నేను నడుస్తున్న దారిలో ఒకప్పుడు సమూహం ఉండేది. బహుశా సమూహం ఉండే దారిలోనే నేను నడిచేవాడినేమో.. ఎప్పుడూ ఒక గొంతు మాట్లాడుతూ ఉండేది. పక్కనే నడుస్తున్న స్నేహితుడి చేయి అప్పుడప్పుడూ నా చేతితో పెనవేసుకుని రోడ్డు దాటిస్తుండేది.
ఇరానీ హోటల్ లో వగరు చాయ్ ను చప్పరిస్తూ గంటలు గంటలు గడిపేవారం. అప్పుడప్పుడూ ఆ స్నేహితురాలి చేయి నా చేయి తాకి ఒళ్లు మైమరిచేది. ఆ నవ్వు హృదయపు పొరల్ని విప్పి వింజామరలా వీచేది.
రాత్రి పూట ఉస్మానియా హాస్టల్ ముందు నేనూ,నా మిత్రుడూ రాతి కుర్చీలపై కూర్చుని ఛాయా గీత్ ను అనుభవించేవారం. పాత పుస్తకాల్లోని పుటల వాసన సంభాషణంతా సోకేది.
కోఠీ నుంచి తార్నాక దాకా ప్రతి బస్ స్టాప్ వద్దా మా జ్ఞాపకాలుండేవి. పత్తర్ గట్టీ గల్లీలో ఉల్టా రాసిన అక్షరాలు పోస్టర్లలో నినాదాలై గోడల ఒళ్లు ఝల్లుమనేది.
ఏ ఇంట్లో రాత్రుళ్లు గడిపామో, ఏ రాత్రుళ్లు వేడి వేడి చర్చల మధ్య టీలను పొగలు కక్కించేదో, ఏ తెల్లవారు ఝామునో సూర్యుడి కిరణం తాకి వెలుగుతున్న దేహాన్ని మరింత వేడెక్కించిందో..
మాట్లాడుతూనే ముందుకు సాగుతుంటే ఉన్నట్లుండి నిశ్శబ్దం ప్రేతాత్మలా ఆవరించింది. అప్పుడు అర్థమైంది. సమూహం మాయమైందని.
నా దారి వేరు,నీ దారి వేరు అని. దారులు ఎక్కడ చీలిపోయాయో,లేక ఎప్పుడు తప్పిపోయామో
నీకూ నాకూ తెలియదు అని.
ఇప్పుడు నీ దారిలో అప్పటి నినాదాలు, కరపత్రాలు,ఉపన్యాసాలతోడుగా ఎడారులు, ఎండమావులూ ప్రవేశించాయి. పాత గ్రాంఫోన్ రికార్డు మోగుతూనే ఉన్నది. అదే వాక్యాన్ని మళ్లీ మళ్లీ కర్ణకఠోరంగా ఆలపిస్తూ..
నా దారిలో పచ్చిక బయళ్లూ, సెలయేళ్లతో పాటు ఎండుటాకులు,నిశ్శబ్ద గీతాలు ప్రవేశించాయి. పిచ్చిక గూళ్లలో పాములు తచ్చాడుతున్నాయి. మెదడులో రాత్రుళ్లు నిండిపోయాయి.
ఉన్నట్లుండి ఎవరో పిలిచినట్లుంది. నీవే అనుకున్నా. కాని వెనుక ఎవరూ లేరు.ఎవరో భుజం తట్టినట్లనిపించిందియ
నీవేనా అనుకున్నా,కాని భ్రమని తెలిసింది. చెవులకు పరిచితమైన స్వరం,భుజాల్లో ప్రసరించిన వెచ్చటి స్పర్శ మోసం చేస్తాయా?
వయసుతో పాటు ఎంతదూరం నడిచానో తెలియదు.తలపై వెండిమేఘాలు కదిలేవరకూ..
నీకోసం నిట్టూర్చని రోజు లేనే లేదు.పేజీల మధ్య , వాక్యాల మధ్య వెతకని క్షణం లేదు
దారులు ఎప్పుడు చీలిపోయామో. ఇప్పటికీ తెలియదు. కాని అనాలోచితంగా, అప్రయత్నంగా నీ దారిలో నేను, నా దారిలో నీవు, మన దారిలో మనం నడుస్తున్నామేమో..
అయినా ఇప్పుడు నీలి గగనం వైపు మేఘాలకోసం చూస్తే గద్దల రెక్కల చప్పుడు ఆవహిస్తోంది కదా..
మనుషులకోసం అన్వేషించబోతే నేల నిండా వేటగాళ్ల పద ధ్వనులు వినిపిస్తున్నాయి కదా..
పూలవాసన కోసం వనాల్లోకి వెళితే నెత్తుటి పరిమళం గుప్పున క్రమ్ముకుంటోంది.
ఆకులు మంచుబిందువులు రాల్చాసింది పోయి బొట్లుబొట్లుగా కన్నీళ్లు కారుస్తున్నాయి.
ఆ కళ్లు తెరుచుకుని ఆకాశం వైపు చూస్తున్నాయి. చేతులనుండి తుపాకీల తుప్పు పుప్పొడిలా రాలుతోంది.
అప్పుడు ప్రతి పెన్నూ ట్రిగ్గర్ ధరించినట్లుండేది. ఇపుడు ప్రతి శవమూ నేలపై మృత్యుగీతం రాస్తోంది. కవిత్వం ఆత్మహత్య చేసుకుంటోంది. విగ్రహం పిడికిలి బిగించి వినపడని నినాదం చేస్తోంది. వేనవేల చితులు నిప్పురవ్వలతో ఆకాంక్షల్ని బూడిద చేస్తున్నాయి.
నేను శిథిలాల మధ్య మొలచిన లేత మొక్కను చూసి జీవన సంగీతంగా ఆనందిస్తున్నాను.
ఇవాళ వెనక్కి చూస్తే మనం నడిచివచ్చిన దారి లేనే లేదు. వేల దారుల్లో మాయమైంది ఎన్నడో.. కొత్త దారి నిర్మిద్దాం వస్తావా మరి..
*
గొప్పగా రాశారు . “అప్పుడు ప్రతి పెన్నూ ట్రిగ్గర్ ధరించినట్లుండేది. ఇపుడు ప్రతి శవమూ నేలపై మృత్యుగీతం రాస్తోంది. కవిత్వం ఆత్మహత్య చేసుకుంటోంది. విగ్రహం పిడికిలి బిగించి వినపడని నినాదం చేస్తోంది. వేనవేల చితులు నిప్పురవ్వలతో ఆకాంక్షల్ని బూడిద చేస్తున్నాయి.”
ఈ పదాలు నిజమే