కాలానికి, కొలతలకీ చిక్కనివాడు!

సైదాచారి పక్కా తెలంగాణ కవి.  అతని కవిత్వంలో కనిపించే తల్లి తెలంగాణ స్త్రీ.  అతను ఉటంకించిన శ్రామికులు తెలంగాణ వాళ్ళు  అతనిలానే అతని భాష కూడా స్ఫురద్రుపి.  మామూలు వ్యవహారిక భాషతో అలవోకగా పలికే తెలంగాణ మాండలికం జమిలిగా సాగుతుంది. 

సైదాచారి నిజమైన కవి.  ఎందుకంటే అతను కవిత్వ ప్రేమికుడిగా కవిత్వం రాయలేదు.  (కవిత్వ ప్రేమికులెవరైనా కవిత్వం చదివితే చాలు.  రాయాల్సిన పనిలేదు.)  కవిత్వం కోసమే కవిత్వం రాయలేదు.  తనని తాను కవిత్వంలో తప్ప మరో రకంగా పరిపూర్ణంగా వ్యక్తం చేసుకోలేడు కాబట్టే కవిత్వం రాసాడు.  అసలు ఒక వ్యక్తి కవిగా ఎందుకు సంభాషించాలి?  మామూలు మాటల్లో తనకు సంభవించిన ఎరుకని, ఎదురొచ్చిన సత్యాన్ని వ్యక్తం చేయటం సాధ్యం కాక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని ఆశ్రయించినప్పుడు అది కవిత్వం అవుతుంది.  సైదాచారి కవిత్వం మామూలు భాష కాదు.  అది మామూలు మనుషులు మాట్లాడే భాష కాదు.  అది ఓ గాయపడ్డవాడి ఘోష.  సమాజాన్ని, తన చుట్టూ వున్న మనుషుల్ని ఒక భిన్నమైన దృక్కోణం నుండి చూసి చేసిన ఒక తాత్విక పరిశీలన.  అతని కవిత్వంలో తాత్వికత లేకుండా ఒక్క స్టాంజా కూడా వుండదు.  గుండె గాయాన్ని చూపని ఒక్క వాక్యమూ వుండదు.

సైదాచారి నిజమైన కవి.  ఎందుకంటే ఎప్పుడూ, ఎట్టి పరిస్తితుల్లోనూ మరొకరి వ్యక్తీకరణని ఆశ్రయించలేదు.  అతని అనుభవాల నుండి తన్నుకొచ్చిన ఆ వాక్యాలన్నీ అతని సొంతం.  మరొకరి అనుభవాన్ని, పరిశీలనని నెత్తికెత్తుకోలేదు.  తనదైన గొంతునే ఎల్లప్పుడూ సవరించుకున్నాడు కవిత్వం కోసం.

సైదు కవిత్వం మొత్తం ఒక అస్తిత్వ దుఃఖం.  పద్దెనిమిదేళ్ళ క్రితం వేసిన “ఆమె నా బొమ్మ”లోనూ, ఎనిమిదేళ్ళ క్రితం వేసిన “నీలం మాయ”లోనూ అదే గుబులు దుఃఖం.  ఐతే సైదు దుఃఖ ప్రేమికుడు కాదు.  దుఃఖాన్ని రొమాంటిసైజ్ చేసే అల్ప బుద్ధిగల కవి కాడతను.  జెండర్ పరంగా, కులం పరంగా, మతం పరంగా నిచ్చెనమెట్ల వ్యవస్థలా రూపుదిద్దుకున్న సమాజంలో నిరంతరం ఆత్మన్యూనత కలిగిస్తున్న అస్తిత్వ దుఃఖం అతనిది.  అతని కవిత్వం చదువుతుంటే అతను ఎవరినో పట్టుకొని ఏడుస్తూనో, ఓదారుస్తూనో నాలుగు మాటలు చెబుతున్నట్లుంటుంది.  ఎప్పుడూ ఎవర్నో దగ్గరకు తీసుకొని నాలుగు వూసులు చెబుతున్నట్లుంటుంది.  ఉదాహరణకి

“దుఃఖం ఉమ్మనీరై ఊరిందా?

రొమ్ముల్లో కన్నీరై పొంగిందా?

ముందు కష్టాల్ని కని నను కన్నావా తల్లీ!

నేను నీ శూన్యపు నీడను

నీకు నీ ఏడ్పుకూ వారసుడ్ని” అంటాడు.

“మనం కలిసిన ప్రతిసారీ నిర్లిప్తత

నీ మీదో కాలు నా మీదఓ కాలుతో నర్తిస్తుంది”

“నిన్ను జార విడుచుకున్న నాకు

నీలో వున్నవి కూడా ఇక నా జీవితంలో లేకుండా పోతాయి

నీటి యెద్దడి కౌగిట్లో ముడుచుకుంటున్న మొక్కలా

బతుకు శుష్కిస్తుంది

నాకు నేనే ప్రశ్నగా మిగిలిన ప్రతిసారీ

నువ్వే సమాధానమవుతావు”

నిజానికి అతని కవిత్వం మొత్తం జీవితంలోని ఎగుడు దిగుళ్ళకి, వైఫల్యాలకి, చేవలేని తనానికి, వ్యర్ధత్వానికి, మోనోటనీకి, ప్రేమ రాహిత్యానికి సంబంధించిన ఒక ఉన్నతీకరించబడిన సంభాషణ.  సైదు అంత నిజాయితీగా కవిత్వం రాసేవారు చాలా అరుదు.   గుండె కవాటాల్లో వెల్లువెత్తే రక్తాన్ని రంగరించి, గుండె చప్పుడుని జోడించిన అక్షరాలే అవి.

సైదు కవిత్వం కొన్ని చోట్ల భయపెడుతుంది.  ఒక తీవ్ర నిరాశలో గుండె పగలగొట్టుకొని వచ్చినట్లుంటాయి ఆ అక్షరాలు.

“ఎన్నాళ్ళు కౌగిలించుకుంటావీ మొండేన్ని?

కలలన్నీ నా అవివాహిత ప్రియురాలి ప్రసవచారికలతో భయానకం”

అసలు సైదు కవిత్వం ఎప్పటికప్పుడు సంభవించే సామాజిక పరిణామాలకు స్పందించి రాసినది కాదు.  అయితే ఆ సామాజిక పరిణామాలు సృష్ఠించే వాతావరణానికి, బంధాలకి, బంధనాలకీ అతని కవిత్వం అతీతం కాదు.  “సముద్రంలో సూర్యుడు” అన్న ఒక్క కవిత చాలు సాఇదాచారి ఆలోచనల తీవ్రతకి.  నిర్దిష్ట గంటలతో సంబంధంలేని శారీరిక కష్టంతో నిద్రలేని, నిద్ర కరువైన కష్టజీవి గురించి రాసిన ఈ కవిత చూడండి.  (నిజానికి ఈ కవితని అతను నాకు స్వయంగా విశాఖ సముద్రం ఒడ్డున వినిపించాడు సుమారు పాతికేళ్ళ క్రితం)

“పగలంతా కాయకష్టంతో ముక్కలైన రెక్కల్ని

మళ్ళీ అతికించుకొనీ – నన్ను నిద్రపోనీ!

చెమట కణికలుగా రాలిపోయిన

ఎర్రెర్రని రక్తకణాల్ని

ఈ మహోజ్వల నిద్రలోంచి ఏరుకోనీ-

మండే కొలిమి వేడిలో మాడిన ఈ దేహాన్ని మసకబారిన చూపుల్ని

మళ్ళీ వెలిగించుకోనీ-

 

నన్ను నిద్రపోనీ-

బుక్కెడు కూడెలాగూ నోటికందలేదు

కాస్త నిద్రయినా కళ్ళకందనీ-

అన్నం ముద్దలోంచి తెచ్చుకోవాల్సిన శక్తులు

నిద్రలోనయినా విచ్చుకోనీ-

 

ఇది సుదీర్ఘ సుషుప్తి కాదు

సుఖ వాంఛా స్వప్న వీచిక కాదు

రేపటి పొయ్యిలోకి పుల్లలేరుకోవటం

రేపటి నిర్మాణానికి పునాదులు తవ్వుకోవటం

రేపటి జల సముద్భవం కోసం

పూడికలు తీసుకోవటం-

 

నువ్వు నోటి దగ్గర మెతుకునే కాదు

కళ్ళ మీది నిద్రనూ కాజెయ్యగలవ్-

ఏ మెలుకువ అంచుననో కూచొని

నా గుండెపై రేపటి కుంపటి రాజేయగలవ్-

గండుబిల్లిలానో, ముళ్ళపందిలానో

భీకర స్వప్నమై

అర నిద్ర నాకు మిగల్చగలవ్

 

అందుకే నేను నిద్రపోతే-

సముద్రంలో సూరుడిలా నిద్రపోతాను

మబ్బు వెనుక చంద్రుడిలా నిద్రపోతాను

అడవి గర్భంలా నిద్రపోతాను

అగ్నిపర్వతంలా నిద్రపోతాను-”

తీర్చిదిద్దినట్లుండే జీవితం, అలాంటి జీవితం నెలకొల్పే విలువలతో సహజసిద్ధ ఆలోచనా స్రవంతికి, తాత్కాలిక జీవితంలో శాస్వత ప్రణాళికలు వేసే జీవనశైలితో తాత్విక చింతనా సౌందర్యానికి మధ్యనుండే తగాదాలతో పడ్డ యాతన అతని కవిత్వంలో కనిపిస్తుంది.  అతని కవిత్వం నిశ్చల నిశ్చితాల మీద ఒక విరుద్ధ భావజాల ప్రకటన (ఉదాహరణకి “విశృంఖల” అనే కవిత చూడండి).

“చివరి నుండి విందాం తమాషాగా పాటని

మృత్యువులోంచి సమీకరిద్దాం మిగిలిన మన జీవితాన్ని

పడమరనుకుందాం కాస్సేపు సూర్యుడుదయించే  దిక్కుని

ఉదయాల్తో కాక రోజుల్ని రాత్రుల్తో మొదలెడదాం

 

ఇంట్లో జుట్టుని దువ్వుకొని బయటికెళ్ళేప్పుడు చెరుపుకుందాం

రహస్యంగా విసిరి పారిపోదాం

మన ఆస్తుల్ని, కీర్తుల్ని ఎవడి జేబులోకో

 

దారులు అరణ్యాలైపోనీ, అరణ్యాలు దారులైపోనీ

నడుద్దామొకసారైనా అస్తవ్యస్తంగా

ప్రయాణిద్దాం హాయిగా పట్టాలు దప్పిన రైల్లోనే

 

ఉమ్మినద్దిన వేళ్ళతో చెరిపేసుకుందాం

సరళరేఖల్ని, గానుగ వృత్తాల్ని”

సైదాచారి కవిత్వంలో స్త్రీ ప్రధాన పాత్రధారి.  అతని స్త్రీ క్షతగాత్రి.  లాలిత్యవతి.  సౌందర్యవతి.  ఒక్కోసారి అమ్మ.  మరోసారి ప్రియురాలు. ఇంకోసారి భార్య.  తన ఆలోచనలు, సృజన, స్పృహ….మొత్తం స్త్రీ చుట్టూనే తిరుగుతుంటాయి.  విపరీతంగా ఆరాధిస్తాడు.  మోకరిల్లుతుంటాడు.  ఒక్కోసారి విసుక్కుంటాడు.  ఇంకోసారి స్త్రీలోకే పయనమవుతాడు లేదా పలాయనమవుతాడు.  ఆ స్త్రీ ఒక్కోసారి మాంసకండరాలతో సజీవంగా కనబడుతుంటుంది. (ఉదాహరణకి “ఒక సంచార తల్లి కోరిక).  మరోసారి అతని పలాయన స్థావరమౌతుంది. (ఉదాహరణకి “నిలుపరాని కామమాయే).  నిజానికి అతని రెండో సంకలనం “నీలం మాయ” స్త్రీల మీదనే రాసాడు.  కానీ అది స్త్రీల కోసం రాసినట్లుండదు.  తన కోసం స్త్రీల మీద రాసినట్లుంటుంది.  స్త్రీల బలాబలాలతో తన అస్తిత్వం ఆధారపడినట్లు రాసుకున్నట్లుగా వుంటుంది.  స్త్రీ దేహ వర్ణనతోనే తన మానసిక ఉల్లాస, దుఃఖాల్ని పోల్చుకున్నాడు.

కవిత్వేతర విషయాలకొస్తే సైదాచారికి జీవితం పట్ల నిర్లక్ష్యంగా వున్నట్లుంటాడు కానీ అతనికి ప్రతి విషయం మీద బలమైన అభిప్రాయాలుంటాయి.  మంచి అభిరుచులున్నాయి.  మంచి సంగీతకారుడు.  వయొలిన్ వాయిస్తాడు.  తత్వశాస్త్రం అంటే బాగా ఇష్టం.  బాగా చదివాడు.  హోమియో వైద్యం అంటే పాషన్.  కానీ జీవితం ఎంత చిత్రం అంటే అంతర్ముఖుడైన సైదాచారి విత్తనాల కంపెనీకో, రియల్ ఎస్టేట్ కంపెనీకో మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ గా పనిచేసాడు.

ఇంకా అతనితో నాకున్న అనుబంధం చెప్పాలంటే నన్ను ఈ కవిలోకంలో నా కలం పేరుతో కాక నా స్వంత పేరుతో పిలిచే ఇద్దరు కవుల్లో, కేవలం ఇద్దరిలో సైదాచారి ఒకడు.  మరొకరు ఆయన భార్య జ్యోతి.  వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నాక అప్పట్లో విశాఖలో వున్న నా దగ్గరకే వచ్చారు.  నేను కవిత్వం మానేసి నిశ్శబ్దంగా వున్న కాలంలో కూడా నేను టచ్ లో వున్నది కేవలం వాళ్ళిద్దరితోనే.

సైదాచారి పక్కా తెలంగాణ కవి.  అతని కవిత్వంలో కనిపించే తల్లి తెలంగాణ స్త్రీ.  అతను ఉటంకించిన శ్రామికులు తెలంగాణ వాళ్ళు  అతనిలానే అతని భాష కూడా స్ఫురద్రుపి.  మామూలు వ్యవహారిక భాషతో అలవోకగా పలికే తెలంగాణ మాండలికం జమిలిగా సాగుతుంది.  అలిసెట్టి ప్రభాకర్ మరణం తరువాత తెలంగాణ కవిత్వానికే కాదు తెలుగు కవిత్వానికి కూడా జరిగిన అతి పెద్ద నష్టం సైదాచారి కాలం నుండి కనుమరుగవటమే.

*

అరణ్య కృష్ణ

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హృదయానికి మరింత దగ్గరగా తీసుకువచ్చారు.

  • ఒక స్నేహితుడైన కవిని ఇలాగే స్మరించుకోవాలి. మీ రాత ఆయన్ని సజీవంగా ఉంచుతుంది.

  • కృష్ణగారు! FB లో వీరి మరణం గురించి చదివాను. నాకు వీరిగురించి ఏమీ తెలియదు.. ఇప్పుడు మీరు వారిగురించి రాసినది , వారు రాసిన కవితలు చదివి బాధనిపించింది. స్నేహితుని గురించి మంచి నివాళి. కృష్ణగారు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు