మళ్ళీ స్వప్నవాసవదత్త!

మాష్టారు విని ఊరుకోలేదు. ప్రతీ గమకం దగ్గరా తన అనుభూతిని ఆవిష్కరించేవారు.

స్వప్నవాసవదత్త నాటకం లోకి మళ్లీ వద్దాం. మాష్టారు శరభయ్యగారికి సంగీతం మీద కాస్త చిన్నచూపు. ఎందుకంటే సాహిత్యాన్ని రాగాలకోసం విరవకూడనిచోట విరిచి అపభ్రంశం చేస్తుందని.బహుశా కొందరు తమిళులు పాడిన త్యాగరాయకృతుల వల్ల కూడా కావచ్చు.
నాటకంలో రాజుకి సంభాషణ లతో పాటు శ్లోకాలు కూడా ఉన్నాయి. అవి మామూలు పండిత స్వర రీతిలో పాడమంటారు మాష్టారు.అలా పాడితే నాటకానికి రంగూ రుచీ తేలేం.
అప్పటికే ఎన్నో పౌరాణిక నాటకాలు పిల్లలచేత వేయించి ప్రేక్షకులను మైమరపించిన తెలుగుటీచర్ సావిత్రి గారు మాష్టారి ముందు మాటాడలేక మథనపడుతూ ఉన్నారు.
ఇక నేనే పూనుకుని మనం కొన్ని రాగాలతో ఆయనకి వినిపిద్దాం. అలా ఎవరూ వినిపించి ఉండకపోవచ్చు. అప్పటికీ కాదంటే ఆలోచిద్దాం అన్నాను. మా సావిత్రీ టీచర్ సంగీతాన్ని అభ్యసించిన లలిత గాయిక. ఎంత భావుకతో ఆమెది.
సరే మోహన, కళ్యాణి. శహన. హిందోళ లతో శ్లోకానికొక రాగం కూర్చేరు. ఒక మంచి సమయం కనిపెట్టి మాష్టారి ని కూచో పెట్టి ఆమె పాడి వినిపించేరు. మేం నమ్మలేకుండా మాష్టారు పరవశులై అభిప్రాయం అప్పటికప్పుడు మార్చేసుకున్నారు.
అన్నీ విన్నాక సాహిత్యానికి ఇలాంటి రాగాలు తప్పకుండా ఉండాలమ్మా. అసలు ఇలాగే చదువుకోవాలి. సంగీతం కలపకుండా అసలు సాహిత్యమేమిటి అనేసారు. అదీ మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారంటే. కిటికీలు అంత విశాలం గా తెరిచిపెట్టుకున్న రసహృదయపండితుడు.
ఇక మా ఆనందం ఏమని చెప్పేది. సంస్కృత నాటకాల్లో ఇంచుమించు శ్లోకాలు నాయకుడికే ఉంటాయి. అంచేత అన్నీ నావే.
పట్టేను. బానే కుస్తీ పట్టేను. ఇప్పటికీ మరవలేదు. అందువల్ల సంగీతం నేర్చుకోని నాకు కాసిన్ని రాగాలు తెలిశాయి.
ఐతే మాష్టారు విని ఊరుకోలేదు. ప్రతీ గమకం దగ్గరా తన అనుభూతిని ఆవిష్కరించేవారు. ఆయన ప్రశంస గానీ అనుభూతి గానీ మామూలుగా ఉంటాయా!!! మనం ఊహించలేని లోకాలను ఆవిష్కరిస్తాయి.
ఉదయనమహారాజు విదూషకుడితో వాసవదత్తా పద్మావతుల లో తనకు ఎవరు ఎక్కువో చెప్పే శ్లోకం ఉంటుంది
పద్మావతీ బహుమతామమ
యద్యపి రూపశీలమాధుర్యైః
వాసవదత్తా బద్ధం నతు
తావన్మే మనోహరతి
ఇందులో వాసవదత్త బద్ధమైన నా మనసును పద్మావతి హరించలేకపోతోంది అని. మనోహరతి లో ‘నో’ మీద సావిత్రీ టీచర్ అద్భుతమైన గమకం వేశారు. అది రిహార్సల్స్ లో వింటూ ప్రతీసారీ తన్మయులైపోయేవారు మాష్టారు. చివరికి ఒకనాడు ఇలా చెప్పేరు
విక్రమోర్వశీయం నాటకంలో కాళిదాసు ఒక వర్ణన చేస్తాడు. పురూరవచక్రవర్తి విక్రముడిని దేవకాంత ఊర్వశి ప్రేమిస్తుంది. కొంతకాలం తర్వాత శాపవిముక్తి కాగా వదిలి వెళ్లిపోతుంది. పురూరవుడి ప్రాణాలే ఆమె వెంట పైకి పోయినంత బాధ పడతాడు. ఎలా పోయేయిటంటే తామరతూడును సగానికి విరిచి పై ముక్కను పైకి లాగితే రెండుముక్కలు అవకుండా దారాలు కిందిముక్కనుంచి పై ముక్కవెంట పైకి సాగుతాయి కదా అలా తన ప్రాణాలు ఆమె వెంట వెళ్లపోయినట్టు అతను బాధపడ్డాడని కాళిదాసు రాస్తాడు
ఇది చెప్తూ” ఈ మనోహరతి దగ్గర గమకం పాడుతూంటే నా ప్రాణాలు అలా తామరతూడు తాలూకు దారాల్లా ఆ గానం వెంట సాగిపోతున్నాయమ్మా” అన్నారు.
భావుకతను గుండె లోతును బట్టి మనసు తాలూకు పలుచని తనాన్ని బట్టి కొలవాలి. లేత తమలపాకుది కూడా ఆ మనసు ముందు మందపుదనమే.
వత్సరాజు వాసవదత్తతో చెప్తానుండు నీ సంగతంతా అనగానే విదూషకుడు ఎక్కడ వాసవదత్త ఎప్పుడో మరణించింది కదా అంటాడు. వత్సరాజు వాసవదత్త మరణించిందని తెలిసినా వాస్తవం మరచిపోయి ఊహాలోకంలో ఉండిపోయాడు. అలాంటప్పుడు విదూషకుడు తిరిగి నేలమీదికి తెస్తాడు.
ఇటువంటి సందర్భాలను కాళిదాసు తన మూడు నాటకాలలోనూ సృష్టించాడట. దాని అంతరార్ధం ఆయన ఇలా చెప్పారు.
గొప్ప భావుకత గల కళాకారుడు ఈ ప్రపంచం మరచి నిత్యమూ తన లోకంలో ఉంటాడు. కానీ అప్పుడప్పుడు ఈ నేలమీద పడాల్సివస్తుంది. అది అతడికి వేదనామయం. దాన్నే ఇలా ప్రతీకాత్మకం గా కాళిదాసు చెప్పేడని ఆరోజుల్లో మాష్టారు కళోపాసకులైన వారి లోకాలను పరిచయం చేశారు.
ఇక ఈ జ్ఞాపకాలు ఆపుదాం. ఇంతకీ తర్వాత ఉదయనమహారాజు కు వాసవదత్త గురించి తెలిసిందా ఏం జరిగింది చివరకు అనికదా!!
పద్మావతి కి ఇంత జరిగాక ఎంత సద్దుకుందామన్నా బాధ తప్పదుకదా. శిరోవేదన తో ఉపశమనం కోసం సముద్రగృహానికి వెడుతోందని పరిచారికలు అటు రాజుకు, ఇటు వాసవదత్త కూ చెప్పేరు. రాజు ఆమెను సాంత్వన పరచడం కోసం విదూషకుడితో కలిసి సముద్రగృహానికి బయలుదేరాడు. జలయంత్రగృహాన్ని సముద్రగృహమంటారట.
 తీరా వెళ్లేసరికి అక్కడ మసకదీపపు వెలుగులో శయ్య మాత్రమే ఉంది. పద్మావతి ఇంకా రాలేదని ఈషణ్మాత్రం నలగని శయ్య చెప్తోంది. రాజు కాసేపు విశ్రమిద్దామనుకున్నాడు.విదూషకుడు అతన్ని ఒంటరిగా వదిలేడు
ఇంతలో పద్మావతిని సేదదీర్చడానికి వాసవదత్త అక్కడికి వచ్చింది. మసకవెలుగులో పద్మావతే అనుకుని దూరంగా కూర్చుంటే స్నేహాన్ని తక్కవచేయడం అవుతుందని శయ్యమీద పక్కనే కూర్చుంది. కూర్చోగానే ఆవిడకి తెలియని ఆహ్లాదం కలిగింది
“కిం ను ఖలు ఏతయా సహోపవిశన్త్యా అద్య ప్రహ్లాదితమేవ మే హృదయం” అంటోంది
ఇక్కడ ‘అద్య’ అనడం లో ఉంది ప్రత్యేకత. చాలాసార్లు పద్మావతి పక్కన కూర్చుని ఉండే ఉంటుంది. కానీ ఇప్పుడెందుకో ఆహ్లాదంగా ఉంది అనుకుంది.
తలనొప్పి తగ్గిఉంటుంది శ్వాస చక్కగా నడుస్తోంది నిద్రపట్టింది. అని ఇంకా ఈమె పడుకున్న తీరు నన్నూ పక్కన పడుకోమని కోరుతూన్నంటుంది అనుకుంటూ పక్కన పడుకుంది.
వెంఠనే రాజు వాసవదత్తా అని పిలచాడు. కంగారుపడింది. శయ్య మీద ఉన్నది పద్మావతికాదు ఆర్యపుత్రుడని గ్రహించింది. యౌగంధరాయణుడి పథకమంతా విఫలమైపోతుందా అని భయపడింది. రాజు మళ్లీ” అవంతిరాజపుత్రీ నాప్రియురాలా నాప్రియశిష్యురాలా” అంటున్నాడు
అప్పుడు నిద్రలో కలలోంచి పిలుస్తున్నాడని అర్ధమై జవాబులు పలకడం మొదలుపెట్టింది. అంటే కలవరింత అనమాట.
ఇక్కడ ఎవ్వరూ లేరు నేను కాసేపు ఆర్యపుత్రులను చూస్తూ, వింటూ దుఃఖం నుంచి ఉపశమనం పొంది సంతాషపడతాను అనుకుంది.
అందుకే జవాబు చెప్పు అనగానే వింటున్నాను అంది. “కిం కుపితాసి” అన్నాడు. ఎందుకు కోపించావు.
లేదు లేదు బాధ మాత్రమే “దుఃఖితాస్మి” అంది. “మరి అలంకరించుకేలేదేం నేను అలంకరిస్తానుండు” అంటూ చెయ్యి చాపేడు అదంతా నిద్రలోనే.
ఆమె ఇక  ఎవరేనా వస్తారు మంచిదికాదు వెళ్లాలని లేచింది. వెడుతూ కిందకి వేలాడుతోన్న రాజుచెయ్యితీసి శయ్యమీద పెట్టింది.
వెంటనే రాజుకుమెలకువ వచ్చింది. వాసవదత్త పారిపోయింది.
వాసవదత్తా నిలు నిలు అంటూ వచ్చి తలకి గుమ్మం కొట్టుకుని దిగ్భ్రాంతి లో ఆగిపోయాడు
ఆ సమయానికి విదూషకుడు వచ్చి విషయం విని వాసవదత్త ఎక్కడుంది అంతా నీ కల, పైగా ఊళ్లో కామరూపధారిణి ఐన యక్షిణి తిరుగుతోందట అన్నాడు
రాజుకు ఆమె స్పర్శ తాలూకు స్పృహ తెలుస్తోంది. ఇది నిజం కాదా. కాకపోతే ఆ కలలోనే ఉండిపోతాను అన్నాడు.
“యది తావదయం స్వప్నో ధన్యమప్రతిబోధనం
అధాయం విభ్రమోవాస్యాత్  విభ్రమోహ్యస్తు మే చిరం”
ఇది కలే ఐతే మెలకువ రాకపోతేనే ధన్యత నాకు.
ఒకవేళ ఇది విభ్రమమే అంటే భ్రమే ఐతే ఎప్పటికీ అందులోనే ఉండిపోవాలి నేను.
ఎంత చిక్కటి భావం. అందుకే కాటూరిపింగళి తమ సౌందరనందం కావ్యంలో ఇదే భావం వాడుకున్నారు. కాళిదాసు కే తప్పలేదుమరి.
బ్రతుకు నిక్కమయేని అవ్వారిపట్ల
విరతి లేని స్వప్నమ్ము గా జరుగబోలు
బ్రతుకు నిక్కము కాక స్వప్నమగునేని
సత్యమై తోపబోలు నా జంపతులకు –అంటారు
తమ ప్రేమలో ప్రపంచం మరచిన బుద్దుడి తమ్ముడు నందుడు అతని భార్య సుందరీల గురించి చెప్తూ.
ఇది భాసమహాకవి ప్రభావం కాక మరేమి!!
స్వప్నం లో చనిపోయిన వాసవదత్త కనిపించి నిజమనిపించకపోతే, నిజం గా ఆమె ఎదురుపడి బతికి ఉందనితెలిసినప్పుడు తట్టుకోగలడా రాజు.ఆనందంతో మరణించినా ఆశ్చర్యంలేదు. అందుకే నాటకకర్త ఇలా సన్నద్ధం చేశాడు
ఇంకేముంది చివరి అంకం లో ఉజ్జయిని నుంచి వాసవదత్త చిత్రపటం పట్టుకుని పుట్టింటివారు వచ్చారు. రాజుతో సహా ఆ పటం పద్మావతీ చూసింది. “అరే ఈమె అచ్చం మా అవంతిక లాగే ఉంది” అంది. “ఏదీ పిలువు” అన్నాడు. “ఆమెను ఆమె సోదరుడు నా వద్ద న్యాసం గా ఉంచాడు. ఆమె పరులకంట పడదు” అంది. ఇంత లో యౌగంధరాయణుడు మాచెల్లెలు ఏది అంటూ వచ్చాడు బ్రాహ్మణవేషంలో. ఇది చిరపరిచితమైన గొంతే అని రాజు ఆశ్చర్యపోయాడు. వాసవదత్త తెరమీదకు వచ్చింది.
రాజు స్వప్నం నిజమయింది.
యౌగంధరాయణుడు ఇదంతా మిమ్మల్ని తిరిగి పూర్వస్థానం లోకి తీసుకురావాలని చేశాం మన్నించమన్నాడు. రుమణ్వంతుడికి తెలుసా అన్నాడురాజు. అందరికీ తెలుసు మీకు తప్ప అన్నాడు మంత్రి.
మీ వల్ల మిధ్యోన్మాదాల్లాంటి యుద్ధాల్లోనూ,రహస్యమంత్రాంగాల్లోనూ ములిగిపోకుండా కాపాడబడుతున్నాను అని రాజు అంటే అదంతా మీ భాగ్యరేఖ మహారాజా మాదేమీ లేదు అన్నాడు యుగంధరుడు.
ఎంత ప్రేమ వాళ్లందరికీ ఉదయనమహారాజుమీద.
నాయకుడంటే అలా ఉండాలి అనిపించేలా. ఆయనకు వారందరి మీదా మరెంత నమ్మకం. తనకోసమే వారని.
సరే వాసవదత్త క్షేమ సమాచారం అక్కడికి పంపుదామా అనడిగితే “న, న, సర్వయేవ వయం యాస్యామ దేవ్యాపద్మావత్యా సహ” అని రాజు వాక్యాన్ని నాటకాన్నీ పూర్తిచేస్తాడు ప్రియతమ భాసమహాచక్రవర్తి
“అందరం మన ఊరు వెళ్లిపోతాం, దేవి పద్మావతి తో సహా”అంటూ.
వాసవదత్త తిరిగి బతికినంతటి ఆనందం లోనూ ఉదయనమహారాజు వివాహమాడిన పద్మావతి మాట మరవలేదు.
క్లుప్తంగా ఉంటూ ఏకకాలంలో సున్నితంగానూ అర్ధవంతంగానూ ఉండే సంభాషణలు ఎవరేనా సరే భాసనాటకాలనుంచే నేర్చుకోవాలి.
ఇలా ఈ సారికి భాసమహాకవి దగ్గర ఆగుదాం.
*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సారంగ లో నాకు ఇష్టమయిన శీర్షికల్లో వీరలక్శ్మి గారి శెఫాలికలోకటి. స్వప్నవాసవదత్త మొదటి భాగం చదివినప్పుడే నాకు చాలా నచ్చింది.

    ఈ రెండో భాగం ఇంకా నచ్చిపోయింది. అద్భుతంగా రాసారు .

    వీరలక్శ్మి గారు రాసే శైలి చదువర్కి సులభంగా చదివించేలా ఉంటుంది. నేరషన్ చాలా బావుంటుంది.

    ఒక సాంస్కృతిక నాటకాన్ని చదువరులకి సులభంగా అర్ధమయ్యేలా పరిచయం చేయడం నిజంగా వీరలక్ష్మి గారి ప్రత్యేకత. ఇంకో ముఖ్య విషయేమిటంటే వారి శైలిలో చాలా నాటకీయత ఉంది. ఉదాహరణికి, శ్లోకాలను సంగీత పరంగా చెప్పడం కోసం . వారి తయారీలో సంగీతం బాగా తెలిసిన సావిత్రి టీచర్ గారి సహాయం తీసుకున్న సంధర్భాన్ని వీరలక్ష్మి గారు చెప్పిన పద్ధతి ఎంతో బావుంది.

    ఎంతో బాగా రాసిన వీరలక్ష్మి గారికి హర్ధిక అభినందనలు

    • థాంక్యూ వెరీమచ్ సుబ్రహ్మణ్యం గారూ

  • సున్నితత్వమంటే తామరతూడులో దారమంత fine గాను, మనోహరంగాను అని చెప్పారండీ! మీ గురువులు, మీరు కూడ మమ్మల్ని అనురాగపు గమకాలు తెలుసుకునేట్లు చేస్తున్నారు. ఈ విజ్ఞానం బహు అపురూపం. ధన్యవాదాలండీ.

    • థాంక్యూ వెరీమచ్ శైలజ గారు

  • రాజు గారికి మాత్రమే శ్లోకాలు ,రాజు వేషంలో మీరు వాటిని గమకాలతో సహా నేర్చుకుని పాడటం. ఊహించుకుంటేనే బ్రహ్మాండంగా అనిపించింది.నాటకం చివరలో ఉదయన మహారాజుకు వాసవదత్త బ్రతికే ఉన్నదన్న వాస్తవం అంచెలు అంచెలుగా తెలియచేయటం, మీరు వివరించిన తీరు అద్భుతంగా ఉంది.మరో నాటకం కోసం ఎదురు చూస్తున్నాం .

    • థాంక్యూ వెరీమచ్ వసుధారాణి గారూ

  • సంస్కృతం ఇంత బాగా వచ్చిన మిమ్మలని ఇష్టంగా, గొప్పగా తలుచుకుంటూ, మీ శేఫాలికలని నా ప్రియనేస్తంతో పంచుకుంటూ, తనతో వీటి గురించే ముచ్చటించుకుంటూ, మురుస్తున్నానని చెప్పడానికిటొచ్చా. ధన్యవాదాలు అందమైన భాషలో మీరందిస్తున్న ఆనందానికి!

    • థాంక్యూ వెరీమచ్ లలిత గారూ

  • లక్ష్మి! కళ్ళముందు దృశ్యకావ్యం మై నిలిచింది. సావిత్రి మేడంగారి రాగాలతో కూడిన శ్లోకాలు సుదూర తీరాల నుంచి వినిపించినట్లు! చదువుతుంటే మల్లెల పరిమళం ! శేఫాలికల సౌకుమార్యం! మనసును స్ప్రుశించాయి! ఈ వేసవిలో మలుగూబా మామిడి పండు తిన్న రుచి! సంస్కృత నాటకాన్ని విశ్లేషించి రుచి చూపించారు లక్ష్మి!! ధన్యవాదాలు మీకు! తెలియని ఆనందం కలిగినదీవేళా!!!!

    • తెలియని సంతోషం నాలో కలిగినదీ వేళ
      థాంక్యూ వెరీమచ్ సుశీలగారూ

  • స్వప్న వాసవదత్తను కంటికెదురుగా నిలబెట్టేసేరండీ.. ఆ మథురానుభూతినుండి తేరుకోలేకపోతున్నాను. ఇంత ఆనందం ఇచ్చిన మీకు వేవేల ధన్యవాదాలు..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు