కొత్తతరం కథల శిల్పి

     కొత్తతరం రచయితలు ఎలా రూపొందుతున్నారు? వారి రచనాక్రమానికి స్ఫూర్తి ఏమిటి? రచనకు కావలసిన  వాస్తవికతను, సృజనాత్మకంగా ఎలా మలుస్తున్నారు? ముఖ్యంగా మూడు పదులు దాటిన  యువతరం వారి రచనానుభవం. అనేక నూతన అంశాలు సాహిత్యంలోకి వస్తున్నాయి. అతి చిన్న వయసులోనే కవిత, కథ, నవలా రచనలో జీవన వాస్తవికతను ఎలా చిత్రించ గలుగుతున్నారు- నూతన తరం ఆలోచనా స్రవంతిలో అనేక మెరుపులు ఉన్నాయి.
ఈతరానికి చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. తాము ఎంచుకున్న రచనా మార్గంలో  ప్రయోగాలకు ఎక్కువ ఖాళీ కూడా ఉన్నది. ఎలాంటి భయం లేకుండా సమాజతలంలోని అనేక విషయాలను రచనలో భాగం చేస్తున్నారు. సంక్షు భిత  సమాజంలో తాము భాగం కాదల్చుకోలేదు. అందుకే ఈతరాన్ని జాగ్రత్తగా చదవాలి. అంచనా వేయాలి. వారు రా యదగ్గ మార్గాన్ని విశాలం చేయాలి.
    హైమావతి ఉపాధ్యాయిని. పాలమూరు ప్రాంతం. అత్యంత వెనుకబడిన ప్రాంతం కూడా. అట్టడుగు నేపథ్యం. మూడు పదులు దాటిన వయసులో సాహిత్యం లోకి వచ్చారు. విప్లవ రచయితల సంఘం లో సభ్యురాలుగా ఉన్నారు. భారతసమాజంపై లోతైన అధ్యయనం ఉంది. ఈ దేశం కుల – వర్గ కూడిక అన్న  అవగాహన ఉంది. ముఖ్యంగా మహిళల  అస్తిత్వం పట్ల ఎరుకవుంది. ఈ అన్నిటిపట్ల పట్టు  సాధించడానికి ఆమె జీవనా నుభవం సరిపోతుందా!  గంభీరమైన ,జటిలమైన      సమస్యల పట్ల దృష్టి సారించడానికి, కథలుగా మలచడానికి సాహిత్య సాధన మాత్రమే సరిపోదు- జీవితం యొక్క రాపిడి ఉండాలి .జీవనం మిగిల్చిన విషాద జ్ఞాపకాలు ఉండాలి. వీటికి మించి ఉద్యమ స్వరూపం అంతర్లీనంగా ఉండాలి .వీటన్నిటి కలయికే రచయితగా రూపొందడానికి అవకాశం ఉంటుంది.
   హైమావతి ఉపాధ్యాయిని గా మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేస్తారు. నాలుగు దశాబ్దాల ఉద్యమ ప్రభావం  కుటుంబంపై ఉంది. తను ఆకేంద్రం నుండి సమాజంవైపు నిలబడాలనే అలోచనకు చేరుకున్నారు.  కుటుంబం, ఉద్యోగం వీటి మధ్య రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. కొత్త తరాన్ని  రచయితలుగా ఎవరు తీర్చిదిద్దుతున్నారు: తమ చుట్టూ ఉన్న పరిసరాలు, లేదా తమ వ్యక్తిగత అన్వేషణ .విరసం వంటి సాహిత్య సంస్థలు. రచయితలుగా రూపొందుతున్న వారిని మరింత మెరుగుపరుస్తాయి. రాజకీయ, సామాజిక విషయాలను రచనలో ఎలా సంలీనం చేయాలో చెబుతాయి. రూపం, శిల్పం, వస్తువు ఈ మూడింటి  సమ్మిళితం రచనకు పునాది. నూతనతరం తమ  అధ్యయనం ద్వారా రచనకు ఊపిరి అయిన అనేకతలను నమోదు చేస్తున్నారు .
   హైమావతి  చురుకైన భూమిక కలిగిన రచయిత. అన్నిటిని మించి సమాజ అధ్యయనం ఉన్నది .తన పరిసరాల, వ్యక్తుల ప్రభావం ఉన్నది. ఆమె కథా రచనలో మహిళల సమస్యలు- మాత్రమే ఉండవు. ఆ కథలలో రాజకీయాలు ఉంటాయి. ప్రగతిశీల ఆలోచనలు ఉంటాయి. ప్రజాసంఘాల పనితీరులో స్త్రీల భాగస్వామ్యం పై చర్చ ఉంటుంది. సమాజ ఉన్నతీకరణ కోసం స్త్రీలు చేసిన పోరాట రూపాలు ఉంటాయి .వీటిని కథలుగా మార్చడం కథా ప్రక్రియలో ఒదిగించడం చాలా కష్టం. రాజకీయాలు, శిల్పం ఎక్కడో ఒకచోట కలగలిసి ఉండాలి. ప్రపంచాన్ని తనదైన భావజాలంతో అంచనా వేస్తున్న క్రమంలో కథా రచనలో  ఆమె ఎంచుకున్న శిల్పం ప్రత్యేకమైనది. తన అనుభవంలోకి రాని విషయాలు ఆమె కథలలో  వుండవు. ఆమె కథలు జ్ఞాన తృష్ణకు సంబంధించిన వ్యవహారం కాదు . రాజకీయ, సామాజిక వస్తువుకు కథాశిల్పాన్నిచ్చారు .
    నూరేళ్ల లో అనేక కథలు ధారగా వచ్చి ఉంటాయి. ఎందరో రచయితలు కథా వరణలో తమదైన ముద్ర వేసి ఉంటారు. నూరేళ్ల తెలుగు కథ విస్తృతి, విశాలం ఎన్నదగినది. అనేక పాయలుగా  తెలుగు కథ వికసించింది.  సమాజ పొరలలోని అనేక అంశాలను రచయితలు చిత్రించారు .తెలుగు సమాజపు చైతన్యీకరణకు  కథ చోదక శక్తి అయింది . ఇక్కడే  హైమావతి నిలబడింది.
కథ కాలక్షేప రచనగా ఉండకూడదు. దానికొక రాజకీయ ,  సాంస్కృతిక  వ్యక్తీకరణ ఉండాలి . భావజాల ఘర్షణ తన అనుభవాలు ఇవన్నీ ఆమెకు ఉండనే ఉన్నాయి. అయితే పరిష్కారం ఏదో ఆవల ఉన్నది. ఈ అన్వేషణే హైమావతి కథలు. కథకు రాలిగా తొలిఅడుగు, చూపు  విశాలమైనది.  స్త్రీల సమస్యలు ఈ దేశ పురోగమనానికి ఒక అవరోధం. పురుషాధిక్యత స్త్రీలను కట్టడి చేసే ఆధిపత్యం ఏదో ఇవాల్టికి కొనసాగుతుంది. బండారు అచ్చమాంబ నుండి, హైమావతి వరకు ఈకథా వస్తువులు స్వీకరించిన వారే. అయినా ఒకానొక జటిల సమస్య భారతదేశం కుటుంబ వ్యవస్థలో అత్యంత బలీయంగా ఉంది. సామాజికార్థిక, తలంలో అనేక కుదుపులు వచ్చినా ఇవ్వాల్టికి స్త్రీల బలవన్మరణాల సంఖ్య తక్కువేమీ కాదు. భారతదేశం అనేక కొత్తదారుల గుండా ప్రయాణం చేస్తుంది. స్త్రీలు ఆర్థికంగా, సామాజికంగా తమను తాము నిలబెట్టుకుంటున్నా- సమాజపు దొంతరలో వారి స్థానం  ప్రశ్నార్థకమే .
    ఈతరం యువత రచనా  తీరును అత్యంత మెలకువతో గమనించ వలసి ఉంది. ఆధునిక జీవితం, గత కాలపు అనుసంధానం మధ్య ఉన్న సమతుల్యతతో అంచనాకు రావాలి. పూర్వ, ఆధునిక జీవితాల మధ్య అంతరం ఉందా లేదా? దాని కొనసాగింపు మాత్రమేనా? మనుషుల జీవనంలో అనేక సమస్యలు ఉన్నాయి.  మానవ జీవన సంవేదనలో ఎలాంటి మార్పులు లేవు. సమాజంలోని సంక్లిష్టతలు మరింతగా మనుషులను ఒంటరి చేస్తున్నాయి. ఈ వృత్తం పరిధిలో నిలబడి రచనా క్రమాన్ని అందిపుచ్చుకున్నారు. ముఖ్యంగా మహిళలు ఉద్యమ తీవ్రతతో పనిచేస్తున్న కాలాన్ని రచయిత నమోదు చేస్తున్నారు. కొత్తగా సాహిత్యావరణకు వచ్చిన రచయిత ముందు గందరగోల ప్రపంచం ఉంటుంది .కుటుంబాలలో, మనుషులలో అంకురించిన మానసికతను ఉద్యమ వెలుగులో హైమావతి చూశారు .ఇదొక పరిణామం.
     ఇవాల్టి రచయితలకు పై ఉద్యమాల ప్రభావం లేదనే సూత్రీకరణలు కొనసాగుతున్న దశ. విప్లవో ద్యమం ఎక్కడ ఉందనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ నూతన తరం ఈవెలుగులోనే సాహిత్య అధ్యయనం చేస్తున్నారు. సృజన చేస్తున్నారు. వాస్తవికతను గందరగోళం పరచకుండా తమ కొనసాగింపులో  మార్క్సిజం  ప్రభావం ఉన్నదనే గ్రహింపు వుంది.    నూతన తరం రచయితలను చదువుతున్నప్పుడు , వారు రాస్తున్న వస్తువులను అంచనా వేస్తున్నప్పుడు  ఒక పరిష్కార మార్గం గుండా వారి ప్రయాణం ఉన్నది అనే భావన.
    ఎందుకు మనుషులు తమను తాము కోల్పోయింది?!  తమకు సంబంధం లేని భావజాలంలోకి వెళ్లిపోయారు.  అనేక కథలు, అనేక రామాయణాలు, అనేక భారతాలు, పురాణాలు అల్లుకుపోయారు.
అవే పాడుతున్నారు. అవే  పునశ్చ రణ , సమాజ పరిణామ వాస్తవికత, ఉద్వేగాలను, కాల్పనికతను, రాజ్య వ్యవస్థలు బలోపేతం చేయాలి. ఎంతో రాజకీయ పరిణితి ఉన్న హైమావతిలో కథల పార్స్వం ఎన్నద గినది.
    అధ్యయనం, ఆసక్తి , ఉద్యమ ప్రాంతం ఇవన్నీ హైమావతి ఉన్నతశ్రేణి రచయితగా నిలపడానికి దోహదకారిగా ఉంటాయి. ఆమె చేయవలసింది సమాజంతో కనెక్ట్ కావడమే-కథ ద్వారా ఆమె సమాజంతో, మానవ సంబంధాలతో సంభాషణ చేస్తున్నారు .ప్రజల నుండి వచ్చిన శిల్పాన్ని అందిపుచ్చుకోవాలి.  కథా రచనలో మరిన్ని మెలకువలను అలవర్చు కోవాలి. రచయితగా ఆమె ఈ సమాజానికి ఇవ్వవలసింది ఎక్కువే.
*

అరసవిల్లి కృష్ణ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎందుకు మనుషులు తమను తాము కోల్పోయింది?! తమకు సంబంధం లేని భావజాలంలోకి వెళ్లిపోయారు. అనేక కథలు, అనేక రామాయణాలు, అనేక భారతాలు, పురాణాలు అల్లుకుపోయారు.
    అవే పాడుతున్నారు…hmmm..aalochinchali.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు