కవి- పిశాచం- శ్రీశ్రీ!

సుమారు 29 ఏళ్ళ ‘నెత్తురుమండే, శక్తులు నిండే….’ యవ్వనోద్రేకంలో పరిక్రమిస్తున్నప్పుడు, నవ్య కవితా పథానికి సారథ్యం వహించిన ‘మహా ప్రస్థానం’ గీత రచన పూర్తి చేసిన మహోద్వేగంలో పరిప్లవిస్తున్న సందర్భంలో శ్రీశ్రీ అనువాదం చేసిన ఇటాలియన్‌ కథ ‘కవి పిశాచం’. 1939 ‘ప్రజామిత్ర’ సంక్రాంతి సంచికలో ప్రచురితమయింది.

ఒక రచనకి, దాని రచయితకి మధ్య ఉండవలసిన సంబంధం, లేదా ఉండే వ్యత్యాసాలపై ఎప్పటినుంచో జరుగుతున్న, ముఖ్యంగా ఆధునిక యుగంలో కాస్త తీవ్రంగా జరుగుతున్న చర్చలో భాగమే ఈ కథ. మహా సృజనశీలురైన వారు తమ నిజ జీవితాల్లో ఎలా ప్రవర్తిస్తారన్న సందేహానికి, ఆసక్తికి సమాధానంగా వచ్చిన రచనల్లో పాల్‌ జాన్సన్‌ రాసిన ‘ఇంటలెక్చువల్స్‌’ బహుశా చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు. టాల్‌స్టాయ్‌, షెల్లీ, ఇబ్సన్‌, హెమ్మింగ్వే వంటి మహారచయితలు, రూసో, రసెల్స్‌, సార్త్ర్‌ వంటి తత్త్వవేత్తలను వారివారి వ్యక్తిగత జీవితాల ప్రాతిపదికన అంచనా వేశాడు జాన్సన్‌. అయితే ఇటువంటి తూనికలు అవసరమా? దానివల్ల ప్రయోజనముంటుందా? ఉదాహరణకు ‘దేవుడి పెద్దన్న’గా తనని తాను భావించుకునే టాల్‌స్టాయ్‌ మహా పొగరుబోతని, తీవ్ర అసూయాగ్రస్తుడని అంటాడు జాన్సన్‌. మార్క్స్‌ తన గది, తాను రాసుకునే మేజాబల్ల వదిలి బయట ప్రపంచం ముఖం చూసేవాడే కాదని, ఆయన లోకవృత్త పరిశీలన అంతా కూపస్థ మండూక చందమేనని జాన్సన్‌ ఆరోపణ. ఇలా వ్యక్తిగత జీవితంలో ఉన్న పరిమితులు, బలహీనతలు, లౌల్యాల ఆధారంగా రచన విలువని అంచనా వేయడం ఏవిధంగాను ప్రామాణికం కాబోదు. అయితే, All property is theft అన్న సిద్ధాంతకర్త, తత్త్వవేత్త నిజజీవితంలో వడ్డీ వ్యాపారం చేస్తూ డబ్బుకోసం కక్కుర్తి పడుతూంటే, ఆ విరోధాభాసకి ఈ ఇటాలియన్‌ కథలో అభిమానిలా బాధపడ్డం సహజమే. రచయిత కంటే రచన ఎప్పుడైనా ఉన్నతమైనది కనుక, తన రచన ప్రభావానికి మొదట తాను గురికాక పోవడం కచ్చితంగా విషాదమే.

అయితే, రచయిత వ్యక్త్తిగత జీవన విధానానికి సాక్ష్యమేమిటి? రచయిత సన్నిహితులు, చివరికి తనకు తానుగా కన్ఫెస్‌ చేసుకున్న ‘ఆత్మకథ’ అయినా ఎంతవరకూ ప్రామాణికం? ఒక వ్యక్తి ‘స్నేహశీలత’ అతని చుట్టూ ఉన్నవారికి ‘పోచుకోలుతనం’గా తోచవచ్చు. కవి ‘అంతర్ముఖత్వం’ ఎంత దగ్గరివారికైనా అసాంఘికత్వంగా అనిపించవచ్చు. ఇక ఎవరికివారు తమని ఎంత నిర్ధాక్షిణ్యంగా, నిష్పాక్షికంగా తవ్వి, ఆటోబయోగ్రఫీగా పోగుపోసినా, ఏవో నిర్ధారిత విలువల ఒత్తిడికో, ప్రతిపాదిత సిద్ధాంతాల బెదిరింపుకో లొంగి, తమ అక్షరాలకి అసత్యాల్నో, అర్థ సత్యాల్నో తొడగక తప్పకపోవచ్చు. కనుక కవి లేదా రచయిత వ్యక్తిగత జీవితానికి సాక్ష్యాలు ఉండవనే చెప్పాలి. మరి అక్షర ప్రపంచంలో, మరీముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచంలో పుంఖానుపుంఖంగా వెలువడే పరిశోధనలు, జీవితకథల మాటేమిటి? ప్రచురణ రంగం కనుసన్నల్లో జరిగే ఆ మహావ్యాపారం గురించి పక్కనబెట్టి అదే పడమటన విశేషంగా, ప్రముఖంగాను, మన ప్రపంచంలో అతి అరుదుగాను జరిగే పునర్మూల్యాంకనల (Reappraisals) గురించి చర్చించుకోవడం మంచిది. ఇలా మళ్లీ తరిచిచూడడానికి ఆయా రచయిత రచనలే ప్రాతిపదిక. పుట్టుకొస్తున్న కొత్తతరాల ఆలోచనలకి, దాని కారణంగా మారుతున్న ప్రమాణాలకి అనుగుణంగా నిన్నటితరం రచయితని, అతని పరిమితుల్ని, విస్తృతుల్ని అంచనా వేయడం ద్వారా కూడా రచనని మరింత విస్పష్టంగా అర్థం చేసుకోగలం. అయితే, ఏ రచయితా స్వయంభూ కాదు కనుక, ఆ రచయిత స్థలకాలాదులు, అతని పూర్వాపరాలు, నాటి వర్గ, వర్ణ అంతరాలు, అతనిపై వాటి ప్రభావాలు ….ఇత్యాదులు కచ్చితంగా చర్చకు రాక తప్పదు. అలా మళ్లీ ‘రచన- రచయిత’ చర్చ ముందుకొచ్చినప్పుడు ‘కవి పిశాచం’ అనే ఈ ఇటాలియన్‌ కథలో అభిమానిలా తీవ్ర సంఘర్షణకి గురికావాల్సి రావొచ్చు.

ఈ రోజు శ్రీశ్రీ 109వ జయంతి. సుమారు పదేళ్ళ నాడు శత జయంతి వేడుకలు ఏడాది పొడవునా జరిగాయి. 1910 ఏప్రిల్‌ 30న విశాఖపట్టణంలో జన్మించిన శ్రీరంగం శ్రీనివాసరావును సంస్మరిస్తూ ఏడాది పొడవునా అనేక వ్యాసాలు, నివాళి సంచికలు ప్రచురితమయ్యాయి. Reappraisal ఓనమాలు కూడా తెలియకపోవడం చేత, గన్ను కృష్ణమూర్తి, ముదిగొండ శివప్రసాద్‌ వంటి ఉద్దండ పండితులు శ్రీశ్రీని తూర్పారబట్టారు. శ్రీశ్రీ మధుపానం, వ్యసనపరత్వం, ద్వంద్వ ప్రవృత్తి వంటి లౌకిక ‘సత్యాల’ ఆధారంగా, శేషేంద్ర శర్మ వంటి కొందరు ‘సత్యసంధులు’ ప్రత్యక్ష సాక్ష్యాల ఆధారంగా శ్రీశ్రీ సాహిత్యాన్ని తూచారు.

అయితే, ‘కవి పిశాచం’లో కథకుడైన అభిమాని ఆక్రోశం, పైన నైతిక నైష్ఠికుల ఉక్రోషం ఒకటేనా? ‘ఈయన కళ్లలోకి చూస్తేనే ఒక రహస్య ప్రపంచం కనబడుతోందని, మాటలు వింటే చాలు ఏదో ఉత్తేజం కలుగుతుందనీ……… అంధకార భూయిష్టమైన ఆత్మలలోనుంచి ఇతడు వెదికితెచ్చే రహస్యాలనన్నిటినీ అర్థం చేసుకుందామని’ ఆశపెట్టుకుంటే, సదరు రచయిత రిటైర్‌ అయిన సైనికాధికారిలాగ, డబ్బున్న బ్యాంకు డైరెక్టరుగా కనిపిస్తే కలిగే భంగపాటు; ‘వడ్డించిన విస్తరిలాంటి జీవితం, ఏడాదికేడాది చదువుల్లో పైకెళ్లే కొడుకు, అణగారిన భార్య, సొంత ఇల్లు, బ్యాంకు బ్యాలెన్సూ’ వగైరాలతో సుశిక్షితమైన చీమలాగో, ఒద్దికైన గొర్రెలాగో రచయిత ఎదురైనప్పుడు కలిగే అసహ్యం; ‘వేళ్ల నిండా ఉంగరాలున్న కొవ్వు పట్టిన చేతులేనా……… అన్ని అద్భుత విషయాలు రాసి, తనని లోగొన్న’దని దిగులు పుట్టించే దిగ్భ్రాంతి…… కలగలిసిన ఆక్రోశం ఆ అభిమానిది.

‘యెంకి ముకంలో యెన్నెలే……యెంకితో బతుకిక యెన్నెలే……’ అంటూ యెంకిని తాకిన వెన్నెలని వందరంగుల్లో వర్ణించిన (నండూరి) సుబ్బారావు గారు, ఆ వెన్నెలకి వీపుతిప్పి చీకటి కొట్లో చీట్ల పేక ఆడుకుంటుంటే చలం గారికి కలిగిన బాధ లాంటిది. ‘జగము నిండ స్వేచ్ఛాగాన ఝరులు నింతు’ అని స్వేచ్ఛాగానం చేసిన మహాకవి ‘ఉన్నత హిమాలయ శిఖరాల్లో కురిసిన కవితా వర్షం పాయలై, దేశాల వెంట ప్రవహించి, చివరికి సైడు కాలవల్లో పడు’తుంటే చూసి తట్టుకోలేని బాధ. అది నిత్యనైమిత్తికాల సగటు నేత్రానికి అందని, సాధారణ బుర్రకి అంతుబట్టని బాధ ఆ అభిమానిది.

అటువంటి బాధని రికార్డు చేసిన ఒకానొక కథని ఎంచుకొని తెలుగులోకి తర్జుమా చేయడంలో రచనకి రచయితకి ఉండాల్సిన సంబంధం, వ్యత్యాసాలను గురించి 29 ఏళ్ళ శ్రీశ్రీ అన్యాపదేశంగా చెప్పారనుకోవచ్చు. అదే యువకవి, యుగాన్ని తన కవిత్వంతో శాసించి, ఊగించి, దీవించి, ఖండించి, ‘ఈ శతాబ్దం నాది’ అని సగర్వంగా ప్రకటించుకున్న యుగకవైన పరిణామంలో రచనకి తనకి ఎంత భేదం, ఎంత అభేదం పాటించారో తప్పక తెలుసుకోవాల్సిందే. శ్రీశ్రీని, అంటే ఆయన సాహిత్య సమగ్రాన్ని, ఆయన ప్రేరణతో జరిగిన తెలుగు కవితా వికాసాన్ని (లేదా వినాశనాన్ని) అంచనా వేయడానికి (Reappraisal కి ) ఏ గట్టి ప్రయత్నమూ జరగలేదు శతజయంతి ముగిసిన మరో దశాబ్దానికి కూడా. ‘ఆదిసూకర వేదవేద్యుడు, వృద్ధ వృకోదరుడు….’ వంటి పురాణ ప్రతీకల ఆధారంగా ఆయన బ్రాహ్మణ్యాన్ని ఎండగట్టిన దళితవాదులు, ‘కసాయిబు’ వంటి ప్రయోగాలు సాక్ష్యాలుగా హైందవ బోనులెక్కించిన మైనారిటీ వాదులు, ‘మాచికమ్మ’, ‘గొడ్రాలు..’ వంటి ఉపమానాలు చూపించి ఆయన మగబుద్ధిని ఎత్తి చూపిన స్త్రీ వాదులు, సాయుధ పోరాట సమయంలో నిజాం ప్రభుత్వంలో ఉద్యోగం చేశాడని, ‘తెలంగాణ ఉద్యమం’ మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడంటూ ఆయన కోస్తా దురంహకారాన్ని బైటబెట్టిన ప్రాంతీయోద్యమకారులు చేసిన ఉపరిత విశ్లేషణలకు మించిన అంచనా ఎంతో అవసరం. అయితే అటువంటి పునర్మూల్యాంకనకి ఆయన పల్లకి మోస్తున్న వీరారాధకులు గానీ, అక్కసు వెళ్లగక్కే ఉక్రోషరాయుళ్లు గానీ ఎంతమాత్రమూ పనికిరారని మరో జయంతి సాక్షిగా కూడా నిర్థారణ అయ్యినట్లేనా!

– నరేష్‌ నున్నా

**       **       **

కవి పిశాచం

(ఇటాలియన్‌ కథకు అనువాదం)

అనువాదం : శ్రీశ్రీ

 

రెండుమార్లు నేను ప్రాగ్‌ నగరానికి వెళ్లికూడా వారి దర్శనం చెయ్యకుండానే తిరిగి వచ్చాను. మొదటిసారి (అప్పటి కింకా కుర్రతనం) ఆయన యిల్లు కనుక్కోవడానికి కూడా ధైర్యం చాలింది కాదు. రెండోమారు ఆ యిల్లు కాదని యెవరో నాకు సరిగా బోధపడని భాషలో చెప్పినట్లు జ్ఞాపకం. ప్రత్యేకంగా వారిని చూదామని వెళ్లి ఒకరోజంతా ఆ నగరంలోనే ఆగినందుకు అదీ ఫలితం! ఒక్కడూ నా భాష మాట్లాడడు. ఆ కర్ణకఠోరమైన భాష (బహుశా నా దక్షిణాది చెవులకు కఠోరంగా వినబడి ఉంటుంది) నాకు రాదు. మరి అతడింకా ప్రాగ్‌లోనే ఉన్నాడో, ఉంటే ఏ వీధిలో నివాసమో, అది ఎలా కనుక్కోవడమో నాకు పాలుపోలేదు. అందువల్ల వచ్చినదారినే మళ్లీ రైలెక్కి తిరిగిపోయాను. మనస్సులో బాగా కించ కలిగింది. ‘వెరోనా’కు వచ్చేదాకా నా ముఖంలో వికాసం కనబడలేదు.

కాని, ఈయన్ని చూడక ఉండడం ఎట్లా? నా పదహారు, పదిహేడేండ్ల వయస్సునుండీ తన ప్రభావం ప్రసరించి నన్ను లోగొన్న వ్యక్తి ఈయన, ప్రతి మనుష్యుణ్నీ తన అదృష్టం ఈడ్చినట్లు నన్నీయన ఆకర్షిస్తాడు. తాత్కాలికంగా తప్పించుకొన్నా, ఎప్పుడో ఆ సుడిగుండంలో పడక తీరదు. నా ఆత్మనంతా ఈయనే ఆవరించాడు. వీరి వాక్యాలే, ఊహలే, భావాలే నాలో నిండి ఉన్నాయి. ఇతని కలలే నేను కంటున్నాను. ఇతని గీతాలే నేను పాడుతున్నాను. ఇతని మాటలలో స్ఫురించే భావాలనే స్మరించుతూ ఉంటాను. ఇతని కథలలో పాత్రలలాగ చరించుతూ ఉంటాను. ఏ గ్రంథకర్త కూడా (ఇంతకంటె మంచిపదం నాకు దొరకలేదు) నా మనస్సు మీద ఇంత శాశ్వతముద్ర వేయలేదు. ఈ ముద్ర కాలంగడచిన కొద్దీ, మాసిపోవడానికి బదులు వదుల్చుకోవడానికి వీలు లేనంత గాఢంగా నా ఊహలమీద హత్తుకుపోయింది. ఈయన యూరపులో ఈ శతాబ్దంలో పొడచూపిన రచయితలందరిలోకీ ఎక్కువ మౌలికత్వం ఉన్నవాడు. లేక, నా మట్టుకలా తోస్తుందో? ఈయనలో ‘పో’ బీభత్సం, ‘నీషే’ ఒంటరితనం, ‘షెల్లీ’ రసోల్బణం, ‘దాస్తోవ్‌స్కీ’ వేదనా ఉన్నాయి. నరకపు ఎరుపుతనం, స్వర్గపునీలిమా – శిశువుల చిరునవ్వూ, పిశాచాల పేలుడూ, ఉన్నాయి. అన్నిటికీపైన అనిర్వచనీయమైన, ప్రత్యేకమైన, ఇతనికి మాత్రమే సంబంధించిన గుణం కూడా ఏదో ఉన్నది. ఇతరులెవ్వరిలోనూ కనపడని ప్రజ్ఞ, అతినవీనమైనదేదో ఉన్నది. వీరికీర్తి చిరకాలం కిందటనే నెలకొన్నా, మనిషి చచ్చిపోయిన తర్వాత ప్రజలలో వ్యాపించేరకం కీర్తి అది. గర్వంగల ఒక ఏకాంతజీవి అనీ, మనుష్యజాతికి శత్రువనీ, విచిత్ర వికారవ్యక్తి అనీ జనులితని గురించి చెప్పుకుంటారు. సరీగా ఇతనివ్రాత లెవరికీ తెలియవు. అందరూ తిట్లూ, శాపాలూ మాత్రం పోస్తూ ఉంటారు.

ముఖ్యంగా వీరి నవలలు నాకిష్టం. అవన్నీ స్వీయచరిత్రలేమో అనిపిస్తుంది, స్ట్రిండ్‌ బెర్గ్ నవలల్లాగు. వాటిలో రక్తాన్ని గడ్డకట్టించే అద్భుతరసం, అందలి వ్యక్తుల అత్యాశ్చర్య జీవితాలలో అవిశ్వసనీయమైన బీభత్స ఘట్టాలు, వీటినిబట్టి చూస్తే, ఈయన కూడా తన జీవితంలో అనుక్షణమూ ఏదో ఉపద్రవం నుండి తప్పించుకుంటూ హుటాహుటిగా పరుగెత్తుతున్నట్లు కానవస్తూ ఉంటాడని నేను భావించుకున్నాను. ఈయన కళ్లలోనికి చూస్తేనే ఒక రహస్య ప్రపంచం కనబడుతుందనీ, వీరి మాటలు వింటే చాలు ఏదో ఉత్తేజం కలుగుతుందనీ నమ్ముకున్నాను. ఈయన ముఖలక్షణాలు చూసి, అంధకారభూయిష్ఠమైన ఆత్మలలో నుండి ఇతడు వెదకితెచ్చే రహస్యాలన్నిటినీ అర్థంచేసుకుందామని ఆశ పెట్టుకున్నాను.

అందువల్ల రెండు అవకాశాలు తప్పిపోయినా, ఇతణ్ణి చూసి తీరాలన్న నిశ్చయం వదలలేదు. పద్దెనిమిది నెలల తర్వాత మళ్లీ నేను ప్రాగ్‌కు పోవడం తటస్థించింది. అక్కడ ఇటలీలో నేనెరిగిన మనిషి. ఒకడు, నాకు అదృష్టవశాత్తూ దొరికాడు. వచ్చీరాని ఫ్రెంచిలో ఎలాగో అతణ్ణి నా అభిమాన గ్రంథకర్తను చూపించమని కోరాను. శ్రమతీసుకొని అతడు వారియిల్లు కనుక్కున్నాడు. నాలుగో అంతస్తులో వారి నివాసం. అన్ని మెట్లూ ఎక్కేసరికి, నా గుండెలు దడదడ కొట్టుకున్నాయి. నా కాళ్లు ఊడిపోతున్నట్లు తోచింది. నోటివెంట మాటరాలేదు. వచ్చినా గొంతుక పూర్తిగా మారిపోయి ఉంటుంది. తలుపుముందు ఒక క్షణం నిలబడ్డాను. దానిమీద బాగా మెరుగుపెట్టబడ్డ ఇత్తడి ప్లేటుపై నల్లని అక్షరాలతో, దేనిచుట్టూ నేనే అనేక రహస్యాలు అల్లుకున్నానో, ఆ పేరు చెక్కబడి ఉన్నది. తుదకు ధైర్యంచేసి, గంట నొక్కాను. నడివయస్సులో ఉన్న సేవకుడొకడు తలుపు తీసుకొని వచ్చాడు. గ్రంథకర్త గారి పేరు గొణిగితే ఇలా దయచెయ్యండని నన్ను లోనికి తీసుకువెళ్ళాడు. ఆ యిల్లంతా ప్రశాంత జీవితం కోరే, సామాన్యపు వ్యాపారస్తుడు నివసించే చోటులాగు కనపడ్డది. తలుపు అవతలగా గొడుగుల స్టాండ్‌ ఒకటీ, దానిపక్క ఒక అద్దం ఉన్నాయి.

తివాసీలు పరిచిన వరండాల మీదుగా నడుస్తూ ఒక గదిలోనికి వెళ్లాను. ‘వస్తారు ఇక్కడ కూర్చోండి’ అని సేవకుడు సెలవు తీసుకున్నాడు. గదిలో ఏమీ విశేషం లేదు. ఒక ఎలక్ట్రిక్‌ దీపం వెలుగుతోంది. దానిచుట్టూ ఆకుపచ్చని కాగితం ఒకటి మీదనుంచి సగం వరకు కప్పుతోంది. గదికి ఒక పక్క పుస్తకాల కేసూ, రెండో పక్క కాగితాల ఫైల్సూ ఉన్నవి. ఏ వకీలు ఆఫీసులోనైనా కనపడతాయి ఇవి. దూరాన గోడ కానుకుని ఒక టేబిలూ, దానిమీద సిరాబుడ్డీ, కలాలూ ఉన్నవి. గోడలమీద ఎంతమాత్రం బాగులేని ప్రకృతి దృశ్యచిత్రాలూ, పూర్వ చిత్రకారుల రచనలకు మాసిపోయిన కొన్ని ప్రతికృతులూ, ఒక కేలెండరూ ఉన్నాయి.

నిజం చెప్పాలంటే ఈ అల్పమైన, సాధారణమైన దృశ్యం చూడగానే నా కాశాభంగమయింది. ఒక మహా రాక్షసుడి గుహలోనికి ప్రవేశిస్తున్నానని అనుకుంటే మామూలు లాయర్ల ఆఫీసు కనపడ్డది. దీనిలోనేనా ఆ అత్యద్భుత వ్యక్తి నివసించేది? ఒక నిదర్శనం కూడా అలా అనుకోవడానికి వీలియ్యడంలేదు.

అసలింటికి నేను రాలేదా ,ఏమిటి చెప్మా ఇదొకవేళ తనపేరే ఉన్న ఇంకో బంధువుడి ఇల్లేమో అని తోచింది నాకు.

కాని మరో ఆలోచన చేసేలోపుగానే, తలుపు తెరుచుకుంది. ఒక పొట్టిమనిషి రమారమి యేబదియేళ్లవాడు వచ్చి ‘ఏం వచ్చా’రని చక్కని ఫ్రెంచిలో నన్ను ప్రశ్నించాడు. ఏమీ చెప్పడానికి తోచనిస్థితిలో పడిపోయాను నేను. వీలులేదు. ఇతనా నా స్వప్నాలన్నిటినీ పరిపాలించిన నాయకుడు? నా ఉత్సాహం అంతటికీ అధినేత? అమాయకమైన ఆ కళ్లలో, మీసం కింద ఆ చిరునవ్వులో ఏ రహస్యమూ నాకు దొరకలేదు. ఏమిటిది? ఫ్రాకుకోటు తొడుక్కుని, గీతల పంట్లాం జేబులో చేయిపెట్టి, పేటెంటు లెదరుజోళ్లు తొడిగి, దర్జాగా నిలుచున్న ఈ మనిషి, ఏ రిటైరయిపోయిన సైన్యాధికారిగాని, బాగా డబ్బున్న బ్యాంకు డైరెక్టరుగాని అనుకోవచ్చును. ఇతడా నా గుండెలు గడగడలాడించి తన శనైశ్చర రచనలతో నన్ను మిరుమిట్లు గొలిపినవాడు? ఒక్కొక్కరాత్రి నాకు నిద్ర సరిగా లేకుండా చేసిన అద్భుతభావాలన్నీ, యదార్థ ప్రపంచాన్ని మరిపించి ఇంద్రజాల లోకాలకు తీసుకుపోయిన సాహసిక కల్పనలన్నీ, ఆ నునుపైన నుదుటిలో, ఆ నున్నని బట్టతల కిందనే పరిపక్వం పొందాయా నిజంగా? నే నిదేమో నమ్మలేకపోయాను. అతనివైపు చూస్తున్నకొద్దీ నా ఆశ్చర్యం ఇనుమడించి పోతోంది.

‘‘మీరేనా నిజంగా…. అంటే మీరేనా చండిమ అనే కావ్యం రాసినదీ, ‘నేనూ-దేవుడూ’, ‘అర్థరాత్రి సమస్యలూ’ మొదలైన గ్రంథాలు రాసింది మీరేనా?’’ అని అడక్క తప్పింది కాదు.’

‘ఔను. నేనే!’ అన్నాడు చాలా మర్యాదగా, ఏమీ మెచ్చుకోకుండా. ‘దయచేసి, కూర్చోండి. మీ పని ఏమిటో సెలవియ్యండి’ అన్నాడు.

ఎక్కడున్నానో నాకు తెలియలేదు. ఏమనాలో నాకు తోచలేదు. నా ఆ స్థితి గ్రహించి చిరునవ్వుతో ఆయన, ‘‘నాకు తెలుసు. విదేశాలలో నన్ను మెచ్చుకునే అనేకులలో మీరొకరు. నా సన్నివేశం కోరుతూ వచ్చారు. అదెంతలోపని! ఒక్కనిమిషంలో తేల్చేస్తాను’’ అంటూ ఫైల్సు దగ్గరకుపోయి, ఒక అచ్చు కాగితం, ఫోటోగ్రాపులకట్టా ఒక పెట్టెలోనుంచి తీసి తెచ్చాడు.

‘‘ఇదిగో ఇది చదవండి. నా జీవితం గురించి కొన్ని వివరాలు ఫ్రెంచిలో రాయబడ్డవి. నా గ్రంథాలపూర్తి జాబితా కూడా చివరని ఉంటుంది చూడండి ఇవి నా ఫోటోగ్రాఫులు. మీ ఇష్టం వచ్చినది ఎంచుకోవచ్చును. ప్రొఫైల్‌లో బాగుంటానని నా ఉద్దేశం. అయితే మీ ఇష్టం వచ్చినదే తీసుకోండి. ఏ పత్రికలో పడుతుంది? దినపత్రికా, మాసపత్రికా? మీ వ్యాసం ఏ పత్రికలో రాస్తారు?’’

వీటికేమో నేను జవాబులివ్వకుండా అతనివైపే నిర్ఘాంతపోయి చూస్తున్నాను. మళ్లీ అతడువెళ్లి మరో పెట్టెలోనుంచి ఒక పుస్తకం తీసుకువచ్చాడు. ‘‘దీనిలో నా గ్రంథాలన్నిటిమీద ముఖ్య విమర్శలు జాగ్రత్త చేశాను. వీటిని మీరు చదివితే మంచిదనుకుంటాను. నాతత్వం తెలుస్తుంది. ఇవన్నీ గొప్ప విమర్శకులు రాసినవి. మంచి పత్రికలు ప్రకటించినవి. చిల్లర పత్రికలలో విమర్శలనంతగా నేను పట్టింపు చెయ్యలేదు. … ఫోటోగ్రాఫుతో వెయ్యడానికి నా చేవ్రాలు కూడా కావాలంటారా? ఇదిగో తక్షణం!’’

అంటూ అలసట అంటే ఏమిటో ఎరుగని ఆ గ్రంథకర్తగారు మళ్లీ లేచి, మరో పెట్టెలోనుంచి ఒక కాగితం తీసుకువచ్చాడు. ముసద్దీల దస్తూరితో అతని సంతకం ఉన్నది. దానిమీద స్పష్టంగా, చక్కగా, దాన్ని నాకిచ్చిన పుస్తకంలో జాగ్రత్తగా మడిచి పెట్టాడు.

నేను పొందిన ఆశ్చర్యం ఎప్పటికీ నన్ను వదలలేదు.

‘ఇంకా యేం కావాలి మీకు? నేనెలా పని చేస్తానో చెప్పాలా? అయితే వినండి. రోజుకు నాలుగు గంటలు పని చేస్తాను. కాని, ఒకసారికి 25 లేక 30 పుటలకంటే ఎక్కువ రాయను. పాసునోటుబుక్కులూ, నిఘంటువులూ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను. మిక్కిలి జాగ్రత్తగా వర్గీకరించిన బోలెడు సామాగ్రి నా వద్ద ఉన్నది. ఉదాహరణకిదిగో, ఈ పెట్టెలో విశేషణాలన్నీ దాచుకొన్నాను. దీనిలో ఉత్ప్రేక్షలు! వ్యతిరేకాలంకారం దీనిలో! ఆ మీదను ప్రకృతిదృశ్యాల వర్ణనలు. ఈ కిందను విచిత్రవ్యక్తుల లక్షణాలు. అదుగో అక్కడ చిన్నకథలకీ, నవలలకీ కథాక్రమాలు. దాని కవతల అసాధారణ భావాల సంగ్రహం. ఒక గ్రంథ భాండారమంతా నిండి ఉంటాయి. నేను సంపాదించిన వార్తలూ, విశేషాలూ, వింతవింత థియిరీలు! ఇటువంటి కట్టుదిట్టాలతో పనిచేస్తూ ఉంటే, నాకేం కష్టం అవుతుంది చెప్పండీ! ఆలోచించకుండా రాసి పారేస్తాను. యంత్రంలా పనిచేస్తూ ఉంటాను. ఏది రాయాలన్నా నాకు కావలసినదేదో స్పష్టంగా తెలుసును. ఎక్కడుంటుందో తెలుసును. వెంటనే తీసి ఉపయోగిస్తాను. ఉపయోగించినదంతా ఎర్రసిరాతో కొట్టివేస్తాను. ఆవేశంలోనే రాస్తామనీ, ఎప్పుడో అది వస్తుందనీ వేచుకొని కూర్చుండే మూర్ఖులరకం కాదు నేను. సక్రమంగా ప్రతిదినం రాస్తాను. అన్ని పరిశ్రమలవంటిదే నేనవలంబించే విధానంకూడా. అంతేనా? మీ ఉద్దేశం ఏమిటి?

ఏదో అందామని ప్రయత్నం చేశాను. కాని నోటివెంట మాటరాలేదు. అతడు దీనినేమీ లక్ష్యపెట్టినట్లే కనపడలేదు. శూన్యదృక్కులతో నావైపే దీక్షగా చూస్తూ, మళ్లీ మాట్లాడుతున్నాడు.

‘‘మీ ఇటలీలో నా పుస్తకాల విషయమై ఏం చెయ్యడానికీ సాధ్యం కాదూ? మీరు వీటిలో కొన్నిటిని తర్జుమాచేసి ప్రకటనకర్త నెవరినైనా చూడరాదూ? లాభంమీద నూటికి నలభై ఇస్తాను. నచ్చితే చెప్పండి. ఇప్పుడే ఒడంబడిక చేసుకుందాం.’’

నా అదృష్టంకొద్దీ పక్కగదిలో టెలిఫోను మోగింది. మహాకవి క్షమాపణకూడా చెప్పకుండా దాటేశాడు. ఒకటి రెండు నిమిషాలలో మళ్లీ వచ్చాడు.

‘క్షమించండి. మా బారిస్టరు పిలిచాడు; మ్యూనిక్‌లో గ్రంథ ప్రకాశకుడి మీద దావా తెచ్చాము. గెలుస్తామనే నమ్మకం. కాని, ఇందాకటి సంగతి ఇటాలియన్‌ అనువాదాలను గురించి ఒడంబడిక మా కిష్టమయినట్టేనా?’

హడలుకొట్టి నిలబడ్డాను. వేళ్లనిండా ఉంగరాలున్న ఆ కొవ్వుపట్టిన చేతులేనా, అభినయ విన్యాసాలతో తిరుగుతున్న ఆ చేతులేనా, అన్ని అద్భుత విషయాలు రాశాయి? లేక వాటన్నిటినీ నమ్ముతూ నేనే మూర్ఖుణ్ణిఅయినానా?

ఏదో మర్యాద మాట గొణుగుతూ, ఈ రోజతనిని తప్పించుకుని పారిపోతే చాలునని తలుపు వైపునకు కదిలాను.

‘‘ఏవండోయ్‌! ఆగరూ? టీ తాగక వెళ్ళిపోతారా? ఉండండి నా భార్య, పిల్లలు వచ్చే వేళయింది. అందరూ కలిసి టీ తీసుకోవచ్చు. మా వాళ్ళను చూసి తీరాలి మీరు. పక్కన కుర్రాళ్లిద్దరు, ఒకరికి పదమూడేళ్ళు, ఒకడికి ఏడేళ్లు. నా భార్య పియానో వాయిస్తుంది. బొమ్మలు కూడా చిత్రిస్తుంది. ఈ బొమ్మా ఆవిడవేసిందే! చూడండి బాగులేదూ?’’ అంటున్నాడతను గొంతు హెచ్చించి.

దానితో ఒక కుర్చీలో కూలబడ్డాను. నా పని బాగా పట్టించాడు. ఎట్టి ఆశ్చర్యమూ చూపించకుండా తన వక్తృత్వం సాగిస్తున్నాడతడు. బుక్‌ కేస్‌ తలుపులు ఆడిస్తూ అన్నాడు. ‘‘దీనిలో నా గ్రంథాలన్నీ ఉన్నాయి. ఇందులో ప్రథమ ముద్రణ ప్రతులున్నాయి. అడుగున మిగిలిన ముద్రణలూ, తర్జుమాలు ఉన్నాయి. చాలా రాశానుకదూ? ఏం? బైండింగులు చూడండీ! ఎంత బాగున్నాయో! అంతా పందిచర్మం. చాలా ఖరీదైనదని మీకు తెలుసు. పుస్తకాలు బైండు చెయ్యించడానికి చాలా డబ్బు ఖర్చుపెడతానండీ నేను. … అయితే పిల్లలకు మంచి దుస్తులు తొడగాలికదూ! ఏమంటారు?’’

అంటూ తనహాస్యానికి తానే గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. నాకేదో అతనిమీద జాలిపుట్టుకొచ్చింది.

‘‘మరి ఆగలేన’’ని అరిచాను. ‘‘నిజంగా ఆగడం వట్టిది. పోవాలి నేను. వెళ్ళిపోవాలి.’’

మరేమీ వినడానికి ఆగకుండా తలుపు తోసుకొని వరండాలో పడ్డాను. తొందరగా మెట్లు దిగిపోయాను. నా వెనుకనే ఒక కంఠం వినిపించుతోంది: ‘‘ఒక్క క్షణం, ఒక్క నిమిషం… టీ!’’

నేనేమీ లక్ష్యపెట్టలేదు. నా హాటు తీసుకుని, గుడ్‌బై కూడా చెప్పకుండా, వీధిలో పడ్డాను. మీద నుంచి ఇంకా నా ఆరాధ్యదైవం అరుస్తున్నాడు.

నేనుమాత్రం, ‘‘ఛీ! మన్ను కొట్టుకుపోవాలి! చావాలి నీలాంటి పిశాచాలంతా’’ అన్నాను, విధిలోకి వచ్చాక.

అమితకోపంతో, చిరాకుతో రైలెక్కాను. ఇల్లు చేరగానే అతగాడి గ్రంథాలన్నింటినీ తగుల బెట్టాను. తప్పు పనిచేశానో, పొరపాటే చేశానోగాని, ఇప్పటికీ ప్రాగ్‌ గురించి తలచుకున్నప్పుడల్లా, నాకు విసుగ్గలుగుతుంది, అసహ్యం వేస్తుంది.

**           **           **

 

 

Naresh Nunna

15 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ ధైర్యానికి నిక్కచ్చితనానికి, మీ వైరుధ్యాలను విశ్లేషించే దమ్ముకి జేజేలు.
    సంయమనం కబుర్లు చెప్ప్ వారంతా కూడ పరిశీలిస్తే వితండవాదులే… సరే … నది గమనం రెండు తీరాలు కాదు. ఒరుసుకునో, కాకనో నడుమ ప్రవహించడమే.
    పెద్దవాళ్ళ గురించి వివరాలకు వెళ్ళి బాధపడడం మానేసేంత పెద్దయ్యాక చదివినా మీ వ్యాసం గొప్ప ఊరట. ధన్యవాదాలు.

  • పంక పంకజ న్యాయము. ఇటులనే, వ్యక్తులనే గాక మన ప్రాచీన పురాణాలను, వేదాలను, సంస్కృతిని, సాహిత్యాన్ని కూడా వితండవాదంతో గాక సంయమనంతో పునర్మూల్యాంకనం చేయగలిగితే విద్వేష వాదాలని తగ్గించవచ్చు. సకారాత్మక ధోరణి అనేది ఒక పక్షంవారికి మాత్రమే చేయదగును, రెండో పక్షం వారు దానికి అర్హులు కారు అనేదే రాగద్వేష జనిత ధోరణి. లేదా, చేయదలచుకుంటే అందరినీ అదే తూకపు రాళ్లతో తూచే సాహసం చేయాలి.

    • శ్రీనివాసుడు గారూ…
      ప్రక్షాళనాద్ధి పంకస్య దూరా దస్పర్శనం వరమ్‌ అని విన్నాను, పంకమగ్నగజన్యాయం గురించి విన్నాను గానీ, పంక పంకజ న్యాయం అంటే తెలియరాలేదు. మీరంటున్నట్టు, ప్రాచీన పురాణాలను, వేదాలను, సంస్కృతిని, సాహిత్యాన్ని సంయమనంతో పునర్మూల్యాంకనం చేస్తున్నారు- రాణి శివశంకర శర్మ గారు.
      ఇక మీరు దేన్ని రాగద్వేష జనిత ధోరణి అంటున్నారో నాకు సరిగా బోధపడలేదు. ‘చేయదలచుకుంటే అందరినీ అదే తూకపు రాళ్లతో తూచే సాహసం చేయాలి’- అది సాహసం కాదు, తెంపరితనం, అదరగణ్ణం. పాశ్చాత్య ప్రమాణాలను బట్టి మన ప్రాచ్య సంస్కృతిని, సాహిత్యాన్నీ తూచడం తప్పని Edward Said తో పాటు చాలామంది చెబుతున్నారు.

      • నరేష్ నున్నా గారూ,

        పంక పంకజ న్యాయం అనేది సంస్కృత న్యాయములలో ఒకటి కాదు. చాలాయేళ్ల క్రితం ఫణిహారం వల్లభాచార్యగారు తాను సంపాదకుడిగా వ్యవహరించిన ‘ప్రవాహవాణి’ మాసపత్రికలో ఈ పేరుతో ఒక వ్యాసం వ్రాసారు. నాకు గుర్తున్నంతవరకూ మనుజుడు ఒక మాధ్యమం మాత్రమేనని, అతడి ద్వారా విశ్వశక్తి సృజనను వ్యక్తీకరిస్తున్నదని దాని సారాంశం.

        ఇక మీ రెండవ వాక్యం గురించి నేను వ్యాఖ్యానించదలచుకోలేదు. ఆ పునర్మూల్యాంకనా రచనల గురించి నా అనుభవం, అవగాహన మీకంటే పూర్తి భిన్నంగా వున్నాయి.

        ఇక మూడవ వాక్యం నేను సరిగా వ్రాయలేదు. నాదే పొరపాటు. నేను వ్రాసింది ప్రాచ్య, పాశ్చాత్య సంస్కృతులని గురించి కాదు. ఇప్పుడు పోరాడుతున్న వైరి వర్గాలు తమ, పరాయి భేదం లేకుండా అందరినీ అలాగే సమీక్షించుకుంటే విద్వేషాలు పెరగవు అన్న భావంలో వ్రాసాను. ఐతే, వ్యక్తిగతానికి, సాహిత్యానికి ఏమాత్రం సంబంధం లేదని మీ భావన గనుక ఈ మూడో వ్యాక్యం నేనే అనవసరంగా వ్రాసానని తెలుపుతున్నాను

        ఇక, నా ఉద్దేశంలో వ్యక్తి గతం, వర్తమానం, భవిష్యత్ ఆచరణ అంతా కూడా అతడి సాహిత్యానికి, లేదా బోధలకు, లేదా నాయకత్వానికి ఏమాత్రం సంబంధం లేకుండా, లేదా పాక్షికంగా సంబంధం వున్నప్పటికీ, దానిని గురించి పట్టించుకోకుండా, అతడి సాహిత్యాన్ని మాత్రమే తీసుకుని, అతడిని తమ కులానికో, వర్గానికో, జాతికో, సమూహానికో స్ఫూర్తిప్రదాతగా ఒక ఐకాన్ గానూ, ఐడల్ గానూ, మార్గదర్శిగనూ చూసే ధోరణి సరియైనది కాదు. నేనైతే ఒక రచనను, బోధలను వ్యక్తినుండి వేరుగా చూడలేను. రచయితలు, బాబాలు, నాయకులు, గురువులు, ఎవరి గురించైనా చెప్పేటప్పుడు రెండు పార్శ్వాలనీ పాఠకుడికి పరిచయం చేయాలని నా భావన.

  • బాగుంది. కృతజ్ఞతలు నరేష్ నున్నా. అయితే ఒక చిన్న సవరణ/సమాచారం. మీరీ అనువాద కథ ప్రజామిత్ర 1939 సంక్రాంతి సంచికలో ప్రచురితమైందన్నారు. మనసు ఫౌండేషన్ సంపుటాలలో ఆంధ్రపత్రిక 1939 ఆగస్ట్ 2 సంచికలో ప్రచురితమైందని ఉంది. ప్రజామిత్రలో వచ్చిన రచనను ఏడు నెలల తర్వాత ఆంధ్రపత్రిక పునర్ముద్రించి ఉంటుందా?

    • కథ ప్రచురణకి సంబంధించి సాధికారిక సమాచారం లేదు గానీ, వేణూ గారూ, మనసు రాయుడి గారి పూనికతో, శ్రీశ్రీ భక్తాగ్రేసర చలసాని ప్రసాద్ గారి నేతృత్వంలో వచ్చిన శ్రీశ్రీ సమగ్ర సాహిత్యం గురించి మాత్రం కచ్చితంగా ఒకటి చెప్పగలను:
      ఆ సమగ్ర సాహిత్యంలో తప్పులు గురించి చెప్పుకోడమంటే, గొంగళిలో వెంట్రుకల లెక్కగట్టటం అన్నమాట.

    • రామానాయుడు గారు,
      ఈ వ్యాఖ్య చేసే ముందు, విధిగా మీరొక exercise చేసి తీరాలి (I mean- you should have done it). ఈ నరేష్ నున్నా- అనే వ్యాసకర్త ఎవరు? శ్రీశ్రీకి సంబంధించి ఏమైనా రాశాడా? అందులో ఏమైనా పనికి వచ్చే పాయింట్ ఉందా? – వగైరాలు తెలుసుకొని, ఒక వేళ గతంలో అటువంటివేమీ రాసినవి లేకపోతే, రాసినా అవి అంత worthy కాకపోతే, అప్పుడు మీరు అనొచ్చు- why cannot you take an initiative to appraise Sri Sri works? What stops you? – అని.
      అంత exercise చేయాల్సిన అగత్యం నాకేంటి అనుకుంటే, అప్పుడు, మీ కామెంటులో కారం శాతం బాగా తగ్గించి, ఇలా అడగాలి:
      “Have you taken up any initiative to appraise Sri Sri works? If the answer is yes, please let me know what’s the output”
      అప్పుడు నేను గతంలో చేసిన ఘనకార్యాల గురించి మీకు చెప్పుకోవచ్చు, లేదా అటువంటివేమీ లేకపోతే, నాకు ఆ శక్తి లేదని, లేదా నా శక్తి చాలదని గానీ చెప్పుకునేవాడ్ని.

  • నరేష్ ఈ కథ లో అతివాదం ఉంది. ఇంతకన్న భిన్నమైన సన్నివేశాలు కొద్దివే ఐనా సరే ఉంటాయి. నేనే చూశాను. చలం లాంటి వాళ్లు ఎలాగూ మినహాయింపే.
    శ్రీ శ్రీ ఎంపిక కనుక వంద మార్కులూ వెయ్యక్కరలేదు. పైగా కొందరికి తమను సమర్థించుకోడానికి వీలు కూడానూ ఈ కథ

    • వీరలక్ష్మి గారూ….
      కవికి కవిత్వానికి, లేదా రచయితకి అతని/ ఆమె రచనకీ ఉండావల్సిన, లేదా ఉండవల్సిన అగత్యం లేని సంబంధం గురించి వేరే context లో నేను రాసిన ఫేసుబుక్కు పోస్టు ఇది, వీలైతే చూడగలరు.
      https://www.facebook.com/naresh.nunna/posts/2142736155780839

  • యువకవి, యుగాన్ని తన కవిత్వంతో శాసించి, ఊగించి, దీవించి, ఖండించి, ‘ఈ శతాబ్దం నాది’ అని సగర్వంగా ప్రకటించుకున్న శ్రీశ్రీ యుగకవైన పరిణామంలో రచనకి తనకి ఎంత భేదం, ఎంత అభేదం పాటించారో తప్పక తెలుసుకోవాల్సిందే.

    శ్రీశ్రీ సాహిత్య సమగ్రాన్ని, ఆయన ప్రేరణతో జరిగిన తెలుగు కవితా వికాసాన్ని ( లేదా వినాశనాన్ని) అంచనా వేయడానికి ( Reappraisal కి ) గట్టి ప్రయత్నమూ జరగాల్సిందే నరేష్ గారూ.

    సామాజిక స్పృహ కోసం పాటుపడటమే కానీ శ్రీశ్రీ వల్ల తెలుగు సాహిత్య / కవితా స్థాయి పడిపోయిందని .. . కవితా ప్రస్థానం శిఖరాయమానం చేరలేదని వగచే ( విశ్వనాధ సత్యనారాయణ గారి అబిమానులు, సారస్వత వ్యాస ఘనాపాటి మా కనిగిరి డాక్టర్ గారమ్మాయితో సహా ఎందరో, అందరికి క్షమార్పణలతో )

    శ్రీశ్రీ సృష్టించిన తెలుగు కవితా వినాశనాన్ని Disruptive Technology / Disruptive Innovation గా పేర్కొనవచ్చేమో.

    A disruptive technology is one that displaces an established technology and shakes up the industry or a ground-breaking product that creates a completely new industry. Harvard Business School professor Clayton M. Christensen coined the term disruptive technology.

    A few examples of disruptive technologies :

    Internet, Robotics, Medical Innovations, Renewable Energy

    Personal Computer (PC) displaced the Typewriter. Email transformed the way we communicate, largely displacing letter-writing and disrupting the postal and greeting card industries.

  • నరేశ్ నున్నా, పిశాచ ములలో కవులు, కవులలో పిశాచ ములు వుం డుట సహజమే కదా!

  • కొందరి వ్యక్తులు, కొన్ని సమయాలును మనము ఊహించిన నంత, లేకపోతే, ఎంత నిరసభావం చెందుతామో.. ఆరోజు లో నే శ్రీ శ్రీ గారు,రాయడం, నిజం గా గ్రేట్. నేను,అలాంటి ఆశాభంగం లు,పడి న దాన్ని నే.. ఈ కాలం లో. శ్రీ శ్రీ. గారి, కథ ను,మాకోసం, రాసినందుకు, మీకు పాదాభివందనం. సర్!💐👌.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు