తెలంగాణ మట్టిని, నా గుండె లోపలి పోరల్ని తవ్వుకుంటూ పోతే బహుశా నా కథల మూలాలు దొరుకుతాయేమో.. ఎక్కడో సిద్ధిపేట జిల్లాలోని ఒక మారు మూల పల్లె (కోహెడ)లో పుట్టిన నేను సర్కారు బడిలో సక్కుబాయి పంతులమ్మ దగ్గర అక్షరాలు నేర్చుకొని ఎన్నోసార్లు కింద పడ్తూ లేస్తూ ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ తెలుగు మీడియంలోనే ఉన్నత చదువులు చదివి నాదైన కోణంలో ఏవో కొన్ని కథలు రాసుకొని వాటిని ‘పుంజీతం’ పేర పుస్తకంగా వేసి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాది నాకే ఆశ్చర్యం కలుగుతుంది.
మా బాపు వెల్దండి ఓదయ్య కుటుంబ పోషణ కోసం భీవండి, షోలాపూర్ వలస పోయి అక్కడ మిల్లు బట్ట ఉత్పత్తిలో కాలాన్ని అరగదీసిన నేత కార్మికుడు. పెద్దగా చదువుకోలేదు కానీ ఉత్తరాలు రాసే మందం చదువుకొని అప్పుడప్పుడు తనకు తోచిన పద్యాలేవో తనలో తానే పాడుకునే వాడు. మా అవ్వ ఈశ్వరమ్మ పూర్తిగా నిరక్షరాస్యురాలే. మా బాపు దేశాలు పట్టుకొని తిరుగుతుంటే నల్గురు పిల్లల్ని, సంసారాన్ని నిలబెట్టడానికి కైకిలి పోతూ మాకు తన పొదుపరితనంతో జీవితంలో ఎలా బతుకాలో మౌనంగా నేర్పేది. రాత్రిపూట జరిగే భజనల్లో పాడే “శరణు శరణు ఓం శ్యామలాంబ నీ శరణు వేడుతునమ్మ… సరస్వతి సద్గుణ రావమ్మా… సరస్వతి సద్గుణ రావమ్మా…”, లాంటి పాటలు, “తల్లి గర్భము నుండి ధనము దేడెవ్వడు వెళ్ళి పోయెడినాడు వెంటరాదు…” లాంటి పద్యాలు, మా అన్నయ్య వెల్దండి రవీందర్ వల్లె వేయించే భగవద్గీత శ్లోకాలు, శతక పద్యాల వల్ల నాకు తెలియకుండానే తెలుగు భాషపైన మక్కువ ఏర్పడింది. ఇదంతా ఒకవైపైతే మా అన్నయ్య ఆ రోజుల్లోనే ఏడు రూపాయలు పెట్టి నాకు మా ఊరి గ్రంధాలయంలో సభ్యత్వపు కార్డు తీసుకోవడంతో నాకు దినపత్రికలతో, వివిధ రకాల పుస్తకాలతో మంచి స్నేహం ఏర్పడింది. అట్లా సాహిత్యం పట్ల ఆకర్షితుడ్ని అయ్యాను. ఇక ఏ వీధి అరుగుల పైనో, ఇంటి ముందు వాకిళ్లలో ఏ వెన్నెల రాతుల్లోనో మా ఇంటి పక్కన ఉండే గుడ్డి గౌరక్క చెప్పే కథలకు పిల్లలమంతా చెవి కోసుకునే వాళ్ళం. హై స్కూల్లో తెలుగు పండితులు ముత్తయ్య సారు, డిగ్రీలో డా. కావూరి పాపయ్య శాస్త్రి గారు రాగయుక్తంగా పాడే పద్యాలు తెలుగు బాష పట్ల ఇష్టాన్ని పెంచాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం. ఏ. తెలుగు చేస్తున్నప్పుడు ఆచార్య ఎన్. గోపి, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఆచార్య ననుమాస స్వామి, ఆచార్య మసన చెన్నప్ప మొదలైన ఆచార్యులు చెప్పిన పాఠాలు సాహిత్యం పట్ల మరింత అభిరుచిని, పరిశోధనా చూపును పెంచాయి.
ప్రింట్ లో నా పేరును నేను చూసుకోవాలనే కోరిక ఒక వైపు, ఏదో చెప్పాలనే కొట్లాట మరో వైపు లోలోపల సెగలు కక్కుతూ నన్ను ఒక దగ్గర ‘కూకుండనీయలేదు’ కొన్నేళ్ళ పాటు. ఉద్యోగ జీవితంలో భాగంగా నేను సిరిసిల్లకు వెళ్ళడం నా సాహిత్య జీవితంలో గొప్ప మేలిమలుపు. నా తొలి కథ ‘అమృతవర్షిణి’ అక్కడే రాశాను. ఇది 2005లో ఆంధ్ర జ్యోతి నవ్య వీక్లీలో అచ్చయింది. మెల్లగా సిరిసిల్లలోని జూకంటి జగన్నాథం, పెద్దింటి అశోక్ కుమార్, డా. పత్తిపాక మోహన్, జిందం అశోక్, ఆడెపు లక్ష్మణ్, దూడం మనోహర్, మద్దికుంట లక్ష్మణ్, చైతన్య ప్రకాష్ ల సాహిత్యంతో పరిచయం అయింది. ముఖ్యంగా పైన చెప్పిన రచయితలను, వారి రచనలను అతి దగ్గరగా చూడడం, వారితో పలు సందర్భాలలో సాహిత్యం గురించి చర్చించడంతో సాహిత్యం పట్ల ఒక సీరియస్ నెస్ పెరిగింది. అట్లా మొత్తం సాహిత్యాన్ని ఒక కొత్త చూపుతో చూడడం మొదలైంది.
నేను కథకుడిగా మొదలైన 2005 నుండి ఇప్పటిదాకా తెలుగు సమాజం ముఖ్యంగా తెలంగాణ సమాజం ఎంతో సంక్లిష్ట దశను దాటుతూ వచ్చింది. మనిషి జీవితంలో ఎంతో వేగం పెరిగి పోయింది. మనిషికి మనిషికి మధ్య ఎంతో ఎడబాటు పెరిగింది. ప్రపంచీకరణ మరింత కోరలు సాచి మనిషిని తన గుప్పిట్లో బంధించింది. పల్లెలు అటు నగరాన్ని చేరుకోలేక, ఇటు పల్లెగా ఉండలేక ఒక విచిత్ర పరిస్థితిలో చిక్కుకు పోయి గిలగిలా తన్నుకుంటున్నాయి. మనిషికి ఇన్ని తిండి గింజలను, జీవితాలకు ఇంత భరోసాను ఇచ్చే భూమి వ్యాపార వస్తువుగా మారిపోయింది. వ్యవసాయం దండుగమారి పనిగా చిత్రింపబడింది.
సామాన్యులు అయిదేళ్ళకోసారి వచ్చే ఎన్నికల్లో లైన్లో నిలబడి ఓటు వేసే మరయంత్రాలుగా మారిపోయారు. ప్రభుత్వ పథకాలు సాధారణ పౌరుల దగ్గరకు రాలేక ఎక్కడో బొక్క బోర్లా పడటం మొదలైంది. నేత కార్మికుల ఆత్మ హత్యలు తారాస్థాయిని అందుకున్నాయి. ఇక్కడి మొండి గోడల మధ్య భార్యా పిల్లల్న, తల్లిదండ్రుల్ని వదిలేసి యువకులు ఎడారి దేశాలకు వలస పోవడం ఎక్కువైంది. ఇసుక దేశాలకు వలస పోయిన యువకులు శవాలుగానో, శవంతో సమానంగానో మారి తిరిగి వచ్చేవారు. సంసారాన్ని నడపలేక అప్పుల పాలై, ఆడవాళ్లు ఎన్నో సరిహద్దుల్ని దాటాల్సిన దుర్భర పరిస్థితులు రాచి రంపాన పెట్టేవి. సంస్కారాన్ని నేర్పాల్సిన చదువులు డాలర్ల వేటలో పిల్లల్ని విదేశాలకు పంపడానికే ఉపయోగపడ్డాయి. ఇక్కడ కన్న పేగులకు దూరమైన పండుటాకులు పిల్లల దగ్గర ఇమడలేక, ఇక్కడే ఉండలేక బతికుండగానే నరకం అనుభవించారు. పల్లెల్లో భూమి పంచాయితీలు పెరిగిపోయి ధనవంతుడిదే, అగ్రకులాలదే పైచేయి అయిపోయింది. సగటు మనిషికి మనశ్శాంతి కరువైంది. ఇలా ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులు, విచ్ఛిన్నమౌతున్న మానవ సంబంధాలు, మనస్తత్వాలు… ఇవన్నీ ఇలా కొనసాగుతుండగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడి చదువుకున్న యువతీ, యువకులకు, ఉద్యోగాలు దొరకక, తెలంగాణ నీళ్ళు, నిధులు, వనరులు ఎక్కడికో తరలి పోయి తెలంగాణాను ఎండిన పేగులాగా మార్చి వేశాయి. ఈ నేపథ్యంలో 2001 నుండే మలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రతరం కావడం ప్రారంభమైంది. కులాంతర వివాహాలు చేసుకున్న యువతీ, యువకులపైన పరువు హత్యలు పెరిగిపోయాయి. ప్రేమ లేని వట్టి ఎండిపోయిన చెట్టులాంటి సమాజం నిర్మితమైంది. ఇన్ని గాజు పెంకులు, ఇన్ని గునపాలు ఓర్చుకోలేని గాయాలు చేస్తూ సాటి మనిషిని కత్తుల వంతెన మీద నడిపిస్తూంటే వాళ్ళతో పాటు కొంత దూరం కలిసి నడిచిన నా కలం పడిన నొప్పులే, దుఃఖాలే నా కథలు.
పల్లెలో పుట్టి నగరానికి ఎగబాకిన వాడిని కాబట్టి మూలాలు మర్చిపోకుండా పల్లె జీవితాన్నే నా కథల నిండా చిత్రించడానికి ప్రయత్నించాను. అలాగని పూర్తిగా నోస్టాల్జియా కథలేం కావు. మెరుగైన జీవిక కోసం మనిషి పడే, ఆ పోరాటంలో మనిషి కోల్పోయే జీవిత మాధుర్యాన్నే కథలుగా చెప్పడానికి ఆయాసపడ్డాను. కొన్ని సార్లు సఫలీకృతం కావచ్చు, లేదా ఆ మార్గంలో ఎక్కడో కూలిపోవచ్చు. అయినా సమకాలీన మానవుడు పడే ఏదో సంఘర్షణను, ప్రకంపనలను, ఆరాటపోరాటాలను, భావోద్వేగాలను నా శక్తి మేరా చెప్పాననే అనుకుంటాను.
ఏ రచయితైనా తన కథలు ఎంత తొందరగా వీలైతే అంతా తొందరగా ప్రాసంగికతను కోల్పోవాలని అనుకుంటాడు. ఎందుకంటే తన కథల్లో చిత్రింపబడిన హింసాత్మక సమాజం, బాధామయ ప్రపంచం, నిప్పుల గుండం లాంటి బతుకు దారి అలాగే ఉండాలని అనుకోడు. మారాలని అనుకుంటాడు. ఆ దిశగా నా కథలు కాస్తో కూస్తో మార్పును ఆశించే కథలు. ఎక్కడో ఓ మూలన కూర్చొని ఏ అర్ధరాత్రో కాగితంపై పురుడి పోసుకునే అక్షరం ఈ లోకాన్ని మార్చుతుందా? అని ప్రశ్నించుకుంటే కచ్చితంగా మారదనే నా అభిప్రాయం. అయితే రాబోయే తరాల కోసమైనా మనం కథలో, కవిత్వమో బాధ్యతగా రాయాల్సి ఉంది. మా తండ్రులో, మా తాతలో నివసించిన సమాజం ఇంత బావుంది, లేదూ ఇంత దుర్భరంగా ఉంది అని భావి తరాల వారు తెలుసుకోవడానికైనా చరిత్ర పుస్తకాల కంటే మిన్నగా సాహిత్య జీవులు రికార్డు చేయగలరు కాబట్టి రాయాలి.
గత కొంత కాలంగా తెలుగు కథను, ముఖ్యంగా తెలంగాణ కథను అతి దగ్గరగా చూస్తూ వస్తున్నాను కాబట్టి నేను ఎంచుకున్న కథా వస్తువులను ఇంకేదైనా శిల్పంలో చెప్పవచ్చా? అని కూడా ఆలోచించాను. కాని నేను రాసిన శిల్పమే సరైందని అనిపించింది. ఇంకో శిల్పంలో, టెక్నిక్ లో చెప్పవచ్చేమో కాని ఆ మేరకు గందరగోళం కూడా కలగక మానదు. ఏ కథకు ఏ భాషా, శిల్పం వాడాలో అవి సరిగ్గానే కుదిరాయని అనుకుంటాను. ఇక సద్విమర్శక పాఠకులే మంచి చెడులు నిర్ణయించాలి. అలాగని ఇక నేర్చికోవాల్సింది ఏమీ లేదనే గర్వం కాదు. ముందు రాయబోయే కథల్ని మరింత మెరుగైన శిల్పంతో రాయాలనే తలంపుతో ఉన్నానని హామీ ఇస్తాను.
సముద్రమంత కథా సాహిత్యంలో నా స్థానం ఎక్కడ అని నన్ను నేను తరచి చూసుకుంటే కచ్చితంగా నా స్థానం చిట్ట చివరి వరుసే. ఇదే కథా వస్తువులను తీసుకొని ఇంతకంటే గొప్పగా రాసే రచయితలు మన కాలంలోనే ఎంతో మంది ఉన్నారు. సోకాల్డ్ కథకుల పక్కన నాకు కుర్చీ వేయకున్నా పరవాలేదు. కానీ నా కథల పిల్ల కాలువలో మునిగి అవి అందించే కాసిన్ని గాఢమైన అనుభూతులకు, పెయిన్ కి మీ హృదయంలో కాస్త చోటిస్తే చాలు నా కథలు సఫలీకృతం అయినట్టే. అక్కడికి చేరాక వాటికవే ఏదో రసాయనిక చర్యను ప్రారంభిస్తాయి. కథల్ని చదవడమంటే సముద్రం ఒడ్డున కూర్చొని పిట్ట గూళ్ళు కట్టడం కాదు. రచయితతో సమానంగా సముద్రంలో మునిగి ఆటు పోటుల్ని, అలల రాపిడిని, విరుచుకుపడే తరంగాలకు మన గుండెల్ని అనునాదం చేయడమే.
తెలంగాణ నేల మీది నుంచి నేను రాసే ప్రతీ అక్షరం ఎంతో బాధ్యతతో, బరువుతో కూడుకున్నది. మొదటి నుంచి ఆ ఎరుకతోనే రాస్తూ వస్తున్నాను. నా కథలు రాశిలో తక్కువే కావచ్చు కాని అవి ఇక్కడి నేల తండ్లాటను, మనుషుల గుండె కింది తడిని చిత్రించడానికే ప్రయత్నించాయి. కొంత మంది విమర్శకులు నా కథల్ని పాత సీసాలో పాత సారా అని, కొత్త సీసాలో పాత సారా అని, కొత్త సీసాలో కొత్త సారా అని సారాయితోనో, సీసాల్తోనో కొలవడానికి ప్రయత్నిస్తారు. కాని అవి సీసా కథలో, సారాయి కథలో కాదు. రూపాయి చుట్టూ తిరిగే మనిషి కథలు, కాసింత ఆత్మ గౌరవపూరిత బతుకు కోసం చివరి శ్వాస దాకా లడాయి చేసే సిసలైన మట్టి కథలు. గుండె బద్దలు కొట్టుకొని రక్త స్పర్శతో వచ్చిన ఆర్ద్రమైన కథలు.
*
పుస్తకావిష్కరణ ముందే ఆత్మావిష్కరణ మంచివిషయం.
రచనకూ రచయితకూ కడుదూరం చూస్తున్న రోజులివి.
విశాఖ నుంచి బయల్దేరి మీ సభకు హాజరవ్వాలనిపించేలా వ్రాసారు. ధన్యవాదాలు.
Thank you sir..