కువ్వారం లేని కుహరం నుంచి నేను

రాకాసి ఉప్పెన వచ్చి

ఊరంతా ఊడ్చుక పెట్టుకుపోయిట్టుంది

నీరవ నిశ్శబ్దంలో నిర్మానుష్యంగా

 

తెల్ల కోటు తన శవాన్ని తానే మోసుకుంటూ

తిరుగుతోంది ఒంటరు దారులెంట

కనీసం ఒక్కటంటే ఒక్క దహన వాటిక వేటలో

 

ఏకీలుకాకీలు విరుస్తూ

వేసవి నడెండలో నీడలతో పోరాడుతూ ఖాకీలు

రేపటి ఊరటలేని ఉనికి ప్రశ్నల కొడవళ్ళ మీద నెత్తురోడుతూ

 

చిలక్కొయ్యకు వేలాడుతున్న  దినచర్యలో

గడపదాటని ముఖాన్ని పదే పదే రాసి రాసి కడిగినట్టు

బారెడు పొడుగు చీపుర్లతో పరిశుద్ధ జీవులు పరమ శాంతంగా

 

కుప్పపోసి మూటకట్టుకున్న ఆకలి

దూరాన్ని తొక్కుతూ వందల మైళ్ళు నడుస్తనే వుంది

నెర్రెలువడిన నీరడి పొలంలాంటి పాదాలతో

అడుగడుగునా గుచ్చుకున్న  పల్లేరుగాయల గాయాల గుండెలతో

 

రోడ్డు ఒక బలిసిన కొండచిలువ

దాని నోటపడే దాకా గమ్యం చేరుతున్నట్టే వుంటది

ఊరి పొలిమేరల చివరి విందులో

మృత్యుమేఘపు కరచాలనం ఎంతమందికో

 

ఆకలి వైరస్ తో పోరాడి ఓడిన దీన

దారిపక్క చెట్టుకింద శవమై

జీవంలేని పాలిండ్ల మీద పసిబిడ్డ ఆత్రంగా

కాలపు తెరమీద గడ్డకట్టిన సామూహిక దుఃఖంలా

 

చారిత్రిక సామాజిక దూరాలు జయించిన నేను

ఉల్కపాతంగా ఊడిపడ్డ భౌతిక దురాల ఉత్పాతానికి వెరసి

అత్తిపత్తినై నాలోకి నేను ముడుచుకొని

ఎడారి నత్తనై నా గుల్లలోకి నన్ను నేను కుదించుకొని

ఒంటరి స్తబ్ద సుప్తావస్థలో

అగమ్యగోచర నట్టనడి సంద్రంలో చుక్కాని లేని నావలా

 

ఇప్పటి విషాద విశాల వీధులందు

సడిలేని సుదీర్ఘ దివారాత్రులందు

నా ఆనవాళ్ళు దొరకని కుట్రల కట్ల పాము

వాకిట్ల నిలిచి నా  గూడు మీద కబ్జా కోరలు సాచింది

 

నా కాలపట్టికను బట్టీ పట్టిన కరెంటు మీటర్ బోర్డు ఆక్రమిత పక్షి

ఆగిపోయిన నా జీవన గడియారంకేసి ఒక చూపు చూసి

గుమ్మం మీద గుట్టుగా వాలి ఒక కన్నీటి పాట పాడింది

 

కదలని కారు కింద పిల్లి

తన శయనపు గడువుకు  కాలపరిమితి లేనందుకు వెరిచి

నడింట్ల నిలిచి ప్రశ్నల చూపులు విసిరింది

పసిబిడ్డను తెచ్చి దండపు దయను పరిచింది

 

నా రాకపోకలతో జీవితాన్ని అనుసంధానించుకుని

కాలాన్ని పరుగులు పెట్టిస్తున్న నా ఆత్మబంధువు

ఎప్పటికీ తెరుచుకోని గేటు చూసి

గుండెవగిలి పోటెత్తిన శోకగీతమయ్యింది

 

మామిడి కొమ్మ మీద స్తంభించిన శిశిరానికి వెరిసి

స్వరం మారిన కోయిల కన్నీటి పాటయ్యింది

 

దోసిట పట్టిన నీటిలా

కాలం చేతివేళ్ళలోంచి  నా ఐదుపదుల జీవితం జారిపొయింది

ఎవరి గాలానికో చిక్కిన  నా చిక్కని ఆకుపచ్చ ఆశల దండకారణ్యం

చిత్తై నెత్తురోడింది

భుజాల మీది ఎర్రటి కవచకుండలాల జెండా

నిస్తేజమై మూలనపడి మూలుగుతోంది

వేనవేల పసిప్రాణాల పాలిటి సంజీవనైన

బక్కపలుచని చేతులు శిలువెక్కి రక్తతర్పణ చేస్తున్నవి

 

ఇప్పుడు జైలునుంచి వాళ్ళు

జైలు లాంటి కువ్వారం లేని కుహరం నుంచి నేను

తూర్పు వాకిట్ల పొడిచే ఎర్రటి పొద్దు కోసం

*

 

 

కాసుల లింగారెడ్డి

13 comments

Leave a Reply to Dr. Linga reddy kasula Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అధ్బుతం సర్..దృశ్యం అలా రూపుదిద్దుకుంది..

  • లింగారెడ్డి గారూ,
    మీ కవిత చాలా చాలా బాగుంది. అద్భుతమైన పద ప్రయోగాలు మళ్లీ మళ్లీ చదివించేలా చేశాయి. సాహిత్యాభిలాషులైన నా మిత్రులకు దీనిని forward చేస్తున్నాను. మీకు నా హృదయపూర్వక అభినందనలు.

  • కంటిచూపుకి గాలం వేసి,కదలకుండా కట్టడి చేసిన ఒక్కొక్క పదం ,వాక్యం , శిల్పం,భావం వెరసి అద్భుతమైన కవితను అందించిన మీకు ధన్యవాదాలు సార్🙏

  • డియర్ లింగారెడ్డి, మీ కవిత కదిలిస్తూ వర్తమాన దృశ్యాన్ని కన్నులముందు నిలిపింది.
    ఒక వైద్యుని, ఖాకీని, సఫాయి వెతలను చూపించింది. దారి పక్కన శావాలవుతూనే ……….కుప్పపోసి మూటకట్టుకున్న వలస జీవుల ఆకలిని గమ్యం చేరుకోవాలనే చిరు ఆశతో నడుస్తూ నడుస్తూ పాదాలు నెర్రెలు పారడం,………….. రోజూవారి దినచర్యలన్నింటికి సంకెళ్ళు వేయబడి సామాజిక జీవితం ఒంటరైన తీరు…… ఒక వైద్యుడు తన కవి హృదయం తో మన వాకిట్లో ముగ్గుల్లా పరుస్తున్నాడు……చాలా లోతైన సాంద్రత ఆద్రత పొంగీ ఈ కవిత అందించిన లింగా రెడ్డు గారికి ధన్యవాదాలు

  • నిజమే
    ఈ చీకటి కుహరాలను బద్ధలను కొట్టడానికి కాంతిరేఖలనేరుకుంటూ ఓ ప్రజ్వలిత ప్రభాతం కోసం ఎదురుచూద్దాం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు