1
వాన కురుస్తున్న వేళ
అరచేతిలో ఇంత నల్లని
మట్టి ముద్దతో
ఏదో బొమ్మ చేయబోతూ
ఆ పిల్లాడు ముంగిట్లో
తుంపరల మధ్య
కేరింతలాడుతూ
గోడకు పట్టిన
నాచు రంగు తెరల
ముందు ఆమె
పచ్చని మొక్కలా
నీళ్ళు కారుతూ
వాన చినుకుల జడిలా
ఏవో గ్యాపకాలు
ముసురుకుంటూ
వణుకుతున్న చేతిలో
టీ గ్లాసుతో నాన్న
వెలగని తడి కర్రల
పొయ్యి ముందు
పొగలో మంచు రంగులో
కన్నీళ్ళవుతున్న అమ్మ
గుమ్మానికి పట్టిన
చెద వానలో తడుస్తూ
కరిగిపోతూ
ఒరిగిపోబోతున్న
మట్టి గోడ వారగా
విరిగిన సైకిల్ చక్రం
జీవితమెప్పుడూ
వాన కారిన
పూరిల్లులా
దుఃఖ పడుతూనే
నడుస్తుంది కదా?
ఎప్పుడో ఒక
కాగితం పడవలో
చేరిన పలకరింపు
వాన వెలిసిన
ఆకాశం గోడపై
రంగుల విల్లులా
కాసేపు విరిసి
మాయమవుతుంది!!
2
స్వప్న ఖండిక
కాళ్ళకు సంకెళ్లు వేయగలవేమో
కానీ కలలకు కాదు కదా
వెన్నెలా మాదే
సూరీడూ మావాడే
పచ్చని నేలా మాదే
ఎర్రని ఆకాశమూ మాదే
పారుతున్న
సెలయేళ్ళూ మావే
నిబ్బరంగా నిలుచున్న
పర్వత సానువులూ మావే
కిటికీ రెక్కను
తట్టే పిచుకా మాదే
రెక్కల చప్పుడుతో
స్వేచ్చను ఎరుక చేసే
పావురమూ మాదే
మేమెప్పుడూ
ఒంటరి కాదు
ఖైదులోనూ
జనం మధ్య
మేమే
మా ఊహలు
అనంతం
మరో ప్రపంచం
మా స్వప్నం…
*
కవితలు రెండు బాగున్నాయి శుభాకాంక్షలు
ధన్యవాదాలు సర్
మీరు రాయటం
నచ్చకపోవడం ఉండదుగా
Thank you Padmarpitaji
బావున్నాయి
Thank you sir
కే క్యూబ్ వర్మగారి కవిత్వం తాత్వికత గాఢత కలిగి సరళ సుందరంగా సాగుతుంది అలతి అలతి పదాల అందం వుంటుంది.అందరికీ అర్థమవుతుంది.
రెండు కవితలు బాగున్నాయి.
Thank you Mastaaru
Thank you మాస్టారు గారు
రెండు కవితలు బావున్నాయి.
Thank you sir
ధన్యవాదాలు అఫ్సర్ సర్.