ఎం.ఎస్.కె కృష్ణజ్యోతి (కొత్త పండుగ కథా సంకలనం)
- మీకు బాగా గుర్తింపు తెచ్చిన తోలు మల్లయ్య కథ నేపధ్యం ఏమిటి?
ఐదు పది రూపాయల రబ్బరు చెప్పులు చీటికీ మాటికీ తెగిపోతే, వాటిని ఈడ్చుకుంటూ ఎంతో కష్టంతో నడవటం ప్రతి ఒక్కరికీ తెలుసు. అది కొందరికి కేవలం ఒక అనుభవం. నాకు మాత్రం ఎంతగానో ఆకర్షణ కలిగించిన జ్ఞాపకం.
బాగుచెయ్యాల్సిన చెప్పుని చేతిలోకి తీసుకుని చక చకా, అందంగా సౌకర్యంగా కుట్టి కాలికి తొడుక్కోమని ఇచ్చి, మహా అయితే ఒక పావలానో, అర్ధ రూపాయో కూలి అడిగేవాడు. అతని దుకాణానికి వెళ్ళిన ప్రతిసారీ శ్రద్దగా గమనించేదానిని. అతను కుట్టినట్టు నేను కూడా చెప్పులు కుట్టాలి
అని ఇంటికొచ్చి ఎన్నోసార్లు ప్రయత్నించినా ఆ పనితనం, ఆ కుట్టులోని పొందిక నాకు అందేవి కావు. ప్చ్. అతని దగ్గర ఉన్న టూల్స్ ఉన్నాయి. నా దగ్గర లేవు. అవి నాకు దొరికితే బావుణ్ణు. బజార్లో ఏ దుకాణంలోనూ అవి కనబడవే? ఆ పదునైన చాకు, చెప్పుని గట్టిగా పట్టి ఉంచే బంక ఎక్కడ అమ్ముతారు? అవి దొరికితే నేను కూడా అచ్చంగా అతనిలానే చెప్పు కుట్టగలను!
పసితనం ప్రతి పనినీ అబ్బురంగా చూస్తుంది. వెదురు కర్రల పని, చెప్పుల పనీ నాకు బాగా నచ్చేవి. చాలా పెద్దయ్యి, సంపాదనకి తగినంత చదువుకొన్న తరవాత కూడా వాటిని నేను మర్చిపోలేదు.
వెదురుతో రకరకాల వస్తువులు ఎలా చెయ్యాలో తెలిపే పుస్తకం, రెండు పదునైన కత్తులు, కట్ట పొడుగాటి వెదురు కర్రలు కొని రోజూ వాటిని కత్తిరిస్తూ, అంచులు నునుపు చేస్తూ కుదిరీ కుదరని పరికరాలు చేసేప్పటికి ఓ బిడ్డకి తల్లిని కూడా. కానీ, ఈ చెప్పులు కుట్టే మేకులూ, దబ్బనాలూ, ఆరా దొరకనే లేదు!
అసలు ఇంకా చాలా వస్తువులు ఉంటాయి కదా అతని దగ్గర, వాటి పేర్లు ఏమిటో? ఎవరైనా చెబితే బాగుండు. ఇప్పుడు ఆనెకాయలు వచ్చాయి. చెప్పు లేకుండా నడవలేను. కాలు లేని వాళ్లకి కృత్రిమ కాలు ఎంతో, ఆనెలు ఉండేవాళ్లకి చెప్పులు అంత. నా కాలికి నొప్పి తెలీకుండా నడిపిస్తున్నాడు కదా, ఆ పెద్దాయన పేరేంటి?
ఇంకా, ఇదివరకు అక్కడ ఊళ్ళో ఉండిన ఒక చర్మకారుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అతని ఇంట్లో ఎవరెవరు ఉండి ఉంటారు? అతని జీవితం ఎలా నడుస్తుంది?
సరిగా జరుగుబాటు ఉందా? అప్పుడు నా పాకెట్ మనీ రోజుకి పావలా, నేను తనకి ఇచ్చే ఒక విడత ధర. ఇప్పుడు అసలు ఎన్నాళ్ళు అయిందో చెప్పు తెగిపోయి. ఆఖరి సారి ఎప్పుడు వెళ్లాను ఆ చిన్న దుకాణానికి? అరిగిపోవలసిందేగానీ యీ నా ఖరీదైన బ్రాండెడ్ చెప్పులు అసలు తెగనే తెగవు కదా. పైగా, అరిగేదాకా కూడా వాటిని వేస్తామా ఏమిటి? పిల్లలు మనల్ని మించి ఉన్నారు. కొత్త బట్టలు కొంటే, వాటికి సరిపడే కొత్త చెప్పులు కూడా అడుగుతారు. మనప్పుడైతే అసలు ఒక్కోసారి చెప్పులు తెగిపోయిన వెంటనే తిరిగి కొనేవాళ్ళు కూడా కాదు. కొన్నాళ్ళు వట్టి కాళ్ళతో బడికి వెళ్ళాలి.
ఇదిగో, ఇలా ఇవన్నీ ఆలోచిస్తూ, వాటినే ఒక కాగితం పైన రాసుకుంటే, అదే కథ అయింది.
చెప్పులు కుట్టే మేకులూ, సుత్తీ, అరా; పదునైన నునుపైన మొన కలిగిన చిన్న మేకు లాంటి చాకు ఉంటుంది,
ఏవంటారో దాన్ని? అది ఇప్పటికీ నాకు దొరకలేదు, దానితో నేను చెయ్యాలనుకున్న రిపేరు పని చెయ్యనేలేదు.
అందుకే, ఆ నిరాశనుంచి బైటికి వచ్చేలాగా ‘నేను తోలుమల్లయ్య కొడుకుని’కథ రాశాను.
- మీ కథలో స్త్రీ పాత్రలు ప్రత్యకంగా అనిపిస్తాయి. దానికోసం ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు?
భలే అడిగారండీ! అసలు ఏ శ్రద్ధా, ఎవరూ తీసుకోనివి నా పాత్రలు! ఒకామె చిన్న కాకిగూడు కోసం లక్షల విలువ చేసే వడ్డాణం అడ్డం వేసింది.
ఆ రవణమ్మ? తెల్లారి మొదలు పచారీ దుకాణం తీసి నానా చాకిరీ చేసి ఇంటిని నడిపితే, వాడు, కొడుకే మొత్తం కాజేశాడు. ఇంకొకామె మొగుడికి, ఆ పిల్లని చావకొట్టడానికి వంకలేవీ అవసరం లేదు, అన్నం తినేప్పుడు పొలమారితే చాలు.
ఏడ్పించి ఏడ్పించి వదులుతుందే, ఆ షరీనా అబద్ధాల పిల్ల, ఎవరికి పట్టింది తన గోస వినడానికి.
సూక్ష్మ జీవులు, వ్యాధులు, ఋతుస్రావంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియవు.
ఆర్ధిక పరిస్థితులు, GST వస్తు సేవలు, పన్నులు……..చెత్త ఏరుకునే ధనమ్మకి ఇవికూడా తెలియవు.
తెలిసింది ఒక్కటే, ఇప్పుడు రెండు కాళ్ళ మధ్య ఒక మెత్తని ముట్టుగుడ్డ(అదేలెండి, శానిటరీ పాడ్)ఉంటే, నడవటానికి హాయిగా ఉంటుంది.
పాపం, ఎవరు శ్రద్ధ తీసుకుని ఆ పిల్లకి అది ఇస్తారు? దురాయి లచ్చమ్మ మాత్రం ఏమి కోరింది?
మొదట్లో అత్యాశ పడినా, చివర్లో ఒక్క లెంపకాయ కొడితే చాలు అనుకుంది కదా. ఎవరు శ్రద్ధ తీసుకుంటారండీ వీళ్ళ కోసం?
మీరు అడగడం కూడా భలే ఉంది. ఏం తెల్లారి లేస్తే వేరే పనులు లేవా?. అందుకే, ఊరకే, వాళ్ళు ఎలా ఉన్నారో అలా రాస్తాను.
అంతగాక? కాస్త కుదురు పెట్టి, వాళ్ళు ఎదురు తిరిగేసినట్లు, లోకాన్ని తిరగా మరగేసినట్లు చేయడం నా వల్ల ఎలా అవుతుంది? నేను చాలా బిజీ అండీ బాబూ. ఈ చిన్నా పెద్దా పాత్రల సంగతి నాకెందుకు. అసలు ఇవన్నీ ఆలోచించక గమ్మునుంటే, అంతకు మించిన సుఖముందా ఎవరికైనా.
***
కొట్టం రామకృష్ణా రెడ్డి (నూనె సుక్క)
–నూనె సుక్క, 3456GB, ఒంటరి ఏకాంతం, యాత్ర…వేరు వేరు జానర్ కథలు. అంటే ముందే ఈ జానర్ అనుకుని రాస్తుంటారా…?
ఫలానా కథ ఫలానా జానర్ లో రాయాలని ఎప్పుడూ అనుకోను. అలాగే ఫలానా జానర్లోనే కథ రాయాలనీ అనుకోను. కథా వస్తువే జానర్ ని ఎన్నుకుంటుందని అనుకుంటాను.
నిరంతరం ఆలోచనా స్రవంతిలో మునిగి ఉన్నప్పుడు ఫ్లాష్ లా పుట్టిన point ని దాచి ఉంచుకుని, తీరిక దొరికినప్పుడు జాగ్రత్తగా నెమరేసుకునే వరకూ జరిగే process జానర్ని ఎన్నుకుంటుంది..
అలా conceive అయిన కథ…ఆఖరికి పేపర్ పై పురుడు పోసుకుంటుంది.
వైవిధ్యమైన నిరంతర అధ్యయనమే కొత్త జానర్ లలో కథలు రాయడానికి ఊతమిస్తుందని నమ్మకం.
మీ కథల్లో ముగింపు వాక్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. కొన్ని సార్లు ఆ వాక్యంతో కథ స్వరూపం మారిపోతుంది. చివరి వాక్యం కోసం ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు…?
చాలా సంధర్భాల్లో నాకు కథ ముగింపే స్ఫురిస్తూంటూంది. దానికి ముందంతా జాగ్రత్తగా కథని అల్లుకుంటాను.
ఎన్నో చిక్కు ముళ్ళు వేస్తూ వెళ్ళి, మళ్ళీ ఒక్కో ముడిని విప్పుతూ రావడమే కథనుకుంటాను.
విప్పరాని, లేని ఎన్నో చిక్కుముళ్ళని వేసేసి, ఒకటేసారి ఆఖరి వాక్యంతో అన్ని ముళ్ళనీ విప్పేస్తే పాఠకుడిని ఒక ఉద్వేగం, ఆనందం, ఆశ్చర్యం, ఉత్కంఠకి లోను చెయ్యడం వలన ఆ కథ చాలా కాలం పాటు పాఠకుడి మదిలో నిలిచి పోతుందని నమ్మకం.
దీనికంతటికీ మళ్ళీ కథా వస్తువే కథని నిలబెడుతుందని అనుకుంటాను.
సినిమా first half కంటే, second half ఎంత బలంగా ఉంటే, అంత hit కొడుతుందనుకుంటాను. కథకి కూడా అదే సూత్రం వర్తిస్తుందనుకుంటున్నాను.
*
Nice