బలవంతుల సమాజంలో బలహీనులపై నిరంతర దాడులు కొనసాగుతూనే ఉంటాయి. అవి భౌతిక దాడులే కానవసరం లేదు. మానసికంగా బయటికి కనిపించని గాయాలు చేసే దాడులకు లెక్కేలేదు. ఇలాంటి దాడులు సహజంగా దళితుల మీదో, మహిళల మీదో జరుగుతూనే ఉంటాయని మనం వేరే చెప్పుకోనవసరం లేదు. మతమే రాజ్యంగా మారిన తరువాత కనీస హక్కులకు తూట్లు పడుతూనే ఉంటాయి. అందుకు నిలువెత్తు నిదర్శనమే కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యే చేసిన అసభ్యవ్యాఖ్యలు.
కర్ణాటక అసెంబ్లీ నిండు సభలో జరిగింది. కర్ణాటక అసెంబ్లీలో ఇటీవల పంటల భీమ మీద మాట్లాడేందుకు హౌజ్ సభ్యులకు అవకాశం ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో తనకు ఆలస్యంగా అవకాశం వచ్చిందనే అసహనంలో సభలోని ఒక ఎమ్మెల్యే అత్యంత నీచమైన వ్యాఖ్యను చేశాడు. అత్యాచారాన్ని ప్రతిఘటించే పరిస్థితి లేనప్పుడు, దానిని ఆస్వాదించాలన్నాడు. ఇది మహిళలను కించపరిచే దుర్మార్గమైన వ్యాఖ్య. ఒకవైపు దేశంలో మహిళలకు, పసిపిల్లలకు రక్షణ కరువవుతన్న సమయంలో ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి ఇట్లా నిండుసభలో వ్యాఖ్యానించడం అతడి బాధ్యతా రాహిత్యాన్ని మాత్రమే కాదు, పురుషాహంకారాన్ని కూడా చాటుతోంది. ఇట్లా మాట్లాడడం వెనకాల ఉన్నది ఏ భావజాలం అన్నదే మనం ఆలోచించాల్సిన విషయం. మహిళలల పట్ల తమ మనస్సులో విపరీతంగా నెలకొన్న చులకన భావమే వారితో ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నది. ఏమన్నా చెల్లుతుంది, ఎంతన్న చెల్లుతుందనే అహంకారంతోటే ఇట్లా మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశాడు సదరు ఎమ్మెల్యే కేఆర్ రమేష్. ఈ మహానుభావుడు గతంలో స్పీకర్‌గా కూడా పని చేశాడు. అప్పుడు కూడా ఇలాగే వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఈ తాజా దురాగతంపై మీడియా దృష్టిసారించి, విషయాన్ని వెలుగులోకి తెచ్చే సరికి సిగ్గులేని ఆ ఎమ్మెల్యే కాళ్ల బేరానికి వచ్చాడు. తన ఉద్దేశ్యం అదికాదని, ఇక మీదట జాగ్రత్తగా మాట్లాడుతానని, స్పీకర్‌కు క్షమాపణ చెప్పాడు. ఇట్లా మాట్లాడడంలోనే అతనికి మహిళల పట్ల, మహిళా సమస్యల పట్ల ఉన్న చిన్నచూపు బట్టబయలవుతున్నది. ప్రజలకు రక్షణ కల్పించవలిసిన కోర్టులు, చట్టసభలు ఇట్లా దిగదుడుపు వ్యాఖ్యానాలకు పాల్పడితే, ఇక బాధితులకు రక్షణ ఏది. ఇలాంటి వారి అండను చూసుకునే ఎమ్మెల్యేలు, మంత్రుల పిల్లలు గ్యాంగురేపులకు పాల్పడుతున్నారు.
మరోవైపు కేఆర్ రమేష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేసినపుడు స్పీకర్ సీట్లో కూర్చున్న మరో దురంహంకారి విశ్వేశ్వర్ హెగ్డే. ఈయనగారు ఆ వ్యాఖ్యలను ఖండిరచకపోగా, ఆ మాటలకు స్పీకర్ సీట్లోనే పడీపడీ నవ్వాడు. ఇది మరీ పరాకాష్టకు చేరిన పురుషహంకారంగా మారింది. నిండు సభలో గౌరప్రదమైన హోదాలో ఉన్న హౌజ్ సభ్యులు సభలో పార్లమెంటరీ భాషను వాడాలని రాజ్యాంగంలో పేర్కొని ఉన్నా సరే ఆ నియమాన్ని సదరు ఎమ్మెల్యే అతిక్రమిస్తే, దానికి వంత పాడుతున్నట్టుగా ఉంది స్పీకర్‌గారి వెటకార నవ్వు. ఇలాంటి వారా మనల్ని పాలిస్తున్నది అని ప్రజలు నివ్వరపోయేలా తయారయ్యింది ఈ వ్యవహారం.
అందుకే కర్ణాటకలో నిత్యం మహిళల మీద యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల పట్ల ప్రజాప్రతినిధులే ఇట్లా అసభ్యంగా ప్రవర్తిస్తే సాధారణ పౌరుల ఆలోచన విధానం ఇంకే రీతిలో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. దీనిపై తీవ్ర దుమారం లేసింది. పార్లమెంటులో సైతం మహిళా సభ్యులు పార్టీలకు అతీతంగా ఈ వ్యాఖ్యలను ఖండిరచారు.
ఈ రకమైన వ్యాఖ్యల వెనుక దాగి ఉన్నది మనువాద బ్రాహ్మణీయ హిందూ పురుషాహంకార భావజాలమే. ఈ భావజాలాన్ని మోస్తున్న వాళ్లంతా ఏదో ఒక సందర్భంలో ఇట్లా మహిళలను కించపరుస్తున్న వారే. ఉత్తర భారతంలో ఇది సర్వసాధారణమైన విషయంగా మారింది. ఇక ఇప్పుడు క్రమంగా దక్షిణాది రాష్ట్రాలకు సైతం పాకుతోంది. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రజాప్రతినిధులకు బుద్ధిచెప్పాల్సింది ఎవరు? అత్యున్నత న్యాయస్థానాలు ఇలాంటి వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి వారికి నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడడం వీలవుతుంది. లేకుంటే ఇట్లాగే రెచ్చిపోయి వ్యవహరిస్తారు. తమలో ఉన్న అహంకారాన్ని ఎట్లాంటి శషబిషలు లేకుండా బయటపెట్టడం, ఆ తరువాత సారీలతో సరిపెట్టడం రివాజుగా మారుతోంది. ఇది కూడా ఒక రకంగా హింసను ప్రేరేపించే చర్యగానే పరిగణించాలి.
బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి వారు చట్టసభల్లో మహిళలకు సమున్నతమైన రిజర్వేషన్ కల్పించాలని ఆనాడు హిందూకోడ్ బిల్లును తెచ్చాడు. దానిని వ్యతిరేకించినప్పుడు తన మంత్రిపదవికి సైతం రాజీనామా చేసి తన మహిళా పక్షపాతాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకున్నాడు. మరి ఇవాళ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిందని ఆజాదీకి అమృతోత్సవ్ పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్న సమయం ఇది. ఈ సందర్భంలో చట్టసభల్లో ప్రజాప్రతినిధులు వాడుతున్న భాష ఇంతటి దారుణంగా ఉండడం ఎంతకూ క్షమార్హం కాదు. ఇలాంటి ప్రజాప్రతినిధులకు భవిష్యత్‌లో ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేసి అవకాశం ఉండకూడదు.
అగ్రవర్ణ కులతత్వం నిండిన మెదళ్లలో సభ్యత సంస్కారం అన్నవాటికి ఆస్కారమే లేదు. అందుకే వారు సమాజంలో బాధితుల పట్ల చిన్నచూపును ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ పురుషాధిక, దురంహకార దృష్టికోణానికి దీనిని కొనసాగింపుగా చూడాలి. పార్లమెంటులో ఉన్న మెజారిటీ సభ్యుల్లో నేరచరిత్ర కలిగిన వాళ్లలో అగ్రవర్ణ సభ్యులదే సింహభాగం. దీనిని బట్టి అర్థమవుతున్న విషయం హింసాప్రవృత్తి ఏ కులాల నిత్య వ్యాపకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. వారికి డబ్బు అధికారం అనేవాటిపై అజమాయిషీని నిలుపుకోవడం కోసం ఎవ్వరినైనా లెక్కచేయనితనం వచ్చి చేరుతున్నది. దీంతో వారు కిందికులాలను, మహిళలను లెక్కచేసే పరిస్థితి లేకుండా పోతున్నది. మరి అగ్రవర్ణ కులాల్లో రావాల్సిన పరిపూర్ణత ఎప్పుడు సాధ్యవుతుందో కూడా చట్టసభలు ఆలోచించాలి. పాఠశాల స్థాయి నుండే సమాజంలో ఎలా మసులు కోవాలో నేర్పించాలి. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడే విషయంలో ఉండాల్సిన భాషా సంస్కారంపైన మరింత శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే ఒక మెరుగైన సమాజం సాధ్యపడుతుంది. లేకుంటే ఇలాంటి పురుషహంకార కూతలు పదే పదే చట్టసభలను మలినం చేస్తూనే ఉంటాయి. దీనిపై మహిళా సంఘాలతో పాటు పౌర సమాజం కూడా సీరియస్‌గా ఆలోచించాలి. ఈ భావజాలాన్ని రూపుమాపడానికి నడుంకట్టాలి. ఎన్నికల్లో ఇలాంటి వారికి ఓటేయకుండా బహుజనులను చైతన్యపరచాలి. అహంకారానికి ఊతమిస్తున్న అధికారాన్ని వారికి దూరం చేయాలి.
పూలే`అంబేద్కర్లు కలలుగన్న స్త్రీపురుష సమాన సమాజ నిర్మాణానికి రాజ్యాధికారమే అసలైన రాచమార్గం. మన జాతులను ఆ దిశగా ఎడ్యుకేట్ చేసి మన ఆడబిడ్డలు, మహిళ పక్షపాతం కలిగిన లౌకిక ప్రజాస్వామిక వాదులనే చట్టసభలకు పంపాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ఆగడాలకు బ్రేక్ పడుతుందని గమనించాలి. లేకుంటే అప్పటిదాకా ఇలాంటి దురంహంకార కూతలు పునరావృతం అవుతూనే ఉంటాయి.
*
Dear Sir
this is all wrong .Just you want put all the bad to one section. There is no scientific proofs to your ideas.
https://www.youtube.com/watch?v=H0dJS0udaVk
here is the proof Mr.Anand garu.
I don’t want to blame anybody.
‘కారుకూతల అసభ్య సభ్యులు’ లో డా. పసునూరి రవీందర్ నేటి చుట్ట సభల్లో సభ్యుల దిగజారుడును ఏ కులాల వారి నిర్వాకమో ఎత్తి చూపుతూనే చక్కటి సూచనలు సైతం చేయడం బావుంది.