కె. రామచంద్రారెడ్డి ‘‘మాటపేటల బిడ్డ కుట్లు”
ఈ శీర్షిక ఒక మోసం.
పుస్తకం లోపలి పదసంతతి పుష్టి తుష్టి తో గంపలకొద్దీ కేరింతలు కొడుతోంది. ఎక్కడా మాటల కోసం ప్రసవ ప్రయాస పడినట్లు కనపడదు.
అనీ అనీ, వినీ వినీ అరిగిపోయిన మాట ‘‘కవితా వస్తువులు కొత్తగా పుట్టవు, ఆదినుండి అవే. భాష ఒకటీ కొత్తగా కవి సృష్టించుకుంటాడు.”
అలాగని నవీన సృష్టికై ఎక్కడి నుంచో వస్తుందా పూర్వం లేని సరుకు? అవే అచ్చులు, హల్లులు, పదాలు, పదబంధాలు భాషకు! చేవ గల ఉలి చేతిలో ఊన్న కవి పాతభాషను కూలగొట్టి అందులోంచి ఏరుకున్న ముక్కలతో తనక్కావలసిన పునః సృష్టి చేసుకుంటాడు తన కవితా శిల్పానికి తగినట్లు. తాతల నాటి నుండి వాడక మూలపడిపోయినవీ, పూర్తిగా విస్మరించపడ్డవీ,
నిషిద్ధం అని పక్కకు పెట్టినవి కొన్నీ, తెలివైన మునిమనవడు వెతికి వెతికి ఎంచి తీసుకుని నగిషీ పెట్టి ఆ వస్తువులనే వాడుకున్నట్టు, జన వ్యావహారికంలోకి రాక దశాబ్దాలుగా నిద్రపోతున్న ఎన్నో మాటలకు కవి మంత్రజలం ప్రోక్షించి పట్టుకువచ్చి కొత్త వాడకం కల్పించి తన కవితకు వాటితోనే ప్రాణం పోయిస్తాడు.
తన భాష విలువ తెలిసినవాడే కవి.
‘మాటపేటల బిడ్డ కుట్లు‘ పుస్తకం లో కవితల ప్రధాన గుణం వాగైశ్వర్యం. ఏ రాత్రో భూమి చీల్చుకుని ఒక రత్నాల పెట్టె వచ్చి తెరుచుకున్నట్లు నూతనత్వం తో మెరిసిపోయే ఎన్ని మాటలో ఈ కొన్ని పుటల్లో!
అలాగని కవితకు సంబంధించి ఊహ విషయం లోనో దాని వ్యక్తీకరణ విధం లోనో నాణ్యత తక్కువ పడిందా? లేదు!
మొదటి కవిత సూర్య స్తుతి.
సాధారణంగా కవితలు అవగల భాగ్యం నోచుకున్న ఉషస్సో, సాయం సంధ్యో, కనీసం మరులు గొలిపే, మరీమరీ పొగడాలనిపించే మాగన్ను పాల్గుణపు ఎండనో కాదు ఈ కవి చిత్రం కట్టింది.
విచ్చుకున్న పడక్కుర్చీ కి విసనకర్ర కూడా అలిసిపోయి జారబడిన సెగల ఎండ, కారు కింద అంతులేని వొగర్పుతో కుక్క చొంగకార్చే దురుసు ఎండ. మంచి నడివేసవి నడిపవలు సూర్యుడి ప్రతాపం అక్కడ కనపడుతుంది.
అందమైన “నీటి సొట్ట, చింత పులుపు, పొడివడ్ల వగరు వాసన, నెర్రలు చీల్చే పుంత”! వీటన్నింటికీ అక్కడి అంత రౌద్రపు ఎండ లో కూడా ఒక ప్రస్ఫటమైన ఉనికిని ఇచ్చిన ఈ ‘నడిపవలు వగలవల‘ అనే కవిత నీడ ఓదార్పు రూపాలను మటుకు చూపదా!
మొదటి సగం కవిత లో సెగల పొగల వేడి కురుస్తున్న మధ్యాహ్నపు ఎడారి వీథి, పంతపు సైకిల్ తొక్కే పసివాడు, చెట్టును చుట్టిన అరుగు మీద ‘‘ఎండకాళ్ళతో ఒంటరిగా నిద్రపోయే బైరాగి‘‘.
చదువరికి ఏమైనా ఇంకా సందేహాలున్నాయా, తత్సమయంలో తత్ప్రదేశంలో నీడ పొడువు ఎంతని, ఎండ వాలు ఎంత అని? అన్యమనస్కంగా చదివిన వారికి కూడా ఉండలేవు ఆ సందేహాలు.
అసలు, మనసు లగ్నం చేయకుండా తనను చదవలేనట్లు తయారైన చిన్న పుస్తకం ఇది.
పై కవితలో తలనిండా బంగారం పోస్తూ మొదలై నడుమ వగరు పెట్టించిన ఎండ చివరకు ఎలా పొడగట్టింది కళ్ళకు!!
దాని వ్యాప్తి ని రూపును పట్టుకునే చట్రం లేదు.
‘‘ఎండొక నలుపలకల పెనుసున్నా”!
నిర్ధారిస్తావా దాని నైసర్గికం?
అసంభవం!
పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి అనంతమనీ, శూన్యమనీ, నిరాకారమనీ పెద్ద హోదా ఇస్తారు కదా మరి నేనో అంటున్నది ఈ కవితై వ్యాపించిన అనంత ఆతపం.
మరి ఈ వెలుగు కు వయసెంతట?
ఈ ప్రకాశం ఎప్పటిది?
‘‘ఎండొక ముక్కాల ముత్తరాల తాత‘‘!
ఇతను ఎంత పూర్వీకుడో, తన వయసెంతో నీ మేధకు అందదు.
ఏ కాలమూ స్థలమూ కొలవలేని వెలుతురు.
‘‘ఏ కాలం తలుపులకూ గొళ్ళాలుండవు.” ఇలా తేల్చేసిన వైనం!
కానీ మన వాడంటే మన వాడని ప్రతివాడూ, ఈతడు తమ వంశస్థుడే అని ప్రతి కుటుంబమూ అనుకుంటుందని కదూ కవి అంటున్నాడు. కాదనేదెవరు! తమ ముత్తాతకు ఇతగాడే తాత అని మనం అనుకోవటం లో కదా కనపడుతుంది అతడి అంత వేడి పట్లా మన ప్రేమ.
పదిహేనో ఇరవైయ్యో పంక్తుల ఈ కవితలో ముచ్చట గా కనపడి కట్టిపడేసిన మాటలు బోలెడు, మచ్చుకు కొన్ని: ‘‘మలి ఎసళ్ళేల , ఆపలికొంగే పొద్దు, గేణంమొర్రి మాటల్లా మెత్తటి ఆరుబయట సాయంత్రాలు, మొగ్గమల్లె‘‘ అట!
మల్లెమొగ్గ కాదు!
విస్తృత అర్థం తోచే విలక్షణ మనశ్చిత్రం పాఠకుడికి అందేట్టు చేయటం ఈ క్లుప్త శబ్దాల పెద్ద బాధ్యత.
ఇందాకటి ప్రచండ సూర్యుడు కాస్త దాళి ఒక చివరి చెట్టుకు ఇలా జాలిగా కనపడ్డాడు,‘‘మంచు తెరల్లో తెగిపడి గిలగిలా కొట్టుకునే ఎర్రకోతి పిర్రలా‘‘- ‘చివరి చెట్టు‘ అనే కవిత లో.
శీతువు ముంచేసిన వనంలో చివరగా ఆరిపోబోతున్న చెట్టు, వన ప్రాణరక్షణోత్సాహియై రావలసిన ఆదిత్యుడి కి ప్రస్తుతం పట్టిన అవస్థ చూసి తను మంచుకన్నీటిబొట్టొకటి రాల్చిందట.
కాలమహిమ! అనాల్సిందేనా!!
‘‘నాలుగ్గోడల మయాన మసుల్తూ‘‘ చదివినా ఈ కవితలను, అవి ఏ గవాక్ష మార్గాల గుండానో మనల్ను లాక్కెళ్లి అనిదంపూర్వమైన భూమ్యాకాశాలలో తిప్పుతాయి.
లోకము అనాది. మారదు. లోకనమే కొత్తది కావాలి. ఏ తరానికి ఆ తరం, ఏ మనిషికి ఆ మనిషి వైవిధ్యం గా చూడటమే సృష్టిని స్తుతించటం.
ఎక్కడెక్కడుంది నవీనత? ఈ మాటలోనా? కవి చేసిన ఈ కల్పన లో నా ? అని చెప్పబోతే కవితలన్నీ ఏకరువు పెట్టవలసి వస్తుంది.
స్రష్ట పురిటి నొప్పులను మరచేది నలుగురికి తన సృష్టి ఆనందం కలిగించినపుడు.
ఎవరి ఆనందం, అనుభవం వారికి మిగులుస్తూ, ముగిస్తూ….
This fruit is palpable, globed.
Talked wisely, sparingly.
Totally new style in observation and expression, that is this poet.
ప్రతులకు: TeluguBooks.in – Largest collection of Telugu books Online
@ 9866318808
నవోదయ బుక్ హౌస్, కాచిగూడ
*
Thank you for introducing madam