం తెలుగు కథా వికాసానికి ఏ మేరకు దోహదం చేస్తుంది. ఈ పదేళ్లలో సమాజంలో వచ్చిన మార్పులు ఎన్ని? వాటిని పట్టుకున్న కథలు ఎన్ని? కథకులు ఎందరు? సమాజ గమనాన్ని వదిలి గాలిలో మేడలు కడుతున్న కథకులను ఎవరు నేల మీదికి దించాలి? అక్షరాల రెండులక్షల యాభైవేల కథలు సరే, వీటిలో సామాన్యుని గుండెను తట్టిలేపిన కథలెన్ని? గమనం సరే, గమ్యం ఏది? దళిత క్రైస్తవుల నుండో, ముస్లిం దూదేకుల నుండో కథకులు రావాల్సిన అవసరం లేదా?

ఇంతకాలం కథను ఏ అగ్రవర్ణాలు ఆక్రమించుకున్నారు? ఏది బహుజన కథ? ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నాము? ఎక్కడ సక్సెస్ అవుతున్నాము? ఎవరు మనల్ని మభ్యపెడుతున్నారు

ఈ ప్రశ్నలకు జవాబులు వెతికే దిశగా కూడలిలో యక్షి-కూడలి సౌజన్యంతో… బహుజన కథకుల కచ్చీరు జరుగనుంది. బహుజన తాత్విక దృక్పథంతో కొత్త కథకులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ సమావేశం జరుగనుంది. ఫిబ్రవరి 2,3 తేదీల్లో జరిగే ఈ సమావేశానికి కూడలి వేదిక కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి బహుజన కథకులు హాజరుకానున్నారు. జీ.లక్ష్మీ నర్సయ్య, సంగిశెట్టి శ్రీనివాస్‌, స్కైబాబ, పసునూరి రవీందర్‌, చందు తులసి తదితరులు నిర్వాహకులు.

*

 

 

పసునూరి రవీందర్

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ కూడలిలో ఈ ప్రశ్నలలో కొన్నిటికైనా సమాధానాలు దొరుకుతాయని ఆశంస

    • అవును సార్. వెతకాలి. వేచి చూడాలి ఎన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయో

  • సరి అయిన ప్రశ్నలను వేసి చర్చకు దిగిన ” బహుజన కథకుల కచ్చీరు జరుగనుంది. బహుజన తాత్విక దృక్పథంతో కొత్త కథకులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ సమావేశం జరుగనుంది. ఫిబ్రవరి 2,3 తేదీల్లో జరిగే ఈ సమావేశానికి కూడలి వేదిక కానుంది. ”

    సరి అయిన జవాబులొస్తే ఆ జవాబులను ఇక్కడ పంచితే బావుంటుంది .

  • ఎక్కుపెట్టిన ప్రశ్నలు..సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్నలు…మనల్ని మనం బేరీజు వేసుకోవాల్సిన ప్రశ్నలు..
    కూడలి ఈ ప్రశ్నలకు జవాబులివ్వాలి.కొత్త కథకులకు వెన్నుదన్నవ్వాలి.కొత్త వస్తువులతో కథ తొణికిసలాడాలి.బహుజనుల ఒడిలో కథ మళ్లీ కొత్తగా నవ్వాలి.

  • మీ ప్రశ్నలన్నీ గులకరాళ్ళలాగా నీటిలో మునుగుతాయో లేక పదిమందిని గమ్యం చేర్చే పడవలై నీటి మీద కదులుతాయో
    ఫిబ్రవరి 2,3 తేదీల్లో తేలిపోతుంది. ప్రశ్నలు ఎక్కు పెట్టినంత తేలికగా ఫలితాలు రావడం కష్టమే.

    • కష్టమని ప్రశ్నించకుండా ఉంటే నష్టమే !!

  • తప్పకుండా స్వాగతించాల్సిన చర్చ. నిర్వాహకుల అనుమతి తో పాల్గొనాలనే ఆలోచన ఉన్నది.

  • రెండు రాష్ట్రాల బహుజన కథకుల తొలి సమ్మేళనం ఇదేననుకుంటా!
    మెజారిటీలుగా ఉన్న బహుజన కథకులు సొంత స్పృహతో ఉన్నది ఎంత!? పరాయితనాన్ని మోస్తున్నది ఎంత!? తేల్చుకునే అవకాశమున్న ‘కచ్చీరు’గా భావించొచ్చు!
    నిర్దిష్టత, మరింత నిర్దిష్టత ప్రాముఖ్యతను గూగీ తదితరులు బలంగా చెప్పినా బహుజన కథకులు ఎంతోమంది ఆధిపత్య భావజాలకుల మెప్పుకోసం ఎంతకైనా దిగజారే పరిస్థితిని చూస్తున్నాం. దీన్ని బ్రేక్ చేయాల్సిందే!

  • ప్రశ్నల హోరు ఇక మిగిలింది సమాదానాల జోరు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు