“మీరు చాలా బాగా మాట్లాడతారు. మీతో మాట్లాడుతుంటే టైమ్ యిట్టే గడిచిపోతుంది. మీరు కథలెందుకు రాయకూడదు? ఎవరెవరో రాస్తున్నారు. అరడజను తప్పులు దొర్లకుండా పట్టుమని పది వాక్యాలు రాయలేని వాళ్లు కూడా పెద్ద రచయితలుగా చలామణీ అవుతున్నారు. మీరు తలుచుకుంటే నాలుగు రోజులకో నవల రాయగలరు.”
సుభద్ర నోటివెంట యీ మాటలు విన్న క్షణం నుండీ గోపాలరావు ప్రాణానికి సుఖం లేకుండా పోయింది. సుభద్ర అన్నదంటే అందులో నిజం వుండే తీరుతుంది. ఎవరిని పడితే వాళ్లని పొగిడే రకం కాదు ఆవిడ. ఏ ఆధారమూ లేకుండా ఆ మాటలు యథాలాపంగా అన్నదని అనుకోడానికి వీల్లేదు. సుభద్ర చెప్పింది ఏదైనా పొల్లుపోకుండా జరిగి తీరుతుందని ఆఫీసులో వొక సెంటిమెంటు నడుస్తుంది కూడానూ. కాబట్టీ, యీరోజు ఆవిడ తనలోని రచయితని గుర్తించడం అన్నది దైవసంకల్పం తప్ప మరొకటి కాదు. ఇప్పుడుగానీ తాను వొక మంచి రచన చేసి, అందరిచేతా శెభాష్ అనిపించుకోకపోతే అది ఆవిడని అవమానించడమే కాగలదు. మరీ నవల కాకపోయినా, కనీసం కథైనా రాయాలని నిర్ణయానికొచ్చాడు గోపాలరావు.
సుభద్ర చెప్పినంత మాటకారితనం, ఊహాశక్తి గోపాలరావుకి వున్నాయా లేవా అన్నది పక్కనపెడితే, అతనికి రాయడం అనే ప్రక్రియ కొత్తేమీ కాదు. పెళ్లైన కొత్తలో, తన సొంత అనుభవాలని రంగరించి అతను రాసిన ‘పెను గుసగుస,’ ‘మంద్ర పొలికేక’ అనే రెండు కథలు వొక ప్రముఖ వారపత్రికలో ప్రచురింపబడ్డాయి కూడానూ. ఆ విషయం కాస్త ఆలశ్యంగా వాళ్లావిడ సక్కుబాయి దృష్టికి రావడమూ, మరోసారి అతను అలాంటి ప్రయత్నం చేయకుండా వుండడానికి తగిన చర్యలు ఆవిడ తీసుకోవడమూ జరిగింది. తక్షణమే కథ రాసి తీరాలీ అనే వుద్వేగానికి అతను లోనైన సందర్భాలు ఆ తర్వాత కూడా అనేకం లేకపోలేదు. కానీ, తన భార్యకి తెలిస్తేనో? ఇలాంటప్పుడే, ఆమెకి ఉక్కుబాయి అని కాకుండా సక్కుబాయి అని పేరు పెట్టిన అత్తామామల మీద అతనికి కోపం వచ్చేది.
మళ్లీ యిన్నాళ్లకి సుభద్ర కారణంగా అతనిలోని రచయిత నిద్ర లేచి తీరాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తన పట్ల సుభద్రకి అంత వున్నతమైన అభిప్రాయం వుండడం గోపాలరావుకి సంతోషంగానే వుంది. కానీ, తీరా తాను కథ రాశాక, దానిని ఎవరూ పట్టించుకోకపోతే సుభద్ర దగ్గర తన పరువేం కానూ. రాస్తే గీస్తే అద్భుతమైన కథే రాయాలి. దానికి కనీసం నాలుగైదు అవార్డులు వచ్చితీరాలి. ‘అవార్డులు రావాలంటే ఎలాంటి కథలు రాయాలి’ అనే ప్రశ్న దగ్గర అతని ఆలోచనలకి బ్రేక్ పడింది. ఇరవయ్యేళ్ల క్రితం, గోపాలరావు లోని రచయితని గుర్తించడానికి నిరాకరిస్తున్నట్టు చెప్పడానికి సక్కుబాయి యిత్తడిచెంబు సహకారం తీసుకున్నప్పటినుండీ.. రాయడం మాట దేవుడెరుగు, కనీసం కథలు చదివే ధైర్యం కూడా చేయలేదు అతను. మరేదీ మార్గం? ఎలాంటి కథలకి మార్కెట్టు వుందీ అన్నది యిప్పటికిప్పుడు చెప్పగలిగిన వారెవరు?
గోపాలరావుకి స్ఫురించిన మొదటి పేరు జయమాలిని. ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సిన రెండు విషయాలున్నాయి. ఒకటి, జయమాలిని అంటే అమ్మాయి కాదు, అబ్బాయి. రెండు, జయమాలిని అల్లాటప్పా వాడు కాదు. “సాహితీ బావలు” అనే సంస్థ ద్వారా తెలుగు వక్షరానికి.. క్షమించాలి.. తెలుగు అక్షరానికి ఎంతో సేవ చేసినవాడు. జయమాలిని సేవారంగంలోకి చొరబడాలని నిర్ణయించుకునేనాటికే కొన్ని సాహితీసంస్థలు వున్నాయి.. వాటికి పోటీగా జయమాలిని వొక సంస్థని నెలకొల్పి, దానికి ‘సాహితీ భావాలు’ అని పేరు పెడదాం అనుకున్నాడు. ఒత్తుల పట్ల చిన్ననాడే కినుక వహించిన జయమాలిని ‘భావాలు’ అనే పదానికి బదులుగా ‘బావాలు’ అని రాసి, కరపత్రం అచ్చేయడానికి ప్రింటింగ్ ప్రెస్ వాళ్లకి యిచ్చాడు.
ప్రెస్సులో కంపోజింగు చేసే కుర్రాడు కూడా కినుక వహించడంలో నేర్పు కలవాడే అని చెప్పక తప్పదు. దీర్ఘం పట్ల కినుక వహించిన సదరు కంపోజిస్టు జయమాలిని రాసిచ్చిన ‘బావాలు’ అనే మాటని ‘బావలు’ గా మార్చేశాడు. ఇక్కడ తర్కప్రియులకి వొక సందేహం వచ్చే అవకాశం వుంది. దీర్ఘం పట్ల కినుక వహించిన వాడే అయితే, ‘బావాలు’ అనేది ‘బవలు’గా కదా మారాలి. కంపోజు చేస్తూ, మధ్యమధ్యలో వొక మోస్తరు కునుకు తీయడం అనే అలవాటు కారణంగా, కినుక వహించడం అనే అభిరుచికి అతను పూర్తి న్యాయం చేయలేకపోయాడని సహృదయులు గ్రహించాలి.
ఆ కరపత్రం బయటకి వస్తూవస్తూనే సంచలనం సృష్టించింది. అనేక యుగాలుగా సోదరులు, మిత్రులు వంటి వరసలు తప్ప, బావలు అనే బంధానికి సామాజిక చర్చల్లో ఎప్పుడూ చోటు దొరకలేదు. ఆ ఛాదస్తాన్ని బద్దలుకొడుతూ, వొక సాహితీ సంస్థ పేరులో బావలు అనే పదాన్ని వాడిన వ్యక్తిగా జయమాలిని పేరు మార్మోగిపోయింది. తనపై కురుస్తున్న ప్రశంసల వర్షానికి కారణం ఏంటో మొదట్లో అతనికి అర్థం కాలేదు. విషయం బోధపడ్డాక జయమాలినికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇందులో తన ప్రతిభ ఏమీ లేదనే వాస్తవాన్ని బయటపెట్టేంత అవివేకి కాదతడు. ఔచిత్యం మీద వికారం సాధించిన యీ విజయం జయమాలినికి చాలా పాఠాలు నేర్పింది. అచిర కాలంలోనే సాహితీ పరిరక్షకుడిగా అవతరించడానికి దోహదపడింది.
అంతటి ఘనత వహించిన జయమాలిని కన్నా, కథల విషయంలో సలహా యివ్వగలిగే అర్హత మరెవరికి వుంటుంది. నిజానికి ఆషామాషీ రచయితలకి అతని అపాయింట్‌మెంట్ దొరకడం కూడా కష్టమే. కానీ, గోపాలరావు రాసిన మొదటి కథ ‘పెను గుసగుస’ చాలా బాగుందని అప్పట్లో జయమాలిని సదరు పత్రికకి వుత్తరం రాయడమూ, అది ప్రచురణకి నోచుకోవడమూ జరిగింది. అప్పటికింకా జయమాలిని వొక అనామక ఔత్సాహికుడు మాత్రమే. సాహితీసౌధాన్ని అధిరోహించడానికి ఆ వుత్తరం తనకి మొదటిమెట్టుగా వుపయోగపడిందనే కృతజ్ఞత జయమాలినికి వుంది. ఆ విధంగా గోపాలరావుతో అతనికి వొకలాంటి బాదరాయణ సంబంధం వుంది.
“కొత్త తరానికి నచ్చేదిగానూ, వుత్తమాభిరుచి కలిగినదిగానూ ప్రస్తుతింపబడే కథా వస్తువు ఏమిటి?” జయమాలినిని అడిగాడు గోపాలరావు. అది వింటూనే జయమాలిని ధ్యానముద్రలోకి వెళ్లిపోయాడు.
తన ప్రశ్న మరీ చిక్కగా, బరువుగా, పొడవుగా వుండడం వల్ల జయమాలినికి నిద్ర ముంచుకొచ్చిందేమో అని గోపాలరావు కంగారుపడ్డాడు. “నేను కథలు బాగా రాయగలను అని అందరూ అనుకోవాలంటే ఏ సబ్జెక్టు మీద రాయాలి?” అని ప్రశ్నని కాస్త సరళంగా మార్చాడు.
తాను బాగా ఆలోచించి, సొంత తెలివితేటలతో అద్భుతమైన సూత్రీకరణ చేసినట్టు గోపాలరావు భావించాలని జయమాలిని కళ్లు మూసుకున్నాడు తప్ప, అతగాడి లఘు-సుషుప్తికి వేరొక పరమార్థం ఏమీ లేదు. గోపాలరావు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం అతనికి ఏమంత కష్టమైన విషయం కాదు. ఆ మాటకొస్తే, ఒత్తులతో కూడిన అక్షరాలున్న పదాలు స్వదస్తూరీతో రాయాల్సిరావడం తప్ప జయమాలినిక ఏదీ కష్టం కాదు.
“కొత్త తరానికి నచ్చే సామాజిక స్పృహ వుండాలి, అదే సమయంలో పాత తరం విమర్శకులు కూడా నోరెత్తడానికి అవకాశం వుండకూడదు. అంతే కదా! ఈ రెండు షరతులనూ సంతృప్తి పరచాలంటే నేను చెప్పబోయే వస్తువుల్లో ఏదో వొకటి ఎంచుకొని తీరాలి మీరు. చదువు అనేది పిల్లల పాలిట శాపం. చదువుకోమని బలవంతపెట్టకుండా వాళ్లని వాళ్ల యిష్టానికి వదిలేయాలి. ఇది మొదటిది. వృద్ధాశ్రమాల్లో వుండే తల్లిదండ్రుల్ని యింటికి తీసుకురావడం అనేది రెండవది. ఇక మూడవది మరింత ప్రశస్తమైంది. అదే, ‘ఉత్తమమైన అభిరుచులు కలిగివుండి, లోకకళ్యాణం కోసం వేశ్యావృత్తిలోకి దిగిన మహిళ.’ ఈ మూడిట్లో దేని గురించి రాసినా సరే.. కథలో మలుపులు, కథనంలో వొప్పించే గుణం గురించి ఆలోచించాల్సిన పనే వుండదు” అని తేల్చాడు జయమాలిని.
గోపాలరావు మనసు తుపానుగాలిలో సయ్యాటలాడే దూదిపింజ లాగా తేలికపడింది. ఇత్తడిచెంబుఘాతం కారణంగా తన చెయ్యి లొట్టబోయి వుండొచ్చు గాక. కానీ, ఆనాడు తాను ఆ కథ రాయకుండా వుండి వుంటే? ఆ కథ గురించి జయమాలిని పత్రికకి వుత్తరం రాయకుండా వుండి వుంటే? జయమాలినికి ధన్యవాదాలు చెప్పి, లేచి నిలబడి, ఆత్మవిశ్వాసంతో రెండడుగులు వేశాడు గోపాలరావు.
“అన్నట్టు యింకొక మాట. సమకాలీన సాహిత్యంతో అంతగా మీరు టచ్‌లో లేరంటున్నారు కాబట్టీ యింకొక సలహా యిస్తాను. మన కథని లీడ్ చేసే పాత్రలని పోలివున్న వ్యక్తులు బయట ఎక్కడైనా తారసపడితే, వారి అనుభవాలు అడిగి తెలుసుకోండి. ఫస్ట్ హ్యాండ్ యిన్ఫర్మేషన్ కన్నా మెరుగైన వనరు వుండబోదు” అన్నాడు జయమాలిని. వస్తువులతో పాటు వనరులు కూడా సూచించిన జయమాలినికి మరోసారి నెనర్లు తెలిపి వచ్చేశాడు గోపాలరావు.
***
కదనోత్సాహంతో కథా రచనకి నడుం బిగించిన గోపాలరావు ఏమాత్రం సమయం వృథా చేయదల్చుకోలేదు. మొదటిచెయ్యి సమాచార (ఫస్ట్ హ్యాండ్ యిన్ఫర్మేషన్) సేకరణలో భాగంగా, పదో తరగతి తొమ్మిదిసార్లు తప్పిన వొక కుర్రాడిని మర్నాటికల్లా వెతికి పట్టుకున్నాడు. అరపెట్టె చార్మినార్ సిగరెట్లు రెమ్యూనరేషన్‌గా యివ్వజూపిన మీదట ఆ కుర్రాడు యింటర్వ్యూ యివ్వడానికి వొప్పుకున్నాడు.
“తొమ్మిదిసార్లు పరీక్ష రాసి కూడా పాస్ అవ్వలేకపోవడం అనే ఫీట్ ఎలా సాధించావు నువ్వు?” అడిగాడు గోపాలరావు.
“ఐ వజ్ బార్న్ యింటెలిజెంట్. ఎడ్యుకేషన్ స్పాయిల్డ్ మీ” అని బదులిచ్చాడు వాడు. గోపాలరావుని మైండ్ బ్లాక్ అయిపోయింది. “ఈ కుర్రాడు నిజంగానే అసాధ్యుడు. ఇంత యింగ్లిషు వచ్చి కూడా పదో తరగతి పూర్తి చేయలేకపోయాడంటే, తప్పు అతనిలో కాదు వ్యవస్థలోనే వుండి వుండాలి. నా కథకి వీడే హీరో” అనుకున్నాడు.
“పాఠకుల సౌలభ్యం కోసం నువ్వు చెప్పిన కొటేషన్ కి తెలుగులో అర్థం చెపుదూ” అన్నాడు గారం చేస్తూ.
“నాకేం తెలుసు. మా పదో తరగతి సప్లిమెంటరీ బ్యాచ్ వాట్సప్ గ్రూప్ కి డీపీగా యీ మాట పెట్టాడు మా ట్యూషన్ మాస్టరు” అన్నాడు పతతొతకు (పదో తరగతి తొమ్మిదిసార్లు తప్పిన కుర్రాడు).
“నీకు దాన్ని చదవడం ఎలా తెలిసింది?” అనుమానంగా ప్రశ్నించాడు గోపాలరావు.
“మా చెల్లితో చెప్పించుకున్నా” చెప్పాడు పతతొతకు.
“మీ చెల్లి ఏం చదువుతుంది?” అడిగాడు గోపాలరావు.
“యాంత్రికంగా బీటెక్ చేసి, యాంత్రికంగా వుద్యోగం చేస్తూ, యాంత్రికంగా నెలకి లక్షన్నర సంపాదిస్తోంది” యీసడింపుగా చెప్పాడు పతతొతకు.
“నీకన్నా చిన్నదైన చెల్లి అంత సంపాదిస్తుంటే, నువ్వు ఖాళీగా వుండడం నీకు యిబ్బందిగా లేదా? నీకూ ఖర్చులుంటాయిగా” అడిగాడు గోపాలరావు.
“సిగ్గు లేకుండా వుద్యోగం చేస్తూ, సిగ్గు లేకుండా సంపాదిస్తోందిగా. అందులో వొక యాభై వేలు నేను తీస్కుంటా” అన్నాడు పతతొతకు సిగ్గు లేకుండా.
అరపెట్టె చార్మినార్ డబ్బులు బూడిదలో పోశానని అర్థమైన గోపాలరావు యిక పొడిగించదల్చుకోలేదు. పాఠకులు ఆదరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే, పతతొతకుని తన కథకి హీరోగా పెట్టడం గోపాలరావుకి సుతరామూ యిష్టం లేకపోయింది.
***
పతతొతకు మిగిల్చిన చేదు అనుభవాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ వృద్ధాశ్రమంలోకి అడుగుపెట్టాడు గోపాలరావు. జయమాలిని చెప్పిన వరసలో కాకుండా తాను ముందే యిక్కడికి వచ్చివుంటే ఎంత బావుండేది అనుకున్నాడు. ఎదురుగా వొక ముసలాయన పడక్కుర్చీలో పడుకోని కనిపించాడు. కాస్త దూరంలో వున్న ముక్కాలిపీటని దగ్గరగా లాక్కుంటూ, ఆయన్ని పలకరించాడు గోపాలరావు. సంభాషణ యిలా నడిచింది.
“మీ కొడుకు, కోడలు ఎక్కడుంటారు?”
“సిటీలో”
“మరి మీరిక్కడ ఎందుకున్నారు?”
“నేను వాళ్లతో వుండడం నా కోడలికి యిష్టం లేదు.”
“ఎందుకు అని మీరు అడగలేదా?”
“ఎందుకు అడగలేదు? గట్టిగానే అడిగాను. అపార్ట్మెంట్ మొత్తాన్నీ పోగేసి పంచాయితీ కూడా పెట్టాను కూడా.”
“అసలు మీతో మీ కోడలికి ఏవిటట సమస్య?”
“రాత్రిపూట నాలుగైదు సార్లు మూత్రవిసర్జన చేయాలి నేను. నాతో పాటు తోడు రమ్మంటే రానంటోంది.”
“బహుశా మీ అబ్బాయిది నైట్ షిఫ్ట్ అనుకుంటాను. అలాంటప్పుడు మీకు తోడు రావాల్సిన బాధ్యత ఆవిడదేగా.”
“మా అబ్బాయిది నైట్ షిఫ్ట్ కాదు. అసలు వాడికి వుద్యోగమే లేదు. నా కోడలి సంపాదనతోనే యిల్లు గడిచేది.”
“అలాంటప్పుడు మీరు మీ అబ్బాయినే లేపొచ్చుగా మూత్ర విసర్జనకి సహకరించడానికి?”
“వాడసలే వుద్యోగం లేదనే బాధలో వున్నాడు. పెళ్లాం సంపాదన మీద బతకాల్సి రావడం ఏం జన్మ. ఆ అపరాధ భావనతో వుండి, పగలంతా బాధపడి, రాత్రిపూటే కాస్త ప్రశాంతంగా పడుకుంటాడు. ఆ కాస్త సుఖానికీ వాడిని దూరం చేయడం నాకు యిష్టం లేదు.”
“అంటే, మీ అబ్బాయి ఖాళీగా వుంటాడు. మీ కోడలు పగలంతా పనిచేస్తుంది. మీ కొడుకుకి రాత్రి పూట నిద్రాభంగం అవకూడదనే మహదాశయంతో మీరు మీ కోడల్ని బాత్రూముకి రమ్మని అడుగుతారు. అదీ నాలుగైదుసార్లు. అంతేనా?”
“అంతే.”
గోపాలరావుని తీవ్రమైన నిరాశ ఆవరించింది. “అసలు నేను కథ రాయాలనే ఆలోచన చేయకుండా వుండాల్సిందా? నిజంగా కథలు రాయగలిగిన ప్రతిభ నాలో వుందా? సుభద్రకి వాక్శుద్ధి వుండివున్న పక్షంలో యీపాటికి నాకు ఏదో వొక శుభశకునం కనిపించి వుండేదిగా? నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికి రోహింగ్యా శరణార్థుల దగ్గర సుభద్ర సుపారీ తీసుకుందా?” ఇలాంటి ఆలోచనలతో కాసేపు సతమతమయ్యాడు గోపాలరావు.
“ఛ..ఛ సుభద్ర అలాంటిది కాదు. బండి రిజర్వులో పడిన రోజు భర్త చొక్కాకి గుండీలు కూడా కుట్టే అలవాటు లేని ఆవిడ తెలిసి తెలిసీ వొకళ్లకి అపకారం చేస్తుందని అనుకుంటే కళ్లు పోతాయి” అని మళ్లీ తానే సర్ది చెప్పుకున్నాడు. సుభద్ర స్కూటీ రిజర్వులో పడడానికీ, ఆవిడ బొత్తాలు కుట్టకపోడానికీ సంబంధం ఏమిటో అర్థం కాకపోతే అది మన అవగాహనారాహిత్యం కాదు. కథారచనకి వుపక్రమించడం గోపాలరావు మతిస్థిమితం మీద చూపెట్టిన ప్రభావానికి అది తార్కాణం మాత్రమే.
***
చదువు వొంటబట్టని పోరగాణ్ని, వృద్ధాశ్రమంలో వుండే ముసలాయన్ని పట్టుకున్నంత తేలిగ్గా మూడో వస్తువుని పట్టుకోవడం కుదర్లేదు. “ఉత్తమమైన అభిరుచులు కలిగివుండి, లోకకళ్యాణం కోసం వేశ్యావృత్తిని ఎంచుకున్న మహిళ తెలుసునా” అని ఎవరినైనా ఎలా అడగడం? సిగ్గువిడిచి అడగడానికి సిద్ధపడినా, దానికి సమాధానం ఎవరు చెప్పగలరు? వేశ్యలు తెలిసినవాళ్లు చాలామందే వున్నారు. ఎంత వయసు, ఏం పేరు, ఎంత వసూలు చేస్తారు, ఏ సమయంలో అందుబాటులో వుంటారు.. ఇలాంటి సమాచారం తప్ప, వేశ్యల తాలూకూ అభిరుచులు, వారు ఆ వృత్తిని ఎంచుకోడానికి దారి తీసిన కారణాలు ఎవరికీ తెలిసినట్టు లేదు.
నాలుగు రోజులు గింజుకున్న మీదట ‘షరతులు వర్తిస్తాయి’ అనే ట్యాగ్‌లైన్ తీసేసి, ‘ఏ వేశ్య అయినా పర్వాలేదు’ అనే నిర్ణయానికి వచ్చాడు గోపాలరావు. కొంత డబ్బు చేతులు మారింది. సంకేతస్థలం నిర్ణయించబడింది. రంగం సిద్ధమైంది.
“నీకు యిష్టమైన రచయిత ఎవరు?” అడిగాడు గోపాలరావు. చలం, కొకు, కారా లాంటి పేర్లేవో ఆవిడ చెపుతుందనీ, సంతోషంతో తన కళ్లు చెమ్మగిల్లుతాయనీ ఆశించాడు గోపాలరావు. కానీ, పాపం ఆవిడకి అసలు యితగాడు అడిగిన ప్రశ్నే అర్థం కాలేదు. తన దగ్గరకొచ్చే విటుల్లో రచయితలు ఎవరైనా వున్నారా అని అడుగుతున్నాడేమో అనుకుంది.
“ఆళ్ల సంగతి నీకెందుకు? పోలీసోళ్లతో చెపుదామనుకుంటన్నావేమో. హెడ్ కానిస్టేబుల్ మనకి శానా లోకువ” బెదిరింపుగా అంది.
తప్పు తనదే అనుకున్నాడు గోపాలరావు. అసలు తాను ఆవిడని ఎందుకు కుదుర్చుకుందీ సూటిగా చెప్పేసి వుంటే యిలాంటి అపోహలకి తావు లేకుండా వుండేది.
“నేను వొక రచయితని” గర్వంతో కూడిన చిరునవ్వుతో చెప్పాడు.
“అంటే?” అనుమానంగా అడిగింది.
“కథలు రాస్తాను” చిరునవ్వుతో కూడిన గర్వంతో చెప్పాడు.
“అయినా సరే నా డబ్బులు నాకివ్వాల్సిందే” దురుసుగా అంది. గోపాలరావు మనసు గాయపడింది.
జేబులో నుండీ డబ్బులు తీసి, ఆవిడ చేతికిస్తూ, “ఇప్పుడు వోకేనా నీకు” అసహనంగా అన్నాడు.
“ఓహో. డబ్బులు తీసుకోని కూడా సుఖపెట్టలేదని అభాండం వేద్దామని చూస్తన్నావేమో. ఆ పప్పులు నా దగ్గర వుడకవ్” చీర విప్పుతూ అంది.
“నీకు దణ్నం పెడతా. ఈ వొక్క ప్రశ్నకీ సమాధానం చెప్పు. అసలు నువ్వు యీ వృత్తిలోకి రావాలని ఎందుకనుకున్నావ్” అడిగాడు.
“నాకు మొత్తం అర్థమైంది. నిన్ను నా మొగుడే పంపించాడు. ఆడిని కాదని నేను వేరే బ్రోకర్‌ని చూసుకున్నానని కుళ్లుకు చత్తన్నాడు దొంగ…”
గోపాలరావుకి దింపుడుకళ్లెం ఆశ కూడా చచ్చిపోయింది.
***
మూడు రోజులు సెలవు పెట్టి మరీ ప్రయత్నించినా, తన కథ వొక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గోపాలరావుని చాలా కృంగదీసింది. “ఒకసారి ఆఫీసుకెళ్లి మళ్లీ సుభద్రతో నాలుగు మాటలు మాట్లాడాలి, అప్పుడు గానీ ప్రాణం తెరిపిన పడేట్టు లేదు” అనుకున్నాడు. గోపాలరావు ఆఫీసుకి వెళ్లేసరికి అటెండర్ ఎల్.విజయలక్ష్మితో మాట్లాడుతోంది సుభద్ర. అటెండర్ యింటి పేరు ఎల్ అనడంలో సందేహం వుండాల్సిన అవసరం లేదు. కానీ, యీ విజయలక్ష్మి కూడా అమ్మాయి కాదు, అబ్బాయే.
“ఏంటి సార్, మూడ్రోజుల బట్టీ కనిపించడం లేదు” అడిగాడు అటెండర్ ఎల్.విజయలక్ష్మి.
“నా సంగతి సర్లే గానీ, నువ్వేంటీ సుభద్ర గారితో తెగ ముచ్చట్లు చెపుతున్నావ్” అన్నాడు గోపాలరావు.
“ఏముంటాయ్ సార్. పాపం, ఆ మహాతల్లికి పుట్టెడు కష్టాలు. కొడుకేమో చదువూసంధ్యా లేకుండా బలాదూర్ తిరుగుతున్నాడు. మొగుడేమో ఎవత్తెనో తగులుకున్నాడు. మామగారేమో వావివరసలు లేకుండా మాటిమాటికీ మీద చేతులేస్తాడంట. పగవాడిక్కూడా రాకూడదు” అని భారంగా నిట్టూర్చాడు ఎల్.విజయలక్ష్మి.
గోపాలరావు నిర్ఘాంతపోయాడు. ఈ లెక్కన తాను అనుకున్న మూడుకథల్లో ఏది రాసినా సుభద్రకి నచ్చివుండేది కాదన్నమాట. విషయం మళ్లీ మొదటికొచ్చిందని అర్థం కాగానే గోపాలరావుకి తిక్కరేగింది. అతనికి ఎవరిమీద కోపం తెచ్చుకోవాలో అర్థం కాలేదు.
ఎదురుగా తన కళ్లలో కళ్లు పెట్టి చూస్తున్న అటెండర్ ఎల్.విజయలక్ష్మిని చూసి, “మీ బాబు, ఆ జయమాలిని గాడి బాబు రికార్డింగు డాన్సులు చూడ్డానికి మరిగి మగపిల్లలకి ఆడపేర్లు పెట్టుకున్నారన్నమాట. వాళ్లిద్దరినీ చెరో కథా రాయమనాల్సింది. అప్పుడుండేది యిద్దరి పనీ, నా సామిరంగా” అన్నాడు శాడిస్టులాగా పగలబడి నవ్వుతూ.
ఆ నవ్వు వినబడి, తన సీట్లోంచీ లేచొచ్చి, “ఏంటి కథ అంటున్నారు? మీ కథ గురించేనా? ఇంతకీ ఏం కథ రాస్తున్నారేమిటీ” నవ్వుతూ అడిగింది సుభద్ర.
“నీ బొంద కథ” అన్నాడు గోపాలరావు.
(వేశ్యల్ని విటులకన్నా రచయితలే ఎక్కువగా వాడినట్టున్నారు అనే ఫేస్‌బుక్ కామెంట్‌తో నేను యీ హాస్య కథ రాయడానికి కారణం అయిన తమ్ముడు చిన్నీఅజయ్ కి కృతజ్ఞతలతో)
*
శ్రీధర్ బొల్లెపల్లి మార్క్ కథే ఇది!!
‘పతతోతకు’, యాంత్రికంగా బీటెక్, యాంత్రికంగా లక్షన్నర జీతం ఇవన్నీ కూడా శ్రీధర్ మాత్రమే రాయగలడు!!
ఒక్క శ్రీధర్ మాత్రమే.. 😍
బోలెడన్ని థేంక్స్ మీకు 🙏
మీ కధలు చాలా డిఫరెంట్ గా వుంటాయి శ్రీధర్ గారు.
Thank you madam. Happy to here that. Hope you like them 🙏
కడుపుబ్బ నవ్వించే కథలు అలవోకగా రాయగల మా అభిమాన రచయిత శ్రీధర్ గారు
నా అభిమాన ఎన్‌సైక్లోపీడియా నుండీ ఇంత చక్కని ప్రశంస 🙏
Hilarious
ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నా అండీ ☺
చాలా బాగుంది సర్ 👌
Thank you sir 😊🙏
చాలా రోజుల తరువాత నవ్వుకున్నాను…మీ రచన శైలి అద్భుతం…. కానీ “ఇ” వాడాల్సిన చోట “యి” యెందుకు వాడారో వీలైతే చెప్పండి.
మాటల్ని ఎలా పలుకుతామో అలాగే రాయాలనేది నా ప్రయత్నం సర్. గొంతులో నుండీ డైరెక్టుగా వచ్చేవి అచ్చులు. నోటిలోని భాగాల కదలికల వల్ల మార్పులకి లోనయ్యేవి హల్లులు. మనం మాట్లాడేటప్పుడు హల్లు శబ్దమే వస్తుంది చాలాచోట్ల. “ఒకసారి” అనడానికి మనం “ఒ” అచ్చు సౌండ్ పలకం. పెదవులు కదిలించి, హల్లునే పలుకుతాం “వొకసారి” అని. వాక్యం ప్రారంభంలో అచ్చు వస్తే దాని మానాన దాన్ని వదిలేయాలనీ, మధ్యలో వస్తే హల్లులా మార్చేయాలనీ అనుకుంటాను నేను. 😊
[…] కినుక […]
“కినుక” అనే పదానికి ముందూ వెనుకా బ్రాకెట్లు, వాటిలో చుక్కలు మాత్రమే కనిపిస్తున్నాయండీ. 😔
చాలా సరదాగా ఉంది.కొత్త రచయితల దురవస్థలను చిత్రిక పట్టారు.శుభాభినందనలు
Thank you very much sir 🙏
బాగానే కష్టపడ్డారు. ఇందులో పతతొతకు బావుంది. మా చిన్నపుడు MABF అని అంటుండే వాళ్ళం. అది గుర్తుకు తెచ్చారు… మీకు మధురవాణి గుర్తుకు రాలేదు తగల్లేదు నమోనమః
MABF 😂😂😂 మేమూ అనేవాళ్లం సర్.
మధురవాణులు తగిలితే మాత్రం కథల్లోకి లాగేస్తామేటండీ ☺