ఒక చిన్న వాక్యం రాసి , ఒక చిన్న సంఘటన సృష్టించి పాఠకుడిని చెప్పలేనంత ఆలోచనకు గురి చేస్తే ఆ కథ పాఠకుడికి చాలా కాలం గుర్తుండి పోతుంది అన్నది నా బలమైన నమ్మకం . నాకు చాలా బాగా గుర్తున్న కథలన్నీ అలా గుర్తున్నవే. ఒక వాక్యం ఏదో అలా హృదయం లో ఉండి పోతుంది . ఆ వాక్యం గుర్తుకు వచ్చినప్పుడల్లా , ఆ కథ , అది సృష్టించే కల్లోల మళ్ళీ మళ్ళీ ఆలోచనామగ్నునిడిని చేస్తాయి . కొత్త కొత్త అర్ధాలతో ఆ కథ మళ్ళీ కొత్తగా నాలో పురులు విప్పుకుంటుంది
అలా ఇటీవలి కాలం లో నన్ను బాగా ఆలోచనల్లో పడవేసిన కథ ఒకటుంది . అది కిటికీలో వెన్నెల . రచన వాడ్రేవు వీర లక్ష్మీ దేవి . బహుశా ఆమెకు కూడా ఆ కథ అంటే ఇష్టం అనుకుంటాను . తరువాత వచ్చిన తన కథా సంపుటికి కిటికీలో వెన్నెల అనే పేరు పెట్టుకున్నారు . ఆ పేరు చూడగానే ఇరుకైన అక్షర గవాక్షం లో నుండి అనంత విశ్వాన్ని చూడగలిగిన ఒక సాహితీ ద్రష్ట లా కిటికీ లో నుండి అనంతమైన ప్రాకృతిక సౌందర్యాన్ని తనివి తీరా, హృదయాస్పదంగా , మనః శరీరాలనిండా నింపుకునే ఒక భావుక హృదయ వేదన కావచ్చు అనుకున్నాను . కథ చదవడం మొదలు పెట్టిన తరువాత కానీ తెలియలేదు అదొక ఆంతరంగిక ఘర్షణల పుష్ప గుచ్ఛమని . ఒక సునిశిత , సున్నితమైన , ఆత్మీయమైన స్త్రీ ఈ సమాజం తో అంతర్ బాహిర్ రంగాలతో చేసిన యుద్దారావమని . చదువుతుంటే అలా వెన్నెల్లో గోదావరిలా అలసట ఎరుగకుండా తన వెంట తీసుకుని వెళ్లే శైలి వీర లక్ష్మీ దేవి ది . ఒక భావుకుడైన కవి తను రాసే కవిత్వం లో ఉద్దేశ్య పూర్వకంగానో , అనుద్దేశ్య పూర్వకంగానో తన పదాల మధ్య , వాక్యాల మధ్య , భావ చిత్రాల మధ్య రవ్వంత నిశ్శబ్దాన్ని వదిలినట్టుగానే వీర లక్ష్మీ దేవి కూడా తన వాక్యాల మధ్య పాఠకుడు తనను తాను వెతుక్కోవడానికి కావలసిన నిశ్శబ్దాన్ని వదిలి వేస్తారు . కేవలం ఆ నిశ్శబ్దం వలన పాఠకుడు తన అంతరంగాన్ని విప్పుకుంటూ , తనను తాను ఆవిష్కరించుకుంటూ , కథ తో ఒక జుగల్బందీ చేస్తాడు
కథను గురించి కొచెం పరిచయం చేసి మళ్ళీ నా సోదంతా వినిపిస్తాను .
ఉత్తమ పురుష లో రాసిన ఈ కథలో కథానాయకికి ఏ పేరూ లేదు . నేను సౌలభ్యం కోసం వీరలక్ష్మీ దేవి అనే కథ చెప్తాను . కధంతా నాలుగు , ఐదు పేజీలకు మించదు . ఒక పోష్ ఏరియా లో ఒక అపార్ట్మెంట్ రెండవ అంతస్థులో , చదువుకుని వుద్యోగం చేసుకునే జంట లో ఒక సగ భాగం వీరలక్ష్మీ దేవి . వీరలక్ష్మీ దేవి ఉదయం బయటకు వెళ్ళిపోతే మళ్ళీ ఏ సాయంత్రానికో గూడు చేరుకుంటుంది . అంతా కలిపి ఆమె ఆ ఇంట్లో మెలకువగా ఉండేది మహా అయితే ఐదారు గంటలు ఉంటుందేమో . ఆ ఉదయ , సాయంత్రాల దినచర్య ను వివరించడమే ఈ కథ . ఇంతే అయితే ఈ కథ, ఈ కథ రాయడానికి స్ఫూర్తి నిచ్చిన అమరావతీ కథలలోని “ఒక రోజు వెళ్ళిపోయింది “కథలా అనామకంగా కాల గర్భం లో కలిసి పోయేదే . తనకు స్ఫూర్తి నిచ్చిన కథకు మించి ఇందులో ఏదో వుంది . ఏమిటది
వీరలక్ష్మీ దేవి నిద్ర లేచి బెడ్ రూమ్ లో కిటికీ తలుపు తెరవగానే పడమటి వైపు వున్న ఒక అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ లోని జీవన చిత్రం కనిపిస్తూ ఉంటుంది . ఆమె ఈ ఫ్లాట్ లో చేరినప్పటినుండీ బెడ్ రూమ్ లోని కిటికీ పక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లోని మనుషులను , తూర్పు , వుత్తరం వైపులా ఉన్న కిటికీ, బాల్కానీ లు ఆకాశాన్ని అందిస్తుంటే రోజులు హాయిగా గడిపేస్తూ ఉంటుంది . ఆ ఇంటి విశాలమైన పెరట్లో ఉన్న నిమ్మ చెట్టు తో స్నేహం చేస్తుంది . ఆ ఆకుపచ్చని ఆకుల మధ్య నుండి పసుపు రంగు నిమ్మపళ్ళు మెరిసి , కనిపిస్తూ దాక్కుంటూ , అల్లరి చేస్తూ తమని లెక్కించమని గొడవ చేస్తూ ఉంటాయి . ఎదురు ఫ్లాట్ పొడవాటి బాల్కనీ లోని కుండీలలో వున్న రంగు రంగుల , రకరకాల మొక్కలతో దూరం నుండే మిత్రత్వం నెరుపుతూ ఉంటుంది . ఆమె ప్రయత్నం లేకుండానే ఆ ఎదురు ఫ్లాట్ లో నివసించే మనుషుల జీవన సరళిని గమనిస్తూ ఉంటుంది .
ఆమె ఆసక్తి మెల్ల మెల్లగా నిమ్మ చెట్టు మీద నుండీ , బూరుగు చెట్టు మీద నుండీ , కిటికీ లో నుండి కనిపించే ఆకాశం మీద నుండీ మరలి
ఆ ఇంటి మనుషుల మీద ఎక్కువ అవుతుంది . ఎదురింటి కిటికీలోనుండి ఎప్పుడైనా ఎదురింటి ఆమె తనవైపు చూసి ఒక పలకరింపు నవ్వు రువ్వుతుందేమో అనుకుంటే ఎదురింటామే వీరలక్ష్మీ దేవి ఉనికినే గుర్తించదు . అయినా ఆ ఇంటి మనుషులను గురించి వీర లక్ష్మీ దేవి బోలెడన్ని ఊహలు చేస్తుంది . చూస్తున్న కొద్దీ వాళ్ళు ఆమెకు దగ్గరవడం మొదలు పెడతారు . లేదు లేదు ఆమె వాళ్లకు దగ్గరవడం మొదలు పెడుతుంది . వాళ్ళ గురించి ఏమీ తెలియకుండానే వాళ్ళు కూడా తనలో భాగం అనుకుంటుంది .
ఆదివారం పూట వీరలక్ష్మీ దేవి కి కాస్త తీరిక . ఆదివారం పూటే అపార్టుమెంట్లో పని చేసే రమణమ్మ చాలా సంగతులు వీర లక్ష్మీ దేవి తో చెప్తుంది . వీర లక్ష్మీ దేవి కొన్ని వింటుంది . మరి కొన్ని వినదు . ఎందుకు వినదు ? ఇరవై ముప్పై కుటుంబాలు వుండే అపార్టుమెంట్లలో ఒకరి కొకరు రమణమ్మ లాంటి పనిమనుషుల ద్వారానే పరిచయం అవుతారు . ఏవేవో అసత్యపు దుష్ట పార్శ్వాలతో . దురదృష్ట వశాత్తు
ఒక్కొక్క సారి అందులో కొన్ని అయినా నిజం అని నిరూపంచబడతాయి . మనుషుల గురించిన ఏ అంచనా లేనప్పుడు ఉన్న అభిప్రాయాలు మనుషుల గురించి ఎంతో కొంత తెలిసినప్పుడు సవరణలకు గురి అవుతాయి . సానుకూలం గానో , ప్రతి కూలంగానో
అందుకేనేమో మనుషులకు ఎందుకు ఒకరి గురించి మరొకరికి తెలియడం ? తెలుసుకునేదాకా ఆగలేకపోవడం , తెలుసుకున్నాక ఓస్ ఇంతే కదా అనో లేదా ఛీ ఇంత నీచంగానా అనో అనుకోవడం ఎందుకు ? ఇందులో అసూయ లాంటి వాటి నుండి ఏదైనా ఓదార్పు ఉన్నదా ? అని విచికిత్స పడుతుంది
ఎప్పుడూ అందం ఆనందం చిందులు వేస్తున్నట్టు కనిపించే ఆ ఎదురు ఫ్లాట్ జంట ఒక సెలబ్రేషన్ తరువాత ఎబెదుకో తెలియదు కానీ ఘర్షణ పడతారు . ఆ మర్నాడు రమణమ్మ ఆమె వద్దు అన్నా వినకుండా ఒక మాట చెపుతుంది . “ఎవరి గొడవో కాదమ్మా ! మీ గురించే ఆ పక్కింటావిడ వాళ్ళ పనమ్మాయి తో అన్నదట . అది వచ్చి కింద ఇంటావిడకి చెప్పింది . “మా ఎదురింటి ఫ్లాట్ లో ఆవిడ అస్తమాను కిటికీ లోంచి దొంగతనముగా మా ఇంటి కేసి చూస్తూ ఉంటుంది . ఆవిడకు ఇంకేమీ పని లేదా ?”అని అడిగిందట . “అని రమణమ్మ ఇంకా ఎదో చెపుతుంటే “వద్దు లే రమణమ్మా ! చెప్పకు ఆ కిటికీ మూసేద్దాం లే “అని చెప్పి వీర లక్ష్మీ దేవి రమణమ్మను పంపించి వేస్తుంది
“అయినా పడగ్గది కిటికీ మూయలేదు . మూయను కూడా . ఈ మనుషుల గురించి నాకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది . ఎందుకంటే వాళ్ళు నాకు కావలి కనుక ” అన్న వాక్యాలతో కథ ముగుస్తుంది . ఈ వాక్యాలు రాయడానికి ముందు రచయిత్రి మరో రెండు మాటలు కూడా అంటుంది . “ఆమె లేదా వాళ్ళ వివరాలు గానీ వినడంకానీ నాకు ఇష్టం లేదు . ఈ తూర్పు వైపు నిమ్మ చెట్టు లాగే , ఉత్తర దిక్కున ఉన్న వేప చెట్టు గల గల ల లోంచి కదిలే ఆకాశపు నీలిమ లాగే వాళ్ళూను “అనే మరో రెండు వాక్యాలు కూడా రాస్తుంది
“కిటికీ మూయలేదు . మూయను కూడా ఎందుకంటే వాళ్ళు నాకు కావాలి . నాకు మనుషులు కావాలి ” అన్న వాక్యాలు నన్ను చాలా రోజులు వెంటాడాయి
ఈ కథలో వీర లక్ష్మీ దేవి మనిషి ఏర్పరచుకునే రెండు బంధాల గురించి చెప్పింది . ఒకటి మనిషి ప్రకృతి తో ఏర్పరచుకునే సంబంధం గురించి . మరొకటి సాటి మనుషులతోనూ ఏర్పర్చుకునే సంబంధాల గురించి . ప్రకృతి తో ఏర్పరచుకునే సంబంధాలతో వీర లక్ష్మీ దేవికి ఎలాంటి పేచీ లేదు . కానీ మనుషులతో ఏర్పరచుకునే సంబంధాలతోనే పేచీ . ఈ కథలోనే ఒక చోట వీర లక్ష్మీ దేవి ఒక మాట అంటుంది . “నేను ఫోన్ లో మాట్లాడుతూ ఉత్తరం వైపు నడవాలోకి వెళితే అతి ఖాళీ స్థలం లో ఉన్న బూరుగు చెట్టు రమ్మని సైగలు చేస్తుంది . నేను ఫోన్ లో చాలా సేపు చిరాగ్గానో , అసౌకర్యంగానో , విసుగ్గానే మాట్లాడి అలసట తో లోపలి వచ్చేటప్పుడు కూడా ఆ బూరుగు చెట్టు అరచేతులంత ఆకులతో రారమ్మని ఆహ్వానిస్తుంది ” అంటారు . నిజం! చెట్టు కదా ! తనతో సంభాషించే , సంభాషించకుండా పక్కనుండి వెళ్లిపోయే మనుషుల భావోద్వేగాలతో వాటికి పని లేదు . అవి ఎప్పుడూ ఒకేలాగా ఉంటాయి . మనం చెట్టుతోనో , పుట్టతోనో స్నేహం చేస్తున్నప్పుడు మన భావేద్వేగాలు అన్నీ ఆ చెట్టుకు పుట్టకు ఆపాదించుకుంటాము మన దుఃఖాన్ని , ఆనందాన్ని వాటిలో చూసుకుంటాము . మన లోపలి మనం తోనే మనం చెట్టు రూపం తోనో , పుట్ట రూపం తోనో స్నేహం చేస్తాము . కనుక వాటితో మనకు పేచీ లేదు . కానీ మనుషులతో అలా కాదు . మనం భావోద్వేగాలతో ఎలా అయితే స్పందిస్తామో , వాళ్ళు కూడా అలాగే భావోద్వేగాలతో స్పందిస్తారు కనుక ఒక ఘర్షణ ఏర్పడుతుంది . తద్వారా అశాంతికి దారులు పడతాయి . ఈ ఘర్షణ, ఈ అశాంతి లేకుండా ఉండాలంటే మనుషులతో రెసిప్రొకేషన్ లేని సంబంధాలు కావాలి . మనుషులు ఎంత తక్కువ తెలిస్తే అంత ఎక్కువ ఆనందంగా ఉంటాము
నిజానికి ప్రకృతితో మన సంబంధాలు ఏమీ అంత సవ్యంగా లేవు . ప్రకృతి భాష మనకు తెలియదు కనుక మనం అవి ఒకేలా ఉంటాయి అనుకుంటాము . చెట్టు కూడా మనలని ప్రేమిస్తుంది . చెట్టు కూడా మనలని ద్వేషిస్తుంది . ఆ భాష తెలిసినప్పుడు వాటి ఆనంద విషాదాలను మనం తెలుసుకోగలుగుతాము .
ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్ గా మారి , సమాచారం ఎక్కడికక్కడ గుట్టలు గుట్టలుగా పోగుపడుతున్నప్పుడు ఇవాళ మనిషి కూడా ఒక సమాచారం గా మరి పోతున్నాడు . ఒక బైట్ గానో , ఒక ఆల్గారిథం గానో తనను తాను కనుగొంటున్నాడు . సమాచారం గుట్టలు గుట్టలు గా పేరుకుపోతున్నప్పుడు , మనలని ఆపాదమస్తకం ముంచేస్తున్నప్పుడు మనం వద్దు అనుకున్నా ఆ సమాచారం మన హృదయం లోకి వెళ్లి పోతుంది . అది మనం వద్దు అనుకున్నా మనం ప్రేమించే మనుషుల పట్ల మన భావనలను ప్రభావితం చేస్తుంది . అలా ప్రభావితం అయినప్పుడు వాళ్ళ మీద మన అభిప్రాయాలూ , అంచనాలు ఒక్కొక్క సారి తలకిందులు అవుతాయి . ఇలా తలకిందులు కావడం కొన్ని సార్లు తీవ్రమైన పరిణామాలకు కూడా దారి తెస్తుంది .
వీర లక్ష్మీ దేవి గారికి తెలిసి కూడా పాఠకుడికి చెప్పని రహస్యం ఒకటి వుంది . ఈ కథ లోని రమణమ్మ లాంటి పని మనుషులు లేదా ఇప్పటి సోషల్ మీడియా మనకు కేవలం సమాచారం మాత్రమే ఇస్తాయి . మనకు ఒక ఆత్మీయమైన , మనకు మాత్రమే ఆనుభవైకవేద్యమైన అనుభవాన్ని ఇవ్వవు . అంటే మన దగ్గర , మనం ప్రత్యక్షం గానో , పరోక్షంగానో ప్రేమించే వాళ్ళ గురించి కేవలం సమాచారం మాత్రమే ఉన్నప్పుడు మన బంధాలు ఒకలా రూపు దిద్దుకుంటాయి . వాళ్లతో మనకు ప్రత్యక్ష అనుభవాలు ఉన్నప్పుడు సంబంధాలు మరొకలా రూపు దిద్దుకుంటాయి . చాలా తరచుగా సమాచారం ద్వారా మనం పొందిన జ్ఞానాన్ని , అనుభవం ద్వారా పొందిన జ్ఞానం తో బేరీజు వేసుకుని మనం అభిప్రాయాలను సవరించుకోవడమో , మార్చుకోవడమో చేయం . ఎవరికైనా మొదట సమాచారం ద్వారాను , తరువాత అనుభవం ద్వారాను రిలేషన్స్ ఏర్పడతాయి . మనం చాలా తరచుగా సమాచారం ద్వారా ఏర్పడిన అభిప్రాయాలకు లెజిటిమసీ కల్పించుకోవడం కోసం అనుభవం ద్వారా ఏర్పడిన అభిప్రాయాలను ఉపయోగించుకుంటాము.
ప్రకృతి తో మనకు పరోక్ష అనుభవం ఉండదు . కేవలం ప్రత్యక్ష అనుభవం మాత్రమే ఉంటుంది . కనుక ప్రత్యక్ష , పరోక్ష అనుభవాల మధ్య ఘర్షణ ఉండదు . అందుకని ప్రకృతి తో వుండే రిలేషన్ లో ఎలాంటి ప్రాబబిలిటీలు ఉండవు . అనుభవం మాత్రమే ఉంటుంది . అభిప్రాయం ఉండదు . అనుభవం ఎప్పటికీ మారదు . అభిప్రాయం మాత్రమే తరచూ మారుతూ ఉంటుంది .
మనుషులతో ఏర్పడే రిలేషన్స్ లో అభిప్రాయాలు , అనుభవాలు ఓక దానిని ఒకటి ఓడించి ఆధిపత్యం చలాయించాలని చూస్తాయి . లేదూ ఒకదానితో మరొకటి ఓవర్ లాప్ అయి మనలని సందేహం లోకి నెట్టేస్తాయి . అభిప్రాయాలకు , అనుభవాలకు ఘర్షణ అంటే అది సమాచారానికీ , జ్ఞానానికీ మధ్య ఘర్షణ . జ్ఞానం కూడా సమాచారమే కానీ అది శుద్ధ సమాచారం కాదు . దాంట్లో కొంత వివేచనా , వివేకమూ , పోల్చి చూసుకునే తాత్వికత ఉంటాయి
వీర లక్ష్మీ దేవి గారు ఈ కథను ఇంకొంచెం పొడిగించి రమణమ్మ ద్వారా లభించిన సమాచారాన్ని , ప్రత్యక్ష అనుభవం ద్వారా పోల్చి చూసుకుంటే బావుండేదేమో . అలా చేయడానికి బదులుగా మనుషులతో అతి తక్కువ లేదా తక్కువ సంబంధాలను నెరపడం ద్వారా ఏ అపార్ధాలు , అసూయలు , అశాంతులు లేని మనుషులను సొంతం చేసుకోవాలి అనుకున్నారు .
ఈ కధకు నేపధ్యం గా ఆమె సత్యం శంకర మంచి ఒక రోజు వెళ్ళిపోయింది , వడ్డెర చండీ దాస్ ఒంటరి జీవితము గురించి ఒక శేఫాలిక లో పేర్కొన్నారు . సత్యం శంకర మంచి పిచ్చయ్య రోజులు , వడ్డెర చండీదాస్ ఒంటరి రోజులు , ఇప్పటి రోజులు ఒకటి కావు . సత్యం శంకర మంచి కాలం ఒంటరి తనం ఒక వధ్యశిల అనుకునే రోజులు కావు . నిజానికి అవి సామాజికము , వయక్తికము అని మనిషి జీవితాన్ని విడదీసుకునే రోజులు కావు . ఆ రోజులలో జీవితం ఒక ఉత్సవ సౌరభం , కొన్ని కొన్ని మినహాయింపులతో . చండీదాస్ ఒంటరి జీవితం కూడా ఒంటరి జీవితం కాదు . అతడొక మౌన సంభాషణ జరిపాడు సమాజం తో . చండీ దాస్ జరిపిన మౌన సంభాషణే , శ్రీ రమణ మిథునం కధలో అప్ప దాసు , బుచ్చి లక్ష్మి కూడా గడిపారు . అప్పదాసు బావ మరిది తప్పిస్తే ఆ కధలో మరొక పాత్ర కనపడదు . చండీ దాస్ లాగే అప్పదాసు , బుచ్చి లక్ష్మి దంపతులు కూడా రేడియో విన్నారు . ఫోన్ లో మాట్లాడారు . పేరంటానికి వెళ్లారు . వీళ్ళ జీవితాలలో సామాజిక జీవితం ఉండీ లేనట్టు కనిపిస్తుంది . సామాజికం కంటే వయక్తికమే ఎక్కువ .
వీర లక్ష్మీ దేవి గారు ఆశించినట్టు అతి తక్కువ సంబంధాలతో కూడా జీవితం గడిపేయవచ్చు . . శంకర మంచి పిచ్చయ్య లాగే బతికినంత కాలం కాలానికి కూడా తెలియకుండా కాలం తో పాటు బతకడం ఇప్పటికీ సాధ్యమే . నిజానికి కొన్ని కోట్ల మంది అనామకంగా పుట్టి అనామకంగానే రాలిపోతున్నారు . వాళ్ళు నివసించిన కాలాన్ని ఆ కాలం కూడా గుర్తు పెట్టుకోదు .
వీరలక్ష్మీ దేవి గారి ఆవేదనకు అర్ధం ఉంది . నిజానికి ఆ ఆవేదన ఒక భయం లో నుండి పుట్టింది . క్షణ క్షణము విస్తృతమవుతున్న సామాజిక మాధ్యమ సంబంధాలలో మనిషి తనను తానూ కోల్పోతున్నాడన్న భయం ఆమెది . ఆ కోల్పోవడాన్ని జయించాలన్న తపన ఆమెది . ఆ స్పేస్ ను ప్రకృతి తో నింపేయాలన్న సదుద్దేశ్యం ఆమెది . ఈ గందరగోళం నుండి స్పష్టత కోసం ఈ కిటికీ లో వెన్నెల కథను రాసారు ఆమె . బ్యాక్ టు నేచర్ . ఈ కథ తాత్విక భూమిక కిటికీ ఒక ప్రతీక . బయట వెన్నెల ప్రకృతి తో మనిషి ఏర్పరచుకోవాల్సిన సంబంధం అయితే గదిలో వీర లక్ష్మీ దేవి సమాచారమనే , సామాజిక సంబంధాలు అనే జైలులో బందీ అయిన మనిషికి ప్రతీక . ఈ రెండు ప్రతీకలు మధ్య ఆమె రచించిన సౌందర్య గీతం , కురిపించిన మానవీయ పరిమళం ఈ కథ
మనిషి తనను తాను నిలబెట్టుకోవడానికి , తద్వారా ఒక సమాజాన్ని నిలబెట్టడానికి కిటికి బయట వెన్నెల ఉడుత సాయం చేసినా చాలు కదా
ఇప్పటికీ కథ కలిగించిన ఆలోచనలు ఇవి . మళ్ళీ చదివితే మళ్ళీ ఏ కొత్త అర్ధాలు స్పురిస్తాయో-
అక్కా ! అభినందనలు.
*
సర్ ఆ కథా సంకలనం పేరు ‘కిటికీ బయట వెన్నెల ‘ .వీరాలక్ష్మీదేవి గారి ప్రతి కథా మానవీయ కోణంలో అద్భుతమైనవి.మీరు చక్కని విశ్లేషణ చేశారు.అభినందనలు ఇరువురికీ.
Nice review. Abhinandanalu
Dr.Vadrevu Veeralakshmidevi గారి వ్యాసమాలికల పుస్తకం “మా ఊళ్ళో కురిసిన వాన” చదివిన తర్వాత నా మనసు పలికిన పలుకులు!
మీరు పంపిన పుస్తకాలలో ఒకటి ” మా ఊళ్ళో కురిసిన వాన” అన్నీ వ్యాసాలు ఒక్క రోజే గుక్కతిప్పుకోక చదివేశాను!
చదువుతున్నంతసేపు నాకు నేను చదువుతున్నట్లు కాక మీరు నా ఎదుట కూర్చుని చదువుతున్నట్లు మీ స్వరం నా చెవుల్లో వినిపించాయి!!
మీ వ్యాసాలు చాలా సరళంగా, మన దిన నిత్య జీవితంలోని ఘటనలుగా కళ్ళ
ముందు కదిలిపోయాయి ! మనసులో నిలిచిపోయాయి! అనుభవైక్యమైన అందరి మనసుల్ని, అట్టడుగున ఉన్న జ్ఞాపకాల్ని తట్టి లేపుతాయి! సుప్తంగా దాగిన నిధిలా వెలుపలికి వస్తాయి!
మనం పుట్టి పెరిగిన, చదువుకున్న పాఠశాల, మనచేత ఓనామాలు తిద్దించి చదువునేర్పిన ఉపాధ్యాయులు, మనం తిరిగి ఆడుకున్న స్థలాలు ప్రతి ఒక్కటీ మీతో పాటూ నన్నూ వెంటాడాయి!
చాలా చోట్ల సుతిమెత్తగా జీవిత సత్యాల్ని బోధించారు! ఎక్కడ మనం తప్పుటడుగు వేస్తున్నాము, మనం ఏమి కోల్పోతున్నాము,ఎలా బంధాల్ని నిలుపుకోవాలి, పెనవేసుకోవాలి! వెనుకటి వివాహాలలో పెళ్ళి పనులు ఇరుగుపొరుగూ, బంధువులు కలిసి చేసిన పిండి వంటలు,వడియాలు అప్పడాలు , ఆడుకున్న పరాచికాలు!!!ఇప్పుడు అన్నీ ఆర్డర్ చేసి మేకప్ వాళ్ళతో మేకప్ చేయించుకుని పెళ్ళి పీటలకు వస్తే చాలు. ముద్దు ముచ్చట్లు మాయం. అంతా యాంత్రికం! ప్రతి వ్యాసమూ మన ఆధునిక జీవితాన్ని ప్రతిబింబించింది. మనం ఏమి కోల్పొయాము అని తట్టి చూపించారు!. కుటుంబ జీవితం, పిల్లలతో అనుబంధం, పెద్దమ్మ, పిన్నమ్మ, పెదనాన్న, పెద్దత్త, ఇలా బంధువులను, ప్రకృతిని,డాబా మీద కూర్చుని, వెన్నెల్లో చేతిముద్దలు తింటూ విన్న కథలూ అన్నీ పోగొట్టుకున్నాం!
ఇస్మాయిల్ లేని లోటు,షాపింగ్ మాల్స్ , అప్పటి ఫాలోవర్స్ అంటే ఎవరు, గాంధీ అనుయాయులు పై షర్టు లేకుండా ఒకరు, కాళ్ళకు చెప్పులు లేకుండా మరొక్కరూ,ఇలా ఉదాహరణంతో రాశారు! వారి ఋతువుల వర్ణణ అవర్ణణీయం!
మనం వేర్లను రక్షించుకుంటే ఈ సరికొత్త ప్రళయం నుంచి , నేడు మనం చిక్కుకున్న విషవలయం నుంచి బయటకు వచ్చే ఆశాదీపం ఈ పుస్తకం! ఈ ప్రకృతి రక్షణ మన భుజస్కంధాలపై ఉంది ! గాలి, నీరు,తినే తిండి కల్మషం లేకుండా దొరకాలి!
మీకు ధన్యవాదాలు లక్ష్మి! మనసును ఒక్కసారి తట్టి లేపింది! ఇంత కన్నా సంతృప్తి సార్థకత ఏం కావాలి రచయిత్రి కి ,పుస్తకానికి !! .💐💐💐
వీరలక్ష్మిగారి పుస్తకం అనుభూతి ఒక్కలాగే ఉంటుంది. మీరు ఎంత లోతుగా విశ్లేషించారో మాటల్లో చెప్పటం కష్టం! అందుకే నేను రాసిన అనుభూతినే పంచుకుంటున్నాను. అన్యధాభావించకండి!
వీరలక్ష్మిగారి పుస్తకం అనుభూతి ఒక్కలాగే ఉంటుంది. మీరు ఎంత లోతుగా విశ్లేషించారో మాటల్లో చెప్పటం కష్టం! మనసును హత్తుకుంది మీ విశ్లేషణ ! 🙏🙏🙏