కొన్ని నెత్తుటి పవనాలు వీచి చల్లారాయి. కొన్ని ఆక్రందనలు ఆకాశానికి ఎగిసి కూలిపోయాయి. కొన్ని నినాదాలు దిక్కులు పిక్కటిల్లి అగమ్యగోచరాలయ్యాయి. కొన్ని సిద్దాంతాలు కొన్నాళ్లు జనాన్ని ఆవహించి ఆవిరైపోయాయి. అవును, నేను సాహిత్యం గురించే మాట్లాడుతున్నాను. తెలుగు సాహిత్యాన్ని 80వ దశకం తర్వాత శాసించిన వాతావరణం ఇప్పుడెందుకో పలచనబారినట్లనిపిస్తోంది. ఈ నాలుగున్నర దశాబ్దాలు తెలుగు సాహిత్యంపై ఆరోగ్యకరమైన ప్రభావాన్ని చూపాయా, లేక నడిపించాల్సిన దారిలోనే నడిపించాయా, లేదా ఉజ్జ్వలంగా మార్చాయా అన్నది చర్చనీయాంశమే కాని మళ్లీ ఒక సారి ఒక కొత్త దారికోసం తెలుగు సాహిత్యం అన్వేషించాల్సిన అవసరం కనపడుతోంది.
సమాజంలో మార్పు అనివార్యం. లేకపోతే వాడేసిన మాటలే వాడుతూ ఉంటే, పాత గ్రాంఫోన్ రికార్డు ఒకే వాక్యాన్ని కర్ణకఠోరంగా ఆలపించినట్లుంటుంది. అలా ఎందుకు జరుగుతోంది, ఈ నాలుగున్నర దశాబ్దాల్లో జరిగిన తప్పులేమిటి.. అని చర్చించుకోవడం ఆవశ్యకమే కాని మన కళ్లు ఎప్పుడూ తల ముందే ఉంటాయి కనుక చూపులు ముందుకే చూడాలి. మాయమైన సమూహాలు, చీలిపోయిన దారులు, నినాదాలు, కరపత్రాల బదులు ప్రవేశించిన ఎడారులూ, ఎండమావులు, పచ్చికబయళ్లు, సెలయేళ్లకు బదులు ఎండుటాకులు, నిశ్శబ్దగీతాల గురించి బాధపడి లాభం లేదు.
మనం ప్రపంచానికి ఆరంభం ఏమిటో, అంతం ఏమిటో తెలియదు. ఈ పాత పుస్తకంలోని మొదటి మరియు చివరి పుటలు ఊడిపోయాయి…ఈ మధ్యలోనే మనం కొట్టుమిట్టాడుతున్నాం. అన్నాడు ఒక రచయిత.
హిందీ సాహిత్య విమర్శకుల్లో ప్రముఖుడైన నామవర్ సింగ్ మనం వలస పాలన నుంచి విముక్తి అయ్యాం కాని వలసవాదం నుంచి విముక్తి కాలేకపోయాం అన్నారు. ఈ డీకాలనైజేషన్ లేకపోవడం వల్లే మనం దశ, దిశను కోల్పోయినట్లనిపిస్తోంది. ప్రపంచ సాహిత్య సృజనలో మన సాహిత్యం కేంద్ర బిందువు కాలేకపోతోంది. జాతీయవాద భావనోద్వేగంలో వచ్చిన సాహిత్యమూ లేదు. అభ్యుదయ, ప్రగతిశీల ఉప్పెనలో కొట్టుకువచ్చిన సాహిత్యమూ లేదు, స్థానిక పోరాటాల ప్రేరణతో ఉప్పొంగిన సాహిత్యమూ లేదు. దందహ్యామాన దశాబ్దాలూ లేవు. ఇవాళ అస్తిత్వం మధ్య సాహిత్యం, సాహిత్యం మధ్య అస్తిత్వం కొట్టుమిట్టాడుతోంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా రచయితలు యూరప్, అమెరికా సాహిత్యాలకు సవాళ్లు విసిరినంతగా భారతీయ సాహిత్యం విసరలేకపోతోంది. మన రచయితలు, సాహిత్యం పరాజయం చెందడం వల్ల గతం మళ్లీ ఒక నీడలా పరుచుకునే పరిస్థితి ఏర్పడుతోంది. మనిషి ఆత్మాశ్రయంలోకి జారిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వేల వేల పుస్తకాలు పుటల్లా విచ్చుకుని రాలిపోతున్నాయి.
మన సాహిత్యం సంప్రదాయానికీ ఆధునికతకూ మధ్య, ప్రాంతీయతకూ, జాతీయతకూ మధ్య, ప్రయోగాత్మకత, స్వదేశీ రూపాల మధ్య సమన్వయం సాధించడంలో విఫలమైంది. సాహిత్యం ఒక ధార అని, ఒక ప్రవాహం అని, మారుతున్న కాలానికి అనుగుణంగా గతానికీ, వర్తమానానికీ మధ్య సమన్వయం సాధించుకుంటూ ముందుకు సాగడమే సాహిత్య లక్షణమని గ్రహించలేకపోతున్నాం. గతితార్కికత గురించి మనం మాట్లాడతాం. కాని సాహితీ వారసత్వానికి దాన్ని అన్వయించడంలో ఎక్కడో విఫలమవుతున్నాం. సాహిత్యాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని ఎవరి ముక్కల్లో వారు ఆనందిస్తున్నారు. వ్యక్తులుగా కొందరు గొప్ప రచయితలు, కవులు ఉండవచ్చు. కాని 80వ దశకం తర్వాత కవిత్వం, కథ, నవల, నాటకం తదితర ప్రక్రియల్లో మనం ప్రపంచ సాహిత్యంలో ఎక్కడో వెనుకబడిపోయినట్లనిపిస్తోంది. మనం పూర్తిగా డీకాలనైజ్ కాలేకపోతున్నామా? సామ్రాజ్యవాదంతో నిశ్శబ్దంగా రాజీపడే పరిస్థితి ఏర్పతోందా? పాశ్చాత్య సాహిత్య ఆధిపత్యానికి పోటీగా మన సాంస్కృతిక ఆధిపత్యాన్ని తిరిగి ప్రతిష్టించలేకపోతున్నామా?
నిజానికి భారతీయ భాషల్లో సాహిత్యాల సాంస్కృతిక చరిత్ర మనం అనుకున్నదానికన్నా సంక్లిష్టమైనది. అనేక సంస్కృతులు, మత పంథాలు, తత్వశాస్త్రాలు, భాషల విభిన్నత మూలంగా ఒకే దృక్పథంలో తులనాత్మక అధ్యయనం చేయడం అంత సులభం కాదు. అందుకే మన పక్కనే ఉన్న కన్నడ, మలయాళీ, తమిళ, ఒడియా, మరాఠీ సాహిత్యాలతో, ఆయా ప్రాంతాల్లో ఉన్న గొప్ప రచయితలతో మన రచయితలను పోల్చడం కష్టం. అన్నీ ప్రాచీనమైనవే కాని వాటి వాటి కాలాలు వేరు. ఒకో భాషకున్న చరిత్ర వేరు వేరు. కనుక ప్రతి సాహిత్యాన్నీ అంచనా వేసేందుకు ఒకే చరిత్రాత్మక సూత్రం సరిపోదు. భాషను బట్టి సమాజ నిర్మాణం, సంస్కృతి, రాజకీయ, సామాజిక చరిత్రలో విస్తృత వైవిధ్యం ఇందుకు కారణం. ఈ తేడాలు ఆ సాహిత్యాల్లో సహజంగానే ప్రతిఫలిస్తాయి. అదే సమయంలో మతం, తత్వశాస్త్రం, సాహిత్యం మధ్య ఉన్నపరస్పర ప్రభావం వల్ల ఇతర దేశాల్లో ఉన్న సౌందర్యాత్మక ప్రమాణాలతో కూడా పోల్చడం కూడా కష్టమే. భారతీయ భాషలతో పోలిస్తే ఇంగ్లీషు భాష చరిత్ర చాలా ఆధునికమైనప్పటికీ దాని దీర్ఘకాల రాజకీయ ఆధిపత్యానికి కూడా మన భావజాలం లోనైంది. అదే సమయంలో ఇస్లామిక్ ఆధిపత్యం, కొత్త సాహిత్య భాషగా ఏర్పడ్డ ఉర్దూ ప్రభావాన్ని కూడా విస్మరించలేం. విషాదకరమైనదేమంటే మన భిన్నత్వాన్నీ, భిన్నత్వంలో ఏకత్వాన్నీ, మన గతాన్నీ, వర్తమానాన్నీ సమన్వయం చేస్తూ భారతీయ సమాజంలోని విభిన్న పరిణామ క్రమాలను మనదైన దృష్టిలో అంచనా వేయకుండా, తులనాత్మక సాహిత్య అధ్యయనం చేయకుండా మన నూతుల్లో మనం మునిగి తేలుతున్నాం. అందువల్ల ఒక సమగ్ర దృక్కోణంతో భారతీయ సాహిత్య రచన చేయడం కూడా కష్టమే.
అసలు భారత దేశంలో ప్రాచీన, మధ్యయుగ, వలసకాలీన, సమకాలిక సాహిత్య ధారలో ఉన్న సాధారణ అంశం ఏమిటి? వాటిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఏఏ తాత్విక ధోరణులు ఏఏ కాలంలో వాటిని ప్రభావం చేశాయి? పాశ్చాత్య సాహిత్య చరిత్ర రచన కొలమానాల ఆధారంగా భారత దేశ సాహిత్య రచన కొలమానాలను అంచనా వేయడం సాధ్యమా? మన సాహిత్యానికంటూ ప్రత్యేక కళా తత్వశాస్త్రం (ఈస్టటిక్స్) ఉన్నదా? భారతీయ అలంకారిక పరిభాషకూ, పాశ్చాత్య కళాతత్వ పరిభాషకూ తేడా ఏమున్నది? రెండింటి మధ్యా సమన్వయ కళాతత్వ శాస్త్ర విమర్శ చేసే అవకాశాలున్నాయా? ఈ అంశంపై కొంత చర్చ జరిగింది కాని అది అసంపూర్తిగా మిగిలిపోయింది.
మనం ఎక్కడో దారి తప్పాం. ఆచరణీయం కాని సిద్దాంతాలు, ఉద్యమాల వల్ల నలిగిపోయి సాహిత్యాన్ని కూడా దారి తప్పించాం. అందువల్ల ఒక అపూర్వ సాహిత్య సృష్టిని మన సమాజం కోల్పోయింది. మనం ఏ భావాల ప్రభావంలో ప్రవర్తిస్తున్నామో తెలియకుండా నడుచుకోవడం తప్పయితే, ఏ భావాలను ప్రచారం చేస్తున్నామో తెలియకుండా రచనలు చేయడం అంతకు పదిరెట్లు తప్పు అని బాలగోపాల్ అన్నారు. ఇప్పటికైనా సంకుచిత గోడల్ని ఛేదించి పరిపూర్ణ సాహిత్యాన్ని, సమాజంలోని అల్లకల్లోలాలతో పాటు మనుషుల ఆలోచనా విధానాన్ని ప్రతిబింబింపచేసే సాహిత్య సృష్టి జరగాలని ఆలోచిద్దాం.
మనం కొత్తదారిని నిర్మించకపోతే, దారి కన్పించకుండా మళ్లీ వెనక్కు మళ్లే ప్రమాదం ఉంది.
*








Thought provoking! ఉద్యమాల ఉదృతి, అవి జరిగేటప్పుడు చెలరేగే ఆవేశకావేశాలు, ఒకళ్ళని మించి ఒకరు చెలరేగి న్యూస్ హెడ్లిన్యూస్ లో ఉండాలనుకునే పోటీలు, వాటిచుట్టూ తిరిగే రాజకీయ ఎత్తులకి పై ఎత్తులు, వీటిలో పడి కొట్టుకుపోతూ దారి తప్పిన ఆశయాల అవసరాల ప్రయోజనాల మధ్య అంతర్దానమైపోతున్న ప్రజాప్రయోజనాలు, సాహిత్యసృజనాత్మకత- సాహిత్యం భ్రమాల్లోకి నెట్టబడిందాని అనిపిస్తోంది. ఏదైనాసాహిత్యం వెలుగుచుసినా ఆ తాత్కాలిక క్షణాల పేరు ప్రతిష్టలకే పరిమితమైపోతోంది. పేలవమయిపోతోంది. ఉద్యమాల వేడి చల్లారగానే సాహిత్యము మరుగునపడిపోతోంది
మంచి వ్యాసం. నిజమే మంచి సాహిత్యం రావటం లేదు.
“పాశ్చాత్య సాహిత్య ఆధిపత్యానికి పోటీగా మన సాంస్కృతిక ఆధిపత్యాన్ని తిరిగి ప్రతిష్టించలేకపోతున్నామా?”
కన్యాశుల్కం లాంటి నాటకం ఈ రోజువరకు రాలేదు. నవల్లో కూడా 80 లో వచ్చినవి ఇప్పుడు రావటం లేదు.
“ఇప్పటికైనా సంకుచిత గోడల్ని ఛేదించి పరిపూర్ణ సాహిత్యాన్ని, సమాజంలోని అల్లకల్లోలాలతో పాటు మనుషుల ఆలోచనా విధానాన్ని ప్రతిబింబింపచేసే సాహిత్య సృష్టి జరగాలని ఆలోచిద్దాం.”