కవిత్వరచన బాధ్యత: దర్భశయనం

ప్రసిద్ధ కవి, “కవిత్వం” వార్షిక ఎడిటర్ దర్భశయనం శ్రీనివాసాచార్య అరవయ్యో పుట్టిన రోజు….

సెప్టెంబర్ 25 వ తేదీకి మీకు అరవై ఏండ్లు నిండుతాయి కదా! చాలా మంది సాహిత్య కారులు తమ అరవయ్యో పడి వస్తోందంటే సమగ్ర సంకలనాలూ, సాహిత్యావలోకనాలు చేస్తున్నారు. మీకేమీ అలాంటి ఆలోచన లేదా ?

తెలుగు సంస్కృతిలో “ షష్టి పూర్తి “ కి ఒక విశిష్టత వుంది. అదొక వేడుక. ఆ వేడుకను  ఒక్కొక్కరు ఒక్కో రకంగా జరుపుకుంటారు. నాకిది పునర్దర్శన సందర్భం. నడిచొచ్చిన దారిని ఈ సందర్భంలో పునర్దర్శిస్తున్నాను. యాత్రానుభవాల్ని నెమరేసుకుంటున్నాను. చూసిన ప్రాంతాల్ని, కలిసిన మనుషుల్నీ గుర్తు చేసుకుంటున్నాను. ఇదొక మజిలీయే. రాయాల్సింది ఎంతో వుంది. ఇప్పటికిప్పుడు సమగ్ర సంకలనాన్ని వేయాలనే ఆలోచన లేదు. జీవన సౌందర్యం సరళతలో వుందని నలభై యేళ్ళ సాహిత్య ప్రయాణం ద్వారా  తెలుసుకున్నాను. ఈ ఎరుకతో ఇక ముందు చేయాల్సిన సృజన గురించీ , ప్రయాణాల గురించీ ఇపుడు యోచన చేస్తున్నాను. ఈ యోచన నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నది.

 దర్భశయనాన్ని కొందరు రైతు కవిగా చూస్తారు. దీని మీద మీ స్పందన చెబుతారా?

వ్యవసాయ వృత్తిని గురించీ, రైతుల గురించీ నేను విస్తారంగా కవిత్వం రాయడం వల్ల కొందరు  సాహిత్య కారులు , సాహిత్యాభిమానులు నన్ను “ రైతు కవి “ గా చూస్తున్న మాట నిజమే.  అది నాకు గౌరవ వాచకమే. అయితే నేను ఒక్క వ్యవసాయ జీవితం గురించే కాక, జీవితానికి సంబంధించిన అనేక అంశాల మీదా, అనుభవాల మీదా  కవిత్వం రాసాను. జీవితం ఎంత విస్తారమైందో, నా కవిత్వ పరిధీ అంత విస్తారంగా వుండాలని కోరుకుంటాను కనుక భిన్న వస్తువుల మీద కవిత్వం రాస్తూ వచ్చాను. ఒక్క మాటలో చెప్పాలంటే- నాకు వస్తు పరిమితి లేదు.

మీ కవిత్వ శైలి, వస్తు నిర్వహణ ప్రత్యేకమైనవి.  కవిత్వ సౌందర్యాత్మకత కోసం మీరు ఎంచుకున్న మార్గం చెప్పండి.

వస్తువెంత ముఖ్యమో నాకు రూపమూ అంతే ముఖ్యం. నా కవిత్వం సరళంగా వుంటూ కవితాత్మకంగా వుండాలని  కోరుకుంటాను. ఆ రకంగా రాయడానికి నేను నిరంతరం సాధన చేస్తూ వచ్చాను.  గాఢత తో కూడిన సరళత నా కవిత్వ స్వభావమూ, మార్గమూ.  ఆ మార్గమే నా కవిత్వానికి సౌందర్యాత్మకతను ఇచ్చిందని అనుకుంటాను. శైలీ రమ్యత కోసం వస్తువును కప్పి పెట్టడం నాకే మాత్రం ఇష్టం వుండదు. వస్తువును స్ఫుటంగా చూపించే రూపకాంతి వల్లనే నేను వాంఛించే సాహిత్య ప్రయోజనం నెరవేరుతుందని అనుకుంటాను.

మీరు ప్రచారాలకూ, ఆర్భాటాలకు దూరంగా వుంటారు. అట్లా వుండడం వెనుక వున్న మీ ఫిలాసఫీ ని చెబుతారా?

నేను జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, అర్థమైనదాన్ని నలుగురితో కళాత్మకంగా పంచుకోవడానికి కవిత్వ మార్గాన్ని ఎంచుకున్నాను. ఎంతో మంది నుంచీ, పరిసరాల నుంచీ ఎంతో స్వీకరించాను కనుకనే కవిత్వం రాయగలుగుతున్నాను. కవిత్వాన్ని మొదలు పెట్టిన కొద్ది కాలానికే, కవిత్వరచన అనేది   ఒక బాధ్యత అని తెలుసుకున్నాను. దాన్ని స్వచ్ఛందంగా స్వీకరించాక, చేయడమే ముఖ్యం. బాధ్యతతో పనిచేస్తున్న రైతులూ, కార్మికులూ, తల్లులూ, తండ్రులూ ప్రచారాన్ని కోరుకోవడం లేదు కదా! మరి కవి మాత్రం ప్రచారాన్నీ ఆర్భాటాన్నీ ఎందుకు కోరుకోవాలి? ప్రచారార్భాటాల వైపు మనసు మళ్ళితే , కవి నిష్ట చెదిరిపోతుందని నా అభిప్రాయం.

 సాహిత్య వ్యక్తిత్వం పట్ల మీ అభిప్రాయం తెలపండి.

తమ రచనల ద్వారా  అనేక విలువల గురించి మాట్లాడే కవులు  తమ జీవితంలో ఆ విలువల్ని పాటించినపుడే అది నిజమైన సాహిత్య వ్యక్తిత్వమని నా అభిప్రాయం. కవి రచనకూ, అతని వ్యక్తిత్వానికీ సంబంధం వుండనక్కర్లేదనే వాదనతో నేను ఏ మాత్రమూ  ఏకీభవించను. కవి తాను విశ్వసించని మార్గాల్నీ తన కవిత్వంలో ప్రవచించడం సరి కాదని నా అభిప్రాయం. విలువల్ని పాటించనపుడు కవి ఎట్లా గౌరవనీయుడవుతాడు? కళానైపుణ్యం ఎంత  అవసరమో, విలువల్ని గౌరవించే వ్యక్తిత్వమూ అంతే ముఖ్యం. నా విషయానికొస్తే – నేను విశ్వసించని దాన్ని నా కవిత్వంలో చెప్పలేదు. విశ్వసించినదాన్ని చెప్పడానికి సందేహించలేదు కూడా.

మీ కవిత్వ సంపుటుల్లో ఏది ఉత్తమమైనదిగా భావిస్తారు? ఎందుకు? 

నా ప్రతి కవితా సంపుటీ నాకు ఇష్టమే. ఇష్టపడకుండా ఏ ఒక్క కవితనూ నేను రాయలేదు. అయితే నా దీర్ఘ కవిత “ ఆట” నా సాహిత్య ప్రయాణంలో ప్రత్యేకమైన రచన అని అనుకుంటాను. నాకు నలభై ఏళ్ళు నిండిన సందర్భంగా జీవితం నాకు ఎట్లా అర్థమయిందో చెప్పాలనిపించింది. దీర్ఘ కవితను నిర్వహించడం కష్టం. దాదాపు వెయ్యి పాదాలున్న ఆ కవిత ద్వారా ఆధునిక కాలంలో పుట్టుక నుంచి మరణం దాకా మనిషి జీవితం ఎట్లా ఒక ఆట గా పరిణమించిందో తెలిపాను. విస్తారమైన జీవితాన్ని క్లుప్తంగా చెప్పడానికి ఒక సంవత్సరం పాటు చేసిన రచన అది.

కొన్నేళ్లుగా మీరు వార్షిక కవితాసంపుటులకు సంపాదకులుగా వుంటూ  కవిత్వాన్ని నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. సంపాదకుడిగా  వచన కవిత్వ భవిష్యత్తు ఎలా వుంటుందని మీరు అనుకుంటున్నారు? 

ఎప్పటికప్పుడు కొత్త కవులు సాహిత్య  ప్రాంగణంలోకి వస్తున్నారు. కొత్త సంపుటులు విరివిగా అచ్చవుతున్నాయి. వివిధ పత్రికల్లో  ప్రతి సంవత్సరం కొన్ని వందల కవితలు అచ్చవుతున్నాయి. ఈ ఉత్సాహం మంచిదే. అయితే ఇది మాత్రమే సరిపోదని నా అభిప్రాయం. కవిత్వం కేవలం కవుల వ్యవహారంగా  వుండిపోతే దాని ప్రయోజనం అంతగా వుండనట్లే. అది ప్రజలకు సంబంధించిన వ్యవహారంగా విస్తరించినపుడే దాని భవిష్యత్తు ఉజ్వలంగా వుండగలదు. కొత్తగా రాస్తున్న కవులు తమ ముందు తరం కవులకు విధేయులుగా కాక, కవిత్వానికీ, మనిషిని నిలబెట్టే విలువలకు విధేయులుగా వుంటూ రచనలు సాగిస్తేనే సాహిత్యానికి మేలు జరుగుతుంది. ఆ రకమైన మేలే సమాజానికీ మేలు అవుతుంది.

 “ కవిత్వ దర్శనం “ పేరుతో మీరు మీ కవిత్వ జీవన  ప్రయాణాన్ని రాస్తున్నారు కదా! దాని గురించి చెబుతారా?

అది నా ఆత్మకథ. అందులో నా జీవితం వుంది. నా జీవితమంటే ప్రధానంగా కవిత్వ జీవితమే. అయితే నా కుటుంబం లేకుండా నా కవిత్వం లేదు కనుక నా కుటుంబ విషయాల్ని కూడా దానిలో చెబుతూ వస్తున్నాను. నేను రాసిన కవితలకు ప్రేరణ ఏమిటో చెబుతూ, వాటిని నేనెట్లా నిర్మించానో వివరిస్తున్నాను. నా పర్యటనానుభవాల్ని చెబుతున్నాను. వివిధ సాహిత్యాంశాల మీద నా అభిప్రాయాలేమిటో సందర్భానుసారంగా వ్యక్తపరుస్తున్నాను.  కవిత్వ ప్రాంగణంలోకి కొత్తగా వస్తున్న వారు వచన కవిత్వాన్ని అధ్యయనం చేయడానికీ, రాయడానికీ నా ఆత్మ కథ కొంత సహాయకారి అవుతుందని నేను ఆశిస్తున్నా. 2022 లో ఈ ఆత్మకథ పుస్తక రూపంలో వెల్వడుతుంది.

*

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవితా జగత్తులో యిలాంటి వ్యక్తులు అరుదు.

  • బాగుంది శ్రీరాం గారు.కవిత్వాన్ని గురించి దాచుకోకుండా అన్ని విషయాలూ చెప్పే కవి దర్భశయనం సార్.నేను కరీంనగర్‌లో ఉన్నప్పుడు సుమారు ప్రతీ ఆదివారం ఒక పూటంతా సారు వాళ్ళింట్లో గడిపే వాళ్ళం.ఆ సమయానికి వచ్చిన కవిత్వం.సాహిత్యం వీటి గురించి వాటిని ముందేసుకుని చాలా చెప్పే వారు సార్.-“కవిత్వం కేవలం కవుల వ్యవహారంగా వుండిపోతే దాని ప్రయోజనం అంతగా వుండనట్లే. అది ప్రజలకు సంబంధించిన వ్యవహారంగా విస్తరించినపుడే దాని భవిష్యత్తు ఉజ్వలంగా వుండగలదు”-ఈ వాక్యం సార్ చెప్పడం నేను చాలా సార్లు విన్నాను.సార్ అనేక వస్తువులపై కవిత్వం రాసినా-వ్యవసాయం రైతు ఆ వాతావరణం పైనా సార్ రాసినంత విస్తృతంగా కవిత్వం రాసిన వాళ్ళు తక్కువ.
    సార్6 రైతును మాధ్యమంగా పెట్టుకుని చాలా కవితల్లో శిల్పాన్ని కొత్త దారుల్లో నడిపించారు.ఆయనకు ఆయనదైన శైలి ఉంది.వ్యవసాయం కుదేలై రైతులు రోడ్డుపైకొస్తున్న కాలంలో ఇన్నాళ్ల ఈ దుస్థినిని రికార్డుచేస్తూ ఒక దీర్ఘకవిత రావాల్సిఉందేమో -అనిపిస్తుంది.ఇలంటి విషయన్ని కదిపి నప్పుడు రాయలసీమ నుంచి వచ్చాయి కదా-అని అంటుంటారు.కాని వ్యవసాయాధారిత దేశమైన ఈ దేశంలో వ్యవసాయం సుదీర్ఘప్రస్థానాన్ని ఆయన మాత్రమే బాగా రికార్డు చేయగలరనిపిస్తుంటుంది నాకు.

    మీ సంభాషణ చదివాక చాలా విషయాలు గుర్తుకొచ్చాయి.
    దర్భశయనం సారుకు “షష్టి పూర్తి శుభాకాంక్షలు”.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు