కొండ కింద ఊరి కథ

రెండు కొండల నడుమా  ఎండిపోయినట్టు
అగపడే పచ్చనిచెట్టు 
ఈ దుమ్ములోనే మా జేజబ్బ నడిసిండు 
ఆవులగాసుకుంటా
చిన్న నల్ల సీమలాగా జేజమ్మ
తనకన్నా ఆరురెట్ల మోయిన ఎత్తుకున్న
గడ్డిమోపు కి 
ఒక రాతెండి గిన్నెలో తిన్న
గొడ్డుకారపు రాగి సంకటి సత్తువ సమాధానం
గిత్త కాళ్ల లాంటి పెద్దయ్య
ఎద్దు మూపరాని పట్టి లొంగదీసే మీసాల చిన్నాన  
గుడా గుడిలో లింగమా డబ్బుకి కొదువ్యాడిది
జాతర్లో కొనుకున్న రైక గుడ్డ లో
రంగు రంగుల అద్దాల సందమామలు
నవ్వుతుంటే ఆకొక్కేసుకున్న
పళ్ళ సందునా సుక్కలా ఎలిగే ముఖాలకాంతి 
వాయబ్బా మా ఊరి పిల్లగాడి సీటేస్తే
మార్కాపురపు పలకల్లో ఏదో ఒక్కరవ్వ పగుళ్ళు
ఏమయావురా శ్యామన్నా   
నవ్వులన్నీ ఈడనే మూటగట్టి
అయిదరాబాద్ బేల్దారిపనుల్లో తట్టలెత్తినవా
నువ్వు బొయినాక కూడా సినుకు రాలలేదురా సామీ 
ఊరు లేదు 
ఊళ్ళ్య పనీ లేదు
పొయిలొ పండిన పిల్లికి గూత
బూడిద అంటటంల్యా
అంబలి తుడిసే పనిలేదనీ
సిన్నాన గొరిగిన మీసాల పుటువా 
మాగొప్పదికదూ
యాడుండాదిరా ఏడుపూ  
కళ్ళు పత్తి కాయల్లా ఇచ్చుకుని
నిద్ర గూత రావట్లే
సీని తోట కాడ నాయెత్తు బోరు
పడకపాయ  గిత్తలాంటి పెదనాయన
సత్తువకొద్ది ఎడ్సినాక నీలొస్తయా
ఒక్క కొండ మీ జెజబ్బలు నడ్సిన కొండ దవ్వితే
పెద్ద మిసనుతో  తొల్సినాక నీలొస్తయంట
ఊరు విలాంబరమైందిరా
ఈడమాత్రం యాడ్సనీకు కండ్లనిండా నీల్లు
మూట్టా ముల్లే ఇప్పనూ కట్టనే సరిపొతాంది బతుకు
నీలొస్తే ఊరొదిలిపోవాల ఈదులాడుకుంటా
ఆ పైన కొండకాడుంచి జూత్తే మల్లా  
ఊరు ఇప్పుడు ఎండిపొయిన సెట్టైందిరా 
ఎంతరాసినా కొండల్ల పలకలెన్నైనా
సాలవుగా చెన్నకేశవా 
ది మా ఊరి గోస , ఆధునిక దేవాలయాల కోసం , సామాజిక బాధ్యత కోసం ఖాళీ అవుతున్న ఊరి గోస. సకల సంపదలతో తులతూగే కోస్తా ప్రాంతపు ఆఖరి కొస ప్రకాశం జిల్లా, అటు సీమ, ఇటు కోస్తా ప్రాంతం మజ్జలో నలిగిపోయిన పుగాకు కాడ.
ఒకటే బస్సు , అదే పైకి పోవడం మళ్ళీ అదే వెనక్కి రావడం. బసొస్తే లేచే ఎర్రని దుమ్ము, దుమ్ము వెంబడి తుమ్ములు, రోడ్డు పక్కన బహిర్భూమి ఆనవాళ్లు, బయటకి పోయి తిరిగిస్తే కళ్ళు కదక్కపోతే నాయనమ్మ చికాకు. ఇదంతా ఒకప్పుడు ఉండేది , ఇప్పుడూ ఉంది, కానీ ఇకపై ఉండదు. వెలిగొండ ప్రాజెక్ట్ కోసం ఆత్మార్పణ చేసుకునే పద్నాలుగు గ్రామాల్లో మా ఊరు ఒకటి “సుంకేసుల”.
మార్కాపురం పలకల కొండలు దాటి బీడుభూమి లాంటి ఎర్ర రేగడి నేలల గుంతల్లో పడి లేచి వస్తే పది కిలోమీటర్లు మాఊరు. చీని కాయలు, కంది బ్యాళ్ళు, వేరుశనగ, ఒట్టి తునకలు, జోన్న రొట్టెలు, ఆవు పాడి, ఇలా సకల సౌభాగ్యాలు ఉండేవి మా ఊళ్ళో, వాన నీటిని ఒడిసిపట్టే ఊట బావులు, దారి పక్కన రేగుపళ్ళు, ఇలా సమృద్ధి ఆహారం, జలం ఉండేవి. ఒక్క వేసవి లో మాత్రం నీరు కాస్త ఇబ్బంది ఉండేది.
భౌగోళికంగా భూమి పొరల్లో నీరు దొరకని ప్రాంతం. ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ, వ్యవసాయం చేసిన మాఊరు. పెట్టుబడి దారుల కాంట్రాక్టు లకి బలైపోయింది.
ఎటునుంచి వస్తారో ఏడాదికి ఒకసారి ఊరికి కాంట్రాక్టర్లు వస్తారు, వయసుల వారీగా పిల్లల్ని ఏరుకుని వాళ్ళకి అడ్వాన్స్ లిస్తారు. ఒక్కొక్కళ్ళకి ఏడాదికి పదిహేను వేలు, ఊరు యువశక్తి లేక కళావిహీనం అయిపోతుంది, వ్యవసాయం ఆగిపోతుంది, ఊరు బీడుగా మారిపోయింది.
స్వాతంత్రం వచ్చిన అరవై ఏళ్ళకి కూడా ఆ ఊరికి కరెంట్ దీపం రాలేదు, ఆ డొక్కు బస్సే తిరిగేది. చుట్టూ నల్లమల అడివి, అప్పుడప్పుడు అన్నలు పలకరిస్తూ ఉంటారు, అదొక ధైర్యం , అడివి అనే మాటే కానీ ఏ ఒక్క క్రూర మృగం చూసి ఎరుగం. ఇదంతా మనుషుల వల్ల వచ్చిందా అంటే అవుననే చెప్పాలి.
నా చిన్నతనం లో  పెరుగు తోడు పెట్టుకోవడానికి అడిగితే ఒక పెద్ద గిన్నెడు చల్లటి మజ్జిగ ఇచ్చిన ఊళ్ళో, తాగడానికి నీరు లేక ఎండిపోయిన పశువుల డొక్కల్ని చూశాను, ఎన్నికల సమయంలో తప్పా ఇంకేప్పుడు కనబడని రాజకీయం ఆ ఊరి దరిదాపుల్లో కూడా ఒక్క ఆసుపత్రిని కట్టలేదు. ఎన్ని ప్రాణాలు ఆ కొండ మొగదాల్లో పోయాయో, ఎన్ని ప్రసవాలు ఆగిపోయి పురిట్లో పిల్లలు చనిపోయారో లెక్కకు అందదు.
అనేకానేక దరిద్రాల మధ్యలో ఊరికే ముప్పు ఏర్పడింది. ఊరి ప్రాణం నీళ్లలో మునిగిపోబోతుంది, ఇక నీళ్ళకి కొదవ ఉండదు. ఊరినిండా నీళ్లే, కానీ అక్కడ మనుషులుండరు, భూమిని జలం ఆక్రమిస్తుంది. దేశంమంటే మట్టి కాదన్నాడు కవి,కాకపోతే మరేమిటో చెబుతూ మనుషులు అన్నాడు, కానీ ఈ దేశం లో ఆ మనుషుల ఇష్టాలతో సంబంధం లేదు. నష్ట పరిహారాల్లో , భూమి కొలతల్లో ఎన్నో తేడాలు, మానవుల్లోనే జాతులున్నప్పుడు, వీళ్ళకి అంతరాలున్నప్పుడు పైవన్నీ మామూలే కదా…!
తొలి జేసిబి దెబ్బ గుమ్మం పై పడినప్పుడు ఆ ఇల్లాలు కళ్ళలో తిరిగిన నీళ్లతో పంటలు పండుతాయి. ఇకపై ఆఊరు జల స్మశానం, అక్కడ దుఖ్హం ఇంకో దుక్ఖాన్ని మాఫీ చేస్తుంది. కాలం గర్భంలో ఇంకో పద్నాలుగు  ఊళ్ళు మునిగిపోతాయి.. ఈ మాటలు … ఈ కవిత మిగిలిపోతాయి, నలుగురు కూర్చుని ఈ దేశ ఔన్నత్యాన్ని కొనియాడే సమయంలో మమ్మల్ని కూడా తలుచుకోండి.
*

అనిల్ డ్యాని

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు