నేను, నాతో పాటు ఉన్న ఆమె ఆ టీ స్టాల్ ముందు నిల్చొని ఒక చాయ్, ఒక కాఫీ ఆర్డర్ చెప్పాం.
‘‘ఇక్కడ కాఫీ బాగుంది.’’ అందామె. నాకు చాయ్ ప్రత్యేకంగా ఇక్కడే బాగుందని చెప్పేంత బాగా అయితే అనిపించలేదు. నవ్వి, ‘‘అవునా?’’ అన్నాను. నవ్వింది.
ఆ తర్వాత కొంతదూరం నడిచెళ్లి ఆమెను డ్రాప్ చేసి, ఇంటికి ఒక్కడినే నడుస్తుంటే మధ్యలో ఇంకోటేదో టీ స్టాల్. అక్కడా ఒక చాయ్ చెప్పి, ఒక చెట్టు కింద, ఇంకా తెరవని ఓ షాపు మెట్ల మీద కూర్చొని తాగుతూ ఆలోచిస్తున్నా.
అకస్మాత్తుగా.. ఎంత అకస్మాత్తుగా అంటే అంతకుముందు తాగిన చాయ్, ఇప్పుడు అప్పుడే సిప్ చేసిన చాయ్ టేస్ట్‌లు రెండూ ఒక్కసారే కలిసిపోతే, ఆ కొత్త టేస్ట్ అర్థమవ్వడానికి పట్టే ఆ కాస్త సమయమంత అకస్మాత్తుగా.. ముందు తాగిన చాయ్, కాఫీకి డబ్బులివ్వలేదని గుర్తొచ్చింది.
‘అలా ఎలా మర్చిపోయాను?’, ‘ముందే టోకెన్ తీసుకునే సిస్టమ్ ఉంటే బాగుండేది అక్కడ’, రకరకాల ఆలోచనలు. ‘ఇలా చేయాల్సింది కాదు’ అని నామీద నాకే చిన్న కోపమొచ్చింది. ఆ కోపంలో ఆ పేపర్ కప్పును గట్టిగా నలిపి, డస్ట్‌బిన్‌లో పడేసి ఇంటికొచ్చా.
కొన్ని గంటలు గడిచాయి. రెండోసారీ చాయ్‌కి డబ్బులివ్వలేదని గుర్తొచ్చింది. నామీద నాకు కోపం పెరిగిపోయింది.
‘రెండోసారి కూడా ఎలా మర్చిపోయాను నేను? అదీ మొదటిసారి మర్చిపోయానని తెలిసి?’
ఆ కోపం అసహ్యం స్థాయికి పోయింది. చిన్న పనేదో ఉంటే మళ్లీ వెళ్లమా, అప్పుడు తిరిగిచ్చేద్దామని నాకు నేను సర్దిచెప్పుకున్నా. అయినా మళ్లీ మళ్లీ అదే ఆలోచన. ఎంత ప్రయత్నించినా అదే ఆలోచన. ఇద్దరు ముగ్గురు స్నేహితులు కలిస్తే వాళ్లకూ ఇదే చెప్పి బాధ పడుతూ, ఆ ఆలోచననే గుర్తుచేసుకుంటున్నా.
సాయంకాలమైంది. గతంలో ఒకతను నా దగ్గర డబ్బులు తీస్కొని తిరిగివ్వని విషయం గుర్తొచ్చింది. ఒకతనికి కష్టపడి పనిచేస్తే అతను రూపాయి ఇవ్వని విషయం గుర్తొచ్చింది. మొన్నెప్పుడో నా పర్సు పోతే, నన్ను రీచ్ అయ్యే అవకాశం ఉన్నా, తెచ్చివ్వకుండా అందులో ఉన్న నా డబ్బును వాడుకున్న మనిషి గుర్తొచ్చాడు. ఇంకా ఏవో ఏవేవో ఆలోచనలు. ఇవన్నీ గుర్తొచ్చాక ఎందుకో మనసు కుదుటపడింది. కాస్త ప్రశాంతంగా అనిపించింది. బయటికెళ్లి తిరిగొచ్చేసరికి ఉదయం జరిగిందంతా నన్ను బాధించడం మానేసింది. రాత్రికి అలాంటిదొకటి నన్ను పొద్దుణ్నుంచీ బాధ పెట్టిందని కూడా మర్చిపోయా.
తెల్లారింది. మళ్లీ ఆమెతోనే, అదే వీధిలో నడుస్తూ, అదే టీ స్టాల్ ముందు ఆగి, ముందు రోజులానే చాయ్, కాఫీ ఆర్డర్ చెప్పాం. ఆ టీ స్టాలతను చాయ్ గ్లాసులతో చాలా నైపుణ్యంగా ఆడుకుంటూ ఆర్డర్ విని నన్ను చూశాడు.
‘‘సార్! నిన్న మీరు డబ్బులివ్వకుండా పోయారు!’’ అన్నాడు.
నేను ‘ఏంటీ?’ అన్నట్టు చూసి, ‘‘ఏ ఇచ్చిన కదా!’’ అన్నాను.
‘‘లేద్సార్! ఇవ్వలేదు.’’
‘‘ఛ ఛ! ఇవ్వకుండ ఎట్ల ఉంట! నాకు ఇచ్చినట్టే గుర్తు.’’
‘‘లేద్సార్’’ అన్నాడతను కానీ, ‘సరే సార్!’ అన్నట్టు తలూపాడు, కాఫీ, చాయ్ చేతికందిస్తూ.
‘‘కాఫీ బాగుందా?’’ అని అడిగాన్నేను, ఆమెను చూస్తూ.
*
manassu chese maayala mida manchi prayogame– manalni maname ela mosamu chesukuntaamo baaga chepparu– escapist mentality–