కాజీ నజ్రుల్ ఇస్లాం  – వరవరరావు ఆవాహన

విద్రోహి ప్రళయోల్లాసం – పిల్లనగ్రోవి యుద్ధభేరీ

నేను అందని ఆ తారాతీరాలకు, శాశ్వతంగా వెళ్ళిపోతాను

కానీ నన్ను మరిచిపోనివ్వను

నువు నీ శిరోజాలని అలా వదిలివేసినపుడు

నీ ముంగురులతో ఆడుకునే దక్షిణపుగాలినై తిరిగివస్తాను

రాత్రి ఆకాశం నీ స్వర మాధురిలో సోలిపోయి

గాలి విషాదంగా విలపిస్తూ ఉన్నపుడు

నీ హృదయంలో వెచ్చని స్పర్శనై తిరిగివస్తాను

  • అమీ చిరతారె దూరె చలె జాబో, కాజీ నజ్రుల్ ఇస్లాం

కవి నజ్రుల్ ఇస్లాం తిరిగి వచ్చాడు. విద్రోహి గీతమై, ధూమకేతువై తెలుగు నేలకి తిరిగి వచ్చాడు. ఎనభైవేల సంవత్సరాల తర్వాత, ఒక తోకచుక్క హైదరాబాద్ ఆకాశంలో 2024 సెప్టెంబరు, అక్టోబరు నెలలలో కనిపించిందని వార్తలు వచ్చాయి. ‘సత్యాన్ని మేల్కొల్పాలంటే మనం తిరుగుబాటు చేయాల్సిన అవసరం వుంది. గౌరవం, ప్రశంసలు అందుకోవాలనే దురాశనుంచి మనల్ని మనం విముక్తం చేసుకోవాలి’ అని 102 సంవత్సరాల క్రితం తన పత్రిక ధూమకేతు పంథాని విస్పష్టంగా ప్రకటించుకున్న కవి కాజీ నజ్రుల్ ఇస్లాం. రా, నా ధూమకేతు, ఈ అంధకారం మీదుగా ఒక నిప్పుల వంతెన నిర్మాణం చేయి, ఈ నిరాశామయ దుర్గం మీద నీ విజయ పతాకం ఎగురనీ, రాత్రి ఎంత అంధకార సంకేతాలనివ్వనీ, సగం నిద్రలో వాళ్ళని నిద్రలేపు, వాళ్ళు మేల్కొని ఒక ప్రారంభం కానీ‘ అని ఆ ఇరవై మూడేళ్ళ నవయువ కవిని రవీంద్రనాథ ఠాగూర్ దీవించాడు. కాకతాళీయమే కావచ్చు కానీ విప్లవకవి వరవరరావు , కాజీ నజ్రుల్ ఇస్లాం ని తెలుగులో ఆవాహన చేస్తున్న సమయంలో మళ్ళీ ఒక తోకచుక్క.. ధూమకేతువు ఆగమనం.

కవి కాజీ నజ్రుల్ ఇస్లాం జీవితం, సాహిత్యాలను ఆలోకిస్తూ వరవరరావు ‘విద్రోహి’ పుస్తకాన్ని ఇటీవల హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. నజ్రుల్ తెలుగు పాఠకులకి పూర్తిగా తెలియదని కాదు. 1970 ల తర్వాత తన కవితల అనువాదంతో పాటు 2001 నాటికి ఆవంత్స సోమసుందర్ తనపై రాసిన పుస్తకం కూడా వచ్చి వున్నాయి. కానీ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఇప్పడు ప్రచురించిన పుస్తకమే నజ్రుల్ ఇస్లాంపైన తెలుగులో అచ్చయిన ముఖ్యమైన పుస్తకం. ధూమకేతు ఆగమనంతో పాటు 2024 అక్టోబరులో పుస్తకం విడుదల కాకతాళీయమే అయినప్పటికీ, నజ్రుల్ ఇస్లాం పైన వివి పుస్తకాన్ని ప్రచురించానే ఆలోచన (2018) వాస్తవంగా రూపుదిద్దుకోవడానికీ, ఆవిష్కరణకీ (2024) మధ్య ఆరుసంవత్సరాలకి పైబడిన అంతరం ఉంది. అది అనేక అంతరాయాలనీ, అవాంతరాలనీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది వర్తమాన రాజకీయ పరిణామాలకి అద్దం పట్టే విషయం.

ఇటీవలి కాలంలో విద్యార్థి ఉద్యమం బంగ్లాదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసింది. తుపాకీ కాల్పుల ముందు చేతులు చాచి, గుండెలని ఎదురొడ్డి నిలిచిన రంగ్ పూర్ లోని బేగం రోకియా యూనివర్సిటీ విద్యార్థి అబూ సయద్ చిత్రం ఆ ఉద్యమానికి దృశ్యమాన సంకేతంగా  మారింది. నజ్రుల్ ఇస్లాం కవిత ‘విద్రోహి’ కవిత పంక్తులతో అబూ సయద్ చిత్రం బహుళ ప్రాచుర్యాన్ని సంపాదించింది. విద్రోహి కవిత వంద సంవత్సరాల నాటిది. సంక్షుభిత కాలంలో నిలబెట్టుకునే స్ఫూర్తి కోసం మనుషులు గతంలోకి, ఒక్కోసారి భవిష్యత్తు ఆశలొకి తొంగి చూస్తారు. వందేళ్ల నాటి విద్రోహి కవిత అలాంటి ఒక స్ఫూర్తి.

ఫ్రెంచి తత్వవేత్త అలాన్ బద్యూ జర్మన్ రైతాంగ పోరాటంలో ప్రతినిధి థామస్ మూంజర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతాడు. ఇది జర్మన్ రైతాంగ పోరాటానికి ఇది 500 ఏళ్ళు నిండిన సందర్భం కూడా. విప్లవ పోరాటాల నేపథ్యమే వివిధ సందర్భాలలో థామస్ మూంజర్ ని పలుమార్లు ఆవిష్కరించిందని అలాన్ బద్యూ అంటాడు. తన వివరమైన జీవిత చరిత్రని మొదటిసారి ప్రచురించిన స్ట్రాబెల్ పుస్తకానికి నేపథ్యం 1789 ఫ్రెంచి విప్లవం. తర్వాత కాలంలో 1840 లనాటి విప్లవ ప్రజాస్వామిక దృక్పథంలో రైతాంగ  ఉద్యమాల చరిత్రని రాసిన జిమ్మర్ మన్ ఆనాటి యంగ్ హెగెలియన్ల బృందంలో సభ్యుడు. ఎంగెల్స్ 1850 లో రాసిన జర్మనీలో రైతు యుద్ధం పుస్తకానికి నేపథ్యం 1848 విప్లవాల ఓటమిని అర్ధం చేసుకునే ప్రయత్నంలో భాగమే. అందులో ఎంగెల్స్ థామస్ మూంజర్ గురించి వివరమైన అంచనాని ప్రకటిస్తాడు. ఆ తర్వాత కాలంలో 1917-23 కాలంలో జర్మనీ విప్లవం ఓటమి నేపథ్యంలోఈ ఎర్నెస్ట్ బ్లాక్ థామస్ మూంజర్, థియాలజియన్ ఆఫ్ రివల్యూషన్ అనే పుస్తకాన్ని రాసాడు. 1968 నాటి తిరుగుబాటు నేపథ్యం, 1990ల గ్లోబలైజేషన్ నేపథ్యంలో మెక్సికన్ జపాటిస్తా ఉద్యమం మళ్ళీ, మళ్ళీ థామస్ మూంజర్ ని తలచుకున్నాయి.

ఈ మాట చెప్పుకుంటున్నామంటే, నజ్రుల్ ఇస్లాం విస్మృతమైనాడనో, మనమో, వివినో కొత్తగా పునరావిష్కరిస్తున్నామనో కాదు. నజ్రుల్ ఇస్లాం స్మృతి సజీవంగానే ఉంది. తనని తిరిగి తలచుకుంటున్నాము, తరచి చూసుకుంటున్నాము. తెభాగా రైతాంగ ఉద్యమంపై విలువైన పరిశోధన చేసిన డచ్ మేధావి, అమరుడు పీటర్ కస్టర్స్ పరిచయంతో, తనదైన దృక్పథంతో విప్లవ కవి వివి కాజీ నజ్రుల్ ఇస్లాం ని మళ్ళీ ఇప్పుడు మన ముందుకు తీసుకువస్తున్నారు. బంగ్లాదేశ్ లో ప్రతీ ఉద్యమమూ నజ్రుల్ ఇస్లాం కవితలనుంచి నిరంతరం స్ఫూర్తిని పొందుతూనే ఉంది. నజ్రుల్ ఇస్లాం కవితలు, పాటల ప్రచురణలు, అనువాదాలు పదులు, వందల సంఖ్యలో అవిచ్చిన్నంగా ఆవిష్కృతమౌతూనే ఉన్నాయి. నజ్రుల్ ఇస్లాం జీవిత చరిత్ర పుస్తకాలు కొన్ని వందల సంఖ్యలో వచ్చి ఉంటాయని అస్జదుల్ కిబ్రియా 2024 ఆగస్టులో రాసిన ఒక వ్యాసంలో అంటారు. ప్రపంచ వ్యాపితంగా కోట్లాదిమంది తన పాటలని ఇష్టంగా వింటూనే ఉన్నారు. యువతరం తిరిగి, తిరిగి తన గీతాలనీ, సంగీతాన్నీ ఆవిష్కరించుకుంటూనే ఉంది. రెండు సంవత్సరాల క్రితం కోక్ స్టూడియో నజ్రుల్ పాట ‘బగీచా  బుల్ బులీ తుయి’ ఒక ఉదాహరణ. యూ ట్యూబ్ లో నాలుగు కోట్లమంది చూశారా పాటని.

నజ్రుల్ ఇస్లాం కవితలు, పాటలు 18 భాషలలోకి అనువాదం అయ్యాయి. ఇంకా అనువాదాలు వెలువడుతూనే ఉన్నాయి. చైనీస్, డచ్, ఇంగ్లీష్, ఇటాలియన్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, పర్షియన్, రష్యన్, స్పానిష్, స్వీడిష్, టర్కిష్, వంటి అంతర్జాతీయ భాషలతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, అస్సామీస్, ఒరియా, ఉర్దూ భారతీయ భాషలలోకి నజ్రుల్ ఇస్లాం రచనలు అనువాదం అయ్యాయి. ఇవే కాక, మునుపటి సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండిన కాలంలో కజఖ్, అజర్ బైజాన్, ఉజ్బెక్, జార్జియన్, తుర్కెమెనిస్తాన్, తజిక్ తదితర భాషలలోకి అనువాదమైనాయని ఖొండ్కార్ అష్రాఫ్ హుసేన్ పేర్కొన్నాడు. సోవియట్ సంగీతవేత్తలు నజ్రుల్ గీతాల రష్యన్ అనువాదాలకి బాణీలు కూడా కట్టారట. ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకుల బృందంతో పాటు, అసన్ సోల్ లోని కాజీ నజ్రుల్ ఇస్లాం యూనివర్సిటీలు కలిసి ఒక ప్రాజెక్టుని 2020-21 లో చేపట్టాయి. భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూలులో గుర్తించిన 22 భాషలు, సాహిత్య అకాడెమీ గుర్తించిన భాషలే కాకుండా మొత్తం ఒక వంద విభిన్న భారతీయ భాషలలోకి విద్రోహి కవితని అనువదించాలనే బృహత్ ప్రయత్నాన్ని ఈ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టారు.

నజ్రుల్ ఇస్లాం సాహిత్య కృషి అపారమైనది. 4000 పాటలు, 2800 కవితలు, కథలు, వ్యాసాలు, నాటకాలు, నవలలు రాసిన తన సృజన విస్తృతమైనది. బెంగాలీ సాహిత్యంపైనా, సంగీతంపైనా తనదైన చెరగని ముద్ర వేశాడు. సలీల్ చౌదరి, హేమంత్ కుమార్ వంటి సంగీతకారులు తన స్ఫూర్తిని ప్రత్యేకంగా చెప్పుకున్నారు. మహ్మద్ రఫీ, ఆశా భోస్లే, అనూప్ జలోతా వంటి గాయకులతో పాటు ఫిరోజా బేగం, మానవేంద్ర ముఖర్జీ వంటి ప్రఖ్యాత బెంగాలీ గాయకుల గొంతులో తన గీతాలు వినిపిస్తూ ఉన్నాయి. మనల్ని మరోలోకంలోకి తీసుకుపోతూనే ఉంటాయి.

నజ్రుల్ కవి మాత్రమే కాదు, ఒక రాజకీయ నాయకుడు కూడా. అతనొక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఒక సంగీతవేత్త కూడా. అతనొక సంగీతవేత్త మాత్రమే కాదు, తత్వవేత్త కూడా‘  అని  రవీంద్రనాథ ఠాగూర్ అంటాడు. నజ్రుల్ ఇస్లాంలో మూడు పాయల ప్రతినిధిని మనం చూస్తాము. బెంగాల్ పునర్వికాసం (రినైజాన్స్), జాతీయ ఉద్యమం, జాతీయ ఉద్యమంలో ప్రత్యేకించి ఎన్నదగిన విప్లవవాదుల స్రవంతి – ఈ మూడింటి మేలు కలయికని, సంగమాన్ని మనం నజ్రుల్ ఇస్లాంలో చూడవచ్చు. బెంగాల్ పునర్వికాసం లో నజ్రుల్ ఇస్లాం స్థానం ప్రత్యేకమైనది. సామాజిక పునాది రీత్యా, భద్రలోక పునాదికి వెలుపలనుంచి వచ్చిన వ్యక్తిగా తన కృషి ప్రత్యేకించి ఎన్నదగినది. జాతీయ ఉద్యమంలో విప్లవ వాదుల కృషి, పాత్ర గురించి హీరేన్ గోహెయిన్, కామ మెక్లీన్ పరిశీలనలు చెప్పుకోదగినవి. విప్లవవాద స్రవంతి మూడు దశలలో పరిణామం చెందిందని హీరేన్ గోహెయిన్ అంటాడు. 1906-07, మొదటి ప్రపంచ యుద్ధ కాలం, ఆతర్వాత 1920 లలో ఈ మూడు దశలని మనం గమనించవచ్చు. మూడవ దశకి వచ్చేసరికి, విప్లవ వాదుల స్రవంతి స్వాతంత్ర్యాన్ని హింసాయుత ఉద్యమం ద్వారా సాధించడం మాత్రమే కాదు, తర్వాత స్వతంత్ర దేశపు రూపు రేఖలు ఎలా ఉండాలనే దానిపై కూడా దృష్టి సారించింది. కాలం రీత్యా, భావాలు, ఆచరణ రీత్యా నజ్రుల్ ఇస్లాంలో ఈ మూడవ దశకి ప్రతినిధిని మనం చూడవచ్చు. దారిద్య్రం, మనిషి, స్త్రీ, వేశ్య (వారాంగన) లాంటి నజ్రుల్ కవితలు తన దృక్పథాన్ని ఎత్తిపడతాయి. రష్యన్ విప్లవం నజ్రుల్ ఇస్లాం పైన లోతైన ప్రభావాన్ని వేసింది. 1922 లో రాసిన బ్యాతార్ దాన్ కథలోని పాత్రలు దారా, సైఫుల్ మాలిక్ లు ఎర్ర సైన్యంలో చేరినట్లు రాశాడనీ, వలస పాలన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వరాజ్య సైన్యంలో చేరినట్లు మార్చాడని కమ్యూనిస్టు ఉద్యమ ప్రారంభకులలో ఒకరైన ముజఫర్ అహ్మద్ అంటారు. తన కవిత ‘ప్రళయోల్లాసం’ కూడా రష్యన్ విప్లవాన్ని కీర్తిస్తూ రాసిందేనని అచింత్య సేన్ గుప్తా అంటారు. సామ్యవాది (నేను సమానత్వాన్ని గురించి పాడతాను), షామ్యో (సమానత్వం ) కవితలు తన రాజకీయ అవగాహనకి విస్పష్ట ప్రకటనలు. తన కవితలలో శ్రామిక, రైతాంగ వర్గ పక్షపాతాన్నీ, మత సామరస్య ఆకాంక్షలనీ గమనించవచ్చు. ఇక్కడే నజ్రుల్ ఇస్లాం సాహిత్యం సమకాలిక మైనది. ఉత్తేజాన్నిఅందిస్తుంది.

నజ్రుల్ ఇస్లాంని బంగ్లాదేశ్ జాతీయ కవిగా మాత్రమే కుదించే ప్రయత్నాలు 1970 లనుండీ జరుగుతూనే ఉన్నాయి. విభజన చరిత్ర సృష్టించిన విషాదం ఇది. రవీంద్రనాథ ఠాగూర్ హిందూ కవియనీ, నజ్రుల్ ఇస్లాం ఉపఖండంలో ముస్లింల పునర్వికాసానికి కృషి చేసిన కవియనీ యాహ్యా ఖాన్ చేసిన ప్రకటనని ఆనాడే బంగ్లాదేశ్ మేధావులు తీవ్రంగా వ్యతిరేకించారు. బంగ్లాదేశ్  మార్క్సిస్టు మేధావి  బద్రుద్దీన్ ఉమర్ నాయకత్వంలో నజ్రుల్ ఇస్లాం హిందూ, ముస్లింలు అందరూ అభిమానించే నిజమైన ప్రజాకవియని ఆనాడే ప్రకటించారు. నజ్రుల్ ఇస్లాం మరణానంతరం తన మృతదేహం బంగ్లాదేశ్, భారతదేశాల రాజకీయ  ఎత్తుగడలకు గురైయిందని సజల్ నాగ్ ఒక వ్యాసంలో అంటారు. ఈ నేపథ్యంలో నజ్రుల్ ఇస్లాం అంతిమ క్రియల గురించి కూడా కొంచెం వివాదముంది. తన మృతదేహాన్ని భార్య ప్రమీలా నజ్రుల్ సమాధి పక్కనే ఖననం చేయాలనేది పిల్లల కోరిక. తన పిల్లలు తన మృతదేహాన్ని చివరిసారి చూసేందుకు అవకాశం ఇవ్వకుండా, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఢాకా యూనివర్సిటీ ప్రాంగణంలోని మసీదు వద్ద తనని ఖననం చేసేసింది. ‘అంతర్జాతీయ న్యాయసూత్రాలనీ, మృతుని కుటుంబసభ్యుల అభీష్టాన్నీ అతిక్రమించి, ఒక జాతీయ కట్టడం నిర్మాణం కోసం తన మృతదేహాన్ని ఉపయోగించుకున్నారు. ఖననం చేసిన వెనువెంటనే తనని జాతీయ కవిగా ప్రకటించడంలో బెంగాలీ జాతీయవాదానికి వ్యతిరేకమైన బంగ్లాదేశీ జాతీయవాదాన్ని సృష్టించాలనే ఉద్దేశ్యం ఉంది. అంత్యక్రియలకోసం తన మృతదేహాన్ని తాను పుట్టిన చోటుకు తీసుకు రాకుండా భారతదేశం నిర్లిప్తతని ప్రదర్శించింది. భారతదేశంలో ప్రజాస్వామిక అవకాశాలు కుంచించుకుపోవడం కూడా ఒక కారణం. ఇందిరాగాంధీ 1975లో అత్యవసర పాలనని ప్రకటించింది’ అని సజల్ నాగ్ వ్యాఖ్యానిస్తారు.

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన పుస్తకంలో 65 నజ్రుల్ ఇస్లాం కవితలు, 7 వ్యాసాలు ఉన్నాయి. నజ్రుల్ ఇస్లాం పై పీటర్ కస్టర్స్ వ్యాసాలు రెండు ఉన్నాయి. వీటన్నిటినీ వివి అనువాదం చేశారు. ఇవి కాక – తెలుగులో కాజీ నజ్రుల్ ఇస్లాం – వరవరరావు వ్యాసం, ఇంకా – కాజీ నజ్రుల్ ఇస్లాం, వంగ విప్లవకవి కాజీ నజ్రుల్ ఇస్లాం జీవితం – సాహిత్యం, నజ్రుల్ ఇస్లాం – తెలుగు కవులు అనే నాలుగు వ్యాసాలు ఉన్నాయి. ‘ఇద్దరు మహాకవుల సంగమం’ అనే మౌమితా ఆలం ప్రవేశిక ఉంది.

నజ్రుల్ ప్రేమ, ధిక్కారం కలగలిసిన కవి, తిరుగుబాటుదారు, సామ్యవాద ప్రేమికుడు. నజ్రుల్ ‘విద్రోహి’ కవితని అప్పటి బ్రిటిష్ వలస పాలకుల కోసం ప్రొఫెసర్ అక్షయ కుమార్ దత్తాగుప్తా ఇంగ్లీషులోకి అనువాదం చేశాడు. ‘ఈ ప్రచురణ అత్యంత అభ్యంతరకరమైనది. రచయిత విప్లవ భావాలతో ఉత్తేజితమయ్యాడు. యువకులలో తిరుగుబాటు, చట్ట ఉల్లంఘన భావాలని రెచ్చగొడుతూ ఉన్నాడని’ ఫిర్యాదు చేస్తూ, ఆయన తన అనువాదాలని అధికారులకి పంపాడు. అప్పటి కలకత్తా పోలీసు కమిషనరు చీఫ్ సెక్రటరీకి లేఖ రాస్తూ, అవే అభిప్రాయాలని వ్యక్తం చేశాడు. ‘బిషేర్ బన్షీ’  పుస్తకాన్ని తక్షణమే నిషేధించాలని  కోరతాడు. 102 సంవత్సరాల తర్వాత కూడా మనం అలాంటి పరిస్థితులనే చూస్తున్నాము. నజ్రుల్ ఇస్లాం ప్రాసంగికత, వివి పరిచయం, అంచెనా, పీటర్ కస్టర్స్ అంచెనాల ప్రాసంగికత ఇందులోనే ఉంది.

జాతులమధ్య శత్రుత్వము, యుద్ధాలు నెలకొన్నాయి. ఒకవైపు మానవులు తీవ్రమైన దారిద్య్రము, అప్పు అవసరాలతో కష్టాలు అనుభవిస్తున్నారు. మరొకవైపు పేరాశ, దయ్యాలు, భూరి ధనాలను, ధనాగారాలలో దాచుకొంటున్నారు. ఈ వ్యత్యాసాలను, ఈ విభేదాలను తొలగించడానికి వచ్చాను. నేను ఇంతకు భిన్నమైన సౌందర్యాన్ని, సమానత్వాన్ని నా కవిత్వంలో సంగీతంలో జీవితంలో సృజించడానికి వచ్చాను. సౌందర్యరాహిత్యాన్ని క్షమించి, అమానుషత్వాన్ని ధ్వంసం చేయడానికి వచ్చాను. మీరే నాకు సాక్ష్యం. నా అద్భుత సౌందర్యమే సాక్ష్యం. నాకు కీర్తి అక్కరలేదు. నాకు ప్రఖ్యాతి అక్కరలేదు. నాకు మందీ, మార్బలం అక్కరలేదు. నాయకత్వం అక్కరలేదు. అయినా మీరు నన్ను నాయకత్వస్థానంపై కూర్చోబెడితే, నా కన్నీళ్ళను నేను ఆపుకోలేను. అయినా ఆదేశం నాకింకా రాలేదు. కానీ, నేనో విధ్వంస సౌందర్యాన్ని కాబట్టి నాకు మీ ముందున్న సౌందర్య రాహిత్యాన్ని వికారమైన మనుషులను వినాశనం చేయాలనే ఆశ రేకెత్తుతున్నది.

(జోడి ఆర్ బన్షీ న బాజే –  వేణువు పలకక పోతే, నజ్రుల్ ఇస్లాం 1941 ఉపన్యాసం నుంచి)

నజ్రుల్ ఇస్లాం సాహిత్యాన్నీ, జీవితాన్నీ ఆవిష్కరించిన వివికీ, ప్రచురించిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కూ కృతజ్ఞతలు. నజ్రుల్ ఇస్లాం కు జోహార్లు!

*

సుధాకిరణ్

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. చదివిందీ, ప్రస్తుతం ఉద్యోగ రీత్యా వుండేదీ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్ధిక అంశాల పైన, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు