కొండ మడుగు

1
ఊరు ఊరంతా
మన్నులేని గోతిలో పడి కొట్లాడుతుంటే
ఎముకల గూడులా ఉన్న ఒక అడవిబిడ్డ
వరదగూడు లాంటి ఓ కలగన్నాడు
తట్టతో ఎత్తిపోస్తూ మట్టి మీద గట్టులా
గట్టు మీద చెట్టులా ఒక్కడే నిలబడ్డాడు
కొండ మొదలు తుప్పా డొంకా రాయీ రప్పా
చదును చేసి మన్ను బురిడాడు
తట్ట పార కత్తి గుణపం నాలుగు పనిముట్లు
నాలుగేళ్ల పాటు నాలుగు చేతులయ్యాయతనికి
కొండ వారగా జక్కర పీల్చిన నీళ్లగోర్జిలా
ఒక్కడి చెమటనే పిండుకుని
చెరువంత నీలి పరదా కప్పుకుందొక గుమ్మి!
2
పుట్టిన గడ్డమీద మమకారమే పురిగొల్పిందో
జన్మెత్తినందుకు మన్నన దక్కాలనుకున్నాడో
ఎండ దమటకి జాపోసిపోయి ఇటుగా
ఈవలి తీర్చుకోవడానికి వచ్చిన
వన్య జీవుల తడవని గొంతుకల ఆనవాళ్లు
అతని గుండెను కళ్ళను ఎంతలా తడిపేశాయో!
తన చెమటవాగును మలిపి
ఒక మడుగును సృష్టించాడు
వానాకాలంలో చూడాలే గానీ
కడుపు ఉబ్బి పోయిన
కాలేయ వ్యాధిగ్రస్తునిలా కనబడేది ఆ బంద
ఆఖరి శ్వాస నాటికి దాదాపుగా
అతడు కూడా అలానే ఉన్నాడు!
3
మొనదేలిన గోళ్ళు నాటిన అడుగు జాడల్లో
జిగట మట్టిమీద తాజాగా తడిమబ్బు చారలున్నాయి
గట్టు దరిన పిట్టలు ఉమిసిన పిక్కలున్నాయి
ఒడ్డు దాపునున్న చెట్ల నుండి
రాలిపడిన పిగిలి పళ్ళ గుత్తులున్నాయి
బురద నీటిలో ఎలగపండును ఊరబెట్టినట్టు
నాలుగు సెక్కల మొలక ఆశ కోసం
అతడు తన కలలన్నీ మూటగట్టి
బహుశా ఈ బంద గట్టునెక్కడో దాచి ఉంటాడు
ఏ పోడు దిగువున కురిసిన పచ్చని వెన్నెలయినా
బంద బొందిలోకి పూలతేరుపై సాగి వస్తుందిపుడు
అతని కలల దుప్పి దప్పిక తీర్చుకుని
తృప్తిగా కొండ పైకి నడిచిపోతుంది!
4
ప్రాణం లేని మట్టి కట్టకి పేగుతీపి గుర్తొస్తుంది
అకాలమో సకాలమో తెలియక
కురిసే ఉద్దేశ్యం లేని చినుకులు కూడా
తటాలున జారి గింజల గుండెల్లో పడతాయి
పాలూరిన మట్టి రొమ్ముల నుండి వేర్లు నీళ్లు కుడిసి
పిసరంతలుగా ప్రాణ స్పర్శ పురుడు పోసుకుంటుంది
పల్లంలో మొలిచిన పచ్చ రుతువు పళ్ళెంలో కొస్తుంది
కొండవాలులోని ఎండుకొమ్మల శిశిరం శిరసొంచుతుంది
ఎప్పుడో పండై రాలిపోయిన అతడు మళ్లీ
పోడుగడ్డ మీద నీటి పొద్దయి పచ్చగా ఉదయిస్తాడు
5
కొండ దాహమంతా బంద తీరుస్తుంది!
గోకురు చుక్కడు నీళ్లు తాగడానికైనా
ఇటుగా వచ్చిన ప్రతి మూగజీవి
అనంత నిద్రలోంచి మేల్కొనే వేళ
ఏ పోడుకొండ దిగువో మరో కట్ట దవ్వుతున్న
ఏ కొండదొర దాహం తీర్చడానికో
దొన్నెడు నీళ్లతో ఎదురెళ్తుంది
                 * * *
6
చెరువులు నదులు కొండలు అడవులు
ఎన్ని కరిగిపోతున్నా
ఇంతవరకూ మనిషి దాహాన్ని పూర్తిగా తీర్చగల
దొరువొక్కటీ దవ్వలేదెవ్వరూ..
ముందు వెనుకలుగా ఒక్కొక్కరూ
మట్టి గోతిలో విశ్రమించిన తరువాత
తీరని దాహార్తితో ఆకాశం అవతలెక్కడో
మరొక మడుగు తవ్వుతూ.. తవ్వుతూ..
(పోడుబంద అనే నిస్వార్థ సాక్ష్యాన్ని  తన ఒక్కడి చెమటతో చెక్కి ఉంచిన  సవర బొడ్డు తాతకి)
చిత్రం: సృజన్ రాజ్ 

కంచరాన భుజంగరావు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు