లక్ష్మి కందిమళ్ళ మూడు కవితలు 

1
కనిపిస్తోందా? వినిపిస్తోందా? 
ఆకురాలుతున్న శబ్దం
గాయాలు గేయాలై
గాలిలో కలిసిపోతూ..
చింపిరి జుట్టులా
వేలాడుతున్న కొమ్మపైన
పిచుకొకటే దిగులుగా కూర్చొని ఉంది
అదంతా
కనిపిస్తోందా?
వినిపిస్తోందా?
*
ఎన్నో భయాలనుంచి
అనేక దృశ్యాలు
నువ్వొక అపరిచితమై
రంగు రంగుల బలహీనతలు
లోలోపల
విన్నవి చూసినవి బరువుగా
వాస్తవాన్ని అనుభూతించలేక
ముళ్లులా గుచ్చుకుంటుంటే
రెక్కలు కట్టుకొని
ఎగరాలని వుంటుంది నీకు
దూరంగా
దూర దూరాలకు.
*
2
మాటల రెక్కలతో
పొలిమేర సంబరపడి
నవ్వింది వెన్నెలై
వసంతం తెచ్చిన
సాయంత్రాలలో
తుమ్మెదల వయ్యారాలు
తోటంతా
మాటల రెక్కలతో
యాసలతో కవిత్వం
సీతాకోకచిలుకై ఎగిరింది హాయిగా
గోరువంక గూడేమో
కథానిలయమైంది
తడిపొడి తపనలతో..
*
3
కథలు 
మళ్ళీ అదే గందరగోళం
చుట్టూ సమూహాల చట్రాలు
ద్వేషపు వాసనలు
అదంతా నీకు రుచించదు
అకస్మాత్తుగా
నీలోని నువ్వు మాయమైనట్టు
ఉలికిపాటు
నిజమేనా
ఇదంతా అని
మళ్ళీఅదే కలవరింత
మెలకువలో కలలు వస్తాయా?
అదే మాట
అదే శబ్దం
కథలు కథలుగా..
*

లక్ష్మి కందిమళ్ళ

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు