కవుల దారి ఎటు వైపు?!

కవిలో పేషన్ స్థానాన్ని ఫేషన్, వస్తు శిల్ప అధ్యయనం స్థానాన్ని గుర్తింపు సంక్షోభం, సామాజిక ప్రాపంచిక జ్ఞానం స్థానాన్ని లౌక్యం, పెద్దల అండ, ఆదరణ, ప్రచారం కోరుకునేతనం ఆక్రమిస్తున్నాయి.

తెలుగు కవిత్వ వాతావరణం, దశ, దిశ, భవిష్యత్తు గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలసినంత అవసరం మునుపెన్నడూ లేదని అనుకుంటున్నా. ప్రత్యామ్నాయ విలువలు, చర్యలు, వేదికలు గురించి ఖచ్చితంగా ప్రజాస్వామిక స్పృహతో చర్చించుకోవాల్సిన సందర్భమిది.

ఓ ముప్ఫై ఏళ్ల క్రితం తెలుగు సాహిత్యంలో, మరీ ముఖ్యంగా కవిత్వంలో ఫలాన కవి రాసి పబ్లిష్ ఐన ఒక కవిత లేదా ఓ కవయిత్రి వెలువరించిన కవిత్వ సంపుటమో ఒక సాహిత్య వార్తగా వుండేది.  కవి మిత్రులు నలుగురు చేరిన చోట ఆ కవిత మీద చర్చ ఉండేది.  ఆ పుస్తకం మీద విశ్లేషణ జరిగేది.  కానీ ఈ రోజున ఒక పురస్కారమో లేదా సత్కారమో లేదా కవిత్వ పోటీ ఫలితమో సాహిత్య వార్తగా వుంది.  విప్లవ కవిత్వమైనా, విప్లవేతరమైనా, అరాజకీయ (అరాచక కాదు) అనుభూతి కవిత్వమైనా, అస్తిత్వ వాదపు పాయలైన దళిత, మైనారిటీ, స్త్రీ వాద కవిత్వమైనా కవులలో అది ఒక నిర్దిష్ట దృక్పథానికి ప్రాముఖ్యమిచ్చేదిగా వుండేది.  అనేక చర్చలు జరిగేవి.  మంచి కవిత్వానికి అండగా మార్క్సిస్ట్, మార్క్సిస్టేతర, అస్తిత్వవాద విమర్శకులుండేవారు.  పత్రికలు కూడా కవిత్వానికి తగినంత ప్రాధాన్యత ఇచ్చేవి.  ఇదంతా గతం కావడం ఒక  విషాదం. అంతర్జాతీయంగా వచ్చిన, వస్తున్న ప్రపంచీకరణ ప్రక్రియలో కవి కూడా ఓ వినిమయదారుడై పోతున్నప్పటికీ మనం చర్చించుకోదగ్గ, మార్చుకోదగ్గ అంశాలున్నాయనే నా భావన.  అందుకే ఈ చర్చ.

ఇవాళ కవిలోని రాజకీయ స్పృహ సామాజికమైనది కాకుండా అవార్డులు, పురస్కారాలు, సత్కారాలకు సంబంధించిన రాజకీయ స్పృహ ప్రధానమై పోతున్నది.  కవిత్వం కంటే కవి ప్రముఖమై పోతున్న దుస్థితి!  కవిలో పేషన్ స్థానాన్ని ఫేషన్, వస్తు శిల్ప అధ్యయనం స్థానాన్ని గుర్తింపు సంక్షోభం, సామాజిక ప్రాపంచిక జ్ఞానం స్థానాన్ని లౌక్యం, పెద్దల అండ, ఆదరణ, ప్రచారం కోరుకునేతనం ఆక్రమిస్తున్నాయి. నిజానికి గతంలో కంటే ఇప్పుడే విరివిగా కవిత్వం వస్తున్నది.  కవులు ధారాళంగా రాసేస్తున్నారు.   రాసిన కవిత్వాన్ని వెంటనే వెలుగులోకి తెచ్చుకోగలుగుతున్నారు.  (సామాజిక మాధ్యమాలకి ధన్యవాదాలు!)  ఎక్కువ రాయడం తప్పని కాదు కానీ వస్తు శిల్ప ప్రమాణా రీత్యా తామెక్కడున్నామనే స్పృహ ఈ తరం కవులకు ఇంకా ఎక్కువ వుండాలని భావిస్తున్నా.  ఎవరో కొందరు కవుల్ని మినహాయిస్తే ఇప్పటి కవిత్వం దూదిలా గాల్లో సుతారంగా ఎగురుతున్నదే కానీ భూమి నుండి విత్తనమై మొలకెత్తడం లేదు.  ఎంతటి సామాజికాంశాల మీద రాస్తున్నామనుకున్నా ప్రజల్ని చేరాలనే లక్ష్యం కనిపించడం లేదు.

కవులు సాటి కవుల కోసమే కవిత్వం రాస్తున్నట్లుగా అనిపిస్తున్నది.  ఇతర కవుల  మెచ్చుకోళ్లని ఆశించడం, ప్రశంసల్ని ఇచ్చి పుచ్చుకునే ధోరణి పెరుగుతున్నది.  కవిత్వానికి పాఠకుల కంటే కవుల సంఖ్యే ఎక్కువనేది ఒక నిష్టుర సత్యం.  పుస్తకాలు ముద్రించుకొని పంచుకోవడమే జరుగుతున్నది.  ఐదొందల కాపీలు వేసుకున్నా పంచుకోడానికి కూడా ఎక్కువవుతున్న దుస్థితి వుందిప్పుడు.  ఓ రెండొందల కాపీలు ముద్రించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వచ్చిందా లేదా చూసుకుంటున్నారు చాలామంది కవులు.   వర్తమాన కథా సాహిత్యంలో కథకులు చూపించే అంతర్బాహ్య సంఘర్షణ కవిత్వంలో కొరవడుతున్నది.  కవిత్వం దీని మీద రాయొచ్చు, దాని మీద రాయకూడదనే ఆంక్షలుండకూడదు కానీ ఏది రాసినా మెజారిటీ కవుల్లో గాఢత, లోతు లేనితనం స్పష్టంగా కనబడుతున్నది.

వున్న దానిలో చెప్పుకోదగ్గ కవిత్వం అనుకుంటే అది భూమి, ఊరు, చెరువు, బాల్యం, అమ్మ, నాన్న, స్నేహం, ప్రేమ, విరహం వంటి అంశాల్ని సెంటిమెంటల్ గా వ్యక్తీకరించడమో లేదా వేరెవ్వరికీ అర్ధం కాని అస్తిత్వ దుఃఖాన్ని వ్యక్తీకరించడమే కవిత్వం అవుతున్నది.  దేశ పునాదుల్లోకి వెళ్లి హింస, వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా కవిత్వం రాసేవారు అతి కొద్దిమందే వున్నారు. కరోన సమయంలో కుప్పలు తెప్పలుగా వచ్చిన కవిత్వం చాలావరకు ఒట్టి ఊకగానే అనిపించింది.  నాకైతే పాఠకుల్ని జెన్యూన్ గా కదిలించగల మంచి కవులు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మందే కనబడుతున్నారు.   ఈ పరిస్థితికి అనేక కారణాలు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కవుల్ని, సామాజిక వ్యాఖ్యాతల్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.  ఒక్కో ప్రభుత్వ శాలువా కవిత్వానికి ఒక కత్తిపోటు వంటిదని కవులు గ్రహించడం లేదు.  కవిత్వం యూనివర్శిటీలు, సెక్రటేరియట్ ప్రాంగణాల్లో బొక్కబోర్లా పడుతున్నది.  ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల సత్కారాల, ఆ ఉత్సవాల్లో పాల్గొనడం కోసం ఎదురు చూసే కవులు ప్రజల పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం గళం విప్పగలరు?  రాజ్య హింసని, ప్రభుత్వ వైఫల్యాల్ని ఏ రకంగా ఎండగట్టగలరు?  కవిత్వం ఖచ్చితంగా ప్రభుత్వాలకి వ్యతిరేకంగా, రాజకీయ స్పృహతో  వుండాలా అని ప్రశ్నించే వారికి నా సమాధానం ఏమిటంటే ఒకవేళ తన ప్రాపంచిక దృక్పథం వల్ల అంతరంగంలో వున్న ప్రభుత్వ వ్యతిరేకత, రాజకీయ స్పృహ వున్న వారు వాటిని ఖచ్చితంగా త్యాగం చేయాల్సే వస్తుంది.  కవి ఎల్లవేళలా ప్రతిపక్షమే అనే కొటేషన్ ఆంతర్జాతీయ స్థాయిలో ఒక విలువగా అంగీకరీంచబడిందనేది సత్యం. ప్రైవేటు పురస్కారాలు, అవార్డులు కూడా కవిత్వానికి తక్కువ చేటు చేయడం లేదు.  ఈ సంవత్సరం ఏ ఏ కవులు తమ సంపుటాలు తీసుకొచ్చి ఫలాన పురస్కారం కోసం పంపుతున్నారో అని లెక్కలేసుకొని మరీ తమ పుస్తకాల్ని వెలువరించే కృత్రిమ కవిత్వ వాతావరణం నెలకొని వుంది.  ఈ ధోరణి కవి సెన్సిబిలిటీస్ ని దారుణంగా దెబ్బతీసేదే.

ఒకప్పటి మంచి విమర్శకుల స్థానంలో ఇప్పుడు కవుల ప్రమోటర్స్ ఎక్కువగా వున్నారు.  భుజం తట్టి సెభాష్ అనడమే తప్ప నిర్మొహమాటంగా నిర్మాణాత్మక సూచనలు చేసే వాళ్లు లేరు.  నిజమైన కవిత్వం అంతరంగం నుండి ఒక విస్ఫోటనంలా వచ్చేదే.  దానిలోని తప్పొప్పులను గుర్తించి, వాటిని వెల్లడించి, కవి తనని తాను పుఠం పెట్టుకొని తనలోని కళని, నైపుణ్యాన్ని మరింత ఉపయోగించుకునేలా చేయడం కన్నా కవి రాసిన కవిత్వం ఎలా వున్నా, ఏ స్థాయిలో వున్నా ఉత్సాహపరిచి, ప్రోత్సహించే రకంగా కవిత్వ పెద్దలున్నారు.  యువ కవులు కూడా విమర్శల్ని, సూచనల్ని స్వీకరించే పరిస్థితిలో లేరు.  మరోలా ఎలా వుండగలరు వాళ్లకి మార్గదర్శకులుగా వుండాల్సిన ఒకప్పటి గుర్తింపు వున్న కవులు (సీనియర్లు అనాలేమో!) ప్రభుత్వానిదో, ప్రైవేటుదో ఏదో ఒక పీఠం కోసం అర్రులు చాస్తున్నప్పుడు?  ఎవరి యావ వారిది.  ఎవరి ప్రయత్నాలు వారివి.   పోనీ ఈ “అనుభవజ్ఞులు” ఏ అకాడెమీలోనో పదవులు స్వీకరించిన అనంతరం వాటిని సంస్కరించి, ప్రజాస్వామీకరిస్తారా అంటే అదీ జరగదు.  తమని శరణుజొచ్చిన వారికి న్యాయం చేసే నెపొటిజంకి పాల్పడుతుంటారు.  పాత తరం వారు ఏ అకాడెమీలోనో చోటు సంపాదించగానే లేదా వారు తామే ఓ కొత్త అవార్డు నెలకొల్పగానే కవులు వారి ప్రాపకం కోసం, మన్నన కోసం భజనలు మొదలెడతారు.  ఇదంతా అవాంఛనీయం కాదూ?

ఐతే ప్రత్యామ్నాయంగా ఏం జరగాలన్నదే అసలు ప్రశ్న.  నిజానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్నా అది విలువల ఆధారితమైనదే.  కవుల వైపు నుండి చూస్తే వారు తాము అసలు ఏ ఆవేశంతో, ఆశయంతో కవిత్వం పట్ల ఆకర్షితులమయ్యామనేది గుర్తు చేసుకోవాలి.  మొదలు పెట్టినప్పుడు లేని లౌల్యాలు, జాడ్యాలు తమనెందుకు ఇప్పుడు పట్టుకున్నాయో ఆలోచించుకోవాలి.  తనని సాహిత్య చరిత్రలో నిలిపేది పురస్కారాలు, పెద్దల భుజం చరుపులు కాదని, కళాత్మక ప్రమాణాలతో కూడిన లోతైన, చిక్కనైన తన కవిత్వ నాణ్యతే తనని నిలబెడుతుందని, ఓ వంద కవితలు హడావిడిగా రాస్తే అందులో ఓ పదైనా తనకో గుర్తింపు తెచ్చి పెట్టక పోతాయా అనే సమీకరణాలు పనికిమాలినవని గుర్తించాలి.  (రచయితలు, కవుల సంఘాల్ని మినహాయిస్తే) కవులు గ్రూపిజం కట్టడం తమ కవిత్వానికే నష్టమని వారు గ్రహించాలి.  ఒకరినొకరు పొగుడుకోవడం సహకార సంఘమే అవుతుంది తప్ప సామూహిక స్వరం కాదనే సత్యాన్ని గుర్తించాలి. కవిత్వం నిక్కమైన, స్వచ్ఛమైన మానసిక అలజడి నుండి, హృదయం మోయలేని సంఘర్షణా భారం నుండి, భావోద్వేగాల నుండి వస్తుందని వారు తెలుసుకోవాలి.

వామపక్ష పార్టీల అనుబంధ సాహిత్య సంస్థలు ఎవరైనా తమ దగ్గరకు రావాలనుకోవడం కాకుండా తామే కవుల్ని, రచయితల్ని చేరాలి.   ఈ దిశగా గత రెండు మూడేళ్లుగా విరసంలో వస్తున్న మార్పుని అంగీకరించాలి.  ప్రోగ్రెసీవ్ గా వున్న కవుల పుస్తకాలను తమ సభలలో ఆవిష్కరించడం, తమ పత్రికల కోసం రచనలు ఆహ్వానించడం, ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపుని నిర్వహించడం జరుగుతున్నది.  ఇది నిజంగా ఆహ్వానించాల్సిన పరిణామం.

కవులు, విమర్శకులు, సాహితీ పెద్దలు అందరూ కలిసి సామూహికంగా ధ్వంసం చేసిన కవిత్వ వాతావరణాన్ని మళ్లీ తిరిగి తామే సామూహికంగా పునర్నిర్మించుకోవాలి.

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

అరణ్య కృష్ణ

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తొలి పార్లమెంటు మలి పార్లమెంటులో MP లు దాదాపు అందరూ Bar at Law చదివి పుస్తకాలు రాసినవారే.. ఇప్పుడు పది రేపులు ఓ రెండు మర్దర్లు చేసినోడికే MP సీటు…. మాయా బజార్, మిస్సమ్మ, నర్తనశాల లాంటి పాత సినిమాల్లో ముద్దు సీన్ ..రెండు పొద్దు తిరుగుడు పూలని దగ్గరగా చేసి ఊపేవారు.. అర్థమయ్యేందుకు… ఇప్పుడు smooch lipsink..ఒకరినాలుక ఒకరు మెలేసి చీక్కోడం నయా ట్రెండ్…. అలా సాహిత్యం లోనూ ఒకరిని మించిన మరొకరుండేవారు !కాబట్టి ఇప్పుడిలా🎶నడుస్తోంది… నడుస్తోంది.. నడుస్తోంది.. జీవితం🎶🎶🤣చెప్పొచ్చేదేమంటే “”గొంగళి లో కూర్చుని తింటూ బొచ్చెరుకోడం'”” లాంటిదే 🤣 God Sex Truth లాంటి పోర్న్ సినిమాల కాలంలో నాకు మాయాబజార్ సిన్మాలాంటిదే కావాలంటే అత్యాశ🤣 ప్లాస్టిక్ పాలు తాగుతున్న కాలంలో స్వచ్ఛమైన గేదె పాలు కోరితే ఎలా మై డియర్ “”విశ్వంభరా”‘ మీ ఆవేదన అర్థం అయింది.. మంచి రచన👍👍👍👍

  • తొలి పార్లమెంటు మలి పార్లమెంటులో MP లు దాదాపు అందరూ Bar at Law చదివి పుస్తకాలు రాసినవారే.. ఇప్పుడు పది రేపులు ఓ రెండు మర్దర్లు చేసినోడికే MP సీటు…. మాయా బజార్, మిస్సమ్మ, నర్తనశాల లాంటి పాత సినిమాల్లో ముద్దు సీన్ ..రెండు పొద్దు తిరుగుడు పూలని దగ్గరగా చేసి ఊపేవారు.. అర్థమయ్యేందుకు… ఇప్పుడు smooch lipsink..ఒకరినాలుక ఒకరు మెలేసి చీక్కోడం నయా ట్రెండ్…. అలా సాహిత్యం లోనూ ఒకరిని మించిన మరొకరుండేవారు !కాబట్టి ఇప్పుడిలా🎶నడుస్తోంది… నడుస్తోంది.. నడుస్తోంది.. జీవితం🎶🎶🤣చెప్పొచ్చేదేమంటే “”గొంగళి లో కూర్చుని తింటూ బొచ్చెరుకోడం'”” లాంటిదే 🤣 God Sex Truth లాంటి పోర్న్ సినిమాల కాలంలో నాకు మాయాబజార్ సిన్మాలాంటిదే కావాలంటే అత్యాశ🤣 ప్లాస్టిక్ పాలు తాగుతున్న కాలంలో స్వచ్ఛమైన గేదె పాలు కోరితే ఎలా మై డియర్ “”విశ్వంభరా”‘ మీ ఆవేదన అర్థం అయింది.. మంచి రచన👍👍👍👍

    • ఇదేమీ చాదస్తానికి సంబంధించిన విషయం కాదు సార్. అన్నింటికీ లొంగడమే పురాతనం. ధిక్కరించడమే అధునాతనం.

  • అరణ్య కృష్ణ గారి ఆర్టికల్ చదివాను… ఈనాటి కవులు మీద కవిత్వ తీరు తెన్నుల మీద ఆలోచనలు రేకెత్తించే గెస్ట్ ఎడిటోరియల్ ఇది…సిన్సియర్గా కవిత్వాన్ని రాస్తున్నారు, చదువుతున్నవారు ఎప్పటినుండో పడుతున్న ఆందోళన ఇది. నేను కవిని కాకపోయినా, అత్యంత పరిమితంగా కవితలు రాసినా పధ్నాలుగు నెలలుగా మల్లెతీగ మాస పత్రికలో కవి గారి అంతరంగాలు శీర్షిక లో అనేక విషయాలు చర్చిస్తున్నాను… ఇందుకు ప్రధాన కారణం బాధే.. ఇప్పుడు కావలసింది ఆత్మ విమర్శ…అరణ్య కృష్ణ లాంటి వారు ఉద్యమ రూపం లో ఈ పనికి పూనుకోకపోతే ఈ వాతావరణాన్ని బద్దలు కొట్టడం కష్టం… ఇందుకు బాధ్యులైన వారు ఇప్పటికైనా సిగ్గుపడి తిరిగి ఓ దశను దిశను చూపించాలి.. తిరునాళ్ళు ఎక్కువ అయ్యాయి… అవి అవసరం లేదని కాదు…ఏ రకమైన భావజాలాన్ని కొత్త తరానికి అందిస్తున్నాయి అనేది పరిశీలించుకోవాలి… కొత్త తరం కలుషిత మార్గం పట్టింది… అయినా సమయం మించి పోలేదు…ఇంతకు ముందు అరణ్య కృష్ణ కొంచెం నీరు కొంచెం నిప్పు శీర్షిక కింద అనేక విషయాలు చర్చకు పెట్టారు… ఇదీ అలాంటి ప్రయత్నమే… ప్రక్షాళన మొదలు కావాలి…మన కవుల్లో, విమర్శకుల్లో అనేక మంది ప్రతిభావంతులు వున్నారు… రకరకాల మొహమాటాలు కొందరి మీద ప్రభావం చూపిస్తున్నాయి… ఇది కొత్త తరానికి మంచి చేయదు… వారికి చిరు అభినందనను అందిస్తూనే, ప్రోత్సాహం ఇస్తూనే సరయిన మార్గం సూచించాలి… అవసరం అయిన చోట కఠినంగా వుండాలి… అప్పుడే ఎవరయినా వెనక్కి తిరిగి ఆలోచిస్తారు… కవిత్వం తిరిగి తన వైభవాన్ని సంతరించుకుంటుంది…అరణ్య కృష్ణ గారికి అభినందనలు… అదే సమయంలో వంద పూలను వికసించనిద్దాం

  • అరణ్య కృష్ణగారు మీ గోడులో అర్థం ఉంది.
    కాని మన కవులు రచయితల్లో ఎవరి అస్తిత్వం వారికి ముఖ్యం.సర్వామోదమైన రచనా లక్షణాలను,నిర్మాణభావనలను మన సాహిత్యం సాధించుకోలేదు.సాహిత్య పరిణామాల మీద మనకు చర్చల్లేవు.
    ఇక విమర్శ అంటారా ? మన విమర్శ పుట్టడమే అనారోగ్యంతో పుట్టింది.ఉందో లేదో ?కోమాలో ఉందో ?.
    కట్టమంచి విమర్శపై వెల్చేరు నారాయణ రావు గారి అభిప్రాయాన్ని వినండి.మన విమర్శ ఎలాంటిదో అర్థమవుతుంది.
    ఒక విషయం చెప్పాలి- గురజాడ సాహిత్యంపై ఒక సదస్సు జరిగితే నాకో అంశం ఇచ్చారు.”గురజాడ సాహిత్యం-తెలుగు విమర్శ”అని నా ప్రసంగంలో భాగంగా రాచమల్లు రామచంద్రరెడ్డి గారి వ్యాసానొకదాన్ని ప్రస్తావించాను.-“కన్యాశుల్కం నాటకం గురజాడ వీపరీత మానసిక ధోరణులు”అని ఓ అభిమాని నన్ను కొట్టినంత పని చేశాడు.వేదిక దిగి వచ్చాక.
    మనవాళ్ళ అభిమానం కింద ఏదైనా అంతే..
    ఇలాంటి సమయాల్లో కొంత మాట్లాడుకుంటాం తరువాత ఊరుకుంటాం అంతే.
    పూర్వం శాస్త్రాన్ని పురాణాలను చదువుతూ ఉన్నప్పుడు శ్మశాన వైరాగ్యం,ప్రసూతి వైరాగ్యం పురాణ వైరాగ్యం అని చదువుకున్నాం ఇదీ అలాంటిదే.
    (ఇంకా ఈ సాహిత్యలోకం మారాలని మారుతుందని మీకో నమ్మకం ఉంది కదా.అందుకు మీకు నమస్కరించాలి.నిజంగానే మిరనుకున్నట్టు జరుగితే బావుణ్ణు)

    • బాధాకరమైనప్పటికీ కొన్ని నిష్ఠుర సత్యాలు చెప్పారు మీరు. ఆశ నిరాశలతో సంబంధంలేని వాస్తవిక పరిశీలనతో ముందుకెళ్ళడమే మంచిదేమో కదా సార్! మీ స్పందనకి ధన్యవాదాలు.

  • అన్నీ జరుగుతున్న నిజాలే. చెప్పుకోడానికి బాగున్నాయి. మీరు చెప్పిన ఈ అంశాలు, సూచనలు ఎంతమంది పాటిస్తారు? ప్రభుత్వం ఇచ్చే నజరానాలు స్వీకరిస్తున్నారు గా! సీనియర్ రైటర్సే ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు “తక్కెడ” ఎటు మొగ్గుతుందో చూసాం కదా!

    • మీరన్నట్లు వేచి చూద్దాం. మీ స్పందనకు ధన్యవాదాలు సుశీలగారూ!

  • ప్రస్తుత స్థితి గతులకు కనువిప్పు

  • కవులు మాత్రమే కాదు, రచయితలందరిలోనూ ఈ ధోరణి వుంది. ఇదేదో కొత్త అపసవ్య ధోరణికాదు. పూర్వ స్థితికి కొనసాగింపు మాత్రమే. కొత్త కవులు, రచయితలు బాగా రాస్తున్నారు. చాలామంది స్పష్టమైన దృక్పథం వున్న రచయితలు శక్తిమంతమైన రచనలు చేశారు. అలాంటి వాళ్లను మెచ్చుకోవాలి. అందరినీ ఒకేగాటన కట్టి వెక్లిరించడమో నిందించడమో సరికాదు. దృక్పథరహిత కవులు, రచయితలు అన్ని కాలాలలో వున్నారు. అలాంటి వాళ్ల ఉనికిని ప్రశంసాపూర్వకంగా గుర్తించడమేకాదు, నెత్తినపెట్టులొని వూరేగినవాళ్లున్నారు. సోషల్ మీడియా జనరేషన్ కొత్త కవులు, రచయితలను అభినందించాలి.‌ వాళ్లు ఎలాంటి శిక్షణలేకుండానే అద్భుతమైన రచనలు చేస్తున్నారు. నాసిరకపు గింజలు ఎప్పుడూ వుంటాయి. ప్రజలకు అర్థం కావాలనే పేరుతో విరసం, అరసం, సాహితీ స్రవంతి లాంటి సంస్థలు బోల్డంత వాక్యసముదాయాలను కవిత్వం పేరుతో, కథల పేరుతో పాఠకులమీద రుద్దారు. అస్తిత్వ సాహిత్యం రాగానే వస్తుశిల్ప సమన్వయం, కళాతాత్వికత పేరుతో నొసలు చిట్లించారు. ఒకేదేశం ఒకేచట్టం అన్న నినాదం లాగా ఒకే ప్రమాణం పేర చేసిన దాడి అంతాయింతా కాదు. దళిత, స్త్రీ, ముస్లిం, దళిత క్రైస్తవ సాహిత్యాన్ని మీలాగే అందరూ విస్మరించారు. వివక్ష చూపించారు. ఎవరి పుస్తకం మీదనైనా ఒక సమగ్ర చర్చ చేశారా? కళ్యాణ్ రావు గారి సాహిత్యం, అల్లం రాజయ్య గారి సాహిత్యం మినహాయించి మరెవరి సాహిత్యాన్నైనా విపులంగా చర్చించారా? గ్రూపిజం నడిపినవాళ్లు ఎవరో అందరికీ తెలుసు. అకాడమీ అవార్డులు పొందినవాళ్లను, వాటిని నిర్ణయించేవాళ్లను విరసం వేదికల మీద ఎన్నిసార్లు చూడలేదు? కొత్తతరం చాలా ప్రామిసింగ్ గా వున్నది. వాళ్లను అపసవ్యపథంలో నడిపిందీ, నడిపిస్తున్నదీ పాతతరం పెద్దలే.

    • మీ స్పందనని నేను ఆలస్యంగా ఇప్పుడే చూశాను. నేను రాసిందానికి మీ ఆవేశపూరిత వ్యాఖ్యకి ఎలాంటి సంబంధం లేదు శ్రీనివాస్ గారూ! నేను కేవలం కవుల్ని చెడగొట్టే అవార్డు సంస్కృతి మీద, కవులకుండే గుర్తింపు సంక్షోభాల మీదనే రాశాను. కవిత్వం క్వాలిటీ మెరుగుపడటం గురించి చెప్పాను. అంతేకానీ అస్తిత్వవాద కవిత్వం బాగోలేదు, విప్లవ కవిత్వం బాగుందని ఏమీ రాయలేదే? నా విమర్శ సీనియర్ల మీద కూడా వుంది కదా! మీరు సరిగ్గా చదవక పోతే ఎలా? దళిత, ముస్లీం, దళిత క్రైస్తవ సాహిత్యాన్ని నాతో సహా అందరూ విస్మరించారని అన్నారు. అప్పుడప్పుడూ ఏవో అభిప్రాయాలు రాయడం తప్పితే నేనేం రెగ్యులర్ సాహిత్య విమర్శకుడిని కాను. అది నా జోన్ కాదు. కానీ నేను రాశాను మీరు ప్రస్తావించిన అస్తిత్వ వాద కవిత్వం మీద. చల్లపల్లి స్వరూపరాణి, రమేష్ కార్తీక్ నాయక్, అఫ్సర్, మెర్సీ మార్గరెట్ కవిత్వాన్ని వారి అస్తిత్వ స్పృహని హైలైట్ చేస్తూనే సమీక్షించాను. మీరు ఏదీ సరిగ్గా ఫాలో అవకుండా కేవలం నిందలు మోపితే ఎలా?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు