కురుక్షేత్రం నాటకం చూడ్డానికి
లంకాధిపతి సతీసమేతంగా వస్తాడు
వారిని నవ్వుతూ పలకరించి
ముందు వరుసలో కూర్చోబెట్టుతాడు
బళ్ళారి రాఘవ
కీచకుడు చేస్తోన్న దుర్మార్గానికి
వెనుక వరుసలో కూర్చోన్న వాలి
విపరీతంగా ఫైర్ అవుతాడు
శకుని మాయపాచికల మోసానికి
విభీషణుడు తీవ్రఅసహనానికి
గురవుతాడు
దుర్యోధనుడు
ద్రౌపదికి చేస్తోన్న అవమానానికి
మండోదరి కోపంగా రావణుని వైపు చూస్తుంది
ద్రోణుడి అసత్య చావుకు
ధర్మరాజు మీద మండిపడతాడు ఇంద్రజిత్తు
కృష్ణుడి మాయ వినయాలు చూసి తాటకి
లోలోన ఉడుక్కుంటుంది
కర్ణుడి కుట్రపూరిత అంతాన్ని చూసి
శూర్పణఖ తీవ్ర మనస్తాపంతో
నాటకాన్ని చూల్లేక అర్థాంతరంగా
వెనుదిరుగుతుంది
భీష్ముడు అంపశయ్య పై
పంటిబిగువున నొప్పిని అనువించడం
చూసి మారీచుడు కంటతడి పెడతాడు
స్కెచ్ వేసి హత్య చేసిన అభిమన్యుని
మరణాన్ని చూసి కుంభకర్ణుడు
పిల్లాడిలా ఏడుస్తాడు
నాటకం మోసమంటూ మైరావణుడు
ఆవేశంతో మైకును విరుస్తాడు
రంగస్థలం చిన్నబుచ్చుకుంటుంది
నటుల వేషాలు కొండెక్కుతాయి
యవనిక మరోనాటకానికి
గ్రీన్ రూమ్ వైపు నడుస్తుంది
అదృశ్యంగా చూస్తోన్న రాముడు
పక్కకు తప్పుకుంటాడు నిశ్శబ్దంగా.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
వెంటకటేష్ కి సొంతమైన ముద్ర
థ్యాంక్యూ మహమూద్