ఎవరెవరో
అందరూ ఏదో నాడు
నాదగ్గరికొచ్చే వారే
నేను మాత్రం అందరికీ సమన్యాయమే
చేస్తాను
చివరంటా నిలబడతాను
నేను నా కళ్ళనిండా
దట్టంగా పెట్టుకునే కాటుక
కళ్ళల్లో కన్నీటిని అరికడుతుంది
నా నుదుటి బొట్టు ఎరుపు
నా మెడలో పూసలగొలుసులు
గంటల గలగల
చేతిలో కట్టె నా ఆహార్యం
నడుస్తుంటే గజరాజునే
భుజాన జోలె
జోలెలో ఎముకలు చర్మం రాగిపలక
పెద్దగంట గవ్వలు శంఖం
నా వృత్తిలో భాగంగా
భయానకం నా రూపం
ఇంద్రజాలం నా విద్య
నోట్లోంచి మండ్రగబ్బలు పాములు
తెప్పించగల జీవిని
కనికట్టు మాత్రమే
మాయలు మంత్రాలెరుగని
దోపిడి చేతగాని వాడ్ని
ఇంద్రజాలం తో యాచన కి
బుల్లితెరపెట్టెలు తెరమూసేసాయి
పల్లెలన్నీ పట్నం దారిపట్టాయి
ఊర్ల కట్టుబాట్లలో కడదాకా సంచారమే
చావు కూడా కూడు పెడుతుంది
నేనే తార్కాణం
కాలే శవాలు రాల్చే ఆఖరి పైస నాదే
నిప్పంటించి వెళ్ళే బంధుమిత్రగణం
బూడిదయ్యే దాకా కాపలాదారుడిని
నేనే కాటికాపరిని
శ్మశానమే నా గూడు
గుండెల్లో గుబులు లేనోడ్ని
పగిలే కుండలు చూసిచూసి
రాటుదేలిన మనసు
చలించటమే మానేసింది
*
అభినందనలు సర్…
Thank you sir
Thank you sir