అమెరికన్ తల్లిదండ్రులు మిగతా దేశాల పిల్లలని దత్తత తీసుకున్నట్టే, అమెరికా వరుడు తూర్పు ఐరోపా (రష్యా, యుక్రెయిన్, …) లేదా ఏషియా (చైనా, వియత్నాం, కంబోడియా, …) ఖండాన్నించీ వధువుని తెచ్చుకున్నాడంటూ మెయిల్ ఆర్డర్ బ్రైడ్స్ గూర్చి అప్పుడప్పుడూ పేపర్లల్లో చదువుతూంటాం. అమెరికాలో పెరిగే వాళ్ల పిల్లల మనోభావాల గూర్చీ, ఆ పిల్లలు తమ క్లాసుమేట్ల వల్ల అనుభవించే వత్తిడి గూర్చీ, దానికి లోనై తల్లి మమతని దూరంగా ఉంచడం గూర్చీ మనకు తెలుసుకునే అవకాశాన్నిస్తాడు కెన్ లు ‘ది పేపర్ మినాజెరీ’ అన్న కథలో http://www.nlb.gov.sg/readsingapore/wp-content/uploads/2013/06/The-Paper-Menagerie.pdf .
కథకుడి తండ్రి హాంగ్ కాంగ్ లో ఉన్నదన్న వధువుని మెయిలార్డర్ కేటలాగులో చూసి అక్కడికి వెళ్లి పెళ్లిచేసుకుని అమెరికా తీసుకువస్తాడు. కథకుడి చిన్నతనంలో అతను కాగితంతో తల్లి చేసిన ఎన్నో రకాల జంతువులే ప్రపంచంగా పెరిగాడు. ఈ కళకి ఆరిగామీ (origami) అని పేరు. “origami” పక్కన కావలసిన జంతువు పేరుని టైప్ చేసి (owl, dog, tiger, etc.) గూగుల్లో దొరికే జంతువుల బొమ్మలను చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో! అతనికి కొత్త ఆట వస్తువంటే తల్లి కాగితంతో చేసిచ్చే కొత్త జంతువే. తల్లీ, ఆ బొమ్మలూ చిన్నతనంలో అతని ప్రపంచం. ముఖ్యంగా ఒక పులి. బయట దొరికే స్టార్ వార్స్ లాంటి ప్లాస్టిక్ బొమ్మలతో అతనికి పరిచయం పదేళ్లు వచ్చిన తరువాత. అది కూడా తండ్రివంటి శ్వేతజాతీయుల పిల్లల వల్ల. ఆ పరిచయం అతని కాగితపు బొమ్మలని దూరంగా నెట్టేసి “అసలైన” ఆటవస్తువులు – అంటే మార్కెట్లో దొరికేవి – కావాలని డిమాండ్ చేయించేలా చేస్తుంది.
“Something about the mixing never seems right. The child looks unfinished. Slanty eyes, white face. A little monster.” అతను వినికిడి దూరంలో ఉన్నప్పుడు వాళ్లింటికి వచ్చిన చుట్టుపక్కలవాళ్లు అన్న మాటలివి. “Do I have a chink face?” అని అతను తండ్రిని అడగడంలో ఆ మాటల ప్రభావమూ, అలా ఉండడం తనకి ఇష్టం లేదన్న సంగతీ ప్రస్ఫుట మవుతాయి. అప్పటినించీ అమెరికాలో ఉన్నా గానీ ఇంగ్లీషు అబ్బని తల్లి మీద చిరాకు కలిగి ఆమెతో మాట్లాడ్డం తగ్గించివేస్తాడు. ఆమె చేసిచ్చిన కాగితపు బొమ్మల నన్నింటినీ అట్టపెట్టెలో పెట్టి అట కెక్కించేస్తాడు. కాలేజీలో ఉన్నప్పుడు తల్లి కాన్సర్‌తో హాస్పిటల్లో ఉండగా అవసాన దశలో ఆమె మొహాన్ని చూశా నన్నట్టు అటెండెన్స్ వేయించుకోవడానికి ఆమెని కలిసి, పరీక్ష లున్నాయని హడావుడిగా వెళ్లిపోతాడు.
చిన్నతనంలో అతని ప్రవర్తన తార్కికంగా తప్పని ఒక వయసు వచ్చిన తరువాత అందరికీ తెలుస్తుంది – అతనితో సహా – “తాత-మనవడు” సినిమాలో తండ్రి పాత్ర లాగా. అయితే, కొన్ని తప్పులని ఎవరికి వారే తెలుసుకున్నప్పుడు కలిగే బాధ ఎవరూ తీసెయ్య గలిగింది కాదు. అయితే, సహాయం చెయ్యడానికి ఆమె తల్లి చేసిచ్చిన కాగితపు బొమ్మ లున్నాయి – వయసుడిగిన పులితో సహా. వాటిల్లో ఆమె కొడుకు మీద అక్షరపరచిన ప్రేమ ఉన్నది.
నేను గ్రాడ్యుయేట్ స్టూడెంట్‌గా ఉండగా ఉత్తర భారతా న్నుంచీ వచ్చిన నా రూమ్మేట్ ఇండియా వెళ్లి తల్లి చూపించిన సంబంధాన్నే చేసుకొస్తా నన్నాడు ఆ పిల్లకు పెద్ద చదువేమీ లేకపోయినా. అతని కొచ్చే సంబంధాలు అన్నీ పల్లెటూళ్ల నించీ వచ్చేవే అనీ ఆ పిల్లకు పదవ తరగతి చదువు కూడా ఉండకపోవచ్చనీ అతను చెప్పిన గుర్తు. ఈ దేశంలో పెరిగిన అతని పిల్లల మనోభావాలు ఆ తల్లిపట్ల ఎలా ఉండివుంటాయోనన్న ఆలోచనని కలుగ జేసింది ఈ కథ. చిన్నపిల్లలు అమాయకులు కారని అందరికీ తెలిసినా మిశ్రమ జాతి కుటుంబమూ, భాషా భేదమూ కలిసి చిన్నప్పటినించే అతని మీద చూపిన ప్రభావాన్ని నిజాయితీగా మన ముందుంచిన రచయితకి అభినందనలు తెల్పాలి.
ఈ కథని మాజిక్ రియలిజం కథగా సాధారణంగా వర్గీకరించడం జరుగుతుంది. అయినా ఇది ‘ఫాంటసీ అండ్ సైన్స్ ఫిక్షన్’ మాగజీన్లో (మార్చ్, 2011) ప్రచురింపబడ్డదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇది చాలా బహుమతుల్ని, విశేషాదరణని పొంది, అతని కథా సంకలనానికి శీర్షికగా కూడా నిలిచింది.
రచయిత పరిచయం
కెన్ లు ఇప్పటిదాకా వందకు పైగా కథలూ, నవలలూ రాశాడు. చైనీస్ భాషలోని నవలల్ని ఆంగ్లంలోకి అనువదించాడు. లాయరూ, ప్రోగ్రామరూ కూడా! ‘ది పేపర్ మినాజెరీ’ పలు భాషల్లోకి అనువదింపబడి అక్కడ కూడా బహుమతులని పొందింది.
- Hugo for Best Short Story 2012.
- Nebula for Best Short Story 2011.
- World Fantasy Award for Best Short Story 2012.
- Featured in Strahan’s ‘Best SF & F of the Year’, Volume Six
© Lisa Tang Liu
Author website:
ఈ “ది పేపర్ మినాజెరీ” కథ చదివాక ఆ కథల పుస్తకాన్ని తెప్పించాను. మంచి కథ. ఆ తల్లిని చాలా బాగా చిత్రించింది.
చాలా కథలు నేను చదివాక మరిచిపోతాను. ఇది మాత్రం అలాగే వుంది.
గొప్ప పరిచయం. Thanks for sharing the link.